'Nenu Anthega' - New Telugu Story Written By Bhagavathula Bharathi
Published In manatelugukathalu.com On 31/05/2024
'నేనూఅంతేగా?!' తెలుగు కథ
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అవును! అదిగో వానలో తడిసిన ఆ పిచ్చుక
ఆ చెట్టు మీద వాలి రెక్కలు గిలగిలలాడించి, ముక్కుతో రెక్కల్లో పొడుచుకుని, తడి ఆరబెట్టుకుంటోంది,
కానీ నేనున్న ఆ పరిస్థితిలో ఆ పిచ్చుక గిలగిల కొట్టుకుంటున్నట్లు కనబడింది.. నామనసులా..
అంతేగా! ఎంతో చదివాడు నాన్న. సంస్క్రతాధ్రాలను ఔపోసన పడ్డాడు.
కాదంబరి వర్ణనలు పుస్తకం చూడకుండానే అప్పజెప్పేవాడు.
ఇక 'అప్పకవీయం', 'వసుచరిత్ర' 'మనుచరిత్ర' కరతలామలకమే!
నాతో సహా ఎంతోమంది తెలుగు పండిట్ లను తయారు జేసాడు. నాటికలూ రాసాడు. నాటకాలూ రాసాడు. శతకమూ రాసాడు. ఉపనిషత్తులు చదివి అర్దాలూ విడమర్చి చెప్పాడు. నిలువెత్తు సాహిత్యచైతన్యం..
ఎన్నో పుస్తకాలూ కొన్నాడు. విపరీతంగా చదివాడు..
అన్నయ్య ఫోన్ చేసాడు.
"ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి మారుతున్నాము. నాన్ననూ, అమ్మనూ తీసుకెడుతున్నాను. సామానంతా బోలెడు ఉంది. అమ్మేస్తున్నాను " అని.
"అంతేగా! అమ్మేయక ఏంచేస్తావ్? కానీలే!..
కానీ మేమూ వచ్చేస్తున్నామ్. సహాయం చేస్తాం.. " సామానుసర్దే సహాయానికి వెళ్ళా.
నేను వెళ్ళేటప్పటికి, పసిపిల్లాడల్లే, కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్న నాన్న.. పక్కనే అమాయకంగా నిలబడ్డ అమ్మ.
బి. పి అనుకోకుండా పెరిగిందో, అశ్రద్ధవల్లో గానీ, బ్రైన్ స్ట్రోక్ వచ్చి, ఫార్టీ పర్సెంట్ మెదడు డామేజ్ అయిందని డాక్టర్ చెప్పేవరకూ తెలుసుకోలేక పోయిన దురదృష్టం వల్లనేమో,
కొన్ని నెలలుగా నాన్నకి ఆరోగ్యం సరిగాలేదు.
మైండ్ సరిగా పనిచేయట్లేదు. మథ్య మథ్య లో మతితెరిపి వస్తోంది. వచ్చినప్పుడు మనుషుల్ని గుర్తుపట్టటం, మరుపు వచ్చినప్పుడు మరిచిపోయి, నువ్వు ఎవరు? అవి అడగటం, కలిచివేస్తోంది.
ఇదంతా వయసు మళ్ళాక సహజమే అని సరిపెట్టుకున్నా.. ఓ శతకము కర్త ఇలాంటి స్థితికి..
మాకు కళ్ళు చెమర్చినాయి.
"ఏరా! నేను రాసిన శతకం పుస్తకం ఏదిరా? పేరుకూడా మరిచిపోయా! "
"రామలింగేశ్వర శతకం.. ఇదిగోనాన్నా! దీనిని రామలింగేశ్వర స్వామి గుళ్ళో దేవుడికి అంకితమిచ్చావుగా! గుడివారు నీకు ఘనసన్మానం చేసారు గుర్తుందా? నాన్నా! ఇదిగో సన్మాన పత్రం! ఇదిగో ఫొటో! ఇదిగో అప్పుడు వాళ్ళు కప్పిన శాలువా!
ఇవిగో! మిగతాచోట్ల సన్మానపత్రాలూ, శాలువాలు. గుర్తుపట్టావా!? దాచిపెడతాలే!"
"గుర్తులేదురా!మిగతా పుస్తకాలు ఏవో ఉండాలిరా.. అవీ పేర్లు గుర్తులేవు.. "
అన్నీ మర్చిపోయి.. అన్నీ కోల్పోయినట్లున్న నాన్న..
ఎంత పండితుడూ!ఎంతమేధావీ! కాలమా! నీకు జేజేలమ్మా!
కవిసార్వభౌముడైన శ్రీనాథునే కాడిభుజాన పెట్టించి దుక్కిదున్నించావే! సంకెళ్ళమాటిన కట్టేసావే!?
ఈరోజు భక్తరామదాసని కీర్తిస్తున్న గోపన్న ను అన్ని సంవత్సరాలు కారాగారవాసం చేయించావే!?
ఇలా కాలానికి ఎదురీది బ్రతికి గెలిచిన ధీరులేరీ!?
నేను ఆడీపాడిన, ఇల్లు, మా కోసం కొన్నఆటవస్తువులు, మేం పెరిగి పెద్దవాళ్లమయ్యేకొద్దీ, మాతో పాటే పెరిగిన సామాను, తెలుగు, సంస్కృత పుస్తకాలూ..
కొన్ని మార్వాడీకి అమ్ముడయినాయ్.
కొన్ని కుప్పతొట్టిలోకి పోయినాయ్. కొన్ని పుస్తకాలు నాన్నకు తెలీకుండా తగులబెట్టబడ్డాయి.
వేరే ఇంటికి వెళ్ళిపోయాక సామానుల్లో, తను పదిలంగా దాచుకున్న వస్తువుల జాడలకోసం..
"అదెక్కడుందిరా? అదెక్కడుందిరా?!" అని పసివాడికి మల్లే వెదుక్కుంటున్న నాన్నని చూస్తే గుండె పిండేసింది. ఆ పిచ్చుకలా మనసు విలవిలలాడింది.
మానసిక సంఘర్షణ.. ఇప్పుడు ఏదైతే జరిగిందో.. అది పగతోనో, ద్వేషంతోనో జరగలా!? అన్నయ్య చాలా మంచివాడు.
నాకు కష్టం కలిగించకుండా నాన్నను తనదగ్గరే ఉంచుకుని ఎంత ప్రేమగా చూసుకుంటాడనీ?!
రాజులు పోయారు. సామ్రాజ్యాలూ, సంస్థానాలూ పోయాయి. ఎంత పురావస్తుశాఖవారైనా, ఎన్ని ఙ్ఞాపకాలను భద్రపరచగలరు. మేమూ అంతేగా!? కాలం తనగర్భంలో ఎన్ని దాచుకుందో!
కొన్ని వస్తువులను మాత్రం ఙ్ఞాపకాలుగా తీసుకుని భారమైన మనసుతో ఇల్లు జేరాను. ఇవీ ఏదోనాటికి పోతాయిగా!
ఏమనిషితో వచ్చిన వస్తువైనా, ఆమనిషితోనే అంతమౌతుందా? ఇవన్నీ మనవి కావు ప్రపంచానివే! అక్కడికే చేరతాయి.
మనసులో ఏదో ఎడతెగని సంఘర్షణ.
విలువైన పట్టుబట్టలు కోరి కడతాం
తర్వాత ఇంకేదో భవిష్యత్తు ఉన్నదని, కట్టుకోవచ్చని దాస్తాం.
వయసు చివరికి నూలు బట్ట కూడా బరువే
పలుచని బట్ట తప్ప, ఏ బట్టా కట్టుకుని నిలవలేం. స్మశానంలో అదీ తీసేస్తారు.
ఆఖరికి అదికూడా తొలగింపే.
చిన్న పలుచని అంగోస్త్రం లో నాన్నని గుర్తుచేసుకుని, వైరాగ్యంతో నిట్టూర్చా.
ఇంటికి వచ్చి, ఎందుకో నేను నివసిస్తున్న ఇంటివైపు చూసాను. కష్టార్జితంతో కట్టి, 'నేనే కట్టానహో' అని విర్రవీగుతున్న లంకంత ఇల్లు. ఇంట్లో ప్రతివస్తువు మీద విరక్తిలాంటి భావం. వనజ నా భార్య. నా ప్రమోషన్ లెటర్ చేతిలోపెట్టి
"మీకు ప్రమోషన్ వచ్చిందండీ ఎంత గొప్ప విషయమండీ! ఎంత అదృష్టం అండీ!".. ఏదేదో చెబుతోంది. నా చెవికి చేరట్లేదు.
నాన్న లాగే నేనూ రచయితను కూడా.. మనసుపడి ఎన్నో రచనలు ప్రచురించుకున్నా! అవార్డ్ లూ తెచ్చుకున్నా..
శాలువాలూ కప్పించుకున్నా..
ఇప్పుడు నాన్నకి ఏదైతే జరిగిందో. అదిరేపు నాకే. ఇప్పుడు ఏదైతే నాన్నో, అదిరేపు నేనే.
ఇల్లు మారుతుంది. కొన్ని వస్తువులు, పుస్తకాలూ కాలిపోతాయి. కొన్ని అమ్ముడవుతాయ్.
కొన్ని దానం చేయబడతాయి.
మరికొన్ని పారవేయబడతాయ్.. మరి దేనికోసం ఈ వెంపర్లాట? దేనికీ తాపత్రయం?
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా//
భగవద్గీతలోని గీతాచార్యుని బోధ గుర్తుకువచ్చింది.
ప్రాణులన్నియును పుట్టుకకు ముందు కంటికి కనిపించనివి. ఇంద్రియ గోచరములు కావు. (అవ్యక్తములు)
మరణానంతరం అవి అవ్యక్తములే.
ఈ జననమరణ మధ్యకాలమునందు మాత్రమే ప్రకటితములు. (ఇంద్రియ గోచరములు)అగుచున్నవి. ఇట్టి
స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
కానీ మనసు ఊరుకుంటుందా? ఎవరి జీవితమైనా కడకు ఇంతేనని మనసు అంగీకరిస్తుందా?
ఇంక మనసుతో సంఘర్షించే ఓపికలేక..
స్నానంచేసి.. సంధ్యావందనానికి కూర్చున్నాను.
ఆధ్యాత్మికతైనా సాంత్వనమిస్తుందేమోనని..
నేను తెలుసుకున్నా!
జననానికీ, మరణానికీ మధ్యలోని కాలక్షేపమే జీవితమనీ!ఇంక మరేమీ కాదనీ! లేదనీ!
===========
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
"నాన్న" పట్ల వున్న ఆదృత! బావుంది .
@varungudipudi
• 1 hour ago
సూపర్ అండి