top of page
Writer's pictureSujatha Swarna

నీ రాక కోసం



'Nee Raka Kosam' - New Telugu Story Written By Sujatha Swarna

Published In manatelugukathalu.com On 28/06/2024

'నీ రాక కోసం' తెలుగు కథ

రచన: సుజాత స్వర్ణ


ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాన్న తనని పరిచయం చేసాడు. నాన్నతో తనని బాగా చూస్తుండేదాన్ని. అందుకేనేమో ఆ వయసులోనే తన మీద నా మనసు పారేసుకున్నాను. రోజూ పొద్దున్నే సుప్రభాత సూర్యుడిలా తన పలకరింపులు. తన కోసం గుమ్మం దగ్గర నా ఎదురు చూపులు. ఈనాటిదా మా బంధం. నాలుగు దశాబ్దాల విడదీయరాని అనుబంధం. 


తనపై అభిమానం నాతో పాటే పెరిగింది. అత్తారింటికొచ్చినా కూడా అణువంతైనా తరగలేదు. తనని చూసాకే మిగతా పనులన్నీను. కాఫీ ఆలస్యమైందని అత్తగారి రుసరుసలు, శ్రీవారి అలకలు, అప్పుడప్పుడు మాటల యుద్ధాలు.. అయినా తనని వీడలేదు నేను. 


తన రాక ఆలస్యమైతే తన నామమే జపిస్తుంటాను. తనకోసం తపిస్తుంటాను. తనని చూడగానే చంద్ర కిరణాలు సోకి పులకించిన కలువనవుతాను. తన రాకతో ఉద్యానవనంలో విహరించే భ్రమరాన్నవుతాను. 


తను నాకోసం ఎన్ని కబుర్లు మోసుకొస్తాడో!! నా ఒడి చేరి నన్ను అలరించే ప్రియసఖుడవుతాడు. నా కరకౌగిలిలో ఒదిగి నాలో నవరస భావాలు కలిగించి నన్ను మురిపిస్తాడు. కాలాన్ని మైమరపిస్తాడు. ప్రపంచాన్ని పరిచయం చేసి దేశమంతా విహరింపజేస్తాడు. తన జ్ఞాన సుమ సౌరభాలలో నన్ను ఓలలాడిస్తాడు. నా అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞానజ్యోతులు వెలిగించే దీపం, నా జీవితానికి మార్గదర్శి తనే. తన సాహచర్యం నాకు లభించిన ఓ గొప్ప వరమనుకుంటాను నేను. 


తను రాని నాడు నా మనసంతా తన ధ్యాసే నిండుతుంది. ఆ దిగులుతో కాలుగాలిన పిల్లినవుతాను. కాళీ కాఫీ కప్పునవుతాను. మరునాడు తనని చూడగానే వెన్నెలకై వేచిన చకోరంలా మనసారా ఆహ్వానం పలుకుతాను. తనని కళ్ళతోనే ఆస్వాదిస్తాను. ఆ ఊసులతో రోజంతా గడుపుతాను. ఒంటరితనంలో తనే నాకు తోడు. ప్రయాణంలో తనే నాకు కాలక్షేపం. 


ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించే ముసలం పుట్టింది కదా! మనిషిని మనిషే అనుమానించే గడ్డు పరిస్థితి దాపురించింది. అదే కరోనా మహమ్మారి కలకలం. దేశమంతటా లాక్ డౌన్ అయినా తనకోసం నా ఎదురు చూపులు ఆగలేదు. ఇంట్లో వాళ్లు తనని ఇంటికి రానిస్తే బాగుండదని, ఒకవేళ వచ్చినా కొంత సేపు బయటే ఉండనివ్వమని పెద్ద గొడవ పెట్టారు. 


తనని అలా చూస్తూ ఓ గంట తాకకుండా ఉండడానికి నేనెంత విలవిల్లాడానో.. !! అయ్యో !తన రాక వల్ల ఏ ఇబ్బందీ లేదని ఎంత చెప్పినా వినరే.. ! వీళ్ళూ వీళ్ళ చాదస్తం!! తన పట్ల నా తపన చూసి చేసేది లేక ఇక మమ్మల్ని వదిలేశారు. అప్పుడు చూడాలి నా వదనం.. సంతోషంతో వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది. 


తన సాన్నిహిత్యమే నా సాహిత్యానికి నాందీ అని వక్కాణించి చెప్పగలను. తన స్నేహమే నాకు బలం. అందుకే నా ప్రాణమున్నంత వరకూ తన రాక కోసం వేచి చూస్తూనే ఉంటాను. 


తనలా నన్ను అలరించడానికి నా నట్టింట తిష్ట వేసిన 'మాయల మరాఠీ' అరచేతిలో వైకుంఠం చూపే 'ఇంద్రజాలం'లాంటివి ఎన్నున్నా అన్నీ తన ముందు దిగదుడుపే అవుతాయి. 


ఎందుకంటే తను నిత్యం సుప్రభాత వేళ జ్ఞాన వెలుగులతో మేలుకొలిపే దినకరుడు, బీదాగొప్పా భేదం లేకుండా అందరినీ సమానంగా ఆదరించే నేస్తం, అందరి బంధువు, నా ఆత్మబంధువు అయిన.. "దినపత్రిక". అందుకే తనకోసం "నీ రాక కోసం నిలువెల్ల కనులై.. ఈ ప్రియ పాఠకురాలు వేచేనురా".. అని పాడుకుంటాను. 

సమాప్తం.  

*****

సుజాత స్వర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.   


 *******


రచయిత్రి పరిచయం:

నా పేరు సుజాత స్వర్ణ. మాది సాహితీ గుమ్మంగా పేరొందిన ఖమ్మం. నేను ఉపాధ్యాయినిని. పుస్తక పఠనం, పాటలు వినడం, పాడడం, రచనలు చేయడం... నా వ్యాపకాలు.




454 views0 comments

Comments


bottom of page