top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 11



'Neti Bandhavyalu Episode 11'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 30/12/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ఇద్దరు పిల్లలు - ఈశ్వర్, శార్వరి. 


లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతనికీ ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి.


అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. మేనత్త కూతురు వాణి, ఇంటినుండి వెళ్లిపోవడానికి తండ్రి ప్రజాపతి సహకారం ఉన్నట్లు దీప్తితో చెబుతుంది ఆమె తల్లి ప్రణవి.


లావణ్య, ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది. ప్రజాపతి సమయానికి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు లావణ్య భర్త హరికృష్ణ.


హరికృష్ణను చులకనగా మాట్లాడుతాడు ప్రజాపతి.

శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 11 చదవండి. 


హరికృష్ణగారి ఇల్లు.. మధ్య హాలు.. టీవీలో.. ఢిల్లీ నుంచి తెలుగులో వార్తా ప్రసారం.

అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోం చేస్తున్నారు. రాత్రి సమయం.

ఆకాశవాణి.. తెలుగులో వార్తలు చదువుతున్నది తిరుమలగిరి వాణి.

ఘనంగా వినబడ్డ ఆ మాటలను విని శార్వరి పరుగున టీవి ముందుకు వచ్చింది. తన అక్క వాణిని చూచింది.


"అమ్మా!.. వార్తలు చదువుతున్నది మా వాణీ అక్క.." సంతోషంతో బిగ్గరగా అరిచింది.

ఈశ్వర్.. లావణ్య.. వారి వెనకాల హరికృష్ణ టీవీ ముందుకు వచ్చారు

తెల్లచీర.. దానిపై క్రమంగా దూరం దూరంగా వరుసలుగా గులాబీపూలు, తెల్ల జాకెట్ బంగారు వర్ణపు అంచు, నొసటన సింధూరం, తలకు స్నానం చేసి కురులు, తల్లో మల్లెపూలు, గాలికి ముఖంపైన అందంగా కదిలాడే ముంగురులు, అప్సరసలా వున్న వాణి.. చిరునవ్వుతో అచ్చ తెలుగులో వార్తలు చదువుతూ వుంది.


అందరి ముఖాల్లో ఎంతో ఆనందం. లావణ్య, హరికృష్ణ ముఖంలోకి కన్నీటితో చూచింది. వారి వదనంలో చిరునవ్వు.. కళ్ళల్లో కన్నీరు. ఈశ్వర్.. శార్వరి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వారి కళ్ళల్లోనూ కన్నీరు.. ముఖాల్లో ఎంతో ఆనందం. అవి, ఆ క్షణాల్లో.. దుఃఖంతో వచ్చిన కన్నీరు కాదు. ఆనంద పరవశపు పన్నీరు. అందరూ ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. వారి పెదవులపై చిరునవ్వు.. ముఖాల్లో ఎంతో ఆనందం.


వార్తలు ముగిశాయి. టీవి స్క్రీన్ పైని వాణి అదృశ్యం అయింది. ముందు ఈశ్వర్, వెనకాల శార్వరి, లావణ్య, హరికృష్ణ డైనింగ్ టేబుల్‍ను సమీపించారు. అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. వారి మనస్సుల్లో వాణిని గురించిన ఆలోచనలే!.. మనసుల్లో ఒకే రకమైన బాధ. వారి మధ్యన మాటలకు తావు లేని మనస్థితులు. ఏదో తిని ముందు లావణ్య, ఈశ్వర్, హరికృష్ణ, శార్వరి చేతులు కడుక్కొని వారి వారి గదులకు వెళ్ళిపోయారు.



ఈశ్వర్ ’నేను, శార్వరీ ఢిల్లీకి వెళ్ళి వాణిని చూచి వస్తామని చెబితే.. అమ్మా నాన్నా.. సంతోషిస్తారా!.. వాణి అక్కయ్య ఎంతో ఠీవిగా వార్తలు చదివింది!.. అంటే తనకు ఏ సమస్యలూ లేకుండా హాయిగా వుందన్న మాటేగా!.. ఆ బావ అక్కను బాగా చూచుకొంటున్నట్లేగా!.. మూడేళ్ళయింది. పిల్లలు కలిగారో లేదో!.. అంతా సవ్యంగా వుంటే ప్రజాపతి మామయ్యకు జాబు ఎందుకు వ్రాసినట్లు!.. భార్యభర్తల మధ్యన ఏమైనా సమస్యలా!.. ఏది ఏమైనా సరే.. అనుకొన్న ప్రకారం ఢిల్లీకి వెళ్ళి వాణి అక్కయ్యను తప్పక కలవాలి’ అనుకొన్నాడు ఈశ్వర్.


శార్వరి.. పడుకొంది గాని మనస్సుకు కొంత శాంతి కలగవచ్చు. ’హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరాలనుకొంటున్నాడో కనుక్కోవాలి’ మంచం దిగి.. శార్వరి ఈశ్వర్ గదిని సమీపించింది. తలుపును నెట్టబోయింది.


ఈశ్వర్ తలుపును తెరిచాడు. శార్వరిని చూచాడు.

"శారూ!.. ఏమ్మా!.. నిద్రపోలేదా!.." అడిగాడు.


"నిద్ర రావడం లేదు. నీతో మాట్లాడాలని వచ్చాను!.."


"అలాగా!.."


"అవును.."


"సరే, రా లోనికి.."


"నీవు ఎక్కడికి బయలుదేరావు?.."


"అమ్మానాన్నలు ఏం చేస్తున్నారో చూడాలని.."



"సరే పదా, చూచి వద్దాం.."


"ముందు వారి గదిలోనికి వెళ్ళకూడదు!.."


"ఆ విషయం నాకు తెలీదా!.. ద్వారం ముందు నిలబడితే.. వారి మాటలు వినిపిస్తాయిగా!.."


"అవునవును.. పద.." అన్నాడు ఈశ్వర్.

వారిరువురూ.. తల్లిదండ్రుల గదిని సమీపించారు.


"ఏమండీ!..


"ఏమిటి?.."


"ఒక్కమాట కూడా మాట్లాడరేం!.."


"ఏ విషయాన్ని గురించి లావణ్యా!.."


"అదే.. మన.."


"వాణీని గురించా!.."


"అవును.."


"ఏం మాట్లాడేది లావణ్యా!.."


"బిడ్డ బాగుంది కదూ!"


"ఆఁ.."


"అంత ముక్తసరిగా చెబుతారేం?.." చిరుకోపంతో అడిగింది లావణ్య.



"లావణ్యా! ఆమెకు ఏం తక్కువ!.. మనం ఏం తక్కువ చేశాము!.. మనమంటే ఎంతో అభిమానంగా వున్న ఆమె అలా ఎలా మారిపోయిందో.. మనకు ఒక్కమాట చెప్పకుండా తనకు నచ్చినవాడితో ఎలా వెళ్ళిపోగలిగిందో!.. తలుచుకొంటుంటే.. ఎదలో ఎంతో బాధ లావణ్యా!.. అందుకే కళ్ళు మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ పడుకొన్నాను!.."


"నా మనఃస్థితీ మీలాగే వుందండీ!.. కన్నతల్లిని కదా!.. మూడేళ్ళ తర్వాత చూచేసరికి నాలో ఎంతో ఆవేదన.. అమ్మా!.. అమ్మా!.. అంటూ నా చుట్టూ తిరుగుతూ తనకు ఏం కావాలన్నా నన్ను అడిగి అది నాకు నచ్చితే తప్ప తానుగా తీసుకొన్నదంటూ ఏమీలేదు. అలాంటి పిల్ల తన జీవితానికి అతి ముఖ్యమైన విషయంలో మన సలహా సంప్రదింపూ లేకుండా.." హృదయ ఆవేదనతో లావణ్య చెప్పడం ఆపేసింది.


"నిన్ను అమ్మా!.. అమ్మా.. అని నీవు ఆమె తల్లివి కాబట్టి పిలిచింది కానీ నేను ఆమెను నా తల్లిగానే భావించాను లావణ్యా!.. ఆమె కోరింది ఏది నేను కాదన్నాను!.. 

అందరికంటే మిన్నగా వుండాలని.. నా శక్తి కొద్దీ ఆమె కోరిన రీతిగా.. తండ్రిగా నేను చేయవలసింది చేశాను. ఎంతో యోగ్యుడైన శివరామకృష్ణ పెద్ద కొడుకు చంద్రంతో ఆమె వివాహం జరిపించాలనుకొన్నాను. వాడితోనూ మాట్లాడాను. వాడూ సరేరా అన్నాడు. కానీ.. వాణి.. హుఁ.. ఈ తండ్రి తన భావిజీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దలేడని.. తనకై తాను తన ఇష్టానుసారంగా మనకు తలవంపులు కలిగేలా.. స్వనిర్ణయాన్ని తీసుకొంది. మనతో తనకు ఎలాంటి అవసరం లేదని వెళ్ళిపోయింది" నిట్టూర్చి తలదించుకొన్నాడు హరికృష్ణ.


భర్త మాట్లాడిన ప్రతి అక్షరం.. నగ్న సత్యం అయిన కారణంగా లావణ్య మారు పలుకలేకపోయింది. ఆవేదనతో కన్నీరు కార్చింది.

కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. కన్నీటిని తుడుచుకొని లావణ్య,

"ఏమండీ!.."


"చెప్పు లావణ్యా!.."


"మీరు వాణిని క్షమించలేరా!.."


"నీవు క్షమించగలవా!.."


"నేను దాని తల్లినండీ.. అది నా పెద్దబిడ్డ!.."  బొంగురుపోయిన కంఠంతో చెప్పింది లావణ్య.


"ఆమె నీకు బిడ్డ.. నాకు తల్లి.. ఏ వ్యక్తి అయినా తన తల్లిని అసహ్యించుకొంటాడా లావణ్యా!.."


బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు హరికృష్ణ.

"అంటే మీరు నా బిడ్డను క్షమిస్తారు కదూ!.."


"ఆమె నా ముందుకు వస్తే తప్పకుండా క్షమిస్తాను.."


"మనం దాని ముందుకు వెళ్ళేదానికి మీకు అభ్యంతరమా!.." దీనంగా అడిగింది లావణ్య.


హరికృష్ణ ఆశ్చర్యంతో లావణ్య ముఖంలోకి చూచాడు.

"నాకు.. నా బిడ్డను చూడాలని వుందండి. తప్పుగా అడిగాననుకొంటే.. నన్ను క్షమించండి" దీనంగా చెప్పింది లావణ్య.


"ఢిల్లీకి వెళతావా!.."


"మీరు రారా!.."


"నాకు నా బిడ్డను చూడాలని వుందండీ.. అని అన్నావు కాని.. మనం వెళ్ళి మన బిడ్డను చూచి వద్దామండీ అని అనలేదు కదా!.."


"ఓ.. సారీ.. సారీ అండీ.. ఏదో ఆవేశంలో అలా అన్నాను.. మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళగలనండీ!..


"అంటే నీతో నన్నూ రమ్మంటావా!.."


"నేను చెప్పిన మాటకు అర్థం అదేకదండీ!.."


"సరే!.."


"ఆఁ.."


"సరే అన్నాను లావణ్య!.."


"దేనికి!!!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య


"నీవు అన్నదానికి!.. నీ కోరిక తీర్చేదానికి!" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.


ద్వారం వెనుక నిలబడి వున్న ఈశ్వర్, శార్వరీలు అంతా విన్నారు. వారి ముఖాల్లో ఎంతో ఆనందం. ఈశ్వర్ చెల్లెలి చేతిని పట్టుకొన్నాడు. ఇరువురూ అతని గదిలో ప్రవేశించారు.


"శారూ!.. సర్వేశ్వరుడు దయామయుడు. మనం అమ్మా నాన్నలకు చెప్పకుండా ఢిల్లీకి వెళితే.. ఆ విషయం ఏనాటికైనా వారికి తెలిస్తే.. మనలను ద్వేషిస్తారేమో అని నాకు భయం. మన నిర్ణయం మంచిదే అనేదానికి అమ్మా నాన్నల మాటలే సాక్ష్యం. ఇక మనం నిర్భయంగా ఢిల్లీకి వెళ్ళవచ్చు" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.


"వారి మాటలను బట్టీ అమ్మా నాన్నలు కూడ త్వరలో ఢిల్లీకి బయలుదేరబోతున్నారుగా అన్నయ్యా!.."


"అవునురా!.."


"అయితే మనం వెళ్ళే విషయం వారికి చెప్పవచ్చుగా!.."


"ఆలోచిస్తా.. పొద్దుపోయిందిరా వెళ్ళి పడుకో!.."

"అలాగే అన్నయ్యా!.." సంతోషంగా శార్వరి గుడ్‍నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయింది.

మరుదినం ఉదయం.. హరికృష్ణ లావణ్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని వున్నారు. శార్వరి వారికి కాఫీ అందించింది.

"శారూ!.. అన్నయ్య ఎక్కడ?.." అడిగింది లావణ్య.


"పళ్ళు తోముకుంటున్నాడమ్మా!.. పిలవనా!.."


"ఆఁ.. పిలూ!.."


పెరటివైపు ద్వారాన్ని సమీపించింది శార్వరి.

"అన్నయ్యా!.. అమ్మ నిన్ను పిలుస్తుంది."


"ఆఁ.. వస్తున్నానని చెప్పు.."


శార్వరి తల్లిదండ్రులను సమీపించి.. "అన్నయ్య వస్తున్నాడమ్మా!.." చిరునవ్వుతో చెప్పింది.

ఆమె మనస్సులో తన తల్లితండ్రి.. వారి ఢిల్లీ ప్రయాణాన్ని గురించి మాట్లాడబోతారనే ఆలోచన.

ఈశ్వర్ వారిని సమీపించాడు.


"ఏం అమ్మా!.." తల్లి ప్రక్కన వున్న కుర్చీలో కుర్చుంటూ అడిగాడు. 


హరికృష్ణ గొంతు సవరించాడు. ఈశ్వర్ తండ్రి ముఖంలోకి చూచాడు. లావణ్య భర్త ముఖంలోకి చూచింది. రెండు కాఫీ గ్లాసులతో శార్వరి వారిని సమీపించింది. ఒక గ్లాసును ఈశ్వర్‍కు అందించింది.

అన్నా చెల్లెళ్ళు కాఫీ సిప్ చేశారు.

"ఈశ్వర్!.." అన్నాడు హరికృష్ణ.


"ఏం నాన్నా!"


"నేనూ అమ్మా.. ఢిల్లీకి వెళ్ళాలనుకొంటున్నాము"


ఈశ్వర్, శార్వరీలు తండ్రి ముఖంలోకి చూచారు.

"అన్ని గుణాల్లోకి క్షమాగుణం చాలా గొప్పది ఈశ్వర్!” అన్నాడు హరికృష్ణ.


"మీరు చెప్పింది ఎవరి విషయంలో నాన్నా!" మెల్లగా అడిగాడు ఈశ్వర్.


"అందరి విషయంలో.. ’అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!..’ ఇది సుమతీ శతకపు సూక్తి.. చిన్న వయస్సులో చదివావు" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.


"అవును నాన్నా!.. మరి నా ప్రశ్నకు జవాబు!" అన్నాడు ఈశ్వర్.


"మీ అక్క వాణి విషయంలో" మెల్లగా చెప్పాడు హరికృష్ణ.

"అంటే!.."


"మీ అమ్మ, వాణిని చూడాలని నన్ను కోరింది. ఆమె కోర్కెను తీర్చడం నా ధర్మం ఈశ్వరా!.."

ఈశ్వర్ నవ్వుతూ.."చాలా మంచి నిర్ణయం నాన్నా!.. నేను శార్వరీ కూడా అక్కయ్యను చూడాలనుకొంటున్నాము. మీరు అంగీకరిస్తే మేమూ మీతో ఢిల్లీకి వస్తాము నాన్నా!.." చెప్పాడు ఈశ్వర్.


"అలాగా!.." ఆనందంగా అంది లావణ్య.

"చాలా సంతోషం అమ్మా!.."

"అయితే.. ఏమండీ!.. నలుగురం కలిసే వెళదాం.."

"సరే!.. ఈశ్వర్!.."

"నాన్నా!. ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేయనా!.."

"చెయ్యి!.."

"ఫ్లయిట!.." ఆశ్చర్యంతో అడిగింది లావణ్య.


"అవునమ్మా!. రెండున్నర గంటల్లో ఢిల్లీకి చేరగలం" నవ్వాడు ఈశ్వర్.


"నాకూ ఓ టిక్కెట్ బుక్ చేయండి బావగారూ!" నవ్వుతూ వారిని సమీపించింది దీప్తి.


మూడు నిమిషాల ముందు అక్కడికి వచ్చింది దీప్తి. వారి సంభాషణనంతా విన్నది.

ఈశ్వర్ ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూచాడు.

"అత్తయ్యా!.. మామయ్యా!.. శుభోదయం" నవ్వుతూ చేతులు జోడించింది దీప్తి. క్షణం తర్వాత "ఏయ్!.. మరదలు పిల్లో! హాట్‍గా ఓ కాఫీ తీసుకురా!.. వెళ్ళు"

దీప్తి లావణ్యను సమీపించింది. 

శార్వరి వంట గది వైపు వెళ్ళింది.

"నీవు ఎప్పుడు వచ్చావ్?" ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.


"వచ్చి వారం రోజులైంది చూచారుగా!.. మరిచిపోయారా!" వెటకారంగా నవ్వుతూ చెప్పింది దీప్తి.

హరికృష్ణ చిరునవ్వుతో, లావణ్య, ఈశ్వర్ ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచారు.


"దీప్తి!.. కూర్చో" చెప్పాడు హరికృష్ణ.


నీలంరంగు షిఫాన్ చీర.. మ్యాచింగ్ బ్లౌజ్, చక్కగా దువ్వి అల్లిన వాలుజడ, తల్లో మల్లెపూలు, నొసటన ఎర్రస్టిక్కర్ బొట్టు, ఎర్రని పెదవులపై చిరునవ్వు అప్సరసలా చూపరులకు కనిపించింది దీప్తి.


"ఏం ఉదయాన్నే వచ్చావ్?" అడిగింది లావణ్య.

"ఏం అత్తయ్యా! రాకూడదా?.. ఓ విషయాన్ని మరువకండి. ఇది మీ ఇల్లే కాదు. మామయ్యగారిది కూడా. నా మామగారి ఇంటికి నేను ఎప్పుడైనా రావచ్చు.. ఎప్పుడైనా పోవచ్చు కదా మామయ్యా!.." హరికృష్ణ ప్రక్కన కుర్చీలో కూర్చుంటూ అంది దీప్తి.


"అవునమ్మా!.. నీకు ఆ హక్కు వుంది" నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ. 

"ఆఁ.. దీని అబ్బకేమో మనమీద పంతం, పగ, దీనికేమో మన మీద.." లావణ్య ముగించకముందే..

"వల్లమాలిన ప్రేమ, అభిమానం, ఇదే కదా అత్తయా మీరు చెప్పాలనుకొన్నది!" కాటుక కళ్ళను చిత్రంగా త్రిప్పుతూ ఒక్కక్షణం ఈశ్వర్ ముఖంలోకి చూచి చెప్పింది దీప్తి చిరునవ్వుతో.

"బావా! నేను జోక్‍గా అనలేదు ఢిల్లీ టిక్కెట్ విషయం. నేను ఢిల్లీకి వెళ్ళాలి. నాకూ టికెట్ బుక్ చేయండి."


"నీకేం పనే ఢిల్లీలో!.." అడిగింది లావణ్య.

శార్వరి వచ్చి కాఫీ గ్లాసును అందించింది దీప్తికి.

సిప్ చేసి "శారూ!.. అమృతమే" నవ్వింది దీప్తి. "ఆ నాకేం పని అడిగావుగా అత్తయ్యా!.. ఢిల్లీలో. అక్కడ నాకో స్నేహితురాలు వుంది. దాని వివాహం అందుగ్గా వెళ్ళాలి."


"ఒంటరిగా వెళ్లాలనుకొన్నావా!"

"లేదే!.."

"మరి ఎవరు నీతో వస్తున్నారు?.."

"మీరంతా!.." గలగలా నవ్వింది దీప్తి.


ఆ మాటకు హరికృష్ణకు నవ్వు వచ్చింది ఆనందంగా నవ్వాడు.

లావణ్య ఆశ్చర్యంతో "ఎందుకండీ నవ్వుతున్నారు!.."

"ఆరోగ్యం కోసం లావణ్యా!.."


"కరెక్ట్!.. అత్తయ్యా!.. నవ్వు అనేది మనకు ఆ దేవుడిచ్చిన వరం. ఆనందకరమైన విషయాలను విన్నప్పుడు, ఆహ్లాదకరమైన దృశ్యాలను చూచినప్పుడు, అయినవాళ్లందరూ ఒకచోట చేరినప్పుడు, సరదా కబుర్లతో నవ్వుకోవడం ఒంటికి ఎంతో మంచిది తెలుసా!.."


"అవును దీప్తీ!.. నీవు చెప్పింది నిజం" నవ్వుతూ చెప్పింది శార్వరి.

"అయితే నాన్నా!.. ఎల్లుండికి మనకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేస్తాను."

"ఆఁ.. దీప్తికి కూడా చెయ్యి" అన్నాడు హరికృష్ణ.

దీప్తి నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఆ చూపుల్లో తీక్షణతకు ఈశ్వర్ తట్టుకోలేక.. తల త్రిప్పుకొని తన గదికి వెళ్ళిపోయాడు.


"మామయ్యా!.."

"ఏమిటమ్మా!.."

"మీరంతా వాణి వదినను కలువబోతున్నారుగా!" అడిగింది దీప్తి.

అవునన్నట్లు తలాడించాడు హరికృష్ణ.


"ఇప్పుడు వాణి వదిన ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో తెలుగు వార్తల అనౌన్సర్. నిన్న రాత్రి నేను, అమ్మా వదిన చెప్పిన వార్తను వినాము" అమాయకంగా నవ్వుతూ చెప్పింది దీప్తి.

"ఆఁ.. మేమూ విన్నాము వదినా!.. అక్క వార్తలను చాలా బాగా చెప్పింది కదూ!.."

"అవును శారూ!.. చాలా బాగా చెప్పింది."

"అది ఎవరి కూతురు!.." గర్వంగా అంది లావణ్య.


"మామయ్యగారు శ్రీ శ్రీ.. తిరుమలగిరి హరికృష్ణగారి పెద్దకుమార్తె. మా వదినగారు" నవ్వుతూ నాటకీయంగా చెప్పింది దీప్తి.

హరికృష్ణ నవ్వాడు ఆనందంగా.

"దీపూ!.. నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ నాన్నతో చెప్పావా!" అడిగింది లావణ్య.

"అవసరమా అత్తయ్యా!.."

"అంటే చెప్పలేదా!.." అడిగింది శార్వరి.


"నా అత్తారింటికి వచ్చేదానికి నాకు ఆయన పర్మిషన్ కావాలా ఏంటి? అమ్మతో చెప్పా!.. వెళ్ళిరా అంది, అంతే వచ్చేశా!.." 

ఆశ్చర్యంతో చూచింది లావణ్య.


దీప్తి లేచి లావణ్యను సమీపించి "అత్తయ్యా!.. నా అలంకారం ఎలా వుంది. పోయినసారి నేను వచ్చినప్పుడు నీవు చెప్పిన మాటలను నేను మరువలేదు. ఎన్నటికీ మరువబోను"

లావణ్య పెదవులపై చిరునవ్వు.. ప్రీతిగా అభిమానంతో దీప్తి ముఖంలోకి చూచింది. 

"దీపూ!.. చాలా అందంగా వున్నావే!.."

"ఆమె అంతా నీ పోలికేగా!.." నవ్వాడు హరికృష్ణ.


"శారూ!.. పద.. నా బావగారు ఏం చేస్తున్నారో చూద్దాం" శార్వరీ చేతిని తన చేతిలోకి తీసుకొంది. ఇరువురూ ఈశ్వర్ గదిలోకి ప్రవేశించారు.

"బావా!.. టికెట్లు బుకింగ్ అయిపోయిందా!"


"అయిపోయింది."

"నాకు బుక్ చేశావా లేదా!."

"తప్పదుగా!"

"అంటే!?"

"మా నాన్నగారు చెప్పారు."

"నేను చెబితే చేయవా?"

"ఎందుకు చేయడు వదినా. నీవు చెప్పినా, నాన్న చెప్పినా విషయం ఒక్కటేగా!


"శారూ!"

"ఏమిటొదినా!.."

"మీ అన్నయ్య మారిపోయాడే!"

"పరిస్థితులు వ్యక్తుల మనస్తత్వాలను మారుస్తాయి"


"పరిస్థితులకు తగిన రీతిగా మనస్సును మార్చుకొనేవారు ఊసరవెల్లి లాంటివారు. వారిని మనుషులని అనకూడదు. అన్ని పరిస్థితుల్లో సహనంతో శాంతంగా వుండేవారే అసలైన మనుషులు. స్వార్థం కన్నా పరమార్థం గొప్పది. మా మామయ్యలాగా!"


"అంటే మా నాన్న మంచివాడా!.. చెడ్డవాడా!.. వదినా!"

"మీ నాన్న.. మా మామయ్య.. ఎంతో మంచివారు. వారి సుపుత్రుడైన ఈ నీ అన్నయ్యకు చెప్పు. ఆ తండ్రిలా మంచిపేరును తెచ్చుకోవాలని శారూ!"

"అదేదో నీవు చెబితే బాగుంటుందిగా!"


"ఏయ్ శారూ!.. నేను అభిమానంగా మాట్లాడితే అర్థం చేసుకోని మనిషే మీ అన్నయ్యా! ఐదేళ్ళ తర్వాత వచ్చానా! ప్రీతిగా దీపూ! ఎలా వున్నావ్? తిరిగి వచ్చావు నాకు చాలా సంతోషం. ముందు ఏం చేయాలనుకొంటున్నావు? నా సాయం ఏమైనా కావాలా? అని అడగవలసిన ఈ మనిషి, ఎవరో.. తనకు ఏమీకాని పరాయి మనిషిని చూచినట్లు ఆ చూపు, మూతి ముడుచుకోవడం న్యాయమా!.. మా అందరికంటే చిన్నదానివైనా నీవు చిన్నప్పటి నుంచి తెలివికలదానివి. నీవే న్యాయం చెప్పు. నా స్థానంలో నీవుంటే ఎలా ఫీలవుతావో ఆలోచించి చెప్పు!" రోషంగా అంది దీప్తి.


ఓరకంట దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్. దీప్తి ఎక్కిరించింది. అతని పెదవులపై చిరునవ్వు. కారణం ఆ ఫోజులో దీప్తి అతనికి చాలా అందంగా తోచింది.

"మామయ్య కారణంగా అన్నయ్య అలా మారిపోయాడు వదినా!.."

"నేనెవరు?.. చెప్పు!.."

"నా వదినవు."

"ఆయన ఎవరు?"

"నా అన్నయ్!"

"ఇద్దరం వేరేగా!.."

"అవును"

"అలాగే.. నేను వేరు.. మా నాన్న వేరు అనే ఆలోచన మీ అన్నయ్యగారికి అదే.." కుడిచేతిని ఈశ్వర్ వైపు చూపి.


"వారికి రాదా!"

"అన్నయ్యా!.. నీవే వదినకు జవాబు చెప్పాలి!"

"ఏం చెప్పాలి"

"తను అడిగిన దానికి!"

"తన టిక్కెట్‍ను బుక్ చేశానని చెప్పు"

"చూచావా!.. నామీద మీ అన్నగారికి ఎంత అభిమానమో!.. ఆయన నాకు చెప్పవలసిన విషయాన్ని నీవు నాకు చెప్పాలట!.." వ్యంగ్యంగా ఈశ్వర్ ముఖంలోకి చురచురా చూస్తూ అంది దీప్తి.

"అన్నయ్యా!"

"ఏమిటమ్మా!.." విసుగ్గా అడిగాడు ఈశ్వర్.


"నాతో చెప్పిన మాట నీవు నేరుగా వదినతోనే చెప్పవచ్చుగా!"

"తనకు చెవుడా ఏంటి?" నవ్వాడు ఈశ్వర్.

"ఏయ్ శారూ!.. చూడు.. చూడు.. ఆ నవ్వులో ఎంత కపటం వుందో!.. శారూ!.. చెప్పు.. నేను ఒక నిర్ణయానికి అంత తేలికగా రాను. వచ్చాననుకో దాని సాధించేవరకూ నా పట్టువదలను వదలను."

"అలాగా వదినా!" అమాయకంగా అడిగింది శార్వరి.

"అవును.."

"అయితే ఇప్పుడు ఏ నిర్ణయంతో వున్నావ్?"

"అది సస్పెన్స్!" వాలుకంట ఈశ్వర్ ముఖంలోకి చూచింది.

"కొద్దిరోజులు ఓపిక పట్టు అదేంటో నీకే తెలుస్తుంది. అప్పుడంటావ్.. వదినా ఆనాడు నీవు అన్నది నిజమే అని" నవ్వింది దీప్తి.


"ఏం చేస్తున్నార్రా!" లావణ్య వారి గదికి వచ్చింది.

"అమ్మా ఎల్లుండి సోమవారం మన ప్రయాణం టికెట్స్ బుక్ చేశాను."

"దీపూకు చేశావా"

దీప్తివంక చూస్తూ "ఆఁ.." అన్నాడు ఈశ్వర్.

"అత్తయ్యా!.. వాణి వదిన ఇంటి అడ్రస్ నా దగ్గర వుంది."

"అడ్రస్ నీకెలా దొరికింది?"

"నేను రామయోగి ఇంటికి వెళ్ళి కనుక్కున్నాను. మనం ఎయిర్‍పోర్ట్ నుంచి నేరుగా వాణి వదిన ఇంటికే పోవచ్చు" నవ్వింది దీప్తి.


"వదినా!.. మనలనందరినీ ఒక్కసారిగా చూచి అక్క!.." శార్వరి పూర్తిచేయకముందే..

"కలా.. నిజమా! అని ఉబ్బితబ్బిబై పోతుంది" గలగలా నవ్వింది దీప్తి. ఆమె స్వచ్ఛమైన నవ్వును చూచిన ఆ ముగ్గురు కూడా నవ్వారు.

"నేను బయలుదేరుతున్నానత్తయ్యా!"


"మంచిదిరా!. జాగ్రత్తగా వెళ్ళు" దీప్తి భుజంపై చెయ్యి వేసి చెప్పింది లావణ్య. 

ఓరకంట ఈశ్వర్‍ను చూచి "శారూ! బై.." చెప్పి దీప్తి వరండాలోకి వచ్చింది.

హరికృష్ణకు చెప్పి.. వెళ్ళి తన కార్లో కూర్చొని ఇంటివైపుకు బయలుదేరింది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

66 views0 comments

Comments


bottom of page