'Neti Bandhavyalu Episode 8' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 15/12/2023
'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హరికృష్ణ, లావణ్యలకు ఇద్దరు పిల్లలు - ఈశ్వర్, శార్వరి.
లావణ్య అన్నయ్య ప్రజాపతి. అతనికీ ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి.
అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది. మేనత్త కూతురు, ఇంటినుండి వెళ్లిపోవడానికి, తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి, దీప్తితో చెబుతుంది.
హరికృష్ణ దగ్గరకి శివరామకృష్ణ కుటుంబంతో వస్తాడు.గతంలో శివరామకృష్ణ తల్లి శాంభవి మరణించిన కొద్ది రోజులకే అతని తండ్రి మహేశ్వర్ మరణిస్తాడు. లావణ్య, ప్రజాపతిల తల్లి రుక్మిణమ్మ మరణిస్తుంది.
ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 8 చదవండి.
మరుదినం కూడా ప్రజాపతి రానందున ఆ కార్యక్రమాలను హరికృష్ణనే పూర్తిచేశాడు. కోడలు ప్రణవి, కూతురు లావణ్య, అల్లుడైన హరికృష్ణలు, కైలాసపతి ప్రక్కనే వుండి వారిని ఓదార్చారు. సపర్యలు చేశారు. మూడవరోజు ఉదయం.. పదిన్నరకు ప్రజాపతి ఇంటికి చేరాడు. మార్గమధ్యంలోనే మాధవయ్య విషయాన్ని ప్రజాపతికి తెలియజేశాడు.
తాను లేని సమయంలో తల్లి గతించిందే అనే బాధ కన్నా.... హరికృష్ణ తన స్థానంలో వుండి అన్ని విధులు సక్రమంగా నెరవేర్చాడనే మాట. ప్రజాపతికి ఎంతో బాధను కలిగించింది. ఆ కారణంగా హరికృష్ణ తన వారందరి దృష్టిలో... వూరి వారందరి హృదయాల్లో మంచిపేరును సంపాదించుకొన్నాడనే వ్యక్తిగత ద్వేషం... ప్రజాపతి హృదయాన నిండిపోయింది.
తండ్రి ప్రక్కన కూర్చొని వున్న లావణ్య... ప్రజాపతిని చూచి... లేచి దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకొని....
"అన్నయ్యా!... అమ్మ... వెళ్ళిపోయింది" భోరున ఏడ్చింది.
కన్నీటితో ప్రణవి భర్త ముఖంలోకి క్షణంసేపు చూచి... ఆ చూపులలో వున్న నిర్లక్ష్య భావాన్ని గ్రహించి తలను ప్రక్కకు త్రిప్పుకొంది.
"ఆఁ... విన్నాను!" మెల్లగా చెప్పాడు ప్రజాపతి.
"ఎక్కడికి వెళ్ళావు అన్నయ్యా!..." అడిగింది లావణ్య.
లావణ్య... యీ ప్రశ్నకు ప్రజాపతి చూపుల్లో తీవ్రత... ముఖంలో ఆవేశం... మౌనంగా వుండిపోయాడు.
"వదిన అడిగిన మాట మీకు వినిపించలేదా అండీ!" సౌమ్యంగా అడిగింది ప్రణవి.
ఆమెవైపు తీక్షణంగా చూచాడు ప్రజాపతి.
అంతవరకూ వారి మధ్యన జరిగిన సంభాషణను హరికృష్ణ, కైలాసపతులు వింటున్నారు.
"బావా!... ఎక్కడికి వెళ్ళావు?" అడిగాడు హరికృష్ణ మెల్లగా.
"ఆ విషయం నీకు అనవసరం... పని ముగిసిందిగా యింకా ఇక్కడ ఎందుకు వున్నారు మీ ఇంటికి పోకుండా!..." ఆవేశంగా ముఖం చిట్లించి అన్నాడు ప్రజాపతి.
హరికృష్ణ... బదులు పలుకలేకపోయాడు. భార్య లావణ్య ముఖంలోకి దీనంగా చూచాడు.
"ఏమిట్రా నీవు అన్నది....!" లేచి నిలబడి అడిగాడు కైలాసపతి ఆశ్చర్యంతో.
"నాన్నా!.... మీరు కూర్చోండి. వూరుకోండి. అన్నయ్య ప్రయాణ బడలికతో వున్నట్లున్నాడు.
రెండవది పోయింది మా అమ్మ కదా నాన్నా!... ఆ బాధా మనస్సున వుంటుందిగా!... ఇకపోతే మేము ఇక్కడ ఎందుకు వున్నామని అడిగాడు... ఏదో ఆవేశంలో ఒకటి అనబోయి మరో రీతిగా అన్నాడేమో!... అన్నయ్యా!... నీవు గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో!... ప్రణవీ!... అన్నయ్యకు ఏం కావాలో చూడు. అతని వెంట వెళ్ళు!..." సౌమ్యంగా చెప్పింది లావణ్య.
"ఏమిటే... ఏదో మేము నీ ఇంట్లో వున్నట్లు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావ్!..." అన్నాడు ప్రజాపతి.
"ఇది నీ ఇల్లే కాదు అన్నయ్యా!.... నా ఇల్లు కూడా!..."
"ఇది నీ ఇల్లు ఎలా అవుతుందే!..." వ్యంగ్యంగా అన్నాడు ప్రజాపతి.
"ఏమండీ!... ఏమిటండి మీ మాటలు!... మీరా వూర్లో లేరు. అన్నయ్య, వదినలు మాకోసం ఎంత కష్టపడ్డారో మీరు వూహించలేరు. వదిన చెప్పింది మీ మంచికి. అర్థం చేసుకోకుండా అసహ్యించుకోవడం.. న్యాయం కాదు!..." అనునయంగా చెప్పింది ప్రణవి.
వారి మధ్యన జరుగుతున్న సంభాషణనను... విరక్తితో కైలాసపతి... తాను నోరు విప్పితే... ప్రజాపతి నోరు ఎలా పారేసుకొంటాడో అనే సందేహంతో హరికృష్ణ మౌనంగా వుండిపోయారు.
"ఏమిటే నీవన్నది!... యదార్థం మాట్లాడటం న్యాయం కాదా!..."
"మీరు మాట్లాడేది యదార్థం కాదు..." కసిగా అంది ప్రణవి.
"ప్రణవీ!... నీవు వూరుకో! ఆవేశపడకు!" మెల్లగా చెప్పింది లావణ్య.
ప్రజాపతివైపుకు తిరిగి "అన్నయ్యా! తల్లి పోయిందనే బాధ నీకూ వుండడం సహజం. నీవు వూర్లోలేని కారణంగా... నీవు చేయవలసిన విధులను మావారు నీ స్థానంలో నిలబడి చేశారు. వారు ఆ పనిని చేసింది ఎవరిమెప్పునో ఆశించి కాదు. ఇంతమంది వుండి... ఎవడో కూలివాడి చేత ఖర్మకాండలు జరిపించడం మనందరికీ అవమానకరమౌతుందని... అమ్మమీద వారికి వున్న గౌరవాభిమానాల కారణంగా ఎంతో శ్రద్ధతో వారు ఆ కార్యాన్ని నిర్వహించారు. అమ్మను వారు తన తల్లిగా భావించారు. మా ఆలోచనలో ఎలాంటి కుట్ర లేదు. అమ్మ మీద అభిమానం... వెళ్ళిపోయిందనే బాధ తప్ప!... అర్థం అయిందా!... యిందాక తొలి పలుకుగా ఏమన్నావ్!... ’వచ్చిన పని అయిపోయిందిగా ఇంకా ఎందుకున్నారు!.... మీ ఇంటికి వెళ్ళిపోకుండా!’ అనే కదూ నీవు అన్నది!... నాన్నా!... నీ కొడుకు వచ్చాడు... ఇక మేము ఇక్కడ వుండవలసిన అవసరం మాకు లేదు." హరికృష్ణవైపు చూచి..."ఏమండీ!... ఇక మన ఇంటికి బయలుదేరండి" ఎంతో ఆవేశంతో చెప్పింది లావణ్య.
"అమ్మా!..... అమ్మా!... ఏమిటమ్మా నీవు మాట్లాడుతున్నావు?..." ఆవేదనతో చెప్పాడూ కైలాసపతి.
"నాన్నా!... నేను ఏమీ తప్పుగా మాట్లాడలేదు నాన్నా!.... మీరు నేర్పిన మాటలే... ఏ మనిషికైనా... సాటివారి ముందు అవమానం జరిగితే వాదనకు దిగకుండా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం ఇరువురికీ మంచిదని... నేను ఇప్పుడు చేయబోతున్న పని అదే నాన్నా!...." ఎంతో సౌమ్యంగా మెల్లగా చెప్పింది లావణ్య.
హరికృష్ణ... "మామయ్యా!" వెళుతున్నట్లు తలాడించాడు.
"వదినా!.... అన్నయ్యా!... మీరు వారి మాటలను పట్టించుకోకండి.... వారి తత్వం ఇక్కడ వున్న అందరికీ తెలిసిందేగా!... మీరు ఇలా వెళ్ళిపోతే.... మామగారు మరీ బాధపడతారు వెళ్ళకండి!..." లావణ్యను సమీపించి ప్రణవి కన్నీటితో చెప్పింది.
"వదినా!.... వూరుకో... నా మాట విను" చిరునవ్వుతో చెప్పింది లావణ్య. ఆ నవ్వులో ఆనందం లేదు ఎంతో వేదన.
మేడమెట్లు ఎక్కుతూ ప్రజాపతి... "ప్రణవీ!... పైకిరా!..." తన గదిలోకి వెళ్ళిపోయాడు.
"పిలిచాడు... వెళ్ళు!" అంది లావణ్య.
కన్నీటితో ప్రణవి మిద్దె మెట్లు ఎక్కింది.
లావణ్య, హరికృష్ణలు కైలాసపతిని ఒకసారి కన్నీటితో చూచి తలలు త్రిప్పుకొని ఇంటి సింహద్వారాన్ని దాటారు.
కైలాసపతి భోరున ఏడ్వసాగాడు చేతులతో తలను పట్టుకొని. మద్రాస్‍లో చదువుతున్న ప్రజాపతి పిల్లలు దీప్తి.... సీతాపతులు శలవుల కారణంగా ఇంటికి వచ్చారు.
ఇంట్లోని సభ్యుల మధ్యన జరిగిన సంభాషణనను విని.. ఏడుస్తూ ఓమూల కూర్చుని వున్నారు అక్కాతమ్ముడు, అమ్మా నాన్న, అత్తామామలు వెళ్ళిపోగానే కైలాసపతిని సమీపించి వారికి రెండువైపులా చేరి ’నానమ్మ చనిపోయిందిగా తాతయ్యా!’ అని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చారు.
కన్నీటితో తలాడిస్తూ వారిరువురినీ తన ముసలి హృదయానికి హత్తుకొని కన్నీరు కార్చాడు కైలాసపతి.
వీధిలో శివరామకృష్ణ హరికృష్ణకు, లావణ్యకు ఎదురైనాడు. హరికృష్ణను కౌగలించుకొని...
"ఏరా!... పెద్ద అమ్మ వెళ్ళిపోయిందా!..." భోరున ఏడ్చాడు.
అతను హరికృష్ణకు లావణ్యకు ఎంతో ఆత్మీయుడు. బాధలో వున్నవారికి ఆత్మీయులు కంటబడితే... అంతవరకూ వారు తమ హృదయంలో అణచిపెట్టుకొన్న ఆవేదన ఉప్పెనలా పొంగి బయటపడుతుంది. హరికృష్ణ, లావణ్యల విషయంలో అదే జరిగింది. నడివీధిలో ఒక ప్రక్కన కొన్ని నిముషాలు నిలబడిన వారు... వారి హృదయవేదనను పంచుకొన్నారు. ఒకరినొకరు ఓదార్చుకొన్నారు. మెల్లగా హరికృష్ణ ఇంటివైపుకు నడిచారు. అప్పటికి శివరామకృష్ణ ఆ వూరు వదలివెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు.
అతని పిల్లలు... చంద్రం వయస్సు పాతిక సంవత్సరాలు. బి.ఎస్సీ ఫస్ట్ క్లాసులో పాసై ఎం.ఎస్సీ చేసేటందుకు అమెరికా వెళ్ళి. ఎం.ఎస్ పూర్తికాగానే అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడు. రెండవవాడు రాఘవ. వయస్సు ఇరవై మూడు. కంప్యూటర్ ఇంజనీర్ ముగించి.. ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. పెద్ద కూతురు వైశాలికి పాతిక సంవత్సరాలు. వివాహం అయింది. ఆమె బొంబాయిలో భర్తతో హాయిగా కాపురం చేస్తూ వుంది. చంద్రం, వైశాలీలు కవలలు. నాల్గవ సంతతి కూతురు శారద. వివాహం అయ్యి భర్తతో చెన్నైలో వుంది. ఐదవ సంతతి విష్ణు. జన్మతః అంధుడు. వయస్సు పదిహేడు సంవత్సరాలు. దీప్తి కన్నా రెండు నెలలు పెద్ద. హరికృష్ణ పిల్లలు దినకర్ ఇంజనీరింగ్ ముగించి అమెరికా వెళ్ళిపోయాడు. శివరామకృష్ణ పెద్దకొడుకు చంద్రం, దినకర్‍ల మధ్య వయస్సు తొమ్మిది నెలల వ్యత్యాసం. రెండవ సంతతి వాణి. వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. ఎం.ఎస్సీ చదువుతూ ఉంది. మూడవవాడు ఈశ్వర్. బి.ఎ ముగించి బి.ఎల్ చదువుతున్నాడు. నాల్గవ సంతతి శార్వరి. టెన్త్ చదువుతూ ఉంది. వయస్సు పదిహేను సంవత్సరాలు. ప్రజాపతి పిల్లలు... పెద్దకుమార్తె దీప్తి వయస్సు పదిహేడు. ఇంటర్ సెకండ్ ఇయర్. చివరివాడు సీతాపతి ప్లస్ వన్‍లో జాయిన్ అయినాడు వయస్సు పదహారు.
హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ ఇంటి వరండాలో ప్రవేశించారు. వాకిట వున్న వాణి, శివరామకృష్ణను చూచి నవ్వుతూ "మామయ్యా! బాగున్నారా!... అత్తయ్యా, విష్ణు బాగున్నారా!" ప్రీతితో పలకరించింది.
"అంతా బాగున్నారమ్మా!"
ముగ్గురూ కూర్చున్నారు. వారి ముఖ భంగిమలు గమనించిన వాణి గ్రాండ్ మదర్ రుక్మిణి హఠాత్ మరణం తమకంతా ఎంత బాధను కలిగించిందో అలాగే... శివరామకృష్ణ కూడా బాధపడుతున్నారని గ్రహించింది.
వారి చింతనను మార్చాలని... "మామయ్యా!.... మీకు కాఫీ అంటే చాలా ఇష్టంగా!.... రెండు నిముషాల్లో తీసుకొస్తాను" వంటగది వైపుకు పరుగెత్తింది వాణి.
"ఏరా హరీ!.... మీ ఇద్దరినీ చూస్తుంటే... పెదనాన్నగారింట్లో మీకు, ప్రజాపతి మధ్యన ఏదో గొడవ జరిగినట్లనిపిస్తుంది. నా ఊహ నిజమేనా!" మెల్లగా అడిగాడు శివరామకృష్ణ.
"అవును..." నిట్టూర్చి చెప్పాడు హరికృష్ణ.
"ఏం జరిగిందిరా!"
"అన్నయ్యా! వారి తత్వం మీకు తెలుసుగా!.... వారు చెప్పలేరు. నేను చెబుతాను వినండి."
ప్రజాపతి వచ్చిన తర్వాత జరిగిన సంభాషణనంతా విన్నంతా చెప్పింది లావణ్య.
అంతా విన్న శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు.
"వాడు అంత మాట అన్నాడా!"
"అవును..." ఖచ్చితంగా చెప్పింది లావణ్య.
"ఇక నన్ను చూస్తే ఏమంటాడో!"
"నేను చెప్పనా!" అడిగిండి లావణ్య.
"పెద్దతల్లి విచారింపుకు వచ్చావా!.... పెదనాన్నను అడిగి ఏదైనా లాక్కుపోవడానికి వచ్చావా!.... అని అడుగుతాడు!" కసిగా చెప్పింది లావణ్య.
"ఏందమ్మా నీవు అనేది!..." ఆశ్చర్యంతో అడిగాడు శివరామకృష్ణ.
"వాడు నిన్ను చూచిన వెంటనే అనబోయే మాటను నేను మీకు చెప్పాను. వాడు పూర్తిగా మారిపోయాడు. తన మన అయినవాళ్ళం అనే భావన వాడిలో నశించింది అన్నయ్యా!" విచారంగా చెప్పింది లావణ్య.
హరికృష్ణ లావణ్య ముఖంలోకి చూచి విరక్తిగా నవ్వాడు.
అతని ముఖ భంగిమను చూచిన శివరామకృష్ణ.
"ఏమిట్రా ఆ నవ్వు!...." ఆశ్చర్యంతో అడిగాడు.
"నీ చెల్లెలు చెప్పింది అక్షర సత్యం!...."
"అలాగా!"
"అవునురా!.... లావణ్య చెప్పినట్లుగా వాడు పూర్తిగా మారిపోయాడు. వాడు ఇప్పుడు మన చిన్ననాటి ప్రజాపతి కాదు" విచారంగా చెప్పాడు హరికృష్ణ.
వాణి... మూడు కాఫీ కప్పులతో వరండాలోకి ప్రవేశించింది. ముందు శివరామకృష్ణకు.... తర్వాత తల్లితండ్రికి అందించింది. శివరామకృష్ణ కాఫీని సిప్ చేశాడు.
"ఎలా వుంది మామయ్యా!.... బాగుందా....! చక్కెర సరిపోయిందా!" నవ్వుతూ అడిగింది వాణి.
"అమృతంలా వుందమ్మా!... ఇంత బాగా కాఫీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా!"
"ఇందులో నా గొప్పతనం ఏమీలేదు మామయ్యా!... మా అమ్మగారి శిక్షణ అలాంటిది. అంటే... మీ ప్రశంసలు మా అమ్మకే చెందుతాయి" నవ్వుతూ చెప్పింది వాణి.
"ఈశ్వర్, శార్వరీలు ఎక్కడ?"
"వాళ్ళు మొన్న అమ్మమ్మను చివరిసారిగా చూచేదానికి వచ్చారు. చూచారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఈ ఉదయమే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు" చెప్పాడు హరికృష్ణ.
శివరామకృష్ణ కాఫీ త్రాగి కప్పును టీపాయ్ పై వుంచాడు. వాకిటివైపు చూచాడు.
కైలాసపతి, దీప్తి లోనికి రావడాన్ని ఆ నలుగురూ గమనించారు.
లావణ్య, వాణి వారిని చూచి పరుగున ఎదురువెళ్ళారు సమీపించారు.
"అత్తయ్యా! తాతయ్య మిమల్ని చూడాలని వచ్చారు" బుంగమూతితో చెప్పింది దీప్తి.
"నాన్నా!... ఏం నాన్నా!... మేము వచ్చి అరగంట కూడా కాలేదు... నీవు..."
"అక్కడ నాకు శాంతి లేదురా!... అందుకే వచ్చాను" విచారంగా చెప్పాడు కైలాసపతి.
తండ్రి చేతిని ప్రీతిగా తన చేతిలోనికి తీసుకొంది లావణ్య.
"తాతయ్యా!.... రండి" మరోచేతిని వాణి పట్టుకొంది.
హరికృష్ణ, శివరామకృష్ణ వారిని సమీపించారు.
శివరామకృష్ణ, కైలాసపతి భుజాలను పట్టుకొని....
"పెదనాన్నా!... పెదనాన్నా!... మా పెద్ద అమ్మ!..." బొంగురుపోయింది కంఠం మాటలు బయటికి రాలేదు.
"ఆఁ... తాను మహరాణిలా వెళ్ళిపోయిందిరా... వెళ్ళిపోయింది...." కన్నీరు కార్చాడు కైలాసపతి.
తనచేతిని వారి వీపు పైవుంచి మెల్లగా వరండా వరకూ నడిపించాడు శివరామకృష్ణ.
అందరూ వరండాలో ప్రవేశించారు.
"కూర్చోండి నాన్నా!..."
చేతిని పట్టుకొని కైలాసపతిని కుర్చీలో కూర్చునేలా చేసింది లావణ్య.
"ఆఁ..." నిట్టూర్చాడు కైలాసపతి.
"నాన్నా!..."
’ఏం’ అన్నట్లు తలాడించాడు కైలాసపతి.
"ఆయాసంగా వుందా!..." మోకాళ్ళపై వారి ఎదుట కూర్చుని దీక్షగా కైలాసపతి ముఖంలోకి చూస్తూ అడిగింది లావణ్య.
వారికి ఇరుప్రక్కల నిలబడిన హరికృష్ణ... శివరామకృష్ణ వారినే పరీక్షగా చూస్తున్నారు.
ఇక... పిల్లలు వాణి, దీప్తి విచారంగా వారందరినీ చూస్తూ నిలబడ్డారు.
" నాన్నా!... కొద్దిగా పాలు తాగుతావా!..." అడిగింది లావణ్య.
"అలాగే అమ్మా!..." మెల్లగా చెప్పాడు కైలాసపతి.
వెంటనే లేచింది లావణ్య.
"అమ్మా!... నీవు తాతయ్య దగ్గర కూర్చో... నేను వెళ్ళి తీసుకొస్తాను."
క్షణంసేపు కూతురు ముఖంలోకి చూచి ఆగిపోయింది లావణ్య.
వాణి, దీప్తి ఇంట్లోకి వెళ్ళారు.
"వదినా!..."
"ఏం దీపూ!..."
"నాయనమ్మ ఎలా చనిపోయింది?"
వాణి ఆశ్చర్యంతో దీప్తి ముఖంలోకి చూచింది.
"నాకు మాత్రం... ఏం తెలుసే... నేనూ వూర్లో లేనుగా!... అందరూ అనుకొంటున్నారు.... వయస్సు అయింది. వెళ్ళిపోయిందని" పాలను గ్లాసులో వంచుతూ చెప్పింది వాణి.
"కాదు..."
"మరేమిటి?..."
"మా నాన్నే కారణంగా!..."
"అంటే!..."
"మా నాన్న మంచివాడు కాదటగా... ఆ దిగులుతో నానమ్మ చనిపోయిందట" విచారంగా చెప్పింది దీప్తి.
"నీకు ఈ విషయం ఎవరు చెప్పారు?..."
"మా అమ్మ!..."
ఇరువురూ వరండాలోకి వచ్చారు. తన చేతిలోని పాలగ్లాసును తల్లిచేతికి అందించింది వాణి.
లావణ్య గ్లాసును కైలాసవతికి అందించింది.
"మెల్లగా తాగు నాన్నా!..."
కైలాసపతి గ్లాసును అందుకొన్నాడు.
పాలు త్రాగడం ప్రారంభించాడు.
అందరూ వారినే చూస్తున్నారు.
పాలు తాగిన గ్లాసును లావణ్య కైలాసపతి చేతినుండి అందుకొని వాణికి అందించింది. వాణి లోనికి వెళ్ళిపోయింది. దీప్తి ఆమెను అనుసరించింది.
"ఒరే!.... శివరామకృష్ణా!..."
"ఏం పెదనాన్నా!..."
"పిల్లలందరూ... నా కోడలు బాగున్నారా!..."
"మీ ఆశీర్వాద బలంతో అంతా బాగున్నారు పెదనాన్నా!..."
"కొడుకుల్ని అమెరికా, ఆస్ట్రేలియాలకు పంపావట కదా!..."
"అవును పెదనాన్నా!... ఉద్యోగరీత్యా వెళ్ళారు"
"రాకపోకలు వున్నాయా!..."
"ఆఁ సంవత్సరానికి ఒకసారి వచ్చి... దాదాపు నెలరోజులు వుండి వెళుతుంటారు. ఇప్పటికి రెండు పర్యాయాలు వచ్చారు."
"వారి వివాహాన్ని గురించి ఏం ఆలోచన!..."
"పెద్దవాడికి మన వాణిని ఇచ్చి వివాహం జరపాలని నా కోర్కె పెదనాన్నా!..."
హరికృష్ణ, లావణ్యలు ఆశ్చర్యంతో శివరామకృష్ణ ముఖంలోకి చూచారు.
"అవునురా!... అమ్మా లావణ్యా!... అది నా మనస్సులోని మాట..." నవ్వాడు శివరామకృష్ణ.
"ఏమ్మా లావణ్యా! విన్నావుగా శివరాముడి కోర్కెను... మీ దంపతులు ఏమంటారు?..."
"మీ మాటను... వాడి మాటను మేము ఏనాడూ కాదనలేము కదా మామయ్యా!" చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
"నాన్నా!... వాణికి ఇంకా చదువు పూర్తికాలేదుగా... అయిన తర్వాత మా ఈ అన్నయ్య మాట మీద నిలబడితే... వాణి వారి కోడలే అవుతుంది నాన్నా!...."
"సమాజాన్ని చుట్టేసింది పాశ్చాత్య నవనాగరీకత... బంధుత్వాలు, బాంధవ్యాలు, విలువలు మారిపోతున్నాయి. ఎన్నో వింతలు వింటున్నాము. పత్రికల్లో చదువుతున్నాము. ఏది ఏమైనా మనదంటూ మనకు మన పెద్దలు నేర్పిన మంచి సంస్కారాలను మరిచిపోకూడదు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో వింత కథనాలు, వివాహాలు జరిగిన కొద్దినెలల్లోనే విడాకులు. వాడు ఆ ప్రజాపతి మీ దారికి రాడు కాబట్టి మీ ఇద్దరైనా బంధుత్వాలను తెంచుకోకుండా... ఇచ్చి పుచ్చుకొనే భావంతో... మీ జీవిత కాలంలో కలిసిమెలసి ఉండాలనేది నా కోరిక... ఆ శుభకార్యాలను చూచేంత పొద్దు నాకులేదు" విచారంగా చెప్పాడు కైలాసపతి.
"పెదనాన్నా! ఏమిటా మాటలు! మీరు నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. మా పిల్లల పెండ్లి మీ ఆధ్వర్యంలోనే మీ ఎదుటనే జరుగుతుంది." అనునయంగా చెప్పాడు శివరామకృష్ణ.
"నాన్నా!.... కాసేపు పడుకొంటారా!..." అడిగింది లావణ్య.
"అమ్మా!... కొందరి భావన ప్రకారం నేను ఇక్కడికి రావడమే తప్పు. నాకు అటువంటి మాటల మీద నమ్మకం లేదు. అందుకే వచ్చా!... మీ అందరి అభిమానం, మాటలు నాకు కొంత శాంతిని కలిగించాయి. ఇకనే బయలుదేరుతానమ్మా!... ఆ పిల్లని పిలువు!...." చెప్పాడు కైలాసపతి.
"మామయ్యా! లోకుల మాటలను మనం పట్టించుకోకూడదుగా!... మనమీద అభిమానం వుంటే మనం ఏం చేసినా ఆకాశానికి ఎత్తేస్తారు. మనం గిట్టకుంటే... విమర్శలు ప్రారంభిస్తారు. మీవరకూ..... మీ దృష్టిలో మీకు ఆ ఇల్లు ఎంతో ఈ ఇల్లూ అంతే మామయ్యా. మీరు ఇక్కడే వుండండి వెళ్ళవద్దు" అభిమానంతో చెప్పాడు హరికృష్ణ.
"అవును నాన్నా!.... మీరు అక్కడికి వెళ్ళవద్దు. ఇక్కడే వుండండి" ప్రీతిగా చెప్పింది లావణ్య.
"వద్దు తల్లీ!.... వద్దు... నన్ను వెళ్ళనీ!... అమ్మా దీపూ రారా!... ఇంటికి వెళదాం!..." కుర్చీ నుంచి లేచాడు కైలాసపతి.
వారి గొంతును విన్న దీప్తి వరండాలోకి వచ్చింది. అంతవరకూ వాణితో చదువుల విషయాన్ని గురించి మాట్లాడుతూ వుండింది.
"తాతయ్యా!.... పిలిచారా!..."
"అవున్రా... ఇంటికి పోదాం పద!..."
"హరీ!... నేనూ పెదనాన్నతో వెళ్ళి ప్రజాపతిని, ప్రణవిని పలకరించి వస్తాను" అన్నాడు శివరామకృష్ణ.
"సరే... వెళ్ళిరా!... వాడు ఏమన్నా అంటే ఆవేశపడకు!..."
శివరామకృష్ణ నవ్వి... "అలాగేరా!..."
"అన్నయ్యా!... త్వరగా వచ్చేయండి"
"సరే అమ్మా!...."
కైలాసపతి, దీప్తి, శివరామకృష్ణ వీధి గేటువైపుకు నడిచారు. వారి వెనకాలే హరికృష్ణ, లావణ్య వీధి గేటువరకూ వచ్చారు. "జాగ్రత్త నాన్నా" అంది లావణ్య.
అలాగే అన్నట్లు తలాడించాడు కైలాసపతి.
ఆ ముగ్గురూ వీధిలో ప్రవేశించారు. దారిన వెళుతున్న వారు... కైలాసపతిని చూచి నమస్కరించారు. శివరామకృష్ణ కుటుంబ విషయాలను పరామర్శించారు.
ఆ ముగ్గురూ వీధి మలుపు తిరిగే వరకూ వీధిగేటు వద్ద నిలబడి వుండిన హరికృష్ణ, లావణ్య, వాణి నిట్టూర్చి లోనికి నడిచారు.
పదినిముషాల్లో కైలాసపతి, శివరామకృష్ణ, దీప్తి కైలాసపతి నిలయంకి చేరారు.
ముగ్గురూ హాల్లో ప్రవేశించారు.
"అమ్మా!...." పిలిచింది దీప్తి.
"ఎవరు వచ్చారో చూద్దువుగాని రా!..." అంది.
ప్రణవి హాల్లోకి వచ్చింది. శివరామకృష్ణను చూచి భోరున ఏడ్చింది.
శివరామకృష్ణ.... కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సమాళించుకొని....
"వూరుకో అమ్మా!.... నిన్ను నీవే సమాళించుకోవాలి. ఈ మామయ్యను జాగ్రత్తగా చూచుకోవలసిన దానవు నీవే కదమ్మా!.... పిల్లలకు మామయ్యకు... మీవారికి వూరటను, శాంతిని నీ మంచిమాటల వలన కలిగించాలి. దైవాన్ని నిత్యం కొలిచేదానివి ఆ దైవం మీద ఎంతో నమ్మకం వున్నదానివి. నీవు దిగాలు పడిపోతే... వీరంతా ఏమౌతారో ఆలోచించమ్మా!...." మెల్లగా అనునయంగా చెప్పాడు. శివరామకృష్ణ. కైలాసపతి తన గదికి వెళ్ళిపోయాడు. మంచంపై పడుకొన్నాడు.
దీప్తి, సీతాపతి తల్లి వెనక చేరారు.
సమాళించుకొన్న ప్రణవి "కుర్చోండి బావగారూ!... అక్కా పిల్లలు అంతా బాగున్నారుగా!" అడిగింది.
అవునన్నట్లు తలాడించాడు శివరామకృష్ణ.
"మా తమ్ముడేడమ్మా?"
"మేడ పైన వారి గదిలో వున్నారు బావగారూ!"
"నేను వచ్చానని వాడికి చెబుతావా అమ్మా!"
"నేను చెబుతాను పెదనాన్నా!" పరుగున సీతాపతి మెట్లు ఎక్కాడు.
తల్లి వెనుక నిలబడి తననే చూస్తున్న దీప్తిని చూచాడు శివరామకృష్ణ.
దగ్గరకు రమ్మని చేతితో సౌంజ్ఞ చేశాడు.
"వెళ్ళు.... పిలిస్తున్నది మీ పెదనాన్నగారు!..." అంది ప్రణవి.
దీప్తి బెరుకు ముఖంతో శివరామకృష్ణను సమీపించింది.
ఆమె కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని...
"అమ్మా! ఏం చదువుతున్నావ్?"
"ఇంటర్ సెకండ్ ఇయర్"
"తర్వాత ఏం చేయాలనుకొంటున్నావ్!"
"డాక్టర్ చదవాలనుకొంటున్నాను"
"గుడ్.... నీవు తప్పక డాక్టర్‍వే అవుతావు... అమెరికా వెళతావు"
"ఆ విషయం మీకు ఎలా తెలుసు!..."
నవ్వి "తల్లీ! నీ ముఖం మా పెద్దమ్మ ముఖం... ముమ్ముర్తులా నీవు మా పెద్దమ్మవే!..."
"అందరూ నేను మా లావణ్య అత్తయ్యలా వుంటానని అంటారు. మరి మీరు!..."
"లావణ్య అత్తయ్య అమ్మగారెవరు!.. మీ నానీ!"
అవునన్నట్లు తలాడించింది దీప్తి అమాయకంగా.
"ఆఁ... నానీ పోలిక అత్తయ్య!... అత్తయ్య పోలిక నీవు!... మరి మొదటి స్థానం ఎవరిది?"
"మా నానీదే!"
"అందుకే అన్నాను. నీవు అంతా మా పెద్దమ్మవని!" నవ్వాడు శివరామకృష్ణ.
దీప్తి అందంగా నవ్వింది.
ఎంతో ఆవేదనతో అత్తగారి వియోగంతో బాధపడుతున్న ప్రణవి పెదవులపై చిరునవ్వు విరిసింది.
సీతాపతి మేడ దిగి వచ్చాడు.
"ఏడిరా మీ నాన్న!..." అడిగింది ప్రణవి.
"నిద్రపోతున్నాడు లేపాను, వస్తున్నాడమ్మా!"
ప్రజాపతి మెట్లు దిగసాగాడు.
శివరామకృష్ణ అతనికి ఎదురు నడిచాడు.
"ఏరా! దారితప్పి వచ్చినట్లున్నావ్?...." వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి.
"దారిని మరిచినవాడు... దారి తప్పటం సహజం. మరువని వాడు ఎన్నటికీ దారి తప్పడురా! నేను నా వూరిదారిని నా వాళ్ళను మరువలేదురా. ఇదిగో ప్రజా! అమ్మ వెళ్ళిపోయిందని హరి చెప్పగానే ఎంతగానో బాధపడ్డాను. దూరాన వున్నందున అంతిమ చూపులకు నోచుకోలేదు. ఇప్పుడు వచ్చాను. నావారైన మీ అందరినీ చూడాలని. పెదనాన్నకు వయసు మీరింది. వారిని జాగ్రత్తగా చూచుకోరా!... ప్రస్తుతంలో వారు ఎంతో బాధలో వున్నారు. వారికి ధైర్యం చెప్పి ఆసరగా నీవే కదరా నిలబడాలి. వారికి ఒంటరితనాన్ని కల్పించకు. రోజులో కొంత సమయం వారితో గడుపు... చిన్నవాడికి చెప్పడం నా ధర్మం చెప్పాను" ఎంతో అభిమానంతో చెప్పాడు శివరామకృష్ణ.
"ముగిసిందా!.... ఇంకా ఏమైనా ఉందా!" వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి.
"నేను నీకు చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పేశానురా!"
"సంతోషం!.... నాకు పని వుంది బయటికి వెళుతున్నాను...."
"ఇప్పుడే కదండి బావగారు వచ్చారు! కొంతసేపు వారితో...." ప్రణవి మాట పూర్తిచేయక మునుపే....
"నీవు మాట్లాడు!" ప్రణవి ముఖంలోకి తీక్షణంగా చూచి ప్రజాపతి వెళ్ళిపోయాడు.
అతనిలో మార్పును... మాటతీరును చూచిన శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు.
"ఆయన పూర్తిగా మారిపోయారు బావగారూ!" కన్నీటితో చెప్పింది ప్రణవి.
"అమ్మా!.... మనిషిలో మార్పు రావడం సహజం. దానికి ఎన్నో కారణాలు!... ఈ ఇంట్లో మా పెదతల్లి స్థానంలో వున్న నీవే నిగ్రహంతో అన్నింటినీ అందరినీ జాగ్రత్తగా చూచుకోవాలి. సహనం, శాంతం వాటిని రెండు కళ్ళులా భావించాలి. నీకు నీ పిల్లలకు వాడికి ఆ దేవుడు తప్పక మేలు చేస్తాడు." అనునయంగా చెప్పాడు శివరామకృష్ణ.
"దీపూ! పద... తాతయ్య ఏం చేస్తున్నారో చూద్దాం" అన్నాడు శివరామకృష్ణ.
నలుగురూ కైలాసపతి గదిలో ప్రవేశించారు. వారు నిద్రపోతున్నారు. కళ్ళనుంచి కారిన కన్నీటి చారలు చెక్కిళ్ళపై కనిపిస్తున్నాయి.
"నిద్రపోతున్నారు... లేపవద్దు... పదండి" మెల్లగా చెప్పాడు శివరామకృష్ణ.
నలుగురూ వరండాలోకి వచ్చారు.
"అమ్మా దీపూ, బాబు సీతాపతీ బాగా చదవాలి. గొప్పవాళ్ళుగా కావాలి. అమ్మను, నాన్నను బాగా చూచుకోవాలి సరేనా!"
ఆ ఇరువురు పిల్లలు ’సరే’ అన్నట్లు తలలు ఆడించారు.
"అమ్మా ప్రణవీ! జాగ్రత్త... మామయ్యను జాగ్రత్తగా చూచుకోవలసిన బాధ్యత నీది"
అందరి ముఖాల్లోకి చూచి కనుసన్నతోనే వెళుతున్నానని చెప్పి... శివరామకృష్ణ గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలోకి ప్రవేశించాడు.
హరికృష్ణ ఇంటికి చేరి... తనకు ప్రజాపతికి జరిగిన సంభాషణను వారికి వివరించాడు.
మరుదినం...
ఊరికి బయలుదేరాడు శివరామకృష్ణ.
"హరీ!... లావణ్యా!... పెదనాన్న ముందు వాణి విషయంలో నేను చెప్పింది ఒట్టిమాట కాదు. అది మా దంపతుల నిర్ణయం. మీరిరువురూ ఆలోచించుకోండి. మీ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి" చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ.
"అలాగే అన్నయ్యా!...." అంది లావణ్య.
దంపతులు ఇరువురూ స్టేషన్‍కు వచ్చి శివరామకృష్ణను రైలు ఎక్కించారు.
అతను ఎక్కిన రైలు వైజాగ్ వైపుకు బయలుదేరింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Kommentare