#GSSKalyani, #GSSకళ్యాణి, #Nijabhakthi, #నిజభక్తి, #TeluguBhakthiKathalu

Nijabhakthi - New Telugu Story Written By - G. S. S. Kalyani
Published In manatelugukathalu.com On 25/02/2025
నిజభక్తి - తెలుగు కథ
రచన: G. S. S. కళ్యాణి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
రామయ్య, శంకరయ్యలు మంచి స్నేహితులు. వాళ్ళు తమ హరినగరి గ్రామంలో అందమైన బొమ్మలను తయారు చేసి, వాటిని పట్నంలో అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవారు. వారు తయారు చేసే బొమ్మల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎక్కువగా ఉండేవి. అందువల్ల పండుగ రోజుల్లో బొమ్మలు బాగా అమ్ముడుపోతూ ఉండేవి. మిగతా రోజుల్లో బొమ్మలు కొనేవారు తక్కువగా ఉండటంవల్ల వారి ఆదాయం తగ్గిపోయేది. అటువంటప్పుడు రామయ్య, శంకరయ్యలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది.
ఆ పరిస్థితినుండీ బయట పడే మార్గమేమిటా అని తరచుగా చర్చించుకుంటూ ఉండేవారు రామయ్య, శంకరయ్యలు.
ఒకనాటి ఉదయం రామయ్య, శంకరయ్యలు ఎప్పటిలాగే బొమ్మలను తీసుకుని పట్నానికి బయలుదేరారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ దారివెంట నడుస్తూ ఉండగా వాళ్ళ ఊరిచివరనున్న ఒక చెట్టు కింద కొందరు జనం గుమిగూడి ఉండటం చూశారు. వారిలో తమ గ్రామపెద్ద కూడా ఉండటం గమనించి విషయమేమిటో తెలుసుకుందామని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు రామయ్య, శంకరయ్యలు. చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతడి వేషధారణను బట్టీ, అతడి ముఖంలో వెలుగుతున్న తేజస్సుబట్టీ అతడు ఒక గొప్ప హరి భక్తుడని తెలుస్తోంది.
"ఎవరండీ ఆయన?", అక్కడున్న వారిలో ఒక వ్యక్తిని మెల్లిగా అడిగాడు రామయ్య.
"ఆయన పేరు జ్ఞానదత్తుడు. నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలను కాలినడకన దర్శించాలని బయలుదేరి వెడుతూ మార్గమధ్యంలో మన ఊరు చేరుకున్నారు!", చెప్పాడా వ్యక్తి.
అంతలో గ్రామపెద్ద జ్ఞానదత్తుడిని ఘనంగా సత్కరించి, ఆయనకు పువ్వులూ, పళ్ళూ సమర్పించి, "అయ్యా! మా ఊరి ప్రజలకు ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి!", అని అడిగాడు వినయంగా.
అందుకు జ్ఞానదత్తుడు చిరునవ్వు నవ్వి, "శ్రీమహావిష్ణువును గూర్చి చెప్పుకునే ప్రతిమాటా మంచి మాటే!", అంటూ తన చేతి సంచీలోనుండీ ఒక విగ్రహాన్ని తీసి తన ముందుంచి, ఆ విగ్రహానికి భక్తితో నమస్కరించాడు.
ఆ విగ్రహం శంఖ, చక్ర, గదాయుధాలు పట్టుకుని అభయహస్తంతో పద్మంలో నిలబడి ఉన్న శ్రీమన్నారాయణుడిది. సమ్మోహనకరమైన చిరునవ్వుగల ముఖముతో అత్యంత సుందరంగా చెక్కబడిన ఆ విగ్రహం దివ్యకాంతులు విరజిమ్ముతున్నట్లుగా ఉండి అక్కడున్న వారందరి దృష్టినీ ఆకర్షించింది. రామయ్య, శంకరయ్యలైతే ఆ విగ్రహం నుండీ తమ చూపు తిప్పుకోలేకపోయారు.
అంతలో జ్ఞానదత్తుడు మాట్లాడటం మొదలుపెట్టి, "భక్తజనులారా! భవసాగరాన్ని దాటి శ్రీవిష్ణు పదకమలాలను చేరుకోవాలంటే మనం చేసిన పాపకర్మలవల్ల కలిగే కష్టాలు మాటిమాటికీ అడ్డు వస్తూనే ఉంటాయి. సంసారంలో కష్టాలూ, డబ్బులవల్ల కష్టాలూ, బంధువులవల్ల కష్టాలూ, అసలు మన జీవితాల్లో కష్టాలకు కొదవే లేదు! మన కష్టాలను పోగొట్టి, తద్వారా మనకు కలుగుతున్న దుఖమునుండీ మనకు విముక్తిని కలిగించి, మనకు సుఖమును అనుగ్రహించి తరింపజేసేవాడు ఆ శ్రీమన్నారాయణుడు! కాబట్టి మీరంతా ఆ మహావిష్ణువును సేవిస్తూ ఆయన కృపకు పాత్రులై ఇహపరాలలో సుఖశాంతులను పొందండి!", అంటూ క్లుప్తంగా తన ప్రసంగాన్ని ముగించాడు.
గ్రామస్థులంతా జ్ఞానదత్తుడి వద్దకువెళ్ళి ప్రసాదం స్వీకరించి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రామయ్య, శంకరయ్యలు జ్ఞానదత్తుడిని సమీపించి, ఆయనకు నమస్కారం చేశారు.
వారిని చూసి జ్ఞానదత్తుడు, "ఏం నాయనా? ఏమిటీ విషయం? నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నారా?", అని అడిగాడు.
"అవును స్వామీ!", అన్నాడు శంకరయ్య.
"కానీ మీరు కోపగించుకోకూడదు!", చెప్పాడు రామయ్య.
"అబ్బే! అస్సలు కోపగించుకోను. మీకేం కావాలో అడగండి!", అన్నాడు జ్ఞానదత్తుడు చిరునవ్వుతో.
"స్వామీ! ఇందాక మీరు డబ్బులవల్ల కలిగే కష్టాలు విష్ణు సేవవల్ల పోతాయని అన్నారు కదా! విష్ణు సేవ ఎలా చెయ్యాలీ?", అడిగాడు రామయ్య.
"విష్ణు సేవను భక్తితో చెయ్యాలి. భక్తి మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో మనకు ఇష్టమైనదీ, వీలైనదీ మనం ఎంచుకోవచ్చు. ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ, భగవంతుడినుండీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా త్రికరణశుద్ధిగా మనసును ఆయన పాదాలచెంత సమర్పించడం నిజమైన భక్తి అని అనిపించుకుంటుంది", చెప్పాడు జ్ఞానదత్తుడు.
"స్వామీ! మాబోటి వాళ్ళకు అవేమీ తెలియవు. మేము చెయ్యగలిగినదల్లా ఆ దేవుడి నామాన్ని తలచుకోవడం మాత్రమే!", అన్నాడు శంకరయ్య.
"సరిగ్గా చెప్పావు నాయనా! ఈ కలియుగంలో భగవత్కృపను పొందటానికి సులభమైన మార్గం భగవన్నామస్మరణ చెయ్యడమేనని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి! ఆ మార్గం నీకు సరైనదని అనిపిస్తే తప్పకుండా అలాగే చెయ్యి", అన్నాడు జ్ఞానదత్తుడు.
అప్పుడు రామయ్య, "స్వామీ! మీరు దేవుడిని ఎలా సేవించుకోవాలో, దానివల్ల కలిగే ఉపయోగాలేమిటో చాలా బాగా చెప్పారు. మీవద్ద ఉన్న విగ్రహం మాకిస్తే దాన్ని చూసినప్పుడల్లా మీరు చెప్పిన మాటలు మాకు గుర్తుకువచ్చి దేవుడి నామస్మరణను తరచుగా చేసుకుంటాము", అన్నాడు వినయంగా.
రామయ్య చేసిన విన్నపానికి జ్ఞానదత్తుడు ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఏదో గ్రహించినవాడిలా చిరునవ్వు నవ్వి, "నాయనా! ఈ విగ్రహాన్ని నేను ప్రాణంగా చూసుకుంటున్నాను. నాకు దానిపై ఉన్న మోహం పోగొట్టడానికే ఆ శ్రీమన్నారాయణుడు నీ ద్వారా ఇలా అడిగించినట్లున్నాడు! మీకు ఈ విగ్రహాన్ని ఆనందంగా ఇస్తాను. అయితే నాకొక సందేహం. మీరిరువురూ అన్నదమ్ములా?", అని అడిగాడు.
"కాదు స్వామీ! మేము స్నేహితులం!", బదులిచ్చాడు శంకరయ్య.
"మరి మీలో విగ్రహం ఎవరికివ్వనూ?", అడిగాడు జ్ఞానదత్తుడు.
సమాధానం ఏమివ్వాలో తెలియక రామయ్య, శంకరయ్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
జ్ఞానదత్తుడు కాస్త ఆలోచించి, "సరే! మీకొక చిన్న పరీక్ష. నా యాత్రను ముగించుకుని నేను తిరిగి ఈ ఊరు చేరడానికి నాకు సుమారుగా ఏడాది కాలం పట్టచ్చు. అంతవరకూ మీరు మీ శక్తి కొలదీ నారాయణుడిని సేవించండి. మీలో ఎవరైతే భగవంతుడిపట్ల నిజభక్తిని కలిగి ఉంటారో వారికి నేను ఈ విగ్రహాన్ని ఇచ్చేస్తాను!”, అని అన్నాడు.
జ్ఞానదత్తుడు చెప్పినదానికి రామయ్య, శంకరయ్యలు అంగీకరించి, ఆయన పాదాలకు నమస్కరించి తమ దారిన తాము పట్నం వెళ్ళిపోయారు. జ్ఞానదత్తుడు కూడా తన యాత్రను కొనసాగిస్తూ ఆ ఊరి విడిచి వెళ్ళిపోయాడు.
రోజులు గడుస్తున్నాయి. రామయ్య, శంకరయ్యలు ఏ పని చేస్తున్నా జ్ఞానదత్తుడి వద్దనున్న శ్రీమన్నారాయణుడి విగ్రహం తమ మదిలో మెదులుతూనే ఉంది. ఆ విగ్రహాన్ని ఎలాగైనా పొందాలన్న తపన వాళ్ళిద్దరిలో పెరిగిపోయింది. రామయ్య, శంకరయ్యలిద్దరూ ప్రతిరోజూ తమ ఊరిలోని చెన్నకేశవ ఆలయానికి వెళ్ళడం, అక్కడ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి స్వామిని సేవించడం అలవాటు చేసుకున్నారు. ఇద్దరిలోనూ భగవంతుడిపట్ల భక్తిభావన ఎక్కువకాసాగింది.
ఒకనాటి రాత్రి భోజనం ముగించి పడుకుని ఆకాశంలో ధవళకాంతులతో వెలిగిపోతున్న నిండుచంద్రుడి అందాన్ని చూస్తూ, "ఆ శ్రీమన్నారాయణుడి విగ్రహం నాకు దక్కితే బాగుండు! నేను ఎలాగైనా గొప్ప భక్తుడినని అనిపించుకోవాలి. అందుకు ఆ రామయ్యకన్నా నేను ఎక్కువసేపు దేవుడిని సేవించాలి!", అని అనుకున్నాడు శంకరయ్య.
ఆ మర్నాటినుంచీ శంకరయ్య పట్నానికి వెళ్ళేముందూ, పట్నం నుండీ వచ్చాక కూడా తమ ఊరిలోని దేవాలయానికి వెళ్ళి, అక్కడ తనకు తోచిన సేవను భక్తితో చెయ్యడం ప్రారంభించాడు.
కొన్నాళ్ల తర్వాత రామయ్య, "శంకరయ్యా! నేను ఇకపై ఇంట్లోనే ఉంటూ విగ్రహాలను తయారు చెయ్యదల్చుకున్నాను. ఎవరికైనా విగ్రహాలు కావాలంటే నా దగ్గరకే వచ్చి కొంటారు", అన్నాడు.
రామయ్య నిర్ణయానికి తెగ ఆశ్చర్యపోయిన శంకరయ్య, "నువ్వంటున్నది నిజమేనా రామయ్యా?! ఇంట్లోనే బొమ్మల దుకాణం పెట్టుకుంటే నిన్ను వెతుక్కుంటూ ఎంతమందొచ్చి కొంటారూ?ఎవరో నీ నైపుణ్యం తెలిసిన ఒకళ్ళిద్దరు రావచ్చు. వాళ్ళిచ్చే డబ్బు నీకు బతకడానికి చాలదేమోకదా!", అన్నాడు ఆప్యాయంగా రామయ్య భుజం తడుతూ.
"ఎవరొచ్చి కొంటారూ? ఎన్ని బొమ్మలు కొంటారూ? అన్నది నేను నమ్ముకున్న ఆ నారాయణుడే చూసుకుంటాడు. నా నిర్ణయం మాత్రం ఇదే!", అన్నాడు రామయ్య.
"సరే రామయ్యా! నీ ఇష్టం!", అంటూ తను చేసిన బొమ్మలను తీసుకుని పట్నానికి వెళ్ళిపోయాడు శంకరయ్య.
రామయ్య క్రమంగా గుడికి వెళ్లడం కూడా మానేశాడు.
"ఈ రామయ్యకు ఏమైందో ఏమిటో! బొత్తిగా కనపడటం మానేశాడు!", అనుకున్నాడు శంకరయ్య.
ప్రతిరోజూ రెండుపూట్లా నియమంగా గుడికి వెళ్ళి సేవలు చేస్తున్న శంకరయ్యను మహాభక్తుడంటూ ఊరిజనం కొనియాడారు. శంకరయ్యలో నిజంగా కూడా భగవంతుడిపట్ల భక్తి ఏర్పడటంతో అతడికి ఇసుమంతైనా గర్వం కలగలేదు. అందరిపట్లా వినయంతో ప్రవర్తిస్తూ వీలైనంత ఎక్కువగా భగన్నామస్మరణ చెయ్యసాగాడు శంకరయ్య.
చూస్తూండగా రెండేళ్ళు గడిచిపోయాయి! తీర్థయాత్రలకు వెళ్ళిన జ్ఞానదత్తుడు తన తిరుగు ప్రయాణంలో మళ్ళీ హరినగరి గ్రమానికి వచ్చాడు. శంకరయ్య జ్ఞానదత్తుడి వద్దకు వెళ్ళి, పళ్ళూ, పువ్వులూ సమర్పించి, భక్తితో జ్ఞానదత్తుడి పాదాలకు నమస్కరించాడు.
జ్ఞానదత్తుడు శంకరయ్యను ఆశీర్వదించి, తన చేతిసంచీలోని శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని తీసి శంకరయ్యకు ఇస్తూ, "భగవంతుడిపట్ల నీవు చూపిన భక్తి చాలా గొప్పది నాయనా! ఇదిగో నువ్వడిగిన శ్రీమన్నారాయణుడి విగ్రహం. నీ భక్తిని ఇలాగే కొనసాగిస్తే ఆ భగవంతుడి కృప నీకు తప్పక లభిస్తుంది!", అన్నాడు.
శంకరయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి!
"ధన్యుడిని స్వామీ!", అంటూ ఆ విగ్రహాన్ని తన రెండు చేతులతోనూ తీసుకుని కళ్ళకద్దుకున్నాడు శంకరయ్య.
"ఈ విగ్రహం నాకు ఎక్కడ దక్కదోనని చాలా భయపడ్డాను. మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గడంవల్లే నాకీ భాగ్యం కలిగింది!", అన్నాడు శంకరయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ.
"శంకరయ్యా! నీ భక్తి గొప్పదని అన్నానేతప్ప నేను పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావని నేను అనలేదే!", అన్నాడు జ్ఞానదత్తుడు.
ఆ మాటలకు అయోమయంలో పడ్డాడు శంకరయ్య.
"అదేమిటి స్వామీ?! పోటీలో నేను నెగ్గకపోతే మరి ఈ విగ్రహం నాకెందుకిచ్చారూ? ఇందులో ఏదో అంతరార్థం దాగే ఉంటుంది. దయచేసి నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి", విగ్రహాన్ని గుండెలకు హత్తుకుంటూ, అది తనకు ఎక్కడ దూరమైపోతుందోనన్న భయంతో జ్ఞానదత్తుడిని వేడుకున్నాడు శంకరయ్య.
జ్ఞానదత్తుడు చిన్నగా నవ్వి, "నాతో రా! అసలు విషయం నీకే తెలుస్తుంది!", అంటూ శంకరయ్యను తీసుకుని రామయ్య ఇంటికి బయలుదేరాడు.
"స్వామీ! నేను రామయ్య ఇంటికి వెళ్ళి చాలా కాలమయ్యింది. అతడు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడో లేడో! నన్ను రామయ్య ఇల్లెక్కడని ఈ ఊరికొచ్చిన చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్లకి రామయ్య కనపడకనే అలా అడుగుతున్నారని నా అనుమానం. రామయ్య బొమ్మల వ్యాపారం మాత్రం చెయ్యటంలేదని నా అనుమానం!", అన్నాడు శంకరయ్య.
"నిజమే! రామయ్య బొమ్మల వ్యాపారం మానేశాడు!", అంటూ రామయ్య ఇల్లు ఉన్న వీధివైపు తిరిగాడు జ్ఞానదత్తుడు. అక్కడ బోలెడు మంది వరుసలో నిలబడి ఉన్నారు.
"ఎవరు వీళ్లంతా?! దేనికోసం ఇలా నిలబడ్డారు? నాకు తెలియకుండా మా ఊళ్ళో ఏదైనా విశేషం జరుగుతోందా?", ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపిస్తూ జ్ఞానదత్తుడి వెంట నడిచాడు శంకరయ్య.
జ్ఞానదత్తుడు చెదరని చిరునవ్వుతో మౌనంగా శంకరయ్యతో రామయ్య ఇంట్లోకి ప్రవేశించాడు. జ్ఞానదత్తుడినీ, శంకరయ్యనూ చూసిన రామయ్య భార్య జానకి, కుమారుడు ప్రణవలు పరుగుపరుగున వారి వద్దకు వచ్చి నమస్కరిస్తూ, తమ ఇంట్లోకి వారిని ఆహ్వానించారు.
"రామయ్య ఎక్కడమ్మా?", జానకిని అడిగాడు జ్ఞానదత్తుడు.
"రండి!", అంటూ జానకి జ్ఞానదత్తుడిని తమ పెరట్లోకి తీసుకువెళ్ళి, అక్కడ పాక వంటి ఒక చిన్న గదిని చూపిస్తూ, "అందులో ఉన్నారు", అని చెప్పింది. ఆ గది తలుపులు దగ్గరకు పెట్టి ఉన్నాయి.
జ్ఞానదత్తుడు శంకరయ్యను తనతో రమ్మని సైగ చేస్తూ ఆ గది దగ్గరకు వెళ్ళి, మెల్లిగా తలుపులను తెరిచాడు. చీకటిగా ఉన్న ఆ గదిలో, దీపపు కాంతి బంగారు వర్ణంలో ప్రకాశిస్తోంది. ఆ వెలుగులో రామయ్య ఒక వేంకటేశ్వర విగ్రహానికి తుది మెరుగులు దిద్దటంలో లీనమైపోయి ఉన్నాడు. జ్ఞానదత్తుడి రాకను కూడా గమనించనంత ఏకాగ్రతతో శ్రీ వేంకటేశ్వరుడి పాదాలకు రంగులద్దుతున్నాడు రామయ్య.
ఏదో తన జీవనాధారం కోసం బొమ్మను చేస్తున్నానని కాకుండా నిజంగా ఆ శ్రీవారి పాదాలను సేవిస్తున్నట్లుగా భావిస్తూ, "బ్రహ్మ కడిగిన పాదమూ.. " అన్న కీర్తనను తన్మయత్వంతో రామయ్య పాడుతున్నాడు.
పాదాలకు రంగులద్దడం పూర్తికాగానే స్వామివారి వస్త్రానికీ, ఆభరణాలకూ ధగధగలాడే పసుపురంగు రాళ్ళను అతికిస్తూ "షోడశకళానిధికి.. " కీర్తననూ, వరద హస్తంలో లేత గులాబీరంగు గీతలను దిద్దుతూ, "ఇందరికీ అభయంబులిచ్చు చేయీ.. " అనే కీర్తననూ, స్వామి విగ్రహాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ, "భావములోనా బాహ్యమునందున గోవింద గోవింద..", అనే కీర్తననూ ఆలపించి, పూర్తైన విగ్రహానికి భక్తితో నమస్కరిస్తూ, "నీకే శరణూ.." అన్న కీర్తననూ శ్రావ్యంగా పాడాడు రామయ్య. భక్తిపారవశ్యంతో రామయ్య కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలాయి. రామయ్య భక్తి శంకరయ్యను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
రెండు నిమిషాల తర్వాత, "రామయ్యా!", అంటూ రామయ్యను పిలిచాడు జ్ఞానదత్తుడు.
"ఎవరూ?", అంటూ సమాధిలాంటి స్థితినుండీ బయటకు వచ్చిన రామయ్య జ్ఞానదత్తుడిని చూసి, సంతోషంతో లేచి వచ్చి, జ్ఞానదత్తుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నెరిసిన గడ్డంతో, రంగు మరకలున్న బట్టలతో, చెదిరిన జుట్టుతో ఉన్న రామయ్య ముఖంలో ఏదో ఆకర్షణ కనిపించింది శంకరానికి. నిజానికి రామయ్య శంకరానికి ఒక మహా తపస్విలా కనపడుతున్నాడు!
రామయ్యను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు జ్ఞానదత్తుడు. రామయ్య ఆ గదికి ఉన్న కిటికీలు తెరిచి తను తయారు చేసిన విగ్రహాలను చూపించాడు. ఆశ్చర్యం!! ఆ విగ్రహాలన్నీ అచ్చుగుద్దినట్లు జ్ఞానదత్తుడు శంకరానికి ఇచ్చిన విగ్రహంలా ఉన్నాయి. శంకరానికి మతిపోయినట్లయ్యింది.
"ఏమిటిది రామయ్యా?? ఈ విగ్రహాల రూపురేఖలను ఇంత అద్భుతంగా, ఒకే రకంగా ఎలా తయారుచేశావూ? అన్ని విగ్రహాలలోనూ జీవకళ ఉట్టి పడుతోంది! సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి నిలబడినట్లున్నాయి ఈ విగ్రహాలు!", అన్నాడు శంకరయ్య.
"అంతా ఆ నారాయణుడి కృప!", అన్నాడు రామయ్య.
అప్పుడు జ్ఞానదత్తుడు, "నిజమే శంకరయ్యా! రామయ్య తన తనువునూ, మనసునూ శ్రీమన్నారాయణుడి సేవకు అర్పించేశాడు. నావద్ద శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని చూసిన రోజే ఆ విగ్రహరూపాన్ని రామయ్య తన హృదయంలో పదిలంగా దాచేసుకున్నాడు. ఆ రూపాన్ని నిరంతరం స్మరిస్తూ, తను చేస్తున్న కర్మను స్వామి సేవగా భావిస్తూ, నిజ భక్తిని కలిగి ఉంటూ ఈ విగ్రహాలను తయారు చేశాడు రామయ్య. కాబట్టే అవి అంత బాగున్నాయి!
వాటికోసం ఎక్కడెక్కడినుంచో జనం వస్తున్నారు. వారికి తోచిన సొమ్ము రామయ్యకు ఇచ్చి విగ్రహాలను తీసుకుని వెడుతున్నారు. సర్వవ్యాపి అయిన ఆ శ్రీమన్నారాయణుడు రామయ్య హృదయంలో స్థిరంగా కొలువై ఉన్నప్పుడు ఇక నేను నీకిచ్చిన విగ్రహంతో రామయ్యకు అవసరమేముంటుంది చెప్పు?", అన్నాడు శంకరయ్యతో.
"ఆహా! ఇది ఆ నారాయణుడి లీల! ఇన్నాళ్ళూ నాదే నిజమైన భక్తి అనే భ్రమలో ఉన్నాను. కానీ, ధర్మబద్ధంగా ఆచరిస్తున్న కర్మలను భగవదర్పణం చెయ్యడమే నిజభక్తి అని రామయ్య నిరూపించి నా కళ్ళు తెరిపించాడు! గురువు పెట్టే పరీక్షలు ఎంత గొప్పవో, అవి ఎటువంటి జ్ఞానాన్ని పంచగలవో ఇవాళ మీవల్ల తెలుసుకున్నాను. ఆ భగవద్ కృప నాకూ దక్కేలా నన్నాశీర్వదించండి గురుదేవా!", అంటూ జ్ఞానదత్తుడి పాదాలకు నమస్కరించాడు శంకరయ్య.
*****
G. S. S. కళ్యాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం' కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను.
@GSSKalyani05
• 1 hour ago
కథను చక్కగా చదివి వినిపించిన పద్మావతి కొమరగిరి గారికి అనేక ధన్యవాదాలు!