top of page
Writer's pictureRamya Namuduri

నల్లమల నిధి రహస్యం పార్ట్ -6


'Nallamala Nidhi Rahasyam Part - 6' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

ఒక్కసారిగా.

" మరియా!" అంటూ ఉలిక్కిపడి లేచి, చుట్టూ చూసాడు అజయ్.

తను తన గదిలోనే ఉన్నాడు. అప్పుడు అర్ధం అయింది ఇదంతా కల అని.

‘ఏంటిది..ఇలాంటి కల వచ్చింది? అంతా ఎప్పుడో.. ఎక్కడో.. చూసినట్టు ఉంది.

ఆ అమ్మాయి.. ఆ అమ్మాయిని నేను ఇంతకు ముందెప్పుడో చూసినట్టు.. అది కూడా తను నాకూ చాలా దగ్గర మనిషే అన్నట్టు.. అనిపించింది’ అనుకుంటూ పక్కనే గురకపెట్టి నిద్రపోతున్న తమ్ముడ్ని చూసి,

" ఆహా! ఏమి నిద్రరా నాయనా. మెలుకువ వచ్చేసింది వీడి గురకకి. నాకిక నిద్రపట్టదులే" అనుకుంటూ టైం చూస్తే 4:30 అయింది.

"కాసేపు బాల్కనీ లో కూర్చుందాం. " అని వెళ్ళాడు.

చల్లటి గాలి తన మోముని మత్తుగా తాకుతోంది.

చెట్ల కొమ్మల మాటుగా చందమామ తొంగి చూస్తున్నాడు.

ఆ చందమామను చూస్తోంటే ఇందాక తన కలలోకి వచ్చిన అమ్మాయి కనిపించింది.

"హా!" అంటూ కళ్ళు నులుముకుని చూస్తే అక్కడ ఏమీ లేదు.

" ఏంటో నా కళ్ళు! నన్నే మాయ చేస్తున్నాయి.అసలు ఎవరో ఆ అమ్మాయి.. ఆ కల అంతా ఏంటి?"అనుకుంటూ మళ్ళీ చందమామను చూసాడు.

" ఓ చందమామా! నీలో నాకు తనే కనిపిస్తోంది. ఏదో తెలియని మధురానుభూతి నాలో కలుగుతోంది. తను ఎవరో నీకు తెలిస్తే నాకు చెప్పవా.. ఎంత దూరమైనా తనకోసం వెళ్లాలనిపిస్తోంది . ఆ రూపం నా మనసులో ముద్రించుకు పోయింది.

‘ఎన్నో జన్మల నుండి నా కోసమే ఎదురు చూస్తున్నదా! తన కొసమే నేను పుట్టానా! అన్నట్టుగా ఏవో భావనలు నాకు పిచ్చి పట్టించేస్తున్నాయి. కలలో ఆమెను చూసిన మరుక్షణం నుండి. ఆమెను చూడాలన్న తపన నన్ను నిలబడనీయడం లేదు. అసలు నా కలలో వచ్చిన ఆ అమ్మాయి నిజంగా ఉందా? ఉంటే ఆ అమ్మాయికి నా మాటగా చెప్పవా నా ఎదుటకు రమ్మని. వద్దు.. వద్దు.. నన్నే ఆమె చెంతకు పిలిపించుకోమని’ అంటూ చందమామను చూస్తూ కవితలు అల్లేస్తున్నాడు అజయ్.

సరేనంటూ చందమామ ఆ దట్టమైన అడవిలో తన వెన్నెల వెలుగుల రూపంలో అజయ్ ప్రేమ సందేశాన్ని ఆ అమ్మాయి కి అందించే ప్రయత్నం చేస్తోంది.

కానీ ఇది ప్రకృతి విరుద్ధం అని ఆ దట్టమైన కారడవి హేళనగా నవ్వుతోంది.

ప్రేమ సందేశాన్ని మోసుకొచ్చిన చందమామ మౌనంగా చూస్తోంది. ఆ కటిక చీకటిని చీల్చుకుని. తన కిరణాలు ప్రసరింప చేయలేని శశిబింబం చిన్నబోయి చూస్తోంది.

" జన్మల క్రిందట కలిసిన ప్రణయం.

మరణం కూడా మార్చని వైనం.

విధి విధించిన వింత పయనం.

తీర్చలేని దుఃఖం.

తీరిపోదు పాశం.

ఆత్మనైనా విడువని ప్రమాణం.

నీ రాక కోసం వేచి ఉంది నా హృదయం.

ఓ శశిబింబమా! మా ప్రేమే సత్యం అయితే, నా ప్రతిజ్ఞ నిజమే అయితే దరి చేర్చు నా నాథుడ్ని.

కల్పించమను నాకు విముక్తిని"

అంటూ ఆ అమ్మాయి ఆత్మ ఘోషిస్తూ ఉంది.

ఆ ఇరువురి బాధను ప్రత్యక్షంగా చూస్తోన్న

ఆ చందమామ భారమైన మనసుతో మబ్బుల మాటున దాక్కుని ఇక తన వంతు అయిపోయింది అన్నట్టు సూర్యుడ్ని ముందుకు తోసింది.

రాత్రంతా చాలా సేపు బాల్కనీలో కూర్చుని ఎప్పుడు నిద్రపోయాడో తెలీకుండానే నిద్రపోయాడు అజయ్.ఉదయిస్తున్న సూర్యకిరణాలు తన మోముపై పడగా మెలుకువ వచ్చింది అతనికి.

లేచి చూస్తే బాల్కనీలో కుర్చీలో ఉన్నాడు.ఇదేంటి ఇక్కడున్నాను.. అనుకుంటూ తెల్లవారుఝామున తనకు కల రావడం, తను అప్పుడు ఇక్కడకొచ్చి కూర్చోవడం అంతా గుర్తొచ్చింది.

లేచి, గదిలోకి వేడితే సంజయ్ ఇంకా మత్తుగానే పడుకుని ఉన్నాడు. టైం చూస్తే 7:15 అయింది.

"ఒరేయ్.. లేరా! కాలేజీ కి టైమ్ అవుతోంది" అంటూ సంజయ్ ని లేపుతున్నాడు అజయ్.

"ఉండరా. నన్ను లేపకు అన్నయ్యా! ఇవాళ కూడా లీవ్ పెట్టేస్తా" అన్నాడు సంజయ్ బద్ధకంగా.

"ఏంట్రా లీవ్ పెట్టేది.." అంటూ ఒక్క తన్ను తన్నాడు సంజయ్ ని.

అంతే. నిద్రమంచం మీంచి కిందపడ్డ సంజయ్ బుర్రగొక్కుంటూ "ఒరేయ్! ఇప్పుడు నేను ఎలా కిందపడిపోయాన్రా? " అన్నాడు.

'ఇదిగో ఇలాగ.." అంటూ మళ్ళీ తన్నాడు అజయ్.

"ఒరేయ్ నీ పోలీస్ దెబ్బలు నాకు రుచి చూపించకురా నాయనా. నేను కాలేజీ కి వెళ్తానులే" అంటూ ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి దూరాడు సంజయ్.నవ్వుకుంటూ హాల్లోకి వెళ్లాడు అజయ్.

“లేచావా నాన్నా..ఉండు కాఫీ తెస్తా” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది సీత.

బ్రష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు అజయ్.

తలంతా భారంగా ఉంది. తెల్లవారు ఝామున వచ్చిన కల. ఇంకా తన మస్తిష్కం వదిలి పోలేదు.

ఎప్పుడూ తనని తాను కోయరాజుగా ఊహించుకోలేదు.

ఏ అమ్మాయినీ ఇంతవరకు ప్రేమించలేదు తను.

కానీ తన కలలో కనిపించిన అమ్మాయిని మాత్రం చూసినది క్షణకాలమే అయినా కూడా ఆ అమ్మాయిని మర్చిపోలేక పోతున్నాడు. ఏదో తెలియని బాధ. ఎలాగైనా ఆమెను మళ్ళీ చూడాలి అనే తపన. కళ్ళు మూసుకుని ఆమె రూపం ఎలా ఉందొ ఊహించుకుంటూ భారంగా ఉన్న తలను పట్టుకుని కూర్చున్నాడు అజయ్.

“నాన్నా అజయ్! ఇదిగో కాఫీ తీసుకో” అంటూ అందించింది సీత.

ఆ కాఫీ తాగుతూ. "అమ్మా! ఇవాళ రాత్రి బస్సు. మనము బయలుదేరి శ్రీశైలం వెళ్తున్నాం. మా జూనియర్ రూమ్ సెట్ చేసి పెట్టాడు." అంటూ చెప్తున్నాడు అజయ్.

సీత మనసు భయం, బాధలతో నిండిపోయింది.ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళ నుండి కన్నీరు కురువ సాగింది.

"ఏమైంది అమ్మా! నీకు నాతో రావడం ఇష్టం లేదా?" అని కంగారుగా అడిగాడు అజయ్.

"అది కాదు నాన్నా. మీ నాన్నగారు గుర్తొచ్చారు. ఇన్ని ఏళ్ల తరువాత మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నాం అంటే సంతోషం తో పాటు భయంగా కూడా ఉందిరా”.

" భయమా? దేనికమ్మా? " అన్నాడు అప్పుడే అక్కడికి వస్తున్న సంజయ్.

"ఏమి జరిగింది అని, నీకు ఆ ఊరు అంటే అంత భయం?"

అన్నాడు అజయ్.

"చెప్తాను నాన్నా! మీ ఇద్దరికీ కూడా తెలియాల్సిన సమయం వచ్చేసింది. మా నాన్నగారి ఊరు శ్రీశైలం దగ్గర నల్లమల అడవిని ఆనుకుని ఉన్న బలభద్రపురం. ఆ ఊరి పెద్ద మా నాన్న బసవయ్య.

మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది.మా నాన్న మళ్ళీ పెళ్లిచేసుకోలేదు. అంత పెద్ద ఇంట్లో నేను, నాన్న.మా నాన్న దగ్గర పనిచేసే కిరాయి మనుషులు.

ఇద్రభవనం లాంటి ఇంట్లో ప్రేమ తప్ప అన్నీ ఉండేవి.

ఎప్పుడూ మా నాన్న నన్ను ప్రేమగా దగ్గరకి తీసుకోనే లేదు. ఆయనకు ఎప్పుడూ. నల్లమల అడవిలో ఏదో నిధి ఉందని, అది వెలికితీసి, ఈ ప్రపంచంలో తానే ధనవంతుడిని కావాలనే కోరిక తప్ప ఇంట్లో తనకొక కూతురు ఉంది, తనతో ఒక గంట అయినా ప్రేమగా మాట్లాడాలి అనిపించేది కాదు.

చిన్నప్పటి నుంచి నేను తండ్రి ప్రేమ కోసం అలమటిస్తూ ఉండేదాన్ని.

అలాంటి రోజుల్లో నేను మీ నాన్నగారిని ఇష్టపడ్డాను.

ఆయన కూడా నన్ను ఇష్టపడడంతో మీ నాన్నగారి స్టేషన్ లోనే దండలు మార్చుకుని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.

అది మా నాన్నకి ఇష్టంలేక, మమల్ని ఇంట్లోకి రానివ్వలేదు. అలా నెలలు గడిచిపోయాయి.

అప్పుడే నేను వినకూడని ఒక మాట విన్నాను.

అదేంటంటే..”

*** సశేషం ***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు



39 views0 comments

Comments


bottom of page