top of page
Writer's pictureSivajyothi

నీల 'కల'

#Sivajyothi, #శివ జ్యోతి, #NeelaKala, #నీలకల, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Neela Kala - New Telugu Story Written By - Sivajyothi

Published In manatelugukathalu.com On 07/11/2024

నీల కల - తెలుగు కథ

రచన: శివ జ్యోతి

 

 స్పీకర్లో సుప్రభాతం వినిపిస్తోంది. నీల, తులసితల్లికి ప్రదక్షిణాలు చేస్తుంది. ఉమాపతి చేతులు విరుచుకుంటూ నిద్రలేచాడు. ‘కరాగ్రే వసతి లక్ష్మి’ అంటూ శ్లోకం చదువుకుంటూ మంచం దిగాడు. 


“ఏమే! ఆ సొంటి కాఫీ ఇట్టా తగలెట్టేది ఏమైనా ఉందా లేదా?” అంటూ కేకలేశాడు. 


 నీలావతి “అలాగేనండి, తీసుకొని వస్తున్నాను” అంటూ వంటింట్లో కెళ్ళింది. 


“ఏమిటో.. అడిగితే గానీ కాఫీ నీళ్లు కూడా మొఖాన కొట్టే వాళ్ళు లేరు ఈ కొంపలో. పొద్దుటే ఈ రామాయణం నాకు..” అంటూ గర్జించాడు. 


“ఇదిగో తీసుకోండి” అంటూ నీలావతి సకిలిస్తూ కాఫీ ఇచ్చింది. “ఇంతలో అంత కోపమా? పూజలో ఉన్నా కదండీ” అనంది. 


“పొద్దుట లేచి తగలడచ్చుగా” అన్నాడు ఉమాపతి “సరిగ్గా నా కాఫీ వేళకే నీకు పూజ గుర్తొస్తుందా” అన్నాడు. 

వీళ్ళ మాటలు విని పక్కింటావిడ పెరట్లో నుంచి “ఏంటే నీలావతి.. ఏదో గొడవ పడుతున్నట్టు ఉన్నారు” అంటూ ఇకిలించి మరీ అడిగింది. 


“అబ్బే ఏం లేదండి. కాఫీ అడిగారంతే. నేను పూజ లో ఉన్నాను. కోప్పడ్డారు అంతే” అంటూ మళ్ళీ వంట ఇంట్లోకి వెళ్లిపోయింది. 


“స్నానానికి నీళ్లు తోడావా” అని అరిచాడు ఉమాపతి. 


“ఆ తోడానండి, వెళ్లి స్నానం చేయండి” అన్నది నీలావతి. 


స్నానం ముగించుకొచ్చిన ఉమాపతి నీలావతి తో “అన్నట్టు ఏం ఫలహారం చేసావు ఇవాళ” అని అడిగాడు.


 ఆ పలకరింపులో ‘పలహారం బాలేకపోతే ఇక నువ్వు శంకరగిరి మాన్యాలకే’ అని అనేంత దర్పంతో కూడిన బెదిరింపు వినిపించింది. నీలావతి ఫలహారం పెట్టి ఏమీ మాట్లాడకుండా వెళ్లి రెడీ అవుతున్న భర్తని చూచి ‘హమ్మయ్య, ఈ పూటకి గొడవకి అడ్డం పడ్డట్టే’ అని అనుకుంటూ వంటింట్లోకెళ్లి భర్తకి ఆఫీస్ కి టిఫిన్ కట్టించింది. 


టిఫిన్ బాక్స్ భర్త చేతికిస్తూ “ఏవండీ! ఇవాళ మన పెళ్లిరోజు. ఆఫీస్ నుండి త్వరగా రండి” అని పిలిచింది. 


ఆ పిలుపులో ‘వచ్చేప్పుడు నాకు పట్టు చీర అయినా తేకపోయారా’ అని అడిగినట్టు అనిపించింది ఉమాపతికి. 


“అవును, ఆ సంగతే మర్చిపోయా. ఇవాళ మన పెళ్లి రోజు కదూ! నిన్ను నాకు కట్టబెట్టిన ఆ పంతులు ఎక్కడున్నాడో కానీ ఆన్ని పట్టుకుని కొట్టాలి. బాగా గుర్తు చేసావు” అని వెటకారమాడాడు ఉమాపతి. 


సన్నికల్లు మీద మెట్టెలు తొడిగించుకుంటూ సిగ్గుపడ్డ క్షణానికి శిక్ష కాబోలు ఈ వెటకారాలు, చిత్కారాలును అని నవ్వి ఊరుకుంది. 


 నీలావతిని చూచి ఉమాపతి “సరే సాయంత్రం త్వరగా వస్తాలే” అని అన్నాడు. 


నీలావతి ఊరుకోక “ఏవండీ! వచ్చేప్పుడు నాకు పట్టుచీర తీసుకురారూ..” అని అడిగేసింది. 


ఉమాపతి “మీ అక్క, చెల్లెలు పట్టు చీరలు కడితే కానీ అందంగా ఉండరు. నువ్వు అలాగా నూలు చీర కట్టినా కూడా కళకళలాడుతావ్” అన్నాడు. 


“అయితే నూలుచీర కొనుక్కోనా” అంది నీలావతి. 


కోపంగా ఉమాపతి “అలమర నిండుకు చీరలే నీకు. ఇంకా కావాలా?” అని అన్నాడు గాత్రము పెంచి. 


‘ఇలాంటి కబుర్లకు ఏం తక్కువ లేదు. ఆ చీరల్లో ఒక్కటి మీరు కానీ మీ పరివారం కానీ కొనిచ్చిన పాపాన పోలేదు. మా పుట్టింటి నుండి తెచ్చుకున్న చీరలనే చూచి ఆ మాట అంటే ఇక మీ వాళ్లు మచ్చుకైనా ఒకటి కొని ఇచ్చుంటే ఇంకెన్ని అనేవాళ్ళు’ అని అనుకొని మనసులో ప్రారబ్దం అని ఊరుకుంది. 


ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్తకి చల్లనిచ్చి “ఏవండీ! మా పిన్ని కూతురు పెళ్లికి రేపు వెళ్లాలి కదా.. సారె ఏమైనా పెడదామండి” అని అంది గోముగా. 


ఉమాపతి “చాలు చాల్లే ఊరుకో! వాళ్ళ పెళ్ళికి వెళ్లడమే ఎక్కువ అనుకుంటే ఇక సారే కూడానా” అనన్నాడు. 


“సర్లే కానీ పండక్కి మా చెల్లెలి పిల్లలకి బట్టలు తెమ్మన్నాను, తెచ్చావా” అని అడిగాడు. 

“లేదండి, ఇవాళ గుమ్మడి వడియాలు పెట్టాను. పనుండెనండి.రేపు వెళ్తాను” అనంది. 


“రోజంతా నువ్వు చేసేది ఏంటి? ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన నా మొద్దు ముఖంతో అది ఇది కావాలని రభస చేయాలని ఆలోచన తప్ప అన్నాడు. 


ఉమాపతి “అక్కరలేని వాటి మీద ఉన్న ఆలోచన సంసారం మీద ఉంటే ఇంకా బాగుండేది” అని అన్నాడు. 


నీల మనసులో ‘ఆ అవును. మా నాన్న నా చదువుని సగంలో మాన్పించకుండా ఉంటే ఇంకా నిజంగా బాగుండేది. నాకు ఈ పాట్లు తప్పే’ ననుకుంది. ‘బ్రహ్మదేవుడు తన రాత రాశాక ఇక ఎవరు ఏం చేసే వీలుంది? తన రాత మార్చే మరో బ్రహ్మ పుడితే గాని కట్టె కాలేదాకా ఈ కష్టాలు తీర్చడం ఎవరి తరం’ అని బాధపడింది. 


భోజనాలయ్యాయి. మజ్జిగ పులుసులో ముంతడు అన్నం తిన్నాడు ఉమాపతి. నీల కాస్త పప్పన్నం తిని పనులు ముగించుకొని పక్క చేరింది. 


రాత్రి అయ్యిందిగా.. ఉమాపతి గారు “అది కాదే! నేను సంపాదించేది, మిగిలించేది అది మాత్రం ఎవరికీ చెప్పు? నీకు కాదు..? మన పిల్లల భవిష్యత్తు కోసం కాదా, నేనేం కట్టుకుపోతానా? నా చెల్లిని నేను కాక ఇంకెవరు చూస్తారు చెప్పు? అందరిని బాగా చూస్తే నీకేగా మంచి పేరు” అన్నారు. 


నీల ‘ఆ.. నిజమే ఈనాటికి ఒక నూలు చీరైనా పెట్టమనస్కరించని నీవా రేపటి మాటలు మాట్లాడుతుంది’ అనుకుంది. 


కడదాకా తోడుండేది నీవేగా అంటూ అవసరానికి తీయగా కబుర్లు చెప్పాడు. చేసేది లేక చెవులు మూసుకోలేక నీల అక్కున చేరింది. లేదంటే ఉమా గారు తమ తిక్కతో తయారవుతారని నీలకు బాగా తెలుసు. 


ఉదయం అయ్యింది. అత్తగారు ఊరు నుండి దిగారు. తన సంచి అందుకుందామని వెళ్లిన నీలతో “ఏమే, బానే ఒళ్ళు చేసావే! మొత్తం అంతా నువ్వే తింటున్నావా నా కొడుకుని ఎండ గట్టి..?” అని అలవాటుగా యటకారం ఆడింది. 


“మామయ్య గారు రాలేదేమి అత్తయ్య, మామయ్య గారికి భోజనానికి ఇబ్బంది అవ్వదూ?” అని విచారించి అత్తగారినడిగింది నీల. 

“ఎందుకులేమ్మ నీకు శ్రమ.. ఇంతమందికి నువ్వు ఏం వండుతావు కానీ ఆయన పాట్లు ఏవో ఆయన పడతారులే” అంది వ్యంగ్యంగా తన బుద్ధి చూపిస్తూ. 


“శ్రమ ఏముంది అత్తగారు.. నలుగురికి వండేది ఇంకొకరికి వండడం పని అనుకోని మనిషిని అని నీకు తెలియదా అత్తమ్మ” అని అంది. 


దానికి అత్తగారు “నేనైతే కొడుకుని చూడకుండా ఉండలేక వచ్చాను. ఈ వయసులో మీ మామగారికి ఓపిక ఎక్కడ”: అని ఓ ముక్తాయింపు ఇచ్చింది. 


అత్తవారిని రెస్టు తీసుకోమని చెప్పి వంటింట్లోకి దూరింది నీల. గారెలు చేయటానికి పప్పు నానబెట్టి పనిలో పడింది. టిఫినీలు అయ్యాయి మధ్యాహ్నం భోజనాల సమయానికి వేడివేడిగా గారెలతో బూరెలతో భోజనం వండి పెట్టింది అందరూ భోజనాలయ్యాక లేచి వెళ్లి పడుకున్నారు నీల గిన్నెలు ఎత్తిపెట్టి సర్ది శుభ్రం చేసి పనిలో పడింది. 


అంతదాకా లేని మోకాళ్ళ నొప్పులు గుర్తు చేసుకుంటూ కాళ్ళు ఒత్తుకుంది అత్తగారు.


“ ఏమిటోనమ్మ నీకు కొద్దిగా సాయం చేయలేకపోతున్నాను. వయసు అయిపోతోంది కదా” అని అంది. 


నీల “పరవాలేదు అత్తయ్య, నేను చేసుకోగలను. నీకెందుకు శ్రమ” అని అంది. మనసులో తన ఆడపడుచుకి ఎంత సాయం చేస్తుందో ఈ వయసులో అని గుర్తు చేసుకుంటూ. 


సాయంత్రం టీ తాగుతూ కబుర్లు పెట్టుకున్నారు తల్లి కొడుకులు. తన వంటకి పేర్లు పెడుతూ అత్తగారు అంటుంది “ఎంతైనా నేను వండినట్టు నీ పెళ్ళాం వండలేదు రా” అని.


“అవునమ్మా! నువ్వు వండితే పొట్ట పగిలిపోయేలా తినేవాడిని. ఈ కాలం వీళ్ళకి వంట ఎక్కడ చేతవుతుంది మాటలు తప్ప” అని కొడుకుగారంటున్నారు. 


నీల మనసులో ;అవునవును. ఆ విషయం ఒక్కొక్కళ్ళు కుంభాలు తిన్నాక అనిపించింది కాబోలు’ అని అనుకుంది. 


అత్తగారు “ఏరా నీ పెళ్ళాం వడియాలు పెట్టినట్టుందిగా. నేను తీసుకెళ్తాలే. మీ చెల్లెలు ఆ పిల్లలతో ఎక్కడ కష్టపడి పెట్టుకుంటుంది కానీ దానిని వేరే పెట్టుకోమని చెప్పు” అని అంది.

 నీల “తనకేనా కష్టం, పిల్లలు ఉన్నది.. నేను కూడా కష్టపడి పెట్టుకుంటున్నా పిల్లలతో” అనుకుంది. ఆడపడుచు కష్టం తెలిసిన అత్తగారికి తన కష్టము మనసుకు తెలియనందుకు కృంగిపోయింది. 


రాత్రి అయింది. భోజనాలు అయ్యాక అత్తగారు కొడుకుతో “ఏరా ఉమా! ఊర్లో పొలం ఒకటి అమ్మకానికి వచ్చిందిరా, కొంటావేమిటి ? మీ నాన్న నా పేరున పొలము కొందామనుకున్నారు కానీ కుదరలేదు. నువ్వైనా కొంటావా” అని అడిగింది. సరేనని తల ఆడించాడు. పైకం తీసుకుని ఊరు బయలుదేరింది అత్తగారు. 


నీల “ఇదంతా మా కోసమే అన్నారు కదండీ! మరి పైసా ప్రయోజనం లేని బంజరు భూమిపై పెట్టుబడి ఎందుకు పెట్టారు? అది మీ అమ్మ పేరున, రేపు మీ చెల్లి వాటాలకి రాదా” అని అడిగింది. 


దానికి ఉమా కోపంగా “ఏం? నీ తల్లి గారు అప్పచెప్పిన ఆస్తి ఏమైనా వారికిచ్చానా? నేను సంపాదించిందిగా. ఒక్క మగ నలుసు. నేను పెడితే తప్పేంటి” అడిగాడు ఉమా. 


సాయంత్రం పెరట్లో పక్కింటి ఆయనతో ముచ్చట్లు పెడుతూ ఉమగారన్నారు “ఈ ఆడవాళ్ళకి ఏమీ తెలియదండి. అమ్మ నాన్నకు పెట్టడం తప్పంటారు. తోడబుట్టిన వాళ్లకు పెడితే తట్టుకోలేరు” అని అన్నాడు.


నీల అది విని మనసులో ‘నిజమే కాదా. ఏమి తెలుసు నాకు? తల్లిగారింటిలో తల్లిదండ్రుల మాట జవదాటము. అత్తగారింటిలో ఎవరి ఆలోచన జవదాటము. చిటికెన వేలుతో ఇంద్రధనస్సుని అటుగా తోసిన సీత రాముడి తోడు లేక రావణాసురుడిని చూడగానే మూర్చిల్లింది. ఎందుకు అని తెలియదు. మనసులో అనుకునేవి బయటకు చెబితే తప్పేంటని ఆలోచించడం తెలియదు. సమాజానికి విరుద్ధంగా తను న్యాయానికి నిలబడి ఎదిరించిన యెడల మగని మాటల దాడికి, అత్తగారి శాపనార్థాల దాడికి, ఆడపడుచు మూతి విరుపులు దాడికి తట్టుకొని నిలబడడం ఎలాగో తెలియదు. 


హారర్ ఓవర్ హానర్ అని కాన్సెప్ట్కి ఎలా అలవాటు పడ్డాము అని తెలియదు. ‘ఆడది అవసరాలకు మాత్రమే అభిమానానికి కాదు’ అనే ఆలోచన మగాళ్లకు ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఏదో ఒక రోజు తన మనసులో మాట బయటకు చెప్పగలిగిన రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు అని అనుకుంటూ సంసార సాగరం ఈదటం మొదలెట్టింది. 


నాలుగు పదులు దాటగానే మూర్ఖత్వం ముడి పడిపోయింది. ఇహ ఆరుపదులు దాటితే ఆకాశం అంచులు చేరుతుందేమో! జవసత్వాలు తగ్గాకైనా ఈ కష్టం నా తోడు రాకుంటే బాగుండు అనుకుంది. 


 వందమంది వీరుల యుద్ధం కన్నా ఓ వనిత అంతర్మధనం మిన్న అనుకుంది. ఈ ఈసడింపుల పోరులో ఛీత్కారాల చీవాట్లతో యుద్ధం చేసి తన మర్యాదని, మనశ్శాంతిని గెలవాలనుకుంది. నీలకు తెలియని కొత్త విషయం ఏమిటంటే మూర్ఖునితో గెలవడం సులువు కాదని. 


కష్టాలని ఎదుర్కొని నిలవ గలిగే ధైర్యం లేక, మాటలంటుంటే చప్పుడు చేయకుండా ఉండగలిగే అవకాశం లేక, నీకు నేనున్నాను నీవు నీవు లాగే ఉండు అని చెప్పే ఆధారము లేక తడబడిన సమయంలో నీలకల నెరవేరేనా.. 


కడుపు మంట కాష్టమై కాల్చినట్టు


 గుండె బాధ గునపమై గుచ్చినట్టు


 ఉవ్విళ్లూరే ఆశలపై ఉరుములు దాడి చేసినట్టు


 చేతకానితనానికి చేతన చేబదులుగా చేరినట్టు


రారాదా ఓ వసంతమా బ్రతుకు బాగుపడేటట్టు?


సమస్య పరిష్కారం అవ్వాలి అంటే మగవారు తమకి మూర్ఖత్వం ఉన్నంత, నేర్చుకున్నంత, చూపించినంతలో కొంచెం అయినా ప్రేమ, తమ వారిపై, తమ ఆడవారి మీద చూపించగలగాలి. 


 ఎవరో అన్నట్టు మర్యాద లేని ప్రేమ ముందుకెళ్లదు. నీలకు కూడా ధైర్యం, అవకాశం తోడు వస్తాయని, ఎవరి మీద తను ఆధారపడకుండా స్వశక్తితో ప్రేమతో గౌరవంతో ముఖ్యంగా మనశ్శాంతితో జీవిస్తుందని ఆశిద్దాం


***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.


75 views3 comments

3 Comments


Phani Bhushan
Phani Bhushan
4 days ago

అవగాహనా లోపమైతే అది ఒక కల అది ఆలోచనైతే ఒక జీవితం

Edited
Like

mk kumar
mk kumar
5 days ago

neela kala kalagane migilipoyundi. podatlite poyedmi ledu vidakulu tappa.

Like
Phani Bhushan
Phani Bhushan
4 days ago
Replying to

కలలు కలలుగానేవుంటే బాగుంటది అవి నిజమైతే తర్టుకోలేము

Edited
Like
bottom of page