top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 20



'Neti Bandhavyalu Episode 20'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 14/02/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 20' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 


ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. 


వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 


సీతాపతి, లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు. 


వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది. తనను క్షమించమని తల్లిదండ్రులను కోరుతుంది వాణి. అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య. దీప్తి, ఈశ్వర్ లు ప్రేమలో పడతారు. ఉంగరాలు మార్చుకుంటారు. దీప్తికి వేరొకరితో వివాహం తలపెడుతాడు ప్రజాపతి. 


ప్రజాపతి ఇంటికి వెళ్లి దీప్తిని తీసుకొని వస్తాడు ఈశ్వర్. ఈశ్వర్, దీప్తిల వివాహం రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతుంది. ఈశ్వర్ మీద కక్ష పెంచుకుంటాడు ప్రజాపతి. 


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 20 చదవండి.. 


లావణ్య పనిమనిషి ఆసరాతో, దీప్తిని కన్నతల్లి ప్రణవి తన స్నేహితురాండ్ర సాయంతో తన ఇంట్లో జరుగవలసిన దీప్తి, ఈశ్వర్ల తొలిరేయి.. భర్త ప్రజాపతి కారణంగా ఆ ఏర్పాట్లను హరికృష్ణ ఇంట్లో చేయించింది. 


సీతాపతి నెల్లూరులో కారు దిగగానే ఈశ్వర్‍ను సమీపించి.. 

"బావా!.. మాట!"


"చెప్పు సీతా!"


"మీ మాట ప్రకారం ఏదో నా చేతనైంది చేశాను. లోపాలేమైనా వుంటే క్షమించండి. అక్క.. నా అక్క చాలా అమాయకురాలు. చిన్నప్పటి నుంచీ మీరంటే తనకు ఎంతో ప్రాణం. 

అప్పుడప్పుడూ నన్ను అడిగేది ’ఒరేయ్! బావ నన్ను పెండ్లి చేసుకొంటాడా’ అని. ’ ’తప్పక చేసుకొంటాడక్కా’ అనేవాణ్ణి. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఎంతో ఆనందాన్ని చూచేదాన్ని. ఆ ఆనందాన్ని చాలాకాలం తర్వాత నా అక్క ముఖంలో ఈరోజు చూచాను. దానికి కారణం మీరు. బావా! నా అక్కను జాగ్రత్తగా చూచుకోండి" కన్నీటితో సీతాపతి ఈశ్వర్ చేతులు పట్టుకొన్నాడు. 


కొన్ని క్షణాల తర్వాత "బావా!.. మా నాన్న మనస్తత్వంలో మార్పు వస్తుందో రాదో నా ఊహకు అందని విషయం. కానీ మా అమ్మకు మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం. నేను ఇంట్లో వుండగా చూచేవాణ్ణి. ఆమె ప్రతినిత్యం పూజ చేసే సమయంలో మీరు తన అల్లుడు కావాలని దేవుణ్ణి కోరుకొనేది. అమ్మ ఆశయం మంచిది. ఆమె కోర్కెను ఆ దేవుడు తీర్చాడు. ఊర్లో జనం అనుకొంటుంటే విన్నాను. 

మన తాతలు.. నానమ్మల హాయంలో మన కుటుంబాలు, వ్యక్తుల మధ్య సఖ్యత ఊరంతటికీ ఆదర్శం అని, మన తండ్రుల హాయంలో ఆ పేరుకు బూజు పట్టింది. మన హాయంలో ఆ బూజును దులిపి మన కుటుంబాల మధ్యన వుండిన పూర్వపు సఖ్యతను తాతల హాయంలోలా వుండేలా చేయాలని నా కోరిక.. స్వార్థంతో బంధుత్వాలు తెగిపోయి పగద్వేషాలు పెరగకూడదు. ఆ రెండు గుణాలు ఆశాంతికి కారణాలౌతాయి. ఆ స్థితి ఎవరికీ రాకూడదు. 


మా నాన్నకు వచ్చింది. అది ఆయన వరకే పరిమితం కావాలి. మనం మన జీవితాంతం కలిసిమెలసి ఉండాలి. బావా! శార్వరి అంటే నాకు ఇష్టం. తనకూ నేనంటే ఇష్టమేనని నా అభిప్రాయం. మా విషయంలో మీరు ఏమి నిర్ణయించినా అది నాకు సమ్మతమే!" చెప్పడం ముగించి చిరునవ్వుతో ఈశ్వర్ ముఖంలో చూచాడు సీతాపతి. 


"సీతూ!.. దీపుతో నా వివాహం దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. నీ విషయంలో ఆ పరంధాముని నిర్ణయం ఎలా వుందో!.. నీ కోర్కె నెరవేరాలని నేను ఆ సర్వేశ్వరుని కోరుతాను. బాగా చదువు. నీ కాళ్ళ మీద నీవు నిలబడు. అమ్మను, అంటే మా అత్తయ్యను జాగ్రత్తగా చూచుకో. ఆమె అమాయకురాలు. మీ వల్లనే ఆమెకు ఆనందం" అనునయంగా చెప్పాడు ఈశ్వర్. 


"అలాగే బావా!"


అందరూ వచ్చిన రీతిగానే కార్లలో కూర్చున్నారు. అవి కదిలాయి. టాటా చెప్పి సీతాపతి స్నేహితులు రైల్వేస్టేషన్ వైపు నడిచారు. 

కార్లు హరికృష్ణ పోర్టికోలో ఒకదాని వెనుక ఒకటి ఆగాయి. ముందరి వ్యాగినార్ నుండి హరికృష్ణ, లావణ్య.. శివరామకృష్ణ.. ఊర్మిళ, మాధవయ్య దిగారు. 

లావణ్య వేగంగా ఇంట్లోకి వెళ్ళి రెండు నిముషాల్లో.. ఎర్రని తట్టతో వచ్చి ఈశ్వర్, దీప్తిలకు దిష్టి తీసింది. 


"పదండి ఇంట్లోకి" అంది. 


ఆమె సెల్ మ్రోగింది. 

"హలో!.. "


"వదినా!.. వచ్చారా!"


"వచ్చాము ప్రణవీ"


"బాగా జరిగిందా?"


"దివ్యంగా జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసింది నా అల్లుడు సీతాపతే!" చిరునవ్వుతో చెప్పింది లావణ్య. 


హరికృష్ణ నవ్వుతూ భార్య ముఖంలోకి చూచాడు. 

"ఒరేయ్ హరీ!.. ఏ మాటకామాట చెప్పుకోవాలిరా!.. నా చిన్నకొడుకు సీతాపతి వాళ్ళ మాదిరి కాదురా! బంగారం, ఎంత వినయం, ఎంత విధేయత ఏమంయావ్?" అడిగాడు శివరామకృష్ణ. 


"అవును బావా! సీతూ.. " భార్య ముఖంలోకి చూచాడు హరికృష్ణ. 


"చెప్పండి.. సందేహం దేనికి?.. అన్నయ్యా!.. సీతూ చాలా మంచియోగ్యుడు. వాడి తండ్రిమాదిరి కాదు. అవునాండీ!"


"ఆఁ.. అవునవును.. అంతా మేనత్త పోలిక" నవ్వాడు హరికృష్ణ. 


"అవునమ్మా!.. లావణ్య!.. నీ పోలికలు వాడిలో చాలా వున్నాయి" అన్నాడు శివరామకృష్ణ. 

లావణ్య నవ్వింది ఆనందంగా. 


"వదినా!" ఫోన్‍లో పిలిచింది ప్రణవి. 


"ఆ.. ఆ.. చెప్పు వదినా!"


"మీ పనిమనిషి మంగ నా స్నేహితురాండ్ర సాయంతో మన పిల్లల తొలిరేయికి కావలసిన ఏర్పాట్లన్నీ మన ఇంట్లో చేయించాను. లోనికి వెళ్ళి చూచి నాకు ఫోన్ చెయ్యి" అంది ప్రణవి. 

"అలాగే వదినా!" సెల్ కట్ చేసింది లావణ్య. 


ఈశ్వర్ తన గదిని సమీపించి చూచాడు. తాళపు బుఱ్ఱ వ్రేలాడుతూ వుంది. ఆశ్చర్యపోయాడు. 

"అమ్మా!" పిలిచాడు. 


లావణ్య, ఊర్మిళలు అతన్ని సమీపించారు. 


"నెల్లురికి వెళ్ళబోయే ముందు నీవు నా గదికి తాళం వేశావా అమ్మా!.. అటు చూడు. "


ప్రక్కనే వున్న పనిమనిషి మంగ ముసిముసి నవ్వులతో తల దించుకొంది. లావణ్యకు, ఊర్మిళకు విషయం అర్థం అయింది. తన చేతిలో ఉన్న ఆ గది తాళాన్ని ఈశ్వర్ కంట పడకుండా లావణ్యకు అందించింది మంగ. 


"ఈశ్వర్! నీవు మీ నాన్నగారి గదికి వెళ్ళి ఫ్రెష్‍కా!"

"ఊర్మిళా! దీపు ఎక్కడ?"

"తను నీ గదివైపుకు వెళ్ళిందమ్మా!" చెప్పాడు ఈశ్వర్. 


"దార్లో దాన్ని ఏమీ అల్లరి చేయలేదు కదా!"

"కారు నెల్లురు దాటటంతోనే నాకు నిద్ర వస్తూవుందని నిద్రపోయింది. మన ఇంటి ముందుకు వచ్చాకే కళ్ళు తెరిచింది.. "


"అలాగా!" అంది ఊర్మిళ. 

"అవునత్తయా!.. నిజం.. "

"సరేలే అమ్మ చెప్పినట్లు చెయ్యి. "


ఈశ్వర్ వారిరువురినీ క్షణంసేపు చూచి తండ్రి గదివైపు నడిచాడు. 

హరికృష్ణ, శివరామకృష్ణలు హాల్లో కూర్చొని టీవీలో వస్తున్న శ్రీ కృష్ణపాండవీయం సినిమాను చూస్తున్నారు. 


లావణ్య, ఈశ్వర్ గది తలుపు తెరిచి.. మంచానికి చేసిన మల్లెపూల అలంకారం.. క్రమంగా అమర్చిన పళ్ళు.. స్వీట్లను చూచి.. 

"ఊర్మిళా!.. ప్రణవి వదిన డైరెక్షన్ అద్భుతం.. తాను ఎక్కడో కూర్చొని మన ఇంట్లో ఏర్పాట్లనన్నింటినీ ఎంత చక్కగా చేయించిందో చూడు" ఆనందంగా చెప్పింది లావణ్య. 


"అవును లావణ్యా!.. ప్రణవి మంచి పనిమంతురాలు. మహా సమర్థురాలు" నవ్వింది ఊర్మిళ. 


"అమ్మా!.. దాదాపు రెండు గంటలసేపు ఈ గదిలో నలుగురు ఆడవాళ్ళు పనిచేశారమ్మా!" ద్వారం దగ్గరకు చేతికర్ర సాయంతో వచ్చిన విష్ణు చెప్పాడు. 


"అలాగా!" అంది ఊర్మిళ. 


"అవునమ్మా!" విష్ణు జవాబు. 


లావణ్య, ఊర్మిళలు గదినుండి బయటికి వచ్చి తాళం బిగించారు. విష్ణు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు. 

వారిరువురూ లావణ్య గదిలోనికి వెళ్లారు. 

దీప్తి మంచంపై పడుకొని నిద్రపోతూ వుంది. 

"దీపూ!" పిలిచింది లావణ్య. 


దీప్తిలో చలనంలేదు. 

"వదినా! ఇదేంటి ఈ సమయంలో ఇలా నిద్రపోతూ వుంది" అడిగింది లావణ్య. 


"ఇంతకాలం.. తనకు ఈశ్వర్‍తో వివాహం అవుతుందో లేదో అనే భయం, కలత తన మనస్సున వుండేది. అది ఇప్పుడు లేదుగా!.. అందుకే హాయిగా నిద్రపోతూ వుంది" నవ్వింది ఊర్మిళ. 


ఇరువురూ డైనింగ్ హాల్లో ప్రవేశించారు. టేబుల్‍పై వంటకాలన్నీ సిద్ధంగా వున్నాయి. 

"అంతా ప్రణవీ అమ్మగారు చెప్పినట్లే చేశానమ్మా" అంది మంగ. 


హాల్లోకి వచ్చిన లావణ్య "ఏమండీ! స్నానాలు చేసేస్తే భోజనం చేయవచ్చు. ప్రణవి వదిన మన మంగచేత అన్నీ చేయించింది. "


పావుగంటలో హరికృష్ణ, శివరామకృష్ణ స్నానం చేశారు. లావణ్య, దీప్తిని లేపింది. స్నానం చేసి వచ్చిన దీప్తికి తెల్ల బంగారు అంచు చీర, రవికను అందించింది లావణ్య. తలలో మల్లెపూలను సింగారించింది. 


అందరూ కలసి భోజనం చేశారు. సరదా కబుర్లతో, మగవారంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. సమయం రాత్రి తొమ్మిదిన్నర. లావణ్య వెళ్ళి ఈశ్వర్ గది తలుపు తెరిచింది. హాల్లోకి వచ్చింది. 


"ఈశ్వరా!.. రేపు ఉదయం చెన్నై వెళ్ళాల్సిందేనా!" అడిగింది లావణ్య. 


"అవునమ్మా! ఎల్లుండి మిస్టర్ బ్రౌన్ లండన్ వెళ్ళిపోతారు. "


"సరే!.. నీ గదికి వెళ్ళు.. పడుకో" అంది లావణ్య. 


ఈశ్వర్ లేచి తన గది తలుపును తెరిచి చూచాడు. ఆశ్చర్యపోయాడు. గుర్తుకు వచ్చింది ఆ రాత్రికి తన జీవితంలో వున్న ప్రాముఖ్యత. చిరునవ్వుతో లోన ప్రవేశించి తలుపు మూశాడు. గడియ బిగించలేదు. 


పావుగంట తర్వాత.. తలుపు తెరుచుకుంది. చేతిలో పాలగ్లాసుతో దీప్తి ద్వారం ముందు నిలబడి వుండి. 

"దీపూ!.. లోనికి పో!" అంది వెనుక వున్న లావణ్య. 


దీప్తి గదిలో తలదించుకొని ప్రవేశించింది. 

మంచంపైన కూర్చొని వున్న ఈశ్వర్ లేచి ద్వారాన్ని సమీపించి గడియ బిగించాడు. 


దీప్తి మంచాన్ని సమీపించింది. వెనుదిరిగి చూచింది. చేరువలో ఈశ్వర్ నవ్వుతూ దీప్తిని ప్రీతిగా చూస్తూ వున్నాడు. 

ఆ చూపుల తాకిడికి దీప్తి నయనాలు క్రిందికి వాలాయి. సిగ్గుతో తలదించుకొని గ్లాసును ఈశ్వర్ వైపుకు చూపింది. 


"ముందు మంచం మీద కూర్చో దీపు!"


దీప్తి మంచంపై కూర్చుంది. తల దించుకొనే వుంది. 

తన చేతితో దీప్తి చుబుకాన్ని పట్టుకొని తలను పైకెత్తాడు ఈశ్వర్. ఆమె కళ్ళల్లో కన్నీరు.. చూచి ఆశ్చర్యపోయాడు ఈశ్వర్. 

"దీపూ! ఏమిటా కన్నీళ్ళు?" ఆందోళనగా అడిగాడు. 


"ఇవి కన్నీరు కాదు బావా! నాలోని అంతులేని ఆనందానికి నిదర్శనం.. ఆనందభాష్పాలు.. పాలు త్రాగండి" గ్లాసును ఈశ్వర్‍కు అందించింది. 


చిరునవ్వుతో తన కుడిచేతిని దీప్తి భుజంపై వేశాడు ఈశ్వర్. గ్లాసులోని సగంపాలు త్రాగి దాన్ని దీప్తి పెదవుల ముందు వుంచాడు. 


దీప్తి కనురెప్పలను పైకెత్తి పరవశంతో నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఆ చూపుల్లో అంతులేని ప్రేమ, అనురాగం, అభిమానం గోచరించాయి ఈశ్వర్‍కు. 

"దీపూ!.. పాలు త్రాగు!" మెల్లగా చెప్పాడు. 


ఈశ్వర్ చేతిపై తన చేతిని వుంచి.. గ్లాసులోని పాలను తాగింది దీప్తి. 


గ్లాసును తన చేతిలోనికి తీసుకొని మంచం ప్రక్కన వున్న టీపాయ్‍పై వుంచింది. కళ్ళుమూసుకుంది చిరునవ్వుతో. ఆ భంగిమలో దీప్తిలో ఎంతో ఆకర్షణ.. ముఖంలో ప్రశాంతత. 


ఈశ్వర్ చిరునవ్వుతో తన అధరాలను దీప్తికి దగ్గరగా చేర్చి.. "దీపూ!.. " అన్నాడు. 

కళ్ళు తెరువకనే "ఆఁ.. " పరవశంతో అంది దీప్తి. 


"కళ్ళు తెరు.. "


"బావా!"


"కళ్ళు తెరిచి మాట్లాడు!"


"ఇది కలా!.. నిజమా!"


"నీకు ఎలా అనిపిస్తుంది?"


"అయితే నేనే చెప్పాలంటావా"


"అవును బావా!"


ఈశ్వర్.. తన రెండు చేతులను దీప్తి చెక్కిళ్ళపై వుంచాడు. దీప్తిని తనవైపుకు లాక్కున్నాడు. ఇరువురి అధరాలు కలిశాయి. ఇరువురి తనువుల్లో జలదరింపు.. పులకింత.. 


ఈశ్వర్ నవ్వుతూ.. "దీపూ!.. ఇది నిజం.. నీవు నా దానివి. నేను నీవాడను. మనం నీవు కోరుకున్నట్లు.. ఇప్పుడు భార్యాభర్తలం. ఇది మన తొలిరేయి.. " దీప్తిని తన హృదయానికి హత్తుకొన్నాడు. తన్మయత్వంతో దీప్తి.. పందిరిని అల్లుకొన్న జాజితీగలా తన చేతులతో ఈశ్వర్‍ను చుట్టేసింది. 

మరునాటి ఉదయం ఆరున్నరకు ఈశ్వర్, విష్ణు చెన్నైకి బయలుదేరారు. మూడుగంటల్లో వారు కార్లో చెన్నై చేరారు. శంకర నేత్రాలయా హాస్పిటల్‍ల్లో వారు డాక్టర్ బ్రౌన్‍ను కలిశారు. బ్రౌన్ విష్ణు కళ్ళను పరీక్షించాడు. గంట తర్వాత ఈశ్వర్‍ను పిలిచి ఎవరైనా నేత్రదానం చేస్తే విష్ణుకు చూపు వస్తుందని.. నేత్రాలు కాక ట్రీట్‍మెంటుకు దాదాపు మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. చికిత్స నిమిత్తం మీరు నేత్రాలను.. డబ్బును రడీ చేసుకొని నాకు ఫోన్ చేస్తే లండన్ నుంచి వచ్చి చికిత్స చేయగలనని చెప్పాడు. ఆ విషయాన్ని విన్న ఈశ్వర్ సంతోషించాడు. కానీ ఆ సంతోషం అతని మనస్సున ఎక్కువసేపు నిలువలేదు. నేత్రాలను ఎవరు దానం చేస్తారనే ప్రశ్న గుర్తుకు రాగానే!.. 

ఆ విషయాన్ని విష్ణుకు చెప్పాడు ఈశ్వర్. 


"బ్రతికివున్న వారు ఎవరైనా నేత్రాలు దానం చేస్తారా బావా! డాక్టర్ గారు చెప్పింది వినేదానికి బాగుంది. కానీ దాన్ని ప్రాక్టికల్‍గా చూస్తే.. అసంభవం అనిపించడం లేదా బావా!" చిరునవ్వుతో అడిగాడు విష్ణు. 


ఇరువురూ గూడురుకు కార్లో బయలుదేరారు. 

"విష్ణు!.. నిరాశపడకు. డాక్టర్‍గారు చెప్పారుగా నేత్రాలు లభిస్తే నీకు చూపు వస్తుందని. ప్రయత్నిస్తాను. ఇకపై నీవు ఎప్పుడూ నాతోనే వుంటావుగా.. నేను చూచిన వాటిని గురించి నీకు వివరంగా చెబుతాను. నా నేత్రాలు నీవనుకో.. నీ అదృష్టం బాగుంటే ఏదైనా యాక్సిటెండ్‍లో చనిపోయే దానికి చివరిదశలో వున్న వ్యక్తిగాని, క్యాన్సర్ లాంటి వ్యాధి లాస్ట్ స్టేజ్‍లో వుండేవారు గాని.. నేత్రాలను నీకు దానంచేసే దానికి ముందుకు రావచ్చునేమో!.. చూద్దాం.. విచారిద్దాం.. బాధపడకు.. నీకు దృష్టి ప్రాప్తి వుంటే అలాంటివారు తప్పక మనకు తారసపడతారు. " అనునయంగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్. 


"బావా!.. నన్ను వూరడించే దానికి అలా చెప్పావు కానీ అది సంభవం కాదని.. నీకూ.. నాకూ తెలుసు. చిన్న వయసులో బాధపడేవాణ్ణి.. ఇప్పుడు నాకు ఏ బాధా లేదు. నాలాంటివారు సమాజంలో కొందరున్నారు కదా. "


"నీ నమ్మకమే నీకు జయం.. అన్నారు మన పెద్దలు విన్నావా ఈ మాటను" అడిగాడు ఈశ్వర్. 


అతని ఫోన్ మ్రోగింది. 

"హలో!.. "


"నేను.. "


"అంటే?"


"ఆఁ.. "


"ఎవరు?"


"బావా!"


"ఎవరండి మీరు?"

"ఇది అన్యాయం"


"మరి ఏది న్యాయం"

"మామూలుగా మాట్లాడం"


"మీరు ఎవరో తెలియకపోతే ఎలా మాట్లాడగలను?"

"నేను తెలీదా?"


"అందువల్లనేగా ఆ ప్రశ్న"

"ఎవరు బావా?" అడిగాడు విష్ణు. 


"ఎవరో.. పేరు చెప్పడంలేదు" నవ్వాడు ఈశ్వర్. 

"మరోసారి అడుగు బావా"

"ఆ.. మీ పేరేంటండీ!"

"ఏమిటీ నాపేరు మీకు తెలీదా!"


"తెలిస్తే ఎందుకు అడుగుతాను!"

"మా ప్రక్కన మా తమ్ముడు విష్ణు వున్నాడా!"

"ఆఁ.. నా బావమరిది వున్నాడు. "

"అతనికి ఒకసారి ఫోన్ ఇస్తారా"


"ఎందుకు?"

"మాట్లాడాలి!"

"ఎవరిని గురించి?"

"మావారు"

"మీవారు ఎవరు?"

"నా మనిషి"

"అంటే?"

"మై.. మై.. లైఫ్!"

"ఇది ఇంగ్లీష్ కదా అండీ!"

"కాదు మలయాళం.. "

"నాకు మలయాళం రాదండీ! మీపేరేంటో చెప్పండి. "

"వినండి"

"ఆ.. సిద్ధం.. "

"దీప్తీ ఈశ్వర్!”’

"వినిపించలేదు.. "

"ఆఁ.. "

"అవును.. మరోసారి"


"దీప్తి ఈశ్వర్.. దీప్తి ఈశ్వర్! బావా! మామూలుగా మాట్లాడు" దీనంగా అడిగింది దీప్తి. 

"అంటే.. ?"

"రాత్రి మాట్లాడినట్లు. "

"ఇది రాత్రి కాదుగా!"


"కాకపోయినా మాట్లాడవచ్చుగా!"

"కుదరదు.. "

"ఎందుకు కుదరదు?"

"కనీసం ఓ మూడుగంటలు ఆగాలి.. డ్రైవింగ్ చేస్తున్నాను. "


"బావా!"

"ఆఁ.. చెప్పు.. చెప్పు.. చెప్పు" వేగంగా నవ్వుతూ అన్నాడు ఈశ్వర్. 


"బావా! దీప్తి కదూ!"

"అవును"


"ఆట పట్టిస్తున్నావా!" నవ్వాడు విష్ణు. 

"ఎంతసేపట్లో వస్తారు?"


"రెండు గంటల్లో"

"పోయిన పని ఏమైంది?"


"ఎవరైనా నేత్రదానం చేస్తే.. విష్ణుకు చూపు వస్తుందట దీపూ!"

"అలాగా!"

"అవును.. "

"మరి నేత్రాలు!"

"ప్రయత్నించాలి.. ప్రయత్నిస్తాను"


"త్వరగా రండి బావా! బోరుగా వుంది"

"అలాగే! పండూ!"


"ఏం పండు?"

"జాంపండు"

ఇరువురూ ఆనందంగా గలగలా నవ్వుకొన్నారు. 


ఆరోజు ఉదయం పదిన్నర సమయంలో మంచి ముహూర్తాన.. ప్రక్కన బాగుచేయించిన భవంతి ముందు రుక్మిణీ కైలాసపతి హాస్పిటల్ బోర్డును పూజా పునస్కారాలతో హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళలు ఆవిష్కరించారు. దీప్తి పరమానందంతో పొంగిపోయింది. తన బావ.. భర్త ఈశ్వర్ ప్రక్కన లేనందున మదిలో కొరత.. 


పగ.. ద్వేషం.. రాక్షస గుణాలు.. అవి వున్నవారికి తన మన అనే అభిమానం, వాత్సల్యం వుండవు. పైశాచిక చర్యలు చేస్తారు. తమ పంతం నెగ్గించుకొనేదానికి ఆ గెలుపు ’గెలుపు’ కాదని తమ తత్వం మంచిది కాదనే విచక్షణా జ్ఞానం వారికి వుండదు. 


ఈశ్వర్ నడుపుతున్న కారు వెనకాలే ఓ లారీ.. అరగంట నుంచి ఫాలో చేస్తూ.. వస్తూ వుంది. 

సమయం.. సాయంత్రం ఆరున్నర.. వేగంగా వచ్చిన ఆ లారీ ఈశ్వర్ కారును గుద్ది ముందుకు శరవేగంతో వెళ్ళిపోయింది. కారు.. రోడ్డుప్రక్కన దొర్లిపోయింది. ముందువైపు నుంచి వస్తున్న ఓ కారులోని ఇరువురు వ్యక్తులు.. అదృశ్యాన్ని చూచారు. రోడ్డు ప్రక్క పడివున్న కారును సమీపించి ఆపి దిగి.. వేగంగా ఆ కారువద్దకు వచ్చారు. 


స్పృహ లేకుండా రక్తపు గాయంతో అచేతనంగా పడివున్న ఈశ్వర్, విష్ణులను చూచారు. బ్రతికి వున్నారా లేరా అనే సందేహంతో వంగి శ్వాసను గమనించారు. శ్వాస ఆడుతూ వున్న కారణంగా బ్రతికే వున్నారనే నిర్ణయానికి వచ్చి 102 నెంబర్‍కు ఫోన్ చేశారు. 


అతికష్టం మీద డోర్లను తెరిచి ఇరువురినీ బయటికి తీశారు. మంచి మనస్సున్న మనుషులు వారు. ఎంతో ఆందోళన చెందారు. తన కారులో వున్న వాటర్ బాటిల్‍ను తెచ్చి ఇరువురి ముఖాలపై వున్న రక్తాన్ని కడిగి ముఖాలను చూచి వ్యక్తులను గుర్తుపట్టాలనే ప్రయత్నాన్ని చేశారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. ఎవరనేది తెలుసుకోలేకపోయారు. 


అంబులెన్స్ కోసం.. ఎదురుచూస్తూ ఈశ్వర్, విష్ణుల ప్రక్కన నిలబడ్డారు. రోడ్‍పై వెళ్ళే కొన్ని కార్లవారు, ఆపి యాక్సిడెంటుకు గురి అయిన ఈశ్వర్, విష్ణులను చూచారు. సంతాప వాక్యాలను పలుకుతూ వెళ్ళిపోయారు. 


ఈశ్వర్ ఫోన్ మ్రోగింది. ఇరువురిలో ఒక వ్యక్తి పేరు నారాయణ. ఫోన్ చేతికి తీసుకున్నాడు. ఫోన్ చేసింది లావణ్య.. 

"ఈశ్వర్.. !"


ఆ వ్యక్తి అనుకొన్నాడు ’ఇరువురిలో ఒకరిపేరు ఈశ్వర్’

"అమ్మా మీరు?"


"మీరెవరు?"

"నా కొడుకు ఈశ్వర్ ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది?" ఆత్రంగా అడిగింది లావణ్య. 


ఆ తల్లి గొంతులో ఆతృతను గమనించిన నారాయణ వెంటనే ఆమెకు జవాబు చెప్పలేకపోయాడు. 

తల్లి.. కన్నతల్లి.. తన కొడుకు స్థితిని విని తట్టుకోగలదా!.. విషయాన్ని చెప్పాలా వద్దా! ఆందోళనతో నారాయణ. 

"ఏమండీ మాట్లాడరు?" లావణ్య ప్రశ్న. 


"అమ్మా!.. " యాంత్రికంగా సంధిగ్దావస్తలో అన్నాడు నారాయణ. 

"జవాబు చెప్పండి!" ఆవేశంగా అడిగింది లావణ్య. 


ఆలస్యం చేసేకొద్దీ అక్కడ ఆమెకు టెన్షన్.. ఇక్కడ నాకు టెన్షన్.. భరించడం కష్టం. విషయాన్ని చెప్పేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిన నారాయణ ఎంతో సౌమ్యంగా.. 

"వారి కారుకు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు తగిలాయి. చెన్నై వైపు వెళుతున్న నేను ఆ దృశ్యాన్ని చూచాను. నా కారును ఆపి వారిని సమీపించాను. అంబులెన్స్ కు ఫోన్ చేశాను. పావుగంటలో రావచ్చు. నాపేరు నారాయణ. ఇక్కడికి చెన్నై దగ్గర కాబట్టి వారిని హాస్పిటల్లో చేర్చి మీకు ఫోన్ చేస్తానమ్మా! భయపడకండి" నారాయణ ఫోన్ కట్ చేశాడు. 


అరగంటలో అంబులెన్స్ వచ్చింది. ఈశ్వర్, విష్ణులను దానిలో ఎక్కించారు. అది చెన్నై వైపుకు బయలుదేరింది. నారాయణ అతని బావమరిది శశి ఆ అంబులెన్స్ ను ఫాలో అయ్యారు. 

నలభై నిముషాల్లో అంబులెన్స్ సెంట్రల్ ముందున్న జి. హెచ్. కు చేరింది. 

స్ట్రెక్చర్ మీదకు ఈశ్వర్, విష్ణులను చేర్చి.. ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని వెళ్ళారు. 

నారాయణ మామయ్య కిరిటీ ఆ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్.. ఆ క్రిందటి రోజు రాత్రి ప్రజాపతి తన ప్రియురాలు నిలయం చేరాడు. మందు.. విందు.. పొందులో మునిగిపోయాడు. 


అహంకారానికి, స్వాతిశయానికి, ఆవేశానికి, తన మన అనే విచక్షణ వుండదు. దానికి నిదర్శనం.. ద్వాపర యుగ రారాజు దుర్యోధనుడు. ఈ కలియుగ ప్రజాపతి.. ఆ కోవకు చెందినవాడే. 

డ్యూటీలో లేని తన మామయ్య కిరీటికి నారాయణ ఫోన్ చేసి వెంటనే జి. హెచ్‍కి రావలసిందిగా కోరాడు. అదే మంచి మానవత్వం.. 


లావణ్యకు ఫోన్ చేసి ఇరువురినీ హాస్పిటల్లో చేర్చానని.. మీరు వచ్చేవరకూ నేను ఇక్కడే వుంటానని చెప్పాడు నారాయణ. 


ఆమె అతని మాటలను విన్నదో లేదో.. ఫోన్ కట్ అయిపోయింది. 

నారాయణ.. మరోసారి ఫోన్ చేశాడు అనుమానంతో ఫోన్ కట్ అయినందున.. 

శివరామకృష్ణ.. 


"హలో!" నీరసంగా అన్నాడు. 

నారాయణ విషయాన్ని వారికి చెప్పాడు. 


యాక్సిడెంట్ వార్త వినగానే లావణ్య మూర్చబోయింది. దీప్తి భోరున ఏడ్వసాగింది. హరికృష్ణకు గుండెదడ ప్రారంభమయింది. జీవితంలో మంచిచెడ్డల ప్రభావాన్ని పూర్తిగా అనుభవించిన శివరామకృష్ణకు ఆ వార్త కరెంటు షాక్‍లా తగిలింది. ఊర్మిళ.. అయోమయ స్థితికి లోనైంది. 

కొన్ని నిముషాలకు తేరుకొన్న శివరామకృష్ణ.. నారాయణ రెండవ ఫోన్ కాల్‍ను విన్నాడు. ఆ నలుగురికీ ధైర్యం చెప్పాడు. ఎంతో ఆవేదనతో హరికృష్ణ.. లావణ్య.. శివరామకృష్ణ.. ఊర్మిళ.. దీప్తి కార్లో చెన్నైకి బయలుదేరారు. 


వూరి బయట వున్న ప్రజాపతి ఆయిల్ ఫ్యాక్టరీ తగలబడి.. సెగలు, పొగలు పైకి లేవడాన్ని చూచారు. 

"బావా!.. పాపం.. మన ప్రజా ఫ్యాక్టరీ తగలబడి పోతూ వుంది. చూడు!" ఆందోళనతో అన్నాడు హరికృష్ణ. 


"వాడు మన హృదయాలకు రగిల్చిన అగ్నికి ప్రతీకారంగా వాడికి ఆ మాత్రం శాస్తి జరుగవలసిందేరా!" ఆవేశంగా అన్నాడు శివరామకృష్ణ. 


నారాయణ మాట ప్రకారం.. జి. హెచ్‍కి వచ్చిన డాక్టర్ కిరీటి ఈశ్వర్, విష్ణులను చూచి.. 

క్యాజువాలిటీ చీఫ్ డాక్టర్ మురారికి ఫోన్ చేసి రప్పించాడు. వారు ఇరువురినీ ఐ. సి. యూలో వుంచి చికిత్స ప్రారంభించారు. 

ఈశ్వర్, విష్ణు, ఇరువురిలో.. 

డాక్టర్లు తేల్చారు.. ఈశ్వర్ పరిస్థితి.. శ్వాస ఆడేది కొన్ని నిముషాలేనని. పగిలిన కారు అద్దం ఈశ్వర్ గుండెల్లో దిగబడింది. 


స్పృహ వచ్చింది ఈశ్వర్‍కు. 

మెల్లగా కళ్ళు తెరిచాడు. ప్రక్కకు చూచాడు. 


"నా దీప్తి.. అమ్మా, నాన్నా వచ్చారా సార్!" అతి కష్టం మీద అడిగాడు. 

"వారు రాలేదు" చెప్పాడు డాక్టర్ మురారి. 


"డాక్టర్.. విష్ణు.. విష్ణు.. "

"హి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్!" 


ఈశ్వర్ పెదవులపై చిరునవ్వు.. 

"డాక్టర్ బ్రౌన్!" ఎంతో కష్టంతో పలికాడు ఈశ్వర్. 


"చెప్పండి. "

"డాక్టర్ బ్రౌన్"

"ఐ స్పెషలిస్టు.. శంకర నేత్రాలయంలో వున్నారని విన్నాను" అన్నాడు డాక్టర్ మురారి. 


"వారికేనా.. పేరు చెప్పండి.. నా నేత్రాలను మా విష్ణుకు మా.. మా.. విష్ణువుకు" ఈశ్వర్ మాట ఆగిపోయింది. 

తల ఒరిగిపోయింది. 


డాక్టర్ మురారి.. కిరీటి.. విచారంగా నిట్టూర్చారు. 

కిరీటి.. నర్స్ వైపు చూశాడు విచారంగా. 

విచార వదనంతో నర్స్ ఈశ్వర్‍పై తెల్లవస్త్రాన్ని కప్పింది. డాక్టర్.. కిరీటి.. నారాయణను సమీపించాడు. 


"ఒరేయ్!.. నారాయణ!.. నీ ప్రయత్నం ఈశ్వర్ విషయంలో ఫలించలేదా!" విచారంగా కిరీటి. 

కిరీటి డాక్టర్ బ్రౌన్‍కు ఫోన్ చేశాడు. బ్రౌన్ జి. హెచ్ కి వచ్చాడు. ఈశ్వర్ నేత్రాలను జాగ్రత్తగా బయటికి తీశారు. ఫ్రిజర్వ్ చేశారు. 


"రేపు విష్ణుకు నేత్రాలను అమర్చుతాను" ఆమాట చెప్పి డాక్టర్ బ్రౌన్ వెళ్ళిపోయారు. విష్ణుకు స్పృహ వచ్చింది. 


"నీవు త్వరలో ఇంతవరకూ చూడని.. నీవారినందరినీ ఆ సర్వేశ్వరుడు సృష్టించిన ఈ యావత్ ప్రపంచాన్ని చూడబోతున్నావు. ఒక మహానుభావుడు తాను, స్వర్గానికి పోతూ తన నేత్రాలను నీకు దానం చేశాడు" చెప్పాడు డాక్టర్ కిరీటి. 


"ఎవరు సార్!.. ఆ మహాదాత?"

"ఈశ్వర్"


"ఈశ్వర్!!!" ఆశ్చర్యంతో అడిగాడు విష్ణు. 

"అవును.. వారి కీర్తిశేషులు" అన్నాడు డాక్టర్ కిరీటి. 

విష్ణు భోరున ఏడ్చాడు. 


ఈశ్వర్ కాయం.. మార్చూరీకి పంపబడింది. 

ఆ తర్వాత ఒకటిన్నర గంటలకు హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, దీప్తిలు చెన్నై జి. హెచ్‍కి వచ్చారు. విషయాన్ని విని.. వారు గుండెలు బాదుకొంటూ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు. దీప్తి స్పృహ కోల్పోయి నేలకు ఒరిగింది. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

46 views0 comments

Comments


bottom of page