top of page

నారీ భేరి!

#Vijayasundar, #విజయాసుందర్, #NareeBheri, #నారీభేరి, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Naree Bheri - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 15/01/2025

నారీ భేరి - తెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"ఎంతసేపు ఆ దివిటీని వెలిగించి ఉంచుతావు కాష్టంలో కాలని కళేబరంలా? బిల్లు పేలిపోతుంది" కథ రాయడంలో మునిగిపోయిన అహల్య ఉలిక్కిపడింది ఆ గర్జనకి! తేరుకుని ఆ గర్జన ఎక్కడ్నించి వచ్చిందో, దాని సారాంశమేమిటో అర్థమయి, "హు.. ఈయనకి ఒక్క మాట, ఆఖరికి నిద్ర మధ్యలో కూడా సొగసుగా రాదా? ఏ మట్టితో పుట్టించావయ్యా ఈ మగాణ్ణి, నామొగుడుగాణ్ణి?"


సమాధానంగా లైట్ ఆర్పేసింది, ఆ శాల్తీ లేచి వస్తే జరిగే అనర్థం తెలిసి. 

అహల్య మంచి రచయిత్రి. చాలా కథలు అచ్చయ్యి, బహుమతులు, పారితోషికాలు గెల్చుకున్నాయి. 


ఆవిడ మొగుడు నాగభూషణం.. నాగులు భూషణాలుగా లేవన్న మాటేగానీ, మనిషికి నిలువెల్లా విషమే! వాళ్ళ ఇద్దరి పిల్లల జీవితాలు ఒడ్డెక్కాక ఇప్పుడు మొగుడుపెళ్ళాలు

రిటైరయి ఒకే గూట్లో బండి లాగుతున్నారు. 


పీనాసి మొగుడితో అహల్య జీవితం నరక సదృశంగానే నడిచింది, నడుస్తున్నది. చాదస్తపు మొగుడు చెప్తే వినకపోవడం దాకానే కానీ, పీనాసి మొండి మొగుడి వైఖరి అనుక్షణం రోకటిపోటే!


***

ఉద్యోగం చేసిందన్న మాటేగానీ అహల్య దగ్గర దమ్మిడీ ఉండదు. ఆవిడ చేసిన ఇంటి పక్క బళ్ళో ఉద్యోగానికి వచ్చి ఒళ్ళో పడ్డ ధనరాసులేమున్నాయని! కథలకి వచ్చే కాస్త డబ్బు అయినా స్నేహతురాలి ఇంటి అడ్రస్ కి వస్తున్నది కనక, ఊళ్ళో ఉన్న కూతురెప్పుడన్నా గడపలోకి పిల్లని ఎత్తుకుని వస్తే, పదో పరకో పెట్టగలుగుతున్నది. 


'ఇప్పుడు కట్టుడు చీరలు బొత్తిగా చిరిగిపోయినాయి.. కొనుక్కుందామంటే తన దగ్గర అసలు ఏమీ లేవు. సిగ్గు విడిచి మొగుణ్ణి అడిగితే, "ఆషాఢం సేల్ రానీ అప్పుడు చౌకగా వస్తాయని" నోరుమూయించాడు. కుట్టటానికి ఇంక వీలు లేనన్ని కుట్లు పడ్డాయి చీరెలకి. పెళ్లి పట్టుచీర, తమ్ముడి పెళ్లికి పెట్టిన పట్టుచీర మాత్రమే ఉన్నాయి లోపలైనా. ప్చ్.. ఇంత దరిద్రం అనుభవించాల్సి వచ్చింది. 


ప్చ్.. కొడుకు ఇంజనీర్ అయి మంచి ఉద్యోగంలో చేరినప్పుడు మురిసిపోయింది, ఇంక తనకి మంచి రోజులు వచ్చాయని. అందుకే ఉన్న ఒక్క గొలుసూ, కొడుక్కి ఉద్యాగానికి డిపాజిట్ కట్ట వలసి వస్తే సంతోషంగా ఇచ్చేసింది.. తరవాత కొడుకు ఏడువారాల నగలు దిగేస్తాడని! నగల మాట దేవుడు ఎరుగు, కొడుకు ఇల్లరికం పోయి నల్లపూస అయిపోయాడు కంటికి కూడా కనిపించకుండా!'


ఆలోచనలనుండి బైటపడి భర్తకు భోజనం వడ్డించడానికి లేచింది. తనకీ ఆకలి వేస్తున్నది. కానీ అలా ఇద్దరూ కలిసి తినకూడదుగా.. ఆయన తిన్నాక మిగిల్చినవి మాత్రమే తినాలి. 

మొదట్లో ఏమీ ఉండేవి కాదు.. మిగిల్చేవాడు కాదనటం కరెక్ట్.. కాస్త ఎక్కువ వండి ఏ బీరువా పక్కనో దాచి పెట్టి ఆయన తిని లేచి వెళ్ళాక అన్నంలో కప్పి పెట్టుకుని ఒట్టి అన్నం తింటున్న బిల్డ్ అప్ ఇస్తున్నది. ఇంతకీ ఇంత పొదుపు ఏ పిల్లలకి ఎత్తి ఇవ్వాలని ఏమీ కాదు.. ఒట్టి రాక్షత్వం.. పెళ్ళాన్ని అణిచి పెట్టాలని తల్లి నేర్పి పోయిన రాకాసి నీతి! ఎదురు తిరగాలనే ఉంటుంది.. చాలాసార్లే ఆ పని చేసింది కూడాను.. కానీ ఉచ్ఛం నీచం లేకుండా తిట్లు, దెబ్బలు తినే ఓపిక చచ్చిపోయి.. ఇదిగో ఇలా


అభిమానంతో ఆకలి తీరదని తన ఇంట్లోనే తాను దొంగగా మారాల్సొచ్చింది అహల్యకి. అన్నం పెట్టుకోగానే కూతురు వచ్చింది పిల్లని బడి నుండి తీసుకుని. హతాశురాలయింది. కంచంలో అన్నం అలాగే ఉంచి చెయ్యి కడుక్కుందుకు లేచింది. కూతురు సుమ, పిల్లని తండ్రికిచ్చి, పిల్ల బాగులో రహస్యంగా దాచిన కారియర్ తీసుకుని తల్లి దగ్గరకు వచ్చి మాట్లాడకుండా తల్లిని రెక్క పట్టి కంచం ముందు కూర్చొపెట్టి, తాను తెచ్చిన కూర పప్పు వేసి.. తల్లి తింటుంటే తృప్తిగా చూసుకుని కళ్ళనిండా నీళ్లతో, "ఏమిటమ్మా నీకీ కర్మ? నువ్వు ఎందుకు ఎదురు తిరగవు? నీ ఇంట్లో నువ్వు మహా రాణిలా ఉండాల్సింది పోయి.. నేనన్నా ఉద్యోగం చేస్తుంటే.. ప్చ్.. నా పరిస్థితులూ అంతంత మాత్రమే కదా" కళ్ళనిండా నీళ్ళతో బాధపడుతున్న కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ, "ఆరాక్షసుడు వింటాడేమో మెల్లిగా" అన్నది. 


"లేడులే.. పిల్లకి బిస్కెట్ కొనిపెట్టమని డబ్బులిచ్చి పంపాను"


"కర్మ పరాకాష్ఠ అందుకోవడం అంటే ఇదే.. డబ్బులిచ్చి కొని పెట్టమనటం" 


అల్లుడు కూడా మామకి తగ్గవాడే. కాకపోతే పెళ్ళాన్ని, పిల్లని బాగా చూసుకుంటాడు. ఇంక ఆ పరిధి దాటడు. ఉండబట్టలేని కూతురే అప్పుడప్పుడు వండినవేవో తేగలుగుతున్నది. 


ఆషాఢమాసం వచ్చేసింది అట్టహాసంగా. కిలోమీటర్ దూరంలో ఉన్న హోల్ సేల్ షాప్ కి నడిపించే తీసుకెళ్లాడు.. మాసికల చీరతో రోడ్డు మీద నడవాలి, ఆటోలో వెల్దామని ఎంత పోరినా చెవిన పెట్టలేదు. అసలుకే మోసం రాగలదని అహల్య తలొంచుకుని నడిచింది. 


"కిలో అయిదు వందలు" అని మైకు పెట్టుకుని మరీ అరుస్తున్నాడు. షాపులో గుట్టలు గుట్టలుగా చీరెలు. మూడు సింథటిక్, రెండు తెలుపు మీద ప్రింట్స్ ఉన్నవి అయిదు వందలట. గబగబా ఒక గుట్ట తీసుకుని నిలబడ్డది అహల్య తూకం వేయించి పాక్ చేయించడానికి. నాగభూషణం ఆవిడకి అంత ఫ్రీడమ్ ఎప్పుడివ్వాలి? భార్య చేతిలో చీరెలు లాక్కుని, ముదురు రంగులు, దగ్గర దగ్గర పూలు ఉన్న చీరెలున్న గుట్ట తీసి అందులోనించి తెలుపు మీద పూలున్న చీరెలు తీసేసి వేరే గుట్టలోనించి రంగు చీరెలు తియ్యబోతుండగా, సేల్స్ మాన్ అలా కుదరదు అన్నాడు. అయితే తమకు వద్దనేశాడు. అహల్య ప్రాణం పోయినంత పని అయింది. దేవుడు ఆవిడ పక్షాన ఉన్నాడు, అక్కడ ఇంకోళ్ళకి తెల్ల చీరెలు కావాలని తీసుకుని రంగు చీరెలు వాళ్లకి నచ్చనివి ఇచ్చారు. తెల్ల చీరెలు చేజారిపోతున్నందుకు బాధపడ్డా అసలు చీరెలంటూ కొన్నది అవతలివాళ్ళ వల్లనే కదా అని వాళ్ళకి థాంక్స్ చెప్పింది అహల్య. 


ఇంటికి వచ్చారు.. చీరెలు కవర్ లోనుండి బయటకు తీసింది అహల్య. పెద్దపెద్ద పూలున్న చీరె చేత్తో పట్టుకుని ఆలోచిస్తున్నది.. 'అసలు తనకి ఇంత ముదురు రంగులు, ఇంత పెద్ద పూల చీరెలు నచ్చనే నచ్చవు. ఏమి చేస్తాను.. సబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని లేత రంగులు, చిన్న ప్రింట్లకి ఒప్పుకోడు మొగుడు అని గొణుకున్నది. చీర ఇప్పి చూసింది. ఒక్కసారి గా ఉలిక్కిపడ్డది.. ఆరు చేతులు కొలత రానేలేదు చీరేకి. చాలా చిన్న చీర. 


"ఏమండీ ఏమండీ" భర్తని కేకేసింది.


 దొడ్లో మొక్కలకు పాదులు చేస్తున్న నాగభూషణం, "ఏమిటీ కొంపలు కూలిపోయినట్లు ఆ కేకలు" అంటూ లోపలికి వచ్చాడు. 


"ఈ చీరె చూడండి 5 మీటర్లు మాత్రమే ఉన్నది. చుట్టు కొలతకి రాదు." కంగారుగా చీర చూపించింది. 


నాగభూషణం ఖంగు తిన్నాడు. ముందే అక్కడ బోర్డు రాసి పెట్టారు ఆషాఢం సేల్ లో కొన్న చీరెలు మార్చుకునేందుకు, వాపస్ కి వీలు లేదని. అయినా తప్పు ఒప్పుకోని మగపురుషుడు కదా.. " ఆ ఏమున్నది బజార్లు ఊడ్చే పైటలు వెయ్యకుండా ఆ షాపు వాళ్ళు సరైన పనే చేశారు. లోపల కొంగు తక్కువ తీసుకుని, చిన్న పమిట వేసుకుంటే మా బాగా సరిపోతుంది. ఇంట్లో పడుండే దానికి నీకు ఏమతుంది ఎలా ఉంటే మాత్రం" ఈసడించి పారేశాడు. అహల్య మారు మాట్లాడలేదు. 


ఆరోజు అహల్య తమ్ముడు వచ్చాడు, అక్కగార్ని తనతో పాటు తల్లిదండ్రుల దగ్గరకి తీసుకు వెళ్లాలని. వెళ్లేందుకు డబ్బు ఖర్చని అక్కని బావ పంపడని ప్రత్యేకంగా వచ్చాడు. హోటల్ లో భోజనం చేసే వచ్చాడు బావగారి సంగతి తెలిసున్నవాడు కనక. 


అహల్య మాత్రం బాధగా, "నాది ఏమి బ్రతుకురా రవీ.. రాక రాక వచ్చే తమ్ముడికి పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యురాలిని, నన్ను క్షమించరా" అన్నది నీళ్లు నిండిన కళ్ళతో తమ్ముడిని పట్టుకుని. 

"అక్కా! బాధపడకే నీ చల్లని ఆశీస్సులే నాకు పఞ్చభక్ష్యపరమాన్నాలు. తొందరగా తెముల్చుకో.. మనం మధ్యలో మీ మరదలి వాళ్ళ అమ్మ వాళ్ళింటి నుండి మీ మరదల్ని ఎక్కించుకుని వెళ్ళాలి" అన్నాడు


మాట వరుసకు బావగార్ని కూడా తమతో రమ్మని పిలిచాడు. నాగభూషణం ఒక్క సెకెండ్ ఆలస్యం చెయ్యకుండా వెంటనే వస్తానన్నాడు. 'అబ్బ ఎందుకైనా అన్నానురా భగవంతుడా.. రెండు రోజులు అక్కతో హాయిగా ఉండవచ్చు అనుకుంటే" అని బాధపడ్డాడు రవి. చేసేదేమీ లేక ఊరుకున్నాడు. 


అంతా బయల్దేరారు రవి కారులో అల్వాల్ లో ఉండే రవి అత్తగారింటికి. అహల్య కారు దిగి, మరదలి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి కూర్చున్నదో లేదో, ఎవరో పట్టుకుని చింపినట్లు కొత్త చీర పరపరా చిరిగి పోయింది. చప్పుడుకి మంచి నీళ్ళు తీసుకు వచ్చిన మరదలు నీలిమ చెల్లెలు, వారిజ తలెత్తి చూసింది.. ఏమిటా అన్నట్లు? అహల్యకి బాగానే అర్థమయింది జరిగిందేమిటో. అవమానంతో, సిగ్గుతో చచ్చినంత పని అయింది ఆమెకి. పొడుగు కొంగు కూడా కాదు చిరుగు కప్పుకోవడానికి. ఏమి చెయ్యాలో దిక్కు తోచలేదు. 


"అబ్బే ఏమీ లేదు" అంటూ వెర్రి నవ్వు నవ్వేసింది. 


వచ్చింది అల్లుడు, అల్లుడి అక్కగారు బావగారు అని బోలెడు మర్యాదలు చేశారు. టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ టేబిల్ దగ్గరకు రమ్మన్నారు. పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డం పడ్డట్లు అయింది అహల్యకి. అందర్నీ వెళ్ళనిచ్చి వెనకగా నడుస్తూ, వీలైనంత మటుకు కొంగు ఆ చిరుగు మీదకి తెచ్చింది. 


మరదలు నీలిమ "అదేమిటి వదినా మీరు అసలు మాట్లాడటం లేదు. ఒంట్లో బాగా లేదా?" అని అడుగుతుంటే అదేమీ లేదని ఏదో దాటవేసింది. పోనీ మరదలికి చెప్దామా అనుకున్నది. మరదలు చాలా మంచిదే కానీ వాళ్ళ అమ్మకి తాము అంటే చాలా చులకన. పెద్దగా లేని వాళ్ళమని. తమ కట్టుబొట్టు అదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కానీ నిజానికి వాళ్ళకంటే ఉన్నవాళ్ళమే తాము. 


సుభద్రమ్మ, నీలిమ తల్లి పూజ ముగించి వచ్చి కూర్చున్నది. 

ఆరాలమీద ఆరాలు మొదలయ్యాయి. 


"ఇలాంటి పాశ్ కుర్చీలు అలవాటు లేకనేమో కోడలు పాపం స్థిమితంగా కూర్చోలేక పోతున్నది. పోనీ నేల మీద పీట వెయ్యమంటావమ్మా" ఆపేక్ష కారిపోతున్నట్లుగా అడిగింది. 


నాగభూషణం ఏదో నోరు విప్పబోయాడు.. ఎంతో అరుదుగా ఉపయోగించే అస్త్రం అహల్య, ఉపయోగించింది, ఏదో అతని గురించి బట్టబయలు చేస్తానని. ఎక్కడన్నా బైట తన మీద పిచ్చి వేషాలు వేస్తే ఈ అస్త్రం తప్పని సరి. 


ఇంతకీ ఆ అస్త్రం ఏమిటో.. నాగభూషణం ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి కక్కుర్తి పడి ఫేక్టరీ లో ఉపయోగించే బోల్టులు, నట్లు, టిఫిన్ బాక్స్ లో వేసుకుని తెచ్చాడు అన్నీ తనిఖీ చేస్తారని తెలియక. అంతే నెల్లాళ్ళు సస్పెండ్ చేసారు ప్రథమ తప్పు కింద, బ్రతిమాలుకుని, ఇంక ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యనని వ్రాత పూర్వకంగా ఇచ్చినాక. దాన్ని చాలా అవమానంగా తీసుకున్నాడు. 


టిఫిన్లు, కాఫీలు అయ్యాక మరదలు అహల్యని తమ గదిలోకి తీసుకెళ్లింది ఒకరకంగా బలవంతంగానే. విషయం తెలుసుకున్నాక, "అదేమిటీ వదినా అంత మొహమాటపడతారు? ఇందాకటి నుండి పాపం ఎంత అవస్థ పడుతున్నారు" అని తన చీర తీసి ఇస్తుంటే వద్దంటున్న వదిన్ని అర్థం చేసుకున్నది నీలిమ. 


తన తల్లి ఎన్ని వ్యంగ్యబాణాలు విసురుతుందో అని వదిన భయపడుతున్నదని అర్థం చేసుకున్నది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తాను ఆడబడుచుకి ఇవ్వటం కోసం, మొత్తం తయారు చేయించి తెచ్చిన చీర ఇప్పుడు బొట్టుపెట్టి ఇచ్చేస్తే సరిపోతుందని వెంటనే ఆ పని చేసింది నీలిమ. అహల్య అవాక్కైయింది. 


"ఇదేమిటీ నీలూ నువ్వు కొనుక్కున్న చీర నాకు ఇవ్వడం ఏమిటి? వద్దు.. మెల్లిగా వెళ్లి కారులో కూర్చుంటాను" అంటే నీలిమ.


 "అయ్యో వదినా నిజంగా ఇది మీకోసమే తీసుకుని, అన్నీ రెడీ చేయించాము. అత్తయ్యగారి చేత ఇప్పిద్దామనుకున్నాను" అంటూ జాకెట్ కూడా చూపించింది, 


అహల్య పాత టైలర్ దగ్గర ఉన్న కొలతలతో కుట్టించానని. మరదలి ప్రేమలో తల్లి కనిపించగా, అహల్య కళ్ళనిండిపోయాయి. ! ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, చీర కట్టుకుని వచ్చింది. 


కారెక్కగానే మొదలుపెట్టాడు నాగభూషణం, "ఏమి ఎలా కూర్చోవాలో తెలియలేదా? లేక పుట్టింటికి వెళ్తున్నానని విరగబాటా?" ఇంకా అనేవాడే.. నీలిమ కలగచేసుకుని, " అయ్యో అన్నయ్యగారు చీరేకదా చిరిగింది? ఇంకా నయం కూర్చున్న చోట ఇంట్లో చిరిగింది.. కాళ్ళదగ్గర ఏ రోడ్

 పై నడిచేటప్పుడో చిరిగితే మా వదిన పడిపోదుటండీ? అయినా ఆషాడం కొనుగోళ్లు ఇలాగే ఉంటాయి.. 'ఓలి తక్కువని కళ్ళులేని పెళ్ళాన్ని తెచ్చుకుంటే ఇంట్లో అన్నీ పగలడమే' అన్నట్లు. 

అయినా మీకేం తక్కువ అన్నయ్యగారూ చక్కగా షో రూమ్ లో కొనక"


నీలిమకి సమాధానం ఇవ్వలేకపోయాడు అంత పెద్ద మగాడూను.. వెర్రి నవ్వొకటి నవ్వి ఊరుకున్నాడు. వింటున్న శ్రోతల్లో రవి, భార్య కొంటెతనానికి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. తామెవ్వరూ బావగారి ఏ మాటకైనా తాన తందాన తప్ప ఎన్నడూ ఇలా కౌంటర్ వేసి ఎరగరు. ఇన్నాళ్టికి ఓ మనిషి ఇలా నిలదియ్యగలుగుతుంటే, చాలా సంతోషంగా అనిపించింది. అహల్య మాత్రం మరదలిని, భర్త ఏమని అవమానిస్తాడో అని భయపడుతున్నది. 


***

తల్లి, తండ్రి అక్కని వెంటపెట్టుకు వచ్చినందుకు రవిని ఎంతగానో పొగిడారు. అహల్య తల్లి, చిక్కి శల్యమైన కూతుర్ని చూసి చాటుగా గుడ్లనీళ్లు కుక్కుకున్నది. అత్తగారి ఆవేదన చూసిన నీలిమ, అహల్యని ఒక నెల్లాళ్ళు ఉంచుకుని, బ్రెయిన్ వాష్ చేసే పంపాలని నిర్ణయించుకున్నది. అందుకు గాను తాను కూడా అహల్య ఉన్నన్నాళ్ళూ అక్కడ ఉండాలని కూడా నిశ్చయించుకున్నది. 


భర్త గచ్చిబౌలి వెళ్లి, వీకెండ్స్ లో వచ్చేట్లు ఏర్పాటు చేసేసింది అనుకున్నదే తడవుగా. అహల్యని ఒప్పించడమే బ్రహ్మప్రళయమైంది. అత్తగారింట్లో పూర్వం లాగా అల్లుడిరకం గానీ, భార్య మీద ఆంక్షలు విధించడం గానీ చెయ్యలేకపోతున్నాడు నాగభూషణం.. అడుగడుగునా నీలిమ సంధించే బాణ పరంపర తట్టుకోవడం అసాధ్యమైపోయింది. అహల్యని నెల్లాళ్ళు ఉంచక తప్పలేదు. 


ఈ నెల్లాళ్లలో అహల్య రెండు నవలలు దసరా, దీపావళి పోటీలకు రాసి 20000 రూపాయలు సంపాదించింది. ఆ డబ్బుకు రవి ఇంకో 30000 అప్పుగానే ఇచ్చి, అహల్య చేత ఆన్లైన్ చీరెలు, ఫాన్సీ నగల వ్యాపారం పెట్టించాడు. జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకుని, పీనాసి మొగుణ్ణి ఎదుర్కోవడానికి సంసిద్ధురాలైన ఆమె, కొత్త అహల్యగా గూడు చేరింది.. కూతురికి పాఠాలు చెప్పబోయే తల్లి అవతారం దాల్చి!


రవి అక్కని దింపి, తనతో ముభావంగా ఉన్న బావగారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. 

నిండుగా, ఆరోగ్యంగా ఆనందంగా లోపలికి వెళ్తున్న భార్యని అక్కసుగా చూస్తూ, "అయినాయా గాలి తిరుగుళ్లు?"అన్నాడు. 


"మాటలు తిన్నగా రానివ్వండి.. దాని అర్థం తెలుసా? నేను లేని ఈ నెల్లాళ్ళు మీ తింగరి వేశాలేమిటో చెప్పండి." 


నాగభూషణం విస్తుపోయాడు.. ఈమె తన భార్యేనా అని!


జుట్టు దొరకబుచ్చుకోబోతున్న మొగుణ్ణి, ఒక్క జబ్బ చరుపుతో ఆపి, "జాగ్రత! నా మీద చెయ్యిపడితే మహిళాపోలీసులకి ఫోన్ వెళ్ళిపోతుంది. మీ అరుపులింక జైల్లోనే" నిబ్బరంగా అంటున్న భార్య అమ్మవారిలా భాసించింది!


అంతే నాగభూషణం ఆటలన్నీ కట్. డబ్బు దగ్గర కట్టడి చేద్దామంటే అసలు నయాపైసా అడగటం లేదు. అన్నీ ఆన్లైన్ లో వచ్చి పడుతున్నాయి. 


భార్య ఎప్పుడూ ఆన్లైన్ లోనే. ఇంట్లో వంటమనిషి, ఫుల్ టైం పనిమనిషి.. నాగభూషణం నోరు పడిపోయింది. ఆర్ధిక స్వాతంత్య్రం ఆడదానికి ఎంతటి ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుందో తెలుసుకున్న అహల్య, ఉద్యోగానికి అన్ని అర్హతలూ ఉండి భర్త వద్దన్నాడని ఉద్యోగం చెయ్యకుండా, బానిస బతుకు బతుకుతున్న కూతరి బ్రెయిన్ కూడా బాగా కడిగేసి, కర్తవ్యోన్ముఖురాలిని చేసింది, వెలుగు దారి పట్టిన ఆ తల్లి!


***

విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!


 
 
 

1件のコメント


mk kumar
mk kumar
1月15日

కుటుంబంలోని సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు ద్వారా మహిళల ఎదుర్కొనే సవాళ్లను చూపారు. అహల్య అనే కథానాయకురాలి జీవితంలో ఆమె పెళ్లి, భర్త నాగభూషణం, కుటుంబ సభ్యులతో గడిపే అనేక సంక్లిష్టమైన సమస్యలను చూపారు. ఆమె అనుభవాలు ఆమె జీవితానికి సంబంధించిన నొప్పి, బాధ, అవమానం, నిరాశను ప్రతిబింబిస్తాయి, అయితే చివరికి ఆమె తన స్వతంత్రతను పొందడం ద్వారా కొత్త జీవితం ప్రారంభిస్తుంది.


ఈ కథ మహిళల అనుభవాలను, వారి ధైర్యాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబించి, సామాజిక బాధ్యత, ఆర్థిక స్వాతంత్ర్యం, కుటుంబ సంబంధాలలో మంచి పెరిగే మార్గాన్ని సూచిస్తుంది.


いいね!
bottom of page