నేను సిద్ధం!
- Divakarla Venkata Durga Prasad
- 5 hours ago
- 7 min read
#DVDPrasad, #డివిడిప్రసాద్, #నేనుసిద్ధం, #NenuSiddham, #కొసమెరుపు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Nenu Siddham - New Telugu Story Written By - D V D Prasad
Published In manatelugukathalu.com On 19/04/2025
నేను సిద్ధం - తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
రాత్రంతా బాగా ఆలోచించి..చించి చేతిలో నలిగిన దిండుని కూడా బాగా చించేసి మరీ ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు క్రిష్ణమూర్తి. ఉదయం లేచిందే తడువుగా తల్లితండ్రులకు ఫోన్ చేసి, "నేను సిద్ధం!" అని చెప్పాడు.
తల్లి దేవకి, తండ్రి వాసుదేవరావు తమ ముద్దుల కొడుకు మాటలు వినగానే ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. లక్షణంగా లక్షలు తెచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండక, 'నేను సిద్ధం!' అంటూ ఉదయాన్నే ఈ సంధి ప్రేలాపనేమిటని వాళ్ళిద్దరూ కలవరపడ్డారు. టివిలో రాజకీయాలు చూసి ఎన్నికల బరిలోకి కొంపతీసి దిగుతున్నాడేమోనన్న అనుమానం కలిగింది వాసుదేవరావుకి. హోటల్లో అడ్డమైన తిళ్ళు తిని కొడుక్కి పైత్యం చేసిందేమోనని దేవకి గాబరా పడింది. పేరుపొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్న కొడుకు, "సిద్ధం!" అంటూ ఉదయాన్నేఫోన్ చేసి చెప్పడం వాళ్ళకి ఆశ్చర్యంతో పాటు ఆగ్రహాన్ని కలుగజేసింది.
"అదేంట్రా...'సిద్ధం!' అని అంటున్నావు? మనకి ఎన్నికలూ అవీ అచ్చిరావురా!" అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు వాసుదేవరావు.
"అదేమిటి నాన్నా, అలాగంటున్నారు? మొన్ననేగా నాకు అరడజను అమ్మాయిల ఫొటోలు పంపి ఎంచుకోమన్నారు. వాళ్ళ బయాడాటాలు కూడా పంపారు. పెళ్ళిచూపులకి, పెళ్ళికి సిద్ధం అవమన్నారు. అందుకే రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా! ఇప్పుడేమో మీరుకూడా రాజకీయ నాయకుల్లా మాట తప్పి మడమ తిప్పుతున్నారు!" తెల్లబోతూ చెప్పాడు క్రిష్ణమూర్తి.
అప్పుడు విషయం అర్ధమైంది వాసుదేవరావుకి. "ఓహ్...అందుకా సిద్ధమని నువ్వన్నది! నేను ఇంకెందుకో అనుకున్నాలే! సరే! నేను పంపిన సంబంధాల్లో ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు. ఆదివారం నాడు పెళ్ళి చూపులకి ఏర్పాటు చేస్తాను." చెప్పాడు వాసుదేవరావు ఇన్నాళ్ళకి కొడుకు పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైనందుకు ఆనందిస్తూ. క్రిష్ణమూర్తి పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకొని జనజీవన స్రవంతిలో కలవడానికి అంగీకరించినందుకు ఆ తల్లితండ్రులిద్దరూ సంతోషించారు.
"మీరు పంపించిన వాటిలో అనంతలక్ష్మి బాగా నచ్చింది నాన్నా! మీరు కూడా సిద్ధం కండి! ఈ ఆదివారం నేను వస్తున్నా!" తండ్రికి చెప్పాడు.
అనంతలక్ష్మి తనకి నచ్చిందని క్రిష్ణమూర్తి చెప్పగానే వాసుదేవరావు, దేవిక ఇద్దరూ తెల్లబోయారు.
"ఆ అమ్మాయి పల్లెటూరి అమ్మాయిరా! వాళ్ళ అమ్మమ్మ ఊర్లోనే ఉండి పెరిగింది. ఏదో వానాకాలం చదువు కూడానూ! నీకు సరితూగదురా ఆ సంబంధం. చక్కగా మీ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్న రస్మిక, సుప్రీత, ఉజ్జ్వల అయితే బాగుంటుందేమో!" నచ్చ చెప్పే ప్రయత్నం చేసాడు వాసుదేవరావు.
"అది కాదు నాన్నా! పట్నం ఆమ్మాయిలతో వేగడం కష్టం. నా స్నేహితులు పడే పాట్లు చూస్తూనే ఉన్నాను కదా! పల్లెటూరి అమ్మాయి అయితేనే బెటర్." అని జవాబిచ్చాడు క్రిష్ణమూర్తి.
పోనీ, పెద్ద చదువు లేకపోయినా సంప్రదాయానికి విలువనిచ్చే పల్లెటూరి పిల్ల అనంతలక్ష్మి కొడుక్కి నచ్చినందుకు తల్లి దేవిక మాత్రం చాలా సంతోషించింది.
"వాడు సరైన నిర్ణయమే తీసుకున్నాడండీ! నాకు కూడా ఆ అమ్మాయి బాగా నచ్చింది. మీరేం ఇందులో కలుగజేసుకోకండి." అని భర్తతో చెప్పి, "కన్నా...నాన్న మాటలకేం గానీ, నువ్వు చెప్పినట్లు ఆ అమ్మాయే నీకు సరైన జోడీరా క్రిష్ణా!" చెప్పిందామె.
అంతే! శనివారం ఉదయాన్నే ఇంటికి చేరుకున్నాడు క్రిష్ణమూర్తి. ఆదివారం నాడు తల్లితండ్రులతో కలిసి పెళ్ళి చూపులకెళ్ళాడు. తను కోరుకున్న లక్షణాలన్నీ అనంతలక్ష్మిలో ఉండటంతో మరో మాటకు తావులేకుండా ఆనందంగా పెళ్ళికి ఒప్పుకున్నాడు క్రిష్ణమూర్తి. లాంఛనంగా పెళ్ళి చూపులు జరిగిన తర్వాత వాళ్ళిద్దర్నీ ఏకాంతంగా మాట్లాడటానికి పెద్దలు అనుమతిచ్చారు. ఒకరి రుచులు, అభిరుచులు మరొకరు తెలుసుకున్నారు. సినిమాలు, షికార్ల విషయంలో ఇద్దరి అభిప్రాయాలు పూర్తిగా కలిసాయి. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే-
"నాకు బజ్జీలు, పకోడీలు అంటే చాలా ఇష్టం." అన్నాడు క్రిష్ణమూర్తి నోట్లో నీరూరగా.
"నాకూ ఇష్టం కానీ..." అంటూ ఏదో చెప్పబోయింది అనంతలక్ష్మి.
మధ్యలోనే అడ్డుకున్నాడు క్రిష్ణమూర్తి. "ముద్దపప్పు, ఆవకాయ, గుత్తొంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం!" అన్నాడు క్రిష్ణమూర్తి లొట్టలేస్తూ.
"నాకూనూ! అయితే..." ఈసారి అనంతలక్ష్మి నోట్లో నీళ్ళూరాయి.
"కాజాలు, కారంపూస అంటే చెవే కాదు నాలిక కూడా కోసుకుంటాను."
"నేనూ అంతే!...కాకపోతే?..."
"ఇంకా కాకపోవడం ఏమిటి? మన ఇద్దరి అభిరుచులే కాదు… రుచులు కూడా చాలాబాగా కలిసిపోయాయి. ఇంక మూడుముళ్ళు వెయ్యడమే తరువాయి." అంటూ ఆనందంగా అనంతలక్ష్మితో ఆ రూములోంచి బయటకు వచ్చాడు క్రిష్ణమూర్తి.
తనకి అనంతలక్ష్మి అన్నిరకాలుగానూ నచ్చిందని చెప్పడంతో పెద్దలందరూ కూడా సంతోషించి ముహూర్తాల గురించి మాట్లాడుకోనారంభించారు. పెళ్ళి సంబంధం తెచ్చిన మధ్యవర్తి మాధవరావు తను చూపిన మొదటి సంబంధమే క్రిష్ణమూర్తి ఖాయం చెయ్యడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కుదర్చడంకన్నా మగపిల్లలకి సంబంధాలు తేవడం కష్టంగా మారినవేళ అతనలా ఫీల్ అవడం సహజమే మరి!
క్రిష్ణమూర్తి, అనంతలక్ష్మిల పెళ్ళి నెలరోజుల్లోపే అంగరంగ వైభవంగా జరిగిపోయింది.
పెళ్ళై భర్త క్రిష్ణమూర్తితో కాపురానికి బెంగుళూరు వచ్చింది అనంతలక్ష్మి. క్రిష్ణమూర్తి బెంగుళూరులో టూ బెడ్రూం ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. పెళ్ళికి ముందే ఇంట్లో అన్నీ అమర్చుకున్నాడు. అయినా కొత్త పెళ్ళికూతుర్ని కాపురానికి రాగానే కష్టపెట్టడమెందుకని మూడు రోజుల పాటు ఉదయం భోజనం స్విగ్గీలో తెప్పించాడు. సాయంకాలం ఇద్దరూ కలిసి హోటళ్ళకెళ్ళేవారు. ఉదయమూ, సాయంకాలమూ కాఫీ, టీలు తనే కలిపి అనంతలక్ష్మికి అందించాడు.
నాలుగోరోజే మొదలైంది అసలు చిక్కు! ఆ రోజు ఆదివారం. ఉదయం లేచి బ్రష్ చేసుకొని భార్య కాఫీ ఇస్తుందని ఎదురు చూసాడు క్రిష్ణమూర్తి. కానీ ఎంతసేపటికీ కాఫీ వస్తున్న సూచనలు లేకపోవడంతో అప్పుడు అడిగితే తెలిసింది తన భార్యకి కాఫీ పెట్టడం కూడా రాదన్న సంగతి. మరి వంటమాటో?
ఆ విషయమే ఆమెనడిగేసరికి, "నాకు వంటరాదండీ!" అని గోముగా, ముద్దుగా అనంతలక్ష్మి చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు.
"మరి పెళ్ళిచూపుల రోజు..." సగంలో ఆగిపోయాడు.
"అవన్నీ నాకు ఇష్టమని చెప్పాను గాని, ఎలా చెయ్యాలో నాకు రాదని చెప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా మీరు అడ్డుపడ్డారు. ఇందులో నా తప్పేం లేదు కదండీ!" అనేసరికి మరి నోట మాట రాలేదు క్రిష్ణమూర్తికి.
ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళాడు. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా తనే అడ్డుకున్నాడు, పల్లెటూళ్ళో పెరిగిన అమ్మాయికి వంట రాకపోతుందా అన్న ధీమాతో. అది గుర్తుకు వచ్చి బేరుమన్నాడు. అయినా, ఇప్పుడు బేరుమన్నా, కేరుమన్నా ఏం లాభం లేదు అని మనసులో అనుకొని ఆశచావక, "మరి పళ్ళెటూళ్ళో మీ అమ్మమ్మ దగ్గర పెరిగావు కదా, వంట నేర్చుకోలేదెలాగా?" అని అడిగాడు.
"ఏం చెయ్యను? నేనంటే మా అమ్మమ్మకి చాలా ముద్దు, అందుకే వంట విషయంలో నన్ను మొద్దులా తయారు చేసింది. అప్పటికీ అమ్మానాన్నా చెప్పారు, 'వంట నేర్చుకోవే తల్లీ, లేకపోతే నీ పెళ్ళవదు!' అని. అయితే నేను వండటానికి మా అమ్మమ్మ ఒప్పుకోలే! ఆవిడ చక్కగా అన్నీ చేసి పెడ్తూంటే సుష్టుగా తినడమే తెలుసుగాని శుచిగా, రుచిగా చెయ్యడం మాత్రం నాకు తెలియదండీ!" అనేసరికి నవ్వాలో ఏడ్వాలో బోధపడలేదు పాపం క్రిష్ణమూర్తికి. ఇక ఆమెనని ఏమాత్రం లాభంలేదని గ్రహించి, అనంతలక్ష్మికి వంట చెయ్యటం నేర్పాలన్న తీర్మానానికి వచ్చాడు.
"వంట చెయ్యడం రాదని దిగులు చెందకు, అదేం బ్రహవిద్య కాదు! నేను నీకు నిదానంగా నేర్పుతాను, సరేనా! ఈ పూటకి నువ్వు అన్నం వండెయ్! నేను పప్పు, కూర, సాంబారు చేసేస్తాను. నెమ్మదిగా మిగతా వంటలు నేర్చుకుందువు గాని. అన్నిట్లోకీ అన్నం వండడం చాలా తేలిక!" అన్నాడు.
"అలాగే!" అని తలూపింది అనంతలక్ష్మి, వంటొచ్చిన మొగుడు దొరకడం తన అదృష్టమని మురిసిపోతూ.
"చూడు, కుక్కర్లో ఓ గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేసి మూడు విజిల్స్ వేసిన తర్వాత కట్టేయాలి. అంతే! చాలా సింపుల్!" చెప్పాడు.
అర్ధమైనట్లు తలూపిందామె. "ఓస్ అంతే నా! చిటికెలో చేసేస్తా!" అని వంటింట్లోకి దూరిందామె.
అనంతలక్ష్మి వంటింట్లోకి వెళ్ళిన తర్వాత, సోఫాలో వెనక్కి వాలాడు క్రిష్ణమూర్తి టీవీ చూస్తూ. ఆమె వంటింట్లోకి వెళ్ళిన రెండు నిమిషాల్లో వెంటవెంటనే మూడుసార్లు విజిల్స్ రావడంతో ఆశ్చర్యపోయాడు. విజిల్లో తేడా ఎందుకు వచ్చిందో తెలియక వంటింటికెళ్ళి చూసాడు. అక్కడ అనంతలక్ష్మి నోట్లో విజిల్ పెట్టుకొని కనిపించేసరికి నోరెళ్ళబెట్టాడు క్రిష్ణమూర్తి.
"చాలా అండీ! కుక్కర్లో బియ్యం, నీళ్ళు వేసి మూడు సార్లు విజిల్ వేసాను. అన్నం ఉడికిపోయి ఉంటుంది కదండీ!" అమాయకంగా అడుగుతున్న అనంతలక్ష్మిని చూసి తల గోడకేసి బాదుకోవాలనిపించింది క్రిష్ణమూర్తికి. అనంతలక్ష్మి పల్లెటూరిపిల్ల,
అమాయకురాలని అనుకున్నాడు కానీ, మరీ ఇంత అమాయకురాలని అనుకోలేదు.
"అదికాదు అనంతం! ట్రాఫిక్ కానిస్టేబుల్లా నువ్వు విజిల్ వెయ్యకర్లే! స్టవ్ మీద కుక్కరు పెడితే, అదే విజిల్ వేస్తుంది.” అని ఆమెకి బోధపర్చేసరికి, "ఓహో...అలాగా!" అందామె.
మరి ఇలా లాభం లేదనుకొని తనే రంగంలోకి దిగాడు క్రిష్ణమూర్తి. తను వంటెలా చేస్తున్నాడో చూడమని ఆమెకి చెప్పి అన్నం వండేసాడు.
ఆ మరుసటి రోజు అన్నం ఎలా వండాలో మరోసారి చెప్పి, "చూసావు కదా నిన్న, అలా అన్నం వండాలి!" అని చెప్పేసరికి తల ఆడించింది, "ఇదేం బ్రహ్మవిద్యా? చూడండి, నేనివాళ ఎలా వంట చేస్తానో!" హుషారుగా అంది.
"హమయ్య! ఇక ఫర్వాలేదు!" అనుకొని హాల్లోకెళ్ళి పేపరు చదువుతూ కూర్చున్నాడు క్రిష్ణమూర్తి.
అనంతలక్ష్మి కుక్కర్లో బియ్యం వేసేసి తను కూడా వచ్చి టివి ముందు కూర్చుంది. పావుగంట గడిచింది, అరగంటే కాదు, గంట కూడా గడిచింది! టివీ వీక్షణంలో మునిగిపోయి ఇద్దరూ కూడా గమనించలేదు. హఠాత్తుగా క్రిష్ణమూర్తికి కుక్కర్ సంగతి గుర్తుకు వచ్చి, ఇంకా ఎందుకు విజిల్స్ రాలేదా అనుకొని వంటింట్లోకెళ్ళి చూసేసరికి స్టౌవ్ వెలగడం లేదు. "అదేంటీ, స్టవ్ వెలిగించలేదా?" అనడిగాడు.
"స్టవ్ వెలిగించాలన్న విషయం మరి నాకు చెప్పలేదే?” అని అనంతలక్ష్మి అనేసరికి జుట్టుపీక్కోబోయి ఆగిపోయాడు క్రిష్ణమూర్తి.
ఆమెకి అంతా మొదటి నుండి వివరంగా చెప్తేనేకానీ తెలియదని గ్రహించి నోరుమూసుకొని ఆ పూట కూడా వంటంతా తనే చేసేసాడు. ఎలాగో కష్టపడి పదిహేను రోజులయ్యేసరికి అన్నం వండటం మాత్రం నేర్పగలిగాడు ఆమెకి. ఈ లెక్కన మిగతావి ఎప్పుడు ఆమె నేర్చుకుంటుందో, తనకీ వంటగది చెర ఎప్పుడు తప్పుతుందో తెలియక తలపట్టుకున్నాడు క్రిష్ణమూర్తి. కూర చెయ్యమంటే ఓ రోజు పచ్చి బటాణీలు తొక్కతో సహా కూర చేసేసింది. కూర మొత్తం డస్ట్బిన్ పాలు చెయ్యవలసి వచ్చింది.
అలా కాదు, బటాణీల తొక్కలు పారేసి గింజలు మాత్రమే కూరలో వెయ్యాలి అని చెప్పేసరికి, ఆ మరుసటి రోజు వంకాయలకి కూడా తొక్క తీసేసి కూర చేసింది. సాంబారులోకి పనికి వస్తాయని తెచ్చిన మునగకాడలు అన్నీ వలిచి, గింజలతో కూర చేసేసింది. అది చూసి తలపట్టుకున్నాడు క్రిష్ణమూర్తి. ఆమెకెలా చెప్తే అర్ధం అవుతుందో బోధపడలేదు. కొబ్బరికాయ పచ్చడి చెయ్యమంటే, పెంకుతో సహా మిక్సీలో వేసేసరికి మిక్సీ పాడై కూర్చుంది. టమాటాలు కూడా తొక్కతీసి మరీ కూర చేసేసిందో రోజు.
కాఫీలో పంచదారకి బదులు ఉప్పు, పప్పులో ఉప్పుకు బదులు పంచదార వేసేసేది. తనకిష్టమైన బజ్జీలు, పకోడీలు, ముద్దపప్పు, గుత్తొంకాయ కూర సంగతి అటుంచి, అసలు తిండే కరువయ్యే పరిస్థితి ఏర్పడింది క్రిష్ణమూర్తికి. అనంతలక్ష్మికి అన్నీ లొట్టలేసుకు తినడం మాత్రమే వచ్చునని, అవి చెయ్యటం మాత్రం చేతకాదని తెలిసిపోయింది.
మరో రోజు తనకి వడ్డించిన బ్రహ్మపదార్థమేమిటో తెలియక అవస్థ పడుతూంటే, "చూసారా, మీరెప్పుడూ పాత రకం కూరలే చేస్తున్నారు. నేనీ రోజు ఓ కొత్త వెరైటీ కూర చేసాను. చెప్పుకోండి చూద్దాం ఏం కూర చేసానో?" అనేసరికి ఆ పదార్థం రుచి చూడాలా వద్దా అన్న మీమాంశలో పడ్డాడు. ఆ వారం తన రాశిఫలాల్లో ఏం రాసుందో కూడా చదువుకోని కారణంగా తటపటాయించాడు.
"చూసారా! పోల్చుకోలేకపోయారు మీరు! అరటిపళ్ళ కూరండీ ఇది! ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు వంట పూర్తిగా వచ్చిందని." అన్న ఆమె వైపు బిత్తరపోయి చూడటం క్రిష్ణమూర్తి వంతైంది.
భోజనం చేసిన తర్వాత తినడానికని డజను అరటిపళ్ళు తెస్తే, తొక్కతో సహా ముద్దకూరలా చేసేసింది అనంతలక్ష్మి. అవన్నీ పారబోసి ఫ్రెష్గా మళ్ళీ వండుకోవలసి వచ్చింది క్రిష్ణమూర్తికి. వంటపని తనకి తప్పదని జ్ఞానోదయమై ఆమెకి వంట నేర్పడానికి ప్రయత్నించినందుకు తన చెంపలు తానే బుద్ధిగా వాయించేసుకున్నాడు. అనంతరం వంటింటి బాధ్యత పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోగా, అనంతలక్ష్మి మహదానందంగా రోజంతా టివి ముందు సెటలై సీరియల్స్ చూడటంలో మునిగిపోయింది.
*****
ఆర్నెల్ల తర్వాత, వాళ్ళింటికి అనంతలక్షి స్నేహితురాలు ఆనందతారకం ఆ ఊళ్ళో ఏదో పనిపడి వచ్చింది. స్నేహితురాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని ముచ్చటించుకుంటూండగా, క్రిష్ణమూర్తి వంటింట్లోకి వెళ్ళి ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చాడు.
"అయ్యో! మీరెందుకండీ శ్రమ తీసుకున్నారు? మా అనంతం కాఫీ కలుపుతుంది కదా!" అని నొచ్చుకుంది ఆనందతారకం.
'అంత అదృష్టం కూడానా!' అని మనసులో అనుకొని మొహమ్మీద నవ్వు పులుముకొని తను కూడా ఓ కాఫీ కప్పు తీసుకున్నాడు.
స్నేహితురాళ్ళిద్దరి మధ్య చిన్ననాటి కబుర్లు దొర్లుతుండగా వంటగదిలోకి వెళ్ళాడు క్రిష్ణమూర్తి.
"అయ్యో, వంట మీరు చెయ్యడమేమిటి? మేమిద్దరమూ చేస్తాంలెండి!' అని అనంతలక్ష్మి లేచేసరికి, బెంబేలెత్తిపోయాడు క్రిష్ణమూర్తి.
"వద్దు వద్దు, ఇవాళ ఆదివారం సెలవే కదా నాకు. చాలా రోజుల తర్వాత మీరిద్దరూ కలిసారు, మాట్లాడుకోండి." అని వంటగదివైపు దారితీసాడు క్రిష్ణమూర్తి.
"అదేంటే! వంట మీ అయన చేస్తున్నారు!" అంది ఆనందతారకం ఆశ్చర్యపోతూ.
"నాకు వంట చెయ్యడం రాదుగా..." నవ్వుతూ బదులిచ్చింది అనంతలక్ష్మి.
"నీకు వంట రాకపోవడమేమిటి, ఎవరైనా వింటే నవ్విపోతారు. మీ ఊరికి నేను వెళ్ళినప్పుడు వంటంతా నువ్వే కదా చేసావు!" మరింత ఆశ్చర్యపోతూ అంది ఆనందతారకం.
"ష్! మెల్లగా మాట్లాడు! వంటింటికి చెవులుంటాయి! నాకు వంట రానట్లు నటించా! ముందు అతను నాకు వంట నేర్పడానికి పూనుకున్నారు. అన్నిరకాలుగా వంటని తగలెట్టా! ఇక నా చేతి వంట మాటెత్తితే ఒట్టు!" రహస్యం స్నేహితురాలికి చెప్పింది అనంతలక్ష్మి.
"ఎందుకు అలా చేసావు?" ఆనందతారకం ప్రశ్నించింది కుతూహలంగా.
"ఎందుకేమిటి, రోజంతా వంటగదికి అంకితమైపోతే సీరియల్స్ ఎప్పుడు చూస్తాను? నాకిష్టమైన సీరియల్స్ మిస్ అవనూ? సెల్లో చూడటం నాకసలు ఇష్టం ఉండదు. అందుకే ఈ నాటకమంతా!” అంది అనంతలక్ష్మి ముసిముసిగా నవ్వుతూ.
తెల్లబోయింది ఆనందతారకం. "వంటొచ్చిన భర్త లభించడం నీ అదృష్టం!" అంది.
“పల్లెటూరి అమ్మాయినని మోజుపడి నన్ను చేసుకున్నారతను. అతనికి వంటొచ్చొని తెలుసుకొని నేను కూడా ఇష్టపడ్డాను.” అంది అనంతలక్ష్మి నవ్వుతూ.
అప్పుడే ఏం కూర చెయ్యమంటుందో అడుగుదామని అక్కడికి రాబోయిన క్రిష్ణమూర్తి చెవిలో స్నేహితురాళ్ళ మాటలు పడనే పడ్డాయి. పట్నం అమ్మాయి కన్నా పల్లెటూరి అమ్మాయితో వేగడం సులభమని ఇప్పటివరకూ అభిప్రాయపడ్డాడు కానీ, ఇప్పుడు తన థీరీ తప్పని తేలిపోయింది. పెళ్ళికి 'సిద్ధం!' అంటూ చెప్పి యుద్ధంలో ఇరుక్కుపోయినట్లు ఉంది అతని పరిస్థితి! పాపం క్రిష్ణమూర్తి! దీర్ఘంగా నిట్టూరుస్తూ వంటపనిలో పడ్డాడు. రెండు గంటల తర్వాత, అలసిపోయిన మొహంతో హాల్లోకి వచ్చి స్నేహితురాళ్ళిద్దరికీ చెప్పాడు, "భోజనం సిద్ధం!" అని.
******
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
Comments