#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #NenuDoctorAvutha, #నేనుడాక్టర్అవుతా

Nenu Doctor Avutha - New Telugu Story Written By - Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 27/01/2025
నేను డాక్టర్ అవుతా - తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“మమ్మీ! నేను మాత్రం చస్తే డాక్టర్ అవను” కోపంగా అంది పదిహేనేళ్ల ప్రిష.
“ఎందుకనటా!” నవ్వుతూ అన్నాడు రాహుల్.
“నాకు తెలుసు, మనని చూసి అలా అనుకుంటోంది. అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లు, పాపం ఎప్పడు చూసినా ఎంతో కష్టపడుతున్నారని, కదా బంగారం” అంది అవని.
“అది కాదు నేను ఇంట్లోనే ఉండి నా పిల్లలని బాగా చూసుకుంటా, మీలాగా ప్రామిస్లు బ్రేక్ చెయ్యను” ఇంకా కోపంగా అంది ప్రిష.
“సారీ బేటీ! నేనూ, అమ్మా తప్పకుండా వచ్చి నిన్ను డిన్నర్ కి తీసుకెళ్దామనుకున్నాం కానీ చాలా ముఖ్యమైన కేసు వచ్చింది. లేకపోతే నీ పుట్టినరోజు కన్నా మాకు ఏదీ ముఖ్యం కాదు” రాహుల్ కూతుర్ని బతిమిలాడుతూ అన్నాడు.
ప్రిషకి కోపం తగ్గలేదు “పో డాడీ! నా ఎండాకాలం సెలవలకి కూడా ఇలానే అన్నారు ఊటీకి, మైసూర్ తీసుకెళ్తామని చివరికి అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపారు" అంది విసుగ్గా.
“ఇంకా మంచిపని అయ్యింది మామూలుగా అమ్మమ్మ ఊరు వెళ్ళవు. అక్కడ ఇంచక్కా మా మామయ్య ఇల్లు, పొలాలు, ఆవులు అన్నీ చూశావు. నీకెంతో నచ్చాయి కూడాను. అక్కడ మా అత్త చేసిన వంటలు ఇంకా గుర్తున్నాయి నీకు” గలగలా నవ్వింది అవని.
“పో మమ్మీ! మీరెప్పుడు ఇంతే” ఉక్రోషంగా అంటూ వెళ్ళిపోయింది.
“ఎందుకే పిల్లని ఇలా ఏడిపిస్తారు ఇద్దరూ! పాపం మీ కోసం ఎంతోసేపు చూసి పడుకుంది. పెద్దది అవుతోంది మీరు కాస్త సమయం కేటాయించాలి ప్రిషా కోసం. నేనున్నా నా దారి వేరు” కూతుర్ని, అల్లుడ్ని హెచ్చరించింది సుజాత.
“నువ్వు చెప్పింది నిజం అమ్మా! మేమే కొంచెం టైం మేనేజ్మెంట్ చెయ్యాలి” అంటూ రాహుల్ ని చూసింది. నిజం అన్నట్టు తలూపాడు.
“సరే అమ్మా! మేము ఆసుపత్రికి వెళతాం" అంటూ ఇద్దరూ బయలుదేరారు.
సుజాత అన్నీ సర్ది మనవరాలి రూమ్ లోకి వెళ్ళింది. ప్రిష మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తోంది. సుజాతకి జాలి వేసింది, అ పరిస్థితి చెప్పాలి లేకపోతే తల్లి, తండ్రిని అర్థం చేసుకోదు అనుకుంది సుజాత.
"ప్రిషా! లే నాన్నా! అలా చీటికీ మాటికీ ఏడవకూడదు. అమ్మానాన్న నిన్ను తీసుకెళ్లకపోతే ఏమైంది మనిద్దరం మంచి హోటల్ కి లంచ్ కి వెళదాం, అటునుంచి సినిమాకి వెళ్దాం. వాళ్ళని వదిలేసి మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం" మనవరాలిని బతిమిలాడింది.
ముందు కొంచెం బెట్టు చేసినా ప్రిష రెడీ అయ్యింది. సుజాత క్యాబ్ బుక్ చేసి అతనికి హోటల్ పేరు కాకుండా వేరే ఏరియా చెప్తే "అటెక్కడికి?" అంది ప్రిష. అక్కడ నా స్నేహితురాలు ఉంది, ఒకసారి తనని చూసి వెళ్దాం" అంది సుజాత.
క్యాబ్ ని రోడ్ మీద ఆపి వెయిట్ చెయ్యమని ఆ సందులలోకి తీసుకెళ్లింది.
అవి ప్రభుత్వం కట్టించిన ఒక బెడ్ రూమ్ ఇళ్ల కాలనీ. రంగులు పోయి, పెచ్చులు ఊడిన గోడలు,రోడ్ మీద చెత్త దాని చుట్టూ ఊర కుక్కలు, పందులు తిరుగుతున్నాయి. అక్కడ కొందరు పిల్లలు ఒంటి మీద సరి అయిన బట్టలు లేకుండా, మట్టి లో ఆడుతున్నారు.
ఆడవాళ్ళూ నైటీలు వేసుకుని బయట కూర్చుని కూరలు తరగడం, బియ్యం ఏరడం చేస్తున్నారు, మగవాళ్ళు నిక్కర్లు వేసుకుని ఒంటి మీద షర్ట్ లేకుండా బీడీలు తాగుతూ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు.
"ఛీ! ఇక్కడ నీ ఫ్రెండ్ ఏంటి అమ్మమ్మా!" అంతా అసహ్యంగా చూస్తూ అంది ప్రిష.
ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడ ఒక ఇంటి తలుపు కొట్టింది సుజాత.
తలుపు తీసిన ఒక పెద్దావిడ "వదినా ! బావున్నావా?" అంటూ మొహం విప్పార్చుకుని లోపలికి రమ్మని పిలిచింది.
ఆవిడ ఒక పాత నేతచీర కట్టుకుని ఉంది. సుజాత వయసే ఉంటుంది కానీ చాల మోటగా ఉంది.
కిళ్ళీలు తిన్నట్టు నోరు ఎర్రగా పండి ఉంది. "బావున్నావా భాగ్యవదినా!" అంటూ లోపలికి వెళ్లింది సుజాత.
కూర్చోమని చిన్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించింది కానీ ప్రిష కూర్చోలేదు.
"మంచినీళ్లు కావాల్నా పాపా!" తలా అడ్డంగా ఊపింది ప్రిష.
"మీ అమ్మ చిన్నప్పుడు మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం బుజ్జి" ప్రిషని చూస్తూ అంది సుజాత.
"నీ వయసు వచ్చేదాకా అంటే పదో క్లాస్ వరకు ఇక్కడే ఉంది చదివింది అమ్మ. ఆ సమయంలో ఈ భాగ్యవదిన మాకు చాలా సాయం చేసింది. మీ అమ్మకి స్కూల్ లో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే తాను కట్టింది. ఒకోరోజు ఇంట్లో తినడానికి లేకపోతే తను వండి పెట్టేది" కళ్ల నీళ్లతో అంటుంటే భాగ్య ఆపి "పో వదినా! ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తావు. అప్పుడు ఇంత బువ్వ పెట్టి, గింత ఫీజు కట్టినందుకు నీ కూతురు నా ఋణం బాగానే తీర్చుకుంటోంది. ప్రతీ నెలా నాకిన్ని పైసలు పంపి" అంటున్న భాగ్య చేతిలో ఐదువేలు ప్రిష చేత పెట్టించింది సుజాత. "నా మనవరాలిని చూపిద్దామని తెచ్చినా, ఏమీ తేనీకి కుదరలే" అంటూ.
వద్దు వద్దు అంటూనే తీసుకుని “నువ్వు కూడా మీ అమ్మ లెక్క పెద్ద డాక్టరు కావాలి బేటా! మీ అమ్మ దయవల్ల ఎంతోమంది బీదవాళ్లు బతికి బట్టి కట్టారు. మీ నాయన వైద్యంతో కాళ్లూ చేతులిరిగిన వాళ్ళు మంచిగ తిరుగుతున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు" అంది భాగ్య.
"అన్నకి, పిల్లలకు చెప్పు వదినా!" అంటూ బయటికి నడిచింది సుజాత.
అక్కడనుంచి ప్రిషని తనకి ఇష్టమైన హోటల్ కి తీసుకెళ్లి భోజనం తిన్నారు ఇద్దరూ.
"ఏ సినిమాకి వెళ్దాం?”
అడిగిన సుజాతతో "వద్దు అమ్మమ్మా! ఇంటికెళ్దాం, నాకు మీరు అక్కడెందుకు ఉన్నారు, మమ్మీ ఎలా డాక్టర్ అయింది చెప్పు" అంది ప్రిష.
ఇంటికెళ్ళాక సుజాత రూంలో కూర్చున్నారు ఇద్దరూ.
కొంచెం రిలాక్స్ అయ్యాక సుజాత చెప్పడం మొదలుపెట్టింది.
"మీ తాత ఆస్బెస్టాస్ రేకులు తయారుచేసే కంపెనీలో పనిచేసేవాడు.
మాకు మీ అమ్మ ఒక్కతే కూతురు. చిన్నప్పటినుంచి మీ అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదివేది. మేము మొదటినుంచీ భాగ్య ఇంట్లో అద్దెకి ఉండేవాళ్లం.
వాళ్లకి ఇద్దరు మగపిల్లలు. అస్సలు చదువు వంటపట్టలేదు వాళ్ళకి. అందుకని మీ అమ్మ అంటే ఇష్టంగా ఉండేవాళ్లు.
గొప్పగా కాకపోయినా సంతోషంగా సాగుతున్న మా సంసారంలో పెద్ద కుదుపు వచ్చింది. మీ తాతకి ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చింది. ఎన్నడూ చుట్ట కానీ, సిగరెట్ కానీ తాగని వాడికి క్యాన్సర్ ఏమిటీ అనుకుంటే ఆ కంపెనీలో పనిచేసేవాళ్లకి వస్తుంది అన్నారు. ఆస్బెస్టాస్ రేకులు తయారు చేసేటప్పుడు ఆ పదార్థం లోపలికి వెళ్లి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు.
కంపెనీ వాళ్లు కొంత సాయం చేశారు కానీ ఆయన పోయాక మాకు ఇల్లు గడవడం కష్టమైంది.
నేను పదోక్లాస్ చదివాను, డబ్బులేదు, ఇల్లు ఎలా గడపాలో తెలియదు. అలాంటి సమయంలో భాగ్య వదిన ఒక ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. నన్ను అక్కడికి తీసుకెళ్లి ఆ డాక్టరమ్మని బతిమిలాడి అక్కడ చేర్చింది. నేను కొద్దిగా చదివినందుకు నాకు పేషెంట్లకి మందులు ఇవ్వడం, ఇంజెక్షన్లు చెయ్యడం నేర్పించి తరవాత నెమ్మదిగా ఒకో పని నేర్పించి నర్సుగా చేశారు ఆ డాక్టర్. మొదట్లో నాకు జీతం ఎక్కువ వచ్చేది కాదు. మీ అమ్మని ప్రభుత్వ పాఠశాలకి మారుస్తానంటే ఈ భాగ్య వదిన వద్దని కొన్నిసార్లు తానే ఫీజ్ కట్టేది.
ఒక రెండేళ్ల తర్వాత కొద్దిగా నిలదొక్కుకున్నాను, మీ అమ్మ కూడా బాగా చదవడంతో స్కూల్ వాళ్ళు ఫీజ్ తీసుకోకుండానే చదువు చెప్పారు.
తరవాత మీ అమ్మ మార్కులు చూసి కాలేజీల వాళ్ళు మా దగ్గర చదవమంటే మా దగ్గర అని క్యూ కట్టారు. నేను పనిచేసిన డాక్టరమ్మ మీ అమ్మని ఏం చదువుతావు అంటే డాక్టర్ అని చెప్పింది. అక్కడ నుంచి మీ అమ్మ చదువుకి, మిగిలినవాటికి అంతా ఆ డాక్టరమ్మే ఖర్చుపెట్టింది. మీ అమ్మ, నాన్న ఇద్దరూ కలిసి చదువుకున్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన మీ నాన్న అమ్మని పెళ్లి చేసుకుంటాను అంటే నాకు అభ్యంతరం ఉండదు కానీ, ఇంత బీద పిల్లని చేసుకోవడానికి ఒప్పుకున్న మీ నాయనమ్మ,తాత దేవతలు.
డాక్టరమ్మ ఇంక చేతకాక తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ మీ అమ్మానాన్నలకి ఆసుపత్రి అప్పచెప్పి వెళ్ళింది.
చిన్నప్పటి నుంచి రోగాలు, చావులు ఎంతో దగ్గరగా చూసిన మీ అమ్మ ఎవరైనా రోగి వస్తే అన్నీ మర్చిపోయి సేవ చేస్తుంది. చదువుకోసం తనకి సాయం చేసిన వాళ్ళని ఆ బస్తీని, మర్చిపోకుండ వాళ్ళకి అవసరమైనవి అమరుస్తుంది.
నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను అన్న ధైర్యంతో మీ అమ్మానాన్న ఎంతోమంది రోగులకు సేవ చేస్తున్నారు. అక్కడ డబ్బులు కూడా ఎక్కువ తీసుకోకుండా చేస్తారు. ఇప్పుడు చెప్పు మీ అమ్మానాన్న మీద నీకు ఇంకా కోపం ఉందా?”
లేదన్నట్టు తల ఊపింది ప్రిష.
ప్రిష తెలివిగల పిల్ల అన్నీ అర్థం చేసుకుంటుంది అనుకుని సుజాత తన పనిలో పడింది.
సాయంత్రం అవని,రాహుల్ తొందరగా వచ్చి ప్రిషని బయటికి వెళ్దామన్నారు.
ప్రిష మాత్రం ఎక్కడికీ వద్దు అని ఇంట్లోనే తమకి ఇష్టమైన సినిమా చూసి అమ్మమ్మ చేసిన వంటలు తిందామని అంటే ఆశ్చర్యపోయారు.
“నీకు పుట్టినరోజు బహుమతి ఏం కావాలి?” అని అడిగిన అవనితో “ఒకరోజు మొత్తం నేను మీతో ఆసుపత్రిలో ఉండాలి. మీ ఇద్దరూ చేసే ఆపరేషన్లు చూడాలి” అన్న కూతుర్ని విచిత్రంగా చూసి
“ఎందుకు?” ఒక్కసారిగా అడిగిన వాళ్ళకి “మరి నేను డాక్టర్ అయ్యాక ఏం చెయ్యాలో తెలియాలిగా” అన్న ప్రిష ని చూసి సంతోషంగా నవ్వారు ఇద్దరూ.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
నేను డాక్టర్ నవుతా: శ్రీ పతి లలిత
మంచి మలుపు ఉంది ఈ కథలో ... ఎలా భామ్మ గారు చిన్న పిల్లకు... డాక్టర్ వృత్తి యొక్క నిజాలు - సేవలు - ప్రాణ దానం ... ఇంటి కోసం సమయం కేటాయించరు పని ఒత్తిడి వల్ల ...
గురించి చెప్పి ... చిన్న పిల్ల మనసు ను మారుస్తారు మంచి వైపు ... డాక్టర్ వృత్తి వైపు
అందరూ పెద్ద వారు మంచి మాటలు - చేతలతో ... చిన్నారుల మనస్సులు మార్చాలి మంచి వైపు. ... భయ పెట్టి - తిట్టి కాదు.
దీనికి ప్రతి తల్లి - తండ్రి శిక్షణ తీసుకోవాలి ... సంతోష పూరిత నిర్వహణ పై.
ఉదాహరణ కొరకు:
పిల్లలకు విడమర్చి చెప్పాలి ... ఎక్కువ ఉప్పు, కారం, చక్కెర, కొవ్వు, నూనె ఉన్న ఉండే తిండి తింటే ... ... ఎలా పెక్కు వ్యాధులు వస్తాయి.
బొమ్మల పుస్తకాలు చూపించాలి ... పిల్లల మనస్సులు మార్చటానికి... జంక్ ఫుడ్ తినకుండా.
పి.వి. పద్మావతి మధు నివ్రితి