నాన్న రాసిన ప్రేమ కవిత
- Vemparala Durga Prasad
- Feb 22
- 6 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #NannaRasinaPremaKavitha, #నాన్నరాసినప్రేమకవిత, #TeluguKathalu, #తెలుగుకథలు

Nanna Rasina Prema Kavitha - New Telugu Story Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 22/02/2025
నాన్న రాసిన ప్రేమ కవిత - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
ఆ రోజు సుధీర్ మానస దంపతుల షష్ఠి పూర్తి వేడుక జరిగింది. బంధువుల భోజనాలు అయ్యేక, అందర్నీ సత్కరించి పంపించేసరికి సాయంత్రం ౩. ౩౦ అయింది. సాయంత్రం ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాడు సుధీర్. ఆఫీస్ వాళ్ళని, లోకల్ గా వుండే ఫ్రెండ్స్ ని డిన్నర్ కి పిలిచేడు. హోటల్ లో పార్టీ హాల్ బుక్ చేసేడు. .
"బాబూ రాహుల్ సాయంత్రం భాస్కర్ అంకుల్ హైదరాబాద్ నుండి వస్తున్నారు. " స్టేషన్ కి వెళ్లి రిసీవ్ చేసుకోవాలి”. అన్నాడు సుధీర్ కొడుకుని ఉద్దేశించి.
భాస్కర్ చిన్న నాటి స్నేహితుడు. ఉదయానికి రమ్మన్నా, 2 రోజులు కంటే సెలవు కష్టం అని సాయంత్రం డిన్నర్ కి వస్తాను అన్నాడు. భాస్కర్, సుధీర్ లు కలిసి చదువుకున్నారు. ఇరువురు కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది. సుధీర్ భాస్కర్ లు స్టేట్ బ్యాంకు లో ఆఫీసర్లు గా పని చేసేరు. సుధీర్ 10 రోజుల క్రిత్రం రిటైర్ అయ్యేడు. భాస్కర్ రిటైర్మెంట్ ఈ నెలాఖరులో.
***
"రాహుల్! భాస్కర్ అంకుల్ కి మూడవ బెడ్ రూమ్ సర్ది వుంచు" అని అమ్మ చెప్పడం తో ఆ గది సర్దు తున్నాడు రాహుల్. ఆ గది లో సుధీర్ అప్పుడప్పుడు కూర్చుని బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. సుధీర్ కి బొమ్మలు గీయడం హాబీ.
మంచం పక్కన టేబుల్ మీద నాన్న డైరీ కనపడింది రాహుల్ కి. సాధారణం గా సుధీర్ డైరీ బయట ఉంచడు. ఆరోజు ఏదో పని వత్తిడి లో మరిచి పోయినట్లు వున్నాడు. డైరీ లోంచి కొద్దిగా బయటకి వచ్చిన ఒక కాగితం రాహుల్ ని ఆకర్షించింది. అది బాగా పాత కాగితం లా రంగు మారి వుంది.
నాన్న డైరీ తీయకూడదని మనసు చెపుతున్నా, ఉత్సాహం ఆపుకోలేక, కనపడిన ఆ కాగితం దగ్గర తెరిచాడు. ఆ కాగితం లో చిన్న కవిత.. ఇలావుంది:
“కలువ రేకులవంటి మీ కన్నులలో బింబాన్ని కావాలి
సంపెంగ లాంటి మీ ముక్కుకు ముక్కెర నై పోవాలి
అందమైన మీ ఆధరాల మెరుపు నాదవ్వాలి
సెలయేటి నవ్వుల జలపాతం లో నేను తడవాలి
అల్లరి చేసే మీ ముంగురులతో ఆడుకోవాలి
మొత్తంగా ఈ జన్మకి మీరే కావాలి”
.మీ ప్రేమకై ఎదురు చూస్తూ.. సుధీర్
త్రిప్పి చూడండి -->
రాహుల్ కి ఆశ్చర్యం వేసింది. ‘కవిత రాసింది నాన్న స్వదస్తూరీ తో. పరిచయం లేని స్త్రీ కి అయితే తప్ప బహు వచనం వాడరు. పైగా ‘త్రిప్పి చూడండి..’ అని రాసే డేమిటి? ఇది ఎవరి కోసం రాసేడబ్బా?..’ అని అనుకుంటూ, ఆ కాగితం తిప్పి చూద్దామనుకునే లోపల, తల్లి పిలుపు తో ఉలిక్కి పడ్డాడు.
గుమ్మంలోకి వసున్న తల్లిని చూసి, డైరీ మూసేసి ఏమీ ఎరగనట్లు పక్కకి జరిగేడు.
గదిలోకి వచ్చిన మానస " ఏరా 7 గంటలకి ట్రైన్ వస్తుంది. ఇప్పుడు 6. 30 అయింది, ఇంకా నువ్వు బయలు దేరలేదు? " అంది.
బైలుదేరు తున్నానమ్మా..” అంటూ బయటికి కదిలాడు. కానీ అతని మనసు నిండా ఆ డైరీ లో ప్రేమ కవిత మెదలాడుతోంది.
అతని ఆలోచనలు తెలియని మానస, "నేను, నాన్న హోటల్ కి వెళ్తున్నాము. అక్కడ ఏర్పాట్లు పూర్తి అయి ఉంటాయి. వచ్చే వాళ్ళని మేము చూసుకుంటాము. నువ్వు వెళ్లి భాస్కర్ అంకుల్ ని ఇంటికి తీసుకుని వచ్చి, ఆయన తెమిలేక, హోటల్ కి తీసుకుని వచ్చెయ్యి " అని గబా గబా చెప్పేసింది.
ఇంతలో ఆ గదిలోకి వచ్చిన సుధీర్, టేబుల్ మీద డైరీ ని చేతి లోకి తీసుకుని వెళ్లిపోవడం జరిగింది.
స్టేషన్ కి వెళ్లిన రాహుల్, భాస్కర్ ని రిసీవ్ చేసుకున్నాడు. కారులో కూర్చున్నాక, కుశల ప్రశ్నలు అయ్యేక, భాస్కర్ ని అడగ కుండా ఉండలేక పోయాడు.
"అంకుల్ మా నాన్న గారిది ఆరంజ్డ్ మారేజు అని చెప్పేరు. అది నిజమేనా. అమ్మ నాన్నలది ప్రేమ వివాహమా, లేక అరేంజ్డ్ మ్యారేజా?" చెప్పండి అంకుల్. " అన్నాడు.
“మీ నాన్న మా వూళ్ళో పెళ్లి చూపులు చూసేడు. ఆ విధంగా అది అరేంజ్డ్ మ్యారేజే.. ” అని అన్నాడు భాస్కర్. ఒక్క క్షణం ఆగి, “మీ అమ్మ, నాన్న ఎప్పుడూ డిస్కస్ చెయ్యలేదా?” అన్నాడు చిరు నవ్వుతో.
“మా అమ్మ, నాన్న ల సంగతి మీకు తెలుసు కదా. అడిగితే గానీ ఎక్కువ మాట్లాడరు. ఎప్పుడూ గంభీరంగా వుంటారు. నాతొ సరదాగా గడుపుతారు కానీ, కొన్ని విషయాల లో ఎక్కువ డిస్కస్ చేయరు. ఎప్పుడూ నా చిన్న తనం లో నా అల్లరి, లేదా నా చదువు, ప్రోగ్రెస్.. ఇలాగే ఉంటుంది వాళ్ళ సంభాషణ.
నాకు నాన్న దాగ్గర చనువు తక్కువ. అమ్మ ఏదీ డిస్కస్ చేయదు. నాకు చెప్పిన దాని బట్టి వాళ్ళు పెళ్ళిచూపుల్లో ఒకరిని ఒకరు ఇష్టపడినట్లు తెలుసు." అన్నాడు.
“మరి, ఈ రోజు సడన్ గా ఈ అనుమానం ఎందుకు వచ్చింది నీకు" అని అన్నాడు భాస్కర్ ఒకింత ఆరా తీస్తూ.
“ఇవాళ అనుకోకుండా మా నాన్న రాసిన కవిత చూసేను.. అని అతను అంటూంటే, అతని మాట ముగించే లోపలే ఇదిగో నా ఫోన్ లో వున్న ఫోటో చూడు, ఇదే కవిత కదా”.. అన్నాడు భాస్కర్.
అతని ఫోన్ కేసి చూసేడు రాహుల్. అదే కవిత. తాను చూసిన కాగితానికి ఫొటోస్టాట్ కాపీ కి ఫోటో తీసింది అది.
“నువ్వు వెనుక వైపు చూడలేదా?” అన్నాడు భాస్కర్.
“లేదు అంకుల్.. బావుండదని అమ్మని కూడా అడగ లేదు” అన్నాడు.
“తినబోతూ రుచి ఎందుకు.. ఇంకో గంటలో ఫంక్షన్ లో స్టేజి మీద ఆ రహస్యం చెపుతాను.
నువ్వు చెప్పిన దాని బట్టి, మీ అమ్మ, నాన్న ఎప్పుడూ నీతో ఒక విషయం చెప్పలేదని అర్ధం అవుతోంది. నాకు స్టేజి మీద మంచి ఇంటరెస్టింగ్ టాపిక్ దొరికింది”.. అన్నాడు.
ఇంతలో ఇల్లు వచ్చింది. భాస్కర్ తెమిలిన తర్వాత ఇద్దరూ కలిసి హోటల్ కి వెళ్ళేరు.
అప్పటికి అక్కడ ఫంక్షన్ జరుగుతోంది. వచ్చిన అతిధులందరికీ తన ప్రాణ స్నేహితుడిని పరిచయం చేసేడు సుధీర్.
ఫంక్షన్ చివర లో, ఆఖరిగా భాస్కర్ మైక్ తీసుకున్నాడు.
“నా మిత్రుడి షష్టిపూర్తి సందర్బంగా వచ్చిన అందరు అతిథులకు నా నమస్కారములు తెలియ చేస్తున్నాను.
మీ అందరికీ తెలుసు ఈ దంపతులు చూడ ముచ్చట గా వుంటారు. వీళ్ళు యెంత గంభీరంగా వుంటారో మీకు తెలుసు. సొంత కొడుకు రాహుల్ కి కూడా చెప్పని వీళ్ళ వివాహం వెనుక వున్న కథ మీకు చెప్పబోతున్నాను. మా తండ్రి గారు, వాళ్ళ తల్లితండ్రులు ఇవాళ లేరు. వాళ్లకి తప్ప ఇంకెవరికీ తెలియని ఆ కథ ఇది”.. అని ఉపోద్ఘాతం గా అన్నాడు.
అందరి మొహాల్లో ఆశ్చర్యం, ఉత్కంఠ. రాహుల్ కి సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందా? అనే ఫీలింగ్ కలుగుతోంది.
సుధీర్, మానస ఒకళ్ళ కేసి ఒకళ్ళు చూసుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.
“ఇప్పటికి 32వత్సరాలకి పూర్వం, మేము ఇద్దరం ఒకేసారి వుద్యోగం లో జాయిన్ అయ్యేము. పైగా ఒకే బ్యాంకు” అంటూ వాళ్ళ కథ ఇలా వివరించాడు :
“విజయవాడ లో సుధీర్ తన తల్లి తండ్రుల తో భవాని పురం లో వుండే వాడు. అక్కడ స్టేట్ బ్యాంకు లో అతని వుద్యోగం. భాస్కర్ కి చిన్నప్పుడే తల్లి పోయింది. తండ్రి, తను గాంధీ నగర్ లో వుండే వారు. లబ్బీపేట స్టేటుబ్యాంక్ లో అతను పని చేసేవాడు. సుధీర్ చిన్నప్పటి నుండీ మంచి చిత్రకారుడు. అతను బొమ్మ వేస్తే, ఫోటో తీసినట్లే ఉండేది.
ఒక రోజు విజయవాడ నుండి ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళడానికి రైలు ఎక్కిన సుధీర్ కిటికీ పక్క సింగల్ సీట్ లో కూర్చుని వున్నాడు.
కొద్దిగా దూరంగా ఒక తల్లి, కూతురు కూర్చుని ఉండడం చూసేడు. ఆ అమ్మాయిని చూడగానే సుధీర్ ఆకర్షితుడయిపోయాడు. ఆమె, చుట్టూ జనాల్ని పట్టించుకోకుండా, తన తల్లి తో మాట్లాడుతూ వుంది. అప్పుడప్పుడు, అటువైపు వున్న కిటికీ లోంచి బయటకి చూస్తోంది. గాలికి ఆమె ముంగురులు రేగుతున్నాయి. మాట్లాడుతున్నప్పుడు ఆమె జుంకాలు ఊగుతున్నాయి. ఆ దృశ్యం అతన్ని కట్టి పడేసింది. వెంటనే తన బాగ్ లో ఎప్పుడూ ఉంచుకునే చిన్న నోట్ బుక్, పెన్సిల్ తీసుకున్నాడు. ఆమెని తదేకం గా చూస్తూ ఆమె చిత్రం గీసేడు. ఆమె చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. అంత బాగా ఆమెని ఆవిష్కరించాడు. అప్పుడే నిశ్చయించుకున్నాడు. పెళ్లి అంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అని.
ఆమె వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలియదు. పైగా, ఆమె పక్కన తల్లి కూడా ప్రయాణిస్తోంది. ఆమె తో ఎలా పరిచయం చేసుకోవాలా అని తర్జన భర్జన పడుతున్నాడు సుధీర్.
ఇంతలో రాజమండ్రి స్టేషన్ లో ట్రైన్ ఆగింది. కిటికీ దగ్గరకి టీ అమ్మేవాడు వస్తే, తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చి, తిరిగేసరికి, ఆ తల్లి కూతురు సీట్లో లేరు. దూరంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో రైలు కదిలి పోవడం తో చేసేది ఏమీ లేక నిరాశగా కూర్చున్నాడు.
4 రోజులు తర్వాత ఫ్రెండ్ భాస్కర్ ని కలిసినప్పుడు, ఆ విషయం అంతా చెప్పి బాధ పడ్డాడు. "ఆ అమ్మాయి వాళ్ళది రాజమండ్రి అనుకుంటా.. కానీ ఎక్కడ వుంటారో తెలియదు. అంటూ" తాను గీచిన బొమ్మ చూపించాడు. అప్పటికే, ఆ అమ్మాయి ఊహల్లో బతుకుతున్న సుధీర్, ఆ బొమ్మ వేసిన కాగితం వెనుక ఒక కవిత కూడా రాసుకున్నాడు.. ఎంతో ఆశా భావం తో.
ఆ అమ్మాయి బొమ్మ చూసిన భాస్కర్కి మిత్రుడికి ఆ అందమయిన అమ్మాయి దొరికితే బాగుండును అనిపించింది ”.
అక్కడ వరకూ చెప్పిన భాస్కర్ ఒక్క సారి ఆగి, రాహుల్ కేసి చూసేడు. రాహుల్ కి అర్ధం అయింది. తాను చూసిన కవిత వెనుక, చూసి ఉంటే అమ్మ బొమ్మ కనపడి ఉండేది. అర్థం అయినట్లు తల పంకించాడు.
“కానీ, మళ్ళీ నాన్న అమ్మని ఎలా కలిసేడు”.. ఆ ఆలోచన అతనిలో మొదలయింది. చాలా మందికి ఆ అందమయిన అమ్మాయి మానస అని అర్ధం అయింది. కానీ తర్వాత ఏమైంది అనే ఉత్కంఠ.
ఇంతలో, హాలులో గంభీర వాతావరణాన్ని చీలుస్తూ, మళ్ళీ కథ ఇలా చెప్పేడు భాస్కర్:
“ ఒక ఆరు నెలలు గడిచేయి. అప్ప్పుడు ఒక విచిత్రం జరిగింది.
భాస్కర్ తండ్రి గోపాల రావు గారు కొడుకు కోసం ఒక సంబంధం తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఫోటో చూసిన భాస్కర్ ఆశ్చర్య పోయాడు. కారణం, ఆమె ఎవరో కాదు.. సుధీర్ బొమ్మ గీసిన అమ్మాయి.
ఆ రోజు సాయంత్రం స్వర్ణ హోటల్ లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసేరు.
వెంటనే సుధీర్ కి విషయం చేర వేయడం, బాస్కర్ తన తండ్రికి సుధీర్ ప్రేమ విషయం చెప్పడం జరిగింది.
పెళ్లి చూపుల కి సుధీర్ ని తనతో తీసుకుని వచ్చేరు, పెద్ద మనసున్న గోపాలరావు గారు. పెళ్లి చూపుల లో గోపాల రావు గారు సుధీర్ ని తన కన్న కొడుకుగా పరిచయం చేసేరు పెళ్లి వాళ్ళకి.
పెళ్లి వారికీ, అమ్మాయికి తెగ నచ్చేసాడు సుధీర్. జంట చూడ ముచ్చట గా ఉంటుంది అని ఇరు పక్షాల వాళ్ళు అనుకున్నారు.
వివాహం నిశ్చయం అనుకున్నాక, గోపాల రావు గారు అసలు విషయం పెళ్లి కూతురు తండ్రికి వివరించారు. ఆయన ముందు అగ్గి మీద గుగ్గిలం అయ్యేడు. ఇది మోసం అన్నాడు.
కానీ, తన కూతురికి సుధీర్ బాగా నచ్చడం తో మెత్త బడ్డాడు.
"సరే, మరి ఆ అబ్బాయి తల్లి తండ్రులు ఎవరు, వాళ్ళు మీతో సమానమయిన కుటుంబ మేనా" అని అడిగేరు.
అదే వూళ్ళో వుంటున్నారని, సుధీర్ తండ్రి శ్యామల రావు గారిని, తల్లి నీలవేణి గారిని పిలిపించి మాట్లాడించారు గోపాల రావు గారు.
అప్పటికే, విషయం తన తల్లితండ్రులకి వివరించాడు సుధీర్. ముందు వాళ్ళు.. " నువ్వు ఇలా చేయకుండా వుండాల్సింది " అని కొడుకుని మందలించినా, అమ్మాయిని చూసేక కరిగి పోయారు. అమ్మాయి కుందనపు బొమ్మ లా ఉండడం, తమ కొడుకు చాలా ఇష్టపడడం తో వాళ్ళు కూడా కాదన లేక పోయారు.
ఇరు పక్షాలకు నచ్చడం తో, అలా ఆ నాడు వీళ్ళ ఇద్దరి పెళ్లి కుదిరింది. " అని ఆ ఏక ముఖ ప్రేమ కథ ని ముగించాడు బాస్కర్.
సభికులందరూ, లేచి చప్పట్లు కొట్టేరు. అందరి మొహాల్లో ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది.
"నాన్న రాసిన ప్రేమ కవిత వెనుక ఇంత కథ ఉందా" అనుకున్నాడు రాహుల్.
సుధీర్, మానస లు, స్నేహితుడిగా భాస్కర్ మరియు అతని తండ్రి గారి పెద్ద మనసు కి అందరి ముందూ మరో సారి కృతజ్ఞతలు చెప్పారు.
*** సమాప్తం***
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
కథ బాగుంది
ఈ కథ తండ్రి సుధీర్ రాసిన ప్రేమ కవిత ద్వారా అతని గత ప్రేమకథను కుమారుడు రాహుల్ తెలుసుకోవడం చుట్టూ తిరుగుతుంది. షష్టిపూర్తి వేడుకలో అనుకోకుండా ఒక పాత డైరీ బయటపడటం, అందులో ఉన్న కవితల ద్వారా తండ్రి మనసును అర్థం చేసుకోవడం కథలో ప్రధాన మలుపు. భాస్కర్ పాత్ర ద్వారా సుధీర్ ప్రేమకథ తెలియడం ఆసక్తికరంగా ఉంది. కథనం సహజంగా, భావోద్వేగపూరితంగా సాగుతుంది. పాత తరం ప్రేమ, త్యాగం, స్నేహం, కుటుంబ బంధాలను హృదయాన్ని హత్తుకునేలా చెప్పింది. కళాత్మకత, కవిత్వం కథకు ప్రాణంగా మారాయి. అసలు ప్రేమ ఎప్పుడూ మరిచిపోలేనిది అనే సందేశం అందిస్తుంది. ఒక తరం ప్రేమ కథ మరొక తరానికి అర్థమయ్యే విధంగా చక్కగా రాసిన హృదయపూర్వక కథ ఇది.