'Narakam Nundi Swarganiki' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 22/02/2024
'నరకం నుండి స్వర్గానికి' తెలుగు కథ
రచన: L. V. జయ
బెంగుళూరు లో వున్న తన ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి బై చెప్పి చెన్నై బయలుదేరింది జాగృతి. చెన్నై లో తన క్లాస్ మేట్ రజిని పేయింగ్ గెస్ట్ గా వున్న చోటకి వెళ్ళింది.
జాగృతిని చూసి చాలా ఆనందపడింది రజిని. "ఎలా వున్నావ్? ఎన్నాళ్ళు అయ్యింది మనం కలిసి. యూఎస్ నుండి ఎప్పుడు వచ్చావ్ ? యూఎస్ ఎలా వుందిలో లైఫ్ ? బెంగుళూరు లో కదా చేస్తున్నావ్? ఇప్పుడు చెన్నై ఏంటి?" గలా గలా మాట్లాడుతుంది రజిని .
"ఆగు. ఆగు. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తే ఎలా?" అని అన్నిటికి సమాధాం చెప్పింది జాగృతి. "వన్ మంత్ అయ్యింది యూఎస్ నుండి వచ్చి. చాలా బాగుంది.బెంగుళూరు వచ్చాక జాబ్ కి అప్లై చేస్తే ఇక్కడ వచ్చింది. మంచి పొజిషన్, శాలరీ ఎక్కువ. అందుకని ఇక్కడకి వచ్చేసాను." అంది జాగృతి.
"నువ్వేమో ఇప్పుడే యూఎస్ నుండి వచ్చావ్. నేను ఇంకొన్నాళ్లలో యూఎస్ వెళ్తున్నాను " అంది రజిని.
"ఓహ్. వావ్ . కంగ్రాట్స్. అక్కడ జాబ్ వచ్చిందా? " అంది రజిని హత్తుకుంటూ జాగృతి.
"నాకు పెళ్లి సెటిల్ అయ్యింది. పెళ్లి తరువాత వెళ్ళిపోతున్నాను." అంది రజిని.
మాట్లాడుతూ రూమ్ వరకు వచ్చారు ఇద్దరూ. రూమ్ చాలా చిన్నగా వుంది. అందులో నాలుగు మంచాలు. మంచాల మధ్యలో నడిచే దారి తప్ప వేరే జాగా లేదు. విండోస్ లేవు ఆ రూమ్ కి. డోర్ లోంచి వచ్చే వెంటిలేషన్ తప్ప వేరేగా గాలి వచ్చే అవకాశం కూడా లేదు. ఖాళీగా వున్న బెడ్ చూపించి "ఇది నీ ప్లేస్. బెడ్ కింద నీ సామాన్లు పెట్టుకో " అంది రజిని. బెడ్ మీద మ్యాట్రెస్ లేదు. బెడ్ కింద సూట్ కేస్, బకెట్, మగ్,కంచం, గ్లాస్, మాసిపోయిన బట్టలు పెట్టుకున్నారు. ఎక్కడ కబోర్డ్స్ లేవు.
తరువాత డిన్నర్ కి తీసుకుని వెళ్ళింది. అక్కడ చాలా మంది అమ్మాయిలు వున్నారు. అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకుని వచ్చి, మెట్ల మీద కూర్చుకుని తిన్నారు. ఎక్కడ డైనింగ్ టేబుల్ కనపడలేదు జాగృతి కి. తిన్నాక అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు లైన్ లో నించుని కడుక్కుని ఎవరి రూమ్ కి వాళ్ళు తీసుకుని వెళ్లారు. కాసేపు కాలేజీ విషయాలు మాట్లాడుకుని పడుకున్నారు. జాగృతికి నిద్ర పట్టలేదు.
మర్నాడు ఉదయాన్నే 3 కి జాగృతి దగ్గరకి వచ్చి రజని "లే ఇంక" అని చెప్పింది.
"అప్పుడే ఏంటి. నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడే కొంచెం పడుతోంది" అంది జాగృతి.
"ఇంకొంచెం లేట్ అయితే బాత్రూమ్స్ ముందు పెద్ద లైన్ ఉంటుంది. నీకు ఈ రోజు ఫస్ట్ డే కదా ఆఫీస్ కి. స్నానం చేసేసి పడుకో కావాలంటే" అంటూ బలవంతంగా లేపింది రజిని.
'ఇది పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లాగ లేదు. హాస్టల్ లాగా వుంది. ఇంక ఇక్కడే, ఇలాగే బతకాలా?' అని బాధపడింది జాగృతి.
ఆఫీస్ లో , HR ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక, హిమాని ని పరిచయం చేసారు. హిమనీ నార్త్ ఇండియన్ అమ్మాయి. ఆఫీస్ అంతా చూపిస్తూ, అందరిని పరిచయం చేసింది. ఆఫీస్ లో పెద్ద కాంటీన్, లైబ్రరీ, జిమ్, మెడిటేషన్ రూమ్, ప్లే ఏరియా లో టేబుల్ టెన్నిస్, మినీ గోల్ఫ్ ఇలా చాలా వున్నాయి. ఆఫీస్ చాలా నచ్చింది జాగృతి కి. 'ఉండడానికి కూడా సరి అయిన ప్లేస్ దొరికితే బాగుణ్ణు.' అనుకుంది మనసులో.
"ఎక్కడ పని చేసావ్ ఇంతకు ముందు?" అడిగింది జాగృతిని హిమాని.
"యూఎస్ లో. కొన్ని రోజుల క్రితమే వచ్చాను" చెప్పింది జాగృతి .
"నీకు హిందీ వచ్చా".
వచ్చంది జాగృతి.
"ఎక్కడ వుంటున్నావ్?"
"నా కాలేజీ ఫ్రెండ్ ఉంది హాస్టల్ లో. అక్కడే ఉంటున్నాను. "
"ఏమైనా వేరే ప్లేస్ వెతుక్కుంటున్నావా" అడిగింది హిమాని.
" నిన్నే వచ్చాను చెన్నై. నాకు ఇక్కడ ఏమి తెలియదు ఇంకా. చూద్దాం" అంది జాగృతి.
"సరే. నీకు వేరే ప్లేస్ కావాలంటే చెప్పు. నేను పేయింగ్ గెస్ట్ గా వున్న చోట ఉండచ్చు కావాలంటే" అంది హిమాని.
"సరే. అవసరం అయితే చెపుతాను" అంది జాగృతి.
ఆ రోజు సాయంత్రం తన రూమ్ కి వెళ్తూ, మ్యాట్రెస్ తో సహా కావాల్సిన సామాన్లు అన్ని కొనుక్కుని వెళ్ళింది హాస్టల్ కి. ఆ రోజు కూడా నిద్ర పట్టలేదు జాగృతి కి .
నెల రోజుల్లో రజిని పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయింది. హాస్టల్ లో ఉండడం చాలా కష్టంగా వుంది జాగృతి కి . రోజూ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లి, చట్నీ, డిన్నర్ లో బీన్స్ కూర, సాంబార్. సాంబార్ లో ఒక రోజు బల్లిని చూసింది జాగృతి. ఆ రోజు నుండి హాస్టల్ లో తినడం మానేసింది. నిద్ర సరిపోకపోవడం తో ఒక రోజు ఆఫీస్ లో మెడిటేషన్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది. హిమనీ అది చూసి "చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమయ్యింది. అంతా ఒకే నా?" అని అడిగింది. హాస్టల్ లో తన పరిస్థితి గురించి చెప్తూ ఏడ్చేసింది జాగృతి.
మర్నాడు ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది జాగృతికి. ఫోన్లో ఎవరో పెద్దాయన పాత హిందీ పాటని ఈల వేసి " ఈ పాట ఏంటో చెప్పు" అని అడిగారు. ఆయన ఎవరో, ఎందుకు అలా అడిగారో తెలియదు కానీ అడిగిన వెంటనే పాడింది. "కరెక్ట్. నీ గొంతు బాగుంది. యు ఆర్ సెలెక్టెడ్ " అని ఫోన్ పెట్టేసారు ఆ పెద్దాయన." ఏమి అర్ధం కాలేదు జాగృతికి.
ఈ సంభాషణ తనకి జీవితాంతం మర్చిపోలేని ఎన్నో మంచి అనుభూతుల్ని ఇస్తుందని అప్పుడు తెలియలేదు జాగృతికి .
తరువాత హిమాని వచ్చి అడిగింది "అంకుల్ ఫోన్ చేసారా?" అని.
" ఏ అంకుల్?" అంది జాగృతి .
"నీ పాట విని, నువ్వు సెలెక్టెడ్ అన్నారు. ఆ అంకుల్. కృష్ణన్ జి" అని నవ్వుతూ చెప్పింది హిమాని .
"ఓహ్. అంకుల్ అంటే నువ్వు పేయింగ్ గెస్ట్ గా వున్న ఇంట్లో అతనా? ఉదయం ఫోన్ వచ్చింది. ఒక పాటని ఈల చేసి ఆ పాట ఎదో చెప్పు అని టెస్ట్ చేసారు " అంది జాగృతి.
హిమాని నవ్వుతూ "అవును. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. చాలా మంచి వాళ్ళు. నువ్వు అక్కడ చాలా హ్యాపీగా ఉండచ్చు".
"మరి నువ్వు?".
" నేను, అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి తరువాత నేను తను వున్న చోటికి వెళ్లిపోతాను" అంది సంతోషంగా హిమాని.
"ఎవరు? మన కోలిగ్ అవినాష్ నా ?" ఆశ్చర్యంగా అడిగింది జాగృతి. అవునంది హిమాని.
"నిజమా. హే. కంగ్రాట్స్. ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ" అంటూ ఆనందంతో హత్తుకుంది హిమానిని.
హిమాని పెళ్లి అయ్యి అవినాష్ ఇంటికి వెళ్ళింది. హాస్టల్ నుండి అంకుల్ వాళ్ల ఇంటికి మకాం మార్చింది జాగృతి . కృష్ణన్ గారు , సుమతి గారు , కృష్ణన్ గారి అమ్మగారు వున్నారు. వాళ్ళ అమ్మాయి యూఎస్ లో MS చేస్తోంది. అందరూ చాలా మంచి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, సింపుల్ మనుషులు. ఇల్లు కూడా చాలా సింపుల్ గా ఉంది. ఎక్కువ వస్తువులు లేవు ఇంట్లో కానీ కావాల్సినవి అన్ని వున్నాయి. ఒక రూమ్ ఇచ్చారు జాగృతికి. చాలా స్పేషియస్ గా ఉంది ఆ రూమ్. రూమ్ లోంచి బయటకి చూస్తే చాలా చెట్లు. ఇది హాస్టల్ కాదు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్ కాదు. కృష్ణన్ గారి ఇంట్లో వాళ్ళ కూతురులా వుండే అవకాశం. జాగృతి ఆనందానికి హద్దులు లేవు.
కృష్ణన్ గారి వాళ్ళ మాట తీరు, పద్దతి చాలా నచ్చాయి జాగృతికి . జాగృతి కూడా చాలా నచ్చింది వాళ్ళకి. జాగృతిని తన ఇంట్లో ఏ పేరుతో పిలుస్తారో అడిగి ఆ పేరుతోనే పిలిచేవారు వాళ్ళు. జాగృతి కూడ వాళ్ళని అంకుల్, ఆంటీ, పాటి అని పిలిచేది. హిందీ లో, ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు. జాగృతి కి తమిళ్ సరిగ్గా రాకపోవడంతో తనని ఏడిపించడానికి అప్పుడప్పుడు తమిళ్ లో మాట్లాడి ఆటపట్టిస్తూ ఉండేవారు కృష్ణన్ గారు. అలాగే నేర్పేవాళ్ళు కూడా. సరదాగా ముద్దపప్పు అని, కుట్టి అని పిలిచే వాళ్ళు. వాళ్లతో ఉంటే సొంతవాళ్లతో ఉన్నట్టుగా వుంది జాగృతి కి. కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా అయిపొయింది జాగృతి.
ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలతో,సుమతి గారు పెట్టే మంచి కాఫీ వాసనతో, కృష్ణన్ గారు పెట్టే కర్నాటిక్ సంగీతం వింటూ లేచేది జాగృతి . వేడి వేడి కాఫీ చేతికి తెచ్చి ఇచ్చేవారు సుమతిగారు. ఆఫీస్ కి లేట్ అయిపోతూ ఉంటే టిఫిన్ నోట్లో పెట్టేవారు కృష్ణన్ గారు. సుమతిగారికి రోజు సాయంత్రం గుడికి వెళ్లే అలవాటు. జాగృతి కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చిన రోజుల్లో సుమతిగారి తో పాటు గుడికి వెళ్ళేది. ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో TV లేదు. సరదాగా కూర్చుని అందరూ మాట్లాడుకునేవారు. రాత్రిపూట పాత హిందీ పాటలు వినేవాళ్ళు . ఆ పాటల్లో సంగీతం, సాహిత్యం గురించి మాట్లాడుకునే వాళ్ళు .
చాలా ప్రశాంతంగా అనిపించేది జాగృతికి.
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు జాగృతిని " మా పెద్ద అమ్మాయి" అని పరిచయం చేసేవాళ్ళు కృష్ణన్ గారు, సుమతి గారు. వాళ్ళ చుట్టాలు కూడా నవ్వుతూ " నీ గురించి విన్నాం. మేము కూడా నీకు చుట్టాలమే." అనేవారు. కృష్ణన్ గారు, సుమతి గారు జాగృతిని కూడా తీసుకుని వెళ్లేవాళ్ళు వాళ్ల చుట్టాల ఇళ్ళకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు. జాగృతికి అందరి ఇళ్ళు, వాళ్ళ పద్ధతులు,మాట తీర్లు చాలా నచ్చాయి. అందరూ చదువుకున్నవాళ్ళు, సంస్కారవంతులు. అందరి ఇళ్లలోనూ సంగీత, సాహిత్యాల గురించి,పెయింటింగ్ గురించి చర్చలు జరిగేవి. ఇళ్ళు అంటే ఇలా ఉండాలి, మనుషులు ఇలా ఉండాలి అనుకుంది.
వీళ్ళని పరిచయం చేసిన తన ఫ్రెండ్ హిమానికి ఎన్నో సార్లు థాంక్స్ చెప్పింది జాగృతి. హిమని, జాగృతి ఇచ్చింది ఉండడానికి ఒక చోటుని కాదు. ఒక కుటుంబాన్ని.
నరకం నుండి స్వర్గానికి వచ్చినట్టు ఉంది జాగృతికి.
సమాప్తం.
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
Comments