కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Nethralayam' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
తల్లి దండ్రులు బిడ్డని తమ సంరక్షణలో ఎప్పుడూ భద్రంగా ఉంచుకుంటారు. కానీ ఓ జంట తమ బిడ్డకు ఉన్న లోపాన్ని చూసి, అనాధగా వదిలేసి వెళ్ళారు. ఆ బిడ్డకు తల్లిదండ్రులు వున్నా, అనాధ గా ఆశ్రమాల్లో ఉండవలసిన దుస్థితి వచ్చింది. తన లోపాన్ని జయించి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించిన డాక్టర్ గా ఎదిగిన ఓ అనాథ కథ..
ఈ కథను యువ రచయిత్రి N. ధనలక్ష్మి గారు రచించారు.
@@@@@@@@@@@@@@@@@@
రైల్వే స్టేషన్ దగ్గర "అమ్మ కావాలి" అని గుక్క పెట్టుకొని ఏడుస్తున్న మూడేళ్ళ పాపను చూసిన ఆటో డ్రైవర్ తనని తీసుకొని వెళ్ళి, పోలీస్ లకు అప్పగించాడు.
పాప ఎంతసేపూ అమ్మ కావాలని ఏడుస్తుంది తప్ప, తన వివరాలు ఏదీ చెప్పలేక పోతోంది.
తన ఫోటోలను తీసి అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అన్నిట్లో వాల్ పోస్టర్ లు అంటించారు..
ఆ పాపని అనాధాశ్రమంలో చేర్చారు..
సరిగ్గా వారానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ పోలీసులకు ఫోన్ చేసాడు.
“కొద్ది రోజుల క్రితం కూలి పనులు చేసుకునే భార్య భర్తలు, ఫోటోలో ఉన్న పాపను నా వద్దకు తీసుకు వచ్చారు. పాపకు జన్యు లోపం వల్ల కొద్ది రోజుల్లో తను చూపు కోల్పోతుందని చెప్పాను. పాపకు సరిపోయే కళ్ళు దొరికిన వెంటనే ఆపరేషన్ చేస్తే తనకి చూపు వస్తుందని, దానికి కొంత మేర డబ్బు అవసరం అవుతుందని చెప్పాను. వాళ్ళు ఏమీ చెప్పకుండా పాపను తీసుకొని వెళ్ళి పోయారు”అని ఆ డాక్టర్ చెప్పాడు.
కావాలనే తల్లిదండ్రులు పాపను రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళారని పోలీసులకు అర్థమైంది..
ఆశ్రమము వాళ్ళే పాపకు నయన అని పేరు పెట్టారు.. పాపకు ఐదు ఏళ్ళు రాగానే పూర్తిగా చూపును కోల్పోయింది..
నయనకు కళ్ళు లేవు అనే లోపం తప్ప మిగతా అన్నిట్లో చురుగ్గా ఉండేది, చక్కగా చదువుకునేది..
దత్తత తీసుకోవడానికి అక్కడికొచ్చే వాళ్ళు మొదట నయనను చూసి ముచ్చట పడ్డా, తనకు ఉన్న లోపాన్ని చూసి తీసుకోకుండా వెళ్ళిపోయేవారు.
తనని ఎవరూ ఇష్టపడడం లేదని తెలుసుకొని ఏడుస్తూ కన్నీరుమున్నీరైంది ఓ రోజు… అది చూసిన ఆశ్రమం వార్డెన్ నయనను ప్రేమగా దగ్గర తీసుకొని తన కన్నీరును తుడిచి, " నీకు మంచి రోజులు వస్తాయమ్మా… నీతో పాటు నీ లోపాన్ని ఇష్టపడి, నీకు ఆపరేషన్ చేయించి , ప్రేమను పంచే వాళ్ళు వస్తారు. అంతవరకు నువ్వు ఓపికగా ఉండాలి” అని ధైర్యం చెప్పారు.
నేత్ర, ఆనంద్ ముచ్చటైన జంట. వారి పెళ్ళి అయిన ఏడాదికి, తమ వారినందరిని ఒక్కసారిగా ఓ ప్రమాదంలో కోల్పోయారు. ఇద్దరూ అమ్మ,నాన్నల ప్రేమను కోల్పోయి బాధ పడ్డారు.. అందుకే వాళ్ళిద్దరూ అమ్మ, నాన్న ప్రేమ కోసం తపించే వారిని దత్తత తీసుకోవాలని అనుకున్నారు..
అలా నయన ఉన్న ఆశ్రమానికి వచ్చారు…
ఆనంద్ కి ఫోన్ రావడంతో మాట్లాడుతుంటాడు.
ఆశ్రమం మొత్తం ఎంతో అందంగా , పచ్చదనంతో నిండిపోయింది.. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తూ నేత్ర రాయి తగిలి కింద పడిపోతుంది..
“అమ్మా!” అంటుంది నొప్పితో.
అక్కడే కూర్చోని ఉన్న నయన లేచి, "అమ్మా ! దెబ్బ తగిలిందా ,తగ్గిపోతుంది ..ఏమి కాదు” అంటుంది.
నేత్రకు నయనలో వాళ్ళమ్మ కనపడుతుంది …
తనని హత్తుకొని తనివితీరా ఏడుస్తుంది...ప్రేమగా నుదిటి మీద ముద్దు పెడుతుంది..
నయనకు ఏమి అర్ధం కాకపోయినా సైలెంట్ గా ఉంటుంది....
అక్కడికి వచ్చిన ఆనంద్ తో "ఏవండీ ! ఈ పాప నేటి నుంచి మన పాప.. కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేయండి” అంటుంది ఎంతో ఆనందంగా…
"నేత్ర! మనం నెలల పాపను తీసుకొని వెళ్దాము అనుకున్నాము కదా!.. అప్పుడే మనకు బాగా దగ్గర అవుతుంది అనుకున్నాము కదా!" అన్నాడు ఆనంద్.
"నిజమే నందు… ఈ పాప నన్ను ‘అమ్మా’ అంది..
నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఈ పాపలో మా అమ్మ కనపడుతుంది..” అంది నేత్ర.
"అవునా ! నీ ఇష్టమే నా ఇష్టము.ఇంతకీ ఈ పాప పేరు ఏంటి ?”
" నీ పేరు ఏంటి కన్నా!" పాపను అడిగింది నేత్ర.
"అమ్మా! నా పేరు నయన. నాకు కళ్ళు కనపడవు.
సర్ గారు చెప్పినట్టు లోపలున్న చిన్నారిని తీసుకొని వెళ్ళండి... అక్కడే ఆ వార్డెన్ మేడమ్ ఉంటారు” అని గది వైపు చెయ్యి చూపిస్తుంది.
" నయనా! సర్ కాదు, ‘నాన్న’ అని పిలువు” అంటూ ప్రేమగా హత్తుకున్నాడు ఆనంద్.
అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఆనాటి నుండి పాపను వారి పాప లాగ కంటికి రెప్పలా చూసుకున్నారు. నయన రాకతో వారి ఇల్లు ఆనందమయం అయింది. ఎప్పటి నుండో కోర్టులో ఉన్న వారి పూర్వీకుల అస్తి కూడా వారి చేతికి వచ్చింది. నయనను వారి ఇంటి మహాలక్ష్మి గా భావించారు.
ఓ పెద్ద కంటి డాక్టర్ కి నయనని చూపించారు.
ఆ డాక్టర్ గారు “మొదట ఒక కంటికి ఆపరేషన్ చేద్దాం. తరువాత ఇంకో కంటికి” అని చెప్పారు.
అలా నయనకు ఒక కంటికి చూపు వచ్చింది.. చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఎంతో సంబరపడింది…
తన అమ్మ, నాన్నలు చూపించే ప్రేమను చూసి, ఇన్నాళ్ళు తను పడ్డ మనోవేదనను మర్చిపోయింది.
కొద్ది రోజులకి నేత్రకి పండటి బాబు పుట్టాడు..
నయన తన తమ్ముడిని ఎంతో బాగా చూసుకునేది.
బాబుకి విహస్ అని పేరు పెట్టుకున్నారు..
కొన్నాళ్లకు నయన రెండో కంటికి ఆపరేషన్ చేశారు.. నయన ఆనందం చూసిన నేత్ర, ఆనంద్ లు ఇద్దరూ ఎంతో మురిసిపోయారు..
ఒకరికి కంటి చూపు వస్తే ఇంత సంతోషంగా ఉంటుందా!..
తమ తదనంతరం కళ్ళను దానం చేయాలని భావించి, ఓ హాస్పిటల్లో ఆర్గాన్స్ డోనార్ గా నమోదు చేసుకున్నారు…
ఆ ఏడాది పదో తరగతి ఫలితాల్లో నయన జిల్లా ఫస్ట్ వచ్చింది. ఆనంద్ అయితే వీధి అంతా స్వీట్స్ పంచాడు.
నయనను “ఏమి కావాలని అనుకుంటున్నావు నువ్వు?” అడిగాడు ఓ రోజు ఆనంద్.
"నేను డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలని అనుకుంటున్నా నాన్నా! ఒకరి బాధను మనం తగ్గిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. నన్నే చూడండి.
నాకున్న లోపాన్ని దూరం చేసింది డాక్టర్ కదా! అందుకే నేను కంటి డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా” అని చెప్పింది.
"శభాష్! మంచి నిర్ణయం" అని అభినందించాడు ఆనంద్.
నయన ఇంటర్ లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. మెడికల్లో ఫ్రీ సీట్ సంపాదించింది. నాలుగేళ్లు కష్టపడి చదివి…
కాదు.. ఇష్టపడి చదివి డాక్టర్ పట్టాను అందుకుంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది.. పీజీ చదువుతోంది.. తమ్ముడు బీబీఎం చదువుతుంటాడు.
నయన పుట్టిన రోజు ఆనంద్ తనతో "అమ్మ! ఈ పుట్టిన రోజుకి నీకు ఏం గిఫ్ట్ కావాలి” అని అడుగుతాడు.
“నేను అనాధ పిల్లల కోసం , వృద్ధుల కోసం ఆశ్రమం నడపాలి అనుకుంటున్నా.. మీరు ఏమంటారు నాన్నా?
అదే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ నాన్నా!” అంది నయన.
" తప్పకుండా నడుపు తల్లీ! మనకు దేవుడి దయ వల్ల డబ్బుకి లోటు లేదు.. నీకు నచ్చింది చెయ్యి" అన్నాడు ఆనంద్.
నయన ఆశ్రమానికి "నేత్రాలయం" అని వాళ్ళమ్మ పేరు పెట్టింది..
నేత్ర మురిసిపోతూ ,ఏడుస్తుంటే విహాస్..
"అక్కా! ఇంకాసేపట్లో ఇక్కడికి వరద నీరు వచ్చేస్తుంది.
మనం మునిగిపోయేలా ఉన్నాము" అన్నాడు.
"రేయ్! ఇక్కడకి దగ్గర్లో చెరువులు కూడా లేవు. పైగా వానలు లేకుండా నీకు వరదలు ఎలా వస్తాయి రా?" అన్నాడు ఆనంద్.
"నాన్నా! అమ్మ కన్నీటి సంద్రంలో మనం మునిగి పోయేలా ఉన్నాము.." అన్నాడు విహాస్.
"రేయ్! ఇది బాధలో వచ్చిన కన్నీరు కాదురా. సంతోషంలో వచ్చిన ఆనందభాష్పాలు! నీకు అర్థం కాదులే" అంది నేత్ర.
" అమ్మా! నేను సరదాగా అన్నాను. మనము సంతోష పడాలి. బాధపడకూడదు, అక్క ఇంత గొప్పపని చేస్తున్నందుకు” అని విహాస్ గర్వంగా చెప్పాడు.
ఒక్కరిగా మొదలైన నేత్రాలయం లో దాదాపు 500 మంది వున్నారిప్పుడు. వాళ్ళ సంరక్షణ మొత్తం నయన కుటుంబం చూసుకుంటుంది.
నయన కొంతమందిని గ్రూప్ గా ఫామ్ చేసి, వీకెండ్స్ లో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ ఉంది…
నయన పి.జీ లో కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది..
నయన కోసం హాస్పిటల్ కట్టించారు.నయన ఆ హాస్పిటల్ కు "నేత్రానంద్" అని పేరు పెట్టించింది..
నామమాత్రపు డబ్బులు తీసుకుంటూ మెరుగైన వైద్యం చేస్తూ మంచి డాక్టరుగా పేరు తెచ్చుకుంది.. ఎంతో మందికి కంటిచూపు ని ప్రసాదించింది తన వైద్యంతో నయన ..
ప్రతి ఆదివారం నయన, తన టీం వాళ్ళతో తను నడుపుతున్న నేత్రాలయానికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది..
ఒక రోజు హాస్పిటల్ లో నయన పట్ల ఒకామె చాలా ప్రేమ గా చూస్తూ ఉంటుంది. ఆమె భర్తను పరీక్షించి మందులు ఇచ్చి ఐ డ్రాప్స్ ఇస్తుంది నయన.
“వీటిని వాడు పెద్దయ్యా! మీ కంటి సమస్య తగ్గిపోతుంది” అని చెప్పి వెళ్ళిపోతుంది.
నయన వెళ్ళిపోయాక ఆమె, "ఏవండీ! చూసారా! ఏ బిడ్డను లోపం ఉందని అనాథలా వదిలేసి వచ్చామో .. ఇప్పుడు మనం తన సంరక్షణలోనే ఉన్నాము. తనే చాలా మందిని చూసుకుంటూ వారికి కొత్త జీవితాన్ని ఇస్తూ అందరి ఆశీస్సులు అందుకుంటోంది మన బిడ్డ"
అంది ఆమె.
"ఏమంటున్నావ్? తను మన బిడ్డ అని నీకు ఎలా తెలుసు?" అడిగాడా పెద్దాయన.
"తన చేతిపై ఉన్న పుట్టుమచ్చను చూసి తను మన ‘నందన’ అని అర్థం అయింది” చెప్పిందామె.
"అవునా! అయితే తనను పిలువు. మనమే తన ‘అమ్మ, నాన్న’ అని చెబుదాము" అన్నాడాయన.
"చిన్న పిల్లగా ఉన్నప్పుడు అనాధగా వదిలేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు తను మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మనం కలిసి ‘మేము నీ తల్లిదండ్రులం’ అని చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. మనం చేసిన ద్రోహానికి ఇదే మనకి తగిన శిక్ష! కన్నబిడ్డనే ఎదురుగా పెట్టుకొని తన చేత అమ్మ నాన్న పిలిపించు కోకుండా ఉండడం" బాధగా ఆంది ఆమె.
"నువ్వు చెప్పింది నిజమే. ఆడబిడ్డ.. పైగా చూపులేదని వదిలేసి వచ్చాము.. మగబిడ్డ కదా అని గారాబంగా పెంచితే వాడు మనల్ని భారం అనుకొని ఇంట్లో నుంచి తరిమేశాడు.. దేవుడు మనకి తగిన శిక్ష వేశాడులే.
చూశావా విచిత్రం తల్లిదండ్రుల సంరక్షణలో బిడ్డలు ఉంటారు కానీ ఇక్కడ మన బిడ్డ సంరక్షణలో మనం ఉన్నాము..”
తమ పరిస్థితి తలుచుకుని బాధ పడ్డారు ఆ దంపతులు.
ఒకసారి ఒక అబ్బాయి బైక్ నడుపుతూ యాక్సిడెంట్ లో చనిపోతే, వారి కుటుంబ సభ్యులను ఒప్పించి, ఆ అబ్బాయి కళ్ళను ఇంకో అబ్బాయి కి పెట్టింది నయన.
ఆ అబ్బాయిని చూసిన ప్రతిసారి ‘తమ బిడ్డ బ్రతికే ఉన్నాడు’ అని అనుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు.
నయన అభ్యుదయ భావాలు నచ్చిన తన కాలేజ్ సీనియర్ వివేక్ తనను ఇష్టపడ్డాడు.. తన అమ్మా నాన్న తో వచ్చి నేత్ర, ఆనంద్ లను ఒప్పించి నయనను వివాహమాడాడు.
విహస్ తన చదువును కంప్లీట్ చేసి తండ్రి ఆనంద్ కి చేదోడువాదోడుగా ఉన్నాడు.
నేత్రాలయాన్ని నేత్ర చూసుకుంటూ ఉంటుంది…
నయన అటు డాక్టర్ గా,ఇటు గృహిణి గా , నేత్రాలయం కి అప్పుడప్పుడు వస్తూ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది.....
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
コメント