top of page
Writer's pictureSiripurapu Hanumath Prasad

నేను సైతం..


'Nenu Saitham' - New Telugu Story Written By Siriprasad

Published In manatelugukathalu.com On 08/10/2023

'నేను సైతం' తెలుగు కథ

రచన: శిరిప్రసాద్

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రాజు లక్ష్మీనగర్ గవర్నమెంట్ స్కూల్ లో ఐదో తరగతి లో చేరాడు. నల్లగా వున్నా ముఖంలో కళ వుంటుంది. చూడ్డానికి పేద కుటుంబంలో పుట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా, అతనిలో చదువు పట్ల ఆసక్తి, సంస్కారం, నిదానం, టీచర్లందరికీ అతణ్ణి దగ్గిర చేశాయి. అతని తండ్రి సుతారి పని చేస్తుంటాడు. తల్లి నాలుగిళ్ళల్లో పని చేస్తుంటుంది.


రాజు కి చదువు పెద్దగా అబ్బకపోయినా, టీచర్లు చెప్పేది శ్రద్ధగా వింటాడు. టీచర్లంటే అపరిమిత గౌరవం. టీచర్లందరిలోనూ సైన్స్ టీచరంటే మరింత గౌరవం. రాజు కి తనపట్ల గౌరవం ఎక్కువగా వుందని తెలుసుకున్న సైన్స్ టీచర్ గోపాల్, తన వ్యక్తిగత పన్లకి రాజుని వాడేసుకుంటూ వుంటాడు. అయితే రోజూ సాయంత్రం రాజుకి ట్యూషన్ ఫ్రీగా చెప్తున్నాడు. ఆ టైం లోనే బయటి పనులు ఏవైనా వుంటే గోపాల్ భార్య రాజుకి చెప్పి చేయించుకుంటుంది. గోపాల్ కి కోపం ఎక్కువ. ట్యూషన్ లోనూ, స్కూల్ లోనూ పిల్లల్ని తీవ్రంగా కొడుతూ వుంటాడు. అయితే రాజుకి మినహాయింపు. రాజుకి చదువు పెద్దగా రాకపోయినా, వాడికీ, వాడి కుటుంబానికీ, దేశానికీ పెద్ద నష్టం లేదని గోపాల్ వుద్దేశం. తనని కొట్టకపోవడం తో రాజుకి గోపాల్ అంటే గౌరవం మరింత పెరిగింది.


'గోపాల్ సర్' అని టీచర్ని ఎప్పుడూ తలుచుకుంటూ వుంటాడు. సర్ భార్య పనేదైనా వుంటే యింటికి కబురు పంపుతుంది, రాజు స్కూల్ లో వుంటే స్కూల్లో భర్తకి ఫోన్ చేసి రాజుని యింటికి పంపమంటుంది. అలా రాజు సేవల్ని వుపయోగించుకుంటారు. కొంతకాలం రాజు తల్లిని యింటి పనికి వాడుకున్నారు. అయితే యేదో అపార్ధం సంభవించి ఆమెని పనిలోంచి తప్పించారు.


గోపాల్ సర్ పొడుగ్గా, బలిష్టంగా, ఎర్రగా వుంటాడు. టీచర్ గా యిరవై ఏళ్ళ అనుభవం. నాలుగు వూళ్ళలో పని చేసాడు యింతకుముందు. ఒక ప్రమోషన్ వచ్చినా, తర్వాత ఆగిపోయాయి. ప్రతిసారీ ప్రమోషన్ ముందు ఆయన మీద ఏదో ఒక ఫిర్యాదు వెళ్ళేది. ఎంక్వయిరీ జరిగేది. ప్రమోషన్ ఆగిపోయేది. భార్య పెద్దగా చదువుకోలేదు. ఇంటిపట్టునే వుంటుంది. టీవీ ఛానెల్స్ కి టీ ఆర్ఫీ పెంచే ప్రయత్నాలు చేస్తూ వుంటుంది. ఆయనకి యిద్దరు పిల్లలు. ఇద్దరూ గురుకులం స్కూల్స్ లో చదువుకుంటూ, హాస్టల్ లో వుంటారు. సెలవులకి యింటికి వస్తుంటారు.


ఒకసారి గోపాల్ సర్ భార్యకి అనారోగ్యమై హాస్పిటల్ లో చేరింది. ఆమె కదల్లేని పరిస్థితుల్లో రాజు హాస్పిటల్ లోనే వుండి ఆమెకి సేవ చేసాడు. ఆయా లేని సమయాల్లో రాజే ఆమె విసర్జితాల్ని తీసి, టాయిలెట్ లో వేసేవాడు. ఆమెకి కాళ్ళు వత్తడం లాంటి సపర్యలు చేసేవాడు. గోపాల్ సర్ తనకి మంచిగా చదువు చెప్పి, తనకి మంచి జీవితాన్ని యిస్తాడనే ఆశ అతని మస్తిష్కంలో మెదులుతూ వుంటుంది. గురువుని సేవించుకుంటే దేవుడు కరుణిస్తాడని గోపాల్ సారే చెప్తుండేవాడు. అందుకే ఎంత సేవైనా, ఎలాంటి సేవైనా చేస్తుండేవాడు.


రాజు తండ్రి ఒక రోజు రాజుని అడిగాడు, 'ఏరా, మంచిగా చదువుకుంటున్నావా?'


దానికి అతని భార్య, 'చదువా, పాడా, ఆ గోపాల్ సారుకి సేవ చేయడానికే సమయం సరిపోతోంది, ' అంది, జవాబుగా.


'ఇంక చదువేం వస్తుందిరా?.. నాతో పాటు పనికి రా.. నాలుగు పైసలన్నా వస్తాయి.. '


ఆ మాటకి రాజు డీలా పడిపోయాడు. కళ్ళంట నీళ్ళు రావడం మొదలైంది. రెండు చేతుల్తో కళ్ళు తుడుచుకుంటున్నాడు.


'సర్లే.. సర్లే.. యిప్పుడేడవ మాకు.. మంచిగా చదువుకోకుంటే వచ్చే ఏడాది స్కూల్ బంద్.. సుతారు పని నేర్చుకుందూ గాని.. '


తల వూపి రాజు బయటికి వురికాడు. అప్పుడే అనుకున్నాడు, గోపాల్ సర్కి యీ విషయం చెప్పి మంచిగా చదువు చెప్పించుకుందామని.


గోపాల్ సారు యింటికి చేరుకున్నాడు రాజు.


'సారు మార్కెట్కి వెళ్లింరు రా.. ఇయ్యాల కూరగాయలు పెడతారుగా.. ' అంది గోపాల్ భార్య.


రాజు వెంటనే మార్కెట్ వైపు పరిగెత్తాడు. 'కూరగాయల సంచి సారు మోయడమేంటి, నేనుండగా?' అనుకున్నాడు. మార్కెట్లో సారు గురించి వెతికాడు. అప్పుడే మెయిన్ రోడ్డు మీదకొచ్చాడు గోపాల్. ఆయన్ని చూసి అటు పరిగెత్తాడు రాజు. ఆయన దగ్గిరకి వెళ్తుండే సరికి ఒక సంఘటన జరిగింది.


గోపాల్ ని వెనక నించి ఒక బైక్ గుద్దింది. గోపాల్ వేగంగా కిందపడబోయాడు. సరిగ్గా అదే సమయంలో రాజు ఆయన ముందుకెళ్ళి, ఆయన్ని కిందపడకుండా ఆపబోయాడు. కానీ ఆపలేక రాజు కింద పడ్డాడు. అతని మీద పడ్డాడు గోపాల్. క్షణంలో జరిగి పోయిందా ఘటన. చుట్టూ జనం మూగారు. గోపాల్ ని నెమ్మదిగా లేపారు. ఆయన రాజు మీద పడడంతో ఆయనకేమీ దెబ్బలు తగల్లేదు, చిన్న చిన్న గాయాలు తప్ప. గోపాల్ రాజు మీద పడడంతో రాజు తలకి గాయమైంది. గోపాల్ బరువుకి దాదాపు చితికి పోయాడు రాజు. స్పృహ తప్పింది.


వెంటనే జనం ఆటోలో రాజుని హాస్పిటల్కి పంపించారు. ప్రభుత్వాసుపత్రిలో అప్పుడున్న అరకొర వుద్యోగులు వైద్యం చేశారు. పెద్ద డాక్టర్ వచ్చాక ఎక్స్ రే లు తీయించారు. మెదడు కి దెబ్బలు తగిలాయా, లేదా అని నిర్ధారణ చేసే పరీక్షలేవీ అక్కడ లేవు. నాలుగైదు గంటల తర్వాత రాజు స్పృహలోకి వచ్చాడు. అప్పటికే అతని తల్లితండ్రులు, యిరుగు పొరుగు హాస్పిటల్ కి చేరారు. ఎవరో కార్పొరేటర్ కి ఫోన్ చేశారు. ఆమె వచ్చి డాక్టర్ తో మాట్లాడి, ఎం ఎల్ ఏ కి ఫోన్ చేసింది.


గంట తర్వాత ఎం ఎల్ ఏ వచ్చి రాజుని పెద్ద ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాటు చేసాడు. అక్కడ పోగైన వందమందిని వుద్దేసించి గొప్పలు చెప్పుకున్నాడు. జాగ్రత్తలు చెప్పాడు. ఆ మోటార్ బైక్ నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేయమని పోలీస్ కాన్స్స్టేబుల్ ని ఆదేసించాడు. అక్కడ్నించి ఆ జనం పెద్దాసుపత్రికి వెళ్ళారు. ఎంఆరై లో లోపల గాయాలేవీ కనపడలేదు. నాలుగు రోజుల తర్వాత రాజు హాస్పిటల్ నించి యింటికి చేరాడు.


గాయాలు మానిపోయినా, రాజు షాక్ నించి తేరుకోలేక పోయాడు. గోపాల్, ఆయన భార్య యింటికొచ్చి రాజుని చూసి వెళ్ళారు. రాజు చేసిన ప్రయత్నంతో, తనకి పెద్ద గాయాలు కాలేదని చెప్పి రాజుని అభినందించాడు గోపాల్.


నిజానికి గోపాల్ రాజుకి పది వేలిద్దామనుకున్నాడు. భార్య అంతెందుకని అంది. ఐదు వేలకి తగ్గించాడు. 'వాళ్ళు పేదోళ్ళు, ప్రభుత్వం పేదోళ్ళ పక్షానే వుంటుంది, వైద్యం ఫ్రీగా అందుతుంది, ’ అన్నది భార్య. చాలాసేపు తర్జన భర్జనలయ్యాక, అయిదొందలు యిద్దామని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం గోపాల్ రాజు తల్లి చేతిలో అయిదొందలు పెట్టాడు. వద్దంటూనే ఆ తల్లి ఆ అయిదొందలూ తీసుకుంది. వాళ్ళు వెళ్ళిపోయాక, ఐదొందలే యిచ్చారని వాళ్ళని తిట్టిపోసింది.


రాజు పూర్తిగా కోలుకోవడానికి నెల రోజులు పట్టింది. చదువు మానేయమని, ఆ గోపాల్ సారుని వదిలేయమని రాజుపై తల్లితండ్రుల వొత్తిడి పెరిగిపోయింది. ఆ మాటలతో రాజు చిన్న మనసులో యింకా చదువు కోవాలనే కోరిక బలపడింది. గోపాల్ సారు తనకి మంచిగా చదువు చెప్పి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా చేస్తాడని ఆశ యింకా బలపడింది. సారుని కిందపడకుండా కాపాడినందుకు ఆయన ఆ మాత్రం హెల్ప్ చేయడా, అనే నమ్మకం బలపడింది. తల్లితండ్రుల్ని కష్టం మీద ఒప్పించాడు.


ఒకరోజు సాయంత్రం పుస్తకాలు తీసుకుని గోపాల్ సారు యింటికి ట్యూషన్ కి వెళ్ళాడు. అక్కడ నలుగురైదుగురు టెన్త్ క్లాస్ అమ్మాయిలకి ట్యూషన్ చెప్తున్నాడు గోపాల్ సారు.


రాజుని చూసి, 'ఏం రాజూ, పూర్తిగా నయమై పోయిందా, ' అని అడిగాడు.


తల వూపాడు రాజు.


'సరే.. నువ్వు రోజూ స్కూల్ కి రా.. నీకు ఎగ్జామ్స్ ముందు అన్నీ సబ్జక్ట్స్ లో స్పెషల్ ట్యూషన్ చెప్తాను.. నిన్ను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయిస్తాను.. సరేనా?'


తల వూపాడు రాజు.


నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ యింటి దారి పట్టాడు రాజు.


మర్నాడు స్కూల్ కి వెళ్ళాడు రాజు. తన క్లాస్ లో రాజు ని అభినందించాడు గోపాల్ సారు. ఎందుకో రాజుకి సంతోషం కలగలేదు. క్లాసుమేట్స్ చప్పట్లు రాజు గుండెలో గుబులు పుట్టించాయి. నిన్నతనని ఆదరించి ట్యూషన్ చెప్తాడనుకుంటే గోపాల్ సారు తర్వాత చెప్తాన్నాడు. ఎందుకో తన ఆశ మీద నీళ్ళు చల్లాడనిపించింది. కొంచం బాధేసింది. ఇప్పుడు క్లాస్ లో మెచ్చుకోలు రాజుకి అంతగా రుచించలేదు. నెల్లాళ్ళు తల్లితండ్రుల తనకి చేసిన బ్రెయిన్ వాష్ ప్రభావం చూపించిందా?


లాంగ్ బెల్ వినిపించింది. పిల్లలందరూ పెద్దగా కేకలేసుకుంటూ స్కూల్ నించి బయటకి పరిగెత్తారు. అయిదు నిముషాల్లో స్కూల్ ఖాళీ అయిపొయింది. నలుగురైదుగురు టీచర్లు, ఆఫీస్ లో యిద్దరు ముగ్గురు వున్నారు. రాజు యింటికి వెళ్ళకుండా స్కూల్లో అటూ, యిటూ తిరిగాడు కాసేపు. గోపాల్ సార్ బాగ్ తీసుకుని ఆయనతో పాటు యింటికి వెళ్ళాలి. స్కూల్ అంతా కలియ తిరిగాడు. తండ్రి చెప్పినట్టు స్కూల్ మాన్పిస్తే యీ యేడే చివరిదవుతుంది. స్కూల్ భవనం శిధిలావస్థలో వున్నా, ఆ చెట్లూ, ప్లే గ్రౌండ్, పిల్లల ఆటలు, పీ డీ సారు చేయించే డ్రిళ్ళూ, అన్నీ మిస్ అయిపోతాడు. తనకి యీ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకునే అదృష్టం వుందో, లేదో? స్కూల్ ని పడగొట్టి, కొత్త భవనం నిర్మిస్తే అప్పుడు స్కూల్ కి తాపీ పనికి వస్తాడేమో!.. ఆ ఆలోచనే గుండెల్లో గునపం దింపినట్టు వున్నది రాజుకి.


గోపాల్ సారు టెన్త్ క్లాస్ అమ్మాయి సింధూని తీసుకుని లైబ్రరీ వైపు వెళ్తూ, రాజుని చూసి పిలిచాడు. 'రాజూ నువ్వు వెళ్ళిపో.. నాకు స్పెషల్ క్లాస్ వుంది.. తర్వాత వెళ్తాను' అన్నాడు. రాజు తలూపి వెనక్కి తిరిగాడు. సింధూని తీసుకుని సారు లైబ్రరీ లోపలికి వెళ్ళడం చూసాడు.


ఆఫీస్ రూమ్ దగ్గిర ఏదో గొడవ జరుగుతున్నట్టు గమనించాడు రాజు. పరిగెత్తి అక్కడికి వెళ్ళాడు. ఐదారుగురు కఱ్ఱలు పట్టుకుని వచ్చారు. వాళ్ళెవర్నీ చూసిన గుర్తు లేదు రాజుకి. వాళ్ళ మాటలు అర్ధం కాలేదు. గోపాల్ సారు పేరు వినపడింది. వాళ్ళ చేతుల్లో కర్రలు చూసేసరికి రాజుకి అనుమానం వచ్చింది. గోపాల్ సారుకి వాళ్ళు హాని తలపెడతారని అర్ధమైంది.


'మా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తుండు.. వాణ్ణి చితక్కొట్టి పోలీసులకి అప్ప చెప్పాలి.. ' అనే మాటలు వినిపించాయి. ‘సారు వెళ్ళిపోయారు. స్కూల్ టైం అయిపొయింది, అని చెప్తున్నాడు అటెండరు.


అలా వాళ్ళు నిందిస్తున్నట్టు ప్రవర్తిస్తోంది ఎవరో తెలియలేదు రాజుకి. ఎందుకో కీడు శంకించాడు.


వెంటనే లైబ్రరీ వైపు పరుగు పెట్టాడు.


'సారుకి చెప్పాలి. ఐదారుగురు కర్రలతో వచ్చి ఆయన గురించి అడుగుతున్నారని, ఆయనకి హాని చేస్తారేమోనని అనుమానంగా వుందని. ఆయన్ని అట్నుంచి అటే పారిపొమ్మని చెప్పాలి. లైబ్రరీ లోపలికి పరిగెత్తాడు. అంతా తిరిగి చూసాడు. ఒక షెల్ఫ్ పక్కన చూసిన దృశ్యం రాజుని ఆపేసింది. అవాక్కయి నిలబడిపోయాడు.


గోపాల్ సార్ సింధూ శరీరాన్ని నలిపేస్తున్నాడు. అమ్మాయి ముఖం మీద ముద్దులు పెడుతున్నాడు. ఆ అమ్మాయి ఆయన్ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ సాధ్యం కావట్లేదు. ముట్టుకో కూడని శరీర భాగాల్ని తడిమేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూడలేక పోయాడు రాజు. గోపాల్ సారు యిలాంటి పని చేస్తున్నాడా, యిలాంటి చేయకూడని పని చేస్తున్నాడా, అమ్మాయి విల విల లాడిపోతున్నా వదిలిపెట్టట్లేదే ! ఒక్కసారిగా అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. కానీ ఆ అమ్మాయి కంటే కూడా చిన్నవాడు తను. ఆ అమ్మాయే విడిపించుకోలేక పోతోంది. తనేం సహాయం చెయ్య గలడు ? కానీ ఏదో ఒకటి చెయ్యాలి, అనుకుని వేగంగా పరిగెత్తాడు.


కఱ్ఱలు పట్టుకొచ్చిన వాళ్ళు స్కూల్ దాటి వెళ్ళిపోతున్నారు. ఒకడైతే బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. వేగంగా పరిగెత్తికెళ్ళి వాళ్ళని పెద్దగా పిలిచాడు, 'సార్' అని. వాళ్ళు ఆగిపోయి రాజు వంక ప్రస్నార్ధకంగా చూసారు. ఆయాసంతో మాట్లాడలేక పోయాడు రాజు. కింద కూలబడ్డాడు. అది చూసి వాళ్ళలో ఒకడు రాజు దగ్గిరకొచ్చి ఏమిటని అడిగాడు.


'గోపాల్ సారు కోసం వచ్చారా?'


'అవును.. వెళ్లిపోయాట్ట?'


'లేదు సార్.. లోపల మూల లైబ్రరీ వుంది. అందులో ఓ మూల వున్నాడు.. ' అని చెప్పి ఆగిపోయాడు.


ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళకి సంజ్ఞ చేసాడు. అందరూ లోపలికి పరిగెత్తారు.


నెమ్మదిగా లేచి అక్కడున్న చెట్టు చాటుకి వెళ్ళాడు రాజు. ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు.


అయిదు నిముషాల్లో గోపాల్ సారుని కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చారు ఆ అయిదుగురూ. చుట్టూ జనం మూగుతున్నారు. కొంతసేపటి తర్వాత ఏడ్చుకుంటూ సింధూ వస్తోంది. ఆ అయిదుగురూ గోపాల్ సారు వద్దని బతిమాలాడుతున్నా, వినకుండా కొడుతున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి వాళ్ళకి సర్ది చెప్పి గోపాల్ సారుని జీపెక్కించారు.


రాజు కళ్ళార్పకుండా చూస్తున్నాడు.

***

శిరిప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :

అందరికీవందనాలు.


చిన్నతనంనించి కథలురాయడం నా హాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.


'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.


ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయి బిరుదు పొందారు.



64 views0 comments

Comments


bottom of page