top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 3


'Neti Bandhavyalu Episode 3' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

Published In manatelugukathalu.com On 14/11/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యాల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి. లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి.


అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 3 చదవండి.


హాల్లో కుర్చొని వున్న ప్రజాపతి.... కూతురు లోనికి రావడాన్ని చూచి....

"అమ్మా దీప్తి!.... ఎక్కడికి వెళ్లావురా!..."

"మీతో చెప్పాను కదా నాన్నా!,.... నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నానని."

"ఆఁ....ఆఁ... చెప్పావ్!.... నిన్ను చూచి ఏమంది మీ అత్త!..."

"ఆమె ముందు మీకు చెల్లెలు, తర్వాత నాకు అత్త అయింది కదా నాన్నా! మా చెల్లెలు నిన్ను చూచి ఏమంది అని కదా నాన్నా అడగాల్సింది?..." అంది దీప్తి.

దీప్తి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు ప్రజాపతి.

కూతురు గొంతువిని దీప్తి తల్లి ప్రణవి హాల్లోకి వచ్చింది.

"కూతురు నాకు బాంధవ్యాలను గుర్తు చేస్తూ వుంది ప్రణవీ!..." వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.

"హక్కు వుంది కనుక... చెబుతుంది... అండులో అతిశయోక్తి ఏముందండీ!" చిరునవ్వుతో చెప్పింది ప్రణవి.

ప్రజాపతి నిట్టూర్చి తలను ప్రక్కకు తిప్పుకొన్నాడు.

దీప్తి తల్లిని సమీపించి...

"అమ్మా!... అత్తయ్య వీటిని నీకోసం పంపింది" తండ్రి ముఖంలోకి చూస్తూ చెప్పింది దీప్తి.

"ఏమిటే అవి?..."వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.

"సున్నివుండలట... అవి నీకు చాలా ఇష్టం అని కూడా చెప్పిందమ్మా!"

"అవునే!.... మీ అత్తయ్య అదే నా వదిన... సున్నివుండలను ఎంతో బాగా చేస్తుంది. ఇలా ఇవ్వు..." కూతురు చేతిలోని డబ్బాను అందుకుంది.

ప్రజాపతి గుటకలు మ్రింగుతూ ప్రణవి ముఖంలోకి చూచాడు.

"రంగీ!... ఓ ప్లేటు తీసుకురా!..." కాస్త హెచ్చుస్థాయిలో పలికింది ప్రణవి భర్త ముఖంలోకి చూస్తూ.

ఆ పిలుపును విన్న పనిమనిషి రంగి పరుగున వచ్చి ప్లేటును ప్రణవికి అందించింది.

మూత తీసి ఆరు వుండలను అందులో వుంచి ప్లేటుతో ప్రజాపతిని సమీపించింది.

"తీసుకోండి..." అంది.

"నాకు అక్కర్లేదు."

"ఉదయాన్నే కదా చేయమన్నారు!..."

"నిన్ను చేయమన్నాను..."

"మనం మనుషులం... కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు వుండడం సహజమే!.... కానీ ప్రాణం లేని యీ తీపికి మనలోని వాటికి అంటగట్టడం తప్పుకదండీ!... యీ వుండలను మా వదిన పంపింది మీ కోసమే!... మీ ఇష్టాయిష్టాలు ఆమెకు తెలియంది కాదుగా!.... తీసుకోండి!..." లాలనగా చెప్పింది ప్రణవి.

"నేను చెప్పింది నీకు అర్థం కాలేదా!..." గొంతులో కరుకుదనం.

"అంతేనా!...." అంది ప్రణవి.

"అంతే!...." కుర్చీ నుంచి లేచి వరండాలోకి వెళ్ళిపోయాడు ప్రజాపతి.

"ఏంటమ్మా!... నాన్న ఇంత పెంకిగా తయారైనాడు!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.

"పాపం... పాపం చేస్తే... మనిషికి శాంతి వుండదు. ఇలాగే ప్రతి విషయానికీ కోపం, ఆవేశం వస్తుంది తల్లీ!..."

"అంటే నాన్న!..."

"మీ అత్తయ్య, మామయ్యల విషయంలో నేను ఎంతగా చెప్పినా నా మాట వినకుండా తప్పుచేశాడు!..."

"ఏం చేశాడమ్మా!..."

"పాపాన్ని!..."

"అంటే!..."

"అదో పెద్ద కథలే!... ముందు నన్ను రెండు సున్నివుండలను తిననీ!..."

"ఆఁ... ఆఁ.... తినమ్మా!.... నాకూ రెండు ఇవ్వు!...."

"ప్రణవీ!.... ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు!...." అడిగాడు ప్రజాపతి.

"అమ్మా!... నీవు కూర్చొని తిను. నాన్నకు నేను మంచినీళ్ళు ఇస్తాను" వేగంగా ఫ్రిజ్‍ను సమీపించి బాటిల్‍ను చేతికి తీసుకొని సున్నివుండను నోట్లో వేసుకొని వరండాలోకి వచ్చి...

"నాన్నా!.... వాటర్...!” అంది దీప్తి.

నోటిలో సున్నివుండ ఉండడం కారణంగా... మాటల్లో స్పష్టత లోపించింది. వంగి గ్లాసును ప్రజాపతికి అందించబోయింది దీప్తి. కూతురు ముఖంలోకి చూచాడు ప్రజాపతి. తల్లోని మల్లెలు ముందు వైపుకు జారాయి.

గ్లాసును అందుకొన్నాడు ప్రజాపతి... నీళ్ళను కొంత త్రాగి... "నీ తల్లోని మల్లెపూలు!..."

"మా అత్తయ్య అంటే మీ చెల్లెలు గారు ప్రేమతో తల్లో పెట్టారు. మల్లెల సువాసన చాలా బాగుంది కదా నాన్నా!..." గోముగా అడిగింది దీప్తి.

కొన్నిక్షణాలు దీప్తి ముఖంలోకి చూచి... అవునన్నట్లు తల ఆడించి మంచినీళ్ళు త్రాగాడు ప్రజాపతి. గ్లాసును దీప్తికి అందించాడు.

"ఏం తింటున్నావ్!..."

"సున్నివుండ!..."

"వాసన చాలా బాగుంది!..." అప్రయత్నంగా ప్రజాపతి నోటినుంచి ఆ మాట జారింది.

"తీసుకురానా నాన్నా!...."

రోషం... అహంకారాల బుస... "వద్దని చెప్పానుగా!..." అన్నాడు.

"సరే!... మీ ఇష్టం!...." లోనికి వెళ్ళిపోయింది దీప్తి.

మాధవయ్య ప్రజాపతిని సమీపించాడు.

"రా మాధవా!... కూర్చో..."

మాధవయ్య ప్రజాపతికి ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు.

ప్రజాపతి సింహద్వారం వైపు ఒకసారి పరీక్షగా చూచి....

"అక్కడికి వెళ్ళావా!... మాట్లాడావా!...." మెల్లగా అడిగాడు.

"ఆ రెండూ నేను చేయవలసినవి... సవ్యంగా చేశాను!.."

"మరి... వాళ్ళేమన్నారు?..."

మౌనంగా ఆ ఉదయం హరికృష్ణ ఇంట్లో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకొంటూ కూర్చున్నాడు మాధవయ్య.

అతని మౌనాన్ని సహించలేక ప్రజాపతి...

"ఏమన్నారో చెప్పరా!..."

"మీ సోదరి నా నోటికి తాళం వేసింది..."

"అంటే!..."

"ఒరే! ప్రజా!... నేను హరికృష్ణతో శార్వరి వివాహం... అన్నానో లేదో.... ఆ మహాతల్లి నీ సోదరి లావణ్య నన్ను బెదిరించింది. నిన్ను అసహ్యించుకొంది. ’సంబంధాలను కలుపుకోవాలనే మంచి మనస్సు వాడికి వుందేమో కానీ మాకు అంతటి గొప్ప మనస్సులేదు. వాడు మాకు చేసిన ద్రోహాన్ని మేము మరువలేదు. మా పిల్లలకు సంబంధాలు చూచే ప్రయత్నాన్ని మీరు మానుకోండి..’ అంది" విచారంగా చెప్పాడు మాధవయ్య.

ప్రజాపతి... కళ్ళల్లో క్రోధం... ముఖంలో చిరాకు.

"హరి ఏమీ అనలేదా!..." సాలోచనగా అడిగాడు ప్రజాపతి.

"ఆ ఇంట్లో ఆమె మాటను కాదనే ధైర్యం ఎవరికి వుందిరా!... మీ బావ సత్తా నీకు తెలీదా!..." వ్యంగ్యంగా నవ్వాడు మాధవయ్య.

హృదయంలో ఆవేశాన్ని అణచుకొని మౌనంగా వుండిపోయాడు ప్రజాపతి.

"ప్రజా!... ఓ మాట చెప్పనా!...."

"అదేమిటో చెప్పు!..."

"నీ కోర్కె నెరవేరాలంటే ఒకే ఒక్క మార్గం వుంది!..."

"ఏమిటది?..."

"నీవు వాళ్ళ ఇంటికి వెళ్ళి నావలన మీకు అన్యాయం జరిగింది... తప్పు నాది... నన్ను మీరు క్షమించాలని వాళ్ళ ఇరువురి కాళ్ళు పట్టుకోవాలి!... అది నీవు చేయగలవా!..."

"అసంభవం!..." గర్జించినట్లు అన్నాడు ప్రజాపతి.

"నీవు అంత గట్టిగా ఆ మాటంటే... నీ ఆశయం నీళ్ళమూటే!..."

"నేను గతాన్ని మరచిపోవాలనుకొంటున్నాను మాధవా!..."

"వాళ్ళు ఆ గతాన్ని మరవలేదు ప్రజా!..."

"అంటే!..."

"నీవల్ల వారి హృదయాలకు తగిలిన గాయాలు మానలేదని అర్థం..."

"అది కాదు!..."

"మరేమిటి?..."

"వారికి నాతో పంతం!...."

"ఏ విషయంలో!...."

"నా విషయంలో!..."

"అవును... అది వారికి వుండడం సహజమే కదా!.... తప్పు చేసిన నీవే మూడేళ్ళుగా ఆ ఇంటివైపు చూడని వాడివి... నిన్న నీ కొడుకు శార్వరిని నేను ఇష్టపడుతున్నాను... పెండ్లి అంటూ చేసికొంటే దాన్నే చేసికొంటాను. లేకపోతే... సన్యాసుల్లో కలిసిపోతాను నీతో చెప్పటంతోటే... నీవు నీ కొడుకు ఆనందం కోసం.... వారితో రాజీకి దిగావు. నీ పంతం సడలించావు. నన్ను రాయబారానికి పంపావు. ఇందులో పూర్తిగా నీ స్వార్థం వుంది. కానీ... వారి మాటల్లో.... ఎలాంటి స్వార్థం లేదు... వున్నదల్లా అవమాన భారం!... పౌరుషం!..."

"నా గురించి నీకు బాగా తెలుసుగా!..."

"నేను ఇరువురికీ బంధువునేగా!.... వారిని గురించీ నాకు బాగా తెలుసు!... చూడు ప్రజా!... నేను అందరి మేలు కోరేవాడిని. నామాట విను. నీవు నేరుగా వెళ్ళి నీ చెల్లికి క్షమాపణ చెప్పు. నీ చెల్లెలు లావణ్యకు నీలాగే ఆవేశం... కోపం ఎక్కువ. ఎదుటి వారి మాటలు తనకు నచ్చకపోతే నిర్భయంగా తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది. మొహమాటపడదు, భయపడదు. ఆమె మనస్సు చాలా మంచిది. ఇక హరికృష్ణ... వాడు ధర్మరాజు... వాడిని గురించి నీకు బాగా తెలుసుగా!..." అనునయంగా చెప్పాడు మాధవయ్య.

తలాడించాడు ప్రజాపతి శూన్యంలోకి చూస్తూ.

"వస్తారా... చెప్పవలసింది నీకు చెప్పాను. ఇక నీ ఇష్టం!..." మాధవయ్య లేచి వెళ్ళిపోయాడు.

ప్రజాపతి... ఆలోచనలో మునిగిపోయాడు.

* * * *

ప్రణవి... దీప్తి తల్లి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి హైస్కూలు మాస్టారు. ప్రణవిని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఆమెను బి.ఎ వరకు చదివించారు. ప్రణవి... బి.ఇడీ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది.

ప్రజాపతి శ్రీరామనవమి నాడు ప్రణవిని రామాలయంలో చూచాడు. ఆమె అందచందాలకు భ్రమించి... పలకరించి... మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ ప్రణవి అతనికి ఆ అవకాశాన్ని కలిగించలేదు.

బి.ఇడీ కాలేజి నుండి తిరిగి వస్తుండగా ఒకనాడు దారికాచి పలకరించాడు ప్రజాపతి. తన మనస్సులోని మాటను నిర్భయంగా చెప్పాడు. పెండ్లి చేసికొందాం అన్నాడు. "నేను మీకు అంతగా నచ్చితే... మీ అమ్మానాన్నలను వచ్చి నా తల్లిదండ్రులను కలిసి మాట్లాడమని చెప్పండి. ఇలా దారికాచే ప్రయత్నాన్ని ఇకపై చేయకండి. మాది ఎంతో పరువు ప్రతిష్టలున్న కుటుంబం. ఆ ఇంట్లో నేను పెద్ద బిడ్డను. నా తర్వాత ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మేము మధ్య తరగతి కుటుంబీకులం. మీ తల్లిదండ్రులు కట్నకానుకలు ఆశిస్తే.... వారు కోరిన రీతిగా ఇచ్చే స్థోమత మాకు లేదు. మీరు అడిగిన దానికి నేను అన్ని వివరాలతో జవాబు చెప్పాను. నా దారికి అడ్డు తొలగండి. ప్లీజ్!..." వేగంగా వెళ్ళిపోయింది ప్రణవి.

ఆమె మాటల తీరు... ప్రజాపతికి ఎంతగానో నచ్చింది. ఇంటికి వెళ్ళి తన నిర్ణయాన్ని తల్లి రుక్మిణికి తెలియజేశాడు. ప్రణవి తండ్రి అచ్యుతరామయ్య. రుక్మిణికి దూరపు బంధువు. భర్త కైలాసపతితో కుమారుని నిర్ణయాన్ని తెలియజేసింది.

రుక్మిణి... "పిల్లవాడు ఆశపడుతున్నాడు. పైగా వారు నాకు బంధువులు. కులగోత్రాలను ఎంచుకొన అవసరం లేదు. మీరు సరే అంటే.... వరుసకు అన్నయ్య అయిన అచ్యుతరామయ్యను పిలిపించి మనం మాట్లాడుదాము" అంది.

కైలాసపతి నిగర్వి. కోటీశ్వరుడు. ఆయన చెల్లెలు శ్యామల. గోపీనంద భార్య. వారే హరికృష్ణ తల్లిదండ్రులు... కైలాసపతి చెల్లెకి పెళ్ళిచేసిన తర్వాత తాను పెళ్ళి చేసుకొన్నాడు. వారి భార్య పేరు రుక్మిణి. వారిరువురి సంతతి... కొడుకు ప్రజాపతి, కూతురు లావణ్య. అచ్యుతరామయ్య తన భార్య రుక్మిణికి బంధువై వున్నందున... భార్యాభర్తలు ఇరువురూ కలిసి అచ్యుతరామయ్య ఇంటికి వెళ్ళి ప్రజాపతి... ప్రణవిల వివాహాన్ని గురించి ప్రస్తావించారు.

అచ్యుతరామయ్యకు రుక్మిణీ అక్క వరుసైనందున... వారిని ఎంతో గౌరవించి... "మీ నిర్ణయమే మా నిర్ణయం..." అని సవినయంగా చెప్పాడు.

మంచిరోజున నిశ్చితార్థం... మూడు వారాల తర్వాత ప్రజాపతి... ప్రణవిల వివాహాన్ని వారికి వున్నంతలో ఘనంగా జరిపించారు అచ్యుతరామయ్య. ప్రణవి, కైలాసపతి ఇంట్లో కాలు పెట్టిన వేళావిశేషం... వారు చేస్తున్న అబ్రకం వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. విదేశ ఎగుమతి పెరిగింది. లక్ష్మీదేవి వారిని పరిపూర్ణంగా కటాక్షించింది. ప్రణవికి నోములు, వ్రతాలు, పూజలు అంటే చిన్నతనం నుంచి ఎంతో ఇష్టం. కారణం ఆమె తల్లిదండ్రులు ఆ నమ్మకాలు కలిగిన వారైనందున.

కోడలు సుగుణాలను చూచి కైలాసపతి... రుక్మిణి ఎంతగానో సంతసించారు. కానీ ఏడు సంవత్సరాలు గడిచినా ప్రణవికి సంతానం కలుగకపోవడంతో కైలాసపతి... రుక్మిణి... ప్రజాపతి ప్రశాంతతను కోల్పోయారు. తన దుస్థితికి ప్రణవి తనలో తాను ఏడ్చుకొనేది.

కైలాసపతి... వేరుశెనగ, నువ్వుల నూనె ఫ్యాక్టరీని నిర్మించారు. ప్రజాపతి ఆ ఫ్యాక్టరీల అజమాయిషీని చూచుకొనేవాడు.

హరికృష్ణ తల్లి మహాలక్ష్మి కైలాసపతి చెల్లెలు. ఆ చెల్లెలన్నా ఆమె భర్త నరసింహం అన్నా కైలాసపతికి ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం.

ప్రజాపతి కన్నా హరికృష్ణ ఐదు సంవత్సరాలుపెద్ద. నరసింహం పాలవ్యాపారి. హరి పుట్టిన వేళావిశేషం... ఆర్థిక వసతులు ఏర్పడి వారు పాల ఫ్యాక్టరీని స్థాపించారు. చుట్టు ప్రక్కనున్న ఇరవై గ్రామాల నుండి వారి ఫ్యాక్టరీకి పాలు వచ్చేవి. పెరుగు, వెన్న, నెయ్యి, పాల విక్రయంతో బాటు వాటిని చెన్నైకి కూడా సప్లై చేసేవారు.

ఎం.ఎ వరకు చదివిన హరికృష్ణ ఆ పాలఫ్యాక్టరీ వ్యవహారాలను స్వయంగా చూచుకొనేవారు.

కాశీకి వెళ్ళిన నరసింహం, భార్య మహాలక్ష్మి రైలు ప్రమాదంలో మరణించారు. కైలాసపతి తన మేనల్లుడికి అండగా నిలబడి ఓదార్చాడు. అతని అభివృద్ధికి సహకరించాడు. తండ్రి నరసింహం వలె... హరికృష్ణ తండ్రికి తగిన తనయుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న కారణంగా... కైలాసపతి తన ముద్దుల కుమార్తె లావణ్యకు.. హరికృష్ణకు ఎంతో వైభవంగా వివాహాన్ని జరిపించాడు.

హరికృష్ణతో లావణ్య వివాహం జరగడం ప్రజాపతికి ఇష్టం లేదు. తండ్రిని ఎదిరించలేక మౌనంగా వుండిపోయాడు. ఆకారణంగా... తల్లిదండ్రులను గౌరవించడం మాని... వారిపై ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచుకొన్నాడు. పెద్దల సలహాలు పాటించే వాడుకాదు. తన ఇష్టానుసారం స్వేచ్ఛగా నడుచుకొనేవాడు. ఎదిగిన కొడుకు ఆ రీతిగా ప్రవర్తిస్తూ.... తమని గౌరవించకుండా అభిమానించకుండా పోయాడనే బాధ ఆ దంపతులను కృంగదీసింది.

హరికృష్ణ, లావణ్యల వివాహానంతరం తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు ప్రసవాలు జరిగాయి.

కానీ... ప్రజాపతికి... ప్రణవికి ఆరు సంవత్సరాలుగా సంతతి లేదు. ఏడవ ఏట... తొలుత ఆడబిడ్డ. ఒకటిన్నర సంవత్సరంలోనే మగబిడ్డ కలిగారు.

కైలాసపతి.... రుక్మిణి గతించి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. మొదట రుక్మిణి... ఆ తర్వాత ఆరునెలల లోపే కైలాసపతి స్వర్గస్థులైనారు.

వదిన మరదళ్ళు ప్రణవి, లావణ్యలు ఎంతో ఒద్దికగా అక్కాచెల్లెళ్ళ వలె వుండేవారు. కాలగమనంలో ప్రజాపతి మనస్సు మారింది.

ఆ వదిన మరదళ్ళవలె హరికృష్ణ, ప్రజాపతి కూడా పరస్పరం ఎంతో ప్రేమాభిమానాలతో వుండేవారు.

ప్రజాపతికి చెల్లెలు లావణ్య అంటే పిచ్చి ప్రేమ...

మూడు సంవత్సరాల క్రిందట జరిగిన ఒక దుస్సంఘటన ఆ రెండు కుటుంబాలను వేరుచేసింది. వారి మధ్యన వుండిన ఆత్మీయతను, అభిమానాలను చంపేసింది.

కైలాసవతి... చివరిరోజుల్లో తన యావదాస్తిని రెండు భాగాలుగా చేసి కొడుకు ప్రజాపతికి, కుమార్తె లావణ్యకు వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించి ఇరువురికీ అందించాడు. లావణ్య సంతోషించింది కానీ... ప్రజాపతికి తన తండ్రి నిర్ణయం... వ్రాసిన వీలునామా నచ్చలేదు. జరిగిన సంఘటనకు ముందే వీలునామాలు సిద్ధం అయిన కారణంగా తండ్రి గతించిన తర్వాత హరికృష్ణ, లావణ్యల మీద ప్రజాపతికి కోపతాపాలను పెరిగే దానికి ఆస్థిపంపకం కూడా ఒక ముఖ్యకారణం అయింది. ప్రణవికి మాత్రం... తన మామగారు ధర్మబద్ధంగా చేశారనే సంతోషం. భర్త ధోరణిలో, మాటల్లో ఆ కుటుంబానికి సంబంధించి పగ పెరుగుతూనే వుందని గ్రహించి అతనికి ఎదురుచెప్పలేక మౌనాన్ని పాటించేది.

కొన్ని కుటుంబాల్లో మగవారు స్వార్థంతో ఇంట్లో శ్రీరాముడిగా, వీధిలో రావణాసురుడుగా ప్రవర్తించేవారు కొందరుంటారు. కానీ ఆ ఇంటి గృహిణి... భర్త తత్త్వాన్ని విమర్శించలేక... అతన్ని హెచ్చరించలేక... తన మనోవ్యధను తాను నమ్ముకొన్న దేవునికి మొర పెట్టుకొంటుంది. తన భర్త తత్త్వాన్ని మార్చమని వేడుకొంటుంది. అలాంటి కోవకు చెందింది ప్రణవి. ఆమె ప్రార్థన.... దైవ ఆరాధన.. ప్రజాపతికి అతనికి తెలియని అండదండలు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


82 views0 comments

Comments


bottom of page