#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #NeekaiEduruchupu
, #నీకైఎదురుచూపు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
'Neekai Eduruchupu - Part 3/4' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 06/11/2024
'నీకై ఎదురుచూపు - పార్ట్ 3/4' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
జరిగిన కథ:
కూతురు అంజలి వికాస్ అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడం తో దిగులు పడుతుంది వైశాలి.
గతంలో వైశాలి కూడా ఆనంద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.కెరీర్ లో పైకి ఎదగాలనే తపన ఆనంద్ కు లేకపోవడం ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది.
ఆనంద్ తో విడిపోయి అంజలిని కష్టపడి చదివిస్తుంది.
ఇక నీకై ఎదురుచూపు: పెద్దకథ పార్ట్ 3 చదవండి.
గత జ్ఞాపకాల సుడిగుండంలో నుండి వాస్తవం లోకి వచ్చిన వైశాలికి, ఆ రాత్రి కాళరాత్రే అయింది.
వైశాలి అంజలితో ముభావంగా ఉంటోంది. అంజలి కూడా అంతే. హాస్పటల్ నుండి రావడం, ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసి, కాసేపు టి.వి చూసాక తన రూమ్ లోకి వెళ్లి నిద్రపోతోంది. అదివరకు అయితే తల్లి పక్కనే సోఫాలో కూర్చుని ఆ రోజు తను టేకప్ చేసిన కేస్ ల గురించి వసపిట్టలా మాట్లాడుతూనే ఉండేది. వైశాలి కూడా అంతే, తన డిపార్ట్ మెంట్ గురించి, వాళ్లకు వస్తున్న ప్రాజక్ట్ గురించి చెపుతూ ఉండేది.
ఇప్పుడు ఎవరికి వారే పంతంగా మౌనంగా ఉంటున్నారు. తన మాటలను అర్ధం చేసుకుని అంజలి మనసు మార్చుకుంటుందేమోనన్న ఆశతో వైశాలి ఎదురుచూస్తుంటే, అమ్మ తన ఇష్టాన్ని తప్పకుండా ఒప్పుకుంటుందన్న ఆశతో అంజలి ఎదురు చూస్తోంది.
తల్లికి తనంటే ప్రాణం, కూతురి సంతోషమే తనకు ముఖ్యం కాబట్టి అమ్మ కన్విస్స్ అవుతుందని నమ్మకం అంజలికి. తను అమ్మ మనసుని బాధ పెట్టడం లేదే? తనేమీ అనామకుడిని, అప్రయోజకుడిని వివాహం చేసుకుంటా ననడం లేదు. వికాస్ కు ఏం తక్కువ? ఎంత మంచి వ్యక్తిత్వం? అతనితో పన్నెండు సంవత్సరాల నుండి స్నేహం కొనసాగుతోంది. ఎంతో తెలివైన వాడు. ఏం మెడిసన్ చదివిన వాళ్లే గొప్పవాళ్లా? మిగతా చదువులు గొప్పవి కావా?
అవకాశం ఎటువైపు వస్తే అలా వెళ్లి చదువుకుంటారు గానీ, అమ్మేంటి, నీకు సరితూగడంటూ మాట్లాడుతుంది? అయినా తనకు డాక్టర్ ని పెళ్లి చేసుకోవాలని లేదు. ఒకే వృత్తిలో ఉంటే కేసులూ, ట్రీట్ మెంట్సే, రోగులూ, రోగాలూ తప్పించితే మాట్లాడుకోడానికి ఏముంటాయి? థ్రిల్ ఏమీ ఉండదు. అదే వికాస్ లా సాఫ్ట్ వేర్ ఇంజనీరైతే ఆ కబుర్లు వేరే తమాషాగా ఉంటాయి.
తన చిన్ననాటి చెలికాడు, తనంటే ప్రాణం పెట్టేవాడు, వికాస్ నే తను వివాహమాడుతుంది. మవసులో దృఢంగా నిర్ణయించుకుంది.
ఒక వారం రోజులు మామూలుగా గడచిపోయాయి.
ఆరోజు బుధవారం. అంజలికి డ్యూటీ లేదు. ఉదయం లేచినప్పటి నుండి తల్లితో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. వైశాలి వంటగదిలో బ్రెక్ ఫాస్ట్ తయారు చేస్తోంది. బుధవారం రోజు ఎప్పుడూ ఆలస్యంగా లేచే అంజలి పొద్దుటే లేవడం ఆశ్చర్యం అనిపించినా మౌనంగా ఉండిపోయింది. వంట కూడా పూర్తి చేసి తను యూనివర్సిటీ కి వెళ్లి పోవాలన్న తొందరలో ఉంది.
"అమ్మా!” అంటూ తన ఎదురుగా నిలబడ్డ అంజలి పిలుపుకు తలెత్తి చూసింది. ఎన్నాళైంది ఇలా తనను పిలుస్తూ తనకు దగ్గరగా వచ్చి నిలబడడం. అంజలి కళ్లల్లోకి చూసింది ఏమిటన్నట్లు.
"ఈరోజు రాత్రి డిన్నర్ బయట రెస్టారెంట్ లో చేద్దాం. వికాస్ నూ, వాళ్ల పిన్ని నీ కూడా రమ్మనమన్నాను. నీకు పరిచయం చేద్దామని".
తను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.
"ఏమంటావమ్మా, వస్తున్నావు కదూ"?
తప్పదు. అంజలి తనని ఇరకాటంలో పెట్టేసింది. ఎంత మొండిది. తను ఏదైనా అనుకుంటే చాలు, చేసి తీరుతుంది ఆరు నూరైనా సరే.
“నేను నా కార్ లో ముందరే వెళ్లిపోతాను. నాకు కాస్త షాపింగ్ పని ఉంది. వికాస్ కూడా వస్తానన్నాడు. వాళ్ల పిన్ని ఆఫీస్ నుండి డైరక్ట్ గా వస్తానంది. నీవు ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయి సాయంత్రం ఆరుగంటలకల్లా నీ కారులో మినర్వా కాఫీ హౌస్, బంజారాహిల్స్ కు డైరక్ట్ గా వచ్చేయి”.
అన్నీ అదే టక టకా నిర్ణయించేస్తోంది. ఆనంద్ కూడా అంతే. అస్సలు తనకు ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ తనే నిర్ణయించేసే వాడు. అక్కడే తనకు నచ్చేది కాదు. గొడవలు వచ్చేవి.
‘ఏమిటీ తను ఆనంద్ ను ఈ మధ్య తరచుగా గుర్తు చేసుకుంటోంది? అంజలి ఆనంద్ గురించి చెప్పినప్పటి నుండి అతని ఆలోచనలు తనను వీడడం లేదు. కొంపతీసి అంజలి ఆనంద్ ను మధ్యవర్తిగా రమ్మనలేదు కదా’.
‘అయినా ఎలా వస్తాడు, తన ముఖం ఎలా చూడగలడు. తను పేరు పొందిన ప్రొఫెసర్ నని తెలియకుండా ఉంటుందా ఏమిటి? తనను చూడడానికి ముఖం చెల్లకే తనకు తెలియకుండా అంజలిని కలుస్తున్నాడు. అయినా అతనితో బంధం ఏనాడో విడిపోయింది. ఇప్పుడు అంజలి మూలానే అతను తిరిగి గుర్తుకు వస్తున్నాడు’.
"అమ్మా ఏమిటీ మాట్లాడవు" అన్న అంజలి ప్రశ్నకు "సరే వస్తానులే” అంటూ బాత్ రూమ్ లోకి స్నానం చేయడానికి వెళ్లిపోయింది.
సాయంత్రం వైశాలి రెస్టారెంట్ కి వెళ్లే సరికి సమయం ఏడుగంటలు అయింది. అప్పటికే అంజలి, ఆ అబ్బాయి వచ్చేసి ఉన్నారు. తనని చూడగానే అంజలి "అమ్మా వచ్చేసావా, ఏమీ ప్రాబ్లమ్ లేదు కదా” అంటూనే "ఇతనే వికాస్ అమ్మా, వికాస్.. మా అమ్మ వైశాలి” అంటూ పరిచయం చేసింది.
ఆ అబ్బాయి ఎంతో అందంగా ఠీవి గా ఉన్నాడు. వైశాలి ని చూస్తూనే ‘నమస్తే ఆంటీ’ అంటూ నవ్వుతూ విష్ చేసాడు. అతని రూపురేఖలూ మాట తీరూ, చాలా సుపరిచత మైనవిగా అనిపిస్తున్నాయి. కానీ అతన్ని ఇంతకముందు ఎప్పుడూ చూడలేదు. అంజలి పక్కనే కూర్చున్న అతను అంజలితో ఏదో అనడం అంజలి చిరునవ్వుతో తల ఊపడం అవీ ఎదురుగా కూర్చున్న వైశాలి గమనిస్తూనే ఉంది.
"అమ్మా! వికాస్ పిన్ని కి లాస్ట్ అవర్ లో ఏదో అర్జంట్ మీటింగ్ ఉందని చెప్పారుట. లేట్ అవుతుందని తను రాలేనని వికాస్ కు ఫోన్ చేసి చెప్పారుట".
వికాస్ వెంటనే "అవును ఆంటీ! పిన్ని మీకు సారీ చెప్పమంది. ఒక ఆదివారం వీలుచూసుకుని మీ ఇంటికి వస్తామని చెప్పమంది”.
ఈ విషయం ముందరే తెలుసుంటే తనూ వచ్చేది కాదు. అర్జెంట్ పనులు తనకూ ఉన్నాయి. కానీ అంజలి మాటను కాదనలేక వచ్చింది. కొంతమంది గొప్పకోసం తాము బిజీగా లేకపోయినా బిజీ అంటూ బోల్డు బిల్డప్ ఇస్తారు. గవర్నెమెంట్ ఆఫీస్ లో కూడా అంత ఊపిరి తీసుకోలేనటువంటి మీటింగులా అనుకుంటూ మనస్సులో గొణుక్కుంది.
కానీ వికాస్ చాలా అందంగా ఉన్నాడు. అంజలి తన తండ్రిలాగే పొడుగ్గా ఉంటుంది. అంజలి పక్కన వికాస్ మెరిసిపోతున్నాడు. మంచి స్పురద్రూపి, పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాడు. అతని రూపురేఖలు ఆమె ఆలోచనల్లో చోటుచేసుకున్నాయి. ఎక్కడ చూసానో అనుకుంటూ ఆలోచిస్తూనే ఉంది. తను వికాస్ తో సంభాషణ ఏమీ చేయలేదు. మధ్య మధ్యలో అంజలి వాళ్లిద్దరి మధ్యా నడుస్తున్న సంభాషణ లో తనను కలుపుతుంటుంటే అవును కాదు అని మాత్రం సమాధానమిస్తోంది.
డిన్నర్ పూర్తి అయ్యాక వచ్చేసే ముందు వికాస్ అన్నాడు. "సారీ ఆంటీ! పిన్ని రానందుకు ఏమీ అనుకోకండి. తొందరలో వచ్చి కలుస్తానని చెప్పమం”దంటూ బై చెపుతూ వెళ్లిపోయాడు.
-----
చాలా రోజుల తరువాత వచ్చిన ఆనంద్ ను చూస్తూనే "రా అన్నయ్యా, చాలా రోజులైంది కదూ నీవొచ్చి” అంటూ నిష్టూరమాడింది రాధ.
"అవునమ్మా! కాలేజ్ పనులతో క్షణం తీరిక ఉండడం లేదు. ఎకడమిక్ ఇయర్ మొదలైంది కదా, అడ్మిషన్స్ వాటితో బిజీగా ఉన్నాను. అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మనమన్నావని వచ్చాను. ఏరీ నా మేనల్లళ్లు? ఇంట్లో లేరా” అంటూ అడిగాడు.
వికాస్ ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అవుతుందన్నాడు. కల్యాణ్ ఎవరినో ఫ్రెండ్ ని కలసి వస్తానంటూ వెళ్లాడు.
"చెప్పమ్మా ఎందుకు రమ్మన్నావ్"?
"అన్నయ్యా, మన వికాస్ అంజలి అనే అమ్మాయిని ప్రేమించాడుట. ఆ అమ్మాయి డాక్టర్ అట. స్కూల్ లో చదువుతున్నప్పటి నుండీ ఇద్దరూ ఫ్రెండ్స్ అట. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవా లనుకుంటున్నట్లు నా అంగీకారం కోసం అడిగాడు.
మామయ్యతో కూడా చెపుతావా పిన్నీ అన్నాడు. కిందటి బుధవారం ఏదో రెస్టారెంట్ లో అందరం కలుద్దాం అని చెప్పాడు. నేను వెళ్లలేకపోయాను. పెద్ద వాడివి పైగా మా యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటున్నావు. నీతో ఈ విషయం చెప్పాలనే రమ్మనమన్నాను.
ఇంకో సంగతి చెప్తే ఆశ్చర్యపోతావ్ అన్నయ్యా. అంజలి తల్లి ఎవరో కాదు. వైశాలి వదినే".
"ఓ.. అంజలిని ప్రేమించాడా"?
"అంటే అంజలి నీకు తెలిసేమిటి అన్నయ్యా"?
"ఆ తెలుసమ్మా. నేను నీకు చెప్పలేదు. కన్నప్రేమను అణుచుకోలేక పోయాను. అంజలి మెడిసన్ చదువుతోందని తెలిసాకా దాన్ని కలిసాను. అప్పటినుండీ దాన్ని నెలకోసారి చూడకుండా ఉండ లేకపోతున్నాను. కానీ అది తన ప్రేమ విషయాన్నిఎప్పుడూ నాతో చెప్పలేదు. ఈ మధ్య పనుల హడావుడిలో దాన్నికలసి చాలా రోజులైంది”.
"ఓ.. ఇంకనేం అన్నయ్యా, ఎలా ఉంటుంది అంజలి?” కుతూహలంతో అడిగింది.
“బాగుంటుంది రాధా. మాటల్లో సౌమ్యత, అభిమానంగా పలకరించడం డాక్టర్ కు కావలసిన లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకుంది. నేను ఫలానా అని చెప్పాక ముందు మాట్లాడడానికి ఇష్టపడలేదు. తరువాత అదే నన్ను అడిగింది. అమ్మా మీరు ఎందుకు విడిపోయారని. కారణం చెప్పాక నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది పిచ్చి తల్లి”.
"ఏమో అన్నయ్యా.. నాకు భయంగా ఉంది. వైశాలి వదినతో మనకు సంబంధాలు లేవు. వికాస్ చూస్తే అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు వదినకు వికాస్ ఎవరో తెలిస్తే అంగీకరిస్తుందంటావా? ఇద్దరూ హైస్కూల్ చదువుతున్నప్పటి నుండి ఫ్రెండ్స్ ట. అంజలే తనను మొదట ప్రపోజ్ చేసిందని వికాస్ అంటున్నాడు”.
"ఇద్దరూ ఒకరినొకరు అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటామంటే ఎవరు ఆపగలరు రాధా? వాళ్లేమైనా చిన్నపిల్లలా వద్దు అని గట్టిగా చెప్పడానికి"?
"నిజమే కానీ అన్నయ్యా అసలు వికాస్ ఎవరో తెలిస్తే వదిన రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న భయం, అంతే!"
"ఇందులో భయం ఎందుకు రాధా? ఎవరు ఊహించారు ఇలా జరుగుతుందని. ఘటన అంటే ఇదేనేమో. విడిపోయాయనుకుంటున్న బంధాలు మన పిల్లల ద్వారా పునశ్చరణ అవడం, ఏదీ మన చేతిలో లేదు కదమ్మా’.
"ఒక ఆదివారం అంజలీ వాళ్లింటికి వెళ్లి వద్దాం, ఆంటీని కలుద్దాం అంటున్నాడు వికాస్. ఏమి మాట్లాడాలో ఏమిటో భయంగా ఉందన్నయ్యా".
"బాగుందే రాధా, భయపడడానికి నీవేమి తప్పు చేసావ్? నేనూ మీ వదినా విడిపోతే మధ్య నీవేమి చేసావూ, వికాస్ తప్పేమిటి? వెళ్లు, ఆమె ఏదైనా అన్నా పట్టించుకోకు. వికాస్ ను పెంచిన తల్లిగా నీవు గర్వంగా తలెత్తుకుని ఉండాలిగానీ ఇలా పిరికి తనం ఏమిటి రాధా! మొత్తానికి మేనకోడలిని నీ కొడుక్కి చేసుకుంటున్నావన్నమాట”.
"అన్నయ్యా! నన్ను అప్పుడే అలా ఆటపట్టించకు. ఇవన్నీ సవ్యంగా అయినప్పుడు కదా"?
"జరగాలని ఉంటే అన్నీ జరిగిపోతాయి రాధా. మనం కేవలం నిమిత్తమాత్రులం అంతే. వెళ్లి వస్తాను రాధా. మళ్లీ మరోసారి వస్తాను. ఏ విషయమూ ఫోన్ చేసి చె”ప్పంటూ కుంటుతూ నడుస్తూ వెళ్లిపోతున్న ఆనంద్ వైపు అలా చూస్తూ భారంగా నిట్టూర్చింది.
రాధ తను ఒక్కర్తీ వెళ్లి వైశాలిని కలవాలని నిర్ణయించుకుంది.
-----
అంజలికి ఆ రోజు రాత్రి హాస్పటల్ లో డ్యూటీ. వారంలో రెండురోజులు నైట్ డ్యూటీ ఉంటుంది. డిన్నర్ చేసి హాస్పటల్ కి వెళ్లిపోగానే వైశాలి సోఫాలో రిలాక్స్ అవుతూ టి.వి ఆన్ చేసింది. ఎప్పుడైనా న్యూస్ తప్పించితే మిగతా ప్రోగ్రామ్స్ మీద ఏమీ ఆసక్తి ఉండదు. ఖాళీ దొరికితే ఇంగ్లీష్ నవలలు, మేగ్జైన్స్ చదువడం వైశాలికి ఎప్పటినుండో ఉన్నఅలవాటు.
యధాలాపంగా ఏదో తెలుగు న్యూస్ ఛానల్ ఆన్ చేసింది. ఎవరో ప్రముఖ వ్యక్తి అని చెపుతూ ఈ ఎకడమిక్ ఇయర్ లో ఆ కాలేజ్ సాధించిన ప్రతిభ గురించి చెపుతూ ఒక వ్యక్తిని స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తోంది ఛానల్. ఆ వ్యక్తిని చూడగానే తృళ్లిపడింది వైశాలి. అతను... ‘ఆనంద్ కదూ’ అనుకుంటూ కళ్లు అప్పగించి టి.వి వైపే చూడసాగింది.
ఈ సంవత్సరం మీ కాలేజ్ రిజల్ట్స్ మిగతా అన్ని కాలేజ్ రిజల్ట్స్ కంటే అధిక శాతం ఉండడమే కాదు టాప్ రేంక్స్ కూడా వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నామంటూ ఆయనను కొన్ని ప్రశ్నలను అడుగుతుంటుంటే వైశాలి తెల్లబోతూ చూడసాగింది.
"మీరు కాలేజ్ ఎప్పుడు స్థాపించారు"?
“మా ‘విజ్నాన జ్యోతీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్' ను స్థాపించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తి అయింది. ప్రతీ సంవత్సరం నా కళాశాల నుండి ఎందరో విద్యార్థీ విద్యార్థినులు, డిగ్రీలు పి.జీ లు విజయవంతంగా పూర్తిచేసుకుని వెడుతున్నారు. మెరిట్ లో మా విద్యా సంస్త మిగతా అన్ని విద్యాసంస్తల కంటే ముందంజ వేస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నాను. స్టూడెంట్స్ కు ఆ కాలేజ్ కేంపస్ లోనే కంప్యూటర్ కోర్సస్ నేర్చుకునే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసాను”.
"అభినందనలు ఆనంద్ గారూ. కాలేజ్ స్థాపించడంలో మీ ముఖ్య ఉద్దేశ్యం తెలుసుకోవచ్చా"?
“సొంతగా కాలేజ్ నిర్మించడం నా ఆశయం. వ్యాపార పరంగా కాకుండా అన్ని వర్గాల వారికి విద్యావకాశాలను అందచేయాలని. చాలా కార్పొరేట్ సంస్తలు మా కాలేజ్ విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే డిగ్రీతో బాటూ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది”.
ఆనంద్ లో వయస్సు తెచ్చిన కొద్ది మార్పులు తప్పించి ఏ మార్పూ లేదు. సూట్ లో అందంగా హుందాగా ఉన్నాడనుకుని కళ్లు అప్పగించి ఆసక్తిగా ఆ ఇంటర్వ్యూని చూస్తోంది.
"మీకు పది సంవత్సరాల క్రితం మేజర్ రోడ్ ఏక్సిడెంట్ అయిందని ఆ ఏక్సిడెంట్ లో మీ ఎడమ కాలు తొలగించవలసి వచ్చిందని విన్నాము. వెరీ సారీ సర్, ఏమైందో చెప్పగలరా మీకు అభ్యంతరం లేకపోతే?”
"అవును. బైక్ మీద వస్తుంటే స్పీడ్ బ్రేకర్ వద్ద స్కిడ్ అయి బైక్ మీదనుండి దొర్లి కింద పడ్డాను. ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్ నన్ను గుద్ది వెళ్లిపోయింది. తలకు కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయి. చనిపోవలసిందే. కానీ ఏ దైవబలమో నన్ను కాపాడింది. ఎడమకాలు నుజ్జు నుజ్జు అయింది. తీసేసారు. కృత్రిమ కాలు పెట్టించుకుని జీవితం సాగిస్తున్నాను”.
వింటూన్నవైశాలి ఆ మాటలకు స్టన్ అయింది.
‘ఏమిటీ.. ఆనంద్ కి ఏక్సిడెంట్ అయిందా? కాలు తీసేసారా, ఓ మైగాడ్’ అనుకుంది.
ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకుని అతని ద్వారా బిడ్డను కంది. అతనితో కొన్ని సంవత్సరాలు సంసార మధురిమలను పూర్తిగా ఆస్వాదించింది. విడాకులు తీసేసుకుని అతనితో సంబంధాన్ని త్రెంచేసుకున్నా అతడు ఒకప్పుడు తన భర్త. తమిరువురి ప్రేమ చిహ్నంగా అంజలి తన కళ్లెదురుగానే ప్రతీ క్షణం కనపడుతూనే ఉంటుంది. బాధగా కళ్లు మూసుకుందో క్షణం.
మనసంతా ఏదో తెలియని బాధ ఆవహించింది. అంజలి ఏమిటి ఈ విషయాలేమీ తనతో చెప్పనే లేదు? ఆనంద్ కలుస్తున్నాడని మాత్రమే చెప్పింది. తను అతని గురించి మరి ఏమీ వివరాలు అడగలేదని చెప్పలేదా? మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తూనే టి.వి. వైపు చూస్తోంది.
"మీ ఆశయాలు, ఆలోచనలూ చాలా గొప్పగా ఆదర్శవంతంగా ఉన్నాయి ఆనంద్ గారూ. మీ కాలేజ్ భవిష్యత్ లో మరింత ప్రగతి సాధించాలని మీలాంటి నిస్వార్ధుల మూలకంగా నే యువత నిరుద్యోగ సమస్య తీరాలని విశ్వసిస్తున్నాం” అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
ఆరోజు రాత్రి అంతా వైశాలికి నిద్రలేదు. ఆనంద్ కళ్లముందు మెదులుతున్నాడు. అతనికి ఏక్సిడెంట్ అయిన విషయానికి మనసు ఎందుకో చలించిపోతుంటే కళ్లనుండి తనకు తెలియకుండానే దుఃఖాశ్రువులు దిండుని తడిపివేస్తున్నాయి.
అంజలిని ఆనంద్ గురించి అడగాలనిపించలేదు. అదే పనిగా ఆనంద్ గుర్తుకు వస్తున్నాడు. తను అతనితో విడిపోయాక అతని గురించి ఏమీ పట్టించుకోలేదు. తన ఉద్యోగం,అంజలి పెంపకంతో బిజీ అయిపోయింది.
తండ్రి మొదట్లో “ఒంటరిగా పిల్లతో ఎలా బ్రతుకుతావు వైశాలీ, పోనీ పెళ్లి చేసుకుంటావా, సంబంధం చూడమని మీ అక్కకు చెప్పనా” అంటూ అడిగేవాడు. తనకు ఎందుకో మరో వివాహం పట్ల ఆసక్తి లేదు.
ఆనంద్ తనకు అన్ని విధాలా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉంటాడు. అతని భార్యా పిల్లలు ఎలా ఉంటారో? సొంత కాలేజ్ పెట్టి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడన్న మాట. అంజలి డాక్టర్ అయి మంచి కార్పొరేట్ హాస్పటల్ పనిచేస్తోందని తెలుసు కదా, ఇదంతా వైశాలి గొప్పతనమే అనుకుని ఉండచ్చు.
తను తన జీవితాన్ని ఫణంగా పెట్టి తన వృత్తిలో ఉన్నత స్తానానికి చేరుకుని హెచ్.ఓ.డీ అయి పేరు ప్రఖ్యాతులు గడించింది. డాక్టర్ వైశాలి అంటే తెలియని వారు లేరు. కూతురుని బాగా చదివించుకుంది. మళ్లీ ఒకలాంటి అహం మత్తులో మళ్లీ పడిపోయింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments