top of page
Writer's pictureLakshminageswara Rao Velpuri

నల్ల కుక్క

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Nalla Kukka' New Telugu Story Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


రంగాచార్యులు గారు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కార్పొరేట్ కంపెనీ కి, 'జనరల్ మేనేజర్' గా వ్యవహరిస్తున్నారు.


ఆ రోజు శుక్రవారం. ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో, దైవ పూజ జరిపి, పలహారం చేసి, ఎంతో ప్రశాంతమైన మనసుతో ఇంటి బయట పెట్టి ఉన్న కారుని స్టార్ట్ చేశారు.


‘రెండు రోజుల్లో కంపెనీకి 'ఫారిన్ డెలిగేట్స్' తో 'బడ్జెట్ మీటింగ్ ' ఉంది. ఎన్నో విషయాలు స్టాఫ్ తో చర్చించి, తుది నిర్ణయాలు తీసుకోవాలి’ అన్న ఆలోచనలతో కార్ స్టార్ట్ చేశారు.


అంతే! కారు కింద ఒక 'నల్ల కుక్క' అరుస్తూ అలాగే ఉంది. కానీ కదలడం లేదు. కోపంతో చిరాకుతో, ‘ఛి ఛి ఛి !’ అంటూ కసిరినా కదల్లేదు ఆ కుక్క. చిరాకుగా పక్కనే పడి ఉన్న రెండు రాళ్ళు తీసి దాని మీదికి విసిరేసరికి, అది భయం భయంగా కారు క్రింద నుంచి బయటకు వచ్చి, గట్టిగా అరుస్తూ ఆయన కాలు రక్కి పారిపోయింది.


వెంటనే “అమ్మో!!” అంటూ అరుస్తూ, కాళ్ళ మీద పడ్డ ఎర్ర గీతలను చేత్తో రాసుకున్నాడు.

‘చి వెధవ కుక్క! కరవలేదు గాని, రక్కేసి పారి పోయింది. ఇంకా నయం.. కొరకలేదు. బొడ్డు చుట్టూరా '14 ఇంజక్షన్లు ' పడేవి’ అనుకుంటూ కోపంగా చిరాకుగా ఆఫీస్ కి వెళ్ళిపోయారు, జనరల్ మేనేజర్ రంగాచార్యులు గారు.


Gm గారు కాస్త చిరాకుగా, కోపంగా రావడం ఆఫీస్ స్టాఫ్ చూసి, ‘ఇవాళ ఎవరికో మూడింది రా! బాస్ కోపంగా వెళ్లి తలుపులు బలంగా వేసేశారు’ అంటూ ఒకరినొకరు సైగలతోనే మాట్లాడుకుంటూ, పని చేసుకుంటున్నారు.


ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి 'మేనేజర్ శ్రీరామ్ గారిని సార్! బాస్ రమ్మన్నారు’ అని చెప్పగానే మేనేజర్ గారు కూడా కొంచెం తడబాటు తో, ఒకసారి తన ఇన్ షర్ట్ సరిచేసుకొని, ఒక ఫైల్ తో లోపలికి వెళ్లారు. అంతా 'గ్లాస్ ప్రూఫ్’ కావడం వల్ల, లోపల ఏం మాట్లాడు కుంటున్నారో, ఎవరికీ తెలియదు. కానీ మనుషులు కనబడతారు. ఆఫీస్ స్టాఫ్ కూడా ఎంతో ఆత్రుతతో ఓరకంట తో GM గారి రూమ్ వైపు చూస్తూ, పని చేస్తున్నట్లు నటిస్తున్నారు.


మేనేజర్ గారు లోపలికి రాగానే 'గుడ్ మార్నింగ్ సార్ !’ అని విష్ చేశారు.


“ ఏంటిది శ్రీరామ్ గారు? మీరంతా ఏం చేస్తున్నారు.. నేను రెండు రోజుల్లో అన్ని ' బడ్జెట్ అకౌంట్స్' నా టేబుల్ మీద పెట్టమన్నాను కదా! రేపు 'ఫారిన్ డెలిగేట్స్' వస్తున్నారు కదా! ఈ ఫైలు ఎంత అర్జెంటో మీకు తెలుసు. మీ 'అకౌంట్స్ డిపార్ట్మెంట్' నిర్లక్ష్యం వల్ల, కొన్ని కోట్లు నష్టపోతాం! ఆ మాత్రం బాధ్యత తెలియదా మీకు? ఈరోజు అన్నీ కరెక్ట్ చేసి నేను బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దాన్లో ఎన్ని తప్పులు ఉన్నాయో చూడాలి. మేనేజర్ గా మీ బాధ్యత ఎంతవరకు? ఏమిటి ఈ నిర్లక్ష్యం!” అంటూ కుక్క రక్కిన దగ్గర మంట పెడుతుంటే, చాలా కోపంగా మేనేజర్ శ్రీరామ్ గారిని తిట్టారు జి ఎం గారు.


“సారీ సార్ ! ఇవాళ ఆ బడ్జెట్ ఫైల్ మీ ముందు ఉంటుంది. నేను వెంటనే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి పరిశీలిస్తాను” అంటూ కంగారుగా బయటకు వచ్చి, కోపంగా ఎకౌంట్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లారు శ్రీరామ్ గారు.

అదే చిరాకుతో అకౌంట్స్ మేనేజర్ భాస్కర్ గారిని ఉద్దేశిస్తూ “ఏంటండీ? పొద్దున్నే బాస్ చేత చివాట్లు పెట్టించి, మీరు హాయిగా ఉన్నారు? ఆ 'బడ్జెట్ ఫైల్' ఈరోజు పొద్దున్నకల్లా జిఎం గారి టేబుల్ మీద ఉండాలి కదా! ఎందుకు లేదు?” అంటూ కోపంగా అనేసరికి, భాస్కర్ గారు లేచి “సార్ !! నిన్న ఒకళ్ళకి చెప్పకుండా ఒకళ్ళు, పని లేని కారణాలతో ఆఫీసుకి రాలేదు. దానివల్ల పని ఆగిపోయింది. నేను ఆ పని మీదే ఉన్నాను. మధ్యాహ్నం మూడు గంటల కల్లా 'బడ్జెట్ ఫైల్’ బాస్ టేబుల్ మీద ఉంటుంది. క్షమించండి!” అని అన్నారు.


“సరే సరే! ఆయన మూడు బాలేదు. సరిగ్గా సెట్ చేసి పెట్టండి. లేదంటే మనలో ఎంతమంది సస్పెండ్ అవుతారో నాకు తెలియదు” అంటూ కోపంగా వెనక్కి వెళ్లిపోయారు మేనేజర్ శ్రీరామ్ గారు.

అకౌంట్ మేనేజర్ భాస్కర్ గారు వెంటనే తన ఇద్దరు అసిస్టెంట్లను పిలిచి ఆయన చూపిన కోపం అంతా వీళ్ళ మీద చూపిస్తూ, “ఏంటయ్యా? ఇది 'ఫారిన్ డెలిగేట్స్' తో వ్యవహారం. మనం బడ్జెట్ ఫైల్ తయారు చేసి ఇవ్వాలి అన్న బాధ్యత కూడా లేకుండా ఇద్దరు సెలవులు పెట్టి వెళ్ళిపోతారా? ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. మీరు ఇవాళ లంచ్ కి కూడా వెళ్లకుండా వెంటనే ఫైల్ తయారు చేసి ఇవ్వండి!” అంటూ మరింత చిరాగ్గా తన పనిలో పడిపోయారు.


ఆ ఇద్దరు అసిస్టెంట్ అకౌంటెంట్లు, తమ పనిలో మునిగి తేలిపోతూ ఒకరినొకరు ‘నువ్వైనా ఉండవలసింది. నాకు చెప్పకుండా నువ్వు సెలవు పెట్టావు. ఇప్పుడు ఇది గాని సరిగ్గా చేయకపోతే, మన ఇద్దరి ఉద్యోగాలు పోతాయి కచ్చితంగా!’ అంటూ ఒకరినొకరు కోపంగా అనుకుంటున్న సమయంలో, ఆఫీస్ ప్యూన్ ఇద్దరికీ ‘టీ' టేబుల్ మీద పెట్టాడు.


అసలే కోపంగా, చిరాగ్గా ఉన్నవాళ్లు, వేడిగా ఉన్న టీ ఒక సిప్పు తాగి, ఎంతో బాగున్న టీ కూడా నోటికి సహించక, “ఛీ వెధవ టీ! ఏం చేస్తున్నావ్ రా భాయ్? ఈ టీ నీ మొఖం లా ఉంది. అసలు పంచదార లేదు. టీ పొడి కూడాలేదు. తీసుకెళ్లి బాత్రూం లో ఒంపేయ్!” అంటూ గట్టిగా అరుస్తూ ఆఫీస్ ప్యున్ మీద తమ కోపం, చిరాకు చూపించారు .


“క్షమించండి సార్! నేను మళ్లీ పెట్టి తెస్తాను” అంటూ కిచెన్ లోకి వెళ్లి, 'ఛీ వెధవ బతుకు! వీళ్ళకి టైం కి టీ ఇవ్వాలి. బాసు ఏమైనా తిడితే ఆ కోపం అంతా నామీద చూపిస్తారు. గతిలేక గాని ఇలాంటి ఉద్యోగం చేయకూడదు రా బాబు !’ అనుకుంటూ మళ్లీ టీ పెట్టి ఇచ్చాడు.


అలా ఆరోజు 'జి ఎం గారు ' ఇంటికి భోజనానికి బయలుదేరే సమయంలో కూడా తన కాలిని ఒకసారి చేత్తో రాసుకుంటూ మేనేజర్ గారి టేబుల్ దగ్గరికి వచ్చి, “నేను అరగంటలో వస్తాను. బడ్జెట్ ఫైలు నా టేబుల్ మీద ఉండాలి ! నాకు సమయం లేదు. మీకు తెలుసు కదా! రేపు పొద్దున్న ఫ్లైట్ కి 'ఫారిన్ డెలిగేట్స్ 'వస్తున్నారు” అంటూ ఎంతో వేగంగా తన కారు స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్లారు.


ఇంటికి రాగానే రంగాచార్యులు గారు ఒకసారి కాలు శుభ్రంగా కడుక్కొని, ఎర్రగా గీతల పడిన కాలు మీద ఒక ఆయింట్మెంట్ రాసి “లక్ష్మీ! భోజనం వడ్డించు. టైం అయిపోతుంది” అని కోపంగా గట్టిగా అరిచేసరికి, “అలాగేనండి ! మీరు వచ్చేయండి” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి పరిగెత్తింది భార్య లక్ష్మి.

పొద్దున కుక్క రక్కిన కాలు, చుర చుర మండడంతో అదే కోపం, చిరాకుతో “ఏమిటి నీ వంట? వంకాయ చేయమన్నాను కదా! దొండకాయలు ఎందుకు చేశావు? నీకు కూడా వయసు వస్తున్న కొద్దీ మతిమరుపు ఎక్కువైపోయింది. పోనీ చేసిన కూరయిన సరిగ్గా ఉడకలేదు. అంతా నా ఖర్మ!!” అంటూ పక్కకు తీసేసి, పెరుగన్నం తిని వెళ్ళిపోయారు.


భార్య లక్ష్మి కూడా మనసులో బాధపడుతూ ఈ 'ఆఫీస్ టెన్షన్లు 'ఇంటికి తీసుకు రావద్దంటే వినరు. సరిగ్గా భోజనం కూడా లేక చికాకు పడి పోతున్నారు. పొన్లే నా రోజు బాగోలేదు’ అనుకుంది. తన ఇద్దరు పిల్లల్ని పిలిచింది. వాళ్ళు పలకలేదు.


పలకని వాళ్లకోసం హాల్లోకి వెళ్లి “ఏరా వెధవల్లారా! పిలిచినా పలకలేదు? మీ ఆన్లైన్ క్లాసులు కాదు గాని, చదువు తక్కువ, వీడియో గేమ్స్ ఎక్కువ.. ఆడుకుంటూ ఇంట్లో పనులే మర్చిపోయారు. ఒక పక్క మీ నాన్నగారికి కోపం, ఓ పక్క మీ గోల.. పడలేక చస్తున్నాను!” అంటూ ఆ కోపం మీద పిల్లల్ని తిట్టింది.


అందులో పెద్దవాడు కోపంగా, బయటకు వెళ్లి కూర్చుండబోయే సరికి, అక్కడే కూర్చున్న 'నల్ల కుక్క' ఛి ,ఛి అన్నా కదలక పోయేసరికి ,కోపంతో అక్కడే ఉన్న రాయితో గట్టిగా కొట్టాడు. అంతే! అది అరుచుకుంటూ పారిపోయింది.


'ప్రొద్దున నల్ల కుక్క రక్కిన క్షణం నుంచి, GMగారు ఎంతో కోపంగా, తన కింద వాళ్లమీద చిరాకు పడుతూ ఉండడం, దానివల్ల ఆ కోపం, చిరాకు ఆఫీసంతా పాకడం, అలాగే ఇంట్లో కూడా అశాంతి చెలరేగి భార్య ని తిట్టడం, ఆవిడ కోపం పిల్లల మీద చూపడం ఆ పిల్లలు మళ్లీ అదే 'నల్ల కుక్క మీద తమ కోపం చూపించడం, యాదృచ్చికంగా జరిగిపోయాయి.


అందుకనే మనం బయటకు వస్తున్నప్పుడు ఆఫీసుకు గాని, వ్యాపారానికి గాని ఎంతో ప్రశాంత మనస్సుతో వెళ్లాలి! ఎన్ని అడ్డంకులు వచ్చినా, శాంతి పాటిస్తూ వెళితే , అంతా మంచే జరుగుతుంది. మన GM గారిలా కోపం, చిరాకుతో బయలుదేరితే, అది అందరికీ అంటుకొని ఆ రోజంతా పాడవుతుంది. ఇది మనకు ఒక 'నల్ల కుక్క' నేర్పిన పాఠం!

"మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది".

కనుక ప్రతి ఒక్కరు రోజు మొదలు పెడుతూనే, ఎంతో ప్రశాంతమైన మనసుతో పనులు ప్రారంభించాలి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.




69 views0 comments

Comments


bottom of page