top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 15



'Neti Bandhavyalu Episode 15'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 18/01/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 

ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా, బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. 

శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి. 

వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 


సీతాపతి లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు.


స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు.

దండాయుధపాణి మోసం చెయ్యడంతో శివరామకృష్ణ వ్యాపారంలో అన్నీ కోల్పోతాడు.వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 15 చదవండి..


రైలుబండి చెన్నై వైపు పరుగు లంఘించింది. వారి ఆ ప్రయాణం ఢిల్లీకి. చెన్నై నుంచి విమాన పయనం.

వదినా మరదలు అయిన దీప్తి, శార్వరీలు ఎంతో సరదాగా మాట్లాడుకోసాగారు. వారి అన్యోన్యత మాటలను విని హరికృష్ణ, లావణ్యలు ఒకరినొకరు చూచుకొని ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.

శార్వరీతో మాట్లాడుతూనే దీప్తి, ఈశ్వర్‍ను క్రీకంట గమనిస్తూనే వుంది.


చేతన్ భగత్ వ్రాసిన ’వన్ ఇండియన్ గర్ల్’ ఇంగ్లీషు నవలను ఈశ్వర్ చదువుతున్నాడు. మధ్య మధ్యన దీప్తి నవ్వును.. మాటలను విని పుస్తకం చాటునుంచి ఆమె చర్యలను గమనిస్తున్నాడు.

దీప్తి, ఈశ్వర్‍ల నయన సంభాషణను హరికృష్ణ, లావణ్యలు గమనించారు. వారి పెదవులపై చిరునవ్వు. మనస్సున ఆనందం. రైలు చెన్నై చేరింది. ఈశ్వర్ స్నేహితుడు మురుగన్ పంపిన టవేరా కారు డ్రైవర్, వారిని ఎయిర్ పోర్టుకు చేర్చాడు. డ్రైవర్‍కు ఈశ్వర్ ఐదువందలు ఇచ్చాడు. అతను వద్దుసార్ అన్నాడు. బలవంతంగా అతని జేబులో పెట్టాడు ఈశ్వర్. అతని ఆ చర్యకు దీప్తికి ఎంతో ఆనందం.


"అత్తయ్యా!.. ఎవరి ఋణాన్ని మనం వుంచుకోకూడదు కదూ!"


"ఆఁ.. ఆఁ.. అవును పద" అంది లావణ్య.


లగేజీని ట్రాలీలో సర్దేదానికి ఈశ్వర్‍కు దీప్తి, శార్వరీ సాయం చేశారు.

ఒక ట్రాలీని ఈశ్వర్ మరో ట్రాలీని దీప్తి తీసుకొని ఎంట్రీ సెక్యూరిటీ చెక్ ముగించుకొని.. బోర్డింగ్ కార్డులను తీసుకొని.. ఏరో బ్రిడ్జి ద్వారా స్పెయిన్ జెట్ బోయింగ్‍లో ప్రవేశించారు. ’ఇ’రోలో ’డి’ సీటు శార్వరికి, ’ఇ’ సీటు ఈశ్వర్‍కు, ’ఎఫ్’ సీటు దీప్తికి.

"అన్నయ్యా!.. నేను కిటికీవైపు కూర్చుంటాను" అంది శార్వరి.


"అలాగే అమ్మా!.. కూర్చో!"


"అది నా సీటు.." అంది దీప్తి.


"చిన్నపిల్ల శారూ కూర్చుంటానన్నది కదా!.." ప్రశ్నార్థకంగా దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.


"మరి నేనెక్కడ?"


"శారూ ప్రక్కన కూర్చో!"


"మరి మీరు!.."


"అన్నయ్య నీ ప్రక్కనే కదా కూర్చోవాలి వదినా! ఈ మూడు సీట్లు మనవేగా!"


"ఓహో!.. అలాగా సరే!" అమాయకంగా ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అంది దీప్తి.


ముగ్గురూ కూర్చున్నారు. వారి వెనుక సీట్లో కిటికీ వైపు లావణ్య, ప్రక్కన హరికృష్ణ, అతని ప్రక్కన గిరిదాదాడీవాలా కూర్చున్నారు. బెల్ట్ పెట్టుకోమనే సందేశం. పైలెట్ పేరు, సహాయకుని పేరు, ఎయిర్ హోసెస్ట్ పేర్లు, వూర్లు వివరణం- సీనియర్ ఎయిర్ హోసెస్ట్ తొలుత హిందీలో, తర్వాత ఆంగ్లంలో తెలియజేసింది.


ఓ జూనియర్ ఎయిర్ హోసెస్ట్, బెల్టు పెట్టుకొనే విధానాన్ని, విమానంలో ఆక్సిజన్ కొరవడినప్పుడు లగేజ్ కేజ్ బాటమ్ నుంచి క్రిందికి జారే ఆక్సిజన్ మాస్క్ వివరాలను, ప్రమాదవశాత్తు విమానం నీటిపై దిగవలసి వచ్చినప్పుడు సీటు క్రింద వున్న రక్షా జాకెట్‍ను ఏ విధంగా ఉపయోగించాలనే విధానాన్ని, ఆయా పరికరములను చూపుతూ, ప్రసారానుసారంగా అభినయం చేసింది. చివరగా రెండున్నర గంటలలో విమానం ఢిల్లీ చేరగలదని చెప్పి, ప్రసంగాన్ని ముగించింది సీనియర్ ఎయిర్ హోసెస్ట్.


విమానం రన్‍వేలో ప్రవేశించి.. నేల విడిచి ఆకాశంలోకి ఎగిరింది. కొద్ది నిముషాల్లో ముఫ్ఫై వేల అడుగుల ఎత్తున విను వీధిలో.. దేశంలో ఉత్తరపు వైపున వున్న ఢిల్లీ వైపుకు గంటకు ఎనిమిది వందల మైళ్ళ వేగంతో ముందుకు సాగింది.


నవల ’వన్ ఇండియన్ గర్ల్’ చదువుతున్నాడు ఈశ్వర్. శార్వరీ కొంతసేఫు కిటికీ గుండా కనిపించే దూదిపింజల్లాంటి తెల్లని మేఘాలను చూచి తలను దీప్తి వైపు త్రిప్పింది.


దీప్తి స్పైస్ జెట్ మంత్లీ మ్యాగజైన్ చదువుతూ ఉంది. మధ్యమధ్యనా ఈశ్వర్ ముఖంలోకి చూచేది.

అతను ఎంతో ఏకాగ్రతతో నవలను చదువుతున్నాడు.


"వదినా!.. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా వుంది!" నవ్వుతూ చెప్పింది శార్వరి.


"ఎందుకు?"


"మనమంతా కలిసి విమానంలో వాణి అక్కయ్యను చూచేటందుకు ఢిల్లీకి వెళుతున్నందుకు.."


"అవును శారూ!.. నాకూ చాలా సంతోషంగా వుంది. బావా! మరి మీకు" ఈశ్వర్ చేతిపై తట్టి అడిగింది.

దీప్తి చేతి తాకిడికి.. ఈశ్వర్ చేతినుండి నవల క్రిందికి జారింది. దీప్తి క్రింద పడబోయిన నవలను తన చేతుల్లోకి తీసుకొంది.


నవ్వుతూ "సారీ బావా!" అంది.


చిరుకోపంతో దీప్తి ముఖంలోకి చూచిన ఈశ్వర్ ఆమె ముఖ భంగిమను చూచాడు. అప్రయత్నంగా అతని పెదవులపైన చిరునవ్వు.


"కావాలనే అంతా చేశావు కదూ!" మెల్లగా అడిగాడు.


"కాదు" బుంగమూతితో చెప్పింది దీప్తి.


"అబద్ధం చెప్పకూడదు"


"నేను చెప్పింది నిజమే బావా!" దీనంగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది. 


కొన్ని క్షణాల తర్వాత..

"మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది దీప్తి.


"ఏ విషయంలో!"


"మన ఈ ప్రయాణ విషయంలో"


కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయాడు ఈశ్వర్.

అతను మనస్సులో ’చాలాకాలం తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వాణి అక్కయ్యను చూడబోతున్నాను. ఈ మా ప్రయాణానికి దీప్తి కారణం. ఆమె అమెరికాలో వుండి ఉంటే యిలాంటి సుదినం వచ్చేది కాదు’ అనుకొన్నాడు ఈశ్వర్. 

ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూచాడు.

దీప్తి ఆనందంతో అందంగా నవ్వింది.

"దీపూ!.. నీవు చాలా మంచిదానివి. మా ఈ ప్రయాణానికి కారణం నీవే!"


"నేను కాదు బావా!.. మీ మంచి మనస్సు."


దీప్తి ముఖంలోకి ప్రీతిగా చూస్తూ ఆనందంగా నవ్వాడు ఈశ్వర్.

"మనం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నీ హాస్పిటల్ భవనం ఎంతో సుందరంగా వుంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాను. హాస్పిటల్ నేమ్ బోర్డు కూడా తయారుగా ఉంటుంది. తిరిగి వచ్చాక మంచిరోజు చూచుకొని పురోహితుని పిలిపించి సాంప్రదాయబద్ధంగా పూజను జరిపించి.. బోర్డును తగిలిద్దాం. మరోమాట.. నీకు సహాయంగా అనుభవం కల ఇరువురు నర్సులను కూడా ఏర్పాటు చేశాను. డాక్టర్‍గా.. ఈ ప్రాంతంలో నీకు మంచిపేరు రావాలని.. అందరి అభిమానాన్ని నీవు పొందాలని నేను కోరుకుంటున్నాను" ఎంతో ప్రీతిగా మెల్లగా చెప్పాడు ఈశ్వర్.


అయస్కాంతానికి అంకితం అయిన ఇనుప ముక్కలా ఆశ్చర్యానందాలతో అన్నయ్య మాటను.. దీప్తి ముఖ భంగిమలను చూచి శార్వరి ఆనందంగా కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ.. నవ్వుకొంది. ’భగవాన్ మా అన్నా వదినల వివాహం త్వరలో జరగాలి’ అనుకొంది శార్వరి.

రామయోగి.. తన కుమారుడు కళ్యాణ్‍తో ఫోన్‍లో దీప్తి ఫలానారోజున ఢిల్లీకి వస్తున్నదని, ఆమెతో మామిడీ ఊరగాయను పంపుతున్నానని చెప్పాడు.


కళ్యాణ్ ఈ విషయాన్ని తన అర్థాంగి వాణికి తెలియజేశాడు. ఎంతో ఆనందంతో వాణి గంతులేసింది.

వాణి, కళ్యాణ్‍లు దీప్తిని రిసీవ్ చేసుకొనేదానికి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‍పోర్టుకు వచ్చారు.


స్పెయిస్ జెట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్, దీప్తి, శార్వరీలు లగేజ్‍ని బెల్ట్ పైనుంచి తీసుకొని ట్రాలీలో వుంచుకొని విమానాశ్రయం బయటికి వచ్చాయి. వారి వెనకాల హరికృష్ణ, లావణ్యలు. ఎంతో ఆత్రంగా దీప్తి కోసం ఎదురు చూస్తున్న వాణి, కళ్యాణ్ ఆ ఐదుగురుని చూచి.. ఆశ్చర్యంతో తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.


"ఏమండీ!.. ఇది కలా నిజమా!" పారవశ్యంతో అడిగింది వాణి.


ఆ ఆశ్చర్యాన్నుంచి తేరుకొన్న కళ్యాణ్, వాణి భుజంపై చెయ్యివేసి..

"ఇది కల కాదు నిజమే!.. దీప్తితో అమ్మా, నాన్న ఈశ్వర్, శార్వరీలు కూడా వచ్చారు" అన్నాడు. వారినందరినీ చూస్తూ చేతులు జోడించాడు కళ్యాణ్.


తనవారినందరినీ చూచిన వాణి కళ్ళల్లో ఆశ్రువులు నిండాయి. వాణిని.. చూచిన దీప్తి తన చేతుల్లో ట్రాలీని వదలి పరుగున వాణిని సమీపించి..

ఆమె భుజాలను పట్టుకొని "వదినా!.. నేను గుర్తున్నానా మీ దీప్తిని. ఈ కన్నీళ్ళేమిటి వదినా!.. ఇప్పుడు మనమంతా ఎంతో సంతోషించవలసిన సమయం. అటు చూడండి. మిమ్మల్ని చూడాలని అమ్మా నాన్న, ఈశ్వర్ బావా, నీ చెల్లి శార్వరీ, నేను వచ్చాము" తన హ్యాండ్ కర్చీఫ్‍తో వాణి కన్నీటిని తుడిచింది దీప్తి.


దీప్తి వదలిన ట్రాలీని శార్వరి తన చేతులతో ముందుకు త్రోసికొని వాణిని సమీపించింది.

"అక్కా!.." గద్గద స్వరంతో శార్వరీ వాణిని కౌగలించుకొని భోరున ఏడ్చింది. చిన్న సోదరి కౌగిలిలో చిన్నపిల్లలా వాణి మారి శార్వరి భుజంపై వాలి కన్నీరు కార్చింది.


హరికృష్ణ, లావణ్య, ఈశ్వర్ వాణిని సమీపించారు. ఆ ముగ్గురి కళ్ళల్లో ఆశ్రువులు..

శార్వరి భుజంపైన వున్న తన తలను పైకెత్తి వాణి, తనకు చేరువైన ఆ ముగ్గురినీ చూచింది.

భావావేశంతో ముందుకు నడిచి వంగి తన తల్లిదండ్రుల పాదాలను తాకబోయింది. వాణి ఐదుమాసాలు గర్భవతి. కూతురి స్థితిని గమనించిన లావణ్య ఆమె భుజాలను పట్టుకొని ఆపి.. తన అక్కున చేర్చుకుంది.


భోరున ఏడుస్తూ వాణి "అమ్మా!.. నన్ను క్షమించగలవా!" దీనంగా అడిగింది.

ఆ మాట విన్న హరికృష్ణ, ఈశ్వర్ చలించిపోయారు. ఇరువురూ ఆమె భుజాలపై తమ చేతులు వుంచారు.


"అమ్మా!.. వాణీ.. ఏడవకు తల్లీ!.." గద్గద స్వరంతో చెప్పాడు హరికృష్ణ.


"అక్కా!.. ఏడవకు.. అందరూ మనల్నే చూస్తున్నారు. పద యింటికి పోదాం" అన్నాడు బొంగురుపోయిన కంఠంతో ఈశ్వర్.


కళ్యాణ్.. రెండు టాక్సీలలో వారి లగేజ్‍ను ఎక్కించాడు. అతనికి దీప్తి, శార్వరీలు లగేజ్‍ను అందించారు.


"తల్లీ వాణీ!.. నీవు ఒట్టి మనిషివి కాదురా!.. ఏడవకు, పదమ్మా!" లావణ్య వాణి భుజంపై చేయి వేసింది. ఇరువురూ టాక్సీని సమీపించారు. కళ్యాణ్ వెనుక డోర్‍ను తెరిచారు. ఇరువురూ లోన కూర్చున్నారు.


కళ్యాణ్ ఈశ్వర్‍ను సమీపించి "ఈశ్వర్! మీరు మామయ్యగారు, శార్వరి, దీప్తి ఆ టాక్సీలో రండి. డ్రైవర్‍కు చెప్పాను. అతను మా టాక్సీ వెనకాలే వస్తాడు సరేనా!" 


హరికృష్ణవైపు చూచి.. "మామయ్యగారు!.. మీరు టాక్సీలో కుర్చోండి" ముందువైపు డోర్ తెరిచాడు.

హరికృష్ణ టాక్సీలో కూర్చున్నాడు. మిగతా ముగ్గురూ వెనుక సీట్లో కూర్చున్నారు.


కళ్యాణ్ వెళ్ళి ముందున్న టాక్సీ ముందు సీట్లో కూర్చున్నాడు. రెండూ టాక్సీలు ఎయిర్‍పోర్ట్ నుండి బయలుదేరాయి.

"అమ్మా వాణీ!" కూతురు ముఖంలోకి చూచింది లావణ్య.

"ఏమ్మా!.."


"నీ ఆరోగ్యం బాగుంది కదా! లేడీ డాక్టర్‍ను కలిశావా!"

"ఇప్పటికి మూడుసార్లు కలిశానమ్మా! అంతా సవ్యంగా వుందని చెప్పింది."


"ఇప్పుడు ఎన్నోనెల!"

"ఐదవ నెలమ్మా!"


లావణ్య కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళనుండి కారిన కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి.

వాణి తల్లి ముఖంలోకి చూచింది. ’నా గురించి నా తల్లి బాధపడుతూ వుంది. వారికి చెప్పకుండా నేను తీసుకొన్న నిర్ణయం వారి దృష్టిలో, అందరి దృష్టిలో కూడా తప్పే.. మూడేళ్ళ తర్వాత ఈనాడు వీరినందరినీ ఇలా కలుస్తానని నేను ఏనాడూ వూహించలేదు. వీరంతా కలిసి వచ్చారంటే నా తప్పును ఒప్పుగా స్వీకరించి.. నన్ను క్షమించారన్నమాట. నా జీవితంలో ఈరోజు ఎంతో సుదినం. దేవుడు దయామయుడు. నా కోర్కెను తీర్చాడు’ అనుకొంది వాణి. కొన్ని క్షణాల తర్వాత..

"అమ్మా!.."


"ఏం తల్లీ!.."


"దీప్తి అమెరికా నుండి ఎప్పుడు వచ్చిందమ్మా!"


"మూడు నెలలు అయింది."


"దీప్తి మీతో ఎలా రాగలిగిందమ్మా!.. మామయ్య ఒప్పుకున్నాడా!.."


"వాడా!.. ఒప్పుకోవడమా!" విరక్తిగా నవ్వింది లావణ్య. "వాడి హృదయం నిండా మాపై పగ, కక్ష. వాడు తప్పుచేసి మమ్మల్ని విరోధులుగా భావిస్తున్నాడు" విచారంగా చెప్పింది లావణ్య.


’దీనికంతటికి కారణం నేనే కదా!’ అనుకొని విచారంగా తలను దించుకొంది వాణి.

తనమాటలు.. వాణి హృదయానికి బాధ కలిగించాయనై గ్రహించిన లావణ్య.

"వాడు తప్ప.. ఆ ఇంటివారు నా వదిన, దీప్తి, సీతాపతి అందరూ ఎంతో మంచివారు. ఈనాడు మేము ఇలా వచ్చేదానికి కారణం సీతాపతి, దీప్తి. నా మేనల్లుడు, మేనకోడలు."


"సీతాపతి బాగా ఎదిగిపోయి వుంటాడుగా. ఏం చేస్తున్నాడమ్మా!"


"వైజాగ్‍లో బి.టెక్ చదువుతున్నాడు. వాడు చాలా మంచివాడు. చిన్న వయస్సులోనే వాడికి మీ తాతయ్యలా గొప్ప వ్యక్తిత్వం, ఎంతో బంధుప్రీతి" ఆనందంగా చెప్పింది లావణ్య.


శార్వరికి, సీతాపతికి వయస్సులో ఎంత వ్యత్యాసమమ్మా!" అడిగింది వాణి.


"ఒకటిన్నర సంవత్సరం.. అవును ఇప్పుడు వారి వయస్సును గురించి ఎందుకు అడిగావు?" చిరునవ్వుతో అడిగింది లావణ్య.

వాణి తల్లి ముఖంలోకి చూచింది. కొన్నిక్షణాలు తర్వాత.. "నా మూలంగా విడిపోయిన మన రెండు కుటుంబాలు, బాంధవ్యాలను కలుపుకొని అందరూ పూర్వంలా ఆనందంగా వుండాలనేది నా కోర్కె" నవ్వుతూ చెప్పింది వాణి.


"నీ కోర్కె.. నా, మీ నాన్నగారి అభిప్రాయం. కానీ ఆ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా వుందో మనకు తెలియదు కదా!" సాలోచనగా చెప్పింది లావణ్య.

మౌనంగా కూర్చొని వున్న కళ్యాణ్ వైపు చూచింది లావణ్య.

"అల్లుడుగారూ!.. మా సంభాషణ మీకు!.." లావణ్య పూర్తి చేయకమునుపే..


"వినేదానికి చాలా ఆనందంగా వుంది అత్తయ్యగారూ!.. మీ మామగారి మనస్తత్వాలను గురించి వాణి నాకు చెప్పింది. మేము మిమ్మల్ని తలచుకోని రోజంటూ లేదంటే మీరు నమ్మగలరా!" చిరునవ్వుతో చెప్పాడు కళ్యాణ్.


లావణ్య నవ్వుతూ అల్లుడు కూతురి ముఖాల్లోకి చూచింది. ’ఈడు జోడు బాగుంది. నా అల్లుడు మంచి అందగాడు’ అనుకొంది.


వెనుక సీటు విశాలంగా లేని కారణంగా ఈశ్వర్ ఎడమవైపు డోర్ వైపున ముడుచుకొని కూర్చున్నాడు. మధ్యన విమానంలో లాగే దీప్తి. రోడ్డు మిట్టపల్లాల్లో దీప్తి చేయి తన చేతికి తగలడం.. నడుముకు క్రింది భాగం.. ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడం, ఈశ్వర్‍కు ఇబ్బందిని కలిగించాయి.

"అభీకెతనా దూర్ హై డ్రైవర్ సాబ్!" అడిగాడు ఈశ్వర్.


"బహుత్ దూర్ హై సాబ్!" అన్నాడు డ్రైవర్.

ఓరకంట తనను దీప్తి చూచే చూపులు ఈశ్వర్‍లోని సహనానికి భంగం కలిగిస్తున్నాయి.

"బహూత్ మీన్స్.. కెతిన్ కిలోమీటర్!" అసహనంగా అడిగాడు ఈశ్వర్.


"ఖరీబ్ దస్ కిలోమీటర్!" చెప్పాడు డ్రైవర్.

"అభీ దస్ కిలోమీటర్!.." ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్.


"హా జీ!.."

"బావా!.." దీర్ఘం తీస్తూ పిలిచింది దీప్తి.

"ఏమిటి?.." అసహనంగా అడిగాడు ఈశ్వర్.


"మనం మాట్లాడితే డ్రైవర్ అటెంషన్ మిస్ అవుతుంది బావా!.."

"అన్నయ్యా!.. ఎలా నడపాలో అతనికి తెలుసు కదా!.." అంది శార్వరి.


దీప్తి, శార్వరీల ముఖంలోకి చురచురా చూచాడు ఈశ్వర్.

పదిహేను నిమిషాల తర్వాత.. రెండు టాక్సీలు ఓ మల్టీస్టోరెడ్ ఫ్లాట్స్ ముందు ఆగాయి. అందరూ టాక్సీల నుంచి దిగారు.

కళ్యాణ్, ఈశ్వర్ లగేజీలను దించారు. కళ్యాణ్ డ్రైవర్లకు టాక్సీ ఫేర్ ఇచ్చాడు. వారు వెళ్ళిపోయారు.

లగేజీనంతా లిఫ్టులో పెట్టి కళ్యాణ్ రెండవ అంతస్తులో వున్న తన ఫ్లాట్ ముందు వుంచి తలుపు తీసి క్రిందికి వచ్చాడు.


అందరూ రెండవ అంతస్థులోని వాణి, కళ్యాణ్ త్రిబుల్ బెడ్‍రూమ్స్ ఫ్లాట్‍లో ప్రవేశించారు. వెయిన్ని మూడువందల యస్.ఎఫ్.టి ఆ ఫ్లాట్ విస్తీర్ణం. మూడు బెడ్ రూంలకు అటాచ్‍డ్ బాత్‍రూమ్స్, విశాలమైన హాలు, డైనింగ్ రూమ్.

కాళ్ళు కడుక్కొని లావణ్య ఇంట్లోని అన్ని భాగాలను చూచింది. హరికృష్ణ కూడా ఆమె వెనకాలే తిరిగాడు.


"ఇల్లు బాగుంది కదండీ!.." అడిగింది లావణ్య.

"చాలా బాగుంది" చెప్పాడు హరికృష్ణ.


వంటింట్లో అందరికీ కాఫీ తయారుచేయడాని వెళ్ళిన వాణి వెనకాలే దీప్తి, శార్వరీ కూడా వెళ్ళారు.

"అక్కా!.. మేము ఇక్కడ వుండబోయే రోజుల్లో.. ఇంటి పనులన్నీ నేను, దీప్తి వదినా చూసుకుంటాము. నీవు నాకు డైరెక్షన్ చెయ్యి.. సరేనా!" నవ్వుతూ చెప్పింది శార్వరి.


"అవును వదినా!.. శారూ చెప్పిన మాటను మీరు వినాలి" చిరునవ్వుతో చెప్పింది దీప్తి.

"సరేలేవే.. అలాగే" అంది వాణి.


స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్‍పై వుంచింది వాణి.

"మిగతా పని మేము చేస్తాము. మీరు వెళ్ళి అత్తయ్యా మామయ్యలతో మాట్లాడండి" అంది దీప్తి.

హరికృష్ణ, లావణ్యలు హాల్లోని సోఫాలో కూర్చున్నారు.

ఈశ్వర్ ఇల్లంతా తిరిగి చూచి వంటగదిలో ప్రవేశించాడు.

"బావగారూ! ఇక్కడ మీకేం పని? వెళ్ళి హాల్లో కుర్చోండి. ఐదు నిముషాల్లో అద్భుతమైన కాఫీని అందిస్తాం. ఏం శారూ!" ఓరకంట ఈశ్వర్‍ను చూస్తూ చెప్పింది దీప్తి.


"అవును వదినా!" ఈశ్వర్ ముఖంలోకి చూచి నవ్వుతూ చెప్పింది శార్వరి.

"వదినా మరదళ్ళు ఒకేమాట మీద వున్నారు. ఈశ్వర్, ఏమిటి విశేషం!" నవ్వుతూ చెప్పింది వాణి.

"అక్కా!.. వదిన చాలామంచిది. అదే విశేషం!" నవ్వింది శార్వరి.


చురచురా ఈశ్వర్ ముఖంలోకి చూస్తున్న దీప్తి చూపులను గమనించింది వాణి. బదులుగా ఈశ్వర్ పెదాలపైన చిరునవ్వు. అతన్ని చూచింది. ఆమెకు కలగవలసిన అనుమానమే కలిగింది.

"వాళ్ళు కాఫీ తెస్తారట రా. మనం హాల్లోకి పోదాం" ఈశ్వర్ చేతిని పట్టుకొంది వాణి. ఇరువురూ హాల్లోకి వచ్చారు. కళ్యాణ్ "వాణీ! ఇలారా" అని పిలిచాడు.

వాణి అతన్ని సమీపించింది.


"చేతులు జోడించి అమ్మా నాన్నలవైపు తిరుగు."

వాణి అతని అభిప్రాయాన్ని గ్రహించి కళ్యాణ్ చెప్పినట్లుగానే చేసింది. కళ్యాణ్ చేతులు జోడించాడు. ఇరువురూ హరికృష్ణ లావణ్య వైపుకు తిరిగారు.


"అత్తయ్యా!.. మామయ్యా!.. నా మూలంగా వాణి తప్పుచేసింది. మీ మనస్సులను యిరువురం నొప్పించాము. మీరు పెద్దవారు. మా తప్పును మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆనందంగా మాతో కలిసి ఉండండి" ఎంతో వినయంగా చెప్పాడు కళ్యాణ్. 

హరికృష్ణ, లావణ్యలు లేచి వారిని సమీపించారు. మోడ్చిన వారి చేతులను విడదీశారు.

"ఇప్పుడు మీమీద మాకు ఎలాంటి కోపం లేదు అల్లుడుగారు. మీ ఇరువురినీ చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా వుంది" చెప్పాడు నవ్వుతూ హరికృష్ణ.


"అవునమ్మా!" అంది లావణ్య చిరునవ్వుతో.


ప్లేట్లో కాఫీ గ్లాసులను పెట్టుకొని ముందు దీప్తి, వెనుక శార్వరీ హాల్లోకి వచ్చారు. ముందు హరికృష్ణకు, లావణ్యకు, కళ్యాణ్‍కు, వాణీకి కాఫీ గ్లాసులను అందించింది దీప్తి.

"శారూ!.. ఈ గ్లాసును మీ అన్నయ్యగారికి ఇవ్వు!" అంది దీప్తి.


క్షణం తర్వాత.. "చెల్లెలంటే వారికి అభిమానం జాస్తి కదా!.. అందుకే శారూను ఇవ్వమంటున్నా!"

ఓరకంట ఈశ్వర్‍ను చూస్తూ చెప్పింది దీప్తి.

శారూ వెంటనే గ్లాసును ఈశ్వర్‍కు అందించింది.

"వదినా!.., ఇచ్చేశాను" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.


"గుడ్ శారూ!" నవ్వుతూ అంది దీప్తి.

కాఫీని సిప్ చేసిన హరికృష్ణ..

"కాఫీ చాలా బాగుందమ్మా! కలిపింది ఎవరు?" అని అడిగాడు.

"నేను మామయ్యా!" వెంటనే చెప్పేసింది దీప్తి.


"నీవేనా!" హరికృష్ణ అడిగాడు.

"అవును" అంది దీప్తి.

"అందుకే అంత బాగుంది" నవ్వాడు హరికృష్ణ.

కల్మషం లేని వారి నవ్వు ముఖంలోకి చూచి.. అందరూ నవ్వారు ఒక్క ఈశ్వర్ తప్ప.

నవ్వును ఆపి.. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూచారు.


"ఏరా నీకు నవ్వు రాలేదా!" అడిగింది వాణి.

"వచ్చింది. కానీ నవ్వలేదు."

"ఎందుకని?"

"మీకందరికీ కాస్త వ్యత్యాసంగా కనుపించాలని!" నవ్వాడు ఈశ్వర్ దీప్తిని చూస్తూ కళ్ళెగరేస్తూ.


పరవశంతో దీప్తి నవ్వుతూ తలను ప్రక్కకు త్రిప్పుకొంది.

వాణి ఆ ఉభయుల ముఖ భంగిమలను గమనించింది. ఆమెకు నాలుగేళ్ళ క్రిందటి తన కళ్యాణ్ ప్రేమకలాపం గుర్తుకు వచ్చింది. ఆనందంతో నవ్వుంది.

మధ్యాహ్న భోజనానికి కావలసిన వంటకాలను లావణ్య తయారుచేసింది. దీప్తి, శార్వరీలు ఆమెకు సహాయకులుగా వర్తించారు. భోజన సమయంలో.. కళ్యాణ్ తండ్రి తన చేతికి ఇచ్చిన మామిడి ఊరగాయల బాటిల్స్ ను డైనింగ్ టేబుల్ పైన వుంచి..


"అన్నయ్యగారూ!.. బాబాయ్ గారూ ఈ ఊరగాయలను నాతో మీకోసం పంపారు వేసుకోండి" ప్రీతిగా చెప్పింది దీప్తి.

ఆమె కలుగోలుపుతనానికి కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు.

"నీ చేత్తోనే అందరికీ వడ్డించమ్మా!" అన్నాడు కళ్యాణ్.


అందరికీ వడ్డించి చివరగా ఈశ్వర్‍ను సమీపించింది.

"బావా!.. మీకు.."

"వెయ్యి దీపు!"


’దీపు’ అన్న ఈశ్వర్ పదాన్ని విన్న వాణి ఆ ఇరువురి ముఖాల్లోకి పరీక్షగా చూచింది. ఆమెకున్న అనుమానం తీరిపోయింది. సరదా సంభాషణలతో అందరూ ఆనందంగా భోజనం చేశారు.

ఆ రాత్రి భోజనానంతరం.. లావణ్య, వాణి ఓ గదిలో, దీప్తి శార్వరీ మరో గదిలో, కళ్యాణ్ ఈశ్వర్ మూడవ గదిలో హరికృష్ణ హాల్లో పడుకొన్నారు.


తల్లీ, కూతురు గతాన్ని గురించి, ప్రస్తుతంలో తమ రెండు కుటుంబాల మధ్యన వున్న భావాలను గురించి, ప్రజాపతి, ప్రణవి, దీప్తి, సీతాపతుల అభిప్రాయాలను గురించి, దీప్తి, సీతాపతుల పట్ల తనకు తన భర్తకు వున్న నమ్మకాన్ని గురించి, దీప్తికి ఈశ్వర్‍పైన, సీతాపతికి శార్వరి పైన ఉన్న ప్రేమాభిమానాలను గురించి వివరంగా మాట్లాడుకొన్నారు.


అంతా విన్న వాణి "అమ్మా!.. నేడు నా జీవితంలో గొప్ప పర్వదినం. నాలుగేళ్ల తర్వాత నీ ప్రక్కన పడుకొని నీ చేతిని నాపైన వేసికొని నా చిన్ననాటిలా.. నీ మాటలను వినే అవకాశాన్ని నాకు ఆ సర్వేశ్వరుడు కల్పించాడు. నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా మనస్సుకు శాంతిగా వుందమ్మా!" తన తలను తల్లి ఎదకు ఆనించి ఆమె వీపుపై చేయి వేసి చిన్నపిల్లలా మారిపోయింది వాణి. కూతురి తలను తన హృదయానికి ప్రేమతో హత్తుకొంది లావణ్య. "పండంటి మగబిడ్డకు తల్లివి అవుతావమ్మా" మనసారా దీవించింది.

"అమ్మా! ఓ మాట అడగనా!.."

"అడుగు తల్లీ!.."


"నాకు మన ఇంటికి రావాలని ఉందమ్మా!"

"నీ కాన్పు మన ఇంట్లోనే జరుగుతుందమ్మా! ఎవరు ఏమనుకున్నా నేనూ, మీ నాన్న లెక్కచేయము. ఇది మా స్వవిషయం. ఇందులో జోక్యం కల్పించుకొనే హక్కు ఎవరికీ లేదు. నీ కోర్కె తప్పక తీరుతుందమ్మా. నిశ్చింతగా వుండు" ఎంతో ప్రీతిగా చెప్పింది లావణ్య.


"అమ్మా మరో మాట!.."

"ఈశ్వర్, దీప్తిలు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారమ్మా ఆ విషయం వారిని చూచిన తొలిగంటలోనే నాకు అర్థం అయింది. వారిరువురికి వివాహం జరిపిస్తే బాగుంటుందమ్మా!"


"నీవు గ్రహించింది నిజం. మీ అత్తయ్య ప్రణవి నిర్ణయమూ అదే. ఈశ్వర్, దీప్తీల వివాహం త్వరలో తప్పక జరుగుతుంది. అంతేకాదు నాకు కాబోయే అల్లుడు నా మేనల్లుడు సీతాపతే. వాడికి శార్వరి అంటే ఎంతో ఇష్టం. మన కుటుంబ సభ్యులందరి మీదా వాడికి ఎంతో గౌరవం. మంచి మనస్సు వున్న వారికి కొంత ఆలస్యం అయినా, వారి మంచి సంకల్పాలు తీరుతాయమ్మా! పొద్దుపోయింది నిద్రపో!" తన మనస్సులోని అన్ని విషయాలను పెద్ద కూతురితో వివరంగా చెప్పింది లావణ్య.


నాలుగేళ్ల తర్వాత తల్లితో.. ఆనాటి ప్రేమాభిమానాలను చూచి వాణి సంతోషంతో కళ్ళు మూసుకొంది.

ఒకే మంచంపై పడుకొన్న కళ్యాణ్, ఈశ్వర్‍లు మంచి స్నేహితుల్లా ఉద్యోగాల గురించి, భవిష్యత్ జీవితానికి సంబంధించి వారి మనసుల్లో వున్న అభిప్రాయాలను గురించి మాట్లాడుకొన్నారు.


"బావా!.. అన్నయ్య దినకర్ అమెరికా నుండి రాడు. ఒకవేళ.. రావాలనుకొన్నా అతని నిర్ణయాన్ని వదిన అంగీకరించదు. వారి ఇద్దరు పిల్లలు పుట్టింది అక్కడనే. అమ్మా నాన్నలు మమ్మల్ని ఎంతో ఆదరాభిమానాలతో పెంచారు. మేము కోరిన రీతిగా చదివించారు. వారు మాపట్ల చేయవలసిన ధర్మాన్ని చక్కగా పాటించారు. రోజురోజుకు వారికి వయస్సు పెరుగుతూ వుంది. అన్నయ్య వదినల తత్వం వారికి ఎంతో బాధాకరం. ఆ కారణంగానే నేను వారితోటే వుండాలని నిర్ణయించుకొన్నాను. వారి ఆనందమే నా ఆనందం. వారి సంతోషం కోసం.. వారి తనయుడిగా నేను ఏమైనా చేసేదానికి సంసిద్ధం. అదే వారిపట్ల నా ధర్మం" ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్.


"ఈశ్వర్!.. మీ అక్కయ్య నాతో ఎన్నోసార్లు చెప్పింది నీ మంచితనాన్ని గురించి. తల్లితండ్రుల ఆనందం కోసం నీవు తీసికొన్న నిర్ణయాన్ని గురించి. అప్పట్లో ఆ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. కానీ.. నేడు నిన్ను చూశాక.. నీ మాటలను విన్నా తర్వాత.. నీ నుండి నేను కొంత నేర్చుకొన్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ఈశ్వర్. నేను మరచిన ధర్మాన్ని నాకు గుర్తుచేశావు" కాస్త ఆవేశంగానే చెప్పాడు కళ్యాణ్.


కొన్నిక్షణాల తర్వాత మంచం నుంచి లేచి హాల్లోకి నడిచాడు. కళ్ళు మూసుకొని వున్న హరికృష్ణను పరీక్షగా చూచి దుప్పటిని కాళ్ళవరకూ సవరించి గదిలోనికి వెళ్ళిపోయాడు కళ్యాణ్.

మంచంపై పడుకొని పైన తిరుగుతున్న ఫ్యాన్‍ను తదేకంగా చూస్తూవుంది దీప్తి. దాదాపు పదినిముషాలుగా మౌనంగా వున్న దీప్తిని చూచి శార్వరి..

"వదినా!.."


దిగాలుపడి శార్వరి ముఖంలోకి చూచింది దీప్తి.

"ఏ విషయాని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్. నాతో చెప్పవా నేనేదైనా సాయం చేయగలనేమో!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.


"శారూ!"

"మా నాన్న గుర్తుకు వచ్చాడు!"


"మామయ్యనా!.."

"అవును.."


"ఈ సమయంలో ఆయన గుర్తుకు రావడం ఏమిటి? రావలసింది మా అన్నయ్య కదా!" నవ్వింది శార్వరి.

"అది కాదే!.. మనం తిరిగి వెళ్ళిన తర్వాతనే నా పెళ్ళిచూపులు.."


"ఎవరితో?.."

"పరంజ్యోతి కొడుకు దివాకర్‍తో!"


"నీవు ఒప్పుకొన్నావా?"

"లేదు.. అంతా ఆయన ఇష్టమే!"


"నేను మా అన్నయ్యతో చెప్పనా వదినా!" క్షణాం తర్వాత "శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని లేపుకెళ్ళినట్లు నిన్ను లేపుకొని రమ్మని" గలగలా నవ్వింది శార్వరి.

"శారూ!.. నేను బాధపడుతుంటే.. నీవు ఎలా నవ్వుతున్నావే!" దీనంగా శార్వరి ముఖంలోకి చూచింది దీప్తి.


"వదినా!.. నీ మనస్సులో మాటను అన్నకు చెప్పు. పంతానికి దిగితే మా అన్నయ్య కూడా తక్కువ వాడు కాదు. ఇప్పుడు నీ చేతిలో మంచి అవకాశం వుంది. రేపు నీ స్నేహితురాలి పెళ్ళి కదా!.. నీతో అన్నయ్యను తోడుగా తీసుకొని వెళ్ళు. మార్గంలో నీవు చెప్పదలచుకొన్న విషయాన్ని అన్నయ్యతో చెప్పేసేయి."


"ఆయన నాతో వస్తాడా?"

"నీవు మా అమ్మను అడుగు. అమ్మ మాటను అన్నయ్య ఎన్నడూ కాదనడు సరేనా!"


కొన్నిక్షణాలు ఆలోచించింది దీప్తి. "ఆఁ నీ ఐడియా బాగుంది. అలాగే చేస్తాను" ఆనందంగా చెప్పింది.

"వదినా!.. నేను నీ శ్రేయోభిలాషిని."

"ఆ శారూ!.. నిజంగానే!"

"సరే వదినా!.. ఇక నిద్రపో!.. నాకూ నిద్ర వస్తుంది!"

ఇరువురూ కళ్ళు మూసుకున్నారు.


హాల్లోకి వచ్చి హరికృష్ణను చూచి తిరిగి వెళుతున్న కళ్యాణ్ కాలికి సోఫా తగిలింది. హరికృష్ణ కళ్ళు తెరిచాడు. అతన్ని చూచాడు. ’చాతుర్‍వర్ణా మయాసృష్ట్యా’ అన్నారు గీతా కృష్ణుడు. మానవ జీవిత గమనాన్ని సక్రమంగా.. శాంతియుతంగా సాగేటందుకు ఆచర్య వారి సంకల్పరీతిగానే జరుగుతూ వుందేమో!.. ఏది ఏమైనా.. కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం కలవాడు. తాను చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. చూస్తుంటే నా బిడ్డ వాణి అన్నివిధాలా ఆనందంగా వున్నట్లుంది. ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలి! సంతోషం’ అనుకొన్నాడు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


48 views0 comments

Comments


bottom of page