top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

నిజాయతీ.. నీకు వందనం!

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #NijayitheeNikuVandanam, #నిజాయతీనీకువందనం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు



Nijayithee Niku Vandanam - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 08/11/2024

నిజాయతీ.. నీకు వందనం! - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ప్రకాష్ బ్యాంకు ఆఫీసర్. అతనికి ఒక కూతురు, భార్య, స్వంత యిల్లు, యిదిగో అంటే పలికే తమ్ముళ్లు వున్నారు. కూతురు లత టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సంపాదించి ఇంటర్మీడియట్ విశ్వం కాలేజీలో చేరింది.


మొదటి వారం చదువు చెప్పడం అనేది లేదు, ఒకళ్ళని ఒకళ్ళు పరిచయం చేసుకోవడం తప్పా. ఆరోజు మాథ్స్ లెక్చరర్ క్లాస్. రాగానే స్టూడెంట్స్ ని ఆడిగాడు తమని తాము పరిచయం చేసుకోమని. ఒక్కొక్కరే వారి పేరు, వారి తల్లిదండ్రుల పేరు, తండ్రి ఉద్యోగం మొదలగు వివరాలు చెప్పి కూర్చుంటున్నారు. లత కూడా తన వివరాలు చెప్పి కూర్చుంది. మూడో బెంచిలో వున్న ఒక అమ్మాయి లేచి, తనపేరు కావ్య అని, అంతకంటే తన గురించి చెప్పటానికి పెద్దగా ఏమిలేదు అని కూర్చుంది. 


మాథ్స్ లెక్చరర్ రఘు “అలాకాదు కావ్య, ఎవ్వరి తల్లిదండ్రులు వాళ్ళకి గొప్ప, వాళ్ళు ఏ వృత్తి చేసినా నీకు గొప్పగానే భావించాలి. ఎందుకంటె నిన్ను ఈ ప్రైవేట్ కాలేజీ లో చదివిస్తున్నారంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నదానివే” అన్నాడు.


“మా నాన్న గారు అమ్మగారు వంటలు చేసి నన్ను చదివిస్తున్నారు” అంది కావ్య.


“అదేమీ తక్కువ కాదు, వాళ్ళు వాళ్ళకి తెలిసిన విద్య తో నిజాయితీ గా బ్రతుకుతున్నారు. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మీ తల్లిదండ్రులని బాగా చూసుకో, నీకు చదువు లో ఏ సహాయం కావలి అన్నా నేను చేస్తాను” అన్నారు రఘు.


కావ్య ఎప్పుడైతే తన తండ్రి వంట చేస్తాడు అని చెప్పిందో చాలా మంది డబ్బు వుండి బుద్ధిలేని పిల్లలు గట్టిగ నవ్వడంతో కావ్య సిగ్గుతో క్రుంగిపోయింది. ఆ అమ్మాయి తో కలవడానికి ముందుకు రాలేదు ఎవ్వరు..


 అది చూసిన లత మెల్లగా కావ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని, మనం యిద్దరం స్నేహితులం, నీకు నేను తోడుగా వుంటాను అని, లెక్చరర్ గారికి చెప్పి కావ్య ని తనతో పాటు కూర్చునే లా మాట్లాడింది.


లత, కావ్య యిద్దరు బాగా చదువుతారు కాబట్టి, ప్రతి పరీక్ష లో మంచి మార్కులు వచ్చేవి. మిగిలిన పిల్లలు కూడా మెల్లగా వీళ్ళతో స్నేహం చెయ్యడం మొదలుపెట్టారు. రెండవ సంవత్సరం లోకి వచ్చేసారు 


టర్మ్ ఫీజు కట్టమని నోటీసు రావడంతో లత తండ్రితో చెప్పి తన ఫీజు కట్టేసింది. అయితే ఎప్పుడు అడిగినా రేపు కడతాను అని ముభావం గా చెప్పేది కావ్య. లత కూడా అంతగా పట్టించుకోలేదు. 


ఒకరోజున కాలేజీ ప్రిన్సిపాల్ గారు కావ్య ని పిలిచి రేపటి లోపు ఫీజు కట్టకపోతే కాలేజీ కి రావద్దు అనడం తో, లంచ్ టైం లో కావ్య తన తండ్రికి జ్వరం తో పది రోజుల నుంచి వంటకి వెళ్లడం లేదని, ఫీజు కోసం వుంచిన డబ్బు వైద్యం కి ఖర్చు పెట్టాలిసి వచ్చింది, అందుకే తను ఒక నిర్ణయం కి వచ్చాను అని, చదువు మానేసి తను కూడా వంటలు ఒప్పుకుని తల్లిదండ్రులకి సహాయం గా వుంటాను అంది ఏడుస్తూ.


“అదేమిటే, యిప్పుడు ఎలా, మీ నాన్నగారికి తెలిసిన వాళ్ళని అడగండి, అంతే కాని చదువు మానేస్తే ఎలా” అంది లత. 


“ఏ ప్రయత్నం చెయ్యడానికి అయినా నాన్న కోలుకోవాలి, ఒకసారి ప్రిన్సిపాల్ గారిని అడుగుదాము. కొంత టైం యిస్తే ఫీజు కడ్తాను” అని, “నువ్వు కూడా వస్తావా” అంది కావ్య.


యిద్దరు కలిసి ప్రిన్సిపాల్ గారికి పరిస్థితి వివరించి చెప్పి, రెండు నెలలు టైం అడిగారు. 


దానికి ప్రిన్సిపాల్, “చూడు కావ్య, నీ పరిస్థితి విచారకరం, అయినా ఈ కాలేజీ మీరందరు కట్టే ఫీజులు మీద ఆధార్ పడి నడుస్తోంది. నెల అవ్వగానే స్టాఫ్ కి జీతాలు యివ్వాలి, నీకు నేను చేయగలిగిన సహాయం ఒక పది రోజులు ఆగుతాను, ఆలోపుగా ఫీజు కట్టాలి” అన్నాడు.


లత తన మిగిలిన స్నేహితులు కి కావ్య పరిస్థితి చెప్పింది. కొంతమంది తాము తమ పాకెట్ మనీ రేపు తీసుకుని వచ్చి యిస్తామని చెప్పారు. వాళ్ళు యిచ్చిన సహాయం పైన యింకా నలభై వేలు కావాలి అని తెలిసి, భోజనం చేస్తో తండ్రి ప్రకాష్ కి చెప్పింది లత.


“వంటలు చేసి అంత డబ్బు ఎలా వస్తుంది పాపం” అన్నాడు. 

“నాన్నా! మనం ఒక నలభై వేలు అప్పుగా యిస్తే పాపం తన చదువు పూర్తి అవుతుంది. ఈలోపు వాళ్ళ నాన్నగారు కోలుకుని పనికి వెళ్తే, త్వరగా మన డబ్బు యిచ్చేస్తారు, మీరు ఈ సహాయం చెయ్యగలరా” అంది.


“నిన్ననే నాతో పాటు పనిచేసిన మా స్నేహితుడు యింటి రిజిస్ట్రేషన్ కి లక్ష రూపాయలు యిచ్చాను. అతను తిరిగి యివ్వడానికి మూడు నెలలు పడుతుంది అన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాడికే డబ్బు అవసరం పడి ఆడిగాడు, మీ స్నేహితురాలు తండ్రి వంట చేసి బాకీ తీర్చగలడా, కానీ అమ్మాయి చదువు ఆగిపోవడం నాకు యిష్టం లేదు. రేపు డబ్బు యిస్తాను, తీసుకుని వెళ్ళి కావ్య వాళ్ళ నాన్నగారికి యిచ్చి కాలేజీ ఫీజు కట్టేసి, తనకి వీలున్నప్పుడు రిటర్న్ ఇవ్వమను. కంగారు పడక్కరలేదు అని ధైర్యం చెప్పు” అన్నాడు.


“నాన్నా! నువ్వు నా చిన్నప్పుడు చెప్పేవాడివి, తాతయ్య ఎంతో మందికి సహాయం చేసి చదువు చెప్పించాడు అని, నీకు అదే గుణం వచ్చింది” అంది సంతోషం గా.


‘కూతురు కోసం డబ్బు యిస్తున్నాను కానీ మళ్ళీ తిరిగి వస్తుంది అనే నమ్మకం లేదు’ అనుకున్నాడు ప్రకాష్. 


మర్నాడు బ్యాంకు కి వెళ్ళి డబ్బు తీసుకుని కూతురు చదువుతున్న కాలేజీ కి వెళ్ళి కూతురుకి డబ్బు యిచ్చి ఇంటికి వచ్చేసాడు. మొత్తానికి కాలేజీ ఫీజు కట్టేసారు. 


తన తండ్రికి లత చేసిన సహాయం తోపాటు మిగిలిన పిల్లలు చేసిన సహాయం చెప్పి “త్వరగా వాళ్ళకి అప్పు తీర్చడానికి మనం వున్న ఈ చిన్న యిల్లు అమ్మేద్దాం” అంది కావ్య.


“యిల్లు కూడా అమ్మేసి ఎక్కడకి వెళ్తాము, నాకు ఆరోగ్యం బాగుపడగానే వంటలు ద్వారా వచ్చిన డబ్బు ముందుగా బాకీ యిచ్చేద్దాం” అని కూతురుకి నచ్చచెప్పాడు.


పరీక్షల హడావుడిలో పడి ఎవ్వరి చదువులో వాళ్ళు ఉండిపోయారు. సెలవు రెండు నెలలు తరువాత మళ్ళీ అదృష్టం బాగుంటే మన యిద్దరం ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదాం అని చెప్పి స్నేహితులు విడిపోయారు.


ఇంటికి వచ్చిన కూతురు లత తో "మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కి ఎలా వుంది" అని ఆడిగాడు ప్రకాష్.


తండ్రి ఉద్దేశ్యం గ్రహించి “ఒక నెల రోజుల నుంచి వంటలకి వెళ్తున్నారుట, రెండు మూడు నెలలలో మన డబ్బు యిచ్చేస్తారు” అంది. 


“వాళ్ళకి యిచ్చిన డబ్బు గురించి ఎప్పుడో మర్చిపోయాను, ఇవ్వకపోయినా పర్వాలేదు, యిచ్చినా తీసుకోకు” అన్నాడు ప్రకాష్.


“మీ ఫ్రెండ్ కి యిచ్చిన లక్ష గురించి ఏమైనా తెలిసిందా” అంది ప్రకాష్ భార్య.


“లేదు, మూడు నెలలలో యిస్తాను అన్నాడు, ఆరు నెలలు అయ్యింది, యిల్లు కొన్నట్టు కూడా చెప్పలేదు. రేపు ఒకసారి ఫోన్ చేసి అడుగుతాను” అన్నాడు ప్రకాష్.


“మూర్తీ! యిల్లు రిజిస్ట్రేషన్ అయ్యిందా?” అని ఫోన్ చేసి ఆడిగాడు ప్రకాష్. 


“రిజిస్ట్రేషన్ అయ్యింది, కూలగొట్టటం అయ్యింది, మా యిల్లు ఎఫ్ టి ల్ లిమిట్ లో వుంది అని పడగొట్టారు. నువ్వు అనవసరం గా లక్ష రూపాయలు యిచ్చావు, ఇవ్వకుండా వుంటే యిల్లు కొనేవాడిని కాదు, యిప్పుడు బ్యాంకు వాళ్ళు లోన్ తీర్చమని వెంటపడ్డారు” అన్నాడు ప్రకాష్ స్నేహితుడు.


“చూసుకుని కొనాలిసింది, ఈ ఊరిలో చాలా మటుకు రెండు, మూడు సారులు రిజిస్ట్రేషన్ జరిగిపోయినవి మనకి అమ్ముతున్నారు” అన్నాడు. 


“అది సరే, మా అమ్మాయిని కాలేజీలో జాయిన్ చెయ్యాలి, నీకు యిచ్చిన లక్ష త్వరగా ఇవ్వరా” అన్నాడు.


“యాభై లక్షలు యిచ్చిన బ్యాంకు వాడే ఏడిపిస్తున్నాడు, నువ్వు కూడా మొదలుపెట్టావా” అన్నాడు మూర్తి.


“అయ్యిందా, మీ స్నేహితుడు కూడా పంగనామం పెట్టేసాడు అన్నమాట, నా సలహా మీకు ఎప్పుడు నచ్చింది కనుక” అంది ప్రకాష్ భార్య.


ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి, లత, కావ్య యిద్దరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. 


“మీ ఫ్రెండ్ ని అడిగి యిద్దరు ఒకే కాలేజీలో చేరండి, కలిసి వెళ్ళచ్చు” అన్నాడు ప్రకాష్.


“అది ఫోన్ తీయ్యడం లేదు, రిజల్ట్స్ చూసి కూడా ఫోన్ చెయ్యలేదు, వాళ్ళ నాన్నకి మళ్ళీ ఏమైనా అయిందేమో” అంది లత.


“యింకా ఏం తీస్తుంది, ఇంటర్ చదవటానికే డబ్బు యిబ్బంది పడ్డ ఆ వంటాయన, కూతురుని ఇంజనీరింగ్ ఎలా చదివిస్తాడు, ఈ డబ్బు కొండేక్కినట్టే” అంది లత వాళ్ళ అమ్మ. 


“అమ్మా! అనవసరంగా ఎందుకు అంటావు, మా ఫ్రెండ్ అలాంటిది కాదు” అంది లత.


రెండు రోజులు అయినా స్నేహితురాలు నుంచి ఫోన్ లేదు, ఇంటికి వెళ్తే డబ్బు కోసం వచ్చాను అనుకుంటుందేమో అని భయపడింది.


ఆదివారం కాఫీ తాగుతో పేపర్ చదువుతున్న ప్రకాష్ కి గుమ్మం లో ఎవ్వరో నుంచునట్టు అనిపించి తలెత్తి చూసాడు. గుమ్మం లో సాధారణ బట్టలు వేసుకుని వున్న ఆయన, ఆయన వెనుక ఒక అమ్మాయి నుంచుని వున్నారు.


అంతలో లోపల నుంచి వచ్చిన లత “హాయ్ కావ్య! ఎక్కడికి వెళ్లిపోయావే, ఫోన్ కూడా తీయ్యటం లేదు” అంటూ, “నాన్నా మా ఫ్రెండ్ కావ్య, వాళ్ళ నాన్నగారు” అంది ప్రకాష్ తో.


ప్రకాష్ లేచి నుంచుని ఆయన ని లోపలికి రమ్మని కూర్చోమన్నాడు.


కావ్య తండ్రి " సార్! మిమ్మల్ని యింతకు ముందే కలుద్దాం అనుకున్నాను, మీరు చేసిన సహాయం మర్చిపోలేను. అయితే ఒట్టి చేతులతో కలవడం యిష్టం లేక రాలేదు. మా అమ్మాయి కావ్య కి మంచి సంబంధం కుదిరింది, అబ్బాయి బ్యాంకు ఆఫీసర్, మాకు వున్న చిన్న యిల్లు అమ్మేసి, కేటరింగ్ కోసం గిన్నెలు మొదలగునవి కొన్నాను. మిగిలిన డబ్బు పెళ్లి ఖర్చులకి. పెళ్లి ఈ రోజుకి 15 రోజులలో వుంది, మీరు తప్పకుండా వచ్చి దంపతులని దీవించాలి” అన్నాడు 



“అదేమిటండి, మీ అమ్మాయి మంచి ర్యాంక్ తెచ్చుకుంది, పెళ్ళికి ఏమి తొందర వచ్చింది, చదివించక” అన్నాడు ప్రకాష్.


“చదివించటానికి నాకు ఓపిక చాలదు, యింతకంటే మంచి సంబంధం తీసుకుని రాలేను. పెళ్ళికొడుకు తను కావ్య ని చదివించుతాను అన్నాడని తెలిసింది. దాని అదృష్టం” అంటూ కూతురు ని పిలిచి సంచిలో నుంచి శుభలేఖ, లత తల్లిదండ్రులకి బట్టలు, అప్పుగా తీసుకున్న డబ్బు కవర్ లత తల్లిదండ్రులకి అందించారు.


“అబ్బే యివి అన్నీ ఎందుకండి, ముందు ఆనందంగా పెళ్లి కానివ్వండి, డబ్బు విషయం తరువాత చూద్దాం” అన్నాడు ప్రకాష్. 


“వద్దండి, ఋణం పెట్టుకుని, పిల్లకు పెళ్లి చేసి పంపించలేను, మీరు చూపిస్తున్న దయకి కృతజ్ఞతలు. మీకు వీలుంటే తెలిసిన వాళ్ళకి నా కేటరింగ్ గురించి చెప్పండి. మీ మాట పోకుండా వంటలు చేసి మెప్పించగలను” అన్నాడు కావ్య తండ్రి.


డబ్బు ప్యాకెట్, బట్టలు అక్కడ పెట్టి వెళ్లిపోయారు తండ్రి కూతురు.


లోపల నుంచి వచ్చిన ప్రకాష్ భార్య, “ఏమో అనుకున్నాను కానీ పాపం నీతికి కట్టుబడివున్నాడు, మీ ఫ్రెండ్, అంత ఉద్యోగం చేసికూడా డబ్బు యివ్వడానికి వంకలు పెడుతున్నారు” అంది. 


“సరే, కొంతమంది మాట అంటే ప్రాణం పోయినా తప్పరు” అన్నాడు ప్రకాష్.


“ఏమండీ! మీకు నా సలహా ఒకటి.. వింటారా” అంది ప్రకాష్ భార్య. 


“వినకపోతే వూరుకుంటావా చెప్పు” అన్నాడు ప్రకాష్. 


“కావ్య కూడా మన పిల్ల లాంటిదే, ఆ అమ్మాయి పెళ్ళికి ఈ డబ్బు కానుకగా చదివించండి, దానితో పాటు పెళ్లి చీర మనం కొందాము” అంది.


“నీ మాటకి ఎదురేముంది, అలాగే కానీ” అన్నాడు ప్రకాష్.


పెళ్ళికి వారం రోజుల ముందే పెళ్లి చీర, ఒక బంగారం గాజు తీసుకొని వెళ్ళి కావ్య తండ్రికి యిచ్చి వచ్చారు. పెళ్లి భోజనం అదిరిపోయింది, పెళ్ళికొడుకు బాగున్నాడు. ప్రకాష్ స్నేహితుడు యింకా లక్ష ఇవ్వలేదు.


                                       శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













55 views2 comments

2 comentários


mk kumar
mk kumar
5 days ago

katha bagundi. pedavallalo niti vuntundi ani chepparu. dabbunna konthamandi appunu eggodataru ani chepparu. kaavayaki , tanu dabbu ivvaledani telise prakasah sahayam cheyadam bagundi.

Curtir


Sai Praveena jeedigunta

16 minutes ago

Chala bagundi

Curtir
bottom of page