'Neti Bandhavyalu Episode 4' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 19/11/2023
'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హరికృష్ణ, లావణ్యాల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి. లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి.
అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది.
ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది.
ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 4 చదవండి.
ఉదయం... ఎనిమిదిన్నరకు టిఫిన్ తిని దీప్తి తన గదికి వెళ్ళిపోయింది. తను హరికృష్ణ ఇంటికి వెళ్ళివచ్చాక తనకు తండ్రికి మధ్యన, తండ్రికి తల్లికి మధ్యన జరిగిన సంభాషణ, ప్రజాపతి ధోరణి... దీప్తికి విచిత్రంగా తోచాయి. తాను అమెరికాకు వెళ్ళేరోజున జరిగిన సంఘటన ఆమె కళ్ళముందు నిలిచింది.
హరికృష్ణ, లావణ్య వారి పెద్దకొడుకు దినకర్ అతని భార్య పద్మిని, కూతురు వాణి, తన తండ్రి ప్రజాపతి, తల్లి ప్రణవి, తమ్ముడు సీతాపతి, బాబాయ్ మాధవయ్య తనతో చెన్నైకి వచ్చారు.
దారి పొడుగునా సరదా సరదా కబుర్లు... ఇకఇకలు పకపకలు.. అందరూ ఎంతో ఆనందంగా దీప్తికి వీడ్కోలు చెప్పేదానికి చెన్నై ఎయిర్‍పోర్టుకు చేరారు.
అంతమంది తనవారిని వదిలి... తన పట్టుదలతో అమెరికాలో డాక్టర్ కావాలని బయలుదేరింది దీప్తి. ఆ రోజు దివాకర్ అతని భార్య పద్మినీ కూడా అమెరికాకు తిరిగి పయనం.
అందరూ ఎయిర్‍పోర్టులో వ్యాన్ దిగారు. అత్త లావణ్య దీప్తి దగ్గరకు వచ్చి తన చేతులతో ఆమె భుజాలు పట్టుకొని "దీపూ!... నీవు మా నుండి దూరంగా దేశంకాని దేశానికి వెళుతున్నావు. బాగా చదివి నీ లక్ష్యాన్ని సాధించు. వారి సాంప్రదాయాలకు, మన సాంప్రదాయాలకు ఎంతో వ్యత్యాసం. అక్కడి సమాజంలో జాగ్రత్తగా మసలుకోవాలి. వెళ్ళిన పనిని సవ్యంగా ముగించుకొని తిరిగి రావాలి. మన కుటుంబాల గౌరవ మర్యాదలను మరువకూడదు. నా కోడలుగా వెళ్ళే నీవు... నా కోడలిగానే తిరిగి రావాలి. జాగ్రత్తరా... నేను చెప్పినవన్నీ మనస్సున వుంచుకో. మరువకు..." ఆ క్షణంలో లావణ్య కళ్ళల్లో కన్నీరు. వాటిని చూచిన దీప్తి... మిగతా అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.
"ఆఁ.... అదిగో మీ ఫ్లయిట్‍కే అనౌన్స్ మెంటు బయలుదేరమ్మా!" అంది లావణ్య.
దివాకర్, పద్మిని, అత్తామామలకు, అమ్మా, నాన్నలకు వెళ్ళొస్తాం అని చెప్పి ఎయిర్‍పోర్టులో ప్రవేశించారు. అందరికీ వీడ్కోలు చెప్పిన దీప్తి.... వారి వెనకాలే ఎయిర్‍పోర్టులో ప్రవేశించింది. నలభై ఐదు నిముషాల తర్వాత ఆ ముగ్గురూ ఎక్కిన విమానం టేకాఫ్‍ను చూచి మిగిలినవారు, తమ వూరు గూడూరుకు బయలుదేరారు.
అంతటి ప్రేమాభిమానాలతో ఏక కుటుంబంగా వున్న యీ రెండు కుటుంబాలు నేడు ఈ రీతిగా... రాకపోకలు లేకుండా విరోధుల్లా ఎలా మారిపోయారు?... ఏదో బలమైన కారణం వుండి వుండాలి!... అది నాకు తెలియాలి... మామయ్య ఎవరినీ అడగవద్దని ఆంక్ష పెట్టాడు. అడగలేను... ’భగవాన్! నీవే నాకు సాయం చేయాలి తండ్రీ!...’
తాను నమ్మిన గురుదేవులు శ్రీరమణ భగవానులను దీనంగా వేడుకొంది దీప్తి. తల్లి ప్రణవి దీప్తి గదిలోకి ప్రవేశించింది.
"దీపూ!... ఏం చేస్తున్నావ్!"
పడుకొని గతానికి సంబంధించిన ఆలోచనలతో వున్న దీప్తి... తల్లి పిలుపు విని లేచి మంచంపైన కూర్చుంది. చిరునవ్వుతో తల్లి ముఖంలోకి చూచింది.
ప్రణవి మంచంపైన కూర్చుంది. దీప్తి ముఖంలోకి చూచింది. ఆమె దేన్ని గురించో ఆలోచిస్తున్నదనే భావన... ప్రణవికి దీప్తి ముఖంలో గోచరించింది.
"దీపూ!...."
"ఏమ్మా!..."
"దేన్ని గురించిరా... దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్!..." చిరునవ్వుతో అడిగింది ప్రణవి.
"భవిష్యత్తును గురించి."
"ఎవరి భవిష్యత్తును గురించి!..."
"మన కుటుంబ భవిష్యత్తును గురించి."
"నీ గురించి కాదా!..."
"నేను అన్న మన అనేదాంట్లో నేనూ వుంటాను కదా అమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"ఆఁ.... అవునవును... మీ బావ...." ఆగిపోయింది ప్రణవి.
"ఏమ్మా ఆపావు?..."
"తప్పుగా అనుకోకు..."
"అనుకోను..."
"నీతో మాట్లాడాడ?..."
"లేదు..."
"ఎలా మాట్లాడుతాడు!..." నిట్టూర్చింది ప్రణవి.
"ఎందుకని?..."
"మీ నాన్నగారి మహిమ...."
"అంటే!..."
"ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నిప్పు అంటించింది మీ నాన్నగారేగా!"
"నీ మాటలు నాకు అర్థం కాలేదమ్మా!..."
"ఆ కుటుంబానికి మీ నాన్నగారు చేసిన అన్యాయాన్ని తలచుకొంటే నా మనస్సుకు ఎంతో బాధ. నీవు అమెరికాలో వుంటివి నీకేం తెలీదుగా!.."
అవునన్నట్లు తల ఆడించింది దీప్తి.
"నేను వివరంగా చెబుతాను విను. హరికృష్ణ అన్నయ్యగారి కూతురు వాణి ఎందుకు లేచిపోయిందో నీకు తెలీదు కదా!"
"తెలీదు. కానీ పెద్దబావ దినకర్ అమెరికాలో నాతో నీవు అన్నమాటనే... అంటే వాణి ఎవరితోనో లేచిపోయిందని" దీప్తి ముగించకముందే....
"ఆ పిల్ల లేచిపోలేదు. మీ నాన్న ఆ పిల్లను అతని పేరు... కళ్యాణ్‍తో లేచిపోయేలా చేశారు. అతని తండ్రి రామయోగి మీ నాన్నగారికి మంచి స్నేహితుడు.
ఒకరికి తెలియకుండా ఒకరు ఎలక్షన్‍లో నిలబడాలనుకొన్నారు. ఇరువురూ నామినేషన్స్ వేశారు.
ఆ విషయం విన్న రామయోగి మీ నాన్నగారిని కలిశాడు. వారు మన కులం వారు కాదు. రామయోగి కులస్థులు చాలామంది వున్నారు. మీ నాన్న విత్‍డ్రా చేసుకొంటే... అతను తప్పక గెలిచేవాడు...
తన వద్దకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించిన రామయోగితో మీ నాన్న... తాను విత్‍డ్రా చేసికోనని నిర్మొహమాటంగా చెప్పాడు. రామయోగిని తనకు సపోర్టు చేయమన్నాడు. రామయోగి కొడుకు కళ్యాణ్, వాణి ఒకే కాలేజీలో చదివినవారు. కళ్యాణ్ మంచి అందగాడు. వాణి కన్నా ఒక సంవత్సరం సీనియర్. అతను వాణిని ప్రేమించాడు. ఎంతో తెలివైన కళ్యాణ్ వలలో వాణి పడిపోయింది. తనూ అతనిని ప్రేమించింది. వారిరువురూ కలిసి తిరగడాన్ని మీ నాన్నగారు చూచారు. వాణిని పిలిపించి విషయాన్ని అడిగాడు మీ తండ్రి. ’మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మామయ్యా!.... మీరే అమ్మా నాన్నలతో మాట్లాడి మా వివాహాన్ని జరిపించమని’ కోరింది వాణి.
అప్పటికి అందరం... బంధుప్రీతితో వున్నందున మీ నాన్నగారు హరికృష్ణ అన్నయ్య... మీ అత్త లావణ్యతో వాణి అభిప్రాయాన్ని చెప్పి... కాలం మారింది. మనం మన తత్త్వాలు మార్చుకొని... ఒకరిపట్ల ఒకరు ఎంతగానో ప్రేమ పెంచుకొన్న వాణి, కళ్యాణ్‍ల వివాహానికి సమ్మతించండి అని చెప్పారు.
మీ మామయ్య, అత్తయ్యలు మీ నాన్నగారి మాటలను లెక్కచేయలేదు.
ఆవేశంలో మీ అత్త లావణ్య ’నీ బిడ్డ విషయంలో మేము నీకు అలాంటి సలహా ఇస్తే నీవు పాటిస్తావా!... సరి కులంగోత్రం లేని వాడికి నా కూతురుని ఇవ్వను. పిల్లకు మేనమామ అయ్యుండి మాతో అలాంటి మాటలు చెప్పేదానికి నీకు నోరెలా వచ్చింది!!... వెళ్ళిపో మా ముందు నుంచి వెళ్ళిపో!’ అని మీ తండ్రిని అసహ్యించుకొంది.
అవమానంతో మీ నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చారు. వారి వాలకాన్ని చూచిన నేను విషయాన్ని గ్రహించాను. ’ప్రణవీ!... నా మాటలను జాగ్రత్తగా విను. ఈ క్షణం నుంచీ ఆ ఇంటికి... ఈ ఇంటికి రాకపోకలు జరుగకూడదు. ఈ మాటలను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకో!’ వీరావేశంతో నన్ను హెచ్చరించారు. కళ్యాణ్‍కు ఢిల్లీ ఆర్కలాజికల్ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. మూడు వారాల్లో వెళ్ళి డ్యూటీలో జాయిన్ కావాలి.
రామయోగి... తన చెల్లెలి కూతురుతో కళ్యాణ్ వివాహం జరిపించి ఇరువురినీ ఢిల్లీ పంపాలని సంకల్పించి... తన నిర్ణయాన్ని కళ్యాణ్‍కు తెలియజేశాడు. కళ్యాణ్ తాను వాణిని ప్రేమించిన విషయాన్ని తండ్రికి చెప్పి... వివాహం అంటూ చేసుకొంటే నేను వాణినే చేసుకొంటాను. ఆమె తల్లిదండ్రులను కలసి మాట్లాడి ముహూర్తాలు పెట్టించండన్నాడు.
హరికృష్ణ అన్నయ్య.... రామయోగికి పెద్దగా పరిచయం లేదు. అతనికి బాగా సన్నిహితుడైన మీ నాన్నగారికి రామయోగి విషయాన్ని చెప్పి వాణీకి కళ్యాణ్‍కు వివాహం జరిగేలా చూడవలసిందిగా కోరారు. స్వార్థం... ఆ ఇంటివారు తనను అవమానించారనే ద్వేషంతో మీ నాన్నగారు రామయోగికి ఒక షరతు పెట్టారు.
’నీవు ఎలక్షన్ నామినేషన్ విత్‍డ్రా చేసుకొంటే.... నీ కొడుకు కళ్యాణ్‍కు, వాణికి వివాహం జరిగేలా చేయగలను. ఒకరోజు ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజెయ్యి!...’ అని చెప్పి రామయోగిని పంపించేశారు.
ఒక్కగానొక్క కొడుకు... మంచి ఉద్యోగం... అతడు వివాహం చేసుకోకుండా సన్యాసిగా మారడం ఇష్టం లేని రామయోగి ఎలక్షన్‍కు వేసిన నామినేషన్‍ను విత్‍డ్రా చేసుకొన్నారు. రెండవరోజు వచ్చి ఆ విషయాన్ని మీ నాన్నగారికి తెలియజేశాడు. మీ నాన్నగారికి ఎంతో ఆనందం.
వాణిని పిలిపించి...
’చూడు వాణీ!... నేను నీ విషయాన్ని గురించి... మీ అమ్మానాన్నలతో మాట్లాడాను. కానీ వారు కళ్యాణ్‍తో నీ వివాహాన్ని జరిపించేదానికి అంగీకరించలేదు. నన్ను అవమానించారు. కానీ!. నీవు నీ నిర్ణయాన్ని నన్ను నీ తండ్రిగా భావించి చెప్పినందుకు... నేను నీ వివాహాన్ని నీవు ప్రేమించిన కళ్యాణ్‍తో జరిపిస్తాను. అతనికి ఇప్పుడు ఢిల్లీలో వుద్యోగం వచ్చింది. హాయిగా పెళ్ళి అయిన తర్వాత మీ ఇరువురూ ఢిల్లీకి వెళ్ళిపోండి. ఇక మీ అమ్మా నాన్నల విషయం అంటావా!... ఈనాటి కోపం... కలకాలం వుండబోదు. కాలం వారి మనస్తత్వాలను తప్పక త్వరలోనే మారుస్తుంది. మనస్సుకు నచ్చిన వాడితో సహజీవనం ఎంతో ఆనందంగా వుంటుందమ్మా. ఎం.ఎస్సీ వరకూ చదివినదానివి నీకెందుకమ్మా భయం. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా... నాకు ఫోన్ చేయ్యి నీవు నా మేనకోడలివి. నీవు ఆనందంగా జీవితం సాగించేలా చేయడం నా ధర్మం.... భయపడకు... బాధపడకు’
ఆ రీతిగా... చెప్పి వాణిని తన వశం చేసుకొన్నాడు మీ తండ్రి. కన్న తల్లిదండ్రుల కన్నా మిన్నగా వాణి నీ నాన్నను నమ్మింది. మీ అత్తయ్యా, మామయ్యా శ్రీశైలం యాత్రకు వెళ్ళారు. ఆ సమయంలో రిజిష్ట్రార్ ఆఫీసులో వాణి, కళ్యాణ్‍లకు మీ నాన్నగారు వివాహం జరిపించారు. రెండు రోజుల తర్వాత వారితో కలిసి చెన్నై వెళ్ళి వారిని విమానంలో ఢిల్లీ పంపారు.
నాలుగురోజుల తర్వాత యాత్రనుండి తిరిగి వచ్చిన మీ అత్తయ్య మామలకు మాధవయ్య బావగారు వూర్లోలేని సమయంలో జరిగిన వాణి, కళ్యాణ్‍ల వివాహాన్ని గురించి... వారు ఢిల్లీకి వెళ్ళిపోయిన విషయాన్ని గురించి తెలియజేశాడు.
వీర ఆవేశంతో మీ అత్తయ్య మన వాకిటికి వచ్చి... ’ఒరేయ్! ప్రజాపతీ!... రారా బయటికి. మా సమ్మతం లేకుండా నా కూతురి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించే హక్కు, అధికారం నీకు ఎక్కడిదిరా!... నీచుడా!... మేము నీకు ఏం అన్యాయం చేశామురా!... నా తండ్రి ఆస్థిలో నాకు అర్థభాగం ఇచ్చాడని మాతో పగతో... అన్నెపున్నెం ఎరుగని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు కదరా!... దుర్మార్గుడా!.... నీదీ ఒక బ్రతుకేనా!... ఛీ...ఛీ..." కొట్టి ఎంత ఆవేశంతో వచ్చిందో అదే వేగంతో తిరిగి వెళ్ళిపోయింది మీ అత్తయ్య.
వరండాలో మాటలుడిగి... నేను మీ నాన్న చిత్తరువుల్లా నిలబడిపోయాము.
ఆనాటి ఒక సంఘటన... మన రెండు కుటుంబాల మధ్యన... పగ, ద్వేషాలను పెంచింది. ఇది జరిగి ఈనాటికి మూడు సంవత్సరాలు. గత ఐదారు ఏళ్ళుగా నేను మీ నాన్నగారి నిర్ణయాలతో ఏకీభవించలేకపోతున్నాను. దేవుడా!... ఆయనకు మంచి బుద్ధిని ఇవ్వు అని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఆడదాన్ని పరువుకలదాన్ని అంతకంటే నేను ఏమీ చేయలేను కదమ్మా!!" అని కన్నీటితో కథను ముగించింది ప్రణవి.
సూర్యరశ్మికి కరిగిన మంచులా... ప్రణవి చెప్పిన కథ మూలంగా దీప్తి మనస్సున వుండిన సందేహాలన్నీ తీరిపోయాయి. తన తండ్రి చర్య వలన... అత్తామామలు ఎంతగానో బాధపడ్డారని గ్రహించింది... బంధువులందరికీ... తల్లిదండ్రులకు దూరం అయిన వాణీ ప్రస్తుతం ఢిల్లీలో ఆ వ్యక్తితో ఎలా వుందో అనే సందేహం!...
"అమ్మా!... వాణి ఢిల్లీలో ఎలా వుందో నీకేమైనా తెలుసా!..."
"నాకేం తెలిదమ్మా!..."
"నాన్నగారికి తెలిసుంటుందా!..."
"ఏమో!..."
"నేను ఢిల్లీకి వెళ్ళిరానా!"
"ఎందుకు?"
"వాణిని చూచి వచ్చేదానికి!..."
"వాణిని ఎందుకు చూడాలనుకొంటున్నావు?"
"వాణి వదిన చాలా మంచిదికదమ్మా!..."
"ఆ ఇంట్లో వుండే వారంతా చాలామంచివారు. ఒక్క వాణియే కాదు!..." అంది ఆవేదనతో ప్రణవి.
"అమెరికాలో నేనుండే చోటికి పెద్దబావ దినకర్ నెలకు రెండుసార్లు వచ్చి నన్ను కలిసేవాడు. వాణి విషయాన్ని నాకు వారే చెప్పారు. నెలకొకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. ’నేను నిన్ను ఎత్తుకొని తిరిగేవాణ్ణి దీపూ!...’ అని చిన్ననాటి జ్ఞాపకాలను నాతో చెప్పేవాడు. అక్క... పద్మినీ, నన్ను సొంత చెల్లెలిలా చూచుకొనేది" సాలోచనగా చెప్పింది దీప్తి.
"దీపూ!... నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి!’"
"నేను నీ కూతురునమ్మా!... అడుగు!..."
"నీకు మీ ఈశ్వర్ బావ అంటే ఇష్టమేనా!"
దీప్తి ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది.
"ఏందే!... అలా చూస్తున్నావ్!... నా ప్రశ్నకు జవాబు చెప్పు!..." అంది ప్రణవి.
"ఆ ప్రశ్నను నీవు నన్ను ఎందుకు అడిగావ్?"
"బుద్ధిలేక!" వ్యంగ్యంగా అంది ప్రణవి రెండు క్షణాల తర్వాత "ఎక్కడికి పోతాయ్!... పాడు బుద్ధులు! ఎదుటి వాళ్లను అవహేళన చేయడం, మీ రక్తంలో వున్న సద్గుణం" నిష్టూరంగా అంది ప్రణవి.
దీప్తి తల్లిని సమీపించి ఆమె భుజాలపై తను చేతులు వుంచి ప్రణవి ముఖంలోకి సూటిగా చూస్తూ "మా అమ్మ చాలా చాలా మంచి అమ్మ!" నవ్వుతూ "నీవు చెప్పు నీకు ఇష్టమేనా!..."
"ఏమిటి?"
"అదే, నీవు నన్ను అడిగిన విషయం!..."
"అదా!... అదృష్టం ఉండాలి..."
"దేనికి!..."
"ఈశ్వర్‍కు ఇల్లాలు కావడానికి!..."
"ఏం ఆయన అంత గొప్పా!..." వెటకారంగా అడిగింది దీప్తి.
"అవును... చాలా గొప్ప. నీకు మీ పెద్ద బావ దినకర్ చెప్పాడో లేదో... ఈశ్వర్‍ను అమెరికాకు రమ్మని పోయినసారి సంవత్సరం క్రింద వచ్చినప్పుడు ఎంతగానో చెప్పాడట. దానికి ఈశ్వర్... "ఏమన్నాడు!..." ఆత్రంగా అడిగింది దీప్తి ప్రణవి పూర్తి చేయకముందే.
"అన్నయ్యా!... అమ్మా నాన్న మన నలుగురినీ నాకు తెలిసినప్పటి నుంచీ ఎంతో గారాబంగా పెంచారు. మన ఇష్టానుసారం చదివించారు. నీవు అమెరికాకు వెళ్ళాలని ఆశపడ్డావు. మన కుటుంబానికి తగిన సంబంధాన్ని చూచి నీ కోరికపై వదినకు నీకు పెళ్ళి జరిపించి మిమ్మల్ని అమెరికాకు పంపారు. వాణి వారి ఆశలనన్నింటినీ కాల్చి భస్మం చేసి తన దారిన తను చూచుకొని మనకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిపోయింది. ఇక చెల్లి శార్వరి... మనందరి కంటే చిన్నది. మనలాగే బాగా చదవాలి. వాణి అక్కయ్యలా కాకుండా ఆమె వివాహం అమ్మా నాన్నల ఇష్టానుసారంగా జరగాలి. అమ్మా నాన్నలు... పెద్దవారవుతున్నారు. వారికి సాయంగా అండగా నేను వుండాలని నిర్ణయించుకున్నాను. శార్వరి చదువు పూర్తి అయ్యేవరకే నేను ఆమెకు తోడుగా హైదరాబాదులో వుంటాను. తర్వాత మన వూరికి వచ్చి నాన్నగారు నిర్వహించే పాలవ్యాపారాన్ని... ఫ్యాక్టరీని చూచుకొంటాను. మనకు రెండు వందల ఆవులకు పైగా వున్నాయి. గోవుల సంరక్షణ అంటే నాన్నకు అమ్మకు నాకు ఎంతో ఇష్టం. వారి ఆనందమే నా ఆనందం. మన వూర్లో వుండి అమ్మా నాన్నలను చూచుకొంటూ నాన్న చేస్తున్న వ్యాపారాన్ని సాగిస్తూ... నాన్నగారికి విశ్రాంతి నివ్వాలనేది నా నిర్ణయం. వాటినన్నింటినీ చూచుకొంటూ న్యాయవాది వృత్తిని సాగిస్తాను.
"అలా అన్నాడు ఈశ్వర్!..." అంది ప్రణవి.
"అమ్మా!.... ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు?"
"మా వదిన చెప్పింది..."
"అంటే నీకు మీ వదినకు మధ్యన...."
"సఖ్యతే! ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు" నవ్వింది ప్రణవి. రెండు క్షణాల తర్వాత "ఆఁ ఇప్పుడు చెప్పు నా ప్రశ్నకు నీ జవాబు!" అడిగింది ప్రణవి.
"వెరీ సింపుల్ అమ్మా!..."
"ఎందే సింపుల్!..."
"అంటే!... నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"నిజంగానా!...."
"అవునమ్మా!..." గోముగా చెప్పింది దీప్తి.
తన చేతుల్లోకి దీప్తి ముఖాన్ని తీసుకొని నొసటన ముద్దుపెట్టి... " నా బిడ్డ బంగారు!" ఆనందంగా చెప్పింది ప్రణవి.
దీప్తి నవ్వుతూ తల్లి ఒడిలో వాలిపోయింది.
దీప్తి తల నిమురుతూ....
"తల్లీ!...."
"ఏమ్మా!...."
"మీ నాన్నగారు సామాన్యులు కారు... వారు మన నిర్ణయానికి అంగీకరించరు. అప్పుడు ఏం చేస్తావు తల్లీ!..." విచారంగా అడిగింది ప్రణవి.
"నాన్నగారు నా మాటను కాదరనుకొంటానమ్మా!..."
"కాదంటే!..."
"నీవు నాకు అండగా వుంటావుగా!... నాన్నగారికి బెదిరిపోయి నీ నిర్ణయాన్ని మార్చుకోవు కదా!..."
"తల్లీ!.... వారి ముందు మాట్లాడి వారికి ఆవేశాన్ని పెంచకూడదని నా నిర్ణయం. ఇక నీ విషయంలో వారు ప్రస్తావించినా మనది మౌన ముద్రే. ఓటు నీకే!.. నా నిర్ణయం మారదు..." నవ్వుతూ చెప్పింది ప్రణవి.
"అమ్మా!...." సీతాపతి పిలుపు.
ఇరువురూ బెడ్‍రూం నుండి హాలువైపుకు నడిచారు.
"అమ్మా అసలు విషయం చెప్పలేదు!..."
"ఏమిటే!..."
"నాన్న ఎలక్షన్‍లో..."
"డిపాజిట్ పోగొట్టుకొన్నారు!..." వెటకారంగా నవ్వింది ప్రణవి.
దీప్తిని చూచిన సీతాపతి దగ్గరకు వచ్చి...
"అక్కా!... ఎంతగా మారిపోయావు..." ఆశ్చర్యంతో అడిగాడు.
"సీతూ!.... నీవు మాత్రం మారలేదా!... ఆరడుగుల అందగాడిలా మారిపోయావ్!..." ప్రీతిగా తమ్ముడి భుజంపై చెయ్యివేసి అతని ముఖంలోకి చూచింది దీప్తి.
"పెదబావా!... అక్కవాళ్ళు బాగున్నారా అక్కా!..."
"అంతా బాగున్నారు... ఎలా సాగుతోంది నీ బి.టెక్. చదువు వైజాక్‍లో!..."
"బాగుంది అక్కా!.... గోల్డుమెడల్ గెలవాలని ప్రయత్నిస్తున్నా!..."
"అమ్మా!.... నాన్నగారు ఏరి?" అడిగాడు సీతాపతి.
"చెన్నై వెళ్లారు వ్యాపార విషయంగా. రేపు తెల్లవారేసరికి దిగుతారు."
"అక్కా! దీపక్... నీతూలు ఎలా వున్నారు?"
"ఆఁ.... వాళ్ళకేం తక్కువ. ఆ ఇంట్లోవారు యువరాజా.... యువరాణి... నీతూ వుంది చూచావ్.... అది అంతా మన అత్తయ్యలాగేరా!.... భయం అనేది లేదు... మహా సాహసి" నవ్వింది దీప్తి.
"అమ్మా!.... మీరు భోం చేశారా!..."
"లేదురా..."
"నేను స్నానం చేసి వస్తానమ్మా!..... కలిసి భోం చేద్దాం. అక్కతో కూర్చుని భోంచేసి చాలాకాలం అయింది" సీతాపతి నవ్వి తన గదికి వెళ్ళిపోయాడు.
"అమ్మా!.... సీతూ ఎంతగా మారిపోయాడమ్మా!.... పెద్దమనిషిలా ఎంతో నీట్‍గా మాట్లాడుతున్నాడు?..."
"వాడిది నా పోలిక!..."
"మరి నేనూ!....." బుంగమూతితో అడిగింది దీప్తి.
"తల్లీ నీవూ నా పోలికేనే... పద.... వాడు ఎప్పుడు తినాడో ఏమో!... అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెడదాం..."
తల్లీకూతుళ్ళు వంటగది వైపుకు నడిచారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments