'Neti Bandhavyalu Episode 10' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 25/12/2023
'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హరికృష్ణ, లావణ్యలకు ఇద్దరు పిల్లలు - ఈశ్వర్, శార్వరి.
లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతనికీ ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి.
అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. మేనత్త కూతురు వాణి, ఇంటినుండి వెళ్లిపోవడానికి తండ్రి ప్రజాపతి సహకారం ఉన్నట్లు దీప్తితో చెబుతుంది ఆమె తల్లి ప్రణవి.
లావణ్య, ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది. ప్రజాపతి సమయానికి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు లావణ్య భర్త హరికృష్ణ.
హరికృష్ణను చులకనగా మాట్లాడుతాడు ప్రజాపతి.
శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి.
ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 10 చదవండి.
"ఎవరమ్మా మీరు...?" ఇంటి ముఖద్వారం తెరిచి అడిగాడు రామయోగి.
కొద్దిక్షణాల క్రిందట దీప్తి వారి ఇంటికి వెళ్ళి వరండాలోని కాలింగ్ బెల్ నొక్కింది.
"నా పేరు దీప్తి!... ప్రజాపతి గారి అమ్మాయిని!..."
"ఓ... నీవు దీప్తివా!..." ఆశ్చర్యంతో అడిగాడు రామయోగి.
"అవును అంకుల్... మీతో మాట్లాడాలని వచ్చాను."
"ఎంతగా మారిపోయావమ్మా... గడచిన ఐదేళ్ళలో... అమెరికాలో చదివావు కదా!..."
తలాడించింది చిరునవ్వుతో దీప్తి.
"కూర్చో అమ్మా!..."
కుర్చీలో కూర్చుంది దీప్తి.
రామయోగి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు.
"అడుగమ్మా!.... నీవు ఏమి అడగదలిచావో!" చిరునవ్వుతో చెప్పాడు రామయోగి.
"నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన పనివుంది. మీ అబ్బాయి కళ్యాణ్ అడ్రస్ చెప్పండి అంకుల్!"
"ఎందుకమ్మా!...."
"మా వదిన వాణిని చూడాలి. చూచి చాలాకాలం అయిందిగా అంకుల్!..."
"ప్రస్తుతంలో మీ రెండు కుటుంబాలకు బద్ధ విరోధం కదమ్మా!..."
"మీరు అన్నమాట బహుశా మా రెండు కుటుంబాల పెద్దలకు వర్తిస్తుందో ఏమో!.... కానీ నాకు మాత్రం అందరం ఆనందంగా కలిసి బ్రతకాలనే కోరిక. మా వదిన... అదే మీ కోడలు వాణి చాలా మంచిది అంకుల్. తనకు నేనంటే ఎంతో ఇష్టం. అందుకే ఒకసారి చూడాలనుకొంటున్నాను!" ఎంతో వందనంగా చెప్పింది దీప్తి.
"మీ నాన్నగారికి విషయం తెలుసా!..."
"వారు చెన్నై వెళ్ళి వున్నారు. రాగానే చెబుతాను..."
"వారు అంగీకరించకపోతే!..."
"మా నాన్న నా మాటను కాదనరు అంకుల్..."
"అలాగా!...."
"అవును!..."
"నీవు ఒక్కదానివే వెళుతున్నావా!... లేక మీ అత్తయ్యా వాళ్ళ ఇంటినుంచి నీతో ఎవరైనా వస్తున్నారా?..."
"ఆ ఇంటివారు ఎవరూ నాతో రావడం లేదు. ఢిల్లీలో నా స్నేహితురాలు వుంది. నేను ఢిల్లీ వెళ్లగానే వుండబోయేది ఆమె ఇంట్లోనే!..."
రామయోగి భార్య నిర్మల వరండాలోకి వచ్చింది దీప్తిని చూచి...
"ఎవరండీ ఈ అమ్మాయి?..." అడిగింది.
"మన ప్రజాపతిగారు కూతురు. అమెరికా నుంచి వచ్చింది"
అన్నాడు రామయోగి.
"నీపేరు దీప్తి కదూ!..."
"అవును ఆంటీ!..."
"మీ అమ్మగారు బాగున్నారా!.... తనకు నాకు మంచి స్నేహం" నవ్వుతూ చెప్పింది నిర్మల.
"అలాగా!... బాగున్నారండి..."
"మీ అమ్మది చాలా మంచి మనస్సు అమ్మాయ్!..."
చిరునవ్వు నవ్వి రామయోగి ముఖంలోకి చూచింది నిర్మల.
ఆ చూపుల్లోని భావాన్ని గ్రహించిన రామయోగి కుర్చీ నుంచి లేచి...
"రెండు నిమిషాల్లో వస్తానమ్మా!..."
"మంచిది అంకుల్"
రామయోగి లోనికి వెళ్ళిపోయాడు.
"పెళ్ళి ఎప్పుడు చేసుకొంటావ్?" కుర్చీలో కూర్చుంటూ అడిగింది నిర్మల.
"మరో రెండేళ్ల తర్వాత"
"ఇప్పుడు నీ వయస్సెంత?"
’ఏయ్!.... ముసలీ!.... నా వయస్సుతో నీకేం పనే!... మూసుకొని కుర్చీలో కూర్చోలేవా!... అధిక ప్రసంగం చేస్తున్నావ్!...’ అనుకొంది దీప్తి.
"మాట్లాడవేం?... నాకు ఎప్పుడు పెళ్ళయిందో తెలుసా!..."
’అబ్బా ఇది నన్ను వదిలేటట్లు లేదు. రామయోగీ! త్వరగా రావయ్యా!’ అనుకొని.
"ఎప్పుడయిందీ!..." దీర్ఘం తీస్తూ అడిగింది.
"పదిహేను ఏళ్ళకు..."
"అలాగా!...."
"అవునూ... ఇంతకూ నీ వయస్సెంతో చెప్పనేలేదు."
రామయోగి వరండాలోకి వచ్చాడు.
"ఈకాలం పిల్లలలాగే ఎవరినైనా లవ్వు గివ్వు చేశావా!..." నవ్వింది నిర్మల.
"అలాంటిదేమీ లేదు..." అంది దీప్తి.
తన చేతిలోని కాగితాన్ని దీప్తికి అందించాడు రామయోగి.
దీప్తి అందుకొంది.
"ఎప్పుడమ్మా నీ ప్రయాణం!..." అడిగాడు.
"ఓ వారంరోజుల లోపల..."
"అందులో మావాడి ఫోన్ నెంబర్ కూడా వ్రాశాను. ఫోన్ చేస్తే నీవు ఎక్కడ వున్నా మావాడు వచ్చి నిన్ను ఇంటికి తీసుకొని వెళతాడు. నేను వాడితో మాట్లాడుతాను" చెప్పాడు రామయోగి.
"ఎవరితోనండీ!..."
"మన అబ్బాయి కళ్యాణ్‍తో..."
"ఏం చెబుతావు?..." అడిగింది నిర్మల.
"తర్వాత చెబుతాను..." నవ్వాడు రామయోగి.
"అంకుల్!... థాంక్యూ! వెళ్ళిస్తాను...." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"మంచిదమ్మా!... వూరికి వెళ్ళేనాడు చెప్పు మా ఆవిడ ’ఆవకాయ’ పెట్టింది. కొంత నీచేతికి పార్శిల్ చేసి ఇస్తాను. మావాడికి ఇవ్వగలవా!..." అడిగాడు రామయోగి.
"తప్పకుండా అంకుల్!..." అంది దీప్తి.
వరండా మెట్లు దిగి తన కారువైపుకు నడిచింది.
శార్వరి... ఇంటికి చేరింది. ఆమె మనస్సు ఎంతో వ్యాకులంగా వుంది. సీతాపతి తన అక్క వాణిని గురించి చెప్పిన విషయం అమ్మా నాన్నలకు చెప్పాలా వద్దా అనేదే ఆమె సమస్య.
’నాన్నా!... దేనికీ తొందరపడరు. ఆవేశపడరు... ఆ విషయాన్ని వింటే బాధపడతారు. అమ్మ!....ఆవేశం ఎక్కువ... ఆక్కను ఎంతగానో అభిమానించి సాకింది. అక్క చేసిన పనికి ఎంతోకాలం బాధపడింది. ఇప్పుడిప్పుడే అక్క జ్ఞాపకాలకు దూరం అయినట్లుగా వుంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని వారికి చెబితే... తప్పకుండా బాధపడతారు. అన్న ఈశ్వర్ సౌమ్యుడు. సహనం కలవాడు నాన్నలాగే. వాడితో విషయం చెబితే... ఆలోచించి ఏదో మంచి నిర్ణయం తీసుకొంటాడు.
అక్క చేసింది తప్పే!.... అంతమాత్రాన జీవితాంతం వరకూ ఆమెను వెలివేయడం తప్పు కదా!.... అక్క చేసింది నేరం ఎలా అవుతుంది?... తనకు నచ్చినవాడిని... తనంటే ఇష్టపడిన వాడిని వివాహం చేసికొంది. అలా జరిగివుండక పోవచ్చు. ప్రజాపతి మామయ్య విషయం తెలియగానే అమ్మానాన్నలకు చెప్పి వుంటే!.... తన రాజకీయ విజయానికి అక్కను అడ్డుపెట్టుకొని బంధుత్వాలను... కుటుంబ గౌరవాలను, రక్తసంబంధాన్ని మరిచిపోయి... నీచంగా ప్రవర్తించాడు. నా కుటుంబ సభ్యులందరికి ఎంతో ఆవేదనను కలిగించాడు. విషయం అమ్మా నాన్నలకు చెబితే... ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తాయి. కనుక విషయాన్ని చెప్పవలసింది ఈశ్వర్ అన్నయ్యకే!...’
అనేక విధాల ఆలోచించి శార్వరి చివరకు ఆ నిర్ణయానికి వచ్చింది. రాత్రి ఎనిమిదిన్నరకు నలుగురూ కలిసి భోజనం చేశారు. ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు. హరికృష్ణ, లావణ్యలు టీవీ ముందు కుర్చొని వస్తున్న పాత రుక్మిణీ కళ్యాణం సినిమాను చూడసాగారు.
శార్వరి... కొంతసేపు తన గదిలో వుండి మెల్లగా ఈశ్వర్ గదిలోనికి సమీపించి తలుపును తోసింది. లోన గడియ పెట్టనందున తలుపు తెరుచుకొంది. లోనికి చూచింది. ఈశ్వర్ ఆమెను చూచాడు.
"శారూ!.... పడుకోలేదా!..." అడిగాడు ఈశ్వర్.
"నిద్రరావడం లేదన్నయ్యా!..." అంటూ తలుపుమూసి అతన్ని సమీపించింది.
"రా.... కూర్చో!..."
శార్వరి మంచంపై కూర్చుంది.
ఆమె ముఖంలోకి చూచిన ఈశ్వర్‍కు... ఎప్పుడూ వికసితకమలంలా వుండే ఆమె ముఖంలో విచారం గోచరించింది.
"నా చెల్లి ముఖం అప్రసన్నంగా వుంది కారణం!..."
చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్.
"వుంది."
"ఏమిటది...?"
"నన్ను నీవు ఏమీ అనవు కదా!..."
"ఎందుకంటానమ్మా!.... నీవు నా ముద్దుల చెల్లెలివి కదా!"
"నేను ఒక విషయం విన్నాను...."
"ఏమిటో చెప్పు!..."
"శివాలయంలో సీతాపతి గాడు నన్ను కలిశాడు."
"సీతాపతా!..."
"అవును..."
"వాడు నీకన్నా పెద్దవాడు. ’గాడు’ అని అనడం తప్పుకదమ్మా!..."
"తప్పో ఒప్పో!... అసలు విషయం...!" ఆగిపోయింది శార్వరి.
"ఏమిటో చెప్పు శారూ!..."
"అక్క!..."
"ఎవరూ!"
"మన అక్క వాణి... ప్రజాపతి మామయ్యకు జాబు వ్రాసిందట."
తాను విన్న విషయాన్ని వివరంగా శార్వరి ఈశ్వర్‍కు చెప్పింది. చివరిగా "అన్నయ్యా!.... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెబితే వారు బాధపడతారు కదా!... అందుకని నీకు చెప్పాను. అక్క ఎలా వుందో ఏమో...! సీతాపతి అక్కను గురించి చెప్పినప్పటి నుంచీ నాకు ఎంతో బాధగా వుంది. ఆలోచించి నీవే ఏదైనా చేయాలి అన్నయ్యా!..." దీనంగా చెప్పింది శార్వరి.
"అక్క మామయ్యకు తొమ్మిదినెలల క్రింద వ్రాసిందా ఉత్తరం!..." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"అవునట. ఆ వుత్తరాన్ని మామయ్య విప్పి చదవలేదట. ఈ రోజు పనిమనిషి ఇవ్వగా దీప్తి చదివిందట."
ఈశ్వర్ కొన్నిక్షణాలు శార్వరి ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పి శూన్యంలోకి... కిటికీ గుండా చూడసాగాడు. అతని మనస్సు నిండా తన అక్క వాణిని గురించిన ఆలొచనలే..
"మహారాణిలా ఈ యింట వుండిన వాణి అక్కయ్య.... తన వివాహ విషయంలో తాను తీసుకొన్న నిర్ణయం కారణంగా... తలిదండ్రులకు తోబుట్టువులకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ ఢిల్లీలో ఆ వ్యక్తితో ఆమె జీవితం ఎలా వుందో!... ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఎంతగానో బాధపడతారు. విషయం వారి చెవికి పోకూడదు’ అనుకొన్నాడు ఈశ్వర్.
"శారూ!... ఈ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పవద్దు..."
"అలాగే అన్నయ్యా!...." కొన్నిక్షణాల తర్వాత... "అన్నయ్యా!... నేను ఒక విషయం చెబితే తప్పుగా అనుకోవుగా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది శార్వరి.
"అనుకోకురా!... చెప్పు..."
"నీవు... ఒకసారి..." ఆపింది శార్వరి... ఈశ్వర్ ఏమనుకొంటాడో అని.
"ఢిల్లీకి వెళ్ళి అక్కను చూచి వస్తే బాగుంటుంది. ఇదేగా నీవు చెప్పదలచుకొన్నది శారూ!"
"అవునన్నయ్యా!...."
వాణిని గురించిన ఆలోచనతో ఈశ్వర్... మౌనంగా వుండిపోయాడు.
"ఎప్పుడో జరిగినదాన్ని మనస్సున పెట్టుకొని జీవితాంతం అక్కను ద్వేషించడం వలన... మనమూ నేరం చేసినవాళ్ళమే అవుతాము కదా అన్నయ్యా!... అన్నిగుణాల్లోకి... క్షమాగుణం గొప్పదని మనం చదువుకొన్నాముగా!... మంచిని పాటించడం తప్పు కాదు కదా అన్నయ్యా!..." దీనంగా అడిగింది శార్వరి.
ఈశ్వర్ ఆమె ముఖంలోకి కొన్నిక్షణాలు పరీక్షగా చూచాడు.
అతని కళ్ళల్లో నీళ్ళు చుట్టుకొన్నాయి.
’నేను ఎత్తుకొని ఆడించి... మాటలు.. పాఠాలు నేర్పిన నా చెల్లి శార్వరిలో ఎంతటి ఉన్నత భావాలు!... ఎంత గొప్ప మనస్తత్వం!...’ అనుకొన్నాడు. లేచి ఆమెను సమీపించి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని "శారూ! నీకు అక్కని చూడాలని వుంది కదూ!..."
అవునన్నట్లు కన్నీటితో తలాడించింది శార్వరి. రెండు క్షణాల తర్వాత... "మరి నీకు!..." అడిగింది.
"నాకూ చూడాలని వుందిరా!... మనం ఢిల్లీకి వెళుతున్నాము."
"ఎప్పుడన్నయ్యా!..." ఆత్రంగా అడిగింది శార్వరి.
"నాలుగురోజుల్లో హైద్రాబాద్ వెళతాంగా!... అక్కడి నుంచి ఢిల్లీకి మనం పోదాం... అక్కను చూద్దాం!..."
"మరి అమ్మా నాన్నలతో!...."
"ఇప్పుడు ఏమీ చెప్పవద్దు.... మనం ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత... ఆలోచించి చెప్పే రీతిగా చెబుదాం. సరేనా!..."
"అలాగే అన్నయ్యా!... నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా వుందో తెలుసా!..."
"నీవు చెప్పక్కర్లేదమ్మా!.... నీ కళ్ళే చెబుతున్నాయ్!..." నవ్వాడు ఈశ్వర్.
"థాంక్స్ అన్నయ్యా!... వెళ్ళి పడుకొంటాను..." నవ్వుతూ చెప్పింది శార్వరి.
"మంచిదిరా!... వెళ్ళి.... పడుకో!...." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.
శార్వరి ఆనందంగా నవ్వుకొంటూ గదినుండి బయటికి నడిచింది.
ప్రజాపతిగారు చెన్నై నుంచి తిరిగి వచ్చారు. ఉదయం అల్పాహారాన్ని సేవించి తన గదిలోకి ప్రవేశించారు. ఇరువురు వ్యక్తులు వారిని చూడాలని వచ్చారు. వాకిట ముందు నిలబడి వున్న వారిని దీప్తి చూచింది.
"ఎవరండీ!..." అడిగింది.
"నాన్నగారున్నారా అమ్మా!..."
"వున్నారు... మీ పేర్లు!"
"సోమయ్య... చంద్రయ్య..."
"కూర్చోండి. నాన్నగారికి చెప్పి వస్తాను" లోనికి వెళ్ళింది దీప్తి.
"నాన్నా!.... మీకోసం సోమయ్య, చంద్రయ్య వచ్చారు."
"లోనికి రమ్మని చెప్పు"
దీప్తి ఆ గది నుండి బయటికి నడిచి వారిని లోనికి రమ్మని పిలిచింది.
ఇరువురూ... ప్రజాపతి గదిలో ప్రవేశించారు. వినయంగా నమస్కరించారు.
"ఆఁ... ఏందిరా!.... ఉదయాన్నే వచ్చారు!..." అడిగాడు ప్రజాపతి.
"అయ్యా!... మీరు మాకు ఓ సాయం చెయ్యాలి!" మెల్లగా చెప్పాడు సోమయ్య.
"ఏమిటది?"
"వీడు నా తమ్ముడు..."
"తెలుసు. మీకేం కావాలి?"
"ఈడి పిల్ల పెళ్ళీడుకొచ్చింది. పెండ్లి చేయాలనుకొంటున్నాము. తమరు..." ఆపేశాడు సోమయ్య.
"డబ్బు కావాలా!..."
"అవునయ్యా!...."
"ఎంత?..."
"ఓ యాభై వేలు..."
"యాభై వేలా!..."
"అవునయ్యా!.... ఆ మాత్రం కావాల!..."
"తిరిగి ఎప్పుడు ఇస్తావ్!..."
"ఓ రెండేళ్ళల్లో..." నసిగాడు సోమయ్య.
"వడ్డీరేటు ఎంతో తెలుసా!..."
"అయ్యా!..." ఆశ్చర్యంతో అన్నాడు సోమయ్య.
"మూడూ రూపాయలు... నూటికి నెలకు!..."
"తమరు మంచి మనస్సుతో సాయం చేయాలయ్యా!..."
ప్రాధేయపూర్వకంగా అడిగాడు సోమయ్య.
"చేస్తాను... వడ్డీరేటు మాత్రం అంతే... ఇష్టం అయితే సాయంత్రం రండి ప్రామిసరీ నోటు వ్రాసి వుంచుతాను. సంతకం చేసి డబ్బు తీసుకొని వెళుదువు గాని!..."
సోమయ్య, చంద్రయ్యలు ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. చంద్రయ్య తలాడించాడు.
"సరే అయ్యా!... సాయంత్రం ఐదుగంటలకు వస్తాం..."
"కాదు... ఏడుగంటలకు రండి!..."
చేతులు జోడించి వారిరువురూ గదినుండి బయటికి నడిచారు. దీప్తి తండ్రిగారి గదిలోకి ప్రవేశించింది.
"నాన్నా!..."
లెడ్జర్‍ను చూస్తున్న ప్రజాపతి కూతురు పిలుపుకు తన ముఖంలోకి చూచాడు.
"ఈ లెక్కలు చూచుకొనేదానికి ఓ క్యాలిక్యులేటర్ కొనుక్కోవచ్చుగా!..."
ప్రజాపతి నవ్వు... "కష్టపడి నేర్చుకొన్న ఎక్కాలను మరచిపోతాం..." వెటకారంగా అన్నాడు.
దీప్తి... ఆశ్చర్యంతో ప్రజాపతి ముఖంలోకి చూచింది.
’ఈ నాన్న ఇంత పిసినారా!...’ అనుకొంది.
"అవునూ!.... ఎం.బి.బి.యస్, ఎం.ఎస్ అయిపోయె!... ముందు ఏం చేయాలనుకొంటున్నావ్!"
"మన వూర్లోనే హాస్పిటల్ ప్రారంభించాలనుకొంటున్నాను..."
"ఈ గూడూరులోనా!..."
"ఏం పెట్టకూడరా!..."
"పెడితే... నీ చుట్టూ తిరగబోయేది ఈగలు... దోమలు"
నవ్వాడు ప్రజాపతి.
కొన్ని క్షణాల తర్వాత....
"చూడు తల్లీ!... నేను నీ ప్రాక్టీస్‍కు చెన్నైలో ఏర్పాట్లు చేస్తున్నాను."
"చెన్నైయ్యా!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.
"అవును..."
"నేను మన వూరిలోనే వుండి.... పేదలకు ఉచితంగా చికిత్సలు చేయాలనుకొంటున్నాను నాన్నా!.."
"ఏందీ!.... పేదలకు ఉచితంగా చికిత్సలా!...."
"అవును..."
"మరి నీమీద నేను పెట్టిన పెట్టుబడి సంగతి గురించి ఆలోచించావా!..."
"పెట్టుబడా!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.
"అవును... నీ డాక్టర్ చదువుకి... నీ అమెరికా యాత్రకు... ఐదేళ్ళు అక్కడ వున్నదానికి... లక్షలు ఖర్చుపెట్టాను. డబ్బు లేకుంటే ఇవన్నీ జరిగి వుండేవా... నీవే చెప్పు..."
"నన్ను కన్న తండ్రిగా అది నీ ధర్మం కదా నాన్నా!..."
"ధర్మం... న్యాయం... నీతి... నిజాయితీ... అనుకొనేదానికి ఆనందంగా వుంటాయి. కానీ... అవేవీ కాసులను సంపాదించలేవు!... పొలంలో నారుపోసి నాటి... మందులు కొట్టి... రైతులు మంచి దిగుబడిని ఆశిస్తారు. పెట్టిన పెట్టుబడి కన్నా అధిక లాభం రావాలని కోరుకొంటారు. అలా పెట్టిన పెట్టుబడి తిరిగి లాభంతో వస్తే దాన్ని మరో పనికి ఉపయోగించుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మునిగిపోతే మనిషి దివాలైపోతాడు.
డబ్బు విలువ సంపాదించే వాడికే తెలుస్తుంది. ఖర్చు పెట్టే నీలాంటి వాళ్ళకు దాన్ని సంపాదించడం ఎంత కష్టమో... దాని విలువేంటో తెలీదు. మరోమాట! నేను నీ తండ్రిని... నీచేత ఏం చేయించాలో... ఎలా చేయించాలో నీకన్నా నాకు బాగా తెలుసు. ఈ మాటను మరిచిపోకు" వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.
ప్రణవి అక్కడికి వచ్చింది. తలవంచుకొని మౌనంగా కూర్చొని వున్న దీప్తిని చూచింది.
"దీప్తిని ఏమన్నారండీ!..."
"నేను ఏమీ అనలా!... ఆమె భావి జీవితం ఎలా సాగాలో ఆ విషయం చెప్పా!...."
"నాన్నా!... నా భావిజీవితాన్ని గురించి నిర్ణయాలు తీసుకొనే అధికారం నాకు లేదా!..." రోషంతో అడిగింది దీప్తి.
"నీ నిర్ణయం... నాకు నచ్చితే అభ్యంతరం లేదు. నచ్చకపోతే... నా నిర్ణయమే నీ నిర్ణయం కావాలి. అదే నేను నీకు చెప్పింది!..."
"ఏం చెప్పారు?..." అడిగింది ప్రణవి.
"చెన్నైలో ప్రాక్టీస్ ప్రారంభించాలని చెప్పాను."
"చెన్నైలోనా!..."
"అవును... రకరకాల రోగులు వుండే స్థలం... పెద్దనగరం..."
దీప్తి దీనంగా తల్లి ముఖంలోకి చూచింది.
"అది సరేలే!... చూద్దాం... నీ ఢిల్లీ ప్రయాణాన్ని గురించి చెప్పావా అమ్మా!...."
"లేదమ్మా!...."
"ఏమండీ!... అమ్మాయి ఢిల్లీకి వెళుతుంది."
"ఎందుకు?..."
"ఆమె స్నేహితురాలి పెళ్ళి..."
"ఆ విషయం తను నాతో చెప్పలేదే!..." ఆశ్చర్యంతో అడిగాడు ప్రజాపతి.
"మన మధ్యన చాలా ఘాటైన సంభాషణ జరిగింది కదా నాన్నా!... ఆ విషయాన్ని మీకు నేను చెప్పేదానికి మీరు నాకు అవకాశం ఇవ్వలేదుగా!..." బుంగమూతితో చెప్పింది దీప్తి.
ముఖం చిట్లించి కూతురు ముఖంలోకి చూచాడు ప్రజాపతి.
కొన్ని క్షణాల తర్వాత....
"అమ్మా దీప్తీ! వెళ్ళితీరాలా!..."
"రాధ అమెరికాలో నా రూమ్‍మేట్ నాన్నా!... ఫోన్ చేసి ఎంతగానో బ్రతిమాలింది. నేను తన పెళ్ళికి వెళ్ళితే కదా!... అది నా పెళ్ళికి రాగలదు!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"సరే వెళ్ళిరా!..." అన్నాడు ప్రజాపతి.
"నాన్నగారు అనుమతించారుగా! ఇక పద... వారిని పని చేసికోనీ!..." అంది ప్రణవి.
"ఎప్పుడమ్మా నీ ప్రయాణం!..." అడిగాడు ప్రజాపతి.
"వచ్చే సోమవారం నాన్నా...." అంది దీప్తి.
"సరే!..." లెడ్జర్‍లోని పేజీలను చూడసాగాడు ప్రజాపతి.
దీప్తి, ప్రణవీలు ఆ గది నుంచి బయటికి వచ్చారు.
వారికి మాధవయ్య ఎదురైనాడు.
"అమ్మా!... దీప్తి నాన్న ఇంట్లో వున్నారా!..."
"ఆఁ... వున్నారు..."
మాధవయ్య ప్రజాపతి గదిలో ప్రవేశించాడు.
"ప్రజాపతీ!... నీకో శుభవార్త..." నవ్వారు మాధవయ్య.
"ఏమిటది!..." అడిగాడు ప్రజాపతి.
మాధవయ్య తలుపును మూసి వచ్చి ప్రజాపతికి ఎదురుగా కూర్చున్నాడు.
"అమోఘమైన సంబంధం ప్రజాపతి!" చిరునవ్వుతో చెప్పాడు మాధవయ్య.
"ఆడనా!... మగనా!..."
"మనకు ముందు కావలసింది మొగపిల్లావాడే కదా!..."
"ఏ వూరు?.."
"చెన్నై..."
"పిల్లవాడు ఏం చేస్తున్నాడు?..."
"డాక్టర్... కోటీశ్వరులు. ఒకే కొడుకు. అతనికి ముందు ఆడపిల్ల. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. తండ్రికి పడవల మీద వ్యాపారం. ఎగుమతి దిగుమతి. మన దీప్తికి అన్నివిధాలా తగిన సంబంధం ప్రజాపతీ!..."
"వాళ్ళు మనవాళ్ళేనా!..."
"ఆ నిక్షేపంలా.... ఇంటిపేరు కంచర్ల.... అబ్బాయి పేరు వినోద్. తండ్రిగారి పేరు సాంబయ్య. అబ్బాయి వయస్సు ఇరవై ఎనిమిది" చంకకు తగిలించుకున్న గుడ్డ సంచిలో నించి ఓ ఫోటోను తీసి ప్రజాపతికి అందించాడు మాధవయ్య.
ఫొటోను పరిశీలనగా చూచాడు ప్రజాపతి.
"అబ్బాయ్ ఎలా వున్నాడు?..." నవ్వుతూ అడిగాడు మాధవయ్య.
"మన వివరాలను వారికి అందించావా!..."
"నీవు సరే... అంటే అదెంత పని!..."
"సరేరా మాధవా!... ప్రొసీడ్ అయిపో..."
"మన దీప్తికి... నీ భార్యామణికి ఫోటోను చూపిస్తావా?..."
“ఆ విషయం నాకు వదిలెయ్యి. వారిని కలిసి మాట్లాడి నెలరోజుల లోపల పెండ్లిచూపులు... నిశ్చితార్థం జరిగేటట్లు చూడు... సంచిలో నుంచి మరో కాగితాన్ని తీసి "ఇది అబ్బాయి జాతకం... నేను దీప్తికి అతనికి పొంతనాలు చూచాను. మన దీప్తి పులి... అతను మేక. మన అమ్మాయి మాటను ఏనాడూ కాదనలేడు" నవ్వాడు మాధవయ్య.
"సరే పద... ఫ్యాక్టరీ దాకా వెళ్ళిద్దాం."
ప్రజాపతి... మాధవయ్యలు గది నుండి బయటికి నడిచారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments