top of page
Writer's pictureRamya Namuduri

నల్లమల నిధి రహస్యం పార్ట్ -12


'Nallamala Nidhi Rahasyam Part - 12' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

మేడ మీదకి వెళ్ళిన సంజయ్ సిద్దాంతి గారి శిష్యుడికి ఫోన్ చేసి, మాట్లాడుతున్నాడు.

అదే టైములో కింద ఫోన్ మాట్లాడుతున్న అజయ్ ముష్టివాడిని చూసి జాలిపడి, అన్నం పెట్టాడు.

అప్పుడు ముష్టివాడు అజయ్ ని తాకినప్పుడు షాక్ కొట్టినట్టు అనుభూతి చెంది చేయి తీసేసి దూరం జరిగి, పైకి చూస్తాడు.

అదే సమయంలో మేడ మీద నిలబడి, ఫోన్ మాట్లాడుతున్న సంజయ్ కి కింద జరుగుతున్నది ఏమీ తెలియదు.

అతను సిద్ధాంతి గారి శిష్యుడితో మాట్లాడుతూ

"గురువుగారు ఉన్నారా? ఇప్పుడు మేము రావొచ్చా " అంటూ అడుగుతూ ఉన్నాడు.

అవతలి వ్యక్తి "సిద్ధాంతి గారు దీక్షలో ఉన్నారు. ఇప్పుడు ఎవర్నీ కలవరు" అని ఫోన్ లొ చెప్తున్న మాటలు సంజయ్ కి తన వెనుకనే నించుని మాట్లాడుతున్నట్టు వినిపించింది.

ఇదేంటి.. అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన సంజయ్ కి అక్కడ ఏమీ కనిపించలేదు.

ఈలోగా ఫోన్ లొ ఉన్న ఆ వ్యక్తి.

" హలో!హలో!" అంటూ ఉండగా..సంజయ్ మళ్ళీ అతనితో మాట్లాడుతూ

"అది కాదు స్వామీ! ఇప్పుడు మేము చాలా ఆపదలో ఉన్నాము. అంటూ జరిగినది అంతా అతనికి చెప్తూ ఉన్నాడు.

ఇంతలో సంజయ్ వెనకనే ఆ ఆకారం తిరుగుతూ ఉంది.

సరిగ్గా అప్పుడే కింద అజయ్ కి ముష్టివాడు తాయత్తు ఇవ్వడం, అది వద్దు అని అజయ్ విసిరేయడం జరిగిపోయాయి.

ముష్టివాడు "తెలుస్తది సామీ ! నమ్మకాలొస్తయి సామీ ! అన్నం పెట్టినావని నీ మంచికోరా.. చల్లగుండు సామీ ! " అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాడు .

అతను కొంత దూరం వెళ్లి, వెనక్కి తిరిగి, ఆ ఇంటి మేడ పైకి చూసి, "హనుమయ్యా! నా చేయి దాటిపోయింది. ఇక అంతా నీదే భారం" అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

అప్పటి వరకు సంజయ్ వెనకనే అదృశ్యంగా తిరుగుతూ ఉన్న ఆ ఆకారం ఆ ముష్టివాడిని వెంబడిస్తూ వెళ్ళిపోతోంది..

అది గమనించిన అతను, నడక వేగం పెంచాడు.

***

శిష్యునితో జరిగింది అంతా ఫోన్ లోనే చెప్పాడు సంజయ్.

"గురువుగారు ఇప్పుడు ఎవర్నీ కలవరు. కానీ మీరు చెప్పేది వింటూ ఉంటే మీరు చాలా ప్రమాదంలొ ఉన్నారు అనిపిస్తోంది. సరే! నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏ విషయం మీకు నేనొక అరగంటలో చెప్తాను " అంటూ ఫోన్ పెట్టేసాడు ఆ శిష్యుడు.

సంజయ్ కిందకి వెళ్ళిపోయి, అజయ్ కి తెలియకుండా తల్లికి విషయం చెప్పి, ‘అరగంటలో తెలుస్తుంది! నువ్వు కంగారు పడకు’ అని చెప్పాడు.

అప్పుడు అజయ్ వచ్చి, "ఏంటి తెలుస్తుందిరా? " అంటూ అడిగాడు.

"ఏమీ లేదురా! రాత్రి మన ప్రయాణం కదా.. దాని గురించి మాట్లాడుకుంటున్నామం”టూ ఏదో కవర్ చేసేసాడు సంజయ్.

"సరే! నువ్వు ఒక వారంలో వస్తాను అంటున్నావ్ గా! అమ్మ నీకు కావాల్సినవి అన్నీ రెడీ చేసింది. నువ్వు ఇంట్లోనే తిను. వంట చేసుకుని, బయట తినేయకు. హారర్ సినిమాలు చూడకు" అంటూ తమ్ముడికి క్లాస్ మొదలుపెట్టాడు అజయ్.

ఫోన్ వైపు చూసుకుంటూ బుర్రగొక్కుంటూ అజయ్ క్లాస్ వింటూ,

" అమ్మా! అన్నయ్యకి తొందరగా పెళ్లి చేసేయ్ వే.. వీడి క్లాస్ లు వినలేక పోతున్నాను." అంటూ తల్లి చెవిలో గొణుగుతున్నాడు సంజయ్.

"ఏంటిరా! " అంటూ సంజయ్ నెత్తి మీద మొట్టికాయ వేసి, నువ్వు మారవు..అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఏదో పని ఉన్న వాడిలా.

పెళ్లి అనే మాట వినేసరికి, బాబుకి మళ్ళీ ఆ స్వప్న సుందరి గుర్తొచ్చింది.

ఈలోగా సంజయ్ కి ఆ సిద్ధాంతి గారి శిష్యుడి నుండి ఫోన్ వచ్చింది.

మెల్లిగా అక్కడనుండి జారుకుని మేడ మీదకి వెళ్ళి, ఫోన్ లిఫ్ట్ చేసాడు సంజయ్.

అవతలి వ్యక్తి ఏమి చెప్పాడో కానీ. అది వింటున్న సంజయ్ మాత్రం నిలువెల్లా చమటతో తడిసిపోతూ చిగురుటాకులా వణికిపోతున్నాడు.

"సరే గురువు గారు! మీరు చెప్పినట్టే చేస్తాను " అని చెప్పి, ఫోన్ కట్ చేసి కిందకి వెళ్లాడు.

సంజయ్ రావడం చూసి, అతనికి ఎదురువెళ్లి,

" ఏమన్నారు రా? రమ్మన్నారా? " అంటూ కంగారుగా అడుగుతుంది సీత.

" ప్రమాదం ఏమీ లేదుట అమ్మా! నన్ను రేపు వచ్చి, కలవమన్నారు. నువ్వు వాడితో ఇవాళ వెళ్ళు. వాడ్ని వీలైనంత వరకూ కనిపెట్టుకుని ఉండు. నేను విషయం అంతా పూర్తిగా తెలుసుకుని వస్తాను " అంటూ చెప్పి, “నేను ఇప్పుడే వస్తాను. వాడు జాగ్రత్త!" అని, ఎక్కడికో చెప్పకుండానే వెళ్ళిపోయాడు.

సీతకి సంజయ్ చెప్పింది అంతగా నమ్మబుద్ధి కాలేదు. ‘వీడు ఏదో దాస్తున్నాడు.. ఎలా తెలుసుకోవాలి?’ అనుకుంటూ ప్రయాణానికి కావలసిన మిగతా పనులు చేసుకుంటూనే అజయ్ ని ఒక కంట కనిపెడుతూ ఉంది.

***

సంజయ్ బైక్ స్టార్ట్ చేసి సిద్ధాంతి గారి ఇంటి వైపు

వెడుతున్నాడు. వీధి చివరికి వెళ్లేసరికి అక్కడ జనం గుమికూడి ఉండడం చూసి, ఏమి జరిగింది అని అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగితే.

"ఎవరో ముష్టి అతను. పిచ్చి పట్టినట్టు అరుస్తూ వేగంగా వస్తోన్న లారీ వైపు, ఎవరో తోసేసినట్టుగా వెళ్లి గుద్దేసి, అక్కడికక్కడే పడి, చచ్చిపోయాడు” అన్నాడు అతను.

అయ్యో! అనుకుంటూ తనున్న పరిస్థితుల్లో అంతకంటే ఇంకేం మాట్లాడలేక, వెంటనే వేరే దారి గుండా సిద్దాంతి గారి ఇంటి వైపు పయనమయ్యాడు.

***

పద్మాసనం వేసుకుని కూర్చున్న రామచంద్ర సిద్ధాంతి గారు తన దీక్షను తాత్కాలికంగా విరమించి "అమ్మా! మన్నించు. నీ దీక్షను తాత్కాలికంగా విరమించవల్సి వస్తోంది.

ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలి అని పగతో ఎదురుచూస్తున్న ప్రేతాత్మ దుష్టత్వాన్ని అంతం చేసే శక్తి ఇవ్వమ్మా!" అంటూ అమ్మవారికి దండం పెట్టుకుని, తన శిష్యుడిని పిలిచి

"ఇప్పుడు ఆ కవల పిల్లల్లో రెండో వాడు వస్తాడు. వాడికి ఈ రక్ష అందించు. ఇవాళ రాత్రి మృత్యు దిశగా వెడుతున్న వాడి అన్నకి ఈ రక్ష అండగా నిలుస్తుంది అని చెప్పు. ఇక ఆ రెండోవాడ్ని రేపటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి పంపు" అంటూ మళ్ళీ ధ్యానం లోకి వెళ్ళిపోయారు.

సంజయ్ కోసమే ఎదురుచూస్తున్న ఆ శిష్యుడు, అతను రాగానే రక్ష అతనికి ఇచ్చి, సిద్ధాంతి గారు చెప్పింది అంతా అతనికి వివరించాడు. సంజయ్ అది తీసుకుని, మళ్ళీ ఇంటి దారి పట్టాడు.

***

"అమ్మా! తమ్ముడు ఏడి?" అప్పుడే బయటకొచ్చిన అజయ్ సీతని అడిగాడు.


"ఏమో నాన్నా! ఇప్పుడే వస్తాను అని వెళ్లాడు. వచ్చేస్తాడులే.. " అంటూ కాఫీ కలిపి ఇచ్చింది.

అది తాగుతూ మేడ మీదకి వెళ్లి, చుట్టూ ప్రకృతిని చూస్తూ తన కలలో కనిపించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.

అప్పటికే సాయంత్రం కావడంతో అస్తమిస్తున్న సూర్యకిరణాలు చుట్టూ ఉన్న చెట్లపై పడి ఎంతో అందంగా కనిపిస్తోంది. చల్లని సాయంత్రం పూట వీస్తున్న గాలి అతనికి ప్రశాంతతను చేకూరుస్తోంది.

ఇంతవరకూ తను ఎవరినీ ప్రేమించలేదు. కానీ తన కలలో కనిపించిన అమ్మాయిని మాత్రం మరిచిపోలేకపోతున్నాడు. ఆమె ఊహల్లో విహరిస్తూ ఉండగా ఆయాసపడిపోతూ వచ్చాడు సంజయ్.

"ఏరా! ఎక్కడికి వెళ్లిపోయావ్? " అని అడిగాడు అజయ్.

సంజయ్. అజయ్ చేయ గట్టిగా పట్టుకుని, రక్ష కట్టేసాడు.

"రేయ్! నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని తెలుసు కదరా" అంటూ రక్ష తీసేయబోయాడు.

వెంటనే సంజయ్ అతడ్ని ఆపి, " నేను, అమ్మా చచ్చిపోయినంత ఒట్టు. నువ్వు కనక ఆ రక్షను తీసేస్తే!" అంటూ నీరు నిండిన కళ్ళతో తలపై చేయి వేసి మరీ ఒట్టు పెట్టేసాడు సంజయ్.

"రేయ్ ఏమైంది నీకు? అంత ఎమోషనల్ అయిపోతున్నావ్.. సరే తీయనులే. ఐనా అమ్మ లాగే నువ్వు కూడా ఏంటిరా?" అంటూ సంజయ్ ని హత్తుకున్నాడు అజయ్.

సంజయ్ కళ్ళు తుడుచుకుని, "అన్నయ్యా! నువ్వంటే నాకు ప్రాణంరా! పొద్దున్న అమ్మ భయపడింది కదా.. నువ్వు కూడా నల్లమల దగ్గర పనిచేయవలసి వస్తోంది అని! అందుకే నా తృప్తి కోసం ఇది. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఇది తీయకురా. ఒట్టు వేసుకున్నా! గుర్తుపెట్టుకో." అంటూ చెప్పాడు సంజయ్.

"నాకూ ఇవి నమ్మకం లేదురా. కానీ నీకోసం ఉంచుకుంటాను. ప్రామిస్. ఇక హ్యాపీ నా?" అన్నాడు అజయ్.

"హ.. హ్యాపీ రా!" అంటూ అన్నను హత్తుకున్నాడు ఆ తమ్ముడు.

ఇద్దరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు ఆ చల్లటి సాయంత్రం పూట.

అలా చాలా సేపు అక్కడే ఉండిపోయారు ఆ అన్నాతమ్ముళ్లు.

కాసేపటికి సీత వచ్చి, "కిందకి రండి నాన్నా. బస్సుకి టైం అవుతోంది కదా! అన్నం తిందురు గాని.." అంది.

"అమ్మా! ఈ పూట, మా ఇద్దరికీ నువ్వే తినిపించు. ఈ చల్లని గాలిలో చుక్కల వెలుగులో చిన్నప్పుడు తినిపించే దానివే. అలాగ!" అని అడిగాడు అజయ్.

సీత సంతోషంగా “అలాగే నాన్నా” అంటూ కిందకి వెళ్లి అన్నం, కూరలు. అన్నీ తీసుకు వచ్చింది సంజయ్ సాయంతో.

ఇద్దరు కొడుకులకి ప్రేమగా ముద్దలు కలిపి తినిపిస్తోంది.

ఆ చల్లని గాలి, ఆ తల్లీకొడుకులను సేద తీరుస్తోంది.

చుక్కల పందిరి కింద, వెన్నెల కురిపించే చంద్రుడి చలువలో ఆ తల్లీకొడుకులు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ కడుపునిండా తినేశారు.

ఎందుకో సీత మనసుకి మాత్రం ఆ క్షణం అలా నిలిచిపోతే బాగుండు అనిపించింది.

ఏదో తెలియని దిగులు ఆ తల్లి మనసుని మెలిపెడుతూ ఉన్నా కూడా కాలం తన పరుగు ఆపదు కదా! పరిగెడుతోనే ఉంది వారి ప్రయాణం తప్పదు కదా అన్నట్టు.

సంజయ్ భారమైన గుండెతో తన అన్నను, తల్లిని బస్సు ఎక్కించి, ఇంటి దారి పట్టాడు. దారంతా రేపటి సూర్యోదయం తరువాత తను చేయవలసిన పని గురించి ఆలోచించుకుంటూ.

***

అజయ్, సీతల ప్రయాణం శ్రీశైలం వైపు సాగుతోంది.

కదిలే ఆ బస్సు అందులోని ప్రయాణికులతో పాటు, వారి ఆలోచనలు కూడా మోసుకుంటూ పోతోంది. కదిలే ఆ బస్సు కిటికీ లోనుండి చందమామను చూస్తున్న అజయ్ కి తన స్వప్న సుందరి దర్శనం ఇచ్చింది.

"నువ్వు ఉన్నావో లేవో..

అందమైన ఊహవో..లేక నా భ్రమవో..

కవ్వించి కరిగిపోయే కలవో..

నా ప్రేమ రాజ్యపు యువరాణివో..

నన్ను కాల్చి మసి చేసే కారుచిచ్చువో..

నాకు తెలియదు కానీ..

నా మనసులో ముద్రించుకు పోయిన నీ రూపం.. తెలియకుండానే నీమీద నిలిచిపోయిన నా ప్రాణం..

నువ్వు నిజమైతే నాకు కనిపించు నేస్తం.."

అంటూ ఆ స్వప్నసుందరి ఊహల్లో తేలిపోతూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు.

అప్పటికే చంద్రుడు నీ ప్రియుడు నీ వైపుగా వచ్చేస్తున్నాడు అంటూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న

మరియా ఆత్మకు వర్తమానం అందించాడు.

ఆ పవిత్ర ఆత్మ తన ప్రియుడు రాబోతున్నాడు అన్న ఆనందంలో తనకు విముక్తి కలగబోతోంది అన్న సంతృప్తి తో సంతోషంగా నృత్యం చేస్తోంది.

అది తెలిసిన ఒక దుష్టాత్మ మాత్రం "నా పగ నెరవేరే తీరుతుంది " అంటూ వికృతంగా నవ్వుతోంది.

***

ఒకరిది ప్రేమ..

ఒకరిది పగ..

అసలు కథలోకి వెళ్ళిపోదాం.. నాతో వచ్చేయండి 👍

సశేషం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


37 views0 comments

Comments


bottom of page