top of page
Writer's pictureRamya Namuduri

నల్లమల నిధి రహస్యం పార్ట్ - 32


'Nallamala Nidhi Rahasyam Part - 32' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఆ అడవిలో, పరుగు లాంటి నడకతో వేగంగా నడుస్తూ వెళ్తున్న సంజయ్ కి, తాను ఇదివరకు ఎప్పుడో, ఈ అడవి ప్రాంతంలో తిరిగినట్టుగా అనిపించసాగింది. వేగంగా నడుస్తూ, మధ్య మధ్యలో ఇంకా వేగంగా పరిగెడుతూ, ఆగి ఆగి రొప్పుతూ, ఆ అడవి మార్గంలో వెడుతూ ఉన్న అతనికి ఓపిక అంతా సన్నగిల్లుతోంది.

ముందు రోజు రాత్రంతా నిద్రలేకపోవడం, పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల, అలుపెరగని ప్రయాణం వల్ల, అతన్ని నిస్సత్తువ ఆవరిస్తోంది. అయినా, తన అన్నకోసం ఓపిక కూడగట్టుకుని, ఒక్కో అడుగు వేస్తూ, నడుస్తూ ఉన్న సంజయ్ కి గొంతు తడి ఆరిపోతోంది. ఆకలితో కడుపులోని పేగులు మెలితిరిగి పోతున్నాయి. ఇంకా ఒక ఫర్లాంగు దూరం ఉంది అనగా, సంజయ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. సంజయ్ నే నీడలా వెంబడిస్తూ వచ్చిన నరేంద్రుని దుష్టాత్మ వికృతంగా నవ్వసాగింది.

" అయ్యారే.. మహారాజా! అయిపోయిందా నీ ఓపికా? లే! లేచి వెళ్ళు. ఆ ఖడ్గం నాకూ అవసరమే. అది నువ్వు బయటకు తేవాలి, నేనూ దాన్ని నీ నుండి సొంతం చేసుకుని, నా అంతాన్నే అంతం చేసి, నాకు ఏనాడో సొంతం కావాల్సిన నిధిని సొంతం చేసుకుని, నా తీరని కోరిక తీర్చుకుంటా!

నాకిక అంతం ఉండదు. ఈ వాహకం నుండి ఇంకో వాహకంలోకి, మరో వాహకంలోకి మారుతూ, ఆత్మని అయినా హాయిగా మళ్ళీ మళ్ళీ కొత్త రూపాలను పొందుతూ, ఈ నిధితో ఈ ప్రపంచంలోని అన్నీ విలాసాలను అనుభవిస్తూ, అపర కుబేరుడనయి వెలిగిపోతాను" అంటూ వికృతంగా నవ్వుతూ, తన దుష్టశక్తితో వర్షం కురిపించసాగాడు. ఆ వర్షపు నీరు, సంజయ్ ని స్పృహలోకి వచ్చేలా చేసింది. స్పృహలోకి రాగానే, కళ్ళు మసక మసకగా అవుతున్నా మళ్ళీ తన పయనం ప్రారంభించాడు సంజయ్.

తను చనిపోయినా పర్వాలేదు. ఎలాగైనా ఖడ్గాన్ని సంపాదించి, తన అన్నకు ఇచ్చి, సిద్ధాంతి గారు చెప్పిన విషయాలు అన్నీ చెప్పి, అన్నను కాపాడుకోవాలని ఒక తమ్ముడిగా, తన శక్తికి మించి, తన ప్రాణాలను పణం పెట్టి ఆ అడవిలో, విధికి ఎదురీదుతున్నాడు సంజయ్.

***

సీత మనసంతా గందరగోళంగా ఉంది.

అంజలి, అంజలి వాళ్ళ అమ్మా, సీతకు ధైర్యం చెప్పి, కొద్దిగా అన్నం తినిపించగలిగారు. సంజయ్, అజయ్ లను తలుచుకుంటూ సీత, వాళ్ళిద్దరి క్షేమం కోసం మల్లన్న స్వామిని వేడుకుంటూ ఉంది.

"కంగారు పడకండి ఆంటీ! సంజయ్ వెళ్లాడు కదా! వాళ్ళ అన్నయ్యతోనే తిరిగివస్తాడు చూడండి. మీరు బాధపడకండి" అంటున్న అంజలితో

" అజయ్ వెతుక్కుంటూ వెళ్లిన సింగా, స్వయానా నా బాబాయి కొడుకు. నాకు తమ్ముడు, వీళ్ళకి మేనమామ.

నీకు తెలీదు అంజలీ! నేను ప్రేమ వివాహాం చేసుకున్నాను అని! మా తండ్రి మమల్ని ఇంట్లోకి రానివ్వకపోతే, మేము ఇదే ఊరిలో విడిగా ఉండేవాళ్ళం. మా వల్ల మా నాన్న పరువు పోయింది అంటూ ఈ సింగా, నన్ను నా భర్తని చాలా సార్లు చంపాలని ప్రయత్నం చేసేవాడు. మా నాన్న చనిపోయిన తరువాత, ఆయన ఆస్తిని, ఇంటిని స్వాధీనం చేసుకుని, చాలా అరాచకాలకు పాల్పడేవాడు.

నా భర్త వాడిని ఎదుర్కొనే క్రమంలో, మాకు విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా చేయించింది కూడా సింగానే. ఊరు విడిచి వెళ్లిపోతున్నప్పుడు కూడా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడాడు. ఇక ఈ జన్మలో సింగాతో మాకిక సంబంధం ఉండదు అనుకున్నాను. కానీ విధి మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. ఎవరి మొహం జీవితంలో చూడకూడదు అనుకున్నానో, వాడితో, నా కొడుకుకి వైరం వచ్చింది. వాడు చాలా క్రూరుడు అంజలీ! ఏ జన్మలో ఏమి పాపం చేసానో తెలియదు. 'నా' అన్నవారిని మింగేసింది ఈ అడవి" అంటూ, ఒక తండ్రిని కోల్పోయిన కూతురిగా, భర్తను పోగొట్టుకున్న భార్యగా, ఇప్పుడు బిడ్డలకి కూడా ఆ అడవిలో ఏం జరగబోతోందో అనే బాధతో ఒక తల్లిగా ఆమె పడుతున్న వేదన చూసి అంజలికి, అంజలి తల్లికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి.

***

మరియాతో కలిసి, అమ్మవారి గుడికి బయలుదేరిన అజయ్, ఒక్కసారిగా పడుతున్న వర్షంలో తడిసి ముద్దయిపోతున్నాడు.

"ఇదేంటి? ఇప్పటి వరకూ లేని వాన, ఇప్పుడు మొదలైంది.." అని అజయ్ అంటూ ఉండగా.

" మావా! ఇది సహజంగా కురుస్తున్న వర్షం కాదు. ఇది ఆ దుష్టుడి పని" అంది మరియా.

"వాడి పనా! కానీ ఎందుకు?" అన్నాడు అజయ్.

మరియా ఒక్క నిమషం కళ్ళు మూసుకుంది. ఆమె ముఖంలో హావభావాలు మారిపోతున్నాయి. మూసి ఉన్న ఆమె కనురెప్పల మాటుగా, అటు, ఇటు తిరుగుతున్న ఆమె కను గుడ్లు, ఆమెలోని కలవరాన్ని తెలియజేస్తున్నాయి.

ఆమె తన ఆత్మ శక్తితో ఏమి చూస్తోందో తెలియని అజయ్ కి ఆందోళన పెరిగిపోతోంది.

ఒక్కసారిగా కళ్ళు తెరిచిన మరియా.

"మావా! నీ తమ్ముడు సంజయ్ ప్రమాదంలో ఉన్నాడు. అతను ఇప్పుడు నీకోసమే, ఆ ఖడ్గాన్ని సంపాదించాలని అమ్మవారి గుడికి చేరుకోబోతున్నాడు. కానీ." అంటూ ఇంకా ఏదో చెప్పబోయి, ఆగిపోయింది మరియా.

" హా! చెప్పు మరియా.. కానీ ఏంటి? " అంటున్న అజయ్ తో.

" మావా! మాట్లాడేందుకు సమయం లేదు. ఆ గుడి ఇక్కడికి చాలా దూరం. ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకోవాలి. లేకుంటే నీ తమ్ముడి ప్రాణానికే ప్రమాదం. నేను నీలో ఆవహిస్తాను. ఆ తాయత్తు నన్ను ఏమీ చేయదు. నేను అమ్మవారి ఉపాసకురాలిని కదా! " అంటూ అజయ్ ని పూర్తిగా మాట్లాడనివ్వకుండా, అజయ్ శరీరంలోకి మరియా ఆవహించింది.

ఒక్కసారిగా అజయ్ గాలిలోకి ఎగిరి, అమ్మవారి గుడి వైపుగా పయనమయ్యాడు.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.



34 views0 comments

Comments


bottom of page