#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #Nireekshana, #నిరీక్షణ
Nireekshana - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma
Published In manatelugukathalu.com On 12/01/2025
నిరీక్షణ - తెలుగు కవిత
రచన: బులుసు రవి శర్మ
మా వూరి శ్మశానం మాట్టాడుతుంది నాతో
మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు
పొగ చేతులతో రా రమ్మని పిలుస్తుంది
ఇక్కడ మా బామ్మని
నాన్నని, వాళ్ళ నాన్నని
నా నేస్తం “పండు”ని కాల్చారు
నెలలు నిండని పసికందుని
అర్ధరాత్రి పాతిపెట్టాను నేను
ఈ మట్టికి మా బామ్మ చేసిన బొబ్బట్ల వాసన
ఎలా వచ్చిందో మరి
తాత గుండె మీద తెల్ల వెంట్రుకల్లా
గుబురుగా పెరిగిన రెల్లుగడ్డి
నేవిన్న కథలే మళ్ళీ మళ్ళీ చెపుతుంది
చివరి సారిగా నాన్న వేసుకున్న
ఆయాసం మందు వాసన గాలిలో కలిసి పలకరిస్తుంది
చెల్లా చెదురుగా పడివున్న గాజు పెంకుల్లో
“పండు” గాడి మొహం ఆస్పష్టంగా మెరుస్తుంది
నే పాతిన పాప బుజ్జి చేతులు
మట్టిలోంచి పైకొచ్చీ పాదాల్ని తడుముతాయి
చుట్టూ పెరిగిన బెమ్మజెముడు డొంకలన్నీ
మా ఊరు వాళ్ళందరూ నా చుట్టూ చేరి
పలకరింపుల సంగీతం పాడుతున్నట్టు వుంటుంది
లేవగానే అడుగులు అటువైపే నడుస్తాయి
ఇనప కాళ్ళని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది శ్మశానం
ఎప్పటికైనా ఇక్కడికే రావాలి కదా
పరిచయమైన పరిసరాలైతే మరీ మంచిది
నా మహాప్రస్థానానికి శవయాత్రలు వుంటాయో లేదో మరి
నా అన్న వాళ్ళు నలుగురు మోస్తారో లేదో మరి
చివరి మజిలీ ఇక్కడేనని తెలుసు
ఇదుగో ఇక్కడ ఎవ్వరూ తుంచని
జాజి తీగ నిండా పూలు విరగబూసాయి
గుళ్ళో గంట కొట్టినప్పుడల్లా
ఉలిక్కి పడి రాలుతుంటాయ్
ఇక్కడే ఎదురు చూస్తాను నేను
జాజి పరిమళాల్ని పిలుస్తూ
మీ అందరితో నా పరిచయాల
స్మృతుల్ని నెమరు వేసుకుంటూ
అనునిత్యం దగ్దమయ్యే మనుషుల బూడిదలో
చిటికెడు మానవత్వం ఏరుకుంటూ.....
బులుసు రవి శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు బులుసు రవి శర్మ
పుట్టింది, పెరిగింది బరంపురం (ఒడిశా)లో.
చదువు ఎం టెక్ సివిల్.
ఒడిశా ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉద్యోగం.
ఒడియా మాధ్యమం లో చదువుకున్నప్పటికీ తెలుగు ఇంట్లో నేర్చుకుని కథలు, కవితలు, నాటికలు రాయడం, కొన్ని ప్రచురితం అవ్వడం జరిగాయి.
బరంపురం వికాసం కార్యదర్శి గా వున్నాను. రాయగడ స్పందన కార్యదర్శిగా సాహితీ కార్యక్రమాలు
పర్యవేక్షించాను.
ఫోటోగ్రఫీ, కార్టూన్, నాటకాలు , చిత్రలేఖనం హాబీలు.
మంచి తెలుగు కథలను షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
రావి శాస్త్రి గారి కథలు, శ్రీ శ్రీ కవిత్వం
అంటే ప్రాణం.
Comments