కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Navvul Navvul Navvullo Puvvul Puvvul' Telugu Story Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
సమయం సందర్భం లేకుండా జోకులు వెయ్యడం, కవితలు, పద్యాలూ చెప్పడం ముత్యాల రాజుకు అలావాటు.
భార్య కూడా అతనిలా మాట్లాడటంతో ఖంగు తిన్నాడు.
సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం.
సికింద్రాబాద్ నుండి శ్యామ్ లాల్ వేపు వెళ్ళే టెన్- ఏ- బస్ ప్రయాణీకులతో క్రిక్కిరిసి ఉంది. ఆ సమయంలో వచ్చీ పోయే బస్సులన్నీ తొక్కిసలాటకు గురవుతూ ఓమోస్తరు గిడ్డంగుల్లా అలాగే ఉంటాయి. సుకన్య ఇటు లేడీస్ సైడ్ వేపునుంచి వెళ్ళి కుర్చుంది. అటు జెంట్స్ మధ్య ముత్యాలరాజు కూర్చున్నాడు. ఇంకా కొందరు ఇనుప కడ్డీని పట్టుకుని నిల్చుని కుదుపులకు ఊగుతూ జోగుతున్నారు. అప్పుడు సందట్లో సడేమియాలా మదన రస్పుటీన్ గాడెవడో ఆడాళ్ల గుంపులోకి దూరి దొంగాటకు పూనుకున్నట్టున్నాడు. వాడు పెట్టే కితకితలు తట్టుకోలేక గామోసు హైస్కూలు అమ్మాయిలు జడుసుకుని కెవ్వున అరవడం- అది గమనించిన సుకన్యా మరో ముగ్గురు స్త్రీలూ తటాలున లేచి ఆ దుండగుణ్ణి పట్టుకోవడం ఒకేసారి జరిగాయి.
”వెధవ రాస్కల్స్! సీటు దొరికినా దొరకనట్టు ఆడాళ్ళ మధ్యకు చొచ్చుకు వచ్చి నిల్చోవడం- సందు చూసి ఆడాళ్ల నడుములూ పొత్తి కడుపులూ తడమడం- - ఈ రోజు నిన్ను విడిచి పెట్టేది లేదంటే లేదు” అంటూ వాడిపైకి సివంగుల్లా దాడికి దిగారు. అప్పుడు ఉన్నపాటున- మగాళ్ల వేపున నవ్వుల రవ్వలు ఫెళ్ళుమ న్నాయి.
ఎవరో పద్యం పాడి వినిపిస్తున్నారు- “పాగ పచ్చడంబు- పైకి కుసంబును- పోగు, లుంగరములు- బొజ్జ కడుపు కలిగినట్టి వాని కందరు చుట్టాలు- విశ్వదాభిరామ వినుర వేమ”
వేమనయోగి పద్యం లోని భావాన్ని సగం అర్థమయీ- సగం అర్థం కాకుండానే పొట్టలు పట్టుకుని నవ్వేస్తున్నారు అక్కడి మగరాయళ్ళు. ’ఇంతటి రణగొణ కేకల మధ్య ఆ పాడేది ఎవరు చెప్మా! ’అని అందరితో బాటు సుకన్య కూడా తెలెత్తి చూసింది. ఇంకెవరు- స్వయాన తన పతిదేవుడే! అందరూ ఆమెలాగే అటుతొంగి చూస్తున్నంతలో ఆ మదన దుండగుడు ఆడాళ్ల పట్టునుండి తప్పించుకుని ఒక్క ఉదుటున బండి మోషన్లో ఉన్నప్పుడే గెంతేసాడు రోడ్డుపైకి.
సుకన్య కు ముత్యాలరాజుపైన గంపెడంత కోపం ముంచుకు వచ్చింది. సాహిత్యం పట్ల ఎంతటి అనురక్తి ఉంటే మాత్రం- పద్యాన్నిఎక్కడ పాడాలి- ఎక్కడ పాడకూడదన్న విచక్షణా విషయజ్ఞానమూ తన మగరాయుడికి ఉండవద్దూ! అర్థ రాత్రిపూట మద్దెల దరువంటారే—అటువంటిదే మరి ఇది కూడాను. అలా పారిపోయిన కొంటె వెధవ అక్కడితో ఊరకుంటాడా! ఇంకెన్ని బస్సులెక్కి ఇంకెన్ని కిసుబుసు పనులు చేయబోతున్నాడో! పబ్లిక్ స్కూలు బస్టాపు వద్ద దిగిన తరవాత కోపావేశపు టెంపోని తగ్గిపోనివ్వకుండా భద్రంగా బిగబట్టుకుని ఇల్లు చేరింది సుకన్య.
ఇంట్లోకి వచ్చీ వచ్చిన వెంటనే అందుకుందామె- “అసలు మీకు మీరేమనుకుంటున్నారు మిస్టర్ ముత్యాలరాజూ! శ్రీనాథుడనుకుంటున్నారా? లేక వేమనవారి యేకైక వారసులనుకుంటున్నారా? ఎక్కడ బడితే అక్కడ కవితలల్లడం పద్యాలు పాడటం వల్ల తెలుగు సాహిత్యపు కావ్యగౌరవాన్ని కించపరుస్తున్నారన్నది మీకుతెలుసా! ”
అతడు నివ్వెరపోతూ- “నేనేం చేసానోయ్?” అని అడిగాడు.
“అంతా మీరే చేసారు. మీ వల్లనే ఆరౌడీ రోమియో తప్పించుకుపోగలిగాడు“అంటూ అప్పుడక్కడకు చేరుకున్న అత్తగారు మాంచాలమ్మకు బస్సులో జరిగిన దంతా వివరించి చెప్పింది.
అంతా విన్నమాంచాలమ్మ, కొడుకు వేపు తల తిప్పి అంది- “అదేంవిట్రా అబ్బాయీ! పద్యమే గద్యమో బస్సులోనట్రా పాడతారు! చూడు నీపద్యం పుణ్యమా అని ఆ ప్రబుధ్ధుడు తప్పించుకున్నాడు”
ముత్యాలరాజు తల్లి వేపు తేరి చూస్తూ బదులిచ్చాడు“అమ్మా! దీని మాట ఉన్నదున్నట్టు వినకే! నా ప్రక్కన కూర్చున్న ప్యాసింజర్ అంతటి ఉక్కపోతలోనూ నడిరోడ్డున టిప్ టాప్ గా సూటు వేసుకు వెళ్తూన్నఒకతణ్ణి చూసి విసుక్కుంటూ చూపిస్తేనూ- అప్పుడా పద్యం ఆశువుగా వచ్చేసింది. దానికదే నాకు తెలియకుండానే నానోట వచ్చేస్తే నేనేమి చేయను? ఆటకత్తెకు ఆడటంరాక మద్దెల పైన పడి ఘోషించినట్లుంది. వెధవను గట్టి పట్టుతో బంధించలేకుండా రెండు తగిలించకుండా విడిచి పెట్టేసి నాపైన లంకించుకుంది నీ కోడలు“ .
అప్పుడు మాంచాలమ్మ కొడుకూ కోడలు మధ్య సయోధ్యకు ఉపక్ర మించింది- “ఔను సుకన్యా! వాడు కావాలనా పద్యం అందుకున్నాడు! దానికదే జమ్మల మడుగులా పొంగుకు వస్తే వాడేమి చేస్తాడు? ఐనా అలా పొట్టలు చెక్కలయేలా పద్యం సగం అర్థమయీ సగం అర్థం కాకుండా నవ్వడం ఆ బస్ ప్యాసింజర్లదే తప్పంటాను”.
తల్లి వత్తాసుతో ముత్యాలరాజు పుంజుకున్నాడు- “అందుకే చెప్తున్నాను మళ్ళీనూ- ఒకటి రెండు సంఘటనలాధారంగా నా సాహిత్యాభిమానాన్ని శంకించే అధికారం నీ కోడలు పిల్లకు లేదని. అంతే కాదు. మాటకు పాటకూ అర్థమయీ అర్థం కాకుండా ఎవరో ఘొళ్ళున నవ్వేస్తే దానికి పూచీ నేను కాను! ”
“అలాగా! అత్తయ్యా! మీ అబ్బాయి చెప్పే నాజూకు మాటలు నమ్మకండి. చేసేది చేసేసి చెప్పేది చెప్పేసి
పెదవి పైన హాస్యరేఖ కన బర్చకుండా తప్పుకుంటాడు“అప్పుడు కోడలుపిల్లను అలా ఒంటి నిట్రాటలా నిలబెట్టి ఒంటరిదానిని చేయడం బాగుండదను కుంటూ- “మీ వాడి విషయంలో ఇంకేమైనా జరిగిందా సుకన్యా?”అని అడిగింది మాంచాలమ్మ.
కాసేపాగి- వేగాన్ని అందుకుంది సుకన్య- “కాక- - మన అపార్టుమెంటు బిల్డర్ మహాశయుడు మన ఫ్లాట్ ఓనర్లకు సరైన పార్కింగు ప్లేస్- క్లబ్బు హాలు కట్టకుండా ఉడాయించాడా! అతడి దుశ్చర్యను ఖండిస్తూ మేమందరమూ బైట గుమికూడాము. ఓనర్స్ అసోసియేషన్ వాళ్లు హాజరు పట్టీ లో అందరివద్దా సంతకాలు తీసుకున్నారా- - అప్పుడు మీ అబ్బాయేమి చేసాడో అడగండి”.
తనేం చేసాడు- అన్నట్టు ముఖం పెట్టి చూసాడు ముత్యాలరాజు.
”నా నోట చెప్పించాలనేగా అలా ముఖం పెట్టారు? సరే- అదీ నేనే చెప్తాను. కాసేపట్లో అక్కడి వాళ్లందరూ పట్టీలోకి చూస్తూ గుసగుసలాడసాగారు” .
అప్పుడు మాంచాలమ్మ కొడుకు వేపు తిరిగి ‘ఏం చేసావురా ముత్యాలూ ?’అని అడి గింది. తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడతడు.
”నేను చెప్తానత్తయ్యా! అపార్టుమెంటుల్లోకి వచ్చిన వాళ్ళలో దాదాపు తొంబై శాతం మంది ఇక్కడ చదువుకుని విదేశాలలో స్థిరపడ్డవారూ- మరికొందరేమో అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగాలు వెలగ బెట్టిన వారని మనకందరకూ తెలుసు కదా! “
”ఔను కదూ- అన్నట్టు తలూపింది మాంచాలమ్మ.
‘కాని ఇదేమీ తెలియనట్టు వాళ్లను తికమక పెట్టేస్తుంటాడు మీ అబ్బాయి’
ఎలా- అన్నట్టు కనుబొమలెగరేసి చూసిందామె.
అప్పుడు ముత్యాలరాజు అందుకుని బదులిచ్చాడు- “నలుగురితో నారాయణా అనకుండా తెలుగులో సంతకం చేసాను. అది తప్పా?”
“అబధ్ధమాడకండి. మీరు సంతకం మాత్రం తెలుగులో చేసారూ! ఊరూ పేరూ- ఫ్లాట్ నెంబరూ- అన్నీ తెలుగులో వ్రాసివ్వలేదూ? మీరిచ్చిన భోగట్టా తెలుసుకోలేక వాళ్ళెంత ఇబ్బంది పడిపోయారో తెలుసా? మీటింగ్ ఆగిపోయినంత పనయింది”
“నువ్విప్పుడు కొంచెం ఆగుతావా సుకన్యా! రాను రాను నీ పోకడ శ్రుతి మించి రాగాన పడుతున్నట్లుంది. నా మాతృభాషలో సం తకం చేసి నా తల్లి భాషలో వివరాలు వ్రాయగల అధికారం నాకుంది. కారణాలు యేమైనా సరే, తెలుగువారై ఉండి తెలుగు తెలి యక పోవడం వాళ్ల లోపం. తెలుగు లోపం కాదు”.
ఈసారి మాంచాలమ్మకు తను నిర్వహించాల్సిన మధ్యవర్తిత్వం జ్ఞాపకం వచ్చి నట్లుంది- “ఔనమ్మా
సుకన్యా! తెలుగు వారై ఉండి తెలుగులో సంతకం చేయడమేగా సబబూ! ఇందులో అబ్బాయిని తప్పు పట్టడమెందుకూ?”.
సుకన్య అత్తయ్యకు సమీపంగా వచ్చింది. “మేటర్ అది కాదత్తయ్యా! మీ అబ్బాయి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పెదాల పైన నవ్వుల్ని పూయిస్తూనే నుదురుతో వెక్కిరించగలరు. సరే- అదలా ఉంచి నావేపు సూటిగా చూసి చెప్పండి. పరిస్థితి అంత టెన్ష్ గా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆ సిమెంటు చప్టాపైన కూర్చున్న లేడీస్ వద్దకు వెళ్ళి జోక్ కొట్టలేదూ! వాళ్ళు పకపకా నవ్వలేక లేచి నిలబడలేక తంటాలు పడలేదూ! ”.
ఈసారి విసుగ్గా కొడుకు వేపు చూసింది మాంచాలమ్మ- ‘అటువంటి పరిస్థితిలో చలోక్తులా?’అని నిలదీస్తున్నట్టు. తల్లి చూపుకి ముత్యాలరాజు నిజంగానే చిన్నబుచ్చు కున్నాడు. అంత కంటే ఎక్కువగా విసుగుదల చూపిస్తూ అన్నాడు- “అప్పుడు జరిగింది వివరించి చెప్తాను. ఇద్దరూ చెవులు రిక్కించి వినండి. ఆ ఆడబృందం హోరాహోరీగా సాగుతూన్న సమావేశ వ్యవహారాలు గమనించకుండా దూరంగా జరిగి ఊసులాడుకుంటున్నారు. అది నాకు నచ్చలేదు. నేను నిదానంగానే వెళ్లి ఒకే ఒక మాట న్నాను- ‘ఇంతలా అతలకుతల మైపోతూన్న పరిస్థితిలో ఇంతటి ప్రశాంతంగా ఇంతటి కమ్మగా ఊసులాడుకోవడం మా మగాళ్ళకు ఈ జన్మలో రాదు సుమా! ’ అన్నాను. అంతే! ఇంత చిన్నటి మాటకు బట్టల తాను అమాంతం బైట పెట్టినట్టు వాళ్ళలా పగలబడి నవ్వుతారని నాకెలా తెలుసు?”.
ఈసారి మరొక మారు మాంచాలమ్మ కలుగచేసుకుంది- “ఔను సుకన్యా! నువ్వు మరీ ఇదయి పోతున్నావు గాని- ఆడాళ్ళకు నవ్వడమూ ఊసులాడటమూ నేర్పాలా యేమిటి చేపకు ఈత నేర్పిన సామెతలా! సరే- ఇప్పుడు నీ వద్దకే వస్తాను. వీళ్లు నవ్వేస్తున్నారూ- వాళ్లు నవ్వే స్తున్నారూ అని తెగ ఇదయిపోతున్నావే—ఏదీ! ఓసారి నీ తొలి కాన్పు రోజుల్ని తరచి చూడూ! నేను చెప్పను. నువ్వే జ్ఞప్తికి తెచ్చుకుని చెప్పు” .
తనేమి చేసానన్నట్టు విస్మయంగా అత్తగారి వేపు చూసింది సుకన్య.
‘ఇదీ నేనే చెప్పాలా! ఖర్మ! నీకప్పుడు నాలుగు నెలల కడుపు. అమావాస్య- అర్థరాత్రి. పడక గదినుండి గుక్క తిప్పుకోకుండా నవ్వుతున్నావు. నేనేమో- అప్పుడో ఇప్పుడో ఆపేస్తావని యెదురు చూసాను. అబ్బే- ఎక్కడాపావని?నాకు భయం వేసింది. గర్భిణీ స్త్రీవి. గుక్కతిప్పుకోకుండా అలా నవ్వు తుంటే ముఖం తిరిగి పడిపోతే- ఇంకేమైనా జరిగితే- - విషయం తెలుసుకో కుండా వియ్యంకుడూ వియ్యంకురాలూ మమ్మల్ని ఆడి పోసుకోరూ! నేనిక ఉగ్గబట్టలేక పరుగున వచ్చి చూద్దును కదా- నీ ఒంటి పైన సగం బట్టలు లేనే లేవు. నన్ను చూసైనా ఆపావా- లేదు. నేనుగా వచ్చి నీ చీర సర్ది నిన్నొక ఊపు ఊపితే గాని ఈ లోకంలో పడలేదు.
అప్పుడు నీ మగాడు కొంచెం కూడా నవ్వకుండా ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు. దానికేమంటావు?ఆడాళ్లకు కారణం ఉన్నా లేకపోయినా పడీపడీ నవ్వడం అలవాటే- అదను దొరకాలే గాని- - ”
అత్తగారి ఆ ఒక్కమాటతో సుకన్య సిగ్గుతో మొగ్గయి పోయింది, రెండు చేతులతోనూ ముఖం కప్పుకుని- “ఇప్పుడవన్నీ చెప్పకత్తయ్యా! సిగ్గేస్తుంది“అంటూ చేతులతో ముఖం కప్పుకుంది.
మధ్యాహ్న సమయం కావటాన ప్రవీంద్ర సూపర్ మార్కెట్ లో జనసందడి అంతగా లేదు. సుకన్య విజయనగరం మాడ వీధిలోని సంప్రదాయకమైన కుటుంబంలో పుట్టి పెరిగిన స్త్రీ కావటాన ఉమ్మడి కుటుంబంలో ఒదిగి మనుగడ సాగించిన ఆడది కావటాన వంటా వార్పు విషయాలలో ఎక్కువ ఆసక్తి. మీదు మిక్కిలి అక్కర- ఆమె ఏమూలనో నిల్చుని పచ్చని కాయగూరల్ని- - ముఖ్యంగా నవనవళాడే గుత్తి వంకాయల్ని జాగ్రత్తగా ఏరుతూ అనుమానం కలిగి నప్పుడల్లా కొనగోటితో గుచ్చి చూస్తూ ప్లాస్టిక్ గంపలో వేస్తూంది. అప్పుడు తన వెనుక ఎవరో నిల్చున్న చప్పుడు విని పించి వెనక్కి తిరిగి చూసింది. ముత్యాలరాజు అసహనంగా ముఖం పెట్టి నిల్చున్నాడు. సంగతేమిటన్నట్టు కళ్ళలోకి చూసిందా మె ప్రశ్నార్థకంగా.
‘నా కంతటి ఓర్పు లేదోయ్“ అతడి మాట విని “దేంట్లో ?” అని అడిగిందామె.
అతడు ఇబ్బందిగా ముఖం పెట్టి అన్నాడు- “అదేనోయ్! నువ్వలా వంకాయల్ని బీరకాయల్ని పువ్వుల్నీ అంత ఓర్పుగా నిదానంగా ఆచి తూచి ఎంపిక చేయడం - - అందరూ నీలా ఆమూలాగ్రం ఎంపిక చేస్తూ ఇక్కణ్ణించి కదలకుండా కూర్చుంటే సూపర్ మార్కెట్ గతేమవు తుంది?” .
అప్పుడామె ఎంపిక చేసిన కాయగూరల్ని ప్లాస్టిక్ గంపలో పోసి అతడి దగ్గరకు వచ్చి అతడి వేపు షార్పుగా చూసింది. ”నేనిలా ఓర్పుగా కుదురుగా మంచివీ చెడ్డవీ చూసి తాజా కాయగూరల్ని తెచ్చి వంట చేయడం వల్లనే మీరూ మీ ఇద్దరు బిడ్డలూ లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. ఏదో చేతికి దొరికింది దొరికినట్టు తీసుకువచ్చి వంట చేసి పారేస్తే, రుచిమాట దేవుడెరు గు- పుచ్చిపోయిన కాయలతో అనారోగ్యం సోకి ఒళ్ళు గుల్లవడం ఖాయం. ఇక్కడ కాయగూరల్ని వెతికేది నేను- మధ్య మీరు తెగ ఇబ్బంది పడిపోతున్నారు గాని- నేనొకటి అడుగుతాను. చెప్తారా సార్?”
“ఇదేమిటి- ప్రశ్నల జవాబుల సమయమా! సరే అడుగు”
“పెళ్ళాం కాయగూరలు ఎంపికి చేసుకుంటున్నప్పుడు అక్కడ కాస్తంత ఓపిగ్గా నిల్చోవడానికి వీలవడం లేదంటున్నారుకదా! మరి మీకు దేంట్లో ఓర్పు ఉంటుందంటారు?రాత్రి పూట ఇద్దరమూ ఒంటరిగా ఉన్నప్పుడా మీకు దండిగా ఓర్పు ఉంటుంది! ” ఆ మాటకు ముత్యాలరాజు కళ్లు పెద్దవి చేసుకుని చూసాడు.
”అదేంవిటోయ్ అంత షార్పుగా పడక గది వ్యవహారాలు ఇక్కడ ఇంత బాహాటంగా మాట్లాడేస్తున్నావు! హర్రర్ సినిమాలు రొమాంటికి టీవీలు చూసి చూసి తెలుగాడాళ్ళు మహ బోల్డుగా తయారవు తున్నట్టున్నారు. సరే- నీ పాయింటుకి నా పాయింటు చేరుస్తాను- బదులియ్యి. నీకు మనిద్దరి యేకాంతమూ ససేమిరా నచ్చదు కదూ?” .
ఆమె విసుగ్గా ముఖం పెట్టింది- “నేనలా అనలేదు. నాకు దానికీ ఓపికుంటుంది- ఇంటి ఇల్లాలుగా ఇంటి వ్యవహారా లలోనూ ఓపికుంటుంది. నాకు మీలా కాదు ఓపికన్నది అందులో మాత్రం ఉంటుందనడానికి- - “అంటూ చకచకా నడచి వెళ్లి ఓ మూలనున్న ప్లాస్టిక్ స్టూలు తెచ్చి అతడి ముందుంచింది- కూర్చోమని సైగ చేస్తూ.
”ఒక్క నిమిషం ఆగు! ”అని సుకన్యను ఆపాడతను కూర్చోకుండానే. ఏమిటన్నట్టు కళ్ళె త్తి చూసిందామె.
”ఇంత బాహాటంగా స్వంత విషయాలు ఎడాపెడా మాట్లాడేస్తు న్నావే- వీటి పర్యావసానం గురించి కొంచెమైనా ఆలోచించావా! పైడమ్మ తల్లి గుడిలో భవ్యంగా వివాహం చేసుకున్నామే- అప్పటి రోజులు కావు యిప్పటివి. ఈ కాలపు కుర్రాళ్ళు చిచ్చిర పిడుగులు- - ముఖ్యంగా ఆ విషయంలో- - సాకు దొరికితే చాలు- కదం తొక్కే గడుగ్గాయలు. కొక్కో శాస్త్రం చదువుకున్న కామ దురంధరులు. ఇక్కడెక్కడైనా పొంచి చూసి అటు వంటివాళ్లు గాని నీ సెక్సీ మాటలు వినుంటే ఏమవుతుందో తెలుసా?”అతడి మాటలకు సుకన్య చెదరలేదు.
ముఖంలోకి ముఖం పెట్టి అంది- “ఏమీ అవదు. నేను మూడవ మనిషితో ముచ్చాట్లడటం లేదు. కట్టుకున్న మొగుడితోనే చెణకులు విసురు తున్నాను. ఎవడికీ నా వద్ద తోకాడించగల ధైర్యం ఉండదు. ఒక వేళ ఎవడైనా మంకుతనంతో వచ్చి తోకాడిస్తే ఏమవుతుందో తెలుసాండీ- ముంగిట పళ్లు రాలిపడతాయి. మీరిక్కడ నిశ్శబ్దంగా సేద తీర్చుకోండి. అది చాలు”.
సుకన్య ఆవేశం చూసి అతడు చల్లబడి ప్లాస్టిక్ స్టూలు పైన కూర్చున్నాడు. సుకన్య యేరి యెంపిక చేసుకున్న దినుసులన్నీ వెంట తెచ్చుకున్న సంచీలలో కుదురుగా పేర్చుతూంది. ముత్యా లరాజు బిల్ సెక్షన్కి వచ్చి బిల్ జెనరేట్ అయింతర్వాత పర్సులోనుంచి డబ్బులు తీసి లెక్క పెడుతున్నాడు. అప్పుడు వెనుక నుంచి ఫెళ్ళు ఫెళ్లున నవ్వులు వినిపించాయి. అమ్మాయిలెవరో బృందావనంలోని గోపకాంతల్లా జోక్స్ పేల్చుతూ విరగబడి నవ్వుతూ అంటున్నారు- “ఏమిటే నీ తంతు? కాయగూరలు ఎంపిక చేయడంలో ఇంత జాప్యమా! డ్యూటీ అన్నది ఎప్పుడూ ఖరాఖండీగా చేయాలే యంగ్ లేడీ! పగటి పూట ఓపికుండదు. రాత్రి పూట మాత్రమే ఓపికుంటుందంటే కుదురుతుందా? ఓపికన్నది కాల పరిమితులకు తావు లేకుండా ఎప్పూడూ ఉండాలే పిచ్చి దానా! ”
ఆ మాటతో ముత్యాలరాజుకి ఝలక్ తగిలినట్లనిపించింది. తన గురించేరోయ్! తమ భార్యా భర్తల మాటలు ఇక్కడెక్కడైనా మగ పిడుగులు వింటారని- విని స్త్వైర్య విహారం చేస్తారనుకున్నాడు. చుట్టు ప్రక్కల ఆడ పిడుగులు కూడా ఉంటారని- అక్కడెక్కడైనా పొంచి చూస్తుంటారన్నది అతడికి తోచనే లేదు! భార్యాభర్తల మాటలు పొంచి వినడమే తప్పు- అది చాలదని కమెంట్సు కూడానా! ఎంతటి తెగింపుతో మాట్లాడు తున్నారీ నవత రపు నారీమణులు- - ఇప్పుడు తెలుస్తూంది ఆ మహాతల్లికి- అనుకుంటూ తిరిగి చూసాడు. ఆశ్చర్యం! సిగ్గుతో ముడుచుకుపోవడం మాట అటుంచి- సుకన్య ఇసుమంత కూడా చెదర లేదు
సరికదా—చీర కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుని గుక్కతిప్పుకోకుండా నవ్వుతూంది! ముత్యాలరాజు ముఖం అదోలా పెట్డి గుచ్చి చూసాడు. అప్పటికీ ఆపలేదు. ఇంకా నవ్వుతూనే ఉంది సుకన్య!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
Comentarios