#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #నవయుగనినాదం, #NavayugaNinadam
'Navayuga Ninadam' - New Telugu Story Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 20/10/2024
'నవయుగ నినాదం' తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
ప్రస్తుతం ప్రతి కదలిక, వేగంయుగం లో ప్రయాణం చేస్తుంది. అందులో భాగంగా మనిషి తన ఆలోచనను అమలు చేయడానికి సాంకేతిక సహాయం, ప్రయోగ శాలలు, పరిశోధన అవకాశాలు చాలా అవసరం. ప్రతి పదార్ధములో అవసరమైనవి, అనవసరమైనవి, అవి చేసే మేలు, సంభవించే కీడు, వాటి ఫలితాలు వంటి క్లిష్టమైన వివరాలు తెలుసు కోవడానికి అధ్యయనం చేసే ప్రక్రియలు ఒక క్రమ పద్ధతిలో తయారు చేసుకోవాలి. అనుభవ యోగ్యమైన మేధావులు మాత్రమే విషయాలు తెలుసుకో గలుగుతారు.
కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ చెప్పిన ఉపన్యాసం అక్షరకు గుర్తు కొచ్చింది.
సమయం మించి పోయింది అని హడావుడిగా వచ్చిన శరణ్య ను చూసి, “ఎప్పుడూ సంతోషంగా కనపడే నీవు ఈ రోజు ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ కనపడుతున్నావ్?” అంది అక్షర.
“అదేం లేదు అక్షర.. అదేం లేదు” అంది శరణ్య.
“అంటే ఏదో ఉంది దాస్తున్నా వన్నమాట”.
“నీవు ఈ వెలుగులో, లైట్స్ వెలుతురులో, పరీక్ష నాళికల, రసాయన పదార్ధాలు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లు, కప్యూటర్స్ వీటి మధ్యలో ఉండి అసలు సహజత్వాన్ని కోల్పోతున్నావు. అంతేకాదు నీ ఎకస్పెర్మెంట్స్, అదేదో క్రొత్త విషయాలను కనుగొనాలనే ఆతురతలో, నా పాత ముఖం అలానే అనిపిస్తుంది”.
“ఏయ్! ఏమిటే అంత వేరు చేసి మాట్లాడు తున్నావ్? నీవు కూడా ఇక్కడే కదా పురుడు పోసుకుంటుంది”.
అప్పుడే వచ్చిన తరుణ్ “ఏమిటండీ, పురుడు అంటున్నారు? ఇక్కడ ఎవరికీ పెళ్లిళ్లు కూడా కాలేదు, ఆ టాపిక్ ఎందుకొచ్చింది?”
“ఇక చాలు తల్లీ. నేను చెబుతాను తరుణ్, ఇక్కడ ఏ క్రొత్త పదార్ధం సృష్టించబడ్డా పురుడు పోసు కున్నట్టేగా అని అంటున్నాను అంతే” అని శరణ్య, “మనం బయటకి వెళ్దాం పద” అని అక్షర ను తీసుకెళ్ళింది. తరుణ్ అయోమయంగా చూస్తున్నాడు.
“నేను ఇంటినుండి తొమ్మిది గంటలకే బయలుదేరి, మెయిన్ రోడ్డుకు రావడానికి అరగంట టైం పట్టింది. వచ్చేదారిలో దట్టమైన చెట్లు, రాళ్లు అక్కడక్కడా మాత్రమే కనిపించే మనుషులు, ఉదయం సందడి తక్కువ. నేను రోజు కంటే తొందరగానే బయలు దేరాను ఇంటి నుంచి. సగం దూరం వచ్చే సరికి నా టూ వీలర్ టీవీఎస్ చాంప్ కదా వేగంకూడా పెంచాను. కానీ మధ్యలో గొర్రెల గుంపు రోడ్ కడ్డంగా వచ్చే సరికి మెల్లగా నడపవలసి వచ్చింది. దూరం నుండి వస్తున్న ముగ్గురు మగ వాళ్ళు నడి వయసులో ఉన్నారు.
ఒకడు హోండా పై, ఇద్దరు స్కూటర్ పైన నావెనకాలే దగ్గరగా వస్తున్నట్లు అనిపించింది. ఈలోగా గొర్రెల కాపరి గొర్రెలను పక్కకు తప్పించాడు. మళ్ళీ నేను వేగం పెంచాను. వాళ్ళు నన్నే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. అందరూ తిరిగే సమయంలో నన్నెందుకు వెంబడిస్తారు. నేనే వ్యతిరేకంగా ఆలోచిస్తున్నానా?
ఒంటరి స్త్రీ కి భద్రత, భయం ముందే వస్తాయి. ఎక్కువ వేగంగా పరిగెత్తే స్త్రీలు, అధిక బరువులను మోసే స్త్రీలు కూడా ఉంటారు. కానీ శరీర శ్రమను చేయవలసిన అవసరం లేని పనులలో బుద్ధిని, తెలివి ని ఉపయోగించే పనులలో మాత్రం తీసివేయ బడుతారు. ఈరెండూ నాకున్నట్లు అనిపించట్లేదు. ఆలోచనలు నా చుట్టూ తిరుగుతున్నాయి”.
“అంత భయంతో బండి ఎలా నడుపుతున్నావే నువ్వు.. నా బలహీన మనసు ఎప్పుడో చచ్చుబడిపోయేది. ఏం జరిగింది చెప్పు. కొంచెం నీళ్లు త్రాగుతావా?..”
గ్లాసుతో నీళ్లు ఇచ్చి “కాసేపు కూర్చోవే ముందు” అంటూ కుర్చీ దగ్గరికి లాగింది.
“అమ్మయ్య! నీతో షేర్ చేసుకున్నాక కొంచెం బలం వచ్చింది. ఇలాంటి సంఘటనలు చెప్తుంటే వినటానికి ఆసక్తి కానీ అనుభవించిన వారికీ తెలుస్తుంది నొప్పి. మోసే గాడిదకే చాకలి మూట బరువు తెలుస్తుంది”
“మధ్యలో ఈ సామెతలు ఎందుకు? అసలు విషయం చెప్పు”.
“గాలి వేగం, బండి వేగానికి నా భుజం పైనున్న చున్నీ వెనుక చక్రం లోనికి జారింది. అంతే! నా టూ వీలర్ ఆగింది. మామూలుగా నేనే మెల్లగా నడుపుతున్నాను, వాళ్లు ఓవర్ టేక్ చేస్తారను కున్నాను. వాళ్ళు చేయలేదు. నేనే ఆపుదామనుకొన్న సమయానికి చున్నీ పడడం వల్ల పెద్ద ప్రమాదమేమి జరగలేదు. బండిపై నుండి దిగి చున్నీ గుంజబోతుండగా, వెనుక నన్ను వెంబడిస్తున్న ముగ్గురు ఒకరి తరువాత ఒకరు తమ వాహనాల నుండి దిగారు.
“ఏమైంది మేడమ్.. ఏమైనా హెల్ప్ కావాలా?”
“వద్దండీ” అంటున్నా, “చిక్కుకున్న చున్నీని నేను తీస్తానుండండి” అంటూ చక్రం లో చుట్టుకున్న చున్నీ ని బయటికి తీసాడు. ఆ తీసిన చున్నీ ని చేతికి ఇవ్వకుండా భుజం పైన సర్దు తున్నాడు. ఒక్క క్షణంలో నాకు వణుకు వచ్చింది.
“ఏయ్ మిస్టర్.. హద్దులు మీరుతున్నావ్?”
“సహాయమే మేడం” అని నవ్వుతున్నాడు.
వెంటనే బ్యాగులో సెల్ ఫోన్ తీస్తుండగా ఒకడు బండి కీస్ పట్టుకుని త్రిప్పుతున్నాడు. జనాలు ఎవరు లేరు, హెల్ప్ చేయడానికి. నేను బ్యాగ్ లోనుండి ఫోన్ బదులు పెప్పర్ స్ప్రే తీసుకొని ముగ్గురి కళ్ళల్లో కొట్టాను. ముగ్గురూ కళ్ళు మంటతో అరుస్తూ దూరం జరిగారు. కానీ అందులో ఒకడు చెట్టుకింద పడ్డాడు. నోట్లో నుండి రక్తం కారుతుంది. వాడు చచ్చి పోయాడనుకున్నాను.
నన్ను మాత్రం ఏమీ చేయ లేరనే ధైర్యం వచ్చింది.
నిముషంలో కిందపడ్డ కీస్ తీసుకుని అక్కడి నుండి నా బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసాను’.
“నీకైతే ఏమీ కాలేదుకదా! థాంక్ గాడ్” అని అంటున్న అక్షరతో, “వాళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేదు కానీ వాడు చచ్చినా నా వల్లే జరిగిందని నాపై పగ పడతారని భయం గా ఉంది”.
“నీవేమీ భయపడకు, ఆ విషయం మర్చిపో, నిన్ను టచ్ చేసినంతనే ప్రాణాప్రాయం జరిగింది. ఇక ఆలోచించకు” అంటూ తమ క్లాస్ లోకి వెళ్లిపోయారు.
కళ్ళ మంట చల్లారిన తరువాత నేలపై పడివున్న చందు దగ్గరికి వెళ్లారు మిగిలిన ఇద్దరు. వాడు కళ్ళు తెర్వక పోగా అచేతనంగా పడి ఉండడం చూసి, భయపడి దగ్గరున్న హాస్పిటల్ లో చేర్పించారు.
“మా వాడికి ఏమైంది డాక్టర్? ఎన్నడూ చిన్న జబ్బు కూడా తెలియదు”.
“అసలు అన్ని విషయాలు అడగాల్సింది మేము. సీరియస్ కoడిషన్ లో ఉన్నాడు. ఎక్కడైనా పడ్డాడా? విషపదార్ధాలు తీసుకున్నాడా? నిజాలు చెప్పండీ”.
“టూ వీలర్ మీద వస్తుంటే అకస్మాతుగా క్రింద పడ్డాడు డాక్టర్. క్రింద పడ్డప్పుడు గాయాలు లేదా ఫ్రాక్చర్స్ అవుతాయి”.
“అయినా అవన్నీ మాకనవసరం, అన్ని పరీక్షలు చేస్తు న్నాము. కాసేపట్లో రిపోర్ట్స్ లో నిజo తెలుస్తుంది”.
మిగిలిన ఇద్దరూ వెయిటింగ్ హాలులో కూ ర్చున్నారు.
ఆ అమ్మాయి వల్ల జరిగిన నష్టానికి వదిలేది లేదు. చందు కోలుకున్నాక వాడితో మాట్లాడి, వాడి నాన్న రాజకీయ బలం తో అనుకున్నది సాధించవచ్చు.
*****************
“వామన రావు పనిచేసే నియోజకవర్గానికి పరిపాలనాధికారి. అందరికీ సహాయం చేసే మనస్తత్వo. అభివృద్ధి పనులలో బిజీ గా ఉన్న సమయంలో కొడుకు విషయం తెలిసి హాస్పిటల్ వచ్చాడు. డాక్టర్స్ పర్యవేక్షణలో కొడుకును చూచి విషయమంతా తెలుసుకుని "కరోనా" కాలం పరిస్థితుల్లో తీసుకోవలిసిన జాగ్రత్త లతో ఇంటి నుండే స్పెషలిస్ట్ ల ద్వారా ఆరోగ్యస్థితి తెలుసుకుంటున్నాడు. పెద్ద అనారోగ్యం ఏమీలేదు, కాకపోతే ఏదో షాక్ వల్ల స్పృహతప్పి పడిపోయాడు. స్మోకింగ్ అలవాటు తగ్గించుకోవాలి అని చెప్పడంతో డిశ్చార్జ్ కోసం ఎదురుచూడ సాగాడు.
‘యూనివర్సిటీ ప్రయోగ శాలలో పరిశోధనా యుగం లో జీవించటం ఎంత ఉత్సాహ కరమంటే, నిర్థిష్టమైన భౌతిక ఆవిష్కరణలు, క్రొత్తగా నేర్చు కుంటున్న విజ్ఞాన శాస్త్రము కొన్ని పుస్తకాలు చదివి నపుడు అర్ధం చేసుకుంటున్నాము. నిన్న జరిగిన సంఘటనలో నాలో ఒక రహస్య శక్తి ని మరింత చక్కగా తెలుసుకున్నాను’
శరణ్య ఆలోచిస్తూ తరుణ్ వైపు తదేకంగా చూస్తుంది.
ప్రయోగo లో నిమగ్నమై హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పాస్పరస్ ను కలిపి తయారు చేస్తే వచ్చే ఫలితాలను పరీక్ష నాళికలో పరిశీలిస్తున్న తరుణ్..
“హాయ్! చాలా బిజీ గా ఉన్నట్టున్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయోగ శాలల్లో జీవితాలను అంకితo చేసుకున్న సైoటిస్టులు తాము కెమికల్స్ ను కరిగించుతూ ఉంటే వాటి ప్రత్యేక లక్షణాలను కోల్పోయి, మిగిలేది ఒక గాఢమైన పదార్ధo. అదే శక్తి. అదే మానసిక శక్తి తోడుగా ఎదిరించే, బెదిరించే చేతనా శక్తిగా మారుతుందనే నా నమ్మకం”.
“అవునండీ ! తధాస్తు! మీ నమ్మకం వమ్ము కాకూడదని కోరుకుంటున్నాను”.
*******************
పెద్ద భవనం, ఇంటి ముందు విశాల మైన స్థలం. గేట్ కి ఇరు వైపులా అశోక వృక్షాలు, లోపల మల్లె, గులాబీ లాంటి పూల మొక్కలతో చల్లని గాలివీస్తూ, శరణ్య ఇల్లంతా సందడిగా.. ముత్తయిదువులతో కళకళ లాడుతూ మహాలక్ష్మి రాకతో శ్రీ నిలయం అవుతుంది.
వాకిట్లో అడుగుపెట్టిన శరణ్యకు ఏదో పండుగ కళ కనపడుతుంది. ఆయింటి వంటల ఘుమ ఘుమ లకు అవుతున్న ఆకలి మరింత రెట్టింపయింది. రోజూ కనిపించే అమ్మ నాన్నలను చూస్తే ఆకలికి తొందర ఎక్కువ ఔతుంది.
ముంగిట్లో కనిపించిన నాన్నతో “హాయ్ నాన్నా! ఏమిటి ఈ సందడి? ఏమైనా పండుగా నాన్నా!"
“తల్లీ! నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా! అమ్మ ఎదురు చూస్తుంది” అంటుండగానే ఎదురుగా వచ్చిన అమ్మతో..
“ఏమిటీ విశేషం? కొత్తగా ఉంది. హా..”
“:కొత్త విశేషమే పెళ్లిచూపులు”.
“ఎవరికమ్మా అన్నయ్యకా? సరిగ్గా మంచి టైమ్ కే వచ్చాను. ఏరా అన్నయ్యా! నాకు తెలియకుండా పెళ్ళికొడుకువై పోతున్నావా?” అంటూ.. అన్న దగ్గరికి వెళ్ళబోతున్న శరణ్యను ఒక చేత్తో ఆపి, మరొక చేత్తో చెంపను పట్టుకుని, “తల్లీ! నీకేనమ్మా. సాయంత్రం పెళ్లి వారొస్తున్నారు. "
“ ఏమిటమ్మా ఇది? మాట వరసకైనా నాతో చెప్పకుండా,
నా ఇష్టం తెలుసుకోకుండా, అప్పుడే నాకు పెళ్ళేమిటమ్మా? నేను పై చదువులు చదువుదామను కుంటున్నాను. నా ఆశలకు, ఆశయాలకు అడ్డుకట్ట వేస్తున్నారమ్మా! "
“అవకాశాలు అందివస్తున్నపుడు ఏ అడ్డుకట్ట లుండవు. మీ నాన్నగారు అన్ని విషయాలు మాట్లాడారు. అబ్బాయి బాగా చదువుకున్నవారే, నీ భవిష్యత్తు కు అడ్డురాడు. పెళ్లయిన తర్వాత అయినా భార్యను .. చదివిస్తానని కూడ చెప్పినాడు. అలా మా అందరికి నచ్చాడు”.
“ఒకప్పుడు నీవు కూడా ఎన్నో ఆశలతో, నాన్న చేయి పట్టుకుని వచ్చి పెళ్లి అనే సంసారం లో మర బొమ్మ అయినావు. నాభర్త నాకు స్వాతంత్య్రం ఇస్తాడు, కోరికలు, ఇష్టాలు తీరుస్తాడు అని భ్రమ పడ్డావు. తన తల్లి తండ్రికి, కుటుంబానికి గౌరవం కోసం పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి ఒక పనిమనిషిని చేసాడు. అప్పుడప్పుడు నువ్వు అనుకునే దానివి గుర్తుందా? మా నాన్నకు నేను ఆడపిల్లగా కాక, మగ పిల్లవాడు గా పుట్టుంటే ఏ డాక్టరో, కలెక్టరో అయ్యేవాణ్ని అనుకునే దానివి”.
“ఏం మాట్లాడుతున్నావే? నేను ఆలా ఎన్నడూ అనుకోలేదు. నా వాళ్లు అని అన్ని సమకూరుస్తూ, సంతృప్తి తో జీవిస్తున్నాను. మీ నాన్న సాహచర్యం లో ప్రపంచం లోని ప్రేమలన్నిటిని పొందాను. ఉన్నత చదువులంటూ, ఉద్యోగాలంటూ, వ్యక్తిగతంగా నా వరకే ప్రయోజనాన్ని పొంది, గర్వo తలకెక్కి, కుటుంబానికిచ్ఛే ఆప్యాయతలను మరచి, స్వార్ధపరురాలుగా ఉండేదాన్ని”.
“ఇప్పుడు నాపట్ల స్వార్ధం తోనే చేస్తున్నావమ్మా! నా ఇష్టాన్ని తెలుసుకుని కూడా, నీ స్వార్ధం తోనే ఆలోచిస్తున్నావు. అయినా నిన్ననేమి లాభం. నీవు నాన్న చేతిలో ఆట బొమ్మవు”.
“ఏ బొమ్మలమైనా నీ అక్క తన ఇష్టంగా ప్రేమ అంటూ మా మాట వినకుండా చేసిన పనికి మీ నాన్న తల ఎత్తుకుని తిరగలేక పోతు న్నారు. ఇప్పుడు నీవు ఆయన నిర్ణయాలకు తల వంచి పరువును కాపాడుతావని ఆశతో ఉన్నాడు”.
“సరే అమ్మా! నీ మాటను కాదనలేను. మా ఫ్రెండ్స్ ను రమ్మంటాను. కొంచెం మానసిక బలం, ఉత్సాహం గా ఉంటుంది" అని తరుణ్, అక్షర లకు ఫోన్ చేసి రమ్మంటుంది.
తన అన్న చెప్పినట్లుగానే ప్రణవ్ ను తాను ఒకసారి ఎక్కడో చూసినట్టు గుర్తుకొచ్చింది. భూగర్భ పరిశోధనా సంస్థలో జియాలాజిస్ట్ గా సెమినార్ లో దూరం నుండి చూచింది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసారు.
“మీ నాన్నగారు మీ గురించి చెప్పారు. మీ ఉన్నత అభిప్రాయాలను గౌరవిస్తాను. మీరు ఆలోచించుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. తొందరేమి లేదు. మీకు ఇష్టమైతే కాల్ చేయండి”.
తరుణ్, అక్షర తో పరిచయాలు, పెద్దవాళ్ళ సంభాషణలతో పెళ్లిచూపుల తతంగం సాదా సీదాగా ముగిసింది.
***********************
హాస్పిటల్ నుండి వచ్చిన చందు, స్నేహితులతో తను పడిన స్థలంలో కూర్చుని ఆలోచించ సాగాడు. జరిగినది తల్చుకుంటే అతనికి భయమేసింది. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తే దానికి ప్రాణమే ఫణంగా పెట్టవలసి వస్తుం దేమో నన్నంత భయంకరంగా అనిపించింది.
హాస్పిటల్లో నా ప్రక్క బెడ్ అతను చాలా బాధతో తాను చేసిన వెధవ వేషాలు, అమ్మాయిలను ఏడపించడం, కాలేజీ లో ర్యాగింగులు శాడిస్టు పనులు, పసి పిల్లలను చెడగొట్టడం ముసలి వాళ్ళతో కూడా తనలో చెడు శక్తి స్వతంత్రoగ చెల రేగింది. దానితో చెడ్డ పనులను చేయించింది. మంచి వాళ్లకు హాని చేయిస్తుంది.
మంటకు గాలి తోడయితే, తన రూపాన్ని కోల్పోయి సమస్తాన్ని ధ్వoసం చేస్తుంది. కాలి బూడిద మిగులుతుంది. నాలో కూడా మంచి తనం బూడిదగా మారింది. నేను మంచివాణ్ణి, మంచి చేస్తానన్నా ఎవరూ నమ్మరు. నా దౌర్జన్యం సాగినంత కాలం సాగింది. ఇప్పుడు నన్ను చెడుకూడా అసహ్యంగా చూస్తుంది.
మంచిని ఉపయోగించుకోలేను, మనసున్న మనిషిగా సమాజం లో నిలబడలేను. శరీరం లో శక్తి తగ్గి బలహీనం తో ఉన్నా, ఆదరించే నా అనే వాళ్ళు లేరు.
ఎప్పుడైనా ఒక స్త్రీ చెడును ఎంచుకుని, తప్పుడు మార్గం లో జీవిస్తే నరక యాతన అనుభవించ వలసి వస్తుందని, తెలియక చేసినా, తెలిసి చేసినా, దుర్మార్గుల, కామాందుల దాడిలో అన్యాయంగా బలైనప్పుడు క్షోభ, సమాజం చిన్నచూపు స్త్రీ మాత్రమే అనుభవిస్తుంది.
మంచి ఎప్పుడైనా చెడు పైనే విజయం. అందువల్ల నేను చేసిన చెడువల్ల బలైన అమ్మాయిలు, స్త్రీలు తాము పొందిన బాధలన్నీ వికటాట్ట హాసం చేస్తూ తమ ప్రదేశాల నుండి నినాదాలను పంపిస్తూ నాలో భయాన్ని పుట్టిస్తున్నాయి. అనారోగ్యo తో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను”. అని కళ్ళ నీళ్లు తీసుకున్నాడు.
ఇప్పటి నుండి బుద్ధిగా మంచి పనులే చేద్దాం. ఆరోజు హెల్మెట్, కళ్లద్దాలతో ఉన్న నన్ను ఏ పెప్పర్ పౌడర్ ఏమీ చేయలేదు. నాలో చెడు శక్తికి చెంపదెబ్బలు, ఊపిరికి దెబ్బ కొంచెంలో తప్పి పోయింది. మా నాన్నకు సాయంగా ఊరి నుద్దరించే పనులు చేద్దాం” అంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు చందు స్నేహితులు.
************, ****
ప్రణవ్ కి కాల్ చేసి దగ్గరలో ఉన్న పార్క్ కు రమ్మని చెప్పింది శరణ్య.
“హయ్!ఎలా ఉన్నారు?"
“బాగున్నానండీ” అని ప్రణవ్ అనడంతో “ఇంట్లో పెళ్ళికి తొందర పెడుతున్నారు అమ్మా నాన్న”.
“పెద్దవాళ్లకు తొందర ఉండడo సహజమే. మీరు నన్ను అంగీకరించినట్లేనా చెప్పండి”.
ఇద్దరూ ప్రక్కప్రక్కనే నడుస్తున్నారు.
“మన కుటుంబాలు సంప్రదాయాలు, ఆచారాలను అతిక్రమించకుండా, తరువాత తరాన్ని కూడా తమ ఇష్టాలకు, కోరికలకు అనుగుణంగా నడచుకోవాలని ఆశిస్తారు”.
“అందులో తప్పేముందండీ మంచిదేగా శరణ్య గారు.
ప్రేమ అంటే ఏమిటో తెలిస్తే, ప్రపంచo లోని అనంత మైన ప్రేమను తెలుసుకుంటారు. ఇద్దరు క్రొత్త వ్యక్తుల వివాహ బంధం, ప్రేమ బంధంగా మారడానికి తమ జీవితమంతా సరిపోదు. కేవలం కుటుంబం, సమాజం కోసం గిరిగీసుకుని బ్రతుకవలసి ఉంటుంది”.
“పాశ్చాత్య దేశాలు భారతీయ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయండీ అందుకే మరి”.
ఐస్క్రీమ్ బండిని పిలిచి ఇద్దరూ కప్ ఐస్క్రీమ్ తింటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ, నాలుగు మాటలు.
“ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి” అంది శరణ్య.
“మనము ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆప్రేమ కళ్ళను సంతోషం తో వెలిగిస్తున్నాయి. ఇప్పుడు ఆప్రేమ ప్రపంచమంతా తిరిగినట్లు తెలుస్తుంది”.
“శరణ్య అలా మాట్లాడుతుంటే ప్రణవ్ ఉత్సా హంగా వింటున్నాడు. ప్రతి చెట్టు కదలికలో చల్లని గాలి వస్తుంది. ఆగాలికి పక్షుల్లో వేగం పెరిగింది. తమకు సురక్షిత స్థావరాలను వెతుక్కుంటున్నాయి. వ్రతి ప్రాణి స్పందించినపుడు వర్షం జల్లుతో భూమి దాహం తీరింది. మన ఇరువురి కలయికకు ఈ ప్రదేశ మంతా పులకించింది.
ఇవాళ ఇక్కడ నువ్వేం చేసావు? అని అడిగితే మామూలుగా ఏదో మాట్లాడుకున్నాం తిరిగాము అని చెపుతాము. ఒక్కొక్క మాటకు ఒక మధుర భావన. అదే ప్రేమంటే. ఆ మాటలే ప్రేమకు పునాది. భావాలతో బంధానికి అనురాగం, ప్రేమ పుట్టుతాయి శరణ్య గారూ” అనగానే
“శరణ్య అనండి చాలు ప్రణవ్” అనడంతో, ఒకరి గురించి ఒకరు ఆలోచించు కోవడం, ఒకరికొకరు కావాలి అనుకోవడం, ఒకటే ప్రాణంగా బ్రతకడం పరమార్ధం కలిగిస్తాయి. కలిసిన మాటలు కౌగిలి వరకు వచ్చాయి.
“శరణ్య, నేను నచ్చానా?” అనగానే చిరు నవ్వుతో సిగ్గుపడింది.
ప్రణవ్ శరణ్య హృదయం పై తలవాల్చి అమృతా నందం పొందాడు.
“మీరు భూగర్భ శాస్త్రవేత్తలు కదా! స్త్రీ హృదయాన్ని శోధించారు" అంది నవ్వుతూ.
“నేను భూమి వరకే, మీరు ఆకాశ మంత ఎత్తుగా కన్ఫడుతున్నారు”.
శరణ్య గలగలా నవ్వుతుంటే, ప్రణవ్ ఆ నవ్వులు నాకే సొంతం అంటూ ముద్దులతో మూటగట్టాడు.
చీకటి పడే వేళకు చేరారు ఇళ్లకు.
****************
కొన్ని వారాలలోనే పెళ్లిఘఢియలు దగ్గరపడ్డాయి. గారాల కూతురు, తన గౌరవాన్ని నిలబెట్టే ఆదర్శాలు నింపుకుని పెళ్లి పీటలెక్కబోతుందని, పరిచయమున్న వారందరికి పెళ్లి పత్రికలు పంచాడు శరణ్య నాన్న గారు.
తను ఊరిలో పెద్ద కాంట్రాక్టర్ కావడం మూలాన అధికారులు, ఆఫిసర్స్ తో పాటు వామన రావు ఇంటికి వెళ్లి గౌరవంగా ఆహ్వానిం చాడు.
***************
మరునాడు పెళ్లి కూతురు ఫోటో కార్డు పై చూసిన చందుకు చమటలు పట్టాయి. విషయమంతా ఫ్రెండ్స్ కి చెప్పి, నాన్నకు చెప్పొద్ధన్నాడు. పెళ్లి సమయానికి తండ్రి బలవంతం తో చందు కూడా వెళుతూ, తన స్నేహితులను రమ్మన్నాడు.
ఘనంగా జరుగుతున్న పెళ్ళిలో, అక్షర, ప్రణవ్ లు చాలా అందంగా, ఆకర్షణీయ జంటగా అందరినీ ఆకట్టుకున్నారు. వేద మంత్రాలతో మంగళ సూత్రధారణ, తళంబ్రాల వేడుకలు, పెద్దలందరు అక్షింతలతో, కానుకలతో వేదిక నెక్కి ఆశీర్వదిస్తూ, హడావుడిగా ఉంది.
శరణ్య కళ్ళు చందు వాళ్లపై పడ్డాయి. కోపం లోపలి నుoడి వస్తుంది. ఇప్పుడు వాణ్ని ఏమన్నా గొడవ ఔతుంది అని కంట్రోల్ చేసుకుంటుంది. తరువాత వాడి సంగతి చూడాలి, ఎంత ధైర్యంగా పెళ్ళికే వచ్చాడు. మనసులో అనుకుంటుంది. తండ్రి తో సహా అక్షంతలు వేయడానికి దగ్గరికి వచ్చాడు.
“ఛీ నువ్వా?” అనే లోపే కాళ్లకు నమస్కారం పెట్టి “క్షమించండి, నా తప్పు తెలుసుకున్నాను. మేమంతా మారిపోయాము. నమ్మండి” అని గిఫ్ట్ తోపాటు తన సంఘ సేవ, స్త్రీ రక్షణ, సంక్షేమ కార్యక్రమాల ఆల్బమ్ ను ఇచ్చి మరో సారి సారీ చెప్పాడు.
విషయం అంతా తెలుసు కుని క్షమించి, భర్తకు పరిచయం
చేసింది. ఆందోళన, ఆవేశం తగ్గి స్నేహితులు అయ్యారు.
*****************
ప్రణవ్ తో కలిసి, స్త్రీ - స్వయం రక్షణ తో దుర్మార్గాలను ఎదుర్కో వడమే కాకుండా, గాలి తంత్రుల సహాయంతో సిగ్నల్స్ ద్వారా రక్షణ సిబ్బంది కి ఆ ప్రదేశం, సమాచార విషయాలు వెంటనే తెలుసుకునే పరిశోధనలు ప్రారంభించింది.
ఆధునిక యుగo లో సాంకేతిక మార్పులు వస్తున్నప్పటికి మనిషి లో సత్వ గుణాలు నశించి పోతు న్నాయి. స్త్రీ గొంతు "నవయుగ నినాదం" కావాలి.
సమాప్తం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments