'Neti Bandhavyalu Episode 13' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 09/01/2024
'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది.
ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా, బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది.
శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి.
వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృధువుగా చెబుతాడు హరికృష్ణ.
ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 13 చదవండి.
ఇంటినుండి బయలుదేరిన సీతాపతి.. మౌనంగా నడుస్తున్న ప్రణవ్‍ను చూచి..
"ఏరా మాటాడవ్!.. " అడిగాడు సీతాపతి.
"ఏం మాట్లాడాలి!.. "
"సరదాగా ఏదైనా మాట్లాడు.. " నవ్వాడు సీతాపతి.
"మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము?"
"ఎక్కడికా!"
"అడిగింది అదేగా!.. "
"హరికృష్ణ మామయ్యగారి ఇంటికి. "
"ఏమిటీ!.. " ఆశ్చర్యంగా అడిగాడు ప్రణవ్.
"అవును.. "
"ఎందుకు?.. శార్వరిని చూచేటందుకా!.. "
"కాదు.. "
"మరెందుకు?.. "
"మా అత్తయ్యను చూచేటందుకు.. "
"ఆమె నీతో మాట్లాడుతుందా?.. "
"తప్పక మాట్లాడుతుంది. "
"ఆమెతో ఏం చెబుతావ్!.. "
"ప్రక్కనే వుంటావుగా.. చెప్పేటప్పుడు విను.. "
"ఏ మాటకా మాట చెప్పాలిరా!.. "
"ఏమిటది?.. "
"నీకు చాలా ధైర్యంరా.. "
"ధైర్యే.. సాహసే.. లక్ష్మి అన్నారు కదా!.. " నవ్వాడు సీతాపతి.
"నీవు అన్న ఆ ’లక్ష్మి’ శార్వరీయే కదూ!"
"అవును"
"చూడాలని వుందా!"
"మాట్లాడాలని వుంది. సాయంత్రం బైజాగ్ వెళ్ళిపోతున్నారా!"
"నిజంగానా!.. "
"అవునురా!.. "
ఇరువురూ హరికృష్ణ ఇంటిని సమీపించారు.
"నేను బయట వుంటాను. నీవు లోనికి వెళ్ళి పని చూచుకొనిరా! అదే శార్వరిని చూచేపని.. "
"నీవూ నాతో రావాలి. "
"వద్దురా నేను బయట వుంటాను"
"రారా!.. " చేతిని పట్టుకొని లాగాడు సీతాపతి.
"నన్ను వదలరా!.. "
"వదలను.. "
ప్రణవ్ నిట్టుర్చి సీతాపతిని అనుసరించాడు.
అప్పుడు వరండాలోకి వచ్చిన శార్వరి లోనికి వస్తున్న ఆ ఇద్దరు మిత్రులను చూచి ఇంట్లోకి పెరుగెత్తింది.
"చూచావా!" అడిగాడు ప్రణవ్.
"ఆ.. చూచాను. "
"మర్యాద బలంగా వుంది" నవ్వాడు ప్రణవ్.
"నీ మాట నిజమేరా!"
ప్రణవ్ ఎంతో అయోమయంగా సీతాపతి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయాడు.
"ఒరే!.. నీకు అది మర్యాదనా!. "
"కాదు గౌరవం.. "
"గౌరవమా!"
"అవును.. నేను వస్తున్నట్లు అత్తయ్యతో చెప్పేదానికి వెళ్ళిందిరా.. ఇప్పుడు చూడు.. "
ప్రణవ్ ఆ ఇంటి సింహద్వారం వైపు చూచాడు.
లావణ్య వరండాలోకి వచ్చింది.
సీతాపతి, ప్రణవ్ వరండాను సమీపించారు.
"అత్తయ్యా!.. నమస్కారాలు" చేతులు జోడించాడు సీతాపతి.
లావణ్య.. వరండాలో వున్న కుర్చీలో కూర్చుంది.
"ఏరా దారి తప్పినట్లున్నావ్!"
సీతాపతి నవ్వుతూ.. "నేను మీ మేనల్లుడిని కదా అత్తయ్యా దారి ఎలా తప్పుతాను!.. ఎప్పుడూ సరైన దారిలోనే నడుస్తాను. సాయంత్రం వైజాగ్ వెళుతున్నాను. మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను. "
"మాటలు బాగా నేర్చావురా!.. నీవు ఇక్కడికి వస్తున్న విషయం మీ నాన్నకు తెలుసా!.. రా.. కూర్చో" అంది లావణ్య.
"నా ఇష్టానికి ఆయనకు తెలియడానికి.. ఏమిటి అత్తా సంబంధం.. నేను నాకు నచ్చిన మార్గంలో నడవడం తప్పు కాదు కదా అత్తయ్యా!.. ఇంట్లో మామయ్యగారు లేరా!"
"నెల్లూరికి వెళ్లారు.. రాక రాక వచ్చావ్.. ఏం తింటావ్!.. "
"మీ చేత్తో ఏది ఇచ్చినా తింటానత్తయ్యా!.. "
కుర్చీ నుండి లేచింది లావణ్య. "రారా లోపలికి.. ఒరేయ్ ప్రణవ్!.. నీవూరా" అంది ప్రీతిగా లావణ్య.
ముగ్గురూ హాల్లోకి నడిచారు. అంతవరకూ సింహద్వార ప్రక్కన వుండి వారి సంభాషణను వుంటున్న శార్వరి ఎడమవైపున వున్న తన గదిలోకి వేగంగా నడవడాన్ని ముగ్గురూ చూచారు.
"అత్తయ్యా!.. నేను సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతున్నా. బి. టెక్ ముగిశాకనే వస్తాను. ఫైనల్ ఇయర్ కదా!.. బాగా చదివి గోల్డ్ మెడల్ సాధిస్తాను. మామయ్య నాకు నయబోధ చేశారు. వారు చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను ఎన్నటికీ మరిచిపోను. వారు.. మీరూ ఎప్పుడూ నా మేలు కోరేవారేగా!.. ఇకపై అనవసరంగా నేనుగా ఎవ్వరినీ డిస్టబ్ చెయ్యబోను" సౌమ్యంగా చెప్పాడు సీతాపతి.
శార్వరిని తలచుకొంటూ ఆశ్చర్యంతో చూచింది లావణ్య. ఆమెకు అతని మాటలు బాగా అర్థం అయినాయి. చివరిమాటలు చెప్పింది శార్వరిని ఉద్దేశించేని గ్రహించింది. పెదవులపై చిరునవ్వు.
"ఇద్దరూ కూర్చోండిరా.. "
సీతాపతి.. ప్రణవ్ మౌనంగా కూర్చున్నారు.
"శార్వరీ!.. " ఆమె వెళ్ళిన గదివైపు చూస్తూ పిలిచింది లావణ్య.
"ఏమ్మా!.. " లోనుంచే జవాబు.
"బయటికి రా!.. "
శార్వరీ ఆ మాట విని ఉలిక్కిపడింది. తల్లి తనను పిలుస్తుందని ఆమె ఊహించలేదు. మెల్లగా గది నుంచి బయటికి వచ్చింది. వస్తున్న శార్వరిని క్షణంసేపు చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు సీతాపతి.
సీతాపతి సోఫానుంచి లేచాడు. అతన్ని చూచి ప్రణవ్ కూడా లేచాడు.
"అత్తయ్యా!.. రావాలనుకొన్నాను. వచ్చాను.. చూచాను.. "
శార్వరివైపు చూస్తూ "చెప్పదలచుకొన్న మాటలను చెప్పాను. మీరంటే నాకు ఎంతో ప్రేమ.. అభిమానం. అవి నా జీవితాంతం నాలో ఉంటాయి. మన కుటుంబాల మధ్యన వున్న విభేదాలకు వాటికి సంబంధం లేదు. ఈ కుటుంబ సభ్యుల పట్ల నాకున్న అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు. వచ్చిన పని అయిపోయింది. ఇకనే బయలుదేరుతాను అత్తయ్యా!"
"నా ఇంటికి వచ్చి ఏమీ తినకుండానే వెళ్ళిపోతావా!.. ఇందాకనే కదా అన్నావ్ నేను ఏది ఇచ్చినా తింటానని!.. " కసిరినట్లు అడిగింది లావణ్య.
"నావల్ల ఎవరూ ఇబ్బంది పడటం నాకు నచ్చదత్తయ్యా!"
"ఏంటీ!.. ఇబ్బందా!"
"అవును!"
"ఎవరికి?"
"అదిగో.. " శార్వరి వైపు చేయి చూపించి "నీ ముద్దుల కూతురు.. నా మరదలు.. వారికి" నవ్వాడు సీతాపతి. లావణ్య, కూతురు అల్లుడిని చూచి నవ్వింది. శార్వరి సిగ్గుతో తలదించుకొంది.
ఆ క్షణంలో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. మదిలోని భావాలకు చెక్కిళ్ళ రంగు నిదర్శనం. కూతురి స్థితిని గమనించిన లావణ్య..
"శారూ!.. వంటగదికి వెళ్ళి ఉదయం చేశావే లడ్లు అవి ప్లేట్లలో పెట్టుకొనిరా!" చిరునవ్వుతో చెప్పింది.
శార్వరి వేగంగా వంటగదివైపుకు వెళ్ళింది.
"కూర్చోండిరా!.. " అంది లావణ్య.
ఇరువురు మిత్రులు ఒకరి ముఖాలొకరు చూచుకొంటూ కూర్చున్నారు. సీతాపతి పెదవులపైని చిరునవ్వు విజయగర్వాన్ని చాటుతూ వుంది.
దాన్ని చూచిన ప్రణవ్ ఆనందంగా నవ్వుకొన్నాడు.
’సీతా!.. నీవు సామాన్యుడివి కావు!!!’ అనుకొన్నాడు.
"సీతా!.. బి. టెక్ అయ్యాక ఏం చేయాలనుకొంటున్నావురా!.. "
"ఎం. టెక్ చేస్తానత్తయ్యా!"
"మరి పెండ్లి ఎప్పుడు చేసికొంటావ్!"
లావణ్య అడిగిన ఆ ప్రశ్నకు సీతాపతి ఆశ్చర్యపోయాడు. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు.
తన్నే లావణ్య చూస్తూ ఉందని గ్రహించిన సీతాపతి..
"అక్కయ్య పెళ్ళి.. నా చదువు పూర్తయ్యాక అత్తయ్యా!.. పిల్లని మీరే చూడాలి సుమా!" నవ్వాడు సీతాపతి.
అతని మాటలు.. వినయం.. అభిమానం.. నిర్భయం.. లావణ్యకు బాగా నచ్చాయి. మూడేళ్ళ తర్వాత సీతాపతి ఆ రోజు ఆ యింటికి వచ్చాడు. అతని మాటల ద్వారా అతను.. ఏ ఉద్దేశ్యంతో వచ్చాడో లావణ్యకు అర్థం అయింది. అతనిపట్ల మనస్సులో అభిమానం.. చిరునవ్వుతో ప్రీతిగా సీతాపతి ముఖంలోకి చూచింది లావణ్య.
"వీడు.. నా అన్న ప్రజాపతి లాంటివాడు కాదు" అనుకొంది.
శార్వరి స్టీల్ ప్లేట్లో పది లడ్డు వుండలను పెట్టుకొని వారిని సమీపించింది.
చిరునవ్వుతో చూచాడు సీతాపతి శార్వరిని. ఇరువురి చూపులు క్షణం కలిశాయి. మరుక్షణంలో శార్వరి ముఖాన్ని ప్రక్కకు తిప్పింది. బెదిరిన లేడిపిల్లలా.
వారి చూపులను లావణ్య, ప్రణవ్ గమనించారు. ముసిముసి నవ్వులతో ప్రణవ్ సీతాపతి ముఖంలోకి చూచాడు.
సీతాపతి కన్నుకొట్టాడు.
"శారూ! ఇంట్లో ప్లేట్లు లేవా!" వెటకారంగా అడిగింది లావణ్య.
తొట్రుపాటుతో చూచింది తల్లిముఖంలోకి శార్వరి.
"వెళ్ళి రెండు చిన్న ప్లేట్లను తీసుకునిరా!"
తన చేతిలోని ప్లేటును టీపాయ్‍పై వుంచి వంట గదివైపుకు వేగంగా నడిచింది శార్వరి. ’నా చర్య అమ్మకు నచ్చలేదు’ అనుకొంది శార్వరి.
"ఫర్వాలేదు అత్తయ్యా. మేము తినబోయేది ప్లేట్లను కాదుగా!" వెళుతున్న శార్వరిని చూస్తూ అన్నాడు సీతాపతి.
పరుగున ఒక్కోప్లేట్లో ఐదు వుండలను వుంచి.. ఒక ప్లేటును ప్రణవ్‍కు అందించింది.
"థ్యాంక్యూ శార్వరీ!" ప్లేటును అందుకొని నవ్వుతూ చెప్పాడు ప్రణవ్.
రెండో ప్లేటును సీతాపతికి అందించింది. ప్లేటును అందుకొనే సమయంలో కావాలనే తన వ్రేళ్ళను శార్వరి వేళ్లకు తగిలేలా అందుకొన్నాడు సీతాపతి ఓరకంట ఆమె ముఖంలోకి చూస్తూ.
అతని ఆ చూపుల్లో ఎంతో అభిమానం.. ప్రేమ.. గమనించింది లావణ్య. పెదవులపై చిరునవ్వు.. శార్వరి ముఖంలో చిరుకోపం.
"వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా!.. "
"అలాగే" చెప్పి వెనుదిరిగింది శార్వరి.
"శారూ!.. ఆగు.. తిన్న తర్వాత.. "
"అత్తయ్యా!.. శారూ!.. " నవ్వుతూ హాల్లోకి ప్రవేశించిన దీప్తి గొంతు విని సీతాపతి చెప్పడం ఆపేసి ఆమె వైపుకు చూచాడు.
"సోదరా!.. తమరు ఇక్కడ వున్నారా!.. " నవ్వింది దీప్తి.
శార్వరి ఆగి నవ్వుతూ దీప్తి ముఖంలోకి చూచి ఆమెను సమీపించింది.
"రా వదినా.. కూర్చో" అంది శార్వరి దీప్తి చేతిని పట్టుకొని.
"రా దీపు.. రా!.. " చిరునవ్వుతో ఆహ్వానించింది లావణ్య. నవ్వుతూ దీప్తి లావణ్య పక్కన కూర్చుంది.
"అత్తయ్యా!.. నీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను. "
"ఏమిటో చెప్పు.. "
"ఆఁ.. అత్తయ్యా! లడ్లు సూపర్.. అక్కయ్య ఏదో రాచకార్యం పైన వచ్చినట్లుంది. ఇక నేను బయలుదేరుతాను" చేతిలోని ఖాళీప్లేటును టీపాయ్ పై వుంచి లేచి..
"అత్తయ్యా!.. నాకు మీ ఆశీర్వాదం కావాలి" వంగి లావణ్య పాదాలను తాకాడు సీతాపతి.
అతని తలపై తన కుడిచేతిని వుంచింది లావణ్య..
"ఓరేయ్ సీతా!.. నీ కోర్కె తప్పక నెరవేరుతుంది రా!.. బాగా చదువు" ప్రీతిగా నవ్వుతూ చెప్పింది లావణ్య.
దీప్తి.. శార్వరి.. ప్రణవ్ లావణ్య ముఖంలోకి ఆశ్చర్యంతో చూచారు.
"ధన్యవాదాలు అత్తయ్యా!" లేచి.. "ఆఁ శారూ!.. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి" శార్వరి ముఖంలోకి నవ్వుతూ చూస్తూ చెప్పాడు సీతాపతి.
శార్వరి వంటగదివైపుకు నడిచింది. కొన్ని క్షణాల్లో జగ్గు గ్లాసుతో వచ్చి గ్లాసును సీతాపతికి అందించి గ్లాసులో నీళ్ళను పోసింది.
గుటగుట నీటిని త్రాగి ప్రణవ్‍కు అందించాడు. నీటిని గ్లాసులో పోసింది శార్వరి.
ఖాళీ గ్లాసును టీపాయ్‍పై వుంచుతూ.. ప్రణవ్..
"పెద్దమ్మా!.. మీ మనస్సు ఎలాంటిదో.. మీరు చేసిన లడ్లు అంత బాగున్నాయ్!" నవ్వాడు.
"చేసింది నేను కాదురా నీ చెల్లి శారూ!"
"అలాగా!.. " శార్వరీ ముఖంలోకి చూస్తూ అడిగాడు ప్రణవ్. అవునన్నట్లు చిరునవ్వుతో సగర్వంగా తలాడించింది శార్వరి.
"శారూ!.. నీతో ఓ మాట చెప్పాలి!" శార్వరిని సమీపించాడు సీతాపతి.
బెరుగ్గా బిక్కముఖంతో అతనివైపు చూచింది శార్వరి.
"బాగా చదువు. అత్తయ్యకు మామయ్యకు ఆనందం కలిగించేలా నడుచుకో. సరేనా!.. "
తలవంచుకొని మౌనంగా తలాడించింది శార్వరి.
"లడ్లు చాలా చాలా బాగున్నాయి" లావణ్య వైపు తిరిగి "అత్తయ్యా!.. వెళ్ళొస్తాను.. "
"మంచిదిరా!.. జాగ్రత్త" అంది లావణ్య.
క్షణంసేపు శార్వరి ముఖంలోకి చిరునవ్వుతో చూచి "పదరా ప్రణవ్!.. " అన్నాడు సీతాపతి.
ఇరువురు మిత్రులూ హాల్లో నుండి బయటికి నడిచారు.
"దీపు!.. నీ తమ్ముడు సీతాపతి.. " సాలోచనగా ఆగిపోయింది లావణ్య.
"చెప్పండత్తయ్యా!.. "
"గొప్ప వ్యక్తిత్వాన్ని అలవరచుకొన్నాడు. మూడేళ్ళ తర్వాత వాడి మాటలను విన్నాను. నాకు ఎంతో ఆనందం కలిగింది" శార్వరి ముఖంలోకి చూచింది లావణ్య.
శార్వరీ చూపులు, తల్లి చూపులతో కలిశాయి. క్షణంసేపు చూచి దృష్టిని దీప్తి వైపుకు మళ్ళించి..
"వదినా!.. ఏమిటి విశేషాలు!" నవ్వుతూ అడిగింది శార్వరి.
"శారూ!.. నేను మన వూర్లో ప్రాక్టీస్ ప్రారంభించదలచాను. ఆ విషయాన్ని గురించే నా అత్తయ్యా మామయ్యలతో మాట్లాడాలని వచ్చాను. అత్తయ్యా!.. నా అభిప్రాయానికి మీ సమాధానం!.. " లావణ్య దీప్తి ముఖంలోకి పరీక్షగా చూచింది.
"ఏం అత్తయ్యా అలా చూస్తున్నారు. నేను మీ దీపూనత్తయ్యా!.. నేనంటే మీకు ఎంత అభిమానమో నాకు తెలుసు. అందుకే నా నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏమిటని అడిగాను జవాబు చెప్పండి" చిరునవ్వుతో అడిగింది దీప్తి.
లావణ్య తన ప్రక్కన కూర్చొని వున్న దీప్తి భుజంపై చేయి వేసి "దీపూ!.. నీ నిర్ణయం ఎంతో ఆదర్శవంతమైంది. కానీ అందుకు మీ నాన్న అంగీకరించడు దీపూ!" విచారంగా చెప్పింది లావణ్య.
"నా నిర్ణయం నా జీవితానికి సంబంధించింది. నాకు ఆనందం కలిగించే పనిని చేసే హక్కు నాకు లేదా అత్తయ్యా!.. "
"తల్లీ!.. మీ నాన్న పరమ మూర్ఖుడు!" విచారంగా చెప్పింది లావణ్య.
"మీరు మామయ్య నాకు సాయం చేయరా అత్తయ్యా!"
"దీపు.. నాకు శార్వరి ఎంతో నీవూ అంతేనే!"
"మామయ్యగారు ఎప్పుడూ వస్తారత్తయ్యా!"
"ఈపాటికి నెల్లూరు నుండి బయలుదేరి వుంటారు. "
"భోజన సమయం కదా వదినా!.. నాన్న పదినిముషాల్లో వచ్చేస్తారు. ఈపూట నీవూ మాతో కలసి భోజనం చేస్తావా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది శారూ.
"నా ముద్దుల మరదలా శారూ!.. నీవు అడగడం నేను కాదనడమూనా!.. అలాగే" నవ్వుతూ చెప్పింది దీప్తి. క్షణం తర్వాత "శారూ!.. మీ అన్నయ్య ఎక్కడా!.. "
"తనూ నెల్లూరికి వెళ్ళాడు. నాన్నతో అన్నయ్యా వస్తాడు" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
వీధిలో కారు హారన్ మ్రోగింది.
"అరుగో.. నాన్నా అన్నయ్య వస్తున్నారు. "
ముగ్గురూ లేచి వరండాలోకి వచ్చారు.
ఈశ్వర్ కారును పోర్టికోలో ఆపాడు. తండ్రి కొడుకులు కారు దిగారు.
"మామయ్యా!.. గుడ్ ఆఫ్టర్ నూన్!"
ఈశ్వర్ ముఖంలోకి చూచి..
"బావగారూ!.. మీకూనూ!.. " చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"గుడ్ ఆఫ్టర్‍నూన్ దీపూ.. ఎప్పుడొచ్చావ్!" అడిగాడు హరికృష్ణ.
"వచ్చి పావుగంట అయింది మామయ్యా!.. మీతో అత్తయ్యతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను" ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ చెప్పింది దీప్తి.
క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి..
"అమ్మా!.. ఆకలి దంచేస్తుంది పద. "
"రండి లోపలికి.. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా వున్నాయ్"
"దీపూ.. పద భోజనం చేస్తూ మాట్లాడుకుందాం!" ప్రీతిగా చెప్పాడు హరికృష్ణ.
లావణ్య, శార్వరి, దీప్తి డైనింగ్ టేబుల్‍ను సమీపించారు.
హరికృష్ణశ్, ఈశ్వర్ తమ గదులకు వెళ్ళిఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు.
"అత్తయ్యా!.. మీరూ కూర్చోండి. నేను శార్వరి వడ్డిస్తాం"
లావణ్య భర్త ముఖంలోకి చూచింది చిరునవ్వుతో.
"రా కూర్చో!.. కోడలు వడ్డిస్తానంటూ వుంది కదా!"
లావణ్య హరికృష్ణ ప్రక్కన కూర్చుంది.
"శారూ.. వడ్డించు" అన్నాడు ఈశ్వర్.
"శారూ కాదు. దీపూ వడ్డించు అనాలి బావగారూ!.. నా పేరును మరిచిపోయారా!" క్రీగంట చూస్తూ చిలిపిగా అంది.
"అమ్మా!.. కూర ఏమిటి?.. "
"గుత్తివంకాయ కూర" వడ్డిస్తూ చెప్పింది దీప్తి.
శార్వరి అందరికీ అన్నం వడ్డించింది.
హరికృష్ణకు లావణ్యకు కూర, కొబ్బరి పచ్చడి, మినప వడియాలు వడ్డించింది దీప్తి.
"ఆఁ.. అన్ని వడ్డించారుగా.. మీరూ కూర్చోండి. దీపూ!.. అన్నింటిని టేబుల్ మధ్యకు జరిపి కూర్చోండి!" అన్నాడు హరికృష్ణ.
"అలాగే మామయ్యా!.. "
రెండు కంచాల్లో వడ్డించుకొని ఆ ముగ్గురికి ఎదురుగా దీప్తి, శార్వరి కూర్చొని తినడం ప్రారంభించారు. తనకు ఎదురుగా వున్న ఈశ్వర్‍ను చూచి..
"బావా!.. మరో గుత్తివంకాయ వేయనా!"
దీప్తి ముఖంలోకి క్షణంసేపు చూచిన ఈశ్వర్.
"వద్దు.. " ముక్తసరిగా చెప్పాడు.
"దీపూ!.. వాడికి ఆ కూరంటే ఎంతో ఇష్టం వడ్డించు. "
"అలాగే అత్తయ్యా!" గరిటతో మరో రెండు గుత్తివంకాయలు ఈశ్వర్ కంచంలో వేసింది దీప్తి.
"బావా!.. ఆహార వ్యవహారాల్లో మొహమాటం పడకూడదు. అది ఒంటికి ఇంటికి మంచిది కాదు. అవును కదా మామయ్యా!" దీర్ఘం తీసి అడిగింది దీప్తి.
హరికృష్ణ నవ్వుతూ "అవునమ్మా!" అన్నాడు.
"దీపూ!.. నాతో చెప్పిన విషయం మీ మామయ్యతో చెప్పు.. " అంది లావణ్య.
"ఏమిటమ్మా ఆ విషయం!" యాంత్రికంగ అడిగాడు ఈశ్వర్.
దీప్తి నవ్వుతూ "నాకు సంబంధించిన విషయం.. స్వవిషయం!.. బావగారూ! మీ సాయం కూడా కావలసి వస్తుంది చేస్తారుగా!" చిరునవ్వుతో అడిగింది దీప్తి.
ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచాడు. తలను ప్రక్కకు తిప్పుకున్నాడు.
"ఇంతకూ విషయం ఏమిటి దీపూ!.. " అడిగాడు హరికృష్ణ.
దీప్తి లావణ్యకు చెప్పిన తన అభిప్రాయాన్ని చెప్పింది. అంతా విన్న హరికృష్ణ..
"వాడు ఈ నీ నిర్ణయానికి అంగీకరించడు దీపూ!.. "
"నేనూ అదేమాటను చెప్పానండీ!" అంది లావణ్య.
"ఈ విషయంలో నా అభిప్రాయమూ అదే!" అన్నాడు ఈశ్వర్.
"వదిన నిర్ణయంలో తప్పేముంది అన్నయ్యా!.. హాస్పిటల్‍ను ఓపెన్ చేసి పేద పీడిత జనానికి వైద్య సహాయాన్ని అందించడం తప్పా అన్నయ్యా!.. మానవసేవే మాధవసేవ కదా!.. "
"మీకు ఒప్పే కావచ్చు. కానీ ఆ ప్రజాపతికి అది తప్పు అవుతుంది. అంగీకరించబోడు" తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఈశ్వర్.
"అమ్మా దీపూ!.. "
"చెప్పండి మామయ్యా!.. "
"వాడితో ఈ విషయాన్ని గురించి మాట్లాడావా!.. "
"మాట్లాడాను"
"ఏమన్నాడమ్మా!.. "
"చెన్నైలో నేను ప్రాక్టీసు ప్రారంభించాలట.. "
"అలాంటప్పుడు నీవు అనుకున్నది ఇక్కడ కుదరడం అసాధ్యం కదా అమ్మా!.. " సాలోచనగా చెప్పాడు హరికృష్ణ.
"అవును నాన్నా!.. మీరన్న మాట వాస్తవం!.. " అన్నాడు ఈశ్వర్.
దీప్తి దీనంగా హరికృష్ణ ముఖంలోకి, ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
"అది నా స్వవిషయం కదా మామయ్యా!.. నాకు సంబంధించిన విషయంలో నాకు నచ్చిన నిర్ణయాన్ని నేను తీసుకొనే హక్కు నాకు లేదా మామయ్యా!" దీనంగా అడిగింది దీప్తి.
హరికృష్ణ కొన్ని క్షణాలు పరీక్షగా దీప్తి ముఖంలోకి చూచాడు.
"ఏమండీ!.. దీపూ నిర్ణయం.. " లావణ్య పూర్తిచేయకముందే.
"మంచిది కాదని నేను ఎలా అనగలను లావణ్యా!.. " అన్నాడు హరికృష్ణ.
"అయితే దానికి మనం సాయం చేయలేమా!.. "
"అవును నాన్నా!.. వదినకు మనం ఆ విషయంలో సాయం చేయాలి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది శార్వరి.
ఈశ్వర్, శార్వరీ ముఖంలోకి తీక్షణంగా చూచాడు.
"శారూ!.. నీవు చిన్నపిల్లవు మాట్లాడకు. "
"ఎందుకురా దాన్ని దబాయిస్తావ్!.. నీవు పెద్దవాడివి. మంచీచెడ్డా తెలిసినవాడివి. లాయర్‍వి. దీపూకు అండగా నిలబడి మన వూర్లోనే దీపు క్లినిక్ పెట్టేలా చేయలేవా!" అడిగింది లావణ్య.
"చేయగలను అమ్మా.. కానీ!.. " ఆగిపోయాడు ఈశ్వర్.
"లావణ్య!.. నీకు దీపూ నిర్ణయం సమ్మతమా!.. " అడిగాడు హరికృష్ణ.
"ముందు మీలాగే సందేహించాను. కానీ.. ఇప్పుడు దీపూ నిర్ణయం సరైందని చెబుతున్నా.. నా తండ్రి నాకు ఇచ్చిన ఇల్లు ప్రక్కనే వుందిగా!.. అందులో దీపు హాస్పిటల్‍ను ఓపెన్ చేసేలా మీ తండ్రి కొడుకు చేయాలి. ఇది నా నిర్ణయం" తన అభిప్రాయాన్ని ఎంతో గంభీరంగా చెప్పింది లావణ్య.
ఆ మాటలను విన్న దీప్తి కుర్చీలో నుంచి లేచి ఆమె ప్రక్కకు వెళ్ళి తల వంచి ఆమె బుగ్గపై ముద్దుపెట్టి..
"మా అత్తయ్య బంగారు తల్లి!" ఆనందంగా పరవశంతో చెప్పింది దీప్తి.
ఆమె చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు.
"ఏమండీ!.. మీరు.. ఇంకా!.. " లావణ్య పూర్తి చేయకముందే..
"లావణ్యా!.. నీవు అనుకొన్నట్లుగానే జరుగుతుంది. ఈశ్వర్ ఫ్యాక్టరీ నుంచి ఓ అయిదారుగురిని పంపి ఆ ఇంటిని శుభ్రం చేయించి.. రంగులు వేయించాలి" అన్నాడు హరికృష్ణ.
"నాన్నా!.. " ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.
"మంచిని సమర్థించడం మానవత్వం అవుతుంది ఈశ్వర్. నా కోడలి నిర్ణయంలో, స్వార్థంలో పరమార్థముంది. ఈ విషయాన్ని విన్న వూరిజనం అంతా ఎంతగానో ఆనందిస్తారు. ఒక్క ఆ ప్రజపతి తప్ప. చూస్తాం వాడు ఏం చేస్తాడో!" హేళనగా నవ్వాడు.
"థాంక్యూ మామయ్యా!.. థాంక్స్ ఎలాట్!" సంతోషంగా చెప్పింది దీప్తి.
"అమ్మా!.. వాడు వూర్లో వున్నాడా!.. "
"లేరు మామయ్యా!.. చెన్నై వెళ్ళారు"
"హాస్పిటల్‍కు పేరు ఏం పెడతావమ్మా!"
"మా తాతయ్య నానమ్మల పేర్లు" దీప్తి పూర్తిచేయకముందే..
"ఏంటీ!.. మా అమ్మా నాన్నల పేర్లా!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య.
"అవునత్తయ్యా!.. రుక్మిణి కైలాసపతి మెమోరియల్ హాస్పిటల్" అంది దీప్తి.
"దీపూ!.. చిన్నదానివైనా చాలాదూరం ఆలోచించావురా!.. యు ఆర్ రియల్లీ గ్రేట్" ఆనందంగా చెప్పింది లావణ్య.
"దీపూ!.. మీ అత్తయ్య అన్నమాట నిజం. నీవు హాస్పిటల్‍కు నిర్ణయించిన పేరు చాలా గొప్ప వ్యక్తుల పేర్లమ్మా. మా అత్తయ్యగారు.. మామగారు నా పాలిటి దేవతలు. మాకే కాదు. ఈ వూరి వారికందరికీ కూడా.. నీకు నా హృదయపూర్వక అభినందనలు తల్లీ. వారి ఆశీస్సులతో నీకోర్కె తప్పక నెరవేరుతుంది. నీవు ఎప్పుడూ ఆనందంగా వుంటావ్. డాక్టర్‍గా నీకు మంచిపేరు వస్తుందమ్మా!.. " ఆనందంగా చెప్పాడు హరికృష్ణ.
"దీప్తి!.. "
"ఏం బావా!.. "
"నీ నిర్ణయం నాకూ నచ్చింది" అన్నాడు చిరునవ్వుతో ఈశ్వర్.
"వదినా!.. "
"ఏం శారూ!.. "
"ఇప్పుడు నీకు మా అన్నయ్య మీది కోపం పోయిందా!.. " నవ్వింది శార్వరి.
"వారిమీద నాకు ఎప్పుడూ కోపం లేదే! ఇంతవరకూ వారికి నామీద వుండిందేమో!" ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ నవ్వింది దీప్తి.
ముసి ముసి నవ్వులతో దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్. నాలుగు కళ్ళూ కలిశాయి. మూగ భాష వాటి మధ్యన జరిగింది. అందరూ కుర్చీల నుంచి లేచారు. దీప్తి, శార్వరీ కంచాలను తీసి వంటగది సింక్‍లో పెట్టారు. డైనింగ్ టేబుల్‍ను క్లీన్ చేశారు.
"అత్తయ్యా మామయ్యా! నేవెళ్ళొస్తాను" వారిరువురిని సమీపించి చెప్పింది దీప్తి.
"మంచిది దీపు" ఏకకంఠంతో హరికృష్ణ, లావణ్య ఒకేసారి అన్నాడు.
ఈశ్వర్‍కు శార్వరికి చెప్పి దీప్తి తన కారులో కుర్చొని స్టార్ట్ చేసింది. వరండాలో నిలబడి వున్న హరికృష్ణ, లావణ్యలు దీప్తి కారు వీధిలో ప్రవేశించేంత వరకూ పరీక్షగా ఆమెను చూస్తూ వుండిపోయారు.
"ఏమండీ!.. "
"చెప్పు లావణ్యా.. "
"దీపూ మనస్సు.. " లావణ్య పూర్తిచేయకముందే హరికృష్ణ.
"ఎంతో మంచి మనస్సు.. నీలాగే!" నవ్వాడు హరికృష్ణ.
"దీప్తిని మీరు నా కోడలిగా చేస్తారా!.. "
"చేయవలసింది నేను కాదు. ఆపైవారు.. వారు తలచుకొంటే కానిది లేనిది అంటూ ఏదీ వుండదుగా!.. "
"అవును.. "
"ప్రజాపతి దీప్తి నిర్ణయాన్ని.. "
"కాదన్నాడని దీపు చెప్పింది కదా అమ్మా!.. "
అప్పుడే వరండాలోకి వచ్చిన ఈశ్వర్, లావణ్య సందేహానికి జవాబు చెప్పాడు.
"అమ్మా!.. మీ అన్నయ్య ఏమనుకొన్నా.. తాతయ్య నీకు ఇచ్చిన ఆ ఇంట్లో దీపు హాస్పిటల్ పెడుతుందమ్మా. తన నిర్ణయం మంచిది. దానికి మీరు అంగీకరించారు. నాకూ నచ్చింది కాబట్టి.. మీ సోదరుడు ఈ విషయంలో ఏమీ చేయలేడమ్మా!.. " ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్.
హరికృష్ణ, లావణ్యలు పరీక్షగా ఈశ్వర్ ముఖంలోకి చూచారు.
"ఈ విషయంలో మీ సోదరుడు వ్యతిరేకిస్తే.. వారిని ఎదుర్కొనే దానికి నేను సిద్ధంగా వున్నాను. మంచిని ఆదరించడం మానవ ధర్మం కదా అమ్మా!.. " చిరునవ్వుతో చెప్పి లోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
"లావణ్యా!.. విన్నావుగా నా కొడుకు నిర్ణయం!"
"వాడిది నా పోలిక.. నా కొడుకు" చిరునవ్వుతో చెప్పింది లావణ్య.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments