నాన్నమాట
- Pandranki Subramani
- 20 hours ago
- 3 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #Nannamata, #నాన్నమాట, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nannamata - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 19/04/2025
నాన్నమాట - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అప్పటి రోజులు తలచుకుంటుంటే డెబ్బై ఏళ్ళ దామోదరానికి విచిత్రంగా తోస్తుంటుంది. ముఖాన నవ్వు తెరలు తాముగా విప్పారి దోబూచు లాడుతుంటాయి. అతడలా తనలో తను నవ్వుకోవడానికి అలవోకగా మనసు విచ్చుకోవడానికి కారణం, ఇప్ప టి లోకం పోకడ గురించి తరచి చూస్తున్నందునే!
తను వయసు ముమ్మరంలో ఉన్నప్పుడు, తండ్రి అప్పగించిన వ్యాపారాన్ని దక్ష దీక్షతలతో నడుపుతున్నప్పుడు వ్యాపారంలో వచ్చే నేలసరి రాబడినుండి పదిశాతం వాటాను విడిగా ఉంచేవాడు, కష్టాలలో ఉన్న బీదసాదలకు పకడ్బందీగా సహాయం చేయడానికి- రాబోయే కాలంలో కాస్తంత పుణ్యఫలాన్ని పొదవుకోవడానికి. అలా చేస్తానని అవసాన దశలో ఉన్న తన తండ్రి రామచంద్రంగారికి అతడు మాటిచ్చాడు. చేతిలో చేయి పెట్టి మాటివ్వడం కాదు- ఆ మాట ప్రకారం నడుచుకున్నాడు.
ఐతే ఒకటి- సహాయాన్ని ఏనో తానో అన్నట్టు చేసేవాడు కాడు. తన వద్ద సహాయం పొందిన ప్రతి వ్యక్తి నుండీ మాట తీసుకునే వాడు; తన లాగే వాళ్ళు కూడా తోటివారికి చేతనైనంత మేర సహాయం చేయాలని. అందరూ బసవన్నల్లా తలలాడించే వారే గాని, తన చూపుకి ఇంతవరకూ యెవరూ ఆనిన భోగట్టా లేదు. ఇన్నేళ్ళ తరవాత ఒక్కడంటే ఒక్కడు ఇచ్చిన మాట ప్రకారం కష్టాల్లో ఉన్న తోటి వారికి చేయూత నిచ్చిన నాథుడు కనిపించలేదు.
అటువంటి నాథుడు ఇకపై న కనిపించడు కూడాను- ఎందుకంటే తనికిప్పటికే ఏడు పదులు దాటాయి- చిత్రగుప్తుడి పట్టీలోకి చేరిపోయుంటాడు. అంచేతనే అతడి ముఖాన అన్ని నవ్వుల పువ్వులు- చాలామందికి తీసుకోవడమే తెలుసు గాని తిరిగివ్వడమన్నది తెలియదుగా! బ్రహ్మ దేవుడికి సహితం అంతుపట్టని మానవ స్వభావంలోని వైచిత్రి అదేగా!
ఐతే రోజులు అలా సాగిపోతున్నప్పుడు అతడి ముఖాన చిందులు వేసే నవ్వులు చెరిగిపోయే సంఘటన చోటు చేసుకుంది. ఎలాగంటే- సనత్ నగరు ప్రాంత బస్తీలో ఎవరో యువకుడు రోహిణీకార్తె పొడసూపిన వెంటనే ప్రొద్దుట నుండి సాయంత్రం ఐదు వరకూ రెండు విడతలుగా చలివేంద్ర పందిరి నడుపుతున్నాడని అతడి చెవికి సోకింది.
అదీను ఎలాగని? మొదటి మూడు గంటల పాటు చల్లనీళ్ళు-- రెండవ విడతగా మిగతా మూడు గంటల పాటు చల్లని మజ్జిగానూ-- అబ్బో పెద్ద చెయ్యే! కాని విషయం అక్కడితో ఆగలేదు. అలా వేసవి యెండల్లో జనుల దాహం తీరుస్తూన్న ఆ యువకుడు జీతగాడో వ్యాపారస్థుడో కాడట. ఒక సాధారణ ఆటోరిక్షా చోదకుడట. అంతే కాక అతడి వెనుక ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారట. వాళ్ళ తోడ్పాటుతో అవన్నీ నడుపుతున్నాడట. డెబ్బై యేండ్ల దామోదరానికి ఆసక్తి కలిగింది ఆ ఆటోరిక్షా కుర్రాణ్ణి చూడాలని. అనుకున్నదే తడవుగా ఊతకర్ర సాయంతో రైల్వే వంతెన దాటి ఫథేనగరు చేరుకున్నాడు.
అక్కడ చిన్నా పెద్దా తేడా లేకుండా చలవేంద్రియ పందిరి ముందు వరస కట్టి నిల్చున్నారు. ఒకబ్బాయి తన ఇద్దరు చెల్లె ళ్ల సహాయంతో అందరికీ మజ్జిగ పోస్తున్నాడు. పోస్తున్నవాడల్లా కాసేపు తరవాత ఉన్నపళాన తలెత్తి చూసాడు ఎడంగా నిల్చు న్న దామోదరం వేపు. చూసిన తోడనే చేతిలోని మగ్గుని అక్కడిక్కడే విడిచి పరుగున వచ్చి నమస్కరిస్తూ దామోదరం రెండు కాళ్ళనూ తాకుతూ అన్నాడు- “ఇదంతా మీ చేతి చలవే అయ్యగారూ! నేనీనాడు నడుపుతూన్న ఆటోరిక్షా ఆనాడు మీరు చేసిన సహాయం వల్లనే వచ్చింది”
దామోదరం అనంగీకారంగా తల్ల అడ్డంగా ఆడించాడు. “నువ్వెందుకో నన్ను బులిపించడానికి అబధ్ధం చెప్తున్నావు. చూస్తుంటే నీ వయసు ఇరవై దాటుండదు. నేను వ్యాపారం మాని, దానితో బాటు నగదు సహాయం చేయడం మాని పది సంవత్సరాలవుతుంది. అంటే- నీకు పదేళ్ళు ఉన్నప్పుడు ఆటోరిక్షా సంపాదించడంలో నగదు సహాయం చేసానంటావా! ”
“అబ్బే—నేనలా అనడం లేదు బాబుగారూ! నిజానికి మీరు ఆటోరిక్షా కొనడంలో సహాయం చేసినది నాకు కాదు. మా బాబుకి. మీరప్పుడు మొదటి విడత డిపోజిట్ కట్టి మా నాన్న తరపున పూచీకత్తు కూడా ఇచ్చి మా బాబుకి బండిని స్వంతం అయేటట్టు చేసారు. కాని మా బాటు మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. మీకిచ్చిన మాట ప్రకారం ఎప్పుడూ పరులకు వీస మెత్తు సహాయం కూడా చేయలేకపోయారు.
అలా జరగడానికి కారణం ఆయన చనిపోయే ముందు చెప్పారు. ఫైనాన్సు వాళ్ళ నుండి తీసుకున్న లోను సొమ్ము వడ్డీతో సహా తీర్చడంతోనే ఆయన కాలమంతా సరిపోయిందట. కావున ఆయన మీకిచ్చిన మాట ప్రకారం వస్తూన్న గిరాకీ రాబడిలో పది శాతం అట్టే పెట్టి, దానితో చుట్టు ప్రక్కల వారికి ఉపయోగ పడేలా చూడలేకపోయా రు. ఇది చెప్పి పలుసార్లు బాధ పడ్డారు మా బాబు.
నేనిప్పుడు అదే చేస్తున్నాను. ఇకపైన కూడా చేస్తూనే ఉంటానని మా తండ్రి గారి తరపున మీకు మాటిస్తున్నాను. నన్ను దీవించండయ్యా!”
దామోదరం ఏమీ అనలేదు. ఆటోరిక్షా అబ్బాయిని దీవించి అత డందించిన మజ్జిగ తాగి వెను తిరిగాడు. ఆశ్చర్యం- ఇప్పుడతని కనురెప్పల మధ్య సన్నటి తుంపర వంటి తడి--
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments