top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 2


'Neti Bandhavyalu Episode 2' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 08/11/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

హరికృష్ణ, లావణ్యాల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి.

లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి.

అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది.

అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది.



ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 2 చదవండి.



స్కూలు నుంచి నేరుగా... హరికృష్ణ ఇంటికి వచ్చిన దీప్తి ఊయల చెక్కపై పుస్తకాల సంచిని వుంచి... పరుగున వంటింట్లోకి వెళ్ళింది.

"అత్తయ్యా!..."

"ఏరా స్కూలు వదిలేశారా!.."

"వదలబట్టేగా ఇంటికి వచ్చాను!..."

"ఏమిటే పరాగ్గా వున్నావ్!..."

"ఆ జ్యోతి లేదూ!..."

"ఏ జ్యోతీ!..."

"రామలింగం అంకుల్ కూతురు!..."

"నిన్నేమన్నా అందా!..."

"అంది..."

"ఏమంది?..."

"అత్తయ్యా!... అది స్కూలుకు మూడు గారెలు తెచ్చింది. నాకు చూపించింది. నేను.. ’నాకు ఒకటివ్వవే’ అడిగాను. అది... నన్ను ఏమందో తెలుసా!..."

"ఏమందిరా!..."

"నేను ఇవ్వను... నీకు కావాలంటే నీ మొగుడి అమ్మను... అదే మీ మేనత్తను అడిగి చేయించుకొని తిను... అంది అత్తయ్యా!... అది చాలా చెడ్డది అత్తయ్యా!..." రోషంతో చెప్పింది దీప్తి. లావణ్య పకపకా నవ్వింది.

"అత్తయ్యా!.... మీరూ నన్ను వెక్కిరిస్తున్నారా!..."

లావణ్య దీప్తిని సమీపించి తన చేతుల్లోకి దీప్తి ముఖాన్ని తీసుకొని... చిరునవ్వుతో... "అది తప్పుగా ఏం చెప్పలేదురా. నీవు నా మేనకోడలివి. నేను నీ మేనత్తను. నా కొడుకు ఈశ్వర్ నీకు కాబోయే మొగుడు... ఇంతకూ ఇప్పుడు నా కోడలికి గారెలు కావాలి... అంతేగా!..." నవ్వింది లావణ్య.

"అవును..." బుంగముతితో చెప్పింది దీప్తి.

"అరగంటలో లోపల నీ ముందు వేడివేడి గారెలు వుంటాయి. ముఖం కడుక్కొనిరా. పాలు తాగు."

పరుగున దీప్తి వెళ్ళి ముఖం కడుక్కొని లావణ్యను సమీపించింది. పాలగ్లాసును దీప్తి చేతికి అందించింది లావణ్య. గటగటా త్రాగి గ్లాసును ఖాళీ చేసింది దీప్తి.

"హోంవర్కు ఏదైనా వుంటే వ్రాసుకో... గారెలు రెడీ చేసి పిలుస్తాను." అంది లావణ్య.

"వుంది అతయ్యా వ్రాస్తాను" వెళ్ళి ఊయల చెక్కపై కూర్చొని హోంవర్కు వ్రాయసాగింది దీప్తి.

అరగంట గడిచింది. హోంవర్క్ పూర్తిచేసింది దీప్తి.

"అత్తయ్యా!... హోంవర్క్ ఫినిష్!..." బిగ్గరగా అరిచింది.

"గారెలు కూడా రెడీ!... రా తిందువు గాని..." అంది లావణ్య.

దీప్తి వంటింట్లోకి వచ్చింది.

లావణ్య టేబుల్‍పై గారెల ప్లేటును వుంచింది.

దీప్తి కుర్చీలో కూర్చుంది.

"దీపూ!... గారెలు వేడిగా వున్నాయి. నిదానంగా వూదుకొని తిను..." అంది లావణ్య.

అదే... డైనింగ్ టేబుల్... అదే కుర్చీ...

* * * *

పది సంవత్సరాల క్రిందట జరిగిన ఆ సంఘటన దీప్తికి గుర్తుకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీరు...

వాటిని చూచిన... శార్వరి...

"దీప్తి! ఏడుస్తున్నావెందుకు?" ఆశ్చర్యంతో అడిగింది.

"గతం గుర్తుకువచ్చింది శారు. ఇవి కన్నీరు కాదు... ఆనందభాష్పాలు. అత్తయ్య... నాకు ఏది ఇష్టమో కాదో అనే విషయాన్ని మరువలేదు" సాలోచనగా చెప్పింది దీప్తి.

"తిన్నావా దీపూ!" అడిగింది లావణ్య.

"ఆఁ... తిన్నానత్తయ్యా!... గతాన్ని గుర్తు చేసుకుంటూ తిన్నాను."

"శార్వరీ!... వచ్చి పాలగ్లాసుకు తీసుకు వెళ్ళు." అంది లావణ్య.

శార్వరి వెళ్ళి పాలగ్లాసులతో డైనింగ్ టేబుల్‍ను సమీపించింది. ఒక గ్లాసును దీప్తికి అందించింది.

ఆ పాలగ్లాసులోని పాలపై దీప్తికి లావణ్య ముఖం గోచరించింది. చిరునవ్వుతో.... ’జరిగిన గొడవ ఏందో... దాని కారణంగా అత్తయ్యకు నాన్నమీద కోపం వున్నా... నా విషయంలో ఆమె మనస్సులో ఎలాంటి ద్వేషమూ లేదు. దానికి సాక్షి... తను నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయడం... నాచేత తినిపించడం.... నాకు ఇష్టమైన పాలు నాకు అందించడం...’ అనుకొంది దీప్తి.

లావణ్య... డైనింగ్ టేబుల్‍ను సమీపించింది.

"అత్తయ్యా!.... ఇక నేను వెళ్ళిరానా!..." చిరునవ్వుతో ప్రీతిగా లావణ్య ముఖంలోకి చూస్తూ అడిగింది దీప్తి.

"సరే వెళ్ళిరా!... ఆఁ.... ఒక్కమాట!...."

"తప్పుగా అనుకోవుగా!.."

"అనుకోనత్తయ్యా!..."

"ఈ మాటను నేను... నీపై నాకు వున్న వాత్సల్యంతో చెబుతున్నాను..."

"చెప్పండత్తయ్యా!..."

"ఈ ఇంటికి నీవు ఎప్పుడైనా ఇక ముందు వచ్చేటప్పుడు... శారూను చూడు... ఆ వేషంలో రావాలి..."

దీప్తికి.... విషయం అర్థం అయింది.

తల దించుకొని... "అలాగే అత్తయ్యా!.... బయలుదేరుతాను..." అంది.

టేబుల్ పైనున్న డబ్బాను చూపుతూ...

"దాన్ని చేతికి తీసుకో!..."

"శారూ!... దేవుడి రూంలో పూలు వున్నాయి తీసుకురా!..." అంది.

శార్వరీ పూజగదివైపుకు నడిచింది.

"ఈ డబ్బాలో ఏమున్నాయి అత్తయ్యా!..."

"సున్నివుండలు... మీ అమ్మకు ఎంతో ఇష్టం...."

"అమ్మకా!.... నాన్నకా!...."

"ఆఁ.... ఒకసారి చెబితే నీకు అర్థం కాదా!..."

"ఆఁ....ఆఁ.... అర్థం అయింది అత్తయ్యా!..." నవ్వుతూ చెప్పింది దీప్తి.

శార్వరి రెండుమూర్ల మల్లెపూల దండను తెచ్చి లావణ్యకు అందించింది. పూలను టేబుల్‍పై వుంచి...

"దీపూ!... వెనక్కు తిరుగు!..." అంది లావణ్య.

దీప్తి ఆమెకు వీపు మళ్ళించి నిలుచుంది.

తల వెంట్రుకలను తన చేతుల్లోకి తీసుకొని... మూడు పాయల జడను అల్లి... మల్లెపూలను తల్లో వుంచింది లావణ్య.

"ఏమిటత్తయ్యా!.... ఇది!..." అసహనంగా అంది దీప్తి.

"ఇది మన పద్ధతి... మరచిపోయినట్లున్నావు... గుర్తుకు తెచ్చుకో!..."

దీప్తి నవ్వి స్టీల్ డబ్బాను చేతికి తీసుకొంది.

"వెళ్ళొస్తానత్తయ్యా!..."

"మంచిదిరా!..."

దీప్తి హాల్లోకి వచ్చింది.

ఈశ్వర్ తన గదినుండి బయటికి వచ్చాడు.

దీప్తి చిరునవ్వుతో అతని ముఖంలోకి చూచింది.

ఈశ్వర్ ఆశ్చర్యంతో... "అమ్మా!..."

"దీప్తి ఇంటికి వెళుతూ వుంది. వీధి గేటు వరకూ వెళ్ళిరా!..." అంది లావణ్య.

"అమ్మా!..."

"ఈశ్వర్!.... మర్యాదను పాటించాలిరా!...."

"ఆఁ....ఆఁ.... అలాగే అమ్మా!...."

’ఈ అమెరికన్ రిటన్.... ఏం మాట్లాడిందో... ఏం మాయ చేసిందో... అమ్మ ఏంది ఇలా మారిపోయింది!....’ అనుకొన్నాడు ఈశ్వర్.

నలుగురూ వరండాలోకి వచ్చారు.

వాకిట రెండువైపులా వున్న పూలమొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతున్నాడు హరికృష్ణ.

వరండాలో ఆగిపోయింది లావణ్య. ముందు దీప్తి, వెనుక శార్వరీ, ఈశ్వర్‍లు వీధి గేటువైపుకు బయలుదేరారు.

హరికృష్ణను చూచి... "వెళ్ళొసాను మామయ్యా!..." చెప్పింది దీప్తి.

"మంచిదమ్మా... వెళ్ళిరా!..." చిరునవ్వుతో చెప్పాడు.

శార్వరీ... ఈశ్వర్... దీప్తి వీధి గేటు ముందుకు వచ్చారు.

"శారూ!.... బావా!... వస్తాను..." నవ్వుతూ చెప్పి దీప్తి కార్లో కూర్చుంది.

డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. శార్వరి... ఈశ్వర్ ముఖంలోకి చూచి నవ్వింది.

"ఎందుకు మహాతల్లీ నవ్వుతున్నావ్!..." అడిగాడు ఈశ్వర్.

"దీప్తి నాకేమౌతుంది?...."

"నీకు తెలీదా!..."

"తమరి నోటితో విందామనే ఆశ..."

"పద అమ్మ దగ్గరికి!..."

"ఎందుకు?..."

"నీ ప్రశ్నకు సమాధానం కావాలిగా!..."

"అడిగింది నిన్ను... నీవే చెప్పాలి..."

"నేను చెప్పినా, అమ్మ చెప్పినా ఒకటే!..."

"అంతేనంటావా!...."

"అవును..."

"సరే పద!..."

ఈశ్వర్, శార్వరీలు లావణ్యను సమీపించారు.

"ఏమిటే నవ్వుతూ వూగిపోతున్నావ్!" అడిగింది లావణ్య.

"నీ కోడలు... ఈ నా అన్నయ్యతో వరస కలిపింది...." నవ్వింది శార్వరి.

"అమ్మా!.... దీప్తి నాకేమౌతుంది?..."

"ఒరేయ్!... ఏందిరా ఈ చచ్చు ప్రశ్న... ఏమౌతుందో నీకు తెలీదా!..."

"ఆఁ.... అమ్మా నేనూ ఇదే ప్రశ్న వేశాను!... జవాబు ఏం చెప్పాడో తెలుసా!..."

"ఏం చెప్పాడు?..."

"నిన్ను అడిగి కనుక్కోమన్నాడు.." వెటకారంగా చెప్పింది శార్వరి.

"అది వాడికి ఏమౌతుందో నీకు తెలీదా!..."

"తెలుసనుకో!... ఆ మాటను చిన్నబ్బాయ్ నోటినుండి వింటే..." నవ్వింది శార్వరి.

"అలాగా!..."

"అవును జననీ!..."

"ఈశ్వరా!... చెప్పు!..."

"ఏం చెప్పాలమ్మా!..."

"దీపు నీకు ఏమౌతుందో చెప్పరా!..."

"అమ్మా!.... ఇది చాలా అన్యాయం.."

పైపును ఆపి... వరండాలోకి వచ్చిన హరికృష్ణ వారి మాటలను విన్నాడు. నవ్వుతూ... "ఈశ్వరా! సిగ్గు వుండవలసింది ఆడవారికి... చెప్పరా చెప్పు..."

"ఏం చెప్పను!..."

"తనకు... నాకు... పెద్దవాళ్ళకు సమ్మతం అయితే నా భార్య అవుతుందని..." నవ్వాడు హరికృష్ణ.

"నాన్నా!.... మీరు నన్ను!...."

"ఆటపట్టిస్తున్నానంటావా!... నేను అన్నమాట ఈనాటిది కాదురా!... దీప్తి పుట్టగానే మేమంతా.. అంటే మన రెండు కుటుంబాల వారు ఆనాడు అనుకొన్నమాట..."

"అవునురా!.... మీ నాన్న చెప్పింది నిజం...."

"అది అప్పటి పరిస్థితి.... కానీ యీనాటి పరిస్థితి వేరు కదమ్మా!.... ప్రజాపతిగారు చేసిన ద్రోహాన్ని మీరు మరిచిపోగలరేమో కానీ.... నేను మరువలేను..." లోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.

హరికృష్ణ లావణ్య ముఖంలోకి చూచాడు. ఆ చూపులోని ప్రశ్న లావణ్యకు అర్థం అయింది. తండ్రి ముఖంలోని గాంభీర్యాన్ని చూచి శార్వరి లోనికి వెళ్ళిపోయింది.

"కూర్చో లావణ్యా!...." వరండాలోని కుర్చీలో తను కూర్చొని చెప్పాడు హరికృష్ణ.

లావణ్య మౌనంగా ఆలోచనతో అతనికి ఎదురుగా కూర్చుంది.

"లావణ్యా!..."

భర్త ముఖంలోకి చూచింది లావణ్య.

"దీప్తి అంటే నీకు ఇష్టం కదూ!...."

"అవునండీ!...."

"ఆమె నీ ఇంటి కోడలు కావాలనే ఆశ కూడా వుంది కదూ!.... తను ఇంటికి రాగానే.... వాడి మీది కోపాన్ని ఆ పిల్ల మీద చూపించావ్. అమెరికాలో చదివి వచ్చినా... ఆ పిల్లలో ఎలాంటి పొగరు... అహంకారం... నాకు కనిపించలేదు... మరి నీకు?..."

"నాకు అంతేనండి. అందుకే దానికి ఎంతో ఇష్టమైన నెయ్యిగారెలు చేసి తినిపించాను. గారెలను తింటూ అది ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావని శార్వరీ అడిగితే.... గతం గుర్తుకు వచ్చిందని చెప్పింది. మన చేతుల్లో పెరిగిన పిల్ల... అదీ గతాన్ని మరిచిపోలేదు... నేనూ మరిచిపోలేదు. అందుకే తలదువ్వి, పూలుపెట్టి ఇది మన పద్ధతి అని చెప్పి పంపాను. మన పంతాలు, పట్టింపులు మన చిన్న పిల్లలకు శాపాలు కాకూడదండీ!..." విచారంగా చెప్పింది లావణ్య.

"అంటే!..." ఆశ్చర్యంతో అడిగాడు హరికృష్ణ.

"దీప్తి ఈ ఇంటి కోడలు కావాలి!... చూచారుగా ఎంత అందంగా తయారయిందో!..."

"ఆమె నీ మేనకోడలు కదా!... అంతా మేనత్త పోలిక..." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ. క్షణం ఆగి... "నీ నిర్ణయాన్ని నేను ఏనాడూ కాదనలేదు. మరి ఈశ్వర్ అభిప్రాయం... ఎలా వుందో!...."

"వాడు మన బిడ్డ! మన మాటను కాదనడు. ఇప్పుడు... సమస్య... ఆ ప్రజాపతి..."

"ప్రజాపతి కాదు నీవు అనవలసింది... నా అన్నయ్య అని...."

"ఆ పదానికి వున్న గౌరవాన్ని అలా పిలిపించుకునే అదృష్టాన్ని వాడు కోల్పోయాడండి" బాధలో చెప్పింది లావణ్య.

"అయితే... నా వాంఛ.... కాదు... కాదు... మన వాంఛ నెరవేరే మార్గం!...."

"నా నిర్ణయం సరైనదైతే మార్గాన్ని నేను నమ్మిన ఆ భగవాన్ రమణమహర్షి తప్పక చూపుతారు... ఆ నమ్మకం నాకుంది."

"ఈశ్వర్‍ని అడిగి చూద్దామా!..."

"ఇప్పుడు కాదు... అసలు వాణ్ణి అడగవలసిన అవసరం లేదు. వాడు మన మాటను కాదనడండీ!..."

"పట్టుదల... పగ... ప్రతీకార వాంఛలు వాడిలోనూ వున్నాయని నా అభిప్రాయం!..."

"మనం నచ్చచెబితే.... వాడు మన మాటను మీరడండీ!...."

"మొన్న నాతో వాడేమన్నాడో తెలుసా!..."

"ఏమన్నాడు!..."

"ఈ సంవత్సరంలో శార్వరి చదువు అయిపోతుందిగా... ముందు దాని వివాహం ఘనంగా జరిపించాలి. ఆ తర్వాతనే నా వివాహ ప్రసక్తి" అన్నాడు.

"వాడి నిర్ణయం మంచిదే కదా!..."

"అవును... చాలా మంచిది..."

"ఈ విషయంలో నా సలహా ఏమిటంటే!..."

"చెప్పు లావణ్యా!..."

"శివరామకృష్ణ అన్నయ్యకు ఉత్తరాన్ని వ్రాయండి. వారు రావాలనుకొంటున్నారుగా!... రాబోయే ముందు ఆ ప్రాంతంలో మనకు తగిన మంచి కుటుంబాల్లో మొగపిల్లలు వున్నారేమో విచారించి రావలసిందిగా వ్రాయండి. వారు పేదవారైనా సరే.... గుణ గణాల్లో.... పరువు మర్యాదల విషయంలో... మంచివారుగా... మనకు తగినవారుగా వుండాలి."

"అలాగే లావణ్యా!... ఈ రోజే వ్రాస్తాను."

"ఫోన్‍లో అన్ని వివరంగా మాట్లాడలేము. అందుకే అన్ని విషయాలను వివరంగా వుత్తరంలో వ్రాయండి."

"సరే..."

ఈశ్వర్ వరండాలోకి వచ్చాడు.

"నాన్నా!.... నేను మన తోటవరకూ వెళ్ళొస్తాను. కేరళ నుంచి ఆరుటెంకాయ మొక్కలను నా స్నేహితుని ద్వారా తెప్పించాను అవిగో... వాటిని తోటలో నాటించి వస్తాను..."

"సరే జాగ్రత్తగా వెళ్ళిరా!..."

ఈశ్వర్ తన... హీరోహోండా పై టెంకాయ మొక్కలను పెట్టుకొని తోటవైపుకు వెళ్ళిపోయాడు.

"అమ్మ!.... అన్నాన్ని దించేశాను.... కూర ఏం చేయమంటావ్!..." వరండాలోకి వచ్చి అడిగింది శార్వరి.

"వంకాయలు... బెండకాయలు... చిక్కుడుకాయలు వున్నాయ్.... నీకు ఏది యిష్టమో వాటిని తరుగు...."

"వంకాయలు తరుగుతా!..."

"సరే!...."

శార్వరి లోనికి వెళ్ళిపోయింది.

హరికృష్ణ కుర్చీనుంచి లేచి "లావణ్యా!... నేను శివాలయానికి వెళ్ళి వస్తాను" అన్నాడు.

"మంచిదండి వెళ్ళిరండి."

హరికృష్ణ వీధివైపుకు.... లావణ్య వంటగది వైపుకు నడిచారు.

కారులో ఇంటికి బయలుదేరిన దీప్తి... తాను హరికృష్ణ ఇంటికి వెళ్లడం... అక్కడ జరిగిన సంభాషణ... ఈశ్వర్ తనను చూచి పలకరించకపోవడం.... ’బయలుదేరుతాను’ అని చెప్పి లేచిన తనను, లావణ్య అత్త పిలవడం.... తనకు ఇష్టమైన గారెలు, పాలు ఇవ్వడం... తల దువ్వి పూలు పెట్టడం... అన్నీ చిత్రంగా ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా జరిగినట్లనిపించింది దీప్తికి.

’మామయ్య!... చిన్ననాడు నన్ను ఎలా పలకరించాడో అదేలా అభిమానంతో పలకరించాడు. అత్తయ్య తొలుత ఆవేశంగా మాట్లాడినా, తర్వాత నా ఇష్టాన్ని మరవలేదనే దానికి నిదర్శనంగా గారెలు, పాలు ఇవ్వడం... తలలో పూలు పెట్టడం... ’ఇది మన పద్ధతి... మరచిపోయినట్లున్నావు...’ అని చెప్పడం... అంటే ఒక్క ఈశ్వర్‍కు తప్ప అందరూ నన్ను పూర్వంలా ఆదరించే మనస్సు వున్నవారే... ఈశ్వర్‍కు మాత్రం ఎందుకు నా మీద అంత కోపం!... ఆ కోపానికి కారణం నేనా!... కాదే... మరి ఎవరు?... నాన్నా!!!... నేను ఇక్కడ లేని గత అయిదేళ్ళలో ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి వుంటుంది. మామయ్య, అత్తయ్య పెద్దవారు గనుక నా పెద్దవారిపైన వున్న కోపాన్ని వారు నా మీద చూపించలేదు. కానీ ఈశ్వర్.... ఈ ఇంటికి సంబంధించిన నన్ను అసహ్యించుకొంటున్నాడు. యువకుడు కదా!... యంగ్ హ్యాండ్‍సమ్ మ్యాన్!... ఆ కథ నాకు ఎలా తెలుస్తుంది. అమ్మను నాన్నను అడగవద్దని మామయ్య చెప్పారు. నేను తలూపాను. వారిని అడిగితే మాట తప్పినదాన్ని అవుతాను. వారికి ఆ విషయం తెలిస్తే ఈనాడు వారు నామీద చూపిన అభిమానం స్థానంలో అసహ్యం ఏర్పడవచ్చు. నాలో నిజాయితీ లేదని అనుకోవచ్చు... అలా జరుగకూడదు. పైన వున్నాడుగా... నే నమ్మిన శ్రీ భగవాన్ రమణ గురువులు... నా ఆవేదనను వింటున్నాడుగా... వారే ఏదో దారి చూపిస్తారు... నిజాన్ని వారు ఎవరో ఒకరి ద్వారా నాకు తెలియజేస్తారు’ అనుకొంది దీప్తి. కారు వారి ఇంటి పోర్టికోలో ఆగింది. దీప్తి దిగి ఇంట్లోకి నడిచింది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


63 views0 comments

Comments


bottom of page