'Nalugu Bommalu' - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 25/01/2024
'నాలుగు బొమ్మలు' తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కుటుంబరావు, అనసూయ దంపతులకు ప్రియ లేక లేక కలిగిన సంతానం. వివాహం అయిన పది సంవత్సరాల తర్వాత పుట్టినందున ఆ అమ్మాయిని వారు ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. తాను ఆడిందే ఆట, పాడిందే పాటగా పెరిగింది. బజార్లో ఏ వస్తువునైనా చూసి కావాలని పేచీ పెడితే క్షణాలలో ఆ వస్తువు ఆమె ఒడిలో వుండాల్సిందే ! ఇంటిలో పని చేసే నౌకర్లందరూ కూడా ప్రియ అంతే ఎంతో అభిమానంగా వుండే వారు. అష్టైశ్వర్యాలలో పుట్టి పెరుగుతున్నా ఆ అమ్మాయిలో గర్వం అనేది కించిత్ కూదా కనిపించేది కాదు. అందరితో ప్రేమగా, స్నేహంగా మెలుగుతుండేది. స్నేహితులు తన వస్తువులను అడిగితే కాదనకుండా ఇచ్చేసేది. ఆమే స్నేహానికి కులం, మతం, పేదా గొప్పా అన్న పట్టింపులు అసలు లేవు. అందరితో కల్మషం లేకుండా మెలుగుతూ,స్నేహం చేస్తూ ప్రియ మంచి అమ్మాయి అన్న పేరు తెచ్చుకుంది.
ప్రియలో అన్నీ మంచి గుణాలే వున్నా ఈ ఒక్క లక్షణమే కుటుంబరావు దంపతులకు నచ్చేది కాదు. ప్రేమించడానికి, స్నేహాలకు,త్యాగానికి ఒక హద్దు అంటూ వుండాలన్నదే వారి ధృఢ విశ్వాసం. ప్రియ హద్దులనేవి లేకుండా ఎలాంటి వారితోనైనా ఎంత సేపైనా భేజషాలు లేక మట్లాడడం, అడిగిన వారికి లేదనకుండా, ఆసలు ఆలోచించకుండా ఇచ్చెయ్యడం భవిష్యత్తులో ఎటువంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందో నని వారు అనుక్షణం భయపడుతుండేవారు. వయసుతో పాటు ప్రియలోని స్నేహ, దాన గుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే ఇది కొన్ని సార్లు చెడు ఫలితాలను ఇచ్చేది. అమాయకురాలైన ప్రియ మంచికి, చెడుకూ మధ్య తేడా ను గుర్తించగలిగేది కాదు. ఏవరు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేసేది. లేదు, కాదు అన్న పదాలు ఆమె డిక్షనరీలోనే లేవు. ఏదైనా ఇచ్చే ముందు ఫలనా వస్తువును ఫలనా వారికి ఇవ్వవచ్చునా లేదా అన్న ఆలోచన అసలు చేసేది కాదు. ఎదుట వారిలోని మాయ, కల్మషం, కుట్ర ఇత్యాది స్వభావాలను కనిపెట్టలేకపోయేది. ఫలితంగా ఎందరో ఆమె అమాయకత్వాన్ని పలు విధాలుగా కాష్ చేసుకుంటుండే వారు.
కొన్ని సందర్భాలలో దుకాణందార్లు ఆమె అమాయకత్వాన్ని గుర్తించి చిల్లర కూడా ఎగ గొట్టేసినా ఆమె ఏమీ అనేది కాదు. అంతకంటే అనలేకపోయేది అనడమే సమంజసంగా వుంటుంది. ఒకరోజు ప్రియా వాళ్ళ అమ్మ ప్రియను అదే ఊరిలో వుండే తమ దూరపు బంధువులకు కొన్ని బట్టలు, స్వీట్స్ ఇచ్చి రమ్మని పంపగా అరగంట లోనే ప్రియ ఉత్తి చేతులతో తిరిగొచ్చింది. ఏమయ్యిందని అడుగగా వీధి మొదట్లో ఒక బిచ్చగత్తె ఎదురుపడి కట్టుకోవడానికి బట్టలు లేవని అడగగా ప్రియ మొత్తం బట్టలను, స్వీట్స్ లను ఆమెకు ఇచ్చేసి వచ్చానని ఎంతో అమాయకం గా చెప్పింది. ఆ మాటలతో అనసూయకు పట్టరాని కోపం రాగా, ఆవేశంతో ఊగిపోతూ, ప్రియ రెండు చెంపలను ఎడా పెడా వాయించేసింది.
‘ఎప్పటికి బాగుపడతావే ముదనష్టపు దానా!’ ఆని ఇష్టం వచ్చినట్లు తిట్టి, ప్రియను గదిలోకి తోసేసి తలుపులేసేసింది. జరిగే తతంగాన్ని చూస్తున్న ప్రియ నాయనమ్మ వచ్చి అనసూయను వారించి, ‘ఆ పిల్లది చాలా అమాయకమైన స్వభావం. దానిని మనం మంచి మాటలతో మార్చాలి గాని ఇలా ఆవేశపడితే లాభం లేద’ని అనునయించి చెప్పింది. ప్రియలో మార్పు తప్పక తేవాలని అప్పటి కప్పుడే ప్రియ నాయనమ్మ నిర్ణయించేసుకుంది. ఆ రోజు రాత్రి ప్రియ నాయనమ్మ ప్రియ దగ్గరకు వచ్చి మూడు బొమ్మలను ఇచ్చి ఒక దారాన్ని ఒకొక్క బొమ్మ చెవి గుండా ఎక్కించమని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లే ప్రియ చెసింది. ఆశ్చర్యం కలిగే విధంగా మొదటి బొమ్మ చెవుల గుండా దారం సాఫీగా సాగి పోయింది.
”ప్రపంచంలో కొంతమంది ఏ మాటలనైనా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. మాటలను ఏ మాత్రం మనస్సుకు పట్టించుకోరు. అలాంటి మనష్యులకు ఈ మొదటి బొమ్మ తార్కాణం. ఇప్పుడు రెండో బొమ్మ చెవుల గుండా దారం పోనివ్వు” అంది నాయనమ్మ.
రెండొ బొమ్మ చెవి నుండి దారం దూర్చగా అది నోట్లో లుంగలు చుట్టుకొని పోయింది. “ఈ తరహా మనుష్యులు ఏం వింటారో దానంతటినీ బయటకు చెప్పెస్తారు. దేనిని మమసులో దాచుకోరు. ఇక మూడో బొమ్మను ట్రై చెయ్యి” అంది నాయనమ్మ. ఆ మాటలకు ప్రియలో కుతూహలం ఎక్కువయ్యింది. మూడో బొమ్మ చెవిలో నుండి వెళ్ళిన దారం బయటకు రాలేదు. “ఇటువంటి మనష్యులు చాలా వింటారు కాని కొంచెమే మాట్లాడుతారు. పై రెండు బొమ్మల లాగే ఈ లక్షణం కూడా మంచిది కాదు” చెప్పింది నాయనమ్మ.
‘అయితే ఎటువంటి ప్రవర్తన మంచిదనిపించుకుంటుంది నాయనమ్మా ?”ఆసక్తిగా అడిగింది ప్రియ. ఆమె ముఖ కవళికలు బట్టి ఆమెపై తన మంత్రం పని చెస్తోందని గ్రహించింది నాయనమ్మ. వెంటనే వెళ్ళి నాలుగో బొమ్మ తెచ్చి ప్రియకు ఇచ్చి “ దీనిని ప్రయత్నించు” అని చెప్పింది. ఎడమ చెవి గుండా ప్రియ దారం పోనివ్వగా అది రెండో చెవి నుండి బయటకు వచ్చింది.
“ఇంకొక సారి ప్రయత్నించు” చెప్పింది నాయనమ్మ. ఈసారి చెవిలో నుండి పంపగా దారం నోట్లోంచి బయటకు వచ్చింది. ముచ్చటగా మూడొసారి ట్రై చెయ్యగా చెవిలోంచి పంపించిన దారం అసలు బయటకు రాలేదు. ఫై మూడింటి కంటే ఇదే మంచి బొమ్మ. ఈ బొమ్మకు ఎప్పుడు వినాలో, ఏం వినాలో,ఎప్పుడు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, ఏది మాట్లాడకూదదో, ఎప్పుడు మౌనంగా వుండాలో తెలుసు. సందర్భాన్ని బట్టి దీని ప్రవర్తన మారుతుంటుంది. ఇటువంటి ప్రవర్తన కలిగినవారే ఉత్తములు. వారే జీవితంలో బాగా రాణిస్తారు” అని ప్రియను అక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకుంది నాయనమ్మ.
"నా పిచ్చి తల్లీ. మంచితనం వుండడం తప్పుకాదు కాని అది చేతకానితనంగా మారకూడదు. ఇతరులకు మనకు వున్న దాంట్లో కొంత ఇవ్వడం లో తప్పులేదు కాని అవసరం వున్నవారికే ఇవ్వాలి, లేకపోతే నీ దానం పనికి రాకుండా పోయే ప్రమాదం వుంది. అపాత్రదానం పాపమని కూడా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మోసం చెయ్యడం ఎంత తప్పో మోసగింపబడడం కూడా అంతే తప్పు.
ఎప్పుడు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో, ఎవరికి సహాయం చెయ్యాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఆపరిచితుల పట్ల తస్మాత్ జాగ్రత్త. మంచితనం చేతగానితనంగా మారకుండా చూసుకో. ఇదే నువ్వు ఈ నాలుగు బొమ్మ ల నుండి నేర్చుకోవలసింది” అని అనునయం గా చెప్పింది నాయనమ్మ.
ఆనాటి నుండి ప్రియ అవసరం వున్నప్పుదే మాట్లాడడం, అపరిచితులను దూరంగా వుంచడం, అవసరం వున్నా వారికే సహాయం చేయడం మొదలు పెట్టింది. అసలే మంచి పిల్ల అయిన ప్రియ తన మారిన ప్రవర్తనతో ఇంకా మంచి పిల్లగా పేరు తెచ్చుకుంది.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments