కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Nammakam' New Telugu Story
Written By Jidigunta Srinivasa Rao
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
నమ్మకం అనే ఈ చక్కటి కథను జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు. చదివి వినిపిస్తున్నది మల్లవరపు సీతారాం కుమార్.
కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు ఆ ఇంట్లో ఎలా ఉండాలో, ఆమెతో అత్తమామలు ఎలా ఉండాలో తెలియజేసే కథ ఇది. ఇక కథలోకి వెడదాం.
రజిత కాపురానికి వచ్చి వారం రోజులు అయ్యింది. భర్త శంకర్ కి సెలవు లేదని ఆఫీస్ కి వెళ్లిపోతున్నాడు. యింట్లో మామగారు, అత్తగారు, తను వుంటారు. మామగారు భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్ర పోతారు. అత్తగారికి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తి టీవీ తో సరిపోతుంది.
తనతో మాట్లాడే వాళ్ళు లేకపోవడం తో, పుట్టింటి నుంచి తెచ్చుకున్న నవలలు చదువుకుంటూ టైం గడుపుతోంది రజిత.
ఒకరోజు ఉదయం, మామగారు, అత్తగారు క్యాలెండరు చూస్తో, ‘ఈ రోజు మంచిది, ఈ రోజు చేయిద్దాం’ అనుకోవడం విన్న రజిత, ‘పోనిలే.. పెళ్ళిలో పెద్దగా నగలు పెట్టక పోయినా, యిప్పుడు చేయిద్దామనుకుంటున్నారు’ అని సంతోషం పడింది.
టిఫిన్ తినేసిన రజిత భర్త శంకర్, ‘రాజీ.. నేను ఆఫీస్ కి వెళ్తున్నా’ అని చెప్పి, అక్కడే కుర్చీలో కూర్చొని వున్న తండ్రికి చెప్పక పోతే బాగుండదని, ‘వెళ్ళొస్తా డాడీ’ అని వెళ్ళిపోయాడు.
‘అదేమిటి, వీళ్ళు ఏదో నగలు చేయిద్దాం అని అనుకుంటూవుంటే, యియన ఆఫీస్ కి వెళ్ళాడు, బహుశా సాయంత్రం తీసుకొని వెళ్తారేమో’అని సర్దుకుంది రజిత.
11 గంటలయ్యింది, అత్తగారు రజిత గది లోకి తొంగిచూస్తూ, “రజితా! ఒకసారి యిలా రా అమ్మా” అని పిలిచింది.
అత్తగారి పిలుపు విని ‘వుందిలే మంచికాలం’ అనుకుంటూ బయటకు వచ్చి, “ఏమిటి అత్తయ్యా!” అంది వినయం గా..
“ఈ రోజు మంచిది. వంటగది లోకి వెళ్లి, స్టవ్ కి కొద్దిగా పసుపు, కుంకం పెట్టి, దణ్ణం పెట్టుకుని వంట మొదలుపెట్టమ్మా. ఈ రోజు నుంచి వంటగది నీది, ఏమి వండాలో మీ మామయ్యగారు చెపుతారు. నువ్వు వండితే, నేను నాలుగు మెతుకులు తిని కృష్ణా రామా అనుకుంటూ టీవీ సీరియల్స్ చూసుకుంటా” అంది.
అత్తగారి మాటలకి కొయ్యబారి పోయింది రజిత. ‘ఇందుకా మంచిరోజు చూసింది’ అని మనసులో అనుకుని, “సరే అత్తయ్యా” అంటూ వంటగది లోకి నడిచింది, కావాలనే ఎడమ కాలు ముందుగా పెడుతూ.
అత్తగారు చెప్పినట్టు స్టవ్ శుభ్రపరిచి, మామగారిని అడిగింది ఈ రోజు ఏమి వండాలని.
“మొదటి రోజు కదమ్మా నువ్వు వంట చేయడం! ఎక్కువ శ్రమ పడకుండా బీరకాయ పొడిపప్పు, బెండకాయ వేపుడు చేస్తే చాలు. మీ అత్తయ్య మాత్రం రసం లేందే అన్నం తినదు. ఆవిడకి టొమోటో వేసి రసం పెట్టు చాలు. సాయంత్రం నీ మొగుడికి యిష్టమైనవి చేసిపెడుదువు గాని” అన్నాడు పేపర్ లోనుంచి తలఎత్తకుండా.
“సరే మామయ్య గారూ” అంటూ వంటగదిలోకి వెళ్లి బీరకాయ చెక్కు తీస్తోవుండగా, రజిత వాళ్ల అమ్మ ఫోన్ చేసింది. ఆవిడ రోజూ మూడు పూటలా ఫోన్ చేసి కూతురి అత్త యింట్లో ఏమి జరుగుతోందో తెలుసుకుంటుంది. అంతే కాదు, కొన్ని సలహాలు కూడా యిచ్చి కూతురి మనసు పాడు చేస్తోవుంటుంది.
సరే.. బీరకాయ పీచు తీసే టైములో రజిత అమ్మగారు ఫోన్ చేసి, ‘ఏమి చేస్తున్నావే’ అని అడగటం, రజిత ఉదయం నుంచి జరిగింది చెప్పి, ‘ప్రస్తుతం వంట చేస్తున్నా’ అంది.
“అయ్యో! బంగారం లాగా చూసుకున్నాము. నువ్వు వంట గదిలో మగ్గటం ఏంటే విచిత్రం, మీ అత్తగారు లేరా?” అంది.
“వున్నారమ్మా! ఈ రోజు మంచిది అని, యిహ నుంచి వంట నన్ను చెయ్యమన్నారు. ఉద్యోగం చేయక్కరలేదు అంటే నువ్వు, నాన్న యిద్దరూ ‘సంతోషం, ఎంత మంచి వాళ్ళు నీ అత్తగారు వాళ్ళు.. కోడలు కష్టపడటం యిష్టం లేదు వాళ్ళకి’ అన్నారు. యిప్పుడు తెలిసిందా, నా ఉద్యోగం వంట చేసి అందరికి సేవలు చేయడం అని! ఫోన్ పెట్టేసేయ్.. మా అత్తగారు వస్తున్నారు” అని ఫోన్ కట్ చేసింది రజిత.
వంట గది లోనికి వచ్చిన అత్తగారు, “అయ్యో! బీరకాయకి చెక్కు పై పైన తీయాలి. కండంతా పోతే మిగిలేది ఏముంటుంది? వుండు.. ఒక కాయకి చెక్కు తీసి చూపిస్తా” అంటూ, “ఏమిటో.. ఈ కాలం పిల్లలకి ఏమీ రాదు” అనేసింది.
“అబ్బో! పెద్ద.. ఈవిడగారు కాపురానికి వచ్చిన మొదటి రోజు నుంచి నవకాయ పిండివంటలు చేసినట్టు.. యిప్పుడు కోడలు కి ఏమి రాదనటం.. చూడు బంగారు తల్లీ! మీ అత్తగారిని మా పెళ్ళైన కొత్తలో పొట్లకాయ కూర వండమంటే, పొట్లకాయ ని వడ్డాణం మడిచి నట్టు మడిచి, కాయ కాయ వండేసింది. తినటానికి భయమేసింది” అన్నారు రజిత మామగారు నవ్వుతూ.
“బీరకాయ పొట్టు ఎక్కువ తీసింది అని అనే బదులు, ఆ పొట్టుతో పచ్చడి చేయటం నేర్పించు. పనికిరాని వస్తువు ఏమీ లేదు ప్రపంచం లో” అన్నారు మామగారు కొసమెరుపుగా.
“బాబోయ్, యిప్పుడు పచ్చడి నేర్చుకోవాలని మామగారి ఉద్దేశ్యం అనుకుంటా” అనుకుంది.
“అవును, మీరు తప్ప అన్నీ పనికి వచ్చేవే. తిండి మీద యావ తగ్గించుకుని, కొద్దిగా ఆ పిల్లోస్ కి కవర్లు ఎక్కించండి. మళ్ళీ బీరకాయ పచ్చడి యిప్పుడు చేయలేము” అంది అత్తగారు మామగారిని దులిపేస్తో.
‘పోనీలే.. బతికించింది. పచ్చడి చేయమనకుండా” అనుకుంది రజిత..
వంట చేసే టైములో రజిత వాళ్ళ అమ్మ చెప్పినట్టు గా తనకి, తన భర్త కి కావలిసిన కూర, పప్పు విడిగా తీసుకొని, మిగిలిన వాటిల్లో రెండేసి చెంచాలు ఉప్పు ఎక్కువ వేసింది.
ఒంటిగంట అవగానే మామగారు, అత్తగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, టేబుల్ మీద వున్న పదార్దాలని కంచంలో వడ్డించుకుని, కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు.
ఉప్పు కాషాయం! భార్య ఏదో అనబోతోవుంటే వెంటనే అందుకుని, “చూసావా.. వంటరాదు అనుకున్నావు. ఎంత రుచిగా చేసిందో” అన్నాడు రజిత మామగారు.
భర్త ఉద్దేశ్యం గ్రహించి, “అవునండి, ఎంత పొందికగా వండిందో వంట. నేను అయితే పది గిన్నెలు మాడిస్తే గాని వంట అయ్యేది కాదు.. కోడలు చక్కగా రెండు గిన్నెలు తో వండి, వేడి వేడిగా వుండటానికి హాట్ బాక్స్ లో పెట్టింది.
ఎంతైనా మనవాడు అదృష్టవంతుడు, మంచి భార్య దొరికింది” అంటున్న అత్తగారిని చూసి తెల్లబోయింది రజిత.
కొంపదీసి నేను విడిగా వుంచుకున్న కూరా పప్పు వీళ్ళకి పెట్టలేదు కదా అనుకుని, వంటగది వైపు చూస్తే విడిగా వుంచిన గిన్నెలు అక్కడే వున్నాయి.
అంటే ఉప్పు ఎక్కువగా ఉన్నా, ‘నేను బాధ పడతానని, బాగున్నాయి అన్నారన్నమాట..’ అనుకుని మామగారి వంక చూడగానే, తన తండ్రి అన్నం తింటున్నట్లే అనిపించి, సిగ్గుతో మెల్లిగా వెళ్లి మామగారి పక్కన నుంచుని, “నిజంగా నా వంట బాగుందా మామయ్యా” అంది కళ్ళనీళ్లతో.
“బంగారు తల్లీ, ఎందుకు బాధ పడుతున్నావు? ఈ రోజేగా మొదలు పెట్టావు, రెండు రోజులైతే నువ్వే బాగా చేస్తావు. ఏమీ పర్వాలేదు. నేను రోజు తినే అన్నం పెరుగుతో తినేసా, కడుపు నిండిపోయింది. సాయంత్రం మీ అత్తయ్య టిఫిన్ చేస్తుంది. నువ్వు మొహం కడుక్కుని రా, ఈలోపున మీ అత్తయ్య నీకోసం రెండు బంగాళాదుంపలు వేయించి రెడీ చేస్తుంది” అని అంటున్న మామగారి చేయి పట్టుకుని భోరున ఏడుస్తూ, “క్షమించండి మామయ్యా! మా అమ్మ మాటలు విని, యిహ రోజూ వంట నేనే చేయాలి అనే కోపంతో కూర, పప్పులో ఉప్పు ఎక్కువ వేసాను” అన్న రజిత తో
“పిచ్చి పిల్ల, మీ అత్తగారు ఏదో నీ వంట రుచి చూడాలి అనే కానీ, తను వంటిల్లు ప్రాణం పోయినా వదులుతుందా యింకోకళ్లకి? పర్లేదు, మెల్లిగా అత్తయ్య దగ్గర నేర్చుకో” అన్నాడు మామగారు.
“మామయ్యగారూ! నాకు వంట చేయడం బాగానే వచ్చు. రాత్రికి మీకు ఇష్టమైన పూరి, కూర వండుతాను చూడండి” అంది కళ్ళు తుడుచుకుంటూ రజిత.
“వెరీ గుడ్, అలాగే చెయ్యి. నీతో ఒక మాట చెపుతాను వింటావా” అన్నారు మామగారు.
“చూడు తల్లీ, నేను రిటైర్ అయ్యి ఆరు సంవత్సరాలు అయ్యింది. నా పెన్షన్ గురించి గాని, డిపాజిట్స్ గురించి గాని మీ ఆయనికి, మీ అత్తయ్య కి తెలియవు.
అలాగే మా అబ్బాయి జీతం ఎంత వస్తోంది అని నేను అడగలేదు, వాడు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నాకు ఏ అవసరం అయినా, ఎంత డబ్బు అయినా మా అబ్బాయి ఖర్చు పెడతాడు అని నా నమ్మకం. అలాగే నా దగ్గర ఎంత డబ్బు వున్నా అది తనదే అని వాడి నమ్మకం. కోడలిని బాగా చూసుకుంటే, కొడుకు ఆనందంగా వుంటాడని మేము నమ్మాలి. అలాగే అత్తమామలను బాగా చూసుకుంటే మొగుడికి సంతోషం అని ప్రతీ కోడలూ నమ్మాలి. అంతా ఒకరి మీద ఒకరు నమ్మకం గా వుంటే జీవితం లో ఎటువంటి బాధలు వుండవు.
ప్రతీ కోడలు తన ఆనందం పుట్టింటి వారికి చెప్పుకోవాలి, తనకి ఏదైనా బాధ కలిగితే అత్తగారికి చెప్పుకోవాలి. అప్పుడు ప్రతీ ఇల్లు ఆనందమయం అవుతుంది” అని అన్న మామగారి చెయ్యి ఆప్యాయంగా పట్టుకొని ‘అవును’ అంది రజిత.
“అయితే నా వంటిల్లు నాదేగా” అన్న అత్తగారిని చూసి గట్టిగా నవ్వుకున్నారు.
శుభo
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
నేటి యువతరానికి తెలియ చేయవల్సిన మంచి విషయాలు చెప్తూ కథ చాలా బాగా వ్రాసారు సార్. నాకు ఇందులో బాగా నచ్చినది మీరు చివరగా మామగారితో చెప్పించిన మాటలు. "ప్రతీ కోడలు తన ఆనందం పుట్టింటి వారికి చెప్పుకోవాలి, తనకి ఏదైనా బాధ కలిగితే అత్తగారికి చెప్పుకోవాలి" అని అన్నవి.
కానీ ఇలాంటి నడవడిక నిజ జీవితంలో ఆనందాన్ని కలిగించేది ఒకరికొకరు నమ్మకంగా వున్నప్పుడు మాత్రమే. అలా లేనప్పుడు నిజాయితీగా, సంస్కారవంతంగా వున్నవారు చాలా నలిగిపోతారనేది నా అనుభవం.
mrvs murthy • 3 hours ago
చాలా బాగుంది కథ. చదవడం కూడా బాగుంది సార్. కథలో మంచి సందేశం ఉంది.