top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

నేనే కింగ్ మేకర్


'Nene King Maker' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

అది ఇండియాలో ఒక రాష్ట్రం. నిన్ననే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అన్నినియోజక వర్గాల్లో నేను బలపరిచిన ‘ఏ ‘ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఈ రోజు పొద్దున్నే ఆరింటికల్లా ఫోన్ మోగింది. కాస్త చిరాకనిపించింది. నిన్నరాత్రి రెండింటి వరకూ ఆగకుండా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ‘ఏ ‘ పార్టీ సీఎం అభ్యర్థి, ఇతర ప్రముఖులు, నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరు చేసి ఉంటారబ్బా అనుకుంటూ ఫోన్ తీశాను. కాల్ చేసింది ‘ఏ ‘ పార్టీ అధ్యక్షుడు.

నేను ఫోన్ తీయగానే, “నమస్కారాలు సార్! ఇంత పొద్దున్నే ఫోన్ చేసి, డిస్టర్బ్ చేసినందుకు మన్నించండి. రాత్రి ఎన్ని సార్లు మీ కోసం ట్రై చేసినా, మీ ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. అందుకనే ఇంత పొద్దున్నే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో కింగ్ మేకర్ మీరు. మా పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన ఘనత మీదే. మీ మేలు ఎప్పటికీ మరిచిపోము. మీరు చెప్పిన పనులన్నీ తప్పకుండా చేస్తాము. మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము” చెప్పడం ముగించాడతను.

“అలాగే! ఖచ్చితంగా మీకు సహకరిస్తాను. కానీ మీలో మార్పు వచ్చిందంటే మాత్రం, అవతల పార్టీ వాళ్లని అధికారంలో కూర్చోబెడతాను. మీకు తెలుసుగా నాకు ఉండే పవర్ “ అన్నాన్నేను.

"అయ్యో! అంత మాట ఎందుకు సార్, మీ అడుగులకు మడుగులొత్తే వాళ్ళం మేము." అన్నాడు పార్టీ ప్రెసిడెంట్.

ఆరు నెలలు గడిచాయి. 'నా మనుషులు' ఇబ్బంది పడటం నా దృష్టికి వచ్చింది. కొత్త ప్రభుత్వం కదా వేచి చూద్దాం అనుకున్నాను. కానీ ఏ లాభం కనిపించలేదు. నాకు కోపం వచ్చింది.

సీఎం కు కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. వెంటనే ‘ఏ ‘ పార్టీ అధ్యక్షుడికి కాల్ చేశాను. ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు. నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నా తడాఖా ఏమిటో తెలిసి కూడా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. వీళ్లకు నా దెబ్బ రుచి చూపించాల్సిందే.

మంచి అవకాశం కోసం చూస్తున్నాను. మరో ఆరు నెలలు గడిచాయి. లోక్ సభ ఎన్నికలు ప్రకటించారు. ఆ రోజు పొద్దున్న షేవింగ్ చేసుకుంటూ ఉండగా, సీఎం నుంచి ఫోన్ వచ్చింది. చిన్నగా నవ్వుకొని ఫోన్ కట్ చేశాను. మరో రెండు మార్లు ఫోన్ రింగ్ అయింది. కానీ నేను ఎంత మాత్రం ఖాతరు చేయలేదు. ఓ అరగంట ఆగి మళ్ళీ ఫోన్ మోగింది. యధాలాపంగా ఫోన్ కట్ చేయబోయి ఎవరా అని చూశాను. ఈ సారి ఫోన్ చేసింది 'బి' పార్టీ ప్రెసిడెంట్.

సంశయిస్తూనే ఫోన్ తీసి, “ఊ! చెప్పండి” అన్నాన్నేను.

“నమస్తే సార్! నేను ‘బి’ పార్టీ ప్రెసిడెంట్ ని. ఆ 'ఏ' పార్టీ వాళ్ళు మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీరు ఒక తొక్కు తొక్కారంటే ఆ 'ఏ' పార్టీ వాళ్ళు భూమిలోకి అణిగిపోతారు. అది తెలిసి కూడా వాళ్లు అలా ప్రవర్తిస్తున్నారు అంటే, వాళ్ళ కళ్ళు నెత్తి మీద కెక్కినట్లు రుజువవుతోంది. ఈ ఎన్నికల్లో మీరు మాకు మద్దతిచ్చారంటే, మీకు కావలసింది మీకు చేరుస్తాము. ఈ విషయంలో మీకు ఏ సందేహం అఖ్ఖర్లేదు” భరోసా ఇచ్చాడతను.

"వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు ఇలాగే చెప్పారు.ఇక మిమ్మల్ని నమ్మను. ’నా’ వాళ్ళను పోటీలో పెట్టి మీ రెండు పార్టీలనూ తొక్కేస్తాను. " కోపంగా చెప్పాను.

"అంతమాట అనొద్దు.'మీ వాళ్ళు' ఈ ఎన్నికల గొడవలు పడలేరు. మాకు మరొక్క అవకాశం ఇవ్వండి. ప్రతి విషయంలో మీ ఆమోదం తీసుకుంటాం . ప్లీజ్...."

అభ్యర్ధించాడాయన.

"అసలు మీరు సక్రమంగా ఉండి వుంటే ఆ 'ఏ ' పార్టీవాళ్లకు అవకాశం ఇచ్చి ఉండను".

'జరిగిన తప్పును మన్నించండి. మరోసారి ఆలా చెయ్యం " బ్రతిమలాడుకున్నాడతను.

అంగీకారంగా తల పంకించాను.

***

లోక్ సభ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి.హోరాహోరీ పోరులో మద్యం వరదలై పారింది. విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేసారు. దౌర్జన్యాలూ,బూత్ క్యాప్చరింగులూ మామూలే. ఎన్నికలు ముగిశాక ఫలితాల గురించి ఆసక్తి. ఎగ్జిట్ పోల్స్ లో భిన్నాభిప్రాయాలు. మరుసటి రోజు ఫలితాలనగా ‘బి’ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు.

"సార్! టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. గెలుస్తామంటారా?"

"ఎంత ఖర్చు పెట్టారు?"

"ఓటుకు వెయ్యి. అవతలి పార్టీ రెండువేలు ఇచ్చారట ! అదే భయంగా ఉంది "

"అంటే నన్ను నమ్మడం అప్పుడే మానేశావన్నమాట."

"అంత మాట అనకండి సార్ ! మీ వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు తీసుకున్నారని....."

నీళ్లు నములుతున్నాడు అతను.

"నేను హామీ ఇచ్చాక కూడా భయపడుతున్నావంటే నీకు నా మీద పూర్తి నమ్మకం లేదన్న మాట".

"అయ్యయ్యో ! ఆలా అనొద్దు సార్.ఏదో నా భయం కొద్దీ అలా అన్నాను. మీ పైన అనుమానం కాదు."

చిన్నగా నవ్వాను నేను.

"ఇక్కడే కాదు.మిగతా రాష్ట్రాల్లో కూడా మా వాళ్ళందరూ మీకే ఓటు వేశారు .కేంద్రంలో అధికారం మీదే. నిశ్చింతగా ఉండండి." హామీ ఇచ్చాను నేను.

మరోసారి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడతను.

పక్క రోజు ఫలితాలు వచ్చాయి. నేను చెప్పినట్లే 'బి' పార్టీవాళ్ళు దేశవ్యాప్తంగా భారీ మెజారిటీతో గెలిచారు. పీ ఎం అభ్యర్థి నాకు 'థాంక్స్' చెప్పాడు. 'మీ రాష్ట్రానికి కావలసిన సహాయం చేస్తాను' అని అడగకుండానే ప్రామిస్ చేశాడు.

రోజులు గడిచాయి. రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. 'ఏ ' పార్టీ నుంచి ఒక వర్గం చీలబోతోంది. ప్రభుత్వం కూలిపోబోతోంది. అధికారం చేతులు మారబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంతలో తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రైతులు కృంగిపోయారు.పేదల ఆత్మహత్యలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర అధికార పార్టీవాళ్ళు నిధుల కొరతతో, పార్టీలో అనిశ్చితితో కేంద్ర సాయం లేనిదే ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.

'బి ' పార్టీ రాష్ట్ర ప్రతినిధికి ఫోన్ చేశాను.

"వెంటనే పీ ఎం తో మాట్లాడి రాష్ట్రానికి సహాయం ఇప్పించండి. " చెప్పాను నేను నా మాట కాదనడనే నమ్మకంతో.

మొదట 'అలాగే సార్' అన్నాడు.

తరువాత చిన్నగా "కొద్ది రోజులు కళ్ళు మూసుకుందాం సార్. అధికార పార్టీలో చీలిక వచ్చి మన పార్టీ రాష్ట్రంలో రూలింగ్ లోకి వస్తుంది. అప్పుడు మీరేమి చెప్పినా చేస్తాం "అన్నాడు.

పట్టలేని కోపం వచ్చింది నాకు.

"ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతూ వుంటే మీరు రాజకీయాలు ఆలోచిస్తున్నారా ? వెంటనే పీ ఎం తో మాట్లాడండి " అన్నాను.

అలాగేనంటూ ఫోన్ పెట్టేశాడతను.

మరుసటి రోజు కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదతను. పీ ఎం అసలు పలకలేదు.

'ఏ' పార్టీలో చీలిక వచ్చింది. మాకు మెజారిటీ ఉందంటే మాకు ఉందంటూ కొట్లాడుకున్నారు.

చివరికి అసెంబ్లీ రద్దు అయింది. మళ్ళీ ఎలెక్షన్స్ రాబోతున్నాయి.

రెండు పార్టీల నుండీ ఫోన్ల మీద ఫోన్లు. కట్ చేసినా వదలకుండా చేస్తున్నారు.

ఒక రోజు కొత్త నెంబర్ నుంచి కాల్.

'సి' పార్టీ వాళ్ళట. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని బ్రతిమాలాడు.

ఫోన్ పెట్టేసి తీవ్రంగా ఆలోచించాను.చివరికి ఒక నిశ్చయానికి వచ్చి మూడు పార్టీలకూ కాల్ చేశాను.

"రేపు ఉదయం పది గంటలకల్లా ఇక్కడకు రావాలి. ఒక పార్టీనుంచి ఒకరే రావాలి." అంటూ షరతు పెట్టాను.

ఎలెక్షన్ టైం కదా. నా మాటకు ఎదురు చెప్పలేరు. మూడు పార్టీల నాయకులూ ‘సరే’ అన్నారు.

మరుసటి రోజు ఉదయం పదిగంటలకల్లా ముగ్గురూ హాజరయ్యారు.'ఏ' పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, 'బి' పార్టీ ప్రెసిడెంటు,'సి' పార్టీ నాయకుడు వచ్చారు.

నేను వాళ్లకు కనబడకుండా నా మాటలు మాత్రమే వినబడేటట్లు అరేంజ్ చేశాను.

"ఇప్పుడు చెప్పండి. నేనెవరిని?" ప్రశ్నించాను.

"ఓటరు" ముగ్గురూ ముక్త కంఠంతో చెప్పారు.

'వెరీ గుడ్ . నా నిక్ నేమ్ చెప్పండి? "

"సగటు మనిషి " చెప్పాడు 'ఏ ' పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు.

"కామన్ మాన్" అన్నాడు 'బి' పార్టీ అధ్యక్ష్యుడు.

"నేను చెప్పిందే ఇంగ్లిష్ లో చెబుతున్నావు. సొంతగా ఒక పదం కూడా చెప్పలేవు" దెప్పి పొడిచాడు 'ఏ'పార్టీ వ్యక్తి.

"వీళ్ళిద్దరూ ఇంతే .అందుకే మా 'సి' పార్టీ పెట్టాం " ఉపన్యాసం ప్రారంభించబోయాడు కొత్త నాయకుడు.

" ముగ్గురూ ఆపండి. ఇదేమన్నా టివి డిబేట్ అనుకున్నారా?" గద్దించాను నేను.

సైలెంట్ అయ్యారు ముగ్గురూ.

ఇక నా ఉపన్యాసం ప్రారంభించాను.

"నేను ఒక సగటు మనిషిని. కొన్ని కోట్ల సామాన్య ఓటర్లకు ప్రతిరూపాన్ని. మరి ఇన్ని కోట్ల మంది కలిసిన రూపమంటే అది భగవంతుడి విశ్వరూపమే. అది చూస్తే మీరు తట్టుకోలేరు. మీకు అంత అదృష్టమూ లేదు.అందుకే నేను మీకు కనబడ్డంలేదు.కేవలం వినబడుతున్నాను.

ఇక అసలు విషయానికి వస్తాను. ముందే చెప్పానుగా. ఇది టివి ప్రోగ్రాం కాదు. నేను యాంకర్ నూ కాదు. కోట్ల మందికి ప్రతినిధిని. అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ ఇంకా చెప్పాలంటే అన్ని పార్టీల్లో కూడా ఉంటాను. నన్ను లెక్క చేయనివాడు నామ రూపాల్లేకుండా పోతాడు. ఇది చరిత్రలో ఎన్నోసార్లు రుజువయ్యింది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పండి.

ముందుగా 'ఏ' పార్టీ వారి సంగతి. మీరు అసెంబ్లీ ఎలక్షన్ లలో చిత్తుగా ఓడిపోయారు. కారణం ఏంటనుకుంటున్నారు?" ప్రశ్నించాను.

కాస్సేపు నీళ్లు నమిలాడు ఆ పార్టీ ప్రతినిధి. తరువాత గొంతు పెగుల్చుకొని "అవతలి పార్టీవాళ్ళు ఎన్నికల్లో అక్రమాలు చేసారు...." అంటూ ఏదో చెప్పబోయాడు.

"నోరు ముయ్యండి." గట్టిగా అరిచాను.

"ఆ ఎన్నికలప్పుడు మీరు అధికారంలో ఉన్నారు.అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకున్నారు.మీ పార్టీవాళ్ళు డబ్బు,మద్యం విరివిగా పంచారు.అవతలి పార్టీవాళ్ళ వాహనాలు తనిఖీ చేసి డబ్బును, మద్యాన్ని సీజ్ చేసారు. మీ వాళ్ళు బాంబులు ,మారణాయుధాలతో తిరిగారు.అవతలివారు చిన్న కొడవలితో వెడుతున్నా అరెస్టు చేసారు. ఆ వార్తను మీ బాకా పత్రికల్లో బాక్సు కట్టి ప్రచురించారు. మీ పార్టీ ఛానళ్లలో రోజంతా స్క్రోల్ చేశారు. కానీ 'మావాళ్లు' .. అంటే సాధారణ ప్రజలు 'బి' పార్టీకి మద్దతిచ్చారు.వాళ్ళు బంపర్ మెజారిటీతో గెలిచారు”

"ఇక ' బి ' పార్టీవాళ్లకు ఒక ప్రశ్న. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలవడానికి కారణం ఏమిటి? "

"ఏముంది. మీరు దయ తలిచారు. మాకు ప్రాప్తించింది " చేతులు జోడిస్తూ చెప్పాడు ఆ పార్టీ ప్రతినిధి.

"భజన మాటలు ఆపండి."మరి లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు?" సూటిగా ప్రశ్నించాను.

“మీ దయకు దూరమయ్యాము” భయపడుతూనే జవాబిచ్చాడతను

“సరైన విశ్లేషణ నేను ఇస్తాను. ఏ పార్టీ అయినా గెలిచాక తమ అధికారం సుస్థిరం చేసుకోవాలనుకుంటారు. మీరు కూడా అలాగే చేసారు. అందులో తప్పు లేదు. అయితే అధికారం సుస్థిరం చేసుకోవడమంటే ఏమిటి? ఎన్నికల్లో గెలిచాక ప్రజల గురించి ఆలోచించాలి. అలాకాక ప్రజల గురించి ఆలోచించడం మానేసి అవతలి పార్టీని నాశనం చేస్తే ఎప్పటికి తామే అధికారంలో ఉంటామనుకోవడం కేవలం భ్రమ. మీ ఆలోచనంతా ఎదుటి పార్టీవాళ్లని భయపెట్టి ఆ పార్టీ నాయకులని మీ వైపుకు తిప్పుకోవడమే.వాళ్ళు మీ వైపుకు వస్తే ఇక ఎదుటి పార్టీ ఖాళీ అయిపోతుందని అనుకుంటున్నారు. మీరు చేర్చుకోవాలని తాపత్రయ పడుతున్న ఆ నాయకులంతా గడచిన ఎన్నికల్లో ఆ వైపు ఉన్నవారే. మరి వారి ప్రతిభతో ఆ పార్టీని గెలిపించగలిగారా? నిజం చెప్పాలంటే పార్టీ ఓటమికి వారే ముఖ్య కారకులు. మిమ్మల్ని గెలిపించిన ప్రజల్ని వదిలేసి వారికోసం వెంపర్లాటేమిటి, అసహ్యంగా!

ఎలా గెలిచామన్నది మీరు వెంటనే మరిచిపోయారు. ఫలితంగా లోక సభ ఎన్నికలప్పటికే ప్రజల్లో అభిమానం కోల్పోయారు.చిత్తుగా ఓడిపోయారు."

'బి'పార్టీ ప్రతినిధి సిగ్గుతో తల దించుకున్నాడు.

'ఏ' పార్టీ ప్రతినిధి మీసం మెలిపెట్టబోయి,నేను కోపంగా చూడటంతో చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

"రొయ్యకూ ఉంటుంది బారెడు మీసం. ఏం సాధించారని మీసం తిప్పుతున్నారు?వరదలతో రాష్ట్రం అల్లాడుతుంటే , కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉన్నా ఏ సహాయం చేయలేక పోయారు. కనీసం అడగనైనా అడిగారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ఎన్నికలు తెప్పించారు. గెలిచేద్దామనే?మేమంత అమాయకుల్లాగా కనబడుతున్నామా?"

తల దించుకున్నాడు 'ఏ ' పార్టీ ప్రతినిధి.

"ఇక కొత్తగా పుట్టుకొచ్చిన 'సి' పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు పార్టీల గెలుపు, ఓటములు గమనిస్తూనే ఉన్నారు కదా! మీరూ వాళ్ళ దారిలోనే నడవడం ఏమిటి?

మీ అందరికి నేను చెప్పాలనుకున్నది ఒకటే.మేము పిచ్చివాళ్ళం కాదు.అమాయకులం అంతకన్నా కాదు. మీ వాగ్దానాలకు, ప్రలోభాలకు లొంగిపోయి, ఓట్లేశామనుకుంటే అది మీ పొరపాటు. మొత్తం ఓట్లు వందనుకుంటే 'ఏ' పార్టీకి ముప్పైమంది ,'బి' పార్టీకి ముప్పైమంది ఎప్పుడూ ఓటు వేస్తారనుకుంటే మిగిలిన నలభై మందీ సాధారణ ఓటర్లు. వాళ్ళు ఈ ప్రలోభాలకు లొంగరు. మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంటారు.సరైన వాళ్ళకే ఓటు వేస్తుంటారు. చక్రం తిప్పేది వాళ్లే. అంటే మేమే.

ఒక్క విషయం గుర్తుంచుకోండి. డబ్బుతో,అధికార బలంతో గెలవడం నిజమయితే ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండాలి. కానీ ఆలా జరుగుతోందా?

కొమ్ములు తిరిగిన నాయకులు సైతం స్వంత నియోజక వర్గాల్లో ఓడిపోవడం గమనించడం లేదా? తెలిసి తెలిసి అవే తప్పులు ఎందుకు చేస్తున్నారు?పోనీ మీరైనా సుఖంగా ఉంటున్నారా?పదవి పోయినప్పటినుంచి ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారు.కనీసం మీరు సంపాదించిన డబ్బుతో సుఖాలు అనుభవించారా? లేదే! మీరు సుఖంగా నిద్ర పోగలుగుతున్నారా? ఇక దిగువ స్థాయి నాయకులైతే ప్రాణ భయంతో అల్లాడుతున్నారు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. కొన్ని ఏళ్లుగా చలనంలేని మీకు ఈ చిన్న ఉపన్యాసంతో మార్పు వస్తుందని నేను ఆశించడం లేదు. అందుకే నా నిర్ణయం చెబుతాను " చెప్పడం ఆపి వాళ్ళ వంక చూసాను. ముగ్గురూ చెవులు రిక్కించి వింటున్నారు.

“ఒకసారి ఓటు వేసి ఐదేళ్ల వరకూ ' మా ఖర్మ ఇంతే ' అనుకొని ఊరుకోవడం కుదరదు. మాకు జరిగిన అన్యాయాల్ని ఎప్పటికప్పుడు ఎండగడతాం. మాకు నచ్చని నాయకులను రీకాల్ చేస్తాం . ఆ సౌకర్యం కలిగించాకే ఎలెక్షన్లు జరగనిస్తాం.అందుకోసం ప్రజా ఉద్యమం ఇప్పటినుంచే ప్రారంభిస్తున్నాం. ఈ విషయం తేల్చి చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను." చెప్పడం ముగించాను.

ముగ్గురూ మౌనంగా నిష్క్రమించారు.

***సమాప్తం***


ఈ కథలో పాత్రలు,సన్నివేశాలు,పార్టీల పేర్లు అన్నీ కల్పితం.ఎవరినీ ఉద్దేశించి వ్రాయలేదు.ప్రజల్లో చైతన్యం వచ్చిందనేది మాత్రం నిజం.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


510 views1 comment

1 Comment


Nice story

Like
bottom of page