top of page
Dr. Kanupuru Srinivasulu Reddy

నీ చల్లని చూపులో ....!


'Ni Challani Chupulo' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

అమ్మ ముద్ద, ప్రేయసి తొలి ముద్దు మరపురాని మరువలేని మధుర సంఘటనలే ! జీవితాంతం గుర్తుండిపోయే తీయనైన స్మృతులే! దైవత్వం అమరత్వం అక్కడే ఉద్భవిస్తాయి.

ప్రేయసి మరుగున పడితే ఆ సుగంధాల సువాసనలు తరిగి పోవచ్చునేమోగానీ, తల్లి తినిపించిన పచ్చడి మెతుకులు, గంజినీళ్లయినా పంచభక్ష్యపరమాన్నాలుగా, జీవితాంతం షడ్రుచులను తలపింపజేస్తూ మరుజన్మకు కూడా మనతో ప్రయాణిస్తాయి.


కళ్ళల్లో వత్తులు వెలిగించుకొని బిడ్డ భవిష్యత్తే తన జన్మకు నిర్ణయించిన గమ్యమని, తను తిన్నా తినకపోయినా బిడ్డ కడుపు నిండితే చాలని అహర్నిశలు శ్రమ పడి సర్వం త్యాగం చేసిన ఆ తల్లికి ఎంత సేవ చేసి ఋణం తీర్చుకోగలం? రాధానందునికి అమ్మ మాట వేద వాక్కు. దైవం సంగతి తెలియదు.


ఎంత కష్టమైనా తల్లిని తలుచుకొంటే చాలు చిటికెలో మాయమయ్యేది. తండ్రి తనకు ఊహ తెలియకమునుపే చనిపోయాడని అమ్మ చెపితే తెలిసింది.


ఎలాంటి స్పందన కలగలేదు. ఉంటే బాగుండునని ఎప్పుడూ అనిపించలేదు. తల్లితండ్రి అన్నీఅమ్మే! ఎలాంటి లోటు లేకుండా పెంచింది యశోదమ్మ రాధానందుణ్ణి.

భర్త పొలానికి వెళ్ళివస్తూ పాముకాటుతో మరణించాడు. ఉన్న ఐదు ఎకరాలు అన్నదమ్ములు భాగాలు పంచుకొంటే, యశోదమ్మకు ఒక ఎకరా, రెండు ఆవులు వచ్చాయి.


నందునికి అవంటే ఎంత ప్రాణమో? పేర్లు పెట్టి పిలిచేవాడు. మేత వేసేవాడు. తల్లితో అవి చేసే పనులు గురించి గంటలు తరబడి మాట్లాడేవాడు.


అవి మేత తినకపోతే తను కూడా మొండికేసేవాడు. యశోదమ్మకు భయం వేసేది, వీటి మీదపడి చదువు ఎక్కడ అశ్రద్ద చేస్తాడోనని! కాని చదువులో ప్రధమంలో ఉండేవాడు.


గోమాతలంటే ఎంతో పిచ్చి. ఆ ప్రేమకు మమకారానికి సంతోషపడేది, కొన్నిసార్లు ఆశ్చర్యపోయేది. ఎట్లా ఇలా అయితే? పట్నం వెళ్లి ఎలా చదువుకుంటాడు అని.?

అదేమి చిత్రమో! వాడి పేరు చెపితే తలలూపుతూ పిలుస్తున్నట్లు అరిచేవి, నలువైపులా వెతికేవి. కాలక్రమేణా ఒక గోమాత చనిపోయింది.


వచ్చేసాడు. నందుని సముదాయించి కాలేజీకి పంపడానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. మరో ఆవుకు ఆడ బిడ్డ కలిగింది. కొంత కాలానికి ఆ గోమాత కూడా చనిపోయింది .


చెప్పనలివికాదు నందు బాధ. కసాయి వాళ్లకు ఇవ్వలేదు. మనుషులకు చేసినట్లే కర్మ క్రతువులు చేయించాడు.


దానితో తల్లి లేని బిడ్డని బుజ్జి అని పేరు పెట్టి, జబ్బులు రాకుండా అన్ని మందులు, సూదులు వేయించాడు . బుజ్జికి నందు అంటే ఎంత ప్రాణమో!


ప్రక్క నే పడుకొనేది, ముదిగారం కార్చేది, వగలుపోయేది, సంతోషంతో గంతులు వేసేది. యశోదమ్మ దాన్ని ఛూసుకుంటూ కొడుకును ఏలోటు లేకుండా పెంచింది. బాగా చదువుకున్నాడు.

రాధానందుడు ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. మంచి ఉద్యోగం వచ్చింది. తన శ్రమ ఫలించిందని పొంగిపోయింది యశోదమ్మ. ఇక పెండ్లి చేసేస్తే తన భాధ్యత పూర్తిగా నేరవేర్చినట్లని వెతకసాగింది. చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి. కానీ తమకు తగ్గ సంబంధం, మంచి పెంపకంలో పెరిగిన, అందంగా ఈడు జోడు సరిపోయేటట్లు, చదువుకున్న బిడ్డకోసం చాలా వెతికింది.

అదృష్టం అలాంటి అమ్మాయే దొరికింది. అణుకువ, మర్యాద, ప్రవర్తన చాలా నచ్చింది. ఇంజినీరింగు చదివి తను కూడా ఉద్యోగం చేస్తుంది. మంచి జీతాలు, గొప్పగా బ్రతికిపోతారు. తన అదృష్టానికి కోటి దేవతలకు వందనాలు తెలుపుకుంది.

ఉన్నంతలో ఘనంగా కోడల్ని ఆహ్వానించింది. ఆ జంటను చూసి మురిసిపోయింది. తృప్తితో మనసు నిండిపోయింది. నెల రోజులకే పట్నంలో కాపురం పెట్టాలని ఇండ్లు చూసి వచ్చారు.

అది ఐదో అంతస్తు అంట. తను ఎక్కగలదా? లిఫ్టు ఉంది, పరవాలేదు అని చెప్పాడు కొడుకు. అయినా మీరు ఎన్ని రోజులు ఉంటారు అత్తమ్మా అంది కోడలు. వింతగా అనిపించినా తప్పుగా కనిపించలేదు యశోదమ్మకు.

“మా అత్తమ్మే మా దేవత. మాతోనే ఉంచుకుంటాం.” అని వచ్చిన వాళ్ళతో కోడలు అపూర్వ చెప్పడం విని జన్మ తరించి పోయిందని, సంతోషంతో గర్వపడింది కోడలి సంస్కారానికి.

కొత్త సంసారానికి కావాల్సినివన్ని ఆలోచించి, ఆలోచించి, కొడుక్కు ఏది ఇష్టమో, కోడలుకు ఏది నచ్చుతుందో అడిగి అడిగి ఏది తక్కువగాకుండా, ఒక లారీకి సరిపడా వస్తువులన్నీసర్దిపెట్టింది యశోదమ్మ.

అవన్నీ చూసి, “ఏవిటి అత్తమ్మా ఇన్ని? అక్కడ దొరుకుతాయికదా ఇక్కడనుంచి మోసుకుపోవడం ఎందుకు?” చిరాకును, చూపించి చూపించనట్లు, తెలిసి తెలియనట్లు మొహమాట పడింది అపూర్వ.

“పల్లెల్ల్లో దొరికే మంచి నాణ్యత గల వస్తువులు అక్కడ దొరకవమ్మా? అన్నీకల్తీలే! ఆరోగ్యం చెడిపోతుంది” అని నచ్చ చెప్పింది యశోదమ్మ.

పాత కాలపు పిచ్చి అనుకొని నిట్టూర్చింది అపూర్వ.

తల్లి ఏమీ సర్దుకోకపోతే నందు అడిగాడు..” రావాలనే ఉంది. బుజ్జినెవ్వరు చూసుకుంటారురా ?” చాలా దిగులుగా అంది.

నిజమేనని అనిపించింది. కాని తల్లిని ఇక్కడ వదిలి వెళ్లడం ఇష్టం లేదు. అలాగని బుజ్జిని మరొకరి దయా దాక్షిణ్యాలమీద వదిలి వెళ్ళడానికి మనస్కరించలేదు.


కాస్త పట్టణానికి దూరంగా పెరడు ఉండే ఇండ్లు తీసుకుంటే, బుజ్జిని కూడా తీసుకెళ్లవచ్చు. అ మాటే అన్నాడు. యశోదమ్మ సంతోషానికి అంతేలేదు.

కాని కోడలు” మీరు నేల విడిచి సాము చేస్తున్నారు. అది మహానగరం. ఆ ఆవు ఇంటికి రాకపోతే దిగులుతో మీరు దేశమంతా తిరగాలి. బయటకొచ్చి దేని క్రింద అయినా పడి చస్తే..?.” అసహనంగా అంది అపూర్వ.

“ఎందుకు చూసుకోకూడదు ? అన్నీ దొరుకుతాయి అక్కడ. నేను చూసుకుంటాను. అంతగా ఉంటే ఒక మనిషిని పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు” అన్నాడు నందు. యశోదమ్మ ఆనందంతో మనసు తేలిక చేసుకుంది.

“ఎంత పరువు తక్కువ. కార్పోరేటు ఉద్యోగం చేస్తూ ఆవుల్ని గేదెల్నిమేపుకుంటారా? అది వేసే దరిద్రాన్ని జవిరిపోస్తారా? ఎందుకు చదివారు? ఆ గబ్బు కొంపలోనే పడి, దగ్గరే పడుకోకపోయారా?

నేనెందుకు.?” కోపంగా అరిచింది అపూర్వ.

కోడలు అంత గట్టిగా తక్కువగా మాట్లాడేసరికి చాలా కష్టం వేసింది యశోదమ్మకు. ” గోమాతమ్మా! మన ఇంటి మహాలక్ష్మి. ఆ మహా తల్లికి సేవచేసే భాగ్యం అందరికి కలగదు. ఎంత పుణ్యమో ? పూర్వ జన్మ సుకృతం ” అంది.

“గొడ్డు కెందుకు అన్ని దండకాలు ...కసాయి వాడికి తోలేస్తే సరిపోతుంది కదా!!”


“అపూర్వా!“ అంటూ ఒక్క అరుపు అరిచి, మమతను మమకారాన్ని కూడా కసాయివాడికి అమ్మేస్తావా? నిన్ను కూడా అమ్మెయ్యనా?” అంటూ లేచాడు నందు.

బిత్తరపోయి చూసింది అపూర్వ. యశోదమ్మకు బాధగా అనిపించినా, ఇది మరో విధంగా దారి తీస్తుందేమోనని భయం వేసింది. వెంటనే కొడుక్కి అడ్డు నిలుచుని, ”నందూ ఏవిటిది? అపూర్వ ఆచరణ యోగ్యమైన మాట చెప్పింది.

గొడ్డు, భార్య ఒకటే అవుతుందా?” అపూర్వ వైపు తిరిగి,” కసాయి వాడికి ఎందుకమ్మా! మంచి కాపలావాడికి అప్పగించి తరువాత వస్తాను. మీరు వెళ్ళండి. నీ ఇష్టా యిష్టాలు ముఖ్యం. బంధం, గొడ్డు మీద ఏవిటి, నీమీద ఉండాలిగాని. వాడి తెలివి తక్కువకు ఏమీ అనుకోకమ్మా!” సర్ది చెపుతూ ప్రేమగా దగ్గరకు తీసుకుంది.

జీవితం మెదటి అడుగులోనే అపార్ధాలు, అపోహలతో మొదలవ్వడం మంచిది కాదని ఆ సంభాషణకు ముగింపు పెట్టాలని ప్రయత్నించింది.

“అది కాదు అత్తమ్మా ! జీవితంలో పైకి రావాలంటే ఎంతో శ్రమ పడాలి. రాత్రుళ్ళు కొన్నిసార్లు చాలా ప్రొద్దు పోతుంది. రాలేక పోతే దాని ఆలోచనతో తొట్రుపడటం, అసలే అలిసిపోయి ఇంటికొచ్చిన మనకు అవసరమా?


దాని ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం అవుతుందని...! అనవసరంగా దాన్ని చంపడం ఎందుకని? అన్నీ మీరు ఎలా చెయ్యగలరు?” జాలితో పశ్చాత్తాపపడుతున్నట్లు అంది అపూర్వ.

“నిజమే నమ్మా నాకు ఆలోచనేలేదు. చక్కగా చెప్పావు. ఇక ఆ విషయం మరిచిపొండి. నీ సంతోషమే మాకు కావలసింది. నీకంటే ముఖ్యం ఎవరమ్మా!” అని లోపలికి నడిచింది యశోదమ్మ.

అపూర్వ అయిష్టంగా కూర్చొనున్న నందు దగ్గరకు సంకోచంగా వచ్చి” నన్ను క్షమించండి! మీకు అత్తగారికి అంత ఇష్టమైతే తీసుకెళదాం. మీ అనుబంధాన్ని అర్ధం చేసుకోలేక పోయాను..” అంటూ కళ్ళు తుడుచుకుంది.

అదిచూసి నందు ప్రసన్నంగా మారి ఆమెను దగ్గరకు తీసుకొని,” అమ్మను అర్ధంచేసుకో చాలు.” అని కళ్ళుతుడిచి నొసట ముద్దు పెట్టుకున్నాడు.

ప్రయాణమైనారు. పల్లెల్లో ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. పుట్టిన రోజుకు, గృహ ప్రవేశానికి , చివరకు చనిపోతే పాడి కట్టడానికి, ముందుగా వాళ్ళ చేతనే చేయిస్తారు.


ఆ ఉళ్ళో దిష్టికి ప్రఖ్యాతిగాంచిన ఆమె చేత అన్ని రకాలు దిష్టిలు తీయించింది. ఏవేవో పూజలు చేయించిన తరువాత మనసు స్థిమిత పరుచుకొంది. రానంటున్న యశోదమ్మను అపూర్వ బ్రతిమలాడి అలిగి నాలుగు రోజులకైనా రమ్మని తొలి అడుగు తనే పెట్టాలని పట్టుపట్టింది. తప్పలేదు.

వెళ్ళే ముందు నందు బుజ్జి దగ్గరకు వెళ్లి, దీనంగా చూస్తున్న దానిని కౌగలించుకొని, ఎంతో ఓదార్చాడు. ఎలా తెలిసిందో ఏమో, కన్నీరు కారుస్తూ, మోర ఎత్తుకొని రాసుకుంటూ వచ్చేస్తుంటే, తాడు తెంపుకోవాలని లాక్కుంటూ దీనంగా అరుస్తూ ఉంటే నందుకు కూడా వదల బుద్దికాలేదు. భార్య గుర్తు చేసేంతవరకు.


అపూర్వ దగ్గరికెళ్ళి సముదాయించపోతే కోపంగా పొడిచేటట్లు ముందుకు వచ్చింది. దూరంగా పరుగెత్తి అవమానాన్ని కప్పిపుచ్చుకోవడానికి నవ్వును కొనుక్కుంది.

ఎలా వస్తాయో, ఎలా తెలుస్తాయో మంచి చెడులు, మానవ స్పందనలు, గొడ్డు అనుకొనే ఈ మూగజీవులకు యశోదమ్మఆశ్చర్యానికిఅంతులేదు.విస్తుపోయింది..

నాలుగు రోజులని అన్ని సర్దేసరికి వారం పట్టింది యశోదమ్మకు. మనసులో బుజ్జిని గురించే ఆలోచన. తన ఇష్ట ప్రకారం ఏదీ జరగలేదు. కానీ అన్నీ తనను అడిగినట్లు ఒప్పుకున్నట్లు చేసేది కోడలు. బాధనిపించలేదు. చిన్నపిల్ల తెలియదు అనుకుని సర్దుకుంది.

వచ్చేటప్పుడు నందు చాలా దిగులుగా ఉన్నట్లు అనిపించింది. అపూర్వ బరువు దిగిపోయిన్నట్లు ఉన్నా, పోయి బుజ్జి దాన్ని ఎవరికైనా అప్పగించి వెంటనే వచ్చెయ్యమని పదే పదే వేడుకున్నట్లు చెప్పింది యశోదమ్మకు.

ఇంటికి రాగానే బుజ్జి దగ్గరకు వెళ్లి తనివితీరా ముద్దాడింది. యశోదమ్మను చూడగానే దిగులుగా ఉన్న బుజ్జి సంతోషంతో గంతులు వేసింది. చాలా సేపు దానితోనే గడిపింది. తిరిగి తిరిగి వీధి వైపు చూస్తుంది. నందు కోసం అని మరీ సముదాయించింది.

ఇంతలో వాళ్ళు వీళ్ళు పలకరించడానికి వచ్చారు. కోడల్ని గురించి ఎంతో గొప్పగా మెచ్చుకుంది. అందరూ యశోదమ్మ అదృష్టానికి చాలా సంతోషించారు.


వాళ్ళు వెళ్ళిన తరువాత తలుపులు వేసొచ్చి, మంచం మీద పడుకొని అనుమానాలతో అలిసిపోయిన మనసుకు విశ్రాంతి నివ్వడానికి ప్రయత్నించింది.


అపూర్వలో అమాయకత్వంతో పాటు తెలియని మూర్ఖత్వం, చదువుకున్నాం సంపాదిస్తున్నాం అనే గర్వం కూడా ఉన్నట్లనిపించింది.


అవి సభ్యత సంస్కారం, మన్నన మర్యాదల ముందు కాలిగోటితో సమానమని తెలియని అవివేకి పాపం. చిన్నతనం, తెలుసుకుంటుందిలే అని గట్టి నమ్మకం.


ఎందుకంటే బాధ్యతతో కూడిన పెంపకం. తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులే! ఏదో మనసులో తెలియని బాధ? ఎంత ప్రయత్నించినా వెళ్లనంటుంది. ఆలోచించి ఆలోచించి, బాగుంటారు అని తృప్తి పడి, నమ్మకం తెచ్చుకొని అలాగే నిదుర పోయింది యశోదమ్మ.

కొత్త కాపురం. అన్నింటికి ఆత్రుత. ఏదో ఒకటి చేసుకుని పరుగులు తియ్యడం. సాయంకాలం రాగానే నీరసం. హోటల్లో తెచ్చుకోవడమో, వెళ్ళి తినేసి రావడమో జరిగేది. నందు ఏమి అడిగేవాడు కాదు. అత్తమ్మ ఉంటే ఎంత బాగుండును అని అప్పుడప్పుడు అనేది. ఎందుకు కొన్ని రోజులు మీవాళ్ళను రమ్మను. మనం స్థిమిత పడేవరకు ఉండి వెళతారు అన్నాడు. వాళ్ళెక్కడండీ ఉద్యోగస్తులు. అత్తమ్మకు తెలిసినంతగా మా అమ్మకు తెలియదు. నేనే నయం అని మాట మార్చేది.

నెలరోజులు గడిచి పోయాయి. ఊరికెళ్లి అమ్మను చూద్దాం అంటే, మొన్ననే కదండి వచ్చి వెళ్ళింది. పాపం ఆమెకు ఎన్ని పనులో, మనం వెళ్లి శ్రమ పెట్టడం ఎందుకు? అని మాట దాటేసింది అపూర్వ.


అమ్మను చూడాలని, బుజ్జితో రోజంతా గడపాలని, ఎంతో ఆశగా ఉన్నా, ఆమెను కష్టపెట్టలేక పోయేవాడు నందు.

ఎప్పుడు ముభావంగా, తను చెప్పినట్లు వింటున్నా, సంతోషంగా లేడని, అది తల్లి మీద, ఆ వెధవ పశువు మీద బెంగని, విధిలేక అయిష్టంగా ఊరికి వెళ్దామని చెప్పింది అపూర్వ. నందుకు భార్య తనను అర్ధం చేసుకున్నందుకు సంతోషం వేసింది.


నందు, తల్లికి పండ్లు, స్వీట్లు చాలా కొంటుంటే ,” ఎందుకండీ అన్ని. ఆమె తింటుందా ఏమన్నానా!” అంది ఎడముఖంగా. ‘మనల్ని చూడడానికి వచ్చిన వాళ్లకు పెడుతుంది. అదొక గొప్ప కాబోలు’ అనుకుని పెదవి విరిచింది అపూర్వ.

యశోదమ్మ పిల్లల్ని చూడగానే సంబరపడిపోయింది. బుజ్జి నందుని చూడగానే పెన్నిధి దొరికినట్లు అల్లుకుపోయింది . నందుని ముఖం అంతా ముద్దులు పెట్టసాగింది.

అసహ్యించుకుంటూ చూస్తూ, “గమ్మనున్నారేమండి. దూరంగా తరమండి.” అంది అపూర్వ,

“మనిషి ముద్దుకంటే కంపు కొట్టదులే” అంటూ లేచి వెళ్లి అంతా కడుక్కున్నాడు నందు. అపూర్వ ముఖం చిన్న బోవటం గమనించలేదు .

ఉన్న రెండు రోజులు ఎన్నో చేసిపెట్టింది యశోదమ్మ.

“నాకు తెలిసి ఇంత రుచిగా ఈ జన్మలో తినలేదు” తిని అపూర్వ లేచింది.


మా వూరు చూడు అని నందు పోరుబెడితే బలవంతంగా వెళ్ళింది. అంతా తిరిగి రామాలయం దగ్గరకు వచ్చారు. చాలా శిధిలావస్థలో ఉంది. చాలా దిగులు వేసింది. “మనం బాగు చేయిద్దాము.” అన్నాడు.

అపూర్వ నవ్వి, ”ఎంత భక్తి ఉందో మీ ఊరి జనాలకు. ఎందుకు మళ్ళీ దెయ్యాల దేవాలయం చెయ్యడానికి? వద్దనే వద్దు. ఆ డబ్బు మరో దానిలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో పనికి వస్తుంది .” అంది.

“ఎంత సేపు భవిష్యత్తు.. భవిష్యత్తు... అది ఇచ్చేది ఆయనే!”

“ఈ ఊళ్ళో ఉన్న వాళ్లకు ఎంతమందికి ఇచ్చాడంట. ఆయనకే దిక్కూ మొక్కూ లేకుండా చెత్తకుప్పలో పడున్నాడు.” అంది నిరసనగా

“దిక్కులేక కాదు. మన కళ్ళు తెరిపించడానికి. మనకు ఆ భాగ్యం కలగడానికి.”


“మిగిలిన వాళ్ళు వద్దనుకున్నారా? లేక మించిపోయి కొవ్వు పట్టి కళ్ళు కనిపించడం లేదా?”

“కళ్ళు తెరిపించడానికే ఒక పవిత్ర కూడలి అవసరం. అది దేవాలయం ఒక్కటే!”


“పిచ్చి మీకు. అక్కడ జరగని దరిద్రపు పనులు లేవు. భక్తులు తలవని దరిద్రపు కోరికలకు అంతులేదు.”

“నాశనం అవుతారు. ఆధ్యాత్మికత అంతరంగ మనోభావాలను క్రమబద్దం చేస్తుంది. ఆవేదన, అసంతృప్తులను అంతం చేస్తుంది. నేనున్నాను అనే ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది.


వెలికి చెప్పలేని, పంచుకోలేని, సంఘర్షణలు, సమస్యలు ధైర్యంగా నిష్కపటంగా చెప్పుకోగలిగిన తల్లిదండ్రులు వాళ్ళొక్కరే! అందుకే దేవాలయం! నిశ్చలమైన మనస్సుతో, ఏకాగ్రతతో కొలిస్తే తీరని బాధంటూ ఉండదు.”

“ మీ అవివేకం. త్యాగయ్యను ఆదుకున్నాడా! రామదాసును విముక్తుడ్ని చేసాడా! కుమ్మరి మొల్లను తనలో చేర్చుకున్నాడా! అన్నమయ్యకు తిండి పెట్టాడా! ఎంత మందిని కాపాడాడు ?”

“ప్రారబ్ద కర్మ అని ఒకటుంది. అనుభవించి తీరాల్సిందే!”

“మరి దేవుళ్ళెందుకు?”

“ అజ్ఞానులుకు అర్ధం కాదు విశ్వమంతా అల్లుకొనున్న ఆ శక్తి మహిమ.

ఆదుకుంటాడు అనే ఆశతో జీవితాన్ని ఎదుర్కోవడానికి ఓర్పును వరంగా ఇస్తాడని . చివరి క్షణాలలో ప్రశాంతంగా ఆయనలో లీనమయిపోతామనే నమ్మకంతో జీవించడానికి .” అన్నాడు చిరాగ్గా నందు.

“మీ రాముడొక్కడేనా? జీసెస్, మహమ్మద్ లు చెయ్యరా?”

“ అందరూ ఒక్కటే! శక్తిస్వరూపులే! ఎవరి నమ్మకం వారిదే.”

మరీ పొడిగించదలుచుకోలేదు. ఈ తర్కం ఎప్పటికి అంతం కాదని తెలుసు.నిజమే ఎవరి నమ్మకం వారిది. చాందసం ఎక్కువ ఉన్నట్లుంది అని మౌనంగా ఉండిపోయింది అపూర్వ.


తల్లి ఎందుకు అంటున్నా అవసరం అని, ఇంటికి ఫోను పెట్టించాడు నందు.

బస్సు ఎక్కేంతవరకు అపూర్వ రమ్మని పిలుస్తూనే ఉంది యశోదమ్మను. నవ్వుకుంటూ ‘వస్తాను.. వస్తాను’ అని చెపుతూనే ఉంది యశోదమ్మ.


బస్సు వెళుతుంటే దానితో పరుగులు తీసింది బుజ్జి. సముదాయించి ఇంటికి తీసుకొచ్చే సరికి అలిసిపోయింది. దిగులుపడింది దాని బాధను చూసి. చాలా చాలా చెప్పి ముదిగారం చేసిన తరువాత స్థిమిత పడింది బుజ్జి. మనుషులుకంటే జీవ హృదయాలే గొప్పవేమో !

ఆరు నెలలు అరకొరగా జరిగిపోయాయి. నందు ఎప్పుడు ఊరికి వెళదామన్నా, అపూర్వ ఏదో ఒక అడ్డు చెప్పేది లేదా మరో కార్యక్రమం పెట్టి మానిపించేది.


ఫోనులో రోజు గంటలు తరబడి మాట్లాడే వాడు నందు అమ్మతో. ఇష్టమే లేదు అపూర్వకు.

“ఏవండి భోజనం చెయ్యమందా? మనల్ని ఒకే ప్రక్కమీద పడుకోమందా?” అంటూ ఛలోక్తులు విసిరేది అపూర్వ. నవ్వుకొనేవాడు నందు అసూయ అని.

ఆరు నెలల తరువాత వెళదామని ఒప్పుకుంది అపూర్వ. కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న యశోదమ్మకు దీపావళి పండుగే అయ్యింది.


బుజ్జి సంగతి చెప్పనే అవసరం లేదు. అలిగింది, ముఖం మాడ్చుకుంది. క్షణంలో మరిచి పోయి ఎగిరి గంతులేస్తూ నందు వడిలో పడుకుంది.

మళ్ళీ చీదరించుకుంది అపూర్వ.

“ఈ ఇంటి ఆడపడుచు. ఆవిడ దయ, ప్రేమ మీదనే ఈ ఇంట్లో నీ స్థానం” అన్నాడు నందు నవ్వుతూ బుజ్జిని ఆప్యాయంగా నిమురుతూ.

“అట్లయితే ఆ జాతిలోనే చేసుకోకపోయారా? నన్ను ఎందుకు చేసుకున్నారు?”

“తప్పలేదు కదా! కాకపోతే కాస్త జాతి తక్కువ,రంగు మార్పు.”

అపూర్వకు అర్ధం కాలేదు. అర్ధం అయి ఒక్క అరుపు అరిచింది ”అత్తమ్మా” అని.

పరుగెత్తు కొచ్చింది యశోదమ్మ. కొడుకు ముఖంలో నవ్వు, కోడలి ముఖంలో పెల్లుబుకుతున్న కోపం చూసి, ”ఏవిట్రా ! ఏమన్నావు?” అడిగింది.

నవ్వును మాయనివ్వక, ”ఏం లేదమ్మా ! తను ఏ జాతి అని అడిగితేను చెప్పాను” అన్నాడు భార్యను కవ్వించినట్లు చూస్తూ.

“నేను గేదె జాతి దాన్నంట. విధి లేక కాపురం చేస్తున్నాడంట” అంది ఏడ్చేటట్లు.

దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ, ”దేవతల సంగతి పసలోడికి ఏం తెలుస్తుందమ్మా. నువ్వు ఈ ఇంటి దేవతవు. పూజ గదిలో పెట్టుకోవాలి. వాడ్ని పశువుల దొడ్డిలోకట్టేయ్యాలి. రామ్మా భోజనం చేద్దురు.” అని పిలిచింది.

బాగా అయ్యిందా అని భర్తను ఎక్కిరిస్తూ, ” నేను పసలోళ్లతో తినను అత్తమ్మా” అని గీర చూపించింది. నందు వచ్చి పట్టుకోపోతే యశోదమ్మ దగ్గరకు పరుగెత్తింది.

భోజనాలు చేసి తీరిగ్గా కూర్చున్న తరువాత తల్లితో, పొలం కొనాలని ఉందని, గుడి బాగు చేయించాలని చెప్పాడు. అపూర్వ ఆశ్చర్యపోయింది. పొలం కొనాలనున్నట్లు తనతో ఎప్పుడు అనలేదు.కష్టం వేసింది.

“ఇక్కడెందుకు? మీకేమయినా పిచ్చా? ఎవరు వచ్చి చూసుకుంటారు. సిటీలోనే స్థలమో, ప్లాటో తీసుకుంటే లోను కూడా ఇస్తారు.” అని అయిష్టాన్ని బయట పెట్టింది.

యశోదమ్మ కాస్సేపు ఆలోచించి,” అపూర్వ చెప్పిందే బాగుంది. ఇక్కడ రోజుకు రోజుకి పనివాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది. పని చెయ్యాలని ఎవ్వరికి లేదు. ప్రభుత్వం తేరగా మేపుతుందిగా?” అంది

“లేదమ్మా పుట్టిన గడ్డ. పోగొట్టుకున్నదంతా కాకపోయినా కాస్తయినా ఉండాలి. నా చిన్ననాటి ఆశయం, కల కూడా.”

“అంటే వచ్చేదంతా ఇక్కడే తగలేస్తారా?” అంది కోపంగా అపూర్వ.

“ కాదు అక్కడ కూడా కొందాము. మన ఇద్దరికీ కలిసి బాగానే వస్తుంది కదా!”

“ అంటే కొనేందుకు ఇంకేం లేవా? బంగారు కొనాలి. కారు కొనాలి.ఇంకా..?”

“అవన్నీ ఖర్చులు. దర్పంకోసం.”

“ కాదు అవసరం.మనం అ స్కూటరులో పోలేక ఎంత అవస్థ పడుతున్నాం. రేపు బిడ్డలు పుడితే అది చాలదు. బంగారం కొందాం. మంచి పెట్టుబడి.”

“బీరువాలో పెట్టి రోజూ చూసుకుంటూ, పేరంటాలకు, పెళ్లిళ్లకు, చావులకు కూడా వేసుకు పోయి, నీ గొప్పతనం చూపించడానికా? ఏ దొంగలో వచ్చి ఎత్తుకెళ్ళతారని నిదరపట్టక చావడానికా?”

“ పొలం చేసేందుకు వాళ్ళను వీళ్ళను బ్రతిమలాడి, డబ్బులిస్తూ అడుక్కుతిని, పెట్టిన తరువాత పండుతుందో లేదో తెలియక, గుండెల్ని అరచేతిలో పెట్టుకొని ఆకాశం చూస్తూ బ్రతకడం మంచిది అంటారా? పందులు పొర్లాడే బురదగుంట కెందుకు అంత ప్రాకులాట. కోరి శని తెచ్చుకోవడం, పూడ్చి పెట్టడానికి?” దురుసుగా అంది అపూర్వ.

“భూమాతను అంత మాటంటావా?” అంటూ లేచాడు నందు. ఎప్పుడూ చూడని కొడుకుని ఆ విధంగా చూసి భయపడింది యశోదమ్మ. వెనక్కు తగ్గింది అపూర్వ.

“నువ్వు ఎక్కడనుంచి వచ్చావు. నువ్వు తింటున్న తిండి ఎక్కడిది? కట్టుకున్న బట్ట, పెట్టుకునే పూలు, పీల్చేగాలి, కురిసే వాన, మనసును రంజింప చేసే ఈ వనాలు, నదులు, పర్వతాలు ఎవరిచ్చినవి.


కోటాను కోట్ల పశుపక్ష్యాదులకు జీవం పోస్తున్నదెవరు? అసలు నీ పుట్టుకకు, పెరిగేందుకు భిక్ష వేసింది ఎవ్వరు? విశ్వమాత భూమాత. మనల్ని రక్షించే కన్నతల్లి పవిత్రమైంది.తెలుసుకొని మాట్లాడు.


అమెరికాలోని ఇతర దేశాలలోని మన భారతీయులు, ఎంతో మంచి ఉద్యోగాలని వదిలి వచ్చి, కొత్త మలుపులతో ఈ భూదేవిని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. కొత్త కొత్త పంటలు పండిస్తున్నారు.


జగతికి అన్నం పెడుతున్నారు .ఈ ప్రపంచంలో నిజాయితీగా బ్రతికేది ఒక్కరైతు మాత్రమే!” కోపంగా అన్నాడు నందు.

“అట్లాగైతే దాంట్లోనే పడి చావండి. నేను వెళుతున్నాను.” విసురుగా సూటుకేసు తీసుకొని బయలు దేరింది.

అంతవరకు ఏం మాట్లాడాలో తెలియక చూస్తుండి పోయిన యశోదమ్మ అడ్డు పోతూ, ”అమ్మా అమ్మా! తొందర పడకు. వాడికి ఇప్పటి ఆలోచనలు తెలియవు. చిన్నగా చెప్పి నువ్వే దారికి తీసుకు రావాలి” అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ సర్దిచెప్పింది.

“లేదత్తమ్మా! నాకు నరకాన్ని చూపిస్తున్నాడు. అమ్మ ఎలాఉందో. బుజ్జి ఎలాగుందో ఇదే ధ్యాస. నేను ఎలాగున్నానో అక్కరలేదు. నన్నెందుకు చేసుకున్నట్లో అర్ధం అయి చావడం లేదు.” అంది కన్నీళ్ళు పెట్టుకుని అపూర్వ.

కొడుకు అలా ప్రవర్తించడం తప్పు అనిపించింది యశోదమ్మకు. దిక్కు తోచనట్లు కొడుకు వైపు చూసింది.

“ఆ కన్నీళ్లు చూసి జాలి తలవకమ్మా!తలుచుకుంటే జడివానలా దూకుతాయి. అది నేను చెయ్యలేక పోతున్నాను.


ఏది చెయ్యాలన్నా నావల్ల కాదు అని ఒకటే నస. సరే మీవాళ్ళను పిలిపించు కొంత కాలం అంటే...వాళ్ళు ఉద్యోగస్తులు అంటుంది.


మిమ్మల్ని గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఆ బడి పంతుళ్ళ గోలే. ఎలా వినేది? అప్పుడు బుజ్జి సంగతి, నీ విషయం మాట్లాడితే కస్సున ఎగిరి, నోరు మూస్తుంది.”

“మా అమ్మా నాన్నలని గురించి మాట్లాడ కూడదా?”అంది విసురుగా అపూర్వ.

“మరి నేను మాట్లాడితే తప్పేవిటి?’ “తప్పని కాదు.మీరు నన్ను.....?”

యశోదమ్మ అర్ధం చేసుకుంది. ”ఓసి పిచ్చి దానా! మీరిద్దరూ కలకాలం చిలకాగోరింకల్లా ఉండాలని కోరుకుంటాను గాని, దూరంచేసి నన్ను చూసుకోవాలని ఎప్పటికి అనుకోను.


భయపడకు. నీ తరవాతనే నేను! పిచ్చి అనుమానాలు పెట్టుకుని అనుబంధాన్ని తగల పెట్టుకోకండి.


ఎన్ని సమస్యలు వచ్చినా మూర్ఖపు పట్టుదలలతో, పంతాలతో గాక, అర్ధంచేసుకొని మన్నించుకొని, భార్యా భర్తల అనుబంధానికి ఒక గౌరవాన్ని, ఒక అర్దాన్ని కల్పించి, జీవితాన్ని స్వర్గమయం చేసుకోండి.


ఏ చిన్న అపార్ధమయినా ఆదిలోనే అంతం చెయ్యాలి. మరుపు సుఖమయ జీవితానికి నూరేళ్ళపంటకు ఎప్పటికి వసి వాడని సంజీవినీ పుష్పం. సువాసన తరగని మల్లెల పాన్పు లాంటిది!


ఉంటాయి ఇష్టాయిష్టాలు,కోపతాపాలు, అపార్ధాలు, అనుచితాలు. అవి సహజం. మీ జీవితాల్ని లోబరుచుకొని శాసించకూడదు.” మౌనంగా యశోదమ్మ చెపుతున్నది వింటూ ఉండిపోయారు.

కాస్సేపటికి అపూర్వ మొహపాటు పడుతూ వచ్చి,యశోదమ్మ కళ్ళల్లోకి చూడక, ”నాకుంది. కాని ఆయన....?” అంటూ ఆపి నందు వైపు చూసింది భయపడుతూ.


అది చూసి నవ్వుకుంటూ ”భయంతో జీవితాలు చిగురించవు“ నొసట ముద్దు పెట్టి ప్రేమతో లోనికి తీసుకెళ్ళింది .

భోజనాలు తిని అపూర్వ నిదురపొయిన తరువాత, మేలుకోనున్న కొడుకు దగ్గర వచ్చి కూర్చుంది. చాలా సేపటి వరకు ఇద్దరు ఏం మాట్లాడ కోలేదు. యశోదమ్మ ముఖంలో ఆందోళన గమనించాడు నందు. అయినా పలకరించ లేదు.

యశోదమ్మ గాఢ నిట్టూర్పు వదిలి కొడుకు వైపు చూసింది. నందు అమ్మ వైపు చూసాడు.

“నువ్వు విడిపోయేంత కష్ట పెడుతున్నావా?”

“నేను నువ్వు పెంచిన బిడ్డనమ్మా” యశోదమ్మ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆ మాటలకు కళ్ళు దించుకొని మౌనంగా ఉండి పొయింది.

మనసు కాస్త మెత్త పడినా ఒక వైపు అనుమానం వేధించ సాగింది. ఎలా సమర్ధించుకొని పదికాలాలు పాటు, పిల్లాజెల్లలు తోటి సుఖంగా ఉండగలరా అని భయాన్ని కలిగించింది. త్వరగా పిల్లలైనా పుట్టితే కలిసిపోతారు. బాధ్యతలు, అర్ధం చేసుకుని సుఖంగా ఉంటారనుకుంది

వెళుతూ పదే పదే మరీ మరీ రమ్మని బ్రతిమలాడింది అత్తను అపూర్వ. తప్పక వస్తానని మాట తీసుకొని బస్సు ఎక్కింది. బుజ్జి ఆరోగ్యాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు నందు.


బాగుంటారులే..బాగుంటారులే, చిన్నతనం ఇంకా తెలియదు. పాపం!! అని మనసుకు సర్ది చెప్పుకుంది యశోదమ్మ.

వాళ్ళు వెళ్లి నాలుగు నెలలైనా ఇవే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. కలవర పెడుతున్నాయి యశోదమ్మను. నందు వారం వారం ఫోను చేస్తూనే ఉన్నాడు. కోడలితో మాట్లాడాలని ప్రయత్నిస్తే, బయట వెళ్ళిందనో, ఇంకా ఆఫీసు నుండి రాలేదనో చెప్పేవాడు.

ఈ లోగా బుజ్జి వయసుకు వచ్చింది. వినగానే దూకినట్లు వచ్చి, మంచి ఒంగోలు జాతి కుర్రాడుతో పెండ్లి, శోభనం జరిపించాడు నందు. డాక్టరుకి చూపించి జబ్బులు రాకుండా చాలా సూదులు వెయ్యించాడు.


మళ్ళీ ఓ చాట భారతమంత లిస్టు ఇచ్చి, కాన్పు అయ్యేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు.


యశోదమ్మ నవ్వుకుంటూ, ”నా బిడ్డ సంగతి నేను చూసుకుంటారా! నీ పెళ్ళాం సంగతి నువ్వు చూసుకో! ”అంటే, ”అన్నీ ఆవిడే చూసుకుంటుంది మన జోక్యం ఇష్టంలేదు.” అన్నాడు. ఆ మాట గుండెల్లో కలత పెట్టింది. మళ్ళీ కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలకు మొక్కుకుంది!!

నందు వారం వారం ఫోను చేసేవాడు... చెయ్యలేదు. చాలా గాబరా పడింది. తను చేస్తే ఫోను ఎత్తుకోవడం లేదు. పట్నం వెళ్ళే వాళ్లకు చెప్పి పంపితే, కామెర్లు హాస్పిటల్లో చేరి ఉన్నాడు. కంగారు పడొద్దు. ఫోను చేస్తానని చెప్పాడు అని కబురు మోసుకొచ్చారు.

అది విని యశోదమ్మకు చేతులు కాళ్ళు ఆడలేదు. శరీరమంతా చెమటతో తడిచిపోయింది. భయంతో వణికి పోయింది. కామెర్లకు ఏవిటి హాస్పిటల్లో? ఆకుపసర్తో తగ్గిపోతుంది. అయినా ఫోను చెయ్యలేక పోవడం ఏవిటి? అమ్మాయి అయినా చేసి ఉండొచ్చు కదా? నిలవలేక అప్పటికప్పుడు ప్రయాణమై వెళ్ళింది.

బిడ్డను చూడగానే కడుపు తరుక్కుపోయింది. చాలా తగ్గిపోయి ఉన్నాడు. దగ్గర ఎవ్వరూ లేరు. భాధను అణుచుకోలేక బోరున ఏడ్చేసింది. తల్లిని సముదాయించడానికి కూడా శక్తి లేదు నందుకు.


కోడలు ఎప్పుడు వచ్చిందో. రాగానే ఎంతో బరువు దిగి పోయినట్లు, “అబ్బ మీరు రావడం దేవుడు వచ్చినట్లుంది. ఇక నాకేం దిగులు లేదు. మంచి భోజనం దొరుకుతుంది ”అంది.

యశోదమ్మకు, కోడలు భర్త సంగతి మాట్లాడక ఇవన్నీ ...? చాలా కోపంగా, బాధగా ఉంది. అయినా ఏం మాట్లాడ లేదు. ”నాతో ఎందుకు చెప్పలేదమ్మా” అంది.

“చెప్పనిస్తే కదా! బుజ్జికి కడుపు, అమ్మకు ఒణుకు.”


ఆ మాట అననేలేదు నందు. “ఎందుకండి.. భయపడుతుంది. ఆఫ్టరాల్ జాండిస్సే కదా. ఆవిడ వస్తే ఇద్దర్ని చూసుకోవడం నావల్ల కాదు” అని చెప్పిన మాట గుర్తుంది నందుకు.

ఎంత వైద్యమున్నా, కావాల్సింది ఆలనా పాలనా మనశ్శాంతి. అవి ఎలాంటి జబ్బునయినా క్షణాలలో కుదుట పరుస్తాయి. ఆత్మీయత అనునయం ఎంత ముఖ్యమూ ఆలోచించలేదు అని చాలా బాధ పడింది యశోదమ్మ.


వస్తువులు చెల్లాచెదురుగా ఉంటే సర్దుతూ , ఒకరకమైన ఖాళీసీసాలు ఒక రూమునిండా ఉండటం గమనించింది. ఇన్ని ఫినాయిల్ సీసాలు ఎందుకు అని, వాసన చూసి శిలలాగా అయిపోయింది.


ఎంతకూ శబ్దం లేకపోయే సరికి తిరిగి చూసిన నందుకు పరిస్థితి అర్ధమై కలవరాన్ని కప్పిపుచ్చుకుంటూ, “అవి.. అవి వాళ్ళ స్నేహితులు..” మాట పూర్తి చెయ్యలేక, నమ్మలేక ఉలిక్కిపడి తిరిగి చూసిన తల్లి కళ్ళల్లోకి చూడలేక తల దించుకున్నాడు.

నిరామయంగా భయంతో నిలిచిపోయిన తల్లిని చూసి, ”ఈ కాలపు ఆడవాళ్లకు సోషల్ స్టేటస్సు... ఇవన్నీ సాధారణమే! పట్టించుకుంటే ఒక్క సంసారం ఉండదు. నువ్వు మరీ దిగులు పెట్టుకోకు. నీ కోడలు ఎంతో...! మాట పూర్తి చెయ్యలేక పోయాడు. ఆ రోజునుంచి కోడలితో ఒక్కమాట మాట్లాడ లేదు.

నందు కోలుకునే సరికి పది రోజులు పట్టింది. ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండలేదు అపూర్వ.


“మీ చేతిలో దైవత్వం ఉంది” అని అత్తను పొగుడుతూనే ఉంది. ఆశక్తి భార్యకు కూడా ఉంటుందనే సంగతి మరిచిపోయింది కోడలు అని అనుకుంది యశోదమ్మ.


ఇద్దరూ వచ్చి నెలరోజులు ఉండి విశ్రాంతి తీసుకు రావొచ్చు అని బలవంతం చేసింది యశోదమ్మ.

“మీరు ఉండగా నేనెందుకు. లీవులు లేవు. పని వొత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ”అయిష్టంగా ముఖం పెట్టుకుంది అపూర్వ.

“నేను ఉండటం వేరు భార్య చూసుకోవడం వేరు.” అని ఎంతో నచ్చ చెప్పింది.

“ ఆయనకు బుజ్జి , మీరుంటే చాలు. ప్రపంచమే కనిపించదు.”

“మేము కాదమ్మా నువ్వు ఉంటే అమ్మకూడా కనిపించకూడదు.” అంది యశోదమ్మ.

“మిగిలిన మగాళ్ళకేమో! ఈయనకు ఆ బుజ్జి ఉంటే చాలు పడుకోవడానికి. వండి పెట్టడానికి ఎటు మీరున్నారుకదా నోట్లో ముద్దలు పెట్టడానికి.”

“ఎప్పుడైనా తల్లి దగ్గర పెరిగుంటే కదా ఆ తియ్యదనం తెలిసేందుకు? అడివిలో పెరిగింది రాక్షసులతో” అన్నాడు కోపంగా విసుగుతో నందు.

”ఇంకోసారి వాళ్ళను ఏమన్నా అంటే మీ ముఖం ఈ జన్మలో చూడను” అని విసురుగా రూములోకి వెళ్ళింది.

యశోదమ్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. కొడుకు వైపు దిక్కు తోచనట్లు చూసింది.

“ ఉంటుంది లేమ్మా! నువ్వు వెళ్ళు. తరువాత తానే వస్తుంది. రాకపోతే నేనే వచ్చేస్తాను.” అని నచ్చ చెప్పి , ఇష్ట లేకపోయినా తల్లి బాధ పడటం సహించలేక, ”కొంచెం సేపేలే ఆ బెట్టు!” అన్నాడు. నందుకు తెలుసు ఆవిడ మొండితనం.

అలా కాదని లోపలికి వెళ్ళి, అపూర్వను సకల విధాల చెప్పి బ్రతిమలాడి, కొంత ప్రసన్నం చేసుకుని, వీడ్కోలు చెప్పేందుకు తీసుకొచ్చేలోగా చాలా అలిసిపోయింది. ఏవిటిది...ఏం జరుగుతుంది అనుకోగానే తల తిరిగిపోయింది చెమటలు పోసిపోయాయి యశోదమ్మకు.

అది గమనించి దగ్గరకు వచ్చి పొదివి పట్టుకుని అనునయిస్తున్నట్లు ”సర్డుకుంటుంది లేమ్మా!ఇది మామూలే ” అన్నాడు నందు.

యశోదమ్మకు అనిపించలేదు. ఊరికి ఇప్పుడే వెళ్లిపోవాలనిపించింది. చెప్పింది.

అప్పుడే వెళ్లిపోతే ఎలా? యింకా ఆయన... అదిగాక తనకు చాలా పని ఉంది. తన మీద కష్టంతో వెళ్లిపోతుందేమో? అనుకొని. “మీరుంటే దేవుడు నా దగ్గరున్నట్లు అత్తమ్మా! తల్లికూడా నన్ను ఇలా చూడదు. నా వలన ఏదయినా తప్పులుంటే క్షమించు అత్తమ్మా!” అంది చాలా సిగ్గు పడ్డట్టు.

బుగ్గలు నిమురుతూ,”అవన్నీ ఆలోచించకమ్మా! నువ్వు నాబిడ్డవే కదా! కష్ట సుఖాలు పంచుకోకపోతే అనుబంధానికి అర్ధమే లేదు” కోడలిలో వచ్చిన మార్పుకు సంతోషంతో పొంగిపోయింది. ఉండిపోయింది యశోదమ్మ.

అది ఎంతో కాలం నిలవలేదు. ప్రతిదానికి ఏదో లోపం చూపించేది. పల్లెటూరి వాళ్లకు ఏం తెలుసు శుభ్రత, పద్ధతి అని ఎగతాళిగా మాట్లాడేది. యశోదమ్మ నవ్వుకుంటూ కష్టంవేసినా మనసులో ఉంచుకోక, ఎంతో ఆప్యాయంగా చేసి పెట్టేది.

నందుకు తన తల్లిని తన ముందే మరీ తక్కువగా హేళన చూస్తుంటే భరించ లేకపోయేవాడు. తల్లిని అదుపు చేసి, కొన్ని కొందరికి తెలియవు. తల్లిదండ్రుల బుద్దులు , పెంపకం మీద ఆధార పడి ఉంటాయి. అలాగే ప్రవర్తిస్తారు అని నచ్చ చెప్పేది.

వాళ్ళిద్దరూ తనను ఏమీ అనక పోయేసరికి “మీరిద్దరూ ఒకటయ్యారు ,నన్ను చులకనగా చూస్తున్నారు, నామీద ఏవిటేవిటో మాట్లాడుకుంటున్నారు” అని ఒక్కటే అపూర్వ దెప్పిపొడుపులు .

“గుడ్డలు బోలెడు పడి ఉన్నాయి, గిన్నెలు అలాగే ఉన్నాయి. పనిమనిషి రావడం లేదు. చెపితే ఈయన పట్టించు కోవడం లేదు. నేను పనికి వెళ్ళివచ్చేసరికి పొద్దుపోతుంది .అలిసిపోతున్నాను .మార్కెట్టుకు పోవాలన్నా వీలుగావడం లేదు.” అంది పరోక్షంగా అత్తను చూస్తూ అపూర్వ.

“దానికి ఏముంది లేమ్మా!మన పని మనం చేసుకుంటే.”

“అత్తమ్మా మీరా?పెద్ద వారు ...!”

“నేను చెయ్యగలనమ్మా!నువ్వువెళ్లి విశ్రాంతి తీసుకో ”అని పండ్ల రసం ఇచ్చి పని మొదలుపెట్టేది

అపూర్వ వెళ్లి పడుకొని యశోదమ్మ చేస్తున్నంత సేపు ఫోనులో మాట్లాడుతూనే ఉంది. యశోదమ్మ ఎప్పుడు చేయని పని అయినా అలసట అనిపించినా అన్ని చక్కగా చేసింది.


నందు గమనిస్తూనే ఉన్నాడు. రెండు మూడు సార్లు అపూర్వను హెచ్చరించాడు వెళ్ళి, తనను కూడా చెయ్యమని. లాభం లేక పోయింది.

అపూర్వ లేచి వచ్చి అన్నింటిని పరీక్షగా చూసి ముఖం ముడుచుకొని, అసంతృప్తిగా అది బాగా చెయ్యలేదు, ఇది బాగా లేదు, చీదరించుకుంటూ చొడ్డులు చెప్పడం మొదలు పెట్టింది.

ఓర్చుకోలేక పోయాడు.తరిమి పారేద్దామా అన్నంత కోపం వచ్చింది నందుకు. అనుకున్నట్లే ఆరోజు పెద్ద గొడవే జరిగింది..

“ఆమె తల్లి. పనిమనిషి కాదు. నీలాగా ఉంపుడుగత్తె కాదు.”

“నేను ఉంపుడుగత్తెనా ?వ్యభిచారినా ?”

“బాధ్యతలు తీసుకోకుండా మగాడితో పడుకొనే మనిషిని ఏమంటారు?.”

“ ఏం చెయ్యలేదు నేను?,పని మూలంగా అప్పుడు మిమ్మల్ని చూసుకోలేక పోయాను.


నాకు మీ మీద ప్రేమ లేదని ఎట్లా అనుకుంటారు. దానికి నన్ను పడుకొనే దాన్ని అంటారా?నాకు అన్నింటికన్నా నా ఉద్యోగం, స్వతంత్రం, ముఖ్యం. దాని కోసం దేన్నయినా వదులుకుంటాను.”

“శాశ్వతమైన బంధం అనుబంధాని కంటే ఎక్కువా అది? ఎప్పుడు పెరికి పారేస్తారో తరువాత వస్తుందో రాదో తెలియని ఉద్యోగానికి ఆత్మీయ సంబంధాలను సర్వ నాశనం చేస్తావా?”

“ ఈ కాలంలో ఏదీ శాశ్వతంకాదు. స్త్రీ స్వాతంత్రం, వక్తిత్వం, ఆర్ధికంగా పటిష్టంగా ఉంటేనే!! “

నందుకు విపరీతమైన కోపం అసహ్యం వేసింది.“అదే నీ చివరి మాటా?”తీక్షణంగా అడిగాడు.


నందు కోపం చూసి, ”ఎందుకు అలా పెంచుతారు. మనం హృదయాల్ని విప్పి, సమస్యలను, అపార్ధాలను పరిష్కరించుకుందాం. అత్తమ్మను మనశ్శాంతిగా ఊరికి వెళ్ళనివ్వండి. పాపం బుజ్జి ఎలాఉందో?” ఆమెను వెళ్ళమన్నట్లు పరోక్షంగా చెప్పింది అపూర్వ.

నందు సంతృప్తి పడలేదు. నిస్సహయంగా తల్లి వైపు చూసాడు.

ఈ సాఫ్టువేరు వచ్చి, ఆర్దిక స్వాతంత్రాన్ని ఇచ్చి, ఎక్కడలేని లెక్కలేని తనాన్ని పెంచి, ఆడపిల్లల జీవితాలను వీధిలో వేసింది. ఎందుకో డబ్బుకు అంత మదం అహంకారం?విచక్షణను వివేకాన్ని నాశనం చేసింది. పూర్తిగా బంధం, అనుబంధం వ్యాపార వస్తువులు అయిపోయాయి. అంతకంటే చేయగలిగింది ఏమీ లేదని, కొడుక్కి, అపూర్వను జాగర్తగా చూసుకోమని, పిచ్చి పిల్ల అని చెప్పి, ఆవేదనను బలవంతంగా అణుచుకొని వచ్చేసింది యశోదమ్మ.

రెండు నెలలు గడిచిపోయాయి యశోదమ్మకు ఒక్క రోజు కూడా కంటికీ కునుకు లేదు.వాళ్ళిద్దరు ఎలా ఉంటారోనని ఏదో తెలియని భయం.

బుజ్జి కాన్పుకు అన్ని సన్నాహాలు చేయడంలో మునిగి పోయింది.


అనుకున్నట్లుగానే బుజ్జి ఓ చిన్నిని ఇచ్చింది. సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వెంటనే నందుకు ఫోను చేసింది. సంతోషంతో ఎగిరి గంతు లేస్తూన్నట్లు పొంగిపోతూ మాట్లాడాడు. కాని రాలేదు.

చాలా కలవర పడింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాకుండా ఉండడు. మరలా ఫోను చేసినా ఎత్తుకోలేదు. ఏదో కీడు. ఆలోచించి ఆలోచించి గుండెల్లో బరువుగా ఉంటే అలాగే పడుకునేసింది .

బుజ్జి చిన్ని అరుపులు ఎగుర్ల శబ్దాలు వినిపిస్తే గబుక్కున లేచింది.వెళ్లి చూసింది.


ఆనందంతో హృదయం పరవశించిపోయింది. నందు బుజ్జి, చిన్నిలతో సమానంగా ఆడుతున్నాడు. పోటి పడి నందుని ముద్దులతో ముచ్చెత్తు తున్నాయి. ఆ దృశ్యం రమణీయం, వర్ణనాతీతం. సంతోషాన్ని భరించలేక కూర్చునేసింది. ప్రక్కకు తిరిగి చూస్తే సూటుకేసులు చాలా పుస్తకాలు కనిపించాయి. గుండె నిలిచి పోయేంత పని జరిగింది.

“వీళ్ళకు వగలు చాలా ఎక్కువయ్యిందమ్మా !చూడు.. చూడు నయగారాలు; ఎలా ఇచ్చులు పోతున్నాయో. అన్నీ నాకు ఇప్పుడే చూపించి మెప్పు పొందాలని.” అంటూ వచ్చి కూర్చున్న నందుని కళ్ళల్లోకి భయంగా చూసింది.

తల తిప్పుకున్నాడు. చాలా సేపటి వరకు తల్లి వైపు చూడలేదు.

యశోదమ్మ కన్నీళ్ళతో ఆకాశం వైపు చూస్తుండి పోయింది.

“బుజ్జి చిన్ని చల్లని చూపులో, మమతానురాగాల నీ ఒడిలో, సంతోషంగా ఇక్కడనుంచే ఉద్యోగం చేసుకోవచ్చు.


రోజూ నిన్ను, బుజ్జిని, చిన్నిని రామాలయానికి తీసుకెళుతూ, భూమాతను సస్యశ్యామలం చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తానమ్మా!” అంటూ చేతులు పట్టుకుని ఉబుకుతున్నకన్నీళ్లను దాచుకున్నాడు నందు.

“మేము శాశ్వతం కాదు.”ఎంతో భాధతో అంది.

“ తల్లి ప్రేమ శాశ్వతం, భూమాత దయ శాశ్వతం!! భార్య అంటే అర్ధాంగి. తల్లిని మరపింప చేసే స్త్రీ కావాలిగాని, తల్లిని ,భూమాతను మరిచి పొమ్మనే ఆడది కాదు కావాల్సింది.” అంటూ తృప్తిగా నమ్మకంతో యశోదమ్మ పాదాల మీద పడుకున్నాడు.

లేవనెత్తి కన్నీళ్లు తుడిచి ,ఒడిలో చేర్చుకుంది యశోదమ్మ. బాధతో మూసిన కళ్ళలోనుంచి ధారగా కారి పోతున్న కన్నీళ్లు తుడుచుకోలేక పోయింది.

ఇంటిముందు కారు నిలిచిన శబ్దానికి ఇద్దరూ లేచి చూసారు.


యశోదమ్మ కన్నీళ్లు తుడుచుకుని చూస్తూ...!

పరువు వచ్చిందో, బరువు తెచ్చిందో...?



*****

రచయిత ఇతర రచనలు : నిర్దోషులు నీరాజనాలు

రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..

నమస్తే !

నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష.

చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను..మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.



186 views1 comment

1 comentario


Korikani Anand
Korikani Anand
28 feb 2021

KADHA CHAALAA BAAGUNDI

Me gusta
bottom of page