top of page
Writer's pictureYasoda Pulugurtha

నీకై ఎదురుచూపు - పార్ట్ 2

#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #NeekaiEduruchupu

, #నీకైఎదురుచూపు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Neekai Eduruchupu - Part 2/4' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 01/11/2024

'నీకై ఎదురుచూపు - పార్ట్ 2/4' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జరిగిన కథ:


కూతురు అంజలి వికాస్ అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడం తో దిగులు పడుతుంది వైశాలి.


గతంలో వైశాలి కూడా ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.కెరీర్ లో పైకి ఎదగాలనే తపన ఆనంద్ కు లేకపోవడం ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది.



ఇక నీకై ఎదురుచూపు: పెద్దకథ పార్ట్ 2 వినండి.


ఆ సంఘటనతో వారిరువురి మధ్య మౌనం రాజ్యమేలసాగింది. ఆ రోజు ఆదివారం. ఆనంద్ ముందు హాల్లో అంజలి ని ఆడిస్తుండగా వైశాలి వచ్చింది. 


అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని "మాదాపూర్ లో అపర్ణా కనస్ట్రక్షన్ వాళ్లు కొత్త అపార్ట్ మెంట్స్ కడుతున్నారుట. గేటెడ్ కమ్యూనిటీ. కోటిన్నర వరకు అవుతుంది, ప్లస్ ఇంటీరియర్స్ మనమే చేయించుకోవాలి. వాళ్ల మార్కెటింగ్ మేనేజర్ మా కాలేజ్ కు వచ్చి ప్రజంటేషన్ చేసాడు. అందులో ఒక ఫ్లాట్ మనకోసం బుక్ చేసాను. నా సేవింగ్స్ లో ఉన్న ముఫై లక్షలు అడ్వాన్స్ పేమెంట్ చేసాను. మీ నాన్నఅమ్మిన పొలం డబ్బులో ముఫై లక్షలు నీవిస్తే మిగతా అమౌంట్ కి మనిద్దరి పేరుమీదా హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. వింటున్నావా ?” అంది వైశాలి.


“ఎవరితో మాట్లాడుతున్నావ్ వైశాలీ?”


“ఇక్కడ ఎవరున్నారని? బేబీ తో మాట్లాడు తున్నాననుకుంటున్నావా"? 


“లేదు లే, అదివరకు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రేమగా పక్కన కూర్చుని చెప్పేదానివి. ఇప్పుడు ఏదో ఆ గోడతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తేనూ....”



“అదిగో అక్కడే నీకూ నాకూ తేడా ఆనంద్. ఏ విషయాన్ని శ్రధ్దగా పట్టించుకోవు అనికదా కోపంతో ఫైర్ అయింది". 



“నీకెందుకో నేనేమీ పట్టించుకోనని ఒక చిన్న చూపు. నీ దృష్టిలో రిసెర్చ్ చేయని వాళ్లంతా పనికిరానివాళ్లు, అవునా వైశూ"?


"హమ్మయ్య అర్ధం చేసుకున్నందుకు ధాంక్స్ ఆనంద్”, వ్యంగంగా అంది. 


"ఆ, ఇంతకీ మా నాన్న పొలం అమ్మిన డబ్బు గురించి కదూ అడిగావు? అయిదెకరాలూ అమ్మితే కోటి రూపాయలు వచ్చాయన్నది వాస్తవం. ఇంకా చెల్లెలి పెళ్లి చేయాలి. అందులో కొంత డబ్బు నాకిస్తామన్నారు. నేనే వద్దన్నాను. మనిద్దరం సంపాదించుకుంటున్నాం కదా. వాళ్ల అవసరాలకే ఉంటుందని అమ్మా నాన్న పేరు మీద బేంక్ లో డిపాజిట్ చేసాను. వాళ్లకు ఏమీ ఆధారం లేదు కదా ఆ డబ్బుమీద వచ్చే వడ్డీ తోనే బ్రతకాలి కనుక”. 


ఆనంద్ మాటలకు తోక తొక్కిన త్రాచే అయింది వైశాలి. 


అతని వైపు ఛీత్కారంగా చూస్తూ, "ఛ.. ఏం మనిషివి ఆనంద్. అస్సలు ఆలోచించవా? నేను బాగా సంపాదిస్తున్నానే కదూ ఆ ధీమా? నీవైపు నుండి ఏ సహాయమూ ఉండదు. నిమ్మకు నీరెత్తినట్లు గా ఉంటావు. నీ మీద భరోసాతో ఫ్లాట్ కమిట్ అయ్యాను. డబ్బు ఇస్తామంటే వద్దంటూ చేతులూపుకుంటూ వచ్చేసి ఏదో గొప్ప పని చేసినట్లు మాట్లాడుతున్నావు".


"నేను ఒక్క మాట అడుగుతాను వైశూ, సమాధానం చెప్పు. ఇప్పుడంత లగ్జరీ ఫ్లాట్ అవసరమా మనకు? వెంటనే కేన్సిల్ చేసేయ్ నా మాట విని. కొంచెం బడ్జట్ తక్కువ లో ఉన్నది కొనుక్కుందాం. ఒక పది పదిహేను లక్షలు నేను తెస్తాను నాన్నను అడిగి. అయినా నీవే అంటావు కదా, మనిద్దరికి సంబంధించిన విషయం మీద నిర్ణయం తీసుకునే ముందు ఒకరినొకరు సంప్రదించుకోవాలని". 


“ఓహో నా మాటలను నాకే అప్పగిస్తున్నావా ఆనంద్? ఫ్లాట్ ను కేన్సిల్ చేసే ప్రసక్తే లేదు. నాకు చాలా నచ్చింది ఆ ఫ్లాట్”. 


"నచ్చడం ఒక్కటేనా వైశూ? డబ్బు గురించి ఆలోచించవా? ఎకనమిక్స్ లో రిసెర్చ్ చేసావ్. రేపు రాబోయే యూనియన్ బడ్జెట్ కి ఎనలిస్ట్ గా పనిచేస్తున్నావు. దేశ రాబడులనూ, ఖర్చులనూ ఎలా బేలన్స్ చేయాలో గంటల తరబడి మీ ప్రముఖులందరూ మీడియా ముందు కూర్చుని చర్చించుకుంటారు. మరి మన ఇంటి బడ్జట్, ఆదాయ వ్యయాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవా"?


“స్టాపిట్ ఆనంద్! నీ మాటల్లోని వ్యంగ్యం అర్ధం చేసుకోలేని అమాయకురాలిని కాదు. గొర్రెతోక సంపాదన గాడివి, నీవు నాకు చెపుతావా ఎలా ప్లేన్ చేయాలోనన్నది. నా హోదా కి తగ్గ ఫ్లాట్ చూసాను నీ హోదాని చూసి కాదు. నీవు తెస్తానన్న ఆ బోడి పది లక్షలూ నాకు అవసరం లేదు".


 అసలు పొరపాటంతా నాదే. నీతో నా జీవితాన్ని పంచుకుని తప్పటడుగు వేసాను. మనిద్దరి ఆశయాలూ అభిరుచులు కలవవని తెలిసిపోయింది. నీతో కలసి జీవితాంతం ఆనందంగా ఉండలేను. మనం విడిపోయి ఎవరికి నచ్చినట్లు వాళ్లు జీవించడం బెటర్” అంటూ అంజలిని తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది.


రెండురోజులు మౌనం తరువాత ఆ రోజు రాత్రి ఆనంద్ వైశాలితో "చిన్న చిన్న విషయాలకే మన బంధాన్ని తెంచేసుకోవాలని నీవనుకోడంలో అర్ధం ఉందా వైశూ? నేను ఏదైనా పొరబాటుగా మాట్లాడి ఉంటే ఐయామ్ సారీ" అన్నాడు.. 


"నీకు అన్నీ చిన్న విషయాలే ఆనంద్. ఉన్నదాంతో తృప్తిపడిపోమంటావు. భవిష్యత్ మీద ఏ ఆశలూ కోరికలూ లేని వాడివి. కనీసం ఉద్యోగం లో నైనా ఎదగాలని కోరుకోవు. నీలాంటి జడ పదార్థం తో నేను కలసి ఉండలేను". 

 

ఆనంద్ వైశాలికి ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసాడు. అతని ప్రయత్నం సఫలీకృతం కాలేదు. డాక్టరేట్ వచ్చాకా వైశాలిలో మార్పు మరింత ప్రస్ఫుట మవుతోంది. వైశాలికి అంత అహం పనికిరాదు. హోదా అంతస్తు అంటూ మాట్లాడే వైశాలి తో కలసి జీవించడం కష్టం అని నిర్ణయించుకున్నాడు. 


వైశాలి తను అన్నమాట మీదే నిలబడింది. ఆనంద్ ఎంత బ్రతిమాలినా, బుజ్జగించినా పట్టించుకోలేదు. ఆనంద్ నుండి విడిగా వచ్చేసాకా వైశాలి ఒంటరిగా కూతురి తో ఒక ఫ్లాట్ లో అద్దెకుంది. విడాకులు మంజూరు అయ్యాయి. 



ఒక సంవత్సరం తరువాత గృహప్రవేశం చేసుకుని సొంత ఫ్లాట్ లోకి మారిపోయింది. 


అసిస్టెంట్ ప్రొఫెసర్ గా యూనివర్సిటీ లో పోస్టింగ్ వచ్చింది. 



అంజలిని బాగా చదివించింది. అంజలి ఎమ్.డి పీడియాట్రిక్స్ లో స్పెషలైజేషన్ చేసింది. ఒక కార్పొరేట్ హాస్పటల్ లో పీడియాట్రీషియన్ గా పని చేస్తోంది. వైశాలి ప్రొఫెసర్ గా మరో మెట్టు ఎక్కింది. కూతురికి వివాహం చేయాలని మంచి హోదా ఐశ్వర్యం కల వ్యక్తిని అల్లుడిగా తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ లోగా అంజలి తను వికాస్ ను ప్రేమిస్తున్నానని చెప్పేసరికి వైశాలి తెల్లబోయింది. ప్రేమించడం తప్పుకాదు. అంజలి తనకంటే అన్ని విధాలా తక్కువ వాడైన వికాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాననేసరికి తట్టుకోలేకపోతోంది.


వికాస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. బి.టెక్ చదివాడు. అంజలి, వికాస్ లు స్కూల్ లో చదువుతున్నప్పటి నుండి ఫ్రెండ్స్. వికాస్ కు ఒక తమ్ముడు. బి.ఫార్మర్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. హైస్కూల్ స్నేహం జూనియర్ కాలేజ్ వరకు పెరిగి బలపడింది. ఆ తరువాత అంజలి మెడిసిన్ లోనూ, వికాస్ కు ఇంజనీరింగ్ లోనూ సీట్స్ వచ్చి చదువులు వేరయ్యాయి. కానీ స్నేహం కొనసాగుతూనే ఉంది. 


వికాస్ ను అమెరికా వెళ్లి ఎమ్.ఎస్ చదువుకోమని ఇంట్లో అన్నా వెళ్లనని ఇక్కడే జాబ్ చేసుకుంటానని చెప్పాడుట. అంజలి, వికాస్ ల మధ్య అరమరికలు లేవు. ఏ విషయానైనా ఇద్దరూ పంచుకుంటారు. అంజలి తనే వికాస్ కు ప్రపోజ్ చేసింది. అంజలి పట్ల ఎంత ప్రేమ ఉన్నా వికాస్ తన మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి కొంచెం తటపటాయించాడు. 


తల్లి తనకు సంబంధాలు చూస్తోందని తెలిసి వికాస్ ను కలిసి తను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుందామని చెప్పింది. అంజలి మాటలకు వికాస్ గంతులేయలేదు సరికదా ముందు మీ అమ్మ తో చెప్పు అంజలీ. ఆంటీ వప్పుకోవాలి కదా. నీవు మీ ఇంట్లో చెప్పాకా ఓకే అంటే అప్పుడు నేను కూడా మా ఇంట్లో చెపుతానన్నాడు.


అంజలి వికాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వైశాలి కి చాలా కోపం వచ్చింది. తన కూతురి పక్కన ఒక గొప్ప డాక్టరు ను ఊహించుకుంది. కూతురికి అమెరికా సంబంధం చూసి చేసే పంపాలని అనుకుందే తప్ప ఇలా తన కూతురికంటే తక్కువ హోదా కలవాడిని ఊహల్లోకి కూడా రానీయలేదు. ఎమ్.డి చదివిన తన కూతురికి వికాస్ లాంటి సామాన్యమైన వ్యక్తినిచ్చి పెళ్లి చేసే ఆలోచనేలేదు. తను జీవితంలో తప్పటడుగు వేసింది. ప్రేమ మత్తులో పడి తన కంటే అన్ని విధాలా అయోగ్యుడిని పెళ్లి చేసుకుంది. చివరకు తను ఏమి సాధించింది? విడాకులు తీసుకుని కూతురితో బయటకు వచ్చేసింది.


అంజలి ఈ విషయం చెప్పినప్పుడు “వద్దు తల్లీ, నీ చదువుకి హోదాకి వికాస్ తగ”డంటే “ఏం వికాస్ చదువుకోలేదా, సంపాదించడం లేదా”? అంటూ ఎదురుప్రశ్న వేసింది. 


“వికాస్ ఐ.ఐ.మ్ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. సీట్ వస్తే హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేస్తాడు కదా మమ్మీ!”


"సీట్ రావాలి కదా అంజలీ. అయినా పెళ్లి అయ్యాకా చదవాలన్న పట్టుదల ఎవరికో కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఆడవాళ్లకు ఉన్న పట్టుదల, శ్రధ్ద మగవాళ్లకు ఉండదు. పైగా నీవు పెద్ద డాక్టర్ వి. బాగా సంపాదిస్తున్నావ్. ఇప్పుడు నేను చదవకపోతేనేం అని అతను అనుకోవచ్చు కూడా. అందుకే చెపుతున్నాను అంజూ, నీ స్థాయికి తగడు. భవిష్యత్ లో సమస్యలొస్తా”యంటూ నచ్చ చెప్పింది.


"సమస్యలంటే నీకూ నాన్నకూ వచ్చినట్లా అమ్మా, అయినా నాన్న ఏం తప్పు చేసాడని నాన్న నుండి విడిపోయా”వంటూ తనను ఎదురు ప్రశ్న వేసింది. 



అంజలి అడిగిన ప్రశ్న వైశాలి మనసు అంతరాళాల్లో తుఫానును రేకెత్తించింది.


"నాన్న నాకు అంతా చెప్పా”రనేసరికి వైశాలి ముఖం లో నెత్తురు లేనట్లు అయింది.


"ఇంతవరకు నాన్ననన్ను కలుస్తున్నారని నీకు చెప్పకపోవడం నా తప్పే, నన్ను క్షమించు మమ్మీ!

నేనే అడిగాను మీ ఇద్దరి విషయం. మొదట చెప్పలేనన్నారు. తరువాత నేను చెప్పిన మూలాన మీ అమ్మ పై కోపం తెచ్చుకుని మీ అమ్మకు దూరం కావద్దు తల్లీ" అంటూ నా చేత ఒట్టు వేయించుకున్నారు.


వైశాలిలో అహం, కోపం ఒక్కసారిగా తన్నుకువచ్చేసాయి.



"మీ నాన్న నిన్ను ఎప్పటినుండి కలుస్తున్నాడు అంజలీ?” అంటూ ఆవేశంగా అడిగింది.


"నాన్నకు మన విషయాలన్నీ తెలుస్తున్నాయిట. నేను ఎమ్.బి.బి.ఎస్ మూడవ సంవత్సరంలో ఉండగా నాన్న నన్ను కలవాలని ఒకసారి కాలేజ్ హాస్టల్ కు వచ్చారు. అప్పటి నుండీ నెలకు ఒక సారి నన్ను చూడడానికి వస్తూనే ఉన్నారు". 


అంజలి తన తండ్రి గురించి చెపుతుంటే వైశాలి మనసు భగ్గున మండిపోతోంది. అతను తన మీద కోపంతో అంజలి మనసును మార్చడం లేదు కదా? 



'అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడా? ఏమి చేస్తున్నాడు? అంజలి ఆ వివరాలేమీ చెప్పడం లేదేమిటి? అయినా తనకెందుకు అతని వివరాలు?’ 



"మమ్మీ, మరోసారి చెపుతున్నాను. వికాస్ నాలా డాక్టర్ కాకపోవచ్చు. కానీ మంచివాడు, గొప్ప మనసు కలవాడు. వికాస్ వాళ్ల అమ్మ వికాస్ తమ్ముడు పుట్టినపుడు పురిటిలోనే చనిపోయిందట. ఆ దుఖంలో వాళ్ల నాన్న ఇల్లు విడిచి వెళ్లిపోయాడుట. అసలు బతికి ఉన్నాడో లేదో ఇప్పటివరకు ఆచూకీ లేదుట. వికాస్ నూ, వాళ్ల తమ్ముడినీ వాళ్ల పిన్ని పెంచి పెద్ద చేసిందిట. అక్క పిల్లలకోసం ఆవిడ వివాహం చేసుకోలేదట. ఆవిడ సెక్రటేరియట్ లో పనిచేస్తున్నారు. ఎంత గొప్ప మనసుకల వ్యక్తో ఆ రాధా ఆంటీ. 



“చదువూ, హోదానే కాదు, చివరకు ఏ దిక్కూ మొక్కూలేని అనాథను చేసుకుంటావన్నమాట". 


"అమ్మా, ఆ మాట అనకు దయచేసి” అంజలి ముఖం కోపంతో ఎర్రబారింది. “అతను అనాధ కాడు". 


" నీ మంచికోరే తల్లిగా చెపుతున్నాను. నీకోసం డాక్టర్ సంబంధాలు రెండు రెడీగా ఉన్నాయి. అందులో నీ కిష్టమైన సంబంధాన్ని చేసుకో అంజలీ". 


"నాకు డాక్టర్ వృత్తిలో లో ఉన్నవాళ్లంటే ఇష్టంలేదు. నేను వికాస్ నే చేసుకుంటాను. నీవు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే....”



“లేకపోతే ఏమి చేస్తావే? ఆ తండ్రి బుధ్దులే వచ్చాయి నీకు. ఆ పంతం, మొండితనం. నీ ఇష్టం. నీవు చిన్నపిల్లవు కాదు. అన్ని విధాలా పరిణితి చెందావు. తల్లిగా మంచీ చెడూ చెప్పాలసిన బాధ్యత నాకుందని చెప్పాను అంతే" అంటూ ఆవేశంగా అక్కడనుండి తన బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది.


తన అభిప్రాయాలనూ ఆశయాలనూ ఆ నాడు ఆనంద్ ఖాతరు చేయలేదు. అంతగా తనను ప్రేమించినవాడు ‘నీకోసం నేను ఏదైనా చేస్తా’నని ఒక్కమాట అనగలిగాడా? 

ఇప్పుడు అంజలి? తన మాట లక్యపెడుతోందా? తనకంటే ఆ వికాస్ ఎక్కువన్నమాట. ఏమి సాధించింది తను? అంజలి కూడా తన మాటను లక్ష్యపెట్టడం లేదు.

ఇంకా ఉంది. 


========================================================================

ఇంకా వుంది..


========================================================================


యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








39 views0 comments

Comments


bottom of page