నాన్నెప్పుడొస్తాడు?
- Parnandi Gopala Krishna
- Aug 14, 2023
- 3 min read
'

'Nanneppudosthadu?' - New Telugu Story Written By P. Gopalakrishna
'నాన్నెప్పుడొస్తాడు?' తెలుగు కథ
రచన: P. గోపాలకృష్ణ
కథా పఠనం: A. సురేఖ
"అమ్మా, నాన్నెప్పుడొస్తాడు?” విచారంగా ఇంట్లోకి అడుగుపెడుతూ అడిగాడు నాలుగేళ్ళ రిషి.
"అలా అనకూడదు నాన్నా! నాన్న నీకంటే పెద్దవారు కదా! ‘ఎప్పుడొస్తారు?’ అనాలి” చెప్పింది వాళ్ళమ్మ.
"అబ్బా, చెప్పమ్మా" అడిగాడు వాడు.
"నాన్న డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది గంటలవుతుంది. అప్పటికి నువ్వు పడుకుంటావు నాన్నా" చెప్పారు ఆవిడ.
రిషి తండ్రికోసం ఎదురుచూస్తూ వీధిగుమ్మంలో కూర్చున్నాడు.
"బయట చలిగా ఉంది" అంటూ వాళ్ళమ్మ లోపలికి తీసుకెళ్లింది. రిషి విచారంగా ఒక మూల కూర్చున్నాడు.
"ఏమైంది నాన్నా, అలా ఉన్నావు" అడిగారు ఆవిడ.
"నా పన్ను కదిలిపోయి ఊగుతోంది, భయమవుతోంది" చెప్పాడు రిషి.
"అయ్యో అవునా, మరేమీ పరవాలేదులే ఏమీ అవ్వదు సరేనా, రా బువ్వ పెడతాను" అంది వాళ్ళమ్మ.
తల్లి పెడుతున్న అన్నం ముద్దలు నమలకుండా మింగుతూ కబుర్లలో పడ్డాడు వాడు. "ఇవాళ బళ్ళో రాజుగారి కథ చెప్పారమ్మా" అంటూ ఉత్సాహంగా బళ్ళో చెప్పిన కథ చెప్పసాగాడు.
అంతలో వాళ్ళక్క ట్యూషన్ నుండి వచ్చి రిషి తో కబుర్లలో పడింది. మాటల మధ్యలో "నా పన్ను కదులుతోంది, నాకు భయమవుతోంది" అంటూ వాళ్ళక్కతో చెప్పాడు రిషి.
తమ్ముడు అలా చెప్పేసరికి వాళ్ళక్క నవ్వింది. "ఒరేయ్ తమ్ముడూ ఆ పన్ను ఊడిపోతుందిరా" అంది.
అక్క ఆ మాట చెప్పడంతో రిషి లో ఆందోళన అధికమైంది. "అమ్మా, నిజంగా పన్ను ఉడిపోతుందా?" వాళ్ళమ్మని అడగడం మొదలెట్టాడు.
ఉదయం నుండి ఆఫీస్ లో పని చేసి అలసిపోయిన ఆమెకు రిషి పదేపదే అడుగుతూ ఉంటే విసుగొస్తోంది. "ఆ పన్ను చూపించు" అంటూ అడిగారు ఆవిడ.
రిషి నోరు తెరిచి చూపిస్తే ఆవిడ దాన్ని చూసి, "ఇది ఇప్పుడు ఊడేది కాదులే" అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది.
డాడీ కోసం ఎదురుచూసిన రిషి, అలాగే నిద్రపోయాడు.
రెండురోజులు పాటూ ఆటపాటల్లో గడిపిన రిషికి మళ్ళీ పన్ను నొప్పి మొదలైంది. "అమ్మా, అబ్బా" అని మూలుగుతూ ఇంటికి చేరాడు స్కూల్ నుండి.
"ఒరేయ్ తమ్ముడూ ఏమయిందిరా?" అడిగింది రిషి వాళ్ళక్క ఉష.
"పన్ను నొప్పెడుతోంది" దాదాపుగా ఏడుపు మొహం పెట్టాడు.
"ఏదీ నన్ను చూడనీ?" అడిగింది ఆ అమ్మాయి.
"అమ్మా, తమ్ముడి పన్ను కదులుతోందే" అరుస్తూ లోపలికి పరిగెత్తింది. అక్క అలా అరుస్తూ పరిగెత్తేసరికి బిక్కచచ్చిపోయాడు రిషి.
గుమ్మంలో కూర్చొని రెండు కాళ్ళమధ్య తల పెట్టుకొని,మొహాన్ని చేత్తో కప్పుకొని భోరున ఏడవడం మొదలెట్టాడు.
"ఏమైంది నాన్నా?” అడిగింది వాళ్ళమ్మ.
“నా పన్ను కదులుతోంది. ఊడిపోతుందేమో భయమవుతోంది" వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు.
వాడు అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మకి కూడా నవ్వాగింది కాదు. "ఏమీ కాదు లే. అది ఊడిపోతే ఇంకోటి కొత్తది వస్తుందిగా" చెప్పింది వాళ్ళమ్మ.
"అలా వస్తుందా? మళ్ళీ అన్నీ తినొచ్చా" ఏడుస్తూనే అడుగుతూ ఉంటే వాడి అమాయకత్వానికి వస్తున్న నవ్వుని ఆపుకొని, “అన్నీ తినొచ్చు. మళ్ళీ ఆ పన్ను వస్తుంది" అని చెప్పారు ఆవిడ.
"అమ్మా, నాన్నెప్పుడొస్తాడు" ఏడుస్తూనే అడిగాడు వాడు.
"నాన్న డ్యూటీ కి వెళ్ళారుగా. వచ్చేసరికి లేట్ అవుతుందిట. నువ్వు బువ్వ తినేసి పడుకో" అన్నం కలుపుతూ చెప్పింది అమ్మ.
రిషి మంచానికి బీరువాకి మధ్య ఖాళీలో కూర్చొని, "నా పన్ను కదులుతోంది అని నాన్నకి చెప్పినా పట్టించుకోలేదు. నాకేమో భయమవుతోంది" అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకోసాగాడు.
"మరేమీ పరవాలేదు నాన్నా, నేను మీ నాన్నకి చెప్తాను కదా! నువ్వు బువ్వ తిను" అంటూ అమ్మ పదేపదే బతిమాలితే కానీ రిషి అమ్మ పెట్టిన అన్నం కూడా ముట్టలేదు.
"ఇవాళ ఎలాగైనా నాన్నొచ్చేదాకా మేలుకొని ఉంటానమ్మా" చెప్పాడు రిషి. ‘సరే అలాగే’ అంటూ కిచెన్ సద్దుకుంటూ ఉండిపోయింది వాళ్ళమ్మ. బీరువాకి మంచానికి మధ్యలో కూర్చోడం బాగా అలవాటు రిషికి. అక్కతో మాట్లాడుతూ కూర్చున్నాడు రిషి. అప్పటికే నిద్ర టైం కావడం కునుకుపాటు పడుతూ అక్కడ కూర్చున్నాడు.
ఎప్పుడు మంచం కి కొట్టుకున్నాడో నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయేలా గావు కేకలు పెడుతూ ఏడుపు మొదలెట్టాడు. కిచెన్ పని చూసుకుంటున్న వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పన్ను ఊడిపోయి కిందపడిపోయింది.
"నీ పన్ను ఊడిపోయింది నాన్నా" అంటూ వాళ్ళమ్మ చెప్పేసరికి ఊడిపోయిన పన్నుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు .
"ఆ పన్నుని జాగ్రత్తగా దాచుకో, నీకు గుర్తుగా ఉంటుంది" నవ్వుతూ చెప్పారు అప్పుడే ఇంట్లోకి వచ్చిన రిషి వాళ్ళనాన్న.
***
P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న రెండవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
𝓚𝓡'𝓼 కథామాలిక
•9 hours ago
🎉