top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 16



'Neti Bandhavyalu Episode 16'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 25/01/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 


ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్నా, బావ ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. 


శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి. 


వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 


సీతాపతి లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు.


వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది.

తనను క్షమించమని తల్లిదండ్రులను కోరుతుంది వాణి.

అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య.



ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 16 చదవండి..


మరుదినం ఉదయం ఆరున్నరకు తల్లి ఆదేశం ప్రకారం ఈశ్వర్, దీప్తిని తన స్నేహితురాలు డాక్టర్ రాధ వివాహానికి కార్లో బయలుదేరారు.

బయలుదేరబోతున్న దీప్తిని పిలిచింది వాణి.

"ఏం వదినా!" వాణిని సమీపించింది దీప్తి.

వాణి నవ్వుతూ "మంచి అవకాశం... సద్వినియోగం చేసుకో మరదలా!" దీప్తి బుగ్గను సున్నితంగా గిల్లింది వాణి.


సిగ్గుతో తలదించుకొని ’సరే’ అన్నట్లు తలాడించి హాల్లోకి వచ్చి అందరికీ చెప్పి బయలుదేరింది దీప్తి.

ముందుసీట్లో ఈశ్వర్ ప్రక్కన కూర్చొని వున్న దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూచింది. అతను దీక్షగా ముందున్న రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు. ఆ ఉదయం అతను తలస్నానం చేశాడు. శిరోజాలు నొసటిపైకి జారి మెల్లగా ఏసీ కార్లో అటూ ఇటూ కదులుతున్నాయి. చక్కటి నాసిక, విశాలమైన కళ్ళు నొసలు, కళ్ళకు అద్దాలు బాలీవుడ్ హీరోలా ఠీవీగా కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు ఈశ్వర్.


’మనిషి మంచి అందగాడు... అందుకే పొగరు... పదిహేను నిముషాల ముందు బయలుదేరాము. నోరు తెరిచి ఒక్కమాట మాట్లాడ్డేం!’ అనుకొంది దీప్తి.


బయలుదేరే ముందు వాణి తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పెదవులపైన చిరునవ్వు. గొంతు సవరిస్తూ ఓరకంట ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఈశ్వర్ దృష్టి యధాతథంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతూ వుంది దీప్తి. సీట్లో అటూ ఇటూ కదిలింది. ఆమె స్థితిని గమనించిన ఈశ్వర్...

"ఏం!... ఏదైనా సమస్యా!..." అడిగాడు.


"అవును..."

"ఏమిటిది?"

"మీరే!..." వెంటనే చెప్పేసింది దీప్తి.


"నేనా!..." క్షణంసేపు ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.


"అవును!... అవును!..."

"నేనేం చేశాను?"

"నాతో మాట్లాడ్డం లేదుగా!"

ఆశ్చర్యంగా చూచాడు దీప్తి ముఖంలోకి ఈశ్వర్.

చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ చురచురా చూచింది దీప్తి.


"డ్రైవింగ్ చేస్తున్నాగా దీపూ!" అనునయంగా చెప్పాడు.

"డ్రైవింగ్ చేస్తే మాట్లాడకూడదా?"

"మాట్లాడకూడదు!"

"మాట్లాడవచ్చు.... మనస్సు వుంటే...!"

"అంటే.... నాకు మనస్సు లేదంటావా!" ఆశ్చర్యంగా దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్.


దీప్తి చిరుకోపంతో ముఖాన్ని చిట్లించి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ... "నాకు కనబడటం లేదు" అంది.

ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి నిట్టూర్చి "నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు?"

’ఓ నా తింగరి బావా! నేను చెబితే గాని నీకు అర్థం కాదా! నా మాటలు, ముఖ భంగిమలు, చూపులు నీకు అర్థం కాలేదా! లేక నన్ను ఆటపట్టించేదానికి నటిస్తున్నావా!’ అనుకొంది దీప్తి.

"అడిగింది నిన్నే! ఏం కావాలి? అడుగు!" ఈశ్వర్ ఆ మాటల్లో దీప్తికి అధారిటీ వినిపించింది.

చిరునవ్వుతో ఈశ్వర్ ముఖంలోకి చూచింది.

"అడగనా!" అంది.


"అడుగు"

"నాకు... నీవు కావాలి" నవ్వుతూ నాలుకను బయటికి తీసి పెదవుల మధ్యన ఆడించింది.


ఈశ్వర్ క్షణంసేపు దీప్తి ముఖంలోకి చూచి చిరునవ్వుతో ముఖాన్ని రోడ్డు వైపుకు త్రిప్పాడు.

"నేను మనవూరికి తిరిగి వెళ్ళగానే నాకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసివున్నారు మీ మామగారు!" విచారంగా చెప్పింది దీప్తి.


"వాడెవడు?" ఆవేశంగా అడిగాడు ఈశ్వర్.

"పరంజ్యోతి కొడుకంట!"


"ఆ పెళ్ళిచూపులు జరుగవు" మెల్లగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్.

"బావా!..." ఆశ్చర్యంతో అంది దీప్తి.


"అవును... వాడు మీ ఇంటికి నిన్ను చూచేదానికి రాబోడు."

"బావా!... ఎలా ఆపగలవు?"

"వెయిట్ అండ్ సీ!"

"బావా!"

"ఏం... నీకు నా మాట మీద సందేహమా!"

"అ...వు...ను" మెల్లగా అంది దీప్తి.


"నా మాట నమ్ము. సందేహపడకు దీపూ!" తన ఎడం చేతిని దీప్తి కుడిచేతిపై వుంచాడు ఈశ్వర్.


దీప్తి ఆనందంగా నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది.

ఈశ్వర్ తన ఎడంచేతిని దీప్తి తలపై వుంచి సున్నితంగా కదిలించాడు. "నీవు... నాదానివి" అన్నాడు మెల్లగా.


ఆ మాటలు విన్న దీప్తి పరవశంతో కళ్ళు మూసుకొంది.

ఈశ్వర్ తన ఎడమ చేతితో దీప్తి కుడిచేతిని పట్టుకొన్నాడు. సున్నితంగా చేతిని నొక్కి వదిలేశాడు. దీప్తి ముఖంలోకి చూచాడు. ఆమె ఆనందంగా కళ్ళు మూసుకొని ఉంది. కొన్ని క్షణాల్లో వారి కారు రాధ... వివాహం జరిగే కళ్యాణ మండపం ముందు ఆగింది.


ఇరువురూ కారునుండి దిగారు. మండపంలోకి ప్రవేశించారు. రాధ వున్న గదిలోనికి వెళ్ళరు. పెండ్లి కూతురు అలంకరణలో వున్న రాధ... దీప్తిని చూచింది. లేచి... పరుగున వచ్చి దీప్తిని కౌగలించుకొంది. 


"రావేమో అనుకొన్నానే!" అంది.

"రాకుండా ఎలా వుంటానే. వస్తానని చెప్పానుగా! అటు చూడు..."

ఈశ్వర్‍ను చూపుతూ...

"నా బావ... ఈశ్వర్ అడ్వకేట్" నవ్వుతూ చెప్పింది దీప్తి.


ఈశ్వర్‍ను చూచి రాధ చేతులు జోడించింది.

"నమస్కారమండీ!" అంది.

నవ్వుతూ "నమస్తే..." అన్నాడు ఈశ్వర్.

దీప్తి చెవి దగ్గరకు నోటిని చేర్చి "దీపూ!... మీ బావ చాలా అందంగా వున్నాడే!" ఈశ్వర్ విషయంలో తనకు కలిగిన భావాన్ని నిస్సంకోచంగా వెల్లడించింది రాధ.


ముహూర్త సమయం ఆసన్నమయింది. వధూవరులు వేదికపైన కూర్చున్నారు. పురోహితులు మంత్రాలు చదవడం ప్రారంభించారు. పెద్దలందరూ మాంగల్యాన్ని తాకారు. దీప్తి, ఈశ్వర్‍లు కూడా తాకారు.


’ఇలా నా మెడకు కట్టబోయే మంగళసూత్రాన్ని మా పెద్దలందరూ ఎప్పుడూ తాకుతారో!’ ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ అనుకొంది దీప్తి.


మాంగల్యధారణ జరిగింది. వచ్చిన వారంతా అక్షింతలతో దంపతులను దీవించారు. దీప్తి తాను తెచ్చిన గిఫ్టును రాధకు అందించింది. భోజనానంతరం రాధ ఆమె భర్త త్రివిక్రమ్‍కు చెప్పి ఈశ్వర్, దీప్తిలు బయలుదేరారు.


ఈశ్వర్ కారును నడుపుతున్నాడు చిరునవ్వుతో దీప్తి ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ వుంది. అది గమనించిన ఈశ్వర్...

ఏంటి దీపూ!..... అలా చూస్తున్నావ్!" అడిగాడు చిరునవ్వుతో తనూ నవ్వుతూ...

"ఏమీ లేదన్నట్లు తలూపింది దీప్తి.

"నీవు నవ్వితే... చాలా బాగుంటావు దీపు."

"అలాగా"

"అవును... నీపై వరుసన వున్న మధ్య రెండు పళ్ళు పెద్దగా మల్లెమొగ్గల్లా నీవు నవ్వినప్పుడు మెరుస్తాయి."

"అయితే... మిగతా పళ్ళల్లో మెరుపు లేదా" అమాయకంగా అడిగింది.


"ఉంది దీప్తీ ఆ రెండు కాస్త వెడల్పు కాబట్టి అవి ప్రత్యేక ఆకర్షణ."

రోడ్డు ప్రక్కన వరుసగా ఉన్న బంగారు షాప్స్ ను చూచింది దీప్తి.

"బావా!.... కారును ఆపండి"


"ఎందుకు?"

"చిన్నపని వుంది"

"ఎక్కడ?"

"ఆ షాపులో" ఎడమచేతి చూపుడు వ్రేలితో బంగారు షాపును చూపింది దీప్తి.


ఈశ్వర్ కారును ఆపాడు. ఇరువురూ కారు దిగి షాపులో ప్రవేశించారు.

"ఏం కొనాలి దీపూ!..."

"కాసేపు ఆగండి సార్!... మీకే తెలుస్తుంది."


గోల్డ్ రింగ్స్ వున్న కౌంటర్ వద్దకు వెళ్ళి రింగ్స్ ను చూపమని అడిగింది దీప్తి. కౌంటర్‍లో వున్న వ్యక్తి రింగ్స్ ను చూపించాడు. ఐదారు చూచి ఒకదాన్ని చేతికి తీసుకొని....

"బావా!... మీ చేతిని ఇలా ఇవ్వండీ."

"నాకా!..."


"మాట్లాడకూడదు. ఓన్లీ యాక్షన్ ప్లీజ్" చిరునవ్వుతో చెప్పింది దీప్తి. తన కుడిచేతిని దీప్తి కుడిచేతికి అందించాడు ఈశ్వర్.

ఈశ్వర్ చేతి మధ్య వేలుకు వుంగరం వున్నందున... తన చేతిలోని వుంగరాన్ని చూపుడు వ్రేలికి తొడిగింది. అది ఆ వ్రేలికి ఖచ్చితంగా సరిపోయింది.

"బాగుందా! బావా!..."

"చాలా బాగుంది."

"బిల్ ప్లీజ్!" సెల్స్ మేన్‍తో చెప్పింది దీప్తి.


వేయింగ్ మిషన్‍పై వుంగరాన్ని వుంచి.... బరువును చూపించి ఐదునిముషాల్లో బిల్లును వుంగరాన్ని వుంచిన చిన్నబాక్స్ ను సెల్స్ మెన్ దీప్తికి అందించాడు. కార్డు ద్వారా పేమెంట్ చేసింది దీప్తి.


తననే పరీక్షగా మాట్లాడకుండా చూస్తున్న ఈశ్వర్‍ను చూచి....

"థాంక్యూ బావా!... నా పని అయిపోయింది పదండి" నవ్వుతూ చెప్పింది దీప్తి.

ముందు ఈశ్వర్ వెనుక దీప్తి నడిచి కారును సమీపించి కూర్చున్నారు. ఈశ్వర్ కారును స్టార్ట్ చేయబోయాడు.

"బావా!... వన్ మినిట్!"

"వన్ మినిట్ ఆ!..."

"అవును..."

"వన్ మినిట్‍లో ఏం చేస్తావ్!"


పాకెట్‍ను విప్పి వుంగరాన్ని చేతికి తీసుకొంది దీప్తి.

"మీ కుడిచేతిని చూపించండి."

ఆశ్చర్యంగా చూచాడు ఈశ్వర్.

"చూపించండి మహాశయా!" చిరునవ్వుతో కోరింది దీప్తి.

ఈశ్వర్ తన కుడిచేతిని ముందుకు సాచాడు.

తన చేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ కుడిచేతి చూపుడు వేలికి తొడిగింది.


"ఇక పదండి... స్టార్ట్!" గలగలా నవ్వింది దీప్తి.

ఆమె చర్యకు ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు.


’నా చేతి వ్రేలికి యాభై ఆరువేల డైమండ్ రింగ్‍ను తొడిగింది ఇది నేను ఆమెకు ’నీవు నా దానివి’ అని చెప్పిన దానికి నాకు బహుమానమా! మరి తనకు నేనూ ఏదో ఒకటి యివ్వాలిగా!... అవును... ఇవ్వాలి!... అతని దృష్టి తన కుడిచేతి చిటికెన వ్రేలికి వున్న వజ్రపుటుంగరం పై నిలిచింది. వెంటనే దాని ఊడదీసి....

"దీపూ! ఏదీ నీ వామహస్తం!" నవ్వుతూ అడిగాడు ఈశ్వర్ చిరునవ్వుతో. 


దీప్తి తన ఎడమచేతిని అతని ఎడమ చేతిలో వుంచింది. తన కుడిచేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ దీప్తి ఎడమచేతి చూపుడు వ్రేలికి తొడిగాడు.

"నచ్చిందా దీపూ!..." ప్రీతిగా అడిగాడు ఈశ్వర్.


ఆ వుంగరాన్ని దీప్తి తన కళ్ళకు అద్దుకొంది. చిరునవ్వుతో.... "బావా!... ఈ క్షణంలో నా మనస్సున నా ఎదలో ఇంతవరకూ లేని సంతోషం నిండివుంది. నా పాలిట ఈ రోజు ఎంత గొప్ప సుదినం బావా!..." ఆనందా పారవశ్యంతో అతని ఎడమచేతిని తన కుడిచేత్తో పట్టుకొంది దీప్తి.

ఈశ్వర్ "దీపూ!... నాకూనూ!... ఇప్పుడు కారు స్టార్ట్ చేయనా!" మెల్లగా అడిగాడు.


"చేయండి బావా!" అంది ఆనందంతో దీప్తి.

ఈశ్వర్..... కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపాడు.

కొన్నిక్షణాల తర్వాత.....

"దీపూ నీకో విషయం తెలుసా!"

"ఏమిటి బావా అది"


"మన సాంప్రదాయం ప్రకారం వుంగరాలు మార్చుకొంటే..."

"పెండ్లి అయిపోయినట్లేగా" ఈశ్వర్ పూర్తిచేయకముందే నవ్వుతూ చెప్పేసింది దీప్తి.

ఈశ్వర్ సాలోచనగా "అవును దీపూ!" అన్నాడు.


"బావా!..."

"చెప్పు!..."

"మామయ్యా అత్తయ్యా... వాణి వదిన కళ్యాణ్ అన్నయ్యలకు ఏం చెబుతారు?"

"జరిగింది చెబుతాను."

"అంటే?"

"నేను దీపు వుంగరాలు మార్చుకొన్నామని."


"బావా! మనం తొందరపడ్డాం కదూ!" భయంతో అడిగింది దీప్తి.

"జరిగిపోయినదాన్ని గురించి బాధపడకు. నేను వుంటాగా నీకు తోడుగా!" కళ్ళు ఎగరేసి నవ్వాడు ఈశ్వర్.


"నాకు భయంగా వుంది బావా!" మెల్లగా అంది దీప్తి. 

"భయపడకు నీ ప్రక్కన నేను వుంటానుగా!" తన ఎడంచేత్తో దీప్తి వీపుపై తట్టాడు ఈశ్వర్.

ఈశ్వర్ మాటలకు దీప్తికి ఆనందం కలిగింది. చిరునవ్వుతో అతని ముఖంలోకి చూచింది దీప్తి.

"మొత్తానికి నన్ను ముగ్గులోకి దించేశావ్!" కొంటెగా నవ్వాడు ఈశ్వర్. 


ఆ నవ్వులో స్వచ్ఛత, అభిమానం, ప్రేమ వున్నాయి. దీప్తి తన అదృష్టాన్ని తలచుకొని మురిసిపోయింది.

పావుగంట తర్వాత వారు వాణి ఇంటికి చేరారు. జరిగిన విషయాన్ని ఈశ్వర్ తన తల్లికి, దీప్తి తన వదిన వాణికి వివరించారు.


దీప్తి, ఈశ్వర్ దంపతులు కావాలనే కోర్కె అందరికీ వున్నందున వారంతా సంతోషించారు.

కళ్యాణ్ మూడురోజులు ఆఫీస్‍కు శలవు పెట్టి.... హరికృష్ణ.... లావణ్య, ఈశ్వర్, దీప్తి, శార్వరీలను రాజధాని నగరంలోని అన్ని ముఖ్యప్రాంతాలకు తీసుకెళ్ళి చూపించాడు. ఆ విహారంలో దీప్తి, ఈశ్వర్‍లు మరింత సన్నిహితులైనారు. వారంరోజులు తర్వాత ఈశ్వర్, శార్వరీలు హైద్రాబాద్‍కు, హరికృష్ణ, లావణ్య, దీప్తిలు చెన్నైకి బయలుదేరడానికి సిద్ధం అయినారు. అంతవరకూ వారి అందరితో కలిసి ఎంతో ఆనందంగా వున్న వాణి దిగాలుపడింది.


లావణ్య కూతురును సమీపించి... "అమ్మా!... బాధపడకు ఏడవనెలలో నీకు సీమంతపు వేడుకను జరిపేటందుకు ఊరికి తీసుకొని వెళ్ళేదానికి నేను మీ నాన్నగారు వస్తాము. అది ఎన్నోరోజులు లేదు కదా. రెండు నెలలు,... తల్లీ ఆరోగ్యం జాగ్రత్త!" అనునయంగా చెప్పింది లావణ్య.


హరికృష్ణ కళ్యాణ్‍ను సమీపించి "అల్లుడుగారూ! అమ్మాయిని జాగ్రత్తగా చూచుకోండి. మేము ఏడవ మాసంలో వస్తాము" మెల్లగా చెప్పాడు.

"అలాగే మామయ్యగారూ!" వినయంగా చెప్పాడు కళ్యాణ్. 


"ఈవారం రోజులు మనమంతా కలిసి వుండడం వలన నాకు మన వూరు... పరిసరాలు, పదేపదే గుర్తుకు వచ్చాయి అమ్మా!" ఆనందాశ్రువులతో చెప్పింది వాణి.

"మరో రెండు నెలల్లో మన వూరికి రాబోతున్నావు కదా తల్లీ!" పవిటకొంగుతో కూతురి కన్నీటిని తుడిచింది లావణ్య. ఆ క్షణంలో ఆమె కళ్ళలోనూ కన్నీరు తుడుచుకుంది.


దీప్తి సెల్ మ్రోగింది. ఆన్‍చేసి "హలో" అంది.

"అమ్మా దీప్తీ! ఎప్పుడు బయలుదేరుతున్నావు? వెంటనే రావాలి" అన్నాడు ప్రజాపతి.

అందరి చూపులూ దీప్తి వైపుకు మళ్ళాయి.


సెల్‍మూసి దూరంగా చేతిని జరిపి...

"నాన్న!" అంది దీప్తి. క్షణాం తర్వాత "ఈరోజే బయలుదేరుతున్నాను నాన్నా!" బేలగా మెల్లగా చెప్పింది దీప్తి.


"సరే!.... జాగ్రత్తగా రా!" అన్నాడు ప్రజాపతి.

ఈశ్వర్ దీప్తిని సమీపించాడు.


"దీపూ!... భయపడకు. నేను శార్వరిని హైదరాబాద్‍లో దించి టార్మ్ ఫీజు కట్టి ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి రెండుమూడు రోజుల్లోనే మనవూరికి వస్తాను."


దీప్తి మౌనంగా తలాడించింది. దీనంగా ఈశ్వర్ ముఖంలోకి చూచింది. వాణి వాళ్ళ కారు మరో ప్రైవేట్ టాక్సీలో అందరూ ఎయిర్‍పోర్టుకు బయలుదేరారు. ఈశ్వర్, శార్వరి హైదరాబాదు వైపు, హరికృష్ణ, లావణ్య, దీప్తి చెన్నై వైపు ఫ్లయిట్‍లో బయలుదేరారు. వాణి, కళ్యాణ్ కారు వారి ఇంటి వైపుకు సాగింది.

చెన్నైలో దిగగానే... దీప్తి, ఈశ్వర్‍కు ఫోన్ చేసింది. వీలైనంత త్వరగా వస్తానని చెప్పాడు ఈశ్వర్. హరికృష్ణ, లావణ్య, దీప్తి గూడూరుకు చేరారు.


దీప్తి ఇంటికి చేరే సమయానికి ప్రజాపతి ఫ్యాక్టరీలో వున్నాడు. ప్రణవి అన్ని విషయాలను దీప్తిని అడిగి తెలుసుకొంది. పూసగుచ్చినట్లు వివరంగా తాము ఢిల్లీ వెళ్ళిననాటి నుండి తిరిగి వారంరోజుల తర్వాత ఎయిర్‍పోర్టుకు చేరేవరకూ జరిగిన అన్ని విషయాలను విపులంగా తల్లికి వివరించింది దీప్తి. చివరగా ఈశ్వర్ తానూ వుంగరాలు మార్చుకొన్న విషయాన్ని చెప్పి ఈశ్వర్ తనకు ఇచ్చిన వజ్రపుటుంగరాన్ని ప్రణవికి చూపించింది దీప్తి. ప్రణవి ఎంతగానో సంతోషించింది. తన భర్త కారణంగా అయినవారికీ, పుట్టి పెరిగిన ఊరికి దూరం అయిన వాణి... తన కూతురు మూలంగా తల్లితండ్రి, తమ్ముడు, చెల్లిని కలిసినందుకు ఆమెకు పరమానందం. హైదరాబాదులో దిగగానే ఈశ్వర్ సీతాపతికి ఫోన్ చేసి... పరంజ్యోతి కుమారుడు డాక్టర్ దివాకర్ ఫోన్ నెంబరు నోట్ చేసుకొన్నాడు. దీప్తికి ఫోన్ చేసి పెళ్ళిచూపులు ఎప్పుడని అడిగాడు. నాన్న ఫ్యాక్టరీలో వున్నాడని... ఆయన ఇంటికి వస్తే గాని ఆ వివరం తెలియదని చెప్పింది.


ఈశ్వర్... దివాకర్‍కు ఫోన్ చేశాడు.

"హలో!.... డాక్టర్ దివాకర్ హియర్... మే ఐ నో హూమ్ ఐ యాం స్పీకింగ్!"

"ఈశ్వర్!"

"ఈశ్వర్!... హూ యీజ్ ఈశ్వర్?"


"దివాకర్!"

"యస్"

"నీవు తెలుగోడీవా? తెల్లోడివా?"


"వాట్... నీవు!"

"యస్... నీవు!"

"మై నేమ్ ఈజ్ డాక్టర్ దివాకర్"

"ఆఁ... ఆఁ... నీపేరు దివాకర్... డాక్టర్ దివాకర్‍వి! ఆ వివరాలు నాకు తెలుసు తమ్ముడూ!"

"తమ్ముడా?"


"కాకపోతే అన్నయ్య అనుకో"


"యు ఆర్ వేస్టింగ్ మై టైమ్!... వాట్ డు యు వాంట్?"

"ఒరేయ్ అన్నాయ్!... దివాకరా!.... తెలుగులో... అదే మన భాషలో మాట్లాడలేవా!..."

"ఏం మాట్లాడాలి?"

"నిన్ను గురించి"


"నన్ను గురించా!"

"అవును!"

"ఎవరితో?"

"ఆ విషయం నీకెందుకు?"

"నేను నీ శ్రేయోభిలాషినిరా!"


"రా!"

"అవునురా!"


"వు హ్యానో మ్యానర్స్!"

"అబ్బా!... మళ్ళా ఇంగ్లిపీసులో మొదలెట్టావా! దివాకరా!... నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీవు పెళ్ళిచూపులకి పోయి చూడబోయే ఆ పిల్ల అదీ డాక్టరే! నా మరదలు. అంటే నా మేనమామ కూతురు. దానికి నాకు ఎంతోకాలం నుంచి అఫైర్."


"అఫైర్!"

"అవును."

"మీరు చెప్పేది నిజమేనా!"

"నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందిరా! అంతేకాదు... మరో విషయం!"


"అదేమిటి?"

"మా ఇద్దరికీ గాంధర్వ వివాహం కూడా జరిగిపోయింది. ఆలోచించుకో!... అలాంటి పిల్లని నీవు పెళ్ళిచూపులకు వెళ్ళి చూడాలా!"


"ఇంతకు నీవెవరు?"

"ఒరేయ్! చెప్పాను కదరా... నా పేరు ఈశ్వర్ అని!"


"ఆ పిల్ల మా నాన్నగారి ఫ్రెండ్ కూతురు. అమెరికా రిటన్. డాక్టర్"

"బాబూ దివాకర్! నా లవర్ వివరాలు నాకు తెలియవా!... నీవు నాకు చెప్పాలా! ఇంకా విను... అది పుట్టుకతో నాకు వరసకు మరదలై... వయస్సు వచ్చాక లవర్ అయింది. అంతేకాదు అది నా మేనమామ కూతురు. చెప్పాల్సిన వివరాలన్నీ చెప్పేశా!... పెండ్లి చూపులకు వెళతావో!..., మానుకొంటావో!... అది నీ ఇష్టం... బైరా బ్రదరూ!... నీ శ్రేయోభిలాషి ఈశ్వర్" నవ్వుతూ ఈశ్వర్ సెల్ కట్ చేశాడు.


దివాకర్ వెంటనే తన తండ్రి పరంజ్యోతికి ఫోన్ చేసి తనకు ఈశ్వర్ చెప్పిన వివరాలన్నీ చెప్పాడు. ఆ పిల్ల తనకు ఇష్టం లేదన్నాడు.


అంతావిన్న పరంజ్యోతి...

"ఓరినా పిచ్చి కొడకా!. ఆ పిల్ల కోట్లకు వారసురాలు. మనకు ఆ పిల్లకంటే దాని ఆస్థి ముఖ్యం. నీవు ఎన్నేళ్ళు ఎంతమందికి సూదులు, దబ్బళాలు గుచ్చి, గోళీలు ఇచ్చి, కోటి రూపాయలను సంపాదిస్తావ్! దాని మెళ్ళో తాళి కట్టూ ఆస్తికి వారసుడివైపో!... నీకు నచ్చిన... నీవు మెచ్చిన మరో కాంతమ్మతో సెటప్ పెట్టుకో. జీవితాన్ని దర్జాగా, మంచి భవంతి, ఖరీదైన కార్లు, ఇంట్లో హాస్పిటల్ పరివారం, సమాజంలో సెలబ్రిటీ హోదా! వీటన్నింటినీ దక్కించుకో!.... జీవితాన్ని అన్నివిధాలా ఆనందంగా అనుభవించరా!.... నామాట విను. ఎల్లుండి మనం పెళ్ళిచూపులకు గూడూరికి వెళుతున్నామ్ ఏమంటావ్!"


దివాకర్ ఆలోచనలో పడ్డాడు. "అరగంటలో నీకు ఫోన్ చేస్తా డాడ్!" అన్నాడు.


అనేకవిధాలుగా ఆలోచించిన దివాకర్ చివరికి తండ్రి మాటే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చాడు. పరంజ్యోతికి పోన్ చేసి... "డాడ్! మీ మాటే నా మాట!" ఆనందంగా చెప్పాడు.


పరంజ్యోతి ప్రజాపతికి ఫోన్ చేసి "ఎల్లుండి శుక్రవారం పెళ్ళిచూపులకు వస్తున్నాము" చెప్పాడు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

41 views0 comments

Comments


bottom of page