top of page

నమ్మక ద్రోహం

Writer's picture: Lakshmi Sarma BLakshmi Sarma B

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link


'Nammaka Droham' New Telugu Story


Written By Lakshmi Sarma B


రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ




తూరుపున తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలారావాలతో పచ్చటి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నలేలేత సూర్య కిరణాలు . ఆలయగోపురంలో గణగణ గంటల ధ్వనిలో రామచంద్రమూర్తికి మేలుకొలుపు రాగయుక్తంగా పాడుతున్నాడు సుందరయ్యగారు.

“ కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్ధూలం కర్తవ్యం దైవమాన్నికం, ”అంటూ మేలుకొలుపు పాడి, “ ఏమయ్యా రామయ్యా … లోకాలను నీ కనుసన్నలలో నడిపించే నిన్ను మేలుకొలుపు పాడి నిద్దురలేపడం మా తరమా, నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రపంచమే జలసమాధి అయిపోతుంది, అటువంటి నిన్ను లేపడం అనేది మాకు మేము నిర్ణయించుకున్న భక్తి మార్గం అంతేకదయ్యా, తండ్రి … ఈ జన్మకు ఇది చాలయ్యా, నీ సేవచేసుకునే భాగ్యం పొందిన నేను అదృష్టవంతుడిని, ” అంటూ భక్తితో రామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం చేసాడు సుందరయ్యగారు.

“ ఏంటి పంతులుగారు… హారతిచ్చి శఠగోపం పెట్టేది పెడతావా ? నువ్వు నీ రామయ్యతోనే ముచ్చట లేసుకుంటావా ఏంటి, ”? నవ్వుతూ అడిగాడు ఆ ఊరిలో మంచి పలుకుబడి ఉన్న సదానందం.


“ అయ్యో మీరా… ఎంతసేపయింది వచ్చి, ” అడిగాడు మోహమాటపడుతూ.

“ ఇప్పుడే వచ్చానులేవయ్యా …నువ్వు ఆర్తిగా రామయ్య వైపు చూస్తుంటే అలా అన్నాను, సరే కానీ… మీ పెద్దబ్బాయి ఏదైనా పనిలోకి వెళుతున్నాడా? నాకు తెలిసిన ఒకతను గుమాస్తా పనికి మనిషికావాలన్నాడు, జీతం ఓ వెయ్యిరూపాయలదాక ఇస్తా అన్నాడు, నాకు మీవాడు గుర్తుకువచ్చాడు, అది చెప్పిపోదామని ఇలా వచ్చాను ఏమంటావు పంతులు”.


ఆనందంతో ఒక్కపరుగులో బయటకు వస్తూ, “ ఎంతమంచి వార్త చెప్పారు, ఆ రామచంద్రుడే మీ మనసులో చేరినట్టున్నాడు, ఎంతమాట… మీరు చెప్పాలేగానీ మావాణ్ణి ఈ పూట మీ ఇంటికి తీసుకవస్తాను, ” చెప్పాడు సంతోషంతో .


“ అలాగే రండి… మిమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకుని వెళతాను, మీరు హారతి ఇస్తే నేను బయలుదేరుతాను, ” అన్నాడు సదానందం.


గబగబా హారతి పళ్ళెం తీసుకుని దేవుడికి హారతిచ్చి కొబ్బరిచిప్ప తీర్థం ఇచ్చి బయటవరకు వచ్చి ఆయనను సాగనంపాడు. “రామయ్యా ఎలాగైనా నా కొడుకుకు ఈ గుమాస్తా పని ఇప్పించి నా పరువు నిలుపు స్వామి, ” అని వేడుకున్నాడు.


సుందరయ్య శేషమ్మలకు ఉన్న సంతానం ఇద్దరు కొడుకులు. పెద్దవాడు కరుణాకర్ అతిగారాభం వల్ల చదువులో రాణించలేకపోయాడు. అతికష్టంమీద పదవతరగతి అయిందనిపించాడు. అప్పటినుండి బలాదూర్ తిరుగుతుంటే సుందరయ్య దంపతులకు తీరని మనోవేదన మొదలైంది. చిన్నవాడు సుధాకర్ బుద్దిమంతుడిలా చదువుకుని ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉన్నాడు.


ఉన్నంతలో ఉన్న కుటుంబమనే చెప్పొకోవచ్చు. వారసత్వంగా వస్తున్న దేవాలయం భూములమీద వచ్చే ఆదాయం. దేవాలయంలో పూజలోకి వచ్చే డబ్బులతో ఒకరి దగ్గర అప్పు చెయ్యకుండానే పైకి వచ్చాడు సుందరయ్యగారు. సుధాకర్ కు అమెరికా వెళ్ళాలనే కోరిక రోజు రోజుకు బలీయం కాసాగింది. తల్లి తండ్రి కూడా సుధాకర్ ను పంపడానికి నిర్ణయం చేసుకున్నారు.


కరుణాకర్ ఎలాగు మనల్ని వదిలి వెళ్ళడు. చిన్నోడయినా బాగుపడతానంటే వద్దనడం ఎందుకని ఒప్పుకున్నారు. వచ్చే సంవత్సరం వెళ్ళిపోతాడు సుధాకర్. కరుణాకర్ కు చిన్నదో పెద్దదో ఏదో ఒక సంపాదన మొదలైతే పెళ్ళి చేసి ఒక బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నారు.


“ కరుణా … ఒరేయ్ కరుణా… తొందరగా తయారవు మనం బయటకు వెళ్ళాలి, నీ కోసం మన సదానందం… గుమాస్తా ఉద్యోగం చూసిపెట్టాడట, నిన్ను తీసుకుని రమ్మన్నాడు పదపద త్వరగా తెములు, ” అంటూ తొందరచేసాడు ఇంటికివస్తూనే.


“ ఏమిటి నాన్న … నేను గుమాస్తాగా పని చెయ్యాలా, అంటే నాకు చదువుసంధ్యలు లేవని వెక్కిరిస్తున్నారా? మీకంతగా బరువుగా ఉంటే చెప్పు బయటకెళ్ళిపోతాను, ” కోపంగా అంటూ చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ ను విసిరికొట్టాడు.


తనకోపమే తన శత్రువు అన్న నానుడి బాగా తెలిసినవాడు సుందరయ్యగారు. అందుకే శాంతంగా కొడుకుకు నచ్చచెప్పాడు.” కరుణా… నిన్ను నువ్వు ఎందుకు చిన్న బుచ్చుకుంటావు, గుమాస్తా అనగానే బస్తాలు మోయడంలాంటివి అనుకున్నావా? నువ్వు పదవతరగతి పాసయ్యావు కదా! లెక్కలురాసే పని నీకు ఇస్తున్నారు, దానికితగ్గ జీతం కూడా ఇస్తారట, విషయం ఆసాంతం వినకముందే కోపం నశాళానికి అంటితే ఎలా? ఏదేమైనా నువ్వు నాలుగురాళ్ళు సంపాదించుకోగలితే ఎవరైనా పిల్లనివ్వడానికి ముందుకువస్తారు, ” అంటూ అనునయంగా చెప్పాడు.


తండ్రి చెప్పింది విన్న తరువాత తను చేసిన తప్పు తెలుసుకొని. విసిరేసిన ప్లేటు తీసి తలవంచుకుని లోపలకు వెళ్ళిపోయాడు.


“ ఏమిటో పెద్దాడికి రోజురోజుకు కోపం పెరిగిపోతుంది, వీడి మెడకొక గుదిబండలా ఓ పిల్లను అంటగడితే తెలుస్తుంది, మంచిచెడు బరువు బాధ్యతలు, ” భర్తతో గుసగుసగా అంది శేషమ్మ.


“ ఆ …ఆ “తాదూరసందులేదు మెడకో డోలు” అన్నట్టు, ముందు మనవాడికి నాలుగు పైసలు సంపాదన మొదలుపెట్టనీ.. అప్పుడాలోచిద్దాం, ” అన్నాడు పై కండువా వేసుకుంటూ.


కాళ్ళకు చెప్పులు వేసుకున్నాడు.

మారుమాటాడకుండా చకచకా తయారయి వచ్చాడు కరుణాకర్. ఎలాగైతేనేం సుందరయ్య నమ్ముకున్న రామయ్య దయవల్లా కరుణాకర్ గుమాస్తా ఉద్యోగంలో చేరి పదిమంది పరిచయంతో సంపాదనలో మునిగిపోయాడు. సుధాకర్ చదువుపూర్తి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. చిన్నవాడు ఉన్నప్పుడే పెద్దవాడికి పెళ్ళిచేద్దామంటే కుదరలేదు. అతను వెళ్ళగానే పెళ్ళి జరిగిపోయింది. పెద్దబరువు దిగిపోయినందుకు చాలా ఆనందంలో మునిగిపోయారు సుందరయ్య దంపతులు.


సుధాకర్ అక్కడ ఉద్యోగంలో చేరి డబ్బులు పంపించడం మొదలుపెట్టాడు. లొసుగులు తెలియని సుందరయ్య ఇంటిబాధ్యత మొత్తం కరుణాకర్ కు అప్పచెప్పాడు. పెత్తనం చేతికి వచ్చేసరికి మొగుడుపెళ్ళాల ఆలోచనలు మారిపోయాయి. అత్తమామలను ఈసడించుకోవడం మొదలుపెట్టింది సుశీల . సుధాకర్ దగ్గరనుండి వీలైనంతవరకు డబ్బులాగాలి పెద్ద బంగళా కట్టుకోవాలి . భూములు కొని పడెయ్యాలి. రేపు పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తాయి. దీపం ముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి . సుధాకర్ కు పెళ్ళి అయిందంటే మనకు నయాపైస పంపివ్వడు అందుకే ముందుజాగ్రత్తగా వసూళ్ళు చేసుకోవాలి అనుకుని, ఒక ఉపాయం ఆలోచించారు కరుణాకర్, అతని భార్య సుశీల.

“ నాన్న … శీనయ్యవాళ్ళు ఇల్లు అమ్ముతున్నారట, మనకు బొత్తిగా ఈ ఇల్లు సరిపోవడంలేదు అందుకని, ఆ ఇల్లు మనం తీసుకుందాము. రేపు రేపు పిల్లలు వచ్చాకయినా ఇబ్బందేకదా! మనకు అందుబాటులో ఉంది. ఏమంటారు, ” తండ్రి దగ్గర ప్రేమ ఒలకబోస్తూ అడిగాడు.

“ ఓరేయ్ కరుణా… ఇల్లు కొనాలంటే మాటలటరా, అంతడబ్బు మన దగ్గరలేదు ఏం పెట్టి కొందామంటావు? ” ఎదురు ప్రశ్న వేసాడు సుందరయ్య.

“ ఆదేంటి నాన్న అలా అంటారు! సుధాకర్ బాగానే సంపాదిస్తున్నాడు కదా! వాడు పంపుతాడు. కావాలంటే ఇల్లు వాడిపేరుమీదనే తీసుకుందాము, ఇన్నాళ్ళు దేవాలయం వాళ్ళిచ్చిన ఇంట్లోనే ఉన్నాము, తమ్ముడు అమెరికా నుండి వచ్చినప్పుడైనా మంచి ఇంట్లో ఉండకపోతే ఎలాగ నాన్న, ” అంటూ చెప్పడం ఆపాడు.


“ అవును మామయ్యా… నేనంటే సర్ధుకుపోయాను, మా మరిదిగారికి వచ్చే పెళ్ళాం ఈ ఇల్లు చూస్తే ఒక్కనిమిషం కూడా ఉండదు అంతే కదత్తయ్యా, ” అంది నునుగారంగా మాట్లాడుతూ.


“ అవునండి పిల్లలు చెప్పింది నిజమే, మన ఇల్లు చూసి సుధాకర్ కు పిల్లనివ్వడానికి కూడా ఎవరురారు, అందుకని సుధాకర్ తో ఓ మాటచెప్పి ఆ ఇల్లు తీసుకోండి, ” కొడుకు కోడలికి సపోర్టుగా మాట్లాడింది శేషమ్మ.


“ సరెసరె మీ అందరిది ఒకే మాటయినప్పుడు నేను మాత్రం ఎందుకు కాదంటాను, కరుణా … చిన్నోడితో మాట్లాడి ఆ ఇంటికి అడ్వాన్సు ఇచ్చిరా రేపు మంచిరోజుంది, ” అన్నాడు సుందరయ్య .


చూసావా మన మొదటి పన్నాగం ఫలించింది అన్నట్టుగా భార్యవైపు చూస్తూ మీసం మెలేసాడు కరుణాకర్. ముసిముసిగా నవ్వుకుంది సుశీల. అనుకున్నట్టుగానే సుధాకర్ తో మాట్లాడాడు. పేపర్లు పంపిస్తాను సంతకం పెట్టి పంపిస్తే చాలు . నీ పేరుమీద రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెప్పాడు.


అనుకున్నదానికంటే ఎక్కువే చెప్పాడు ఇంటిరేటు. అన్నంటే పంచప్రాణాలు సుధాకర్ కు . అందుకే ఆయన ఏదంటే దానికి సరే అంటాడు. అమ్మానాన్నలను మంచిగా చూసుకుంటున్నాడు . నేను దగ్గరలేను కాబట్టి అన్ని అన్నయ్యనే చూసుకుంటాడులే అనుకుంటాడు సుధాకర్.


“ ఓరేయ్ కరుణా … ఇల్లు చాలా బాగుందిరా ఏమో అనుకున్నాను గానీ నాకు నచ్చింది, ” అంది తల్లిమురిసిపోతూ గృహప్రవేశం రోజు.


“అవున్రా కరుణా… మంచిపని చేసావు, పాపం సుధాకర్ కూడా ఉండి ఉంటే బాగుండేది, ” అన్నాడు చిన్నకొడుకును గుర్తుచేసుకుంటూ.


రోజులు దొర్లిపోతున్నాయి. సుశీల ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సుధాకర్ వెళ్ళినప్పటినుండి ఇంతవరకు రానేలేదు. శేషమ్మకు సుందరయ్యలకు ఒకటేబెంగగా ఉంది. కొడుకును చూసి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావొస్తుంది. సుధాకర్ కు పెళ్ళి చేసి పంపిస్తే బాధ్యత అయిపోయేది. ఒక్కడు.. ఎలా ఉంటున్నాడో ఏం తింటున్నాడో దేశంగాని దేశంలో ఎన్ని కష్టాలుపడుతున్నాడోనని రేయింబవళ్ళు ఇదే ఆలోచనలు.

ఎప్పుడో ఒక ఉత్తరం ముక్కరాస్తాడు అంతే, వాడితో మాట్లాడుతానురా అని ఎప్పుడన్నా కరుణాకర్ ను అడిగితే, నేను పట్నంపోయినప్పుడే మాట్లాడుతాను. మన పల్లెటూరి నుండి మాట్లాడడానికి లేదు అని చెబుతాడు. వాళ్ళు పట్నం పోలేరు.. కొడుకుతోని మాట్లాడలేరు. కోడలు మాటలకు సగం చచ్చి బ్రతుకుతున్నారు.

” కరుణా… చిన్నోడికి మంచిపిల్లను చూడరా, వాడి పెళ్ళి చేసేద్దాం వాడు ఒక్కడే ఏం కష్టపడుతున్నాడో ఏమో, ” బాధపడుతూ చెప్పాడు సుందరయ్యా.

“ అబ్బా ఏంటి నాన్న నువ్వు… వాడికి ఏమంతవయసైందని వాడితోటివాళ్ళేవరికి ఇంతవరకు పెళ్ళిళ్లు కానేలేదు, వాడు చెప్పని అప్పుడు చూద్దాంలే, ” అన్నాడు కరుణాకర్.

“ ఆహా… మీ తమ్ముడు మీ మాట వింటాడు అన్నట్టే చెబుతున్నావు, అక్కడే ఎవరో తెల్లోళ్ళ పిల్లను పెళ్ళిచేసుకొని వస్తాడు చూస్తుండండి, ” దెప్పిపొడుస్తూ అంది సుశీల.

“ అమ్మా సుశీల… వాడు అలాంటి వాడు కాదమ్మా, చిన్నప్పటినుండి వాడివన్ని బుద్ధిమంతుడి లక్షణాలే, వీడిలాగా మాకు చెప్పకుండా ఏ పని చెయ్యడు, ” అంది శేషమ్మ చిన్న కొడుకును వెనకేసుకొస్తూ.


“ అంతేలేండి మనకెప్పుడు పెద్దకొడుకంటే ఇష్టముంది గనుక, చిన్న కొడుకు ఏది చేసిన సంతోషమే మీకు, పాపం ఈయన పిచ్చి కాకపోతే మా అమ్మా నాన్నను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని కష్టపడుతున్నాడు, మీ చిన్న కొడుకు పట్టించుకోకపోయినా పర్వాలేదు మీకు, ఇంతచేస్తున్న మీరు ఆయనను అర్ధంచేసుకుంటే కదా, ” కోపంగా చూస్తూ కఠినంగా అంది.


“ అన్నయ్యా … బాగున్నావా ? అమ్మా నాన్నలు ఎక్కడున్నారు, ” అడిగాడు సుధాకర్. చెప్పాపెట్టకుండ వచ్చిన తమ్ముణ్ణి చూసి నోటమాటరావడంలేదు కరుణాకర్ కు.


“ ఒరేయ్ అన్నయ్యా ఏమిట్రా అలా చూస్తున్నావు, ఓహో నేను ఇంత సడెన్ వచ్చానని నమ్మలేకపోతున్నావా? ఏం లేదురా మా ఆఫీసులో సెలవులు అడిగాను. ఇచ్చారు. వెంటనే టికెట్ కొనుక్కుని బయలుదేరి వచ్చాను, మీకు సడెన్ సర్ ఫ్రైజ్ ఇవ్వాలనుకుని నేను వస్తున్నట్టు చెప్పలేదు, ” అంటూ కరుణాకర్ ను బిగ్గరగా కౌగిలించుకుంటూ చెప్పాడు సంతోషంతో.


తమ్ముణ్ణి చూసిన ఆనందంకంటే, కంగారు ఎక్కువైంది కరుణాకర్ లో. తను అనుకున్నట్టుగా ఇంకా తను కొన్న భూములు తన పేరుమీద రిజిష్టరు చేయించుకోలేదు. ఈరోజు రేపంటూ కాలయాపన చేసాను. ఈ లోపల సుధాకర్ చెప్పాపెట్టకుండా కొంపలంటుకు పోయినట్టు ఊడిపడ్డాడు. ఇప్పుడెలా.. అనుకుంటూ, తమ్ముడికి సమాధానం ఇవ్వలేకపోయాడు. సుధాకర్ గొంతు వినపడగానే లోపలనుండి పరుగు పరుగున వచ్చారు సుధాకర్ తల్లి తండ్రులు. ఏం చేస్తున్నా వాళ్ళ ధ్యాసంతా చిన్నకొడుకు మీదనే ఉంటుంది.


“ నాన్నా … బాగున్నావా ? అమ్మా ఏంటి ఇలా అయిపోయావు, పూటకు గతిలేని వాళ్ళలా ఈ బట్టలేంటి? ఈ అవతారం ఏందమ్మా? అసలు ఏమైంది మీకు.. ఒంట్లో బాగలేదా, ” గబుక్కున తల్లిని హృదయానికి హత్తుకున్నాడు. ఎముకలా గూడులా ఉన్న తల్లిని చూసి తట్టుకోలేకపోయాడు సుధాకర్.


“ చిన్నోడా … ఇన్ని రోజులకు నీకు గుర్తుకు వచ్చామా? మేము చచ్చిపోయేలోగా నిన్ను చూస్తామో లేదో అనుకున్నాము, ఆ రామయ్య మా మీద కనికరం చూపినట్టున్నాడు, ” అంటూ రెండు చేతులెత్తి శ్రీ రామచంద్రమూర్తికి దండంపెట్టుకున్నాడు సుందరయ్య.


“ నాన్నా … అలా అనకండి, ఇన్నాళ్ళు రాకుండా ఉండడం నాది తప్పే, కాకపోతే ఎప్పటికప్పుడు డబ్బులకు ఇబ్బంది అవడం వల్లా రాలేకపోయాను. నన్ను క్షమించండి నాన్నా, అయినా అన్నయ్య మిమ్మల్ని మంచిగానే చూసుకుంటున్నానన్నాడు, మీరు చాలా బాగున్నారని చెప్పాడు.

ఏరా అన్నయ్యా … ఇదేనా నువ్వు అమ్మానాన్నలను చూసుకుంటున్నది? ఏం జరిగిందిరా.. చెప్పు నాకు, ” ఆవేశంతో ఊగిపోతూ కరుణాకర్ కాలర్ పట్టుకున్నాడు.


“ అయ్యో అయ్యో … చంపేస్తున్నాడు రండి రండి, ” లబోదిబో మొత్తుకుంది సుశీల.

“ చిన్నోడా వాడిని వదలరా వాణ్ణి ఏం చెయ్యకు, ” సుందరయ్య వచ్చి విడిపించాడు. నిర్లక్ష్యంగా చూసాడు కరుణాకర్ సుధాకర్ వైపు.


“ అవును … నా ఒక్కడిదే బాధ్యతనా వాళ్ళను చూడడం, నువ్వేమో అక్కడ హాయిగా ఉన్నావు. బాధ్యత లేకుండా? నేను మాత్రం ఎంతగనం చూస్తాననుకున్నావు, వీళ్ళకు వచ్చే జబ్బులకు ఎక్కడి డబ్బులు సరిపోలేదు, అక్కడికి మీ వదిన మంచిది కాబట్టి ఓపికతో వీళ్ళను చూసుకుంది, అంతగా ప్రేమ ఉన్నావాడివైతే ఇన్నాళ్ళు రాకుండా ఎందుకున్నావు” పొగరుగా తల ఎగిరేస్తూ అడిగాడు.


“ ఏంటి నువ్వు అంటున్నది … డబ్బులకు ఇబ్బంది పడ్డావా? అంటే నేను నెలనెలా పంపిన డబ్బులన్నీ ఏమయ్యాయి? నువ్వు చెప్పావు కదా! అమ్మ వాళ్ళకు అన్ని సదుపాయాలు కలిపించానన్నావు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారన్నావు కదా! ఇదేనా, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు పంపాను, ఎందుకు ఏమిటి అని నేనెప్పుడు అడగలేదు, అన్నీ నాన్న చూసుకుంటున్నారు అన్నావు. ఇళ్ళన్నావు, జాగలన్నావు ఇవన్నీ కొనడం కోసం నాన్న డబ్బులు పంపమన్నారు అన్నావు, మీరు అడిగినన్నీ డబ్బులు పంపించడం వల్లనే కదా! నేను రాలేకపోయాను, చెప్పు ఆ డబ్బులన్ని ఏం చేసావు, ” గట్టిగా అరుస్తూ అడిగాడు సుధాకర్.


“ నీకు చెప్పల్సిన అవసరం నాకులేదు, నువ్వు నాకే డబ్బులు పంపించానని ఋజువులున్నాయా? అవన్నీ నాన్న పేరుమీద పంపించావు. ఆయనేం చేసాడో నాకేం తెలుసు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీకు ఈ ఇంట్లో అధికారం లేదనే చెప్పవలసి వస్తుంది, మర్యాదగా నాలుగురోజుండి వెళ్ళిపోవడం మంచిది నీకు గాని వాళ్ళకు గానీ, ” వేలు బయటకు చూపిస్తూ చెప్పాడు కరుణాకర్.


“ ఓరేయ్ అన్యాయం చేస్తే పురుగుల పడతావు, నాకే డబ్బుల గురించి తెలియదు చిన్నోడా… వీడు నిన్ను నిలువునా ముంచాడురా, “సొమ్మోకడిది సోకొకడిది” అన్నట్టు నువ్వు పంపిన డబ్బులన్ని వీడు కాజేసాడు, నిన్ను పీడించి వసూలు చేసిన డబ్బులతో భూములు కొన్నాడు, ఇళ్ళు కొన్నాడు. అన్ని తనపేరు మీదనే రాయించుకున్నాడు, నిన్ను బికారిని చెయ్యాలనుకున్నాడురా, ” గుండెను పిండేస్తున్న బాధనంతా వెళ్ళగక్కాడు సుందరయ్య.


“ విన్నావుగా ఆ పెద్దాయన చెప్పిందంతా, నువ్వేం చేసుకుంటావో ఏంటో నాకు తెలియదు, వీళ్ళను మాత్రం భరించకోవడం నా వల్లకాదు, నువ్వు వచ్చావు కాబట్టి నీకు అప్పచెబుతున్నా, కొన్నాళ్ళాగి ఆనాథాశ్రమంలో వేద్దామనుకున్నాను, నాకాబాధ లేకుండా చేసావు సంతోషం, ” అన్నాడు.


“ ఛీ … నువ్వసలు మనిషివేనా, నన్నింత మోసం చేస్తావా? నిన్ను, ” అంటూ కొట్టడానికి ఉరికాడు సుధాకర్.


“ చిన్నోడా… వద్దురా నువ్వు తొందరపడకు, పద మనం వెళ్ళిపోదాం మన రామయ్య దగ్గరకు, మనకు ఆయనే ఆశ్రయం ఇస్తాడు కలో గంజో తాగుతూ మా జీవితాలను అక్కడే కడతేర్చుకుంటాము, ” అన్నాడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.


“ పదండి నాన్నా… వెళ్దాం, అమ్మా రా అమ్మా, ” తల్లిని భుజాలు పట్టుకుని నడిపించుకుంటూ బయటకు వస్తూ, ‘’ నిన్ను ఊరికే వదిలిపెట్టను కోర్టుకీడుస్తాను, గొప్పోడి వయ్యానని మురిసిపోతున్నావు చూడు..


నిన్ను పదిమందిలో తలెత్తుకోలేకుండా చేస్తాను, అమ్మా నాన్నలను బాధపెట్టావు.. అనుభవిస్తావు!” అంటూ వెళ్లాడు .


“ ఫోరా పో… నువ్వేం చెయ్యలేవు నన్ను , ఈ ఊర్లో అందరు నామాటే వింటారు, నువ్వు చెప్పే సొల్లు ముచ్చట్లు వినడానికి ఎవరు సిద్ధంగాలేరు,” అంటూనే వాళ్ళు వెళ్ళగానే దభేలుమని తలుపులు మూసేసాడు.


“ చిన్నోడా … నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మాకు దిక్కెవరురా? మా ముసలి ప్రాణాలు పోయేంతవరకైనా నువ్వు మాతో ఉండకూడదా, కొడుకును దగ్గరకు తీసుకుని అడిగింది శేషమ్మ . పాత ఇంటికి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిలోకి కావాలసిన సామానంతా తెచ్చుకున్నారు తండ్రి కొడుకులు కలిసి.

“ అమ్మా … మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేనెక్కడికి వెళ్ళను, నేను రెండునెలలు సెలవులు పెట్టుకొని వచ్చాను, అంతేకాదు! మిమ్మల్ని నాతోపాటుగా తీసుకవెళ్ళాలని వీసా పేపర్లు కూడా తెచ్చాను, మీరేం బాధపడకండి. మీరు నాతోపాటే ఉంటారు,” చెప్పాడు. తల్లిని హృదయానికి హత్తుకుంటూ.


“ ఏంటి చిన్నోడా నువ్వనేది, మేము నీతోపాటుగా వస్తున్నామా? ఎంతమంచి మాట చెప్పావురా, ఇదంతా ఆ రామయ్య చలువనే,” అంటూనే “ ఏమయ్యా రామయ్యా… ఇన్నాళ్ళకు నా మీద దయకలిగిందా? నా బాధలకు విముక్తి కలిగిస్తున్నావా, అదిసరే గానీ… నేనెక్కడున్నా నీ సేవ మాత్రం మరిచిపోనియ్యకు సుమా, నా జీవితం ఉన్నంతవరకు నీ నామ స్మరణలోనే ఉంటాను రామభద్రా,” సుందరయ్య రామచంద్రమూర్తికి షాష్టంగా దండం పెట్టుకున్నాడు. తండ్రిని అంత ఆనందంగా చూస్తూంటే , సుధాకర్ మనసు తృప్తితో నిండిపోయింది.

**** **** **** ***** **** **** *****

॥॥ శుభం ॥॥

B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


139 views1 comment

1 Comment


Sharada Rasagna • 3 hours ago

Nice

Like
bottom of page