'Nene Heroni' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'నేనే హీరోని' తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
యువ ప్రేక్షకులు.. బావున్న సినిమాలని చూస్తూంటారు కానీ, చాలా కొద్ది వాటినే తమ మనసుకి దగ్గరగా భావిస్తూంటారు. ప్రతీ ఫ్రేములోనూ తమని తాము చూసుకుంటారు. ఈ మధ్య వచ్చిన “ప్రేమంటే ఇదేరా” అలాంటి సినిమానే. కాబట్టే కోటి రూపాయలతో నిర్మించిన సినిమా వందల కోట్లు దాటి దూసుకెళుతోంది. ఇంతటికీ కారణం.. శివదాసు.
తెరవెనుక దర్శకుడిగా యువత నాడిని సరిగ్గా పట్టుకో గలడమే కాదు.. తెరపైన హీరోగా నేటి తరానికి ప్రతిబింబంలా అలరించాడతను. ఆ కుర్రాడి ఉద్విగ్నభరిత ప్రయాణం ఇది..
——————
ఆ రోజు “ప్రేమంటే ఇదేరా” సినిమా విడుదల తేదీ ఖరారైన రోజు అది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల మధ్య కాసింత ఖాళీ దొరికితే మానాన్న నడుపుతున్న జిరాక్సుషాపు వద్దకి వెళ్ళాలనిపించింది. వెళితే ఎప్పటిలాగే మా ‘ జిరాక్సుషాపు’ ఫుల్ బిజీబిజీ గా ఉంది. నేను వచ్చింది గమనించినా.. పలకరించే తీరిక లేదు మానాన్నకి.
చాలా సేపటి తరువాత “ఏరా; రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?” అన్నాడు.
నేను జవాబు చెబుతూండగానే మరో కస్టమర్ వచ్చాడు. ‘నాలుగు కాపీలు కావాలి.. ఎంతవుతుంది?’ అన్నాడు. నాన్న పది రూపాయలని చెప్పి నాతో మాట్లాడుతుండగానే అతని ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసి ఇచ్చాడు. ఆ కస్టమర్ తనకిచ్చినా నాణేలని సరిగ్గా లెక్కించకుండానే టేబుల్ పైన పెట్టాడు.
నాతో మాట్లాడుతుండగానే చటుక్కున ఏదో గుర్తొచ్చినట్టు టేబుల్ పైన నాణేలని చూసి ఉలిక్కిపడ్డాడు.
“అరె, నేను పది రూపాయలంటే అతను ఆరు రూపాయలు ఇచ్చాడ్రా” అన్నాడు.
“అతను నాకు తెలిసిన వాడే.. ఫోన్ చేసి అడుగుతానుండు” అంటూ మొబైల్ తీశాడు. ’
“అబ్బా! నాలుగు రూపాయలే కదా.. వదిలెయ్ నాన్నా” అన్నాను విసుగ్గా.
“అదెలాగా; మనది కాని డబ్బుకోసం తాపత్రయపడటం ఎంత తప్పో.. రావాలిసినవాటిని నిర్లక్ష్యం చేయడమూ అంతే తప్పు” అంటూ ఆ వ్యక్తికి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు.
ఎందుకో నాలో విసుగు పోయి.. ఒక్కసారిగా నవ్వొచ్చేసింది.
సినిమా దర్శకుడిగా నేను కోటానుకోట్లు కాకున్నా లక్షలు సంపాదిస్తున్నాను. అక్కయ్య, అన్నయ్య- ఇద్దరూ జీవితంలో స్థిరపడిపోయారు. అయినా సరే.. నాన్న తన జిరాక్స్ షాప్‌లో రోజంటూ కష్టపడటం మానలేదు. రూపాయీ, రెండు రూపాయల కోసం గొడవ పడటం మానలేదు.
నాకు నవ్వుతో పాటు మరో ఆలోచన కూడా వచ్చింది.. నాన్న యింత ఖరాఖండీగా ఉండబట్టే కదా ఈ రోజు మేమిలా సెటిల్ కాగలిగాం అని. : ఈ జిరాక్స్ షాపే లేకపోతే మేమెక్కడ అని;;
——————————————
తమిళనాడు దిండివనం పట్టణం. దగ్గరలోని ఓ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చాడు మానాన్న. మా తాతా వాళ్ళు ఉత్తరాంధ్ర రణస్థలం అనే ఊరునుంచి ఏదో ప్రాజెక్ట్‌ను కోసం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. నాన్న పదో తరగతి వరకూ చదువుకున్నాడు. చెన్నైహార్బర్‌లో మెకానిక్ గా పనిచేసే వాడు.
పెళ్ళైనా అన్నయ్య పుట్టేదాకా ఆ పనులు చేస్తూ వచ్చాడు. ఆ తరువాత టైప్, షార్ట్‌హాండ్ నేర్చుకుని.. ఓ కాలేజీలో స్టెనోగ్రాఫర్ గా చేరాడు. కొన్నాళ్ళకి ఈ జిరాక్స్‌షాప్ పెట్టాడు. అప్పటికే అక్కయ్య, నేనూ పుట్టాం.
తమకున్నా, లేకున్నా మా ముగ్గురిని మంచి కాన్వెంట్ లో జాయిన్ చేశారు. అన్నయ్య ఇంజనీర్ కావాలనీ, అక్కయ్యను డాక్టర్ చేయాలని, నన్ను కలెక్టర్ గా చూడాలని కలలు కన్నాడు. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడే.. నాకోసం జీకే పుస్తకాలు తీసుకొచ్చి ‘ నువ్వు పెద్దయ్యగా ఐఏస్ కావాలి’ అనేవాడు.
అమ్మా, నాన్నలు ఆశించినట్టే పదోతరగతి, ప్లస్ టూ ల్లో 98 శాతం మార్కులు సాధించాను. చెన్నైలో ప్రఖ్యాత త్రిబుల్‌ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. విద్యార్థులు అన్ని రకాలుగా ఎదిగేందుకు ఊతమిచ్చు కాలేజ్ అది.
నేను అక్కడ చేరగానే ‘ ఇంజనీరింగ్ కాకుండా నీకు ఎందులో ఇంట్రస్టుంది? ‘ అని అడిగారు.
‘నేను సివిల్స్ రాయాలి’ అన్నాను.
ఇంకేం, నాక్కావాలిసిన మెటీరియల్‌తో పాటు గైడెన్స్ కూడా ఇవ్వసాగారు. నేను ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉండేవాణ్ణి. అవన్నీ పక్కనపెట్టేలా సినిమా వ్యామోహం నన్ను ముంచెత్తు తుందని అసలు ఊహించలేదు.
—————————
కోలీవుడ్‌లో ఏ సినిమా కోసం కాలేజీ సీన్స్ తీయాలన్నా.. దర్శకులు మా క్యాంపస్‌కే వస్తుండేవాళ్ళు.
ఓ రోజు ఫ్రెండ్స్‌తో కలిసి సూటింగ్ చూడటానికి వెళ్ళానా..
ఉదయ్ హీరోగా దేవా దర్శకత్వం వహించిన ‘( కలలు)’ అన్న సినిమా అది. అడుగుపెట్టిన క్షణమే ఆ కలల ప్రపంచం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
మనం తెరపైన చూసే వెలుగుజిలుగుల కన్నా.. తెరవెనుక నుంచి వాటిని సృష్టించేవాళ్ళ సృజన అధ్భుతం అనిపించింది.
ఆ తరువాత రోజు మా కాలేజీలోని షార్ట్‌ఫిల్మ్ క్లబ్‌లో చేరిపోయాను. ‘వాట్సప్ కాదల్’ అన్న షార్ట్‌ఫిల్మ్ తీయడం ప్రారంభించాను. ఆ షార్ట్‌ఫిల్మ్‌కి కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, మాటలు, కెమెరా, హీరో అన్నీ నేనే కావడం వల్ల దానిని పూర్తి చేయడానికి రెండేళ్ళు పట్టింది. నేను చివరి సెమిస్టర్ వ్రాస్తున్నాను.
ఆ ఏడాది దానికి ఫస్ట్‌ఫ్రైజ్ వచ్చింది. ఫ్రైజ్ వచ్చింది కదాని.. ఇక సినిమాలు నా జీవితం అనుకోలేదు. అప్పటికి మాఅన్నయ్య ఇంజనీరింగ్ చదివి కాల్‌సెంటర్‌లో చిన్న ఉద్యోగమేదో చేస్తున్నాడు. అక్కయ్య డెంటల్ కాలేజీలో చదువుతోంది. ఏ ఒడిదుడుకులు లేకుండా ఇల్లు గడవాలంటే నేను ఉద్యోగానికి వెళ్ళకుండా తప్పదు..
ఆ ఆలోచనలతో..
ఐటీ ఉద్యోగిగా.. ఉదయమంతా పనిచేసి రాత్రి ఓ హాబీగా స్క్రిప్ట్ వ్రాస్తూండేవాణ్ణి. ఏడాది తిరక్కుండానే ‘ కోన్‌మాలిక్’ సినిమా స్క్రిప్ట్ సిద్దమైంది. అప్పుడే మనదేశంలో యూట్యూబ్ పాపులరవుతోంది. దానికోసం చిన్నగా ఏదైనా చేయాలని ‘స్టూండెంట్ లైఫ్ డైరీస్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను.
అది బాగా వైరల్ అయ్యింది. దానిని చూసి కొందరు నిర్మాతలు కథలు చెప్పమని పిలవసాగారు. అప్పుడు నిర్ణయించుకున్నాను.. మరో రెండేళ్ళలో ఉద్యోగం మానేయాలనుకున్నాను. దాంతో, రెండేళ్ళ తరువాత నాకు కావాలసిన డబ్బు కోసం పొదుపు చేయసాగాను.
వీకెండ్ పార్టీలు కాదు, క్రొత్తగా బట్టలు కూడా కొనడము మానుకున్నాను. అనుకున్నట్టే రెండో ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేశాను. కానీ.. ఆ విషయం మా ఇంట్లో ఎవరికీ చెప్పనేలేదు.
———————————————
అబద్దమే కానీ.. తప్పదు.
రోజూ ఆఫీసుకని బయలు దేరి ఫ్రెండ్స్ ఇంట్లో కథాచర్చలు చేసేవాణ్ణి. కొన్నిసార్లు పార్కుల్లో కూర్చుని స్క్రిప్ట్‌లూ వ్రాసేవాణ్ణి. ఇంట్లోవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను. నాన్నతో అబద్దాలు చెబుతున్నానన్న అపరాధ భావం లోలోపల సలుపుతూండేది. కానీ.. ఎప్పుడో ఒకరోజు ఆయన గర్వపడేలా చేస్తానని నాకు నేను సర్ది చెప్పుకునేవాణ్ణి.
అప్పట్లో మూవీమేకర్స్ అన్న సంస్థ ఓ లఘుచిత్రాల పోటీ పెట్టింది. విజేతలకి హీరో రజనీకాంత్‌గారు, స్టూడియో ద్వారా అవకాశాలిస్తామని చెప్పారు. అందు కోసం నేనే నటించి ‘అప్నాలుక్’ అన్న షార్ట్ ఫిల్మ్ తీశాను. దాదాపు ఆరువందల ఎంట్రీలు వస్తే ఫైనల్‌గా ఎంపిక చేసిన రెండింటిలో నాదీ ఉంది. ఆ రెండింటిని తమిళనాడులోని థియేటర్లలో ఇంటర్వెల్ అప్పుడు ప్రదర్శించి.. ‘దిబెస్ట్’ అనుకున్న దానికి ఓటు వేయమన్నారు. రెండింటిలో నా చిత్రానికి అత్యధిక ఓట్లు వచ్చాయి.
కానీ.. తుదిరౌండ్ జ్యూరీ ఆ రెండో చిత్రాన్ని ఎంపిక చేసింది. అక్కడ కూడా రాజకీయం జరిగింది. అలా రజనీగారితో పనిచేసే అవకాశం తృటిలో తప్పింది.
దాంతో మళ్ళీ “ కోన్‌మాలిక్” సినిమాని తీసుకుని స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించాను. ఎలాగోలా అవకాశం సాధించి ప్రభుదేవాకి వినిపించాను. ఓకే చేశారుకానీ, ఆయన ఆలోపు ‘దబాంగ్2’ సినిమా డైరక్ట్ చేయాలిసి వచ్చింది.
దాంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కొన్నాళ్ళకి వినాయక్ అనే నిర్మాత పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఆయనే ‘గెలుపు’ రవిని హీరోగా ఎంపిక చేశారు.
షూటింగ్‌కు వెళుతూ ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పే ధైర్యం లేక “ నాలుగు నెలలు సెలవు” పెట్టాను; అని చెప్పాను.
——————-
ఓ ఏడేళ్ళ పిల్లాడు పదహారేళ్ళపాటు కోమాలో ఉండి.. అప్పటికి యువకుడై ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది?’ అన్నదే నా “ కోన్‌మాలిక్” కథ. షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ ఖరారు అయ్యాకా.. మాకో పెద్ద అవాంతరం వచ్చి పడింది.
ఈ కథ తనదేనంటూ ఓ పెద్ద దర్శకుడు ప్రకటించాడు. ఆ సినిమా టైటిల్ లో తనకు ‘కృతజ్ఞతలు’ చెప్పాలన్నాడు. ఆ ప్రకటన విని నేను ఏడ్చేసాను. ఆ పని చేస్తే.. నేను నిజంగానే కాపీ చేశానని ఒప్పుకున్నట్టవుతుంది. తొలి సినిమాకే ఆ ముద్ర పడితే.. అంతటితో నాకెరీర్ ఆగిపోతుంది.
దానిపైన చాలా పంచాయితీలు జరిగాయి. ఓదశలో బాధ పడటం మానేసినా పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో పడిపోయాను.
పూర్తిగా సిద్దమై వెర్షన్‌ను చూపించాక ఆయన వెనక్కు తగ్గారు. హమ్మయ్యా అనుకుని రిలీజ్ చేశాను. 2017 లో విడుదలైన వాటిలో “ కోన్‌మాలిక్” ( తెలుగులోనూ- ‘యజమాని ఎవరు’ అనే పేరుతో వచ్చింది) అది పెద్ద హిట్టుగా నిలిచింది. అప్పుడు చెప్పాను మా నాన్నకి.. నేను కిందటి ఏడాదే ఉద్యోగానికి రాజీనామా చేశాను అని.
—————————
“ కోన్‌మాలిక్” ఓ పెద్ద బ్లాక్‌బస్టర్ ఇవ్వడంతో.. తమిళ మెగాస్టార్ ధనుష్ పిలిచి సినిమా చేద్దామన్నాడు. కథ సిద్దమయ్యాక “ బావుంది కానీ.. ఇంకొంత కాలం ఆగుదాం” అన్నాడు. చేతికి వచ్చింది నోటికి అందనట్టు.. గింజుకున్నాను ఆ రోజు.
మరో ఆరునెలల్లో మరో కొత్తకథ వ్రాసుకుని నా ప్రయత్నాలేవో చేశాను. అప్పటికే రెండేళ్ళ గడిచిపోయాయి. నాన్న ఎప్పటిలాగే ‘ ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేయరా’ అనడం ప్రారంభించారు. ఒకప్పుడు కూలికినాలీకి వెళుతూ ఆయన పడ్డ కష్టాలు అలా మాట్లాడించాయి.
ఈ లోపు ఓటీటీలో అంథాలజీలు రావడం మొదలయ్యాయి. ఓ పెద్ద నిర్మాత నా మూడు నిమిషాల ‘స్టూడెంట్ స్కూల్ మెమరీస్’ లఘు చిత్రాన్ని వెబ్‌సిరీస్‌గా చేద్దామంటూ ముందుకు వచ్చాడు. అలా విస్తరించిన కథని నా ఫ్రెండ్స్‌కి వినిపిస్తే.. ” ఒరే; ఇది సినిమా అయి తీరుతుంది. ఇంకా పెద్దది చెయ్” అన్నారు.
దాంతో నిర్మాత దగ్గర నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి.. ‘స్టూండెట్ స్కూల్ మెమరీస్’ కథనం పెద్దది చేశాను. అదే పేరు ఫిక్స్ అయిపోయాను. కథ విన్నాక హీరో ఎవరు అని అడిగారు మా ఫ్రెండ్సంతా.
“ఇంకెవరు.. నేనే” అన్నాను. ;
ఆ ఒక్క కారణంతోనే సినిమా రెండేళ్ళు ఆలస్యమయింది.
———————
తమిళనాడులోని టాప్-10 నిర్మాణ సంస్థలకి నా కథ వినిపించడం ప్రారంభించాను. అందరికీ కథ నచ్చేదే కానీ, ‘ హీరో ఎవరు’ అన్నాకే వచ్చేది పేచీ; ‘మీరే హీరోగా చేస్తారని ముందే చెప్పి ఉంటే.. ఫోన్‌లోనే రిజెక్ట్ చేసి ఉండేవాళ్ళం’ అన్నారు.
దాదాపు అందరూ.. ఆ కథకు నేనైతేనే సరిగ్గా సరిపోతానని బల్లగుద్ది చెప్పసాగారు. నా వాదనకి ‘ఏబిసిడి’ నిర్మాణ సంస్థ మాత్రమే కన్విన్స్ అయింది. కేవలం ఐదుకోట్ల ఖర్చుతో ఆరునెలల్లో సినిమా పూర్తి చేశాను. తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ చేశారు సినిమాని.
కేవలం 150 స్క్రీన్‌లో కేటాయించారు. అన్నీ నూన్ షోలకే పరిమితం చేశారు. కానీ మరుసటి రోజుకి 500 స్క్రీన్‌లకి మించిపోయింది. నూన్‌షోలు కాస్తా ఐదు షోలుగా మారాయి. యువతని టార్గెట్ చేస్తే.. కుటుంబసమేతంగా అందరూ వచ్చి చూడటం ప్రారంభించారు. మూడు వారాల్లోనే మా సినిమా వందకోట్ల వసూళ్ళ మైలురాయిని దాటేసింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వయంగా వచ్చి అభినందించారు. తెలుగులో డబ్ చేసాక తమిళంలో కన్నా వేగంగా కలెక్షన్స్ నమోదవుతున్నాయి.
——————-
మా నాన్న ఇప్పుడు ఉద్యోగం గురించి అడగట్లేదు. కానీ “ఎంతైనా.. నువ్వు ఐఏఎస్ చేయాలిసిందిరా; ఆ అధికారం, ఆ ఠీవి, ఆదర్పం - ఆ తీరే వేరు తెలుసా” ; అనడం మాత్రంగా మానలేదు.
ఆ ఐఏఎస్ లలో చాలామంది ‘నేను మీ ఫ్యాన్’ అంటూ ఫోన్ చేస్తున్నారులే నాన్నా’ అంటూ.. నవ్వేస్తున్నాను.
శుభంభూయాత్
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments