'Network' - New Telugu Story Written By Dr. D. V. G. Sankararao
Published In manatelugukathalu.com on 15/09/2024
'నెట్ వర్క్' తెలుగు కథ
రచన: డా. డి. వి. జి. శంకరరావు
ఆరు మాసాల క్రితం వరకూ ఈ ఊరు అస్సలు పరిచయంలేదు. ఉద్యోగరీత్యా అమ్మ తో కలిసి ఈ ఊర్లో ఉంటున్నాను. పెళ్లి, పిల్లా జెల్లా లేని ఒంటరి వాణ్ని. అందుకనేమో అమ్మ నాతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. నా కన్నా పెద్ద పిల్లలు, అక్క అన్న వారి వారి కుటుంబాల తో ఉన్నా అమ్మ వారి దగ్గర ఎక్కువ ఉండదు. కాదు, కాదు వారే ఉండనివ్వరు. చేతలలో సాగనంపి, మాటల్లో ప్రేమ కురిపిస్తుంటారు. ఈ ఊళ్లో కాలనీ వాళ్లు గానీ, ఆఫీసు బయట మరెవరూ పరిచయం కాలేదు. నాక్కూడా అది లోటనిపించలేదు. ఒంటరి తనం ఫీల్ కాలేదు. అందుకు సోషల్ మీడియాకు ధ్యాంక్స్ చెప్పాలి.
ఫేస్ బుక్ లో 5 వేల మంది, వాట్సాప్ గ్రూపులు ఒక ఇరవై. రోజంతా స్నేహితులతో బిజీగా ఉంటున్నట్టే. చిన్నప్పటి క్లాస్ మేట్ గ్రూపు, డిగ్రీలోని గ్రూపు, ఆఫీసు గ్రూపు, వృత్తి స్నేహితులది, స్వచ్చంద సంస్థలదీ.. ఒకటేమిటి, సవాలక్ష. చర్చలూ, జోకులూ, వాదోపవాదాలు. ఈ ఊళ్లో ఉన్న వాళ్ల దగ్గర నుండి ఖండాంతరాల్లో ఉన్న వాళ్ల వరకూ. అన్నట్టు మా అక్కా, అన్న వారి పిల్లలు కూడా బయట కన్నా, సోషల్ మీడియా లోనే బాగా పలకరి స్తుంటారు.
అమ్మకు మూడు రోజులుగా ఆరోగ్యం బాగులేదు. హాస్పిటల్ లో చేరింది. మిత్రుల రెస్పాన్స్ నాకు ఓదార్పు ఇచ్చింది. ఫేస్ బుక్, వాట్సప్ మెసేజ్ లు వరదలయ్యాయి. తిరిగి ధన్యవాదాలు చెప్పడం కూడా అసాధ్యం. రోజంతా కూర్చుని టైప్ చేసినా పూర్తయ్యేసరికి వారం పడుతుంది. అన్న కూడా వీడియో కాల్ చేశాడు.. ' అమ్మ జాగ్రత్తరా. బిజీగా ఉన్నాం. రాలేం. ప్రస్తుతానికి డబ్బులేమైనా అవసరమైతే పంపిస్తాను' అంటూ. ' అవసరం లేదులే' అని చెప్పాను. గతంలో రెండ్రోజులు అమ్మ వారింట్లో ఉన్నప్పుడు వదిన చేసిన హంగామా, తెచ్చిపెట్టుకున్న పోట్లాట, మరి నీ ముఖం చూడమంటూ తెచ్చి మాయింట్లో దింపడం అన్నీ గుర్తున్నాయి. అవన్నీ మర్చిపోయి ఇలా మామూలుగా ఎలా మాట్లాడగలరు అని ఆశ్చర్య పోయాను కూడా. వీటన్నిటికీ పరాకాష్ట అన్నయ్య తన వాట్సాప్ డీపీగా అమ్మ ఫోటో పెట్టుకుని, సెంటిమెంటు పండించడం.
*****. ***** *****
చూస్తుండగానే అమ్మ పరిస్థితి క్షీణించింది. భౌతిక జీవితం నుండి సెలవు తీసుకుంది. చెప్పాల్సిన వారికి చెప్పాను. ఫేస్ బుక్, వాట్సాప్ మిత్రులకు తెలియ జేశాను. అంతిమ యాత్ర కు ముందు ఇంటికి తీసుకు వచ్చాను. ఆఫీసు వాళ్లు సాయానికి వచ్చారు. నాతోనే ఉన్నారు కార్య క్రమం పూర్తయ్యే వరకూ. కాలనీ వాళ్లు ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేసుకున్నారు. చొరవ తీసుకుని పనులకు ముందు కొచ్చారు. ఏ భేషజమూ లేకుండా కలిసి పోయారు. ఒంటరినన్న భావం కలగ నీయకుండా అంతా ఒక కుటుంబం అనుకునేలా ప్రవర్తించారు. బంధువులు మొక్కుబడిగా వచ్చి వెళ్లినా బాధనిపించలేదు, అది వారి సంస్కారం కదా అనిపించింది.
వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యమనిపించిందల్లా, ఫేస్ బుక్ మిత్రులు. ఒక్కరూ ఫేస్ చూపించలేదు. ఊళ్లోనే ఉన్న కవిమిత్రులు. మానవ సంబంధాలు, సున్నితత్వం పై కుండల కొద్దీ కవిత్వాన్ని ఒంపేవారు, రెండడుగులు వేసి స్నేహం కొద్దీ వచ్చి భుజం పై చెయ్యి వేద్దామనుకోలేదు. చుట్టూ పక్కల నగరాల్లోనే ఉన్న స్కూల్, కాలేజీ మిత్రులు కూడా.
ఫేస్ బుక్, వాట్సాప్ తెరిచాను. అమ్మ ఆత్మశాంతి కోసం మెసేజ్ ల తో నిండిపోయాయి. అక్క, అన్న, వదినె ఆమెతో ఉన్న పాత ఫోటోలు పెట్టి చాట భారతం రాసి ఉన్నారు వాల్ మీద. కృత్రిమ ప్రేమ వర్షం కుండ పోతలుగా కురుస్తోంది. ఊరట కలగలేదు. చిరాకు వచ్చింది. ఎకౌంట్లు డిలీట్ చేద్దామని లేచాను. అప్పుడే ఆయన వచ్చాడు.
"అయాం సారీ సర్. మీ అమ్మగారి మృతికి బాధ పడుతున్నాను. "
"థ్యాంక్స్ అండి. మిమ్మల్ని పోల్చుకోలేదు. "
"నేను మీ ఫేస్ బుక్ లో ఫాలోయర్ ని అండి. మీ పోస్టులెప్పుడూ ఫాలో అవుతాను. ఎక్కువగా స్పందించను గానీ మీరంటే మంచి మిత్రునిలా భావిస్తాను. "
"ఓ. సురేష్ గారు కదూ. ఫేస్ బుక్ లో ఫోటోకీ, మీకూ వ్యత్యాసం కనబడుతోంది. అయినా పూనే లో ఉంటారు కదా"
"అవున్సార్. అక్కడి నుండే వస్తున్నాను. ఒక్క సారి కలిసి మీకు నా సానుభూతి తెలపాలనిపించింది" గుర్తు పట్టానన్న ఆనందం ఆయన మొహంలో కనబడుతోంది.
"అయ్యో. అంత దూరం నుండి రావాలా? రండి. ఫ్రెష్ అప్ అవుదురు గానీ. "
ఇప్పుడు నా మనసు ఫ్రెష్ అయ్యింది. సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చెయ్యను. అవసరం లేనివి అన్ ఫ్రెండ్ చేస్తానంతే. సమాజమైనా, సామాజిక మాధ్యమైనా పరిచయాల్ని ఇస్తాయి అంతే. అసలైన మిత్రుల్ని అందులోంచి జాగ్రత్తగా ఎంచుకోవాల్సింది మనమే.
*****. ******** **** సమాప్తం ******** ******
డా. డి. వి. జి. శంకరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
డా. డి. వి. జి. శంకరరావు,మాజీ ఎంపీ
విజయనగరం, ఆంధ్రప్రదేశ్
ప్రచురించబడ్డ రచనలు : స్వాతి,ఈనాడు, ఆంధ్రజ్యోతి,సూర్య, ప్రజాశక్తి,విశాలాంధ్ర, ఆంధ్రభూమి,సాక్షి,వార్త, ఆదివారం అనుబంధం పత్రికల్లో,కౌముది వెబ్ పత్రికలో,
కథలు 35
కవితలు 300
వ్యాసాలు,లేఖలు ఇంగ్లీష్,తెలుగు దిన పత్రికల్లో: 4 వేలు
డీవీజీ కవితలు పేరుతో ఒక పుస్తకం ప్రచురణ.
Comments