#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #నిజమైనస్నేహం, #NijamainaSneham, #TeluguMoralStories, #నైతికకథలు

Nijamaina Sneham- New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 26/02/2025
నిజమైన స్నేహం - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కొప్పోలు గ్రామంలో సూరయ్య చుక్కమ్మ అను దంపతులు ఉండేవారు. వ్యవసాయం వీరి జీవనాధారం. ఐదెకరాల పొలంలో పంటలు పండించుకుంటూ ఉన్నంతలో అన్యోన్యంగా సుఖంగా ఉండేవారు. చాలా కాలానికి వారికి లేక లేక ఒక మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడికి రామచంద్రుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.
రామచంద్రుడికి ఐదేండ్లు వయసు రాగానే తమ వూరిబడిలో చేర్పించి ఐదవ తరగతి వరకు చదివించారు తల్లిదండ్రులు. ఆతరువాత తమ వూరికి సమీపంలోనే వున్న పంచాయతీ జిల్లెల్లలో ఉన్నత పాఠశాలలో చేర్పించి పదవతరగతి వరకు చదివించారు. ఆపై మండలం చాపాడులో ఇంటర్మీడియట్ చేరి ఉత్తీర్ణతను సాధించాడు రామచంద్రుడు.
ఉన్నత చదువులు కోసం తమ వూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పురపాలక సంఘమైన మైదుకూరులో డిగ్రీ, నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరపాలక సంస్థైన కడపలో పిజీ పూర్తి చేసి అల్లగుత్తి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు రామచంద్రుడు.
రామచంద్రుడికి చిన్నప్పటి నుండి స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. రామచంద్రుడి దృష్టిలో స్నేహానికి గొప్ప విలువ ఉంది. అన్నీ బంధాల కన్నా స్నేహబంధానకి ప్రధమ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి రామచంద్రుడు తన స్నేహితులతోనే ప్రొద్దస్తమానం గడిపేవాడు. ఆ విధానాన్ని రామచంద్రుడు తాను పెద్దైయ్యాక కూడా, పెళ్లయ్యాక, బిడ్డల తండ్రైయ్యాక కూడా చెక్కు చెదరకుండా, క్రమము తప్పకుండా, తుచ తప్పకుండా కొనసాగించాడు.
రామచంద్రుడికి చాల మంది స్నేహితులు ఉన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి తరగతిలోనూ స్నేహితులు ఉన్నారు. అందరి పట్ల అభిమానం ఉంది. అయితే అందరిలో అతి ముఖ్యమైన వారు ఐదుగురు. రమేష్ రాజేష్ సురేష్ రూపేష్ భూపేష్ లపై మితిమీరిన అభిమానం ఉంది. బడి వదలగానే వీరిని ప్రతి రోజూ కలిసి ఒక్కోక్కరి దగ్గర ఓ అర్థగంట ముచ్చట్లతో గడపందే ఇంటికి వచ్చేవాడు కాదు..
రామచంద్రుడికి చిన్నప్పుడే తన తండ్రి సూరయ్య "స్నేహితులంటే అభిమానం ఉండోచ్చు గాని మరీ ఇంతగా అతి ప్రేమ ఉండకూడదు. ఒక్కోక్కసారి అది చెడుకు దారి తీస్తుంది" అని చెప్పేవాడు.
అయితే రామచంద్రుడు ఈవిషయంలో తండ్రి మాటను వినేవాడు కాదు. కాని పెళ్ళై బిడ్డల తండ్రైయాక కూడా స్నేహితులు వద్దే ఎక్కువ సమయం గడుపుతూ ఏ అర్దరాత్రికో ఇంటికి రావడం వల్ల భార్య బిడ్డలు చాల ఇబ్బందికి గురైతూ వచ్చారు.
రామచంద్రుడు ఇంటికి వచ్చే వేళకు పిల్లలు నిద్రపోతుంటారు. మళ్లీ రామచంద్రుడు ఉదయాన్నే లేచి తొందరగా స్కూలుకు పోక పోతే బస్సు తప్పిపోతుందని పిల్లలు నిద్ర లేవక మునుపే పోతుంటాడు. దానితో పిల్లలు తండ్రిపై బెంగ పెట్టుకున్నారు.
పిల్లలు తల్లిని పట్టుకొని "నాన్న ఏడమ్మా? నాన్నను చూడాలి, నాన్నతో మాట్లాడాలి, నాన్నతో ఆడుకోవాలి" అని రోజు మారాము చేస్తుండేవారు.
భర్తకు పిల్లల విషయం చెప్పి త్వరగా ప్రొద్దు ఉండగానే రమ్మని బ్రతిమాలుకుంది. ఆమె బంగపోవడం తప్ప అతడు సస్సేమిరా కుదరదు అన్నాడు. ఇక ఎక్కుడికీ కాకపోయేసరికి అత్తామామలతో చెప్పుకొని " ఎలాగైనా మీ కొడుకును త్వరగా ఇంటికి వచ్చేటట్లు చూడండి మామయ్యా" అని చెప్పుకుంది.
"ఏదోక ఉపాయం ఆలోచించి కొడుకును త్వరగా ఇంటికి వచ్చేటట్లు చూడాలి" అని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు సూరయ్య.
ఒక ఆదివారం రోజు కొడుకు రామచంద్రుడిని దగ్గరకు పిలిచి "రామచంద్రా! నువ్వు స్నేహానికి చాల విలువ ఇచ్చి నీ స్నేహితుల్ని అభిమానిస్తావు కదా! అట్లే నీ స్నేహితులు కూడా నిన్ను అభిమానిస్తారా?" అని అడుగుతాడు సూరయ్య.
అందుకు రామచంద్రుడు "నా స్నేహితులు నేను వారిని అభిమానించే దాని కంటే. వారే నన్ను ఎక్కువగా అభిమానిస్తారు అని అనేకంటే ప్రాణమిస్తారు అనాలి" అంటాడు తండ్రి సూరయ్యతో గర్వపడుతూ.
"అంటే నీ స్నేహితుల్లో నిజమైన స్నేహితులు ఉన్నారు అంటావు. అయితే నీ స్నేహితులకు ఒక పరీక్ష పెట్టు. ఆ పరీక్షలో నెగ్గుతారో లేదో తెలిసిపోతుంది, నిజమైన స్నేహితులు ఎవరో తేలిపోతుంది" అన్నాడు సూరయ్య.
"స్నేహం విషయంలో ఎటువంటి పరిక్ష పెట్టినా నా స్నేహితులు నూటికి నూరుశాతం నెగ్గుతారు. ఈ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. " రామచంద్రుడు ధీమాగా అంటాడు.
"అయితే నిజమైన మిత్రుడు ఎవరో పరీక్ష పెట్టి తెలుసుకో! ఆ పరీక్షలో నెగ్గిన అసలు సిసలైన స్నేహితుడెవరో తెలుసుకొని తుక్కునంతా వదిలేసి అసలైన స్నేహితుడితోనే స్నేహం చెయ్యి " అని చెప్పుతాడు తండ్రి.
"సరే ఏ పరీక్ష పెట్టమంటావు నాన్నా!" అడుగుతాడు రామచంద్రుడు.
"నీ రెండు పాదాలకు దట్టంగా బురద పూసుకొని నీ స్నేహితుల ఇండ్లల్లోకి పో! ఎవరైతే నిన్ను చూసి అసహ్యించుకుని చీదరించుకుంటారో వారు ఉత్తుత్తి స్నేహితులు. ఎవరైతే నిన్ను చూసి "అరే మిత్రుడు ఏదో ఖయ్యాల్లో ఉండి బురద తొక్కి వచ్చాడు అనుకొని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ఆదరిస్తారో వారు నిఖార్సయిన స్నేహితులు. వారితోనే స్నేహం చెయ్యి రామచంద్రా!" ఉపాయం వివరించుతాడు సూరయ్య.
"అలాగే చేసి నా స్నేహితులు ఎంత గొప్ప వారో ! స్నేహానికి ఎంతగా ప్రాణం ఇస్తారో నిరూపిస్తాను" తండ్రితో స్థిరంగా పలికాడు రామచంద్రుడు.
" ఇంకేం నిరూపించు!" తండ్రి రెచ్చగొట్టినట్లు అన్నాడు.
రామచంద్రుడు "ఈ రోజు నా స్నేహితుల సత్య సంధతను నిరూపించాలి. మా నాన్నకు కండ్లు తెరిపించాలి" అనే కృతనిశ్చయంతో హుటాహుటిన స్కూలుకు పోయాడు. సాయంత్రం స్కూలు వదలగానే సరాసరి స్నేహితుల ఇండ్లకు పోతూ మార్గం మధ్యలో ఒక బురద మడిలో దిగి కాళ్ళకు బురద పూనుకున్నాడు.
ముందుగా అందరికీ కంటే మిన్నగా ప్రాణ స్నేహితుడని తాను నమ్మిన రమేష్ ఇంటికి పోయి బురద కాళ్ళతో ఇంట్లోకి ప్రవేశించాడు. రమేష్ బురద కాళ్ళతో వచ్చిన రామచంద్రున్ని చూసి "నువ్వు మనిషివా! పశువువా! బురద కాళ్ళతో ఇంట్లోకి వస్తావా! ఇది మనుషులున్న ఇల్లనుకున్నావా! పశువుల కొట్టం అనుకున్నావా! అయినా రోజు మా ఇంటికి వస్తావ్! నీకు ఇంకేమి పని లేదా? దాటు నా ఇల్లు" అని కసురుకున్నాడు రమేష్.
దానితో రామచంద్రుడు నిర్ఘాంత పోయి "ఈడేనా ఇలా అంటున్నది నిజమైన స్నేహితుడనుకున్నానే!" అనుకుంటూ విస్మయంతో విపరీతంగా చింతించాడు రామచంద్రుడు.
అదే ఊపులో పోయి రెండవ వాడైన రాజేష్ ఇంటిలోకి బురద కాళ్ళతో వచ్చి నిలిచాడు.. "అర్రెరేయ్! నీకు బుద్ధి ఉందా! జంతువులా బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చావ్! పనికి మాలిన వెధవా! ముందు నువ్వు బయటికి పోరా!" అంటూ తీవ్ర పదజాలంతో గద్దించాడు రాజేష్.
వాని మాటలు వినగానే అవాక్కై తన నమ్మకం వమ్మైనందుకు బాధపడుతూ వెళ్లిపోయాడు రామచంద్రుడు.
మూడవ వాడు సురేష్. బురద కాళ్ళతో వాడి నడింట్లోకి వచ్చి నిలబడ్డాడు. వాన్ని చూసి చీదరించుకొని, అసహ్యంగా తిట్టిపోసి ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు సురేష్.
విభ్రాంతికి గురై అక్కడి నుంచి అత్యంత విచారంతో వెళ్లిపోయాడు రామచంద్రుడు.
ఇక నాలుగో వాడు రూపేష్! వాడింటికి అనుమానం పడుతూ ఇంట్లో అందరూ సరదాగా ఉండగా బురద కాళ్ళతో ఇంట్లోకి అడుగు పెట్టాడు రామచంద్రుడు. అలా చూసిన రూపేష్ "నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా! గడ్డి తింటున్నావా! నీకు తిక్క పట్టిందా లేక ఎర్రి లేచిందా! తెలివి తక్కువ మూర్ఖా ! గెట్ అవుట్ రాస్కెల్" అని వాకిలి అవతలికి రామచంద్రున్ని తోశాడు రూపేష్.
తీవ్రమైన అవమాన భారంతో తల దించుకుని వెళ్లిపోయాడు రామచంద్రుడు.
"ఏమిటి నా స్నేహితులు ఇంతటి అధములు? కేవలం బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చినంత మాత్రాన ఇంత ఘోరంగా అమానుషంగా అవమానిస్తారా? ఇదేనా స్నేహానికి వీళ్ళు ఇచ్చే విలువ? "అని ఆశ్చర్యపోతూ అంతులేని విచారానికి గురౌతూ "ఇక చివరి స్నేహితుడు భూపేష్. వాడి విషయం తేల్చుకుందాం!" అని భూపేష్ ఇంటికి బయలుదేరాడు రామచంద్రుడు.
భూపేష్ ఇంట్లో అందరూ భోజనానికి కుర్చున్న సమయంలో బురద కాళ్ళతో ఇంట్లోకి వస్తాడు రామచంద్రుడు. అది చూసిన భూపేష్ అతని భార్య భూదేవి ఇద్దరూ ఖంగారు పడి రామచంద్రుడి దగ్గరకు వస్తారు "ఏరా రామచంద్రా! కాళ్ళకు బురదైంది. చూసుకోనంతగా ఏమాలోచిస్తున్నావురా!" అని ఆత్మీయంగా అడిగాడు భూపేష్.
"నీకేమైందన్నా! ఏం బాధ వచ్చింది నీకూ! అంతగా ఐతే మేమంతా లేమాన్నా!" అంటూ బాధపడిపోయింది భూదేవి.
ఇద్దరు భార్యాభర్తలు రామచంద్రుడ్ని బాత్రూంలోకి తీసుకునిపోయి భార్య చెంబుతో నీళ్ళు పోస్తుంటే భర్త మిత్రుని కాళ్ళు కడిగాడు. అపుడు రామచంద్రుడికి భూపేష్ లో 'కుచేలుని కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకున్న శ్రీకృష్ణుడు' కనిపించాడు.
రామచంద్రుడ్ని కుర్చీలో కూర్చోబెట్టి భోజనం పెట్టారు భూపేష్ దంపతులు.
"ఏదో ఖయ్యాల్లో బురద చూసుకోకుండా ఇంట్లోకి వచ్చానమ్మా! ఏమనుకోవద్దమ్మా!" విచార పడుతునట్లు అన్నాడు రామచంద్రుడు.
" అయ్యో! అదేమీ లేదులే అన్నా! దాని గురించి నువ్వేమి విచారించకు!" అంది భూదేవి ఎంతో ఆదరంగా.
" మనకు మనకు ఏముందిలేరా రామచంద్రా! ఈ విషయంపై ఇంకేమి ఆలోచించకు!" చిరు కోపంగా భూపేష్ అన్నాడు.
సంతృప్తిగా ఇంటికి పోయిన రామచంద్రుడు తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా చెప్పి " నాన్నా! నువ్వు చెప్పినట్లు స్నేహితులంతా నిజమైన స్నేహితులు కాదు నాన్న! ఇన్నాళ్లు నేను మాయలో ఉన్నాను. ఎక్కడో ఒక్కడు ఉంటాడు నాన్నా నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహితున్ని కలిగి ఉండడం అదృష్టం. నాకు అలాంటి స్నేహితుడు భూపేష్ ఉండడం నా అదృష్టం నాన్నా!" అంటూ నిజమైన స్నేహితున్ని కనుగొన్నందకు మహానంద పడుతూ అన్నాడు రామచంద్రుడు.
" తళుకు బెళుకు రాళ్ళు తట్టెడున్ననేమి. నిక్కమైన నీలం ఒకటి చాలు అన్నారు పెద్దలు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఒక్కడున్న చాలు రామచంద్రా!" అన్నాడు సూరయ్య కొడుకు నిజం తెలుసుకున్నందుకు సంతోష పడిపోతూ.
అప్పటినుండి త్వరగా ఇంటికి వచ్చి భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతూ వచ్చాడు రామచంద్రుడు.
-------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
---------
Comments