#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #NeekaiEduruchupu
, #నీకైఎదురుచూపు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
'Neekai Eduruchupu - Part 1/4' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 29/10/2024
'నీకై ఎదురుచూపు - పార్ట్ 1/4' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
అంజలి తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వైశాలికి చెప్పినప్పటి నుండీ వైశాలి మనసు మనసులో లేదు. ఒంటరిగా అయిపోయి ఏదో కోల్పోయినట్లు గా దుఖపడుతోంది.
కని పెంచిన కూతురు. ఇరవై ఆరు సంవత్సరాలు, దాన్ని కంటికి రెప్పలా చూసుకుంది.
ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రెండేళ్ల 'అంజలి' ని తీసుకుని భర్త నుండి శాశ్వతంగా బంధాన్ని తెంచేసుకుని వచ్చేసిన రోజు నుండి ఇప్పటి వరకూ తన కూతురే తన ప్రాణంగా బ్రతుకుతోంది వైశాలి.
కూతురి జీవితం తన జీవితంలా కాకూడదని దానికి మంచి భర్త దొరకాలని అది ఎంతో గొప్ప జీవితం అనుభవించాలని తను ఎంతగానో కలలు కంటోంది. దాని బంగారు భవిష్యత్ కోసం తను ఎంతగానో శ్రమించింది.
కానీ అంజలి? తన ఆశలనూ, ఆశయాలను కాలదన్నింది.
నేను వికాస్ ను ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని నిష్కర్ష గా చెప్పింది. ఒక్కగా నొక్క కూతురు అంజలిపై తాను పెట్టుకున్న బంగారపు ఆశలన్నీ చిన్నాభిన్నమై పోయాయి.
అంజలి తన మాట కాదన్నందుకు బాధ ఒకవైపు నిద్రపట్టకుండా చేస్తుంటే, మరోవైపు దీనికంతటికీ కారణం నీవే కదూ అని అంతరాత్మ తనని ప్రశ్నిస్తుంటే దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది. తన అంతరాత్మ నీదే తప్పని తనని నిందించినా తను ఒప్పుకోదు. మనిషికి ఆశలూ, ఆశయాలూ ఉండకపోతే జీవితంలో ఎదగలేడని తను విశ్వసిస్తుంది. ఆ మనిషి ఆడ అవనీ, మగవాడైనా కానీ.
జ్ఞాపకాల సుడిగుండాలు వైశాలి మనసును ఆవహించి ఉక్కిరిబుక్కిరి చేస్తుంటే ఆ జ్ఞాపకాల సుండిగుండాల్లో కూరుకుపోతూ నిస్సహాయంగా కళ్లు మూసుకుంది. ఇరవై నాలుగు సంవత్సరాలనాటి గతం తాలూకా జ్ఞాపకాలు కళ్ల ముందు సినిమా రీళ్లలాగ కదలాడసాగాయి.
***
వైశాలి ఎమ్. ఏ ఎకనామిక్స్ లో సెంట్రల్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఎమ్. ఫిల్ కూడా చేసింది. రీసెర్చ్ అసోసియేట్ గా సోషల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ లో పని చేస్తూనే పి. హెచ్. డి చేస్తోంది. మరో రెండు సంవత్సరాలలో డాక్టరేట్ పూర్తి అవుతుంది.
అదిగో అప్పుడే ఆనంద్ తో పరిచయం అయింది. నిజామాబాద్ లో ఒక ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న ఆనంద్ ఎకనమిక్స్ లో ఎమ్. ఫిల్ చేయడానికి అదే యూనివర్సిటీకి రావడం అతనికి గైడ్ చేయవలసిందిగా హెచ్. ఓ. డి. వైశాలి కి సూచించాడు.
రీసెర్చ్ వర్క్ లో తనకు ఎంతో సహాయపడుతున్న వైశాలి అంటే ఇష్టం ఏర్పడింది ఆనంద్ కి. ఆనంద్ మంచి మాటకారి. అందగాడే కాకుండా తెలివైన వాడు. కానీ బధ్దకస్తుడు. వైశాలే అతని వెంటపడుతూ అతని రిసెర్చ్ వర్క్ ను వేగవంతం చేయడానికి తాపత్రయపడ్తూ ఉండేది.
ఆనంద్ అంటూ ఉండేవాడు, "ఎందుకంత తొందర మేడమ్? మొదలు పెట్టాక, ఇవాళ కాకపోతే రేపైనా అవదా” అంటూ కావాలని వైశాలికి కోపం తెప్పించేలా మాట్లాడేవాడు.
వైశాలి ముఖం కోపంగా పెడ్తే అతను నవ్వేసేవాడు. "కూల్ వైశాలీ మేడమ్” అంటూ.
వైశాలి, ఆనంద్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగి ఒకరిపట్ల మరొకరికి ప్రేమ ఏర్పడడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నువ్వూ’.. అనుకునేటంత సాన్నిహిత్యం ఇద్దరి మధ్యా పెరిగింది.
కొన్ని నెలల తరువాత వైశాలి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో సీనియర్ లెక్చరర్ గా జాయిన్ అవడానికి వెడుతుంటే ఆనంద్ దీనంగా ముఖం పెట్టి అన్నాడు "నీవు నా పక్కన లేకపోతే నేను రీసెర్చ్ పూర్తి చేయడం నా వల్లకాదు వైశూ” అంటూ. తను కూడా ప్రస్తుతానికి రీసెర్చ్ ఆపేసి ఉద్యోగం చూసుకుంటానన్నాడు. తొందరలో పెళ్లి చేసుకుందామన్నాడు.
"లేదు ఆనంద్, ముందు నీ రీసెర్చ్ అయ్యాకనే మన పెళ్లి” అంటూ చెప్పింది వైశాలి.
అనుకోకుండా వైశాలి చెల్లెలు కౌముది కి మంచి సంబంధం రావడంతో ముందు వైశాలి కి త్వరగా పెళ్లి చేసేయాలనుకున్నారు ఇంట్లో.
ఈ విషయం ఆనంద్ తో చెపితే, "చూసావా వైశూ.. చెపితే నీవు వినడం లేదు. నా రీసెర్చ్ కూ చదువుకూ ముడి పెడుతున్నావు. రిసెర్చ్ ఎప్పుడైనా పూర్తి చేస్తాను. ఇక్కడ అవంతీ పి. జి. కాలేజ్ లో లెక్చరర్ పోస్ట్ ఖాళీ ఉందట. అయిదు సంవత్సరాల అనుభం ఉంది కాబట్టి యూ. జీ. సీ స్కేల్ ఇస్తారని విన్నాను. నీది ఎలాగూ పర్మెనెంట్ జాబ్. మనం కాస్త స్థిరపడ్డాక నా రిసెర్చ్ ను కంటిన్యూ చేస్తా”నని చెప్పాడు.
ఆనంద్ వాళ్లది నిజామాబాద్. తండ్రి వ్యవసాయం చేస్తాడు. ఒక అక్క, చెల్లెలు అతనికి. అక్క గోమతికి పెళ్లి అయి ఆరునెలలు కావస్తోంది. చెల్లెలు రాధ ఎమ్. కామ్ చదువుతోంది. ఆనంద్ కు టీచింగ్ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా డిగ్రీ, ఆ తరువాత ఎమ్. ఏ చదివాడు. ఎకనమిక్స్ సబ్జక్ట్ అంటే చాలా ఇష్టం అతనికి. కాలేజ్ లో ఫస్ట్ కూడాను. అందుకనే పి. జి అవగానే అక్కడ కాలేజ్ లోనే ఉద్యోగం వచ్చింది.
వైశాలి చెల్లెలి కి మంచి సంబంధం వచ్చింది. వైశాలికి తల్లి లేదు. నాలుగు సంవత్సరాల క్రితం హార్ట్ ఎటాక్ తో చనిపోయిందావిడ. తండ్రి ఎల్. ఐ. సీ లో పని చేసి రిటైర్ అయ్యాడు. తన ముందు అక్కకు పెళ్లి అయిపోయింది. చెల్లెలు కౌముది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కౌముది ని చేసుకోబోయే అబ్బాయి వైపు వాళ్లు తొందర పడుతున్నారు కాబట్టి, వైశాలి ఆనంద్ ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడం, ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఇరువురికీ పెళ్లి జరిగిపోయింది.
కొత్త సంసారం ఉద్యోగాలతో రోజులు హడావిడిగా గడచిపోతున్నాయి. మధ్య మధ్య లో ఆనంద్ ను అతను పూర్తిచేయాలసిన రీసెర్చ్ విషయమై గుర్తు చేస్తూనే ఉంది. ఆనంద్ ఆ విషయం పై దృష్టి సారించడం లేదు. మామూలుగా కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. వైశాలి తను పనిచేస్తున్న కాలేజ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఫాకల్టీ మెంబర్ గా వివిధ విద్యా సంస్థలలో పార్ట్ టైమ్ క్లాస్ లు తీసుకోమని కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఆదాయం పెరిగింది. పి. హెచ్. డి కూడా పూర్తి అయిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కు ప్రయత్నిస్తోంది.
ఈ లోగా వైశాలి కన్సీవ్ అవడం పాప పుట్టడం జరిగింది. పాపకి 'అంజలి' అని పేరు పెట్టుకున్నారు.
ఆనంద్ ను లెక్చరర్ జాబ్ వదిలేసి ఎమ్. ఫిల్ చేయమని పదే పదే చెబుతోంది.
“ఇప్పుడు చేయకపోతేనేం వైశూ, ప్రస్తుతం నా జాబ్ బాగానే ఉంది కదా. ఎమ్. ఫిల్ అయిన తరువాత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో తెలియదు. అయినా నాకు ఇప్పుడు రీసెర్చ్ మీద ఆసక్తి లేదు. హాయిగా ఉంది నా ఉద్యోగం. టెన్షన్ లేదు. నీవు చూడు. ఫాకల్టీ మెంబర్ గా ఇటూ అటూ పరుగెడుతున్నావు. ప్రీ బడ్జెట్ సమావేశాలకు నిన్ను మెంబర్ గా సెలక్ట్ చేసారన్నావు. ఒకవైపు ఎకనమిక్ కన్సల్ టెన్సీ కూడాను. వీటన్నిటికీ అటెండ్ అవడానికి రాత్రి పగలూ ప్రిపేర్ అవుతున్నావు. నాకు ఆ ఓపిక లేదు వైశూ. నన్ను చదవమని చంపకు ప్లీజ్".
“ఆ చెప్పడం మరచాను. ఈ వీకెండ్ మా ఊరు వెడుతున్నాను. మా ఊళ్లో ఉన్న పొలాన్ని అమ్మేద్దామని నాన్న అంటున్నారు. నాన్న పెద్దవారై పోయారు. సరిగా చూసుకోలేకపోతున్నారుట. ఆ వ్యవహారమేదో చూసుకుని వస్తాను. ఒక్కర్తివీ బేబీ తో ఇంట్లో ఉండే కన్నా మీ నాన్నగారి దగ్గరకో అక్క దగ్గరకో వెళ్లు. నేను ఊరి నుండి వచ్చాకా నిన్ను పిక్ అప్ చేసుకుంటాను”.
“నాకు ఏం చేయాలో తెలుసు ఆనంద్. నేనేమీ చిన్న పిల్లని తెలివి తక్కువ దాన్నీ కాదు. నేనేదైనా నీ మంచి కోసం చెపితే వినవు. పెళ్లి అయ్యాకా రిసెర్చ్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు ఆసక్తి లేదనడం, నా మాటకు అంత విలువ ఉందన్నమాట. భవిష్యత్ పట్ల ఏ కోరికలూ ఆశయాలూ లేకుండా ఉంటావు”.
“పోనీ లే వైశూ. నాకే ఆశయాలూ, కలలూ లేవు. నీతో నా జీవితం హాయిగా ఆనందంగా ఉంటే చాలు, సరేనా! ఉన్నదానిలో తృప్తిగా బ్రతకడం నాకిష్టం” అన్నాడు ఆనంద్.
వైశాలికి తన భర్త తన స్థాయికి తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటోంది. తన కంటే అన్నింటిలోనూ తక్కువే. అందరూ ఆనంద్ గురించి తనను అడుగుతుంటుంటే తను సిగ్గుతో చచ్చిపోతోంది.
ఆనంద్ తన ఊరు వెళ్లి తిరిగి వచ్చాడు. ఉన్న అయిదు ఎకరాలు పొలం పక్కవాళ్లే కొనుక్కుంటామని ముందుకొచ్ఛారని వైశాలితో చెప్పాడు.
“అమ్మా నాన్ననూ మన దగ్గరకు తెచ్చేయాలను కుంటున్నాను. చెల్లెలు ఉగ్యోగ ప్రయత్నాలకోసం ఎలాగూ ఇక్కడకు వస్తానంటోంది. అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది. మన బేబీ ఆలనాపాలనా అమ్మా నాన్నా చూసుకుంటారు. వాళ్లకీ విషయం చెప్పి వచ్చాను. వాళ్లు ఉంటున్న ఇంటిని ఎవరికైనా అద్దెకివ్వమని చెప్పాను. తొందరలో అక్కడ పనులన్నీ అయిపోతే వాళ్లను ఇక్కడకు తెచ్చేస్తాను” అన్నాడు.
“నేనొకదాన్ని ఉన్నానని, మనిద్దరికీ సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునే ముందు నాతో సంప్రదించాలని తెలియదా ఆనంద్?” అంటూ కోపంగా ప్రశ్నిస్తున్న వైశాలి మాటలకు నిశ్చేష్టితుడైనాడు.
“అదేమిటి వైశూ, నా నిర్ణయాన్నినీవు హర్షిస్తావనుకున్నాను"!
"నీవేమి గొప్ప నిర్ణయం తీసుకున్నావని నేను హర్షించాలి ఆనంద్"? మీ అమ్మా, నాన్నగారిని తెస్తున్నావని ఎగిరి గంతులేయమంటావా"?
"వైశూ"! ఆనంద్ గొంతుక రోషంతో పలికింది.
"ఇది గొప్ప నిర్ణయం కాదా? మన కుటుంబానికి సంబంధిన నిర్ణయం. మా అమ్మా, నాన్నా మన కుటుంబ సభ్యులు" అన్నాడు.
"నా దృష్టిలో కుటుంబం, సంసారం అన్న విషయాల కంటే ముందర మన ఉద్యోగం, మన ఎదుగుదల, హోదా ముఖ్యం అని భావిస్తాను ఆనంద్" అంది వైశాలి.
“మనం ఏది మాట్లాడుకున్నా చివరకు టాపిక్ నా రిసెర్చ్ వైపుకే వెడుతుంది. ఐ యామ్ సో సారీ వైశూ, నేను రీసెర్చ్ చేయలేను. ఎప్పుడో ఆ కోరిక ఉండేది. కాని ఇప్పుడు లేదు. మరోసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు”. అయినా ఇప్పుడు మనకేమి తక్కువ? నాకూ ఉద్యోగం ఉంది కదా"?
"అయితే మీ అమ్మా నాన్ననూ కూడా మన దగ్గరకు తీసుకు రావద్దు. పల్లెటూరి సాంప్రదాయాలన్నా మనుషులన్నా నాకు ఎలర్జీ" అంది వైశాలి.
"నేనూ పల్లెటూరి నుండి వచ్చిన వాడినే వైశూ"!
"నీతో వాదించే ఓపిక, సమయం నాకు లేదు ఆనంద్. నాకు మనిద్దరి భవిష్యత్, అంజలి భవిష్యత్ ముఖ్యం" అంటూ అక్కడ నుండి వెళ్లిపోతున్న వైశాలి వైపు నిశ్చేష్టితుడై చూడసాగాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
コメント