'Nallamala Nidhi Rahasyam Part - 7' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
మీ నాన్నగారి స్టేషన్ లోనే దండలు మార్చుకుని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.
అది మా నాన్నకి ఇష్టంలేక, మమల్ని ఇంట్లోకి రానివ్వలేదు. అలా నెలలు గడిచిపోయాయి.
అప్పుడే.. నేను వినకూడని ఒక మాట విన్నాను.
అదేంటంటే..
మా నాన్న, నల్లమల అడవిలో దాగి ఉన్న నిధి కోసం ఎవరో ఒక అనాధ పిల్లాడిని బలి ఇచ్చాడని, కాటికాపరి సాయంతో,ఆ హత్యను సహజ మరణం గా చిత్రీకరించాడని, అందుకు సాయం చేసిన కాటికాపరి చనిపోయి ఉన్నాడని మీ నాన్నగారి ద్వారా తెలిసింది..
అది విన్న నేను అక్కడికక్కడే కూలబడిపోయాను.
నన్ను ఎలాగో సముదాయించి, మా నాన్నను అరెస్ట్ చేయడం కోసం చాలా చోట్ల వెతికారు. ఎంత వెతికినా వాళ్ల ఆచూకీ దొరకలేదు. ఆ కేసు మీదే పనిచేస్తూ, ఒక ఏడాది కాలం శ్రీశైలంలోనే ఉన్నాము.
తరువాత అక్కడ నుండి విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది.
అప్పుడే మీ ఇద్దరూ ఒకేసారి నా కడుపున పడ్డారు..
మీ ఇద్దరినీ కన్న సంతోషం లో రోజులు ప్రశాంతంగా సాగిపోతున్న వేళ మీ నాన్నగారికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది.
ఇక్కడకి రావడం అవన్నీ మీకు తెలుసుగా.. మీ ఇద్దరూ బాగా చదువుకోవడంతో చీకు చింత లేకుండా హాయిగా 15 ఏళ్ళు గడిచిపోయాయి .
ఇద్దరూ డిగ్రీలు పూర్తిచేసే టైంకి, స్పెషల్ ఆపరేషన్ పేరుతో. స్పెషల్ ఫోర్స్ గా నల్లమలలో జరిగిన కూంబింగ్ లో మీ నాన్నగారికి డ్యూటీ పడడం,ఆ మారణకాండలో మనము ఆయన్ని కోల్పోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ నల్లమల అడవుల్లోనే నా తండ్రి అదృశ్యం అయిపోయాడు. అక్కడే నా భర్త కూడా బలైపోయాడు.. " అంటూ సీత వెక్కి వెక్కి ఏడవసాగింది..
"వద్దు అమ్మా ఏడవకు. ఇప్పుడు నాకూ అక్కడకి ట్రాన్స్ఫర్ అయిందని, నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నావ్! అవునా?" అన్నాడు అజయ్..
అవునన్నట్టు తల ఊపింది సీత.
"అమ్మా! ఎప్పుడో ఏదో అయింది అని, ఇప్పుడు కూడా అవుతుంది అని అనుకోకు. నాన్న పోయిన తరువాత, మనల్ని ఆదుకుంది ఆయన నుండి వచ్చిన ఈ పోలీస్ జాబ్ కదా. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను జాబ్ లో చేరాను కనక, తమ్ముడైనా వాడు కోరుకున్న చదువు చదువుకోగలిగాడు. మంచిగా సెటిలయ్యాము. ఇది మనల్ని కాపాడే జాబ్ అమ్మా! అనవసరంగా నువ్వు భయపడి ఆరోగ్యం పాడు చేసుకోకు" అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు అజయ్.
"సరే నాన్నా! రండి టిఫిన్ చేద్దురుగానీ.." అంటూ కళ్ళు తుడుచుకుని, కిచెన్ లోకి వెళ్ళింది సీత.
" ఒరేయ్ అన్నయ్యా! అమ్మ ఎన్నాళ్ళనుంచి ఇంత బాధ పడుతోందో.. ఏదేమైనా ఇవాళ తన బాధ బయటపెట్టింది.
నువ్వు తనని నీతో తీసుకెళ్తా అన్నావ్ కదా. నేను అక్కడికి ఇంకో ఫైవ్ డేస్ లో వస్తాను.. ఒక త్రీ డేస్ ట్రిప్ మాది.
నల్లమల అడవుల్లో ట్రెక్కింగ్..
మా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తో వచ్చి, వెళ్ళేటప్పుడు అమ్మని మళ్ళీ ఇక్కడికి తీస్కొచ్చేస్తాను.
ఒకవేళ అమ్మ అక్కడ కొన్ని రోజులు నీతో ఉంటాను అంటే నేనొక్కడిని తిరిగి వస్తాను. అమ్మకి ఎలా అనిపిస్తే అలా చేద్దాం" అన్నాడు సంజయ్..
"అలాగేరా.." అన్నాడు అజయ్.
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే టిఫిన్ తెచ్చింది సీత.
కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురూ టిఫిన్ చేశారు..
సంజయ్ కాలేజీకి వెళ్ళిపోయాడు.అజయ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు.
కళ్ళు మూసుకుని,షవర్ కింద నుంచుని రాత్రి వచ్చిన కల గురించి, ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు..
ఇంతలో వెనక నుండి వచ్చి తనని గట్టిగా హత్తుకుని
" ఏయ్! దొరికేసావ్ మార్తాండా..ఈ కోలకళ్ళ కోయ పిల్ల కౌగిలికి చిక్కేసావ్.. " అంటూ కిల కిలా నవ్వుతున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసాడు అజయ్.
అక్కడ ఎవరూ లేరు. ఏంటిది.. ఇలా అనిపిస్తోంది రాత్రి నుంచి.. అనుకుంటూ ఎలాగో స్నానం చేసి, బయటకు వచ్చాడు అజయ్.
మనసంతా ఏదో తెలియని అలజడి..తనకి జరుగుతున్నది ఎవరికీ చెప్పుకోలేక, అలాగని దాని గురించి ఆలోచన మానలేక పిచ్చి పట్టేస్తోంది అతనికి.
తల్లికి చెప్పుకుందామంటే అసలే తను ట్రాన్స్ఫర్ విషయం గా టెన్షన్ పడిపోతోంది..
తమ్ముడా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఒకవేళ చెప్పినా, వాడు నమ్ముతాడో.. నమ్మడో..
ఇలా ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
***సశేషం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
Comments