top of page
Writer's pictureYasoda Pulugurtha

నీకై ఎదురుచూపు - పార్ట్ 4

#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #NeekaiEduruchupu

, #నీకైఎదురుచూపు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Neekai Eduruchupu - Part 4/4' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 10/11/2024

'నీకై ఎదురుచూపు - పార్ట్ 4/4' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



జరిగిన కథ:


కూతురు అంజలి వికాస్ అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడం తో దిగులు పడుతుంది వైశాలి.


గతంలో వైశాలి కూడా ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కెరీర్ లో పైకి ఎదగాలనే తపన ఆనంద్ కు లేకపోవడం ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది.


ఆనంద్ తో విడిపోయి అంజలిని కష్టపడి చదివిస్తుంది.

వికాస్ ను తల్లికి పరిచయం చేస్తుంది అంజలి.

ఆనంద్ స్వంతంగా కాలేజీని స్థాపించినట్లు తెలుసుకుంటుంది వైశాలి. 


ఇక నీకై ఎదురుచూపు: పెద్దకథ పార్ట్ 4 చదవండి


ఆరోజు శుక్రవారం. వైశాలికి ముఖ్య పనులేమీ లేనందువలన యూనివర్సిటీ నుండి మధ్యాహ్నం తొందరగా వచ్చేసింది. 


అప్పుడే వైశాలికి ఎవరో ఫోన్ చేసారు. కొత్త నంబరు అనుకుంటూ "హలో” అనగానే అవతలి వైపునున్న ఒక వ్యక్తి "వైశాలిగారేనా” అంటూ ప్రశ్నించింది. 


"అవును చెప్పండి” అనగానే "నేను వికాస్ పిన్నిని. నా పేరు రాధ. మిమ్మలని కలవడానికి సాయంత్రం అయిదు గంటలకు వస్తాను. మీరు అప్పటికి యూనివర్సిటీ నుండి వచ్చేస్తారా? మిమ్మలని కలవవచ్చా” అంటూ అడిగింది.


‘తనతో ఆవిడ ఏమి మాట్లాడాలి ఇంక? ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి నిర్ణయించేసుకున్న తరువాత? అంజలి తన జీవితాన్ని తనే నిర్ణయించేసుకుంది. రేపు ఇరువురి మధ్య ఏ పొరపొఛ్చాలు వచ్చినా తన చూస్తూ తట్టుకోగలదా? ఈ మాటలూ, కలవడాలు మూలాన ఏమి ప్రయోజనం’ అని మనస్సులో అనుకుంటూ "రావచ్చు, ఇంకా ముందరే రం”డంటూ ఫోన్ పెట్టేసింది.


అయిదు గంటల లోపే రాధ వచ్చింది వైశాలి ఇంటికి. వికాస్ అంజలి గురించి రాధతో చెప్పగానే ఎవర్రా ఆ అమ్మాయంటూ అడిగింది. వాడు చెప్పగానే తను నిశ్చేష్టిత అయింది. కానీ ఆవిడ తనకు తెలుసన్న నిజాన్ని వాడికి చెప్పలేదు. వైశాలికి తాము ఎలా ఉన్నామో, ఎక్కడ ఉన్నామో నన్న ఆసక్తి లేకపోయినా వైశాలి గురించి అన్నయ్య కు అన్ని విషయాలూ తెలుస్తూనే ఉన్నాయి. 


రాధ ను చూస్తూనే వైశాలి రండంటూ హాల్ లో సోఫా చూపించి కూర్చోమంది. రాధ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసింది. వైశాలి తనను గుర్తు పట్టనే లేదు. అయినా తనను చూసింది ఏ రెండు మూడు సందర్భాలలోనో. ఒకటి అన్నయ్య పెళ్లిలో, రెండవది కొత్త కోడలిగా వైశాలి తమ ఇంట్లో అడుగు పెట్టినపుడు. 


ఆ తరువాత వాళ్లిద్దరూ హైద్రాబాద్ లో కాపురం పెట్టడం, తను అప్పుడు పి.జి చదువుతోంది. ఆ తరువాత మళ్లీ వదినను కలవనే లేదు. ఆ తరువాత కొంత కాలానికి అన్నయ్యకూ, వైశాలి కీ విడాకులు అయిపోయాయి. ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది వైశాలిని ఆఖరిగా చూసి.


"చెప్పండి నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా" అంటూ రాధను ప్రశ్నించింది.


"అవును వైశాలి గారూ, ఆ రోజు మిమ్మలని కలవలేక పోయాను. తరువాత వికాస్ తో వద్దామనుకున్నాను. కానీ ఈలోగా మిమ్మలని నేను ఇలా వచ్చి కలవడం మంచిదనుకున్నాను. ఎందుకంటే మీతో చాలా మాట్లాడాలి. 


వదినా, మిమ్మలని ఇలా పిలవ్వచ్చో లేదో గానీ మీరు నన్ను గుర్తు పట్టలేకపోయినా నాకు మీరెవరోనన్నది ఈ మధ్యే వికాస్ చెప్పాడు. వాడికి మీరొక పెద్ద ప్రొఫెసర్ అని మాత్రమే తెలుసు. మిగతావేమీ వాడికి తెలియదు.


నేను ఆనంద్ ఆఖరి చెల్లెలిని రాధను. అన్నయ్య గుర్తు ఉన్నాడు కదూ వదినా?”


బాంబ్ పేలినట్లు ఉలిక్కి పడుతూ రాధ వైపు పరీక్షగా చూసింది.

"అంటే వికాస్"?


"మా చిన్నక్క గోమతి పెద్ద కొడుకు వదినా. అక్క చిన్నవాడి ని కని పురిటిలోనే పోయింది. వాడు కల్యాణ్. బావ దుఖంతో ఇల్లువిడిచి సన్యాసుల్లో కలసిపోయాడు. గోమతి అక్కకు పెళ్లైన సంవత్సరానికే కదా మీ ఇరువురి వివాహం అయింది”. 

రాధ ఏమి చెపుతోందో ఏమిటో మనస్సంతా అగమ్యగోచరంగా ఉంది వైశాలికి. ఏమిటీ, మళ్లీ ఈ రూపంలో ఈ బంధాలు ఇలా అల్లుకుంటున్నాయని విస్తుబోతోంది. వద్దు అనుకుంటూ అన్ని బంధాలనూ తెంచేసుకు వచ్చేసింది. మళ్లీ ఎక్కడ ఆనంద్, ఎక్కడ రాధ? 


రాధ చెపుతోంది. "అమ్మ దుఖంతో మంచం పట్టింది అక్క చనిపోయినందుకు, బావ ఇల్లువిడిచి వెళ్లిపోయినందుకు. అసలుకే అన్నయ్య వైవాహిక జీవితం అలా అయినందుకు బెంగ పెట్టుకున్న అమ్మ కి పులిమీద పుట్ర లాగ ఇదో పెద్ద కష్టం వచ్చి పడింది. ఇంక అమ్మ బెంగతో సుస్తీ పడి లేవలేకపోయింది. అసలుకే హై బి.పి తో ఉన్న అమ్మకు హార్ట్ ఎటాక్ రెండుసార్లు వచ్చి ఇంక తట్టుకోలేక చనిపోయింది. అప్పుడే నాకు సెక్రటేరియట్ లో జాబ్ రావడం తో అందరం హైద్రాబాద్ వచ్చేసాం. 


గోమతక్క పిల్లల బాధ్యత నా మీద పడింది. నాన్నగారు కూడా బాగా కృంగిపోవడంతో అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఒకవైపు ఉద్యోగం, చిన్నపిల్లల పెంపకం. అన్నయ్యను మరల వివాహం చేసుకొమ్మని నాన్న పదే పదే బ్రతిమాలేరు. కానీ అన్నయ్య చేసుకోనని తెగేసి చెప్పేసాడు. రాధకు చేద్దాం అన్నాడు. 


నేను పెళ్లిచేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే పసిపిల్లల పరిస్థితి ఏమిటా అని ఆలోచించాను. గోమతక్క పిల్లలు అనాధలు అయిపోతారని భయపడ్డాను. అక్క పిల్లలను పెంచుతూ వాళ్లను అభివృధ్దిలోకి తీసుకురావాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. అన్నయ్యకు నా అభిప్రాయం నచ్చలేదు. పిల్లలను తను పెంచుతానన్నాడు. మగవాడిగా తనకు సాధ్యమా? చివరకు నా మొండి వైఖరికి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. 


అమ్మ పోయిన రెండు సంవత్సరాల లోపే నాన్న కూడా అనారోగ్యంతో పోయారు. లెక్చరర్ గా పనిచేస్తూనే ఒకటి రెండు కాలేజ్ లు మారాడు అన్నయ్య. చివరకు సొంత కాలేజ్ పెట్టాలని తీవ్రంగా కృషి చేసి తన కోరికను తీర్చుకున్నాడు. రాత్రీ పగలూ కాలేజ్ ధ్యాసే వాడికి. కాలేజ్ లోనే ఎక్కువసేపు గడుపుతాడు.


ఒక పనిమనిషిని పెట్టుకుని పిల్లల పెంపకాన్ని చూసుకున్నాను. అప్పుడప్పుడు అన్నయ్స వచ్చి చూసి వెడుతున్నాడు. వికాస్ చాలా బ్రిలియంట్. 'నిట్' వరంగల్ లో మంచి రేంక్ తో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ లో కాలేజ్ లో టాపర్. యూ.ఎస్ వెళ్లి చదువుకోమన్నాం నేను అన్నయ్యాను. 


ససేమిరా వెళ్లనన్నాడు. కారణం చెప్పాడు, నన్నూ మామయ్యనూ వదిలి వెళ్లలేనని మా పెద్ద వయస్సులో మమ్మలని చూసుకోవలసిన బాధ్యత తనదేనంటూ క్యేంపస్ సెలక్షన్ లో మంచి జాబ్ వస్తే చేరిపోయాడు. అన్నయ్య వాడిని ఐ.ఐ.మ్ అయినా చదవమని అంటున్నాడు. 


నాలా ఉండిపోకూడదరా, పెద్ద చదువులు చదివితేనే ఈ సొసైటీలో విలువ అంటూ వికాస్ కు పదే పదే చెపుతాడు అన్నయ్య. వికాస్ ఉద్యోగం చేస్తూనే ప్రిపేర్ అవుతున్నాడు. చిన్నవాడు కల్యాణ్ బి.ఫార్మర్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 


వికాస్ అంజలిని ప్రేమిస్తున్నట్లు ఈ మధ్యనే నాకు చెప్పాడు. ఎవరో అంజలి అనుకున్నాను. ఎవరమ్మాయి అని అడిగితే మీ పేరు మీ వివరాలు చెప్పాడు. అప్పుడు తెలిసింది. మీ అమ్మాయని. ఈ విషయంలో నా ప్రమేయం గానీ, అన్నయ్య ప్రమేయం గానీ ఏమీ లేవు. మిమ్మలని ఇలా ఒంటరిగా వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడాలని వచ్చాను. ఇవాళ కాకపోతే రేపైనా పిల్లలకు అన్నీ తెలుస్తాయి కదా వదినా!” 


రాధ చెపుతున్న మాటలను మంత్రముగ్ధలా అలా చేష్టలుడిగినదానిలా వింటూ కూర్చుండి పోయింది వైశాలి.


ఈ అమ్మాయిలో ఎంతటి పరిపక్వత ఉందో కదా అని అనుకుంది. అక్క పిల్లల కోసం తన మొత్తం జీవితాన్ని ఫణంగా పెట్టింది. ఆనంద్ తో తన పెళ్లినాటికి ఎమ్.కామ్ చదువుతోందేమో ఈ అమ్మాయి. అంత చిన్న వయస్సులో ఎంతటి త్యాగం. పెళ్లి చేసుకోకుండా, చనిపోయిన తన అక్క పిల్లలను తన పిల్లలుగా పెంచి పెద్ద చేసింది. 


 ఆనంద్....? మళ్లీ పెళ్లి చేసుకోలేదట! అంటే.... అంటే తనమీద ప్రేమ ఉండబట్టే కదా? సొంత కాలేజ్ పెట్టి, తన కోరికను తీర్చుకున్నాడా? ఆశయాలు అందరికీ ఉంటాయన్నమాట. తనే ఆనంద్ ని సరిగా అర్ధం చేసుకోలేదు. తనకంటే తక్కువ చదువుకున్నాడని కించపరిచింది. ఒకనాడు ఆనంద్ ను నీకు జీవితంలో ఏ ఆశయాలూ, కోరికలూ లేవా అంటూ హేళన చేసింది. 


ఆకాశానికి నిచ్చెన వేయాలని తను అనుకుంది. అందరూ తనలాగే ఆలోచించాలని అనుకుంది. కానీ ఆనంద్? నిస్వార్ధంగా సేవ చేస్తున్నాడు. గొప్ప పేరు సాధించాడు. ఒకప్పుడు పల్లెటూరు గబ్బిలాన్ని పెళ్లి చేసుకున్నానని అనుకుంది. కానీ వాళ్లే తమ ఆశయ సిధ్ది కోసం తమ జీవితాలని సైతం త్యాగం చేసారు.


కళ్లల్లో నుండి కన్నీళ్లు వరదలా కారిపోతున్నాయి. దుఖంతో ఎగిసి పడుతున్న మనస్సుని సంభాళించలేక "వెళ్లొస్తాను వదినా అంటూ" రాధ వెళ్లిపోతున్నా ఆపలేని ఆశక్తితో అలా సోఫాలోనే కూర్చుండిపోయింది చాలా సేపు.

-----


అది గోమతీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్. యాప్రాల్ దగ్గర అయిదెకరాల విస్తీర్ణం లో నిర్మించిన కాలేజ్. ముందంతా అందమైన తోట, మధ్యలో కాలేజ్ భవనాలు. కాలేజ్ కు కాస్త దూరంలో హాస్టల్స్.


రమణీయమైన ప్రకృతి సౌందర్యాల మధ్య ఠీవిగా మెరిసిపోతూ ఉన్నాయి కాలేజ్ భవనాలు.

రంగు రంగు దుస్తులలో విద్యార్ధీ, విద్యార్ధినులతో ఆ కాలేజ్ ప్రాంగణం అంతా కళ కళ్లాడిపోతోంది.


ఆనంద్ ను కలవాలని అతని కాలేజ్ కు వచ్చిన వైశాలి ఆనంద్ ప్రైవేట్ రూమ్ లో సోఫాలో కూర్చుని ఉంది. ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో ఆనంద్ కూర్చుని మౌనంగా కిటికీలోనుండి బయటకు చూస్తూ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. వైశాలిని ఇన్ని సంవత్సరాల తరువాత చూసినందుకు అతనిలో ఏ విధమైన అనుభూతి లేదు. వికాస్, అంజలి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్త తెలిసినప్పటినుండి వైశాలిని ఏదో రోజున ముఖా ముఖీ ఇలా కలవ వలసి వస్తుందని ఎప్పుడో ఊహించాడు. 

 

వైశాలికి రెండు రోజుల క్రితం అంజలి ఏడుస్తూ తనతో చెప్పిన సంగతిని మరచిపోలేక పోతోంది. ఆవేదనతో తల్లడిల్లి పోతోంది. 


"మమ్మీ, డాడీ అరుణాచలం ఆశ్రమానికి వెళ్లే సన్నాహంలో ఉన్నారుట. ఎప్పుడు తిరిగి వస్తానో, అసలు వస్తానో రానో కూడా తెలియదని వికాస్ తో చెప్పారుట. డాడీ అలా వెళ్లిపోతే ఎలాగమ్మా” అంటూ తనను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 


తను సంగతి విని మ్రాన్పడిపోయింది. ఆనంద్ ను కలసి తనను క్షమించమని అడగాలని, అతని నిర్ణయాన్ని ఆపాలని ఆరాటంగా వచ్చింది. అతనేమీ మాట్లాడడం లేదు. తనే మాట్లాడాలని నిర్ణయించుకుంది.


"ఆనంద్! నేను ఎందుకు వచ్చానా తెలుసుకోవాలని లేదా"?

"అంజలి ప్రేమ విషయంలో నా ప్రమేయం ఏదైనా ఉందేమోనన్న అనుమానాన్ని తీర్చుకోడానికి అయితే నీవు ఇక్కడనుండి వెళ్లచ్చు వైశాలీ. అంజలీ, వికాస్ చిన్న పిల్లలు కాదు. మన ఇరువురి గురించి తెలియక పూర్వం నుండే వారిద్దరికీ పరిచయం ఉంది, తరువాత ప్రేమ ఏర్పడింది. ఎవరు కాదన్నా వాళ్లు పెళ్లి చేసుకుంటారు".


"ఆ విషయం గురించి కాదు ఆనంద్, వాళ్ల పెళ్లి వాళ్ల ఇష్టం అనే అభిప్రాయానికి నేనెప్పుడో వచ్చేసాను. ఆ సంగతి కాదు. నిన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. నీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాను. రాధ చెప్పేవరకు నా కళ్లు తెరుచుకోలేదు. అహంకారంతో, మూర్ఖంగా ప్రవర్తించి నీకు తీరని మనస్తాపాన్ని కలిగించాను. నిన్ను అవమానించాను, చిన్న చూపు చూసాను.


కానీ, ఉన్నతమైన మీ వ్యక్తిత్వం, త్యాగం ముందు నా అహంకారం ఓడిపోయింది ఆనంద్. నేను ఏమి సాధించానని విర్రవీగాలి? మీ ఆశయాల కంటే గొప్పవా నావి? హిమాలయ శిఖరం వంటి ఉన్నతమైన మీ వ్యక్తిత్వాన్ని చూస్తూ నేను సిగ్గుతో కుంచించుకు పోతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా నా అహంకారంతో నిన్ను దూరం చేసుకున్నాను ఆనంద్. నా పాపానికి నిష్కృతి లే”దంటూ భోరుమంటూ ఏడుస్తున్న వైశాలిని ఓదార్చాలని అనిపించలేదు అతనికి.


అతని మనసంతా శూన్యంగా ఉండిపోయింది. గడచిన కాలవాహినిలో అతను ఎదుర్కొన్న అనేక చేదు సంఘటనలు అతనిని నిర్వీణ్యుడిని చేసాయి. వైశాలి దుఖం అతడిని కదిలించలేకపోతోంది. అంత నిశ్శబ్దంలోనూ అతని మనసులో ఎన్నాళ్లనుండో పేరుకుపోయిన ఆవేదన మాటలరూపంలో తనకు తెలియకుండానే పైకి పొంగి ప్రవహించాయి. 


“నన్ను ఎంతగానో అభిమానించే గోమతక్క మరణం నన్ను కృంగతీసింది వైశాలీ. మనం ఇద్దరం విడిపోయామనే బాధే కాకుండా అక్కమరణం, బావ ఇంటినుండి వెళ్లి పోవడం అమ్మా నాన్నని బాగా కృంగతీసింది. అమ్మ తట్టుకోలేక పోయింది. ఆ దిగులుతోనే పోయింది. ఆ తరువాత సంవత్సరం లోపే నాన్నగారు. 


గోమతక్క పురిటి బిడ్డను, మూడేళ్ల వికాస్ ను ఎవరు సాకాలి? ఆ సమయంలో నా బాధను పంచుకుని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరేనని ఏడ్చాను. మొత్తం మా కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఏమీ దిక్కు తోచని పరిస్తితి. పెళ్లి కావలసిన మా రాధ పెళ్లి చేసుకోకుండానే గోమతక్క పిల్లలకు తల్లి అయింది.


 

ఆ తరువాత నాకు జరిగిన రోడ్ ఏక్సిడెంట్. ఎలాగో బ్రతికాను. ఎడమకాలు పూర్తిగా తీసేసారు. ఎందుకు బ్రతికానా అనుకున్నాను. నీలా నేను పెద్ద చదువులు చదవలేదు, పెద్ద పెద్ద ఆశయాలను సాధించలేదు. నాకు నచ్చిన జీవితాన్ని అదే సొంతంగా కాలేజ్ ఏర్పరుచుకుని పదిమందికి విద్యాదానం చేస్తున్నాను. ఇంక అలసిపోయాననిపిస్తోంది. నేను నెరవేర్చవలసిన బాధ్యతలు కూడాలేవు. నా కాలేజ్ నిర్వహణను కొంతకాలం ఎవరికైనా అప్పగించాలని ఆలోచిస్తున్నాను. కొంతకాలం దేశాటన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడ నాకు ప్రశాంతత దొరికితే అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాను వైశాలీ”.


కంటనీరు పెడుతున్న వైశాలి ఒక్క ఉదుటన లేచి సుడిగాలిలా ఆనంద్ ను చుట్టేసింది. 


"నన్ను క్షమించు ఆనంద్. అటువంటి నిర్ణయం తీసుకోకు ప్లీజ్. నేనూ నీ వెంటే వస్తాను. ఆ నాడు నిన్ను కాదని వెళ్లి పోయాను, ఇప్పుడు నీవే కావాలని కోరుకుంటున్నాను". 


 అర్ధ్రత నిండిన స్వరంతో కన్నీళ్లు పెట్టుకుంటూ రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్న వైశాలి వైపు చూస్తూ"....


"సారీ వైశాలీ, నా నిర్ణయం లో మార్పు లేదు. నాకొక సాయం చేయగలవా"?


"చెప్పు ఆనంద్, నా ప్రాణం ఇమ్మనమన్నా ఇచ్చేస్తాను".


"నా ప్రాణంగా భావించే నా కాలేజ్ ను నీవు నిర్వహించాలి".


"అంటే... అంటే, నీ నిర్ణయాన్ని మార్చుకోవా ఆనంద్? 

పోనీ కొంత కాలం తరువాతైనా తిరిగి వస్తావా? నీ కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను".

"ప్రస్తుతం నా మనస్సంతా శూన్యంగా ఉంది వైశాలీ, నేను వెళ్లాలి. భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. కాలం తెచ్చే మార్పులో నా మనస్సు మీ అందరి సమక్షాన్ని కోరుకుంటే ఆ రోజు తప్పకుండా వస్తాను. నిన్ను క్షమించమని కదూ అడిగావు? 


నీపై నాకు కోపం ఎందుకుంటుంది వైశాలీ? నా మనోభావాలు, ఆలోచనలు నీకు నచ్చలేదు. అభిప్రాయాలు కలవనప్పుడు సర్దుకుపోతూ జీవించడం అసాధ్యం. నీలా నేను ఉండాలనుకోవడం అలాగే నాలా నీవు ఉండాలనుకోవడం అన్యాయం కదూ? ఎవరికి వాళ్లం మనం చేస్తున్నది కరెక్ట్ అనుకుంటూ విడిపోయినపుడు ఈ క్షమార్పణలు ఎందుకు వైశాలీ? 


సంతోషంగా ఉండు. అంజలి, వికాస్ ల పెళ్లి దగ్గరుండి జరిపించు. రాధకు, పిల్లలకు ధైర్యం చె”ప్పంటూ అక్కడనుండి నిష్క్రమిస్తున్న ఆనంద్ వైపు అలా సజలనయనాలతో చూస్తూ ఉండిపోయింది.


"నీవు తప్పకుండా నా కోసం తిరిగి వస్తావని నా మనసు చెపుతోంది ఆనంద్. నీ మనసుని కరిగించే లోపు నా వయసు కరిగిపోవచ్చేమో కానీ నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు". 


ఏనాటికైనా ఆనంద్ తనకోసం తిరిగి వస్తాడన్న ఆశతో ఆనంద్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడానికి సన్నద్ధమైంది.


========================================================================

--సమాప్తం--

========================================================================


యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








29 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Nov 10

readability bagundi medam garu

Like
bottom of page