top of page
Writer's pictureKotthapalli Udayababu

నివురు తొలగిన నిప్పు!!!

#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #NivuruTholaginaNippu, నివురుతొలగిననిప్పు, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు


Nivuru Tholagina Nippu - New Telugu Story Written By - Kotthapalli Udayababu 

Published In manatelugukathalu.com On 24/12/2024 

నివురు తొలగిన నిప్పు - తెలుగు కథ

రచన : కొత్తపల్లి ఉదయబాబు 

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కరుణాకరం నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి సోఫాలో పడుకుని ఉన్న అభిజిత్ కనిపించాడు. అభిజిత్ ఇంట్లో ఉంటే అతని పక్కనే నీడలా ఉండే ‘’పింటూ’’ ఆసమయంలో అక్కడ లేదు. 


‘’పింటూ’’ అభిజిత్ పెంచుకునే కుక్కపేరు. కొడుకు ఎంతో ముచ్చటపడి అడిగితే దాన్ని పుట్టినరోజు కానుకగా ఆ ఆల్శేషియన్ ని కొని ఇచ్చాడు తాను. 


తమ తల్లితండ్రులు ఆస్తిపాస్తులు తమకు ముందే ఇచ్చేయడంతో వారిమానానా వారిని వదిలేసి సుఖంగా బ్రతుకుతున్న తమకు అభిజిత్ ఒక్కగానొక్క కొడుకు. మరో మూడుతరాలకు సరిపడా ఆస్తి పుష్కలంగా ఉండడటంతో అభిజిత్ కోరడమే తరువాయి సాధ్యమైనంత తొందరలో ఆ కోరికను తీర్చేవాడు కరుణాకరం. 


ఇక తల్లి కనకవల్లిఅయితే చెప్పనేఅక్కర్లేదు. బంగారుపళ్ళెంలో బంగారపుచెంచాతో దగ్గరుండి తినిపిస్తుంది. కొడుకు నోట తలనొప్పి అన్న చిన్నమాట వచ్చినాసరే విలవిల్లాడిపోతుంది. 


పింటూ ఒక్కదానికే ఇద్దరుమనుషుల ఖర్చుకన్నా ఎక్కువైనా సరే ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చుపెట్టే తల్లితండ్రులంటే అభిజిత్ కు కూడా పంచప్రాణాలు. 


కరుణాకరం వచ్చి సోఫాలో కొడుకు పక్కన కూర్చుని నిద్రబోతున్న అతని తల నిమిరాడు. అటువైపు తిరిగి ఉన్న అభిజిత్ ఇటువైపు తిరిగినా కళ్ళు మూసుకునే వున్నాడు. 

‘’నాన్న.. అభి.. పింటూ ఏదిరా? కనబడదేమి?’’ అడిగాడు కరుణాకరం. 


ఆ మాటలకు కళ్ళుతెరిచాడు అభిజిత్. ‘’నాన్న.. నాన్న.. పింటూ.. పింటూ.. ’’ అంటూ వెక్కసాగాడు. 


కరుణాకరం కంగారుపడిపోయాడు ఎర్రగా ఉన్న కొడుకు కళ్ళు చూసి,"ఏమైంది నాన్నా. పింటూ ఎక్కడైనా తప్పిపోయిందా? చెప్పు నాన్నా”


‘’పింటూ’’ని వాళ్ళ అమ్మదగ్గరకి పంపేశాను నాన్న.. పింటూ.. వాళ్ళఅమ్మమీద బెంగ పెట్టుకుందట. ’’


ఆ పిచ్చిమాటలు విని కరుణాకరానికి మతి పోయింది. కంగారుగా కిచెన్ లో కాఫీ కలుపుతున్న భార్య దగ్గరకి పరుగెట్టాడు. అంతావిని ఆమె బెంబేలు పడిపోయి ఆదుర్దాగా అభిజిత్ దగ్గరకు పరుగెట్టుకొచ్చింది కనకవల్లి. 


‘’ఏంటి నాన్నా? ఏంజరిగింది?’’ అడిగింది కన్నీళ్లతో. 


"అమ్మా. ఈ ప్రపంచంలో పిల్లలకి అమ్మ నాన్నల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా? అమ్మానాన్నలకి పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా?"


"బాబు. నవమాసాలు మోసి తన రక్తమాంసాలు ధారపోసి నొప్పులుపడి తల్లి బిడ్డల్ని కంటుంది. అందుకని తల్లికి పిల్లల మీద తన ప్రాణాలకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది బాబు. కానీ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అందుకని ఆ తల్లి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతుంది. 


తాను ఆకలితో ఏడిస్తే ఎవరైతే తనని గుండెలకు హత్తుకుని తన ఆకలి తీరుస్తారో ఆ తల్లిని మాత్రమే ఆ బిడ్డ గుర్తుపట్టి దగ్గరికి వెళ్తుంది. అదే నాన్న తల్లీబిడ్డల మధ్య ప్రేమంటే. వందమందిలో ఎక్కడఉన్నా తనతల్లిని గుర్తుపడుతుంది ఆబిడ్డ"


"అలాగా. అందుకేనా అమ్మా.. పింటూ మూడురోజులనుంచి పాలు ఒక్క చుక్క కూడా తాగలేదు. వాళ్ళ అమ్మమీద బెంగపెట్టుకుందని నా ఫ్రెండ్ శ్రీహర్ష చెబితే వాడికే ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపేసానమ్మా! కానీ పింటూ లేకుండా నేను బతకలేనమ్మా. " ఒక్కసారిగా భోరున ఏడ్చేసాడు అభిజిత్. 


"పోనీలే నాన్న ఇంకో మంచి కుక్కపిల్లని కొని తీసుకొస్తాను. ఎంత ఖరీదైనాసరే నీకు కావాల్సిన కుక్కపిల్లని కొనితెస్తాను. సరేనా? నువ్వు మాత్రం అలా బాధపడితే మేము తట్టుకోలేమయ్యా." అంది కన్నీళ్ళతో తల్లి. 

"మరి రేపు మీరు ముసలివాళ్ళయిపోతే మీ పనులు మీరు చేసుకోలేరుగా. అప్పుడు మీ పనులెవరు చేస్తారు?" అయోమయంగా అడిగాడు అభిజిత్. 


"అప్పుడు మమ్మలి నువ్వు, నీ పెళ్ళామే చూడాలి బాబు. నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు చెప్పు?"అడిగింది కనకవల్లి. 


"మీరు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నారు కాబట్టి నేనైతే మిమ్మల్ని చూస్తాను అంటాను. కానీ రేపు నా పెళ్ళాం మిమ్మల్ని చూడ్డానికి వీల్లేదు అంటే?.. నేను బతకలేనమ్మ.. అందుకే ఇప్పుడే.. నేనిప్పుడే చచ్చిపోతాను. " ఒక్కసారిగా తల్లిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసాడు అభిజిత్. 

భార్యాభర్తలిద్దరూ భయపడిపోయినట్లుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 


"ఏంటండీ పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడు? బయట కొంపతీసి ఏ 'చెడు' తొక్కలేదు కదా" అంది భర్తతో. 


"ఏం నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? ఏమైందసలు. చెప్పయ్యా. నువ్వు అలా మాట్లాడితే మేము భరించలేమయ్యా " అడిగాడు కరుణాకరం. 


“అమ్మా. , నాన్న.. నాకు నిద్రట్లో పెద్ద పీడకల వచ్చింది నాన్నా’’ అన్నాడు వెక్కుతూనే. 


‘’ఏం కల నాన్నా? దేనిగురించి? "

"ఉహు. నేను చెప్పను. చెబితే మీరు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. "


"పిల్లలుగా మీ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసామో, మేము ముసలాళ్ళమయ్యాక మీరు మమ్మల్ని అంతే ప్రేమగా చూడాలి నాన్న. నీకేం భయం లేదు నాన్న. ఆ కల ఏమిటో చెప్పు" అంది కనకవల్లి కొంగు తో కన్నీళ్లు వత్తుకుని

‘’నాన్న.. నన్ను.. నన్ను నీ గుండెలమీద పడుకోబెట్టుకో నాన్నా.. ఆ కల తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ’’ అన్నాడు అభిజిత్. అంతటి కొడుకుని ఒక్కసారిగా ఒళ్ళోకి తీసుకున్నాడు కరుణాకరం. 


తండ్రి హృదయపు తడి అభిజిత్ గమనిస్తూనే అన్నాడు. 

‘’మీరు నాకు పెళ్లి చేసి మొత్తం ఆస్తి అంతా నాకు రాసి ఇచ్చేశారట. నాకు ముగ్గురు పిల్లలు పుట్టారట. వారిని అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసానట. ముగ్గురు పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారట. మీకు తాత ముందే ఆస్థి ఇచ్చేసినట్టే నేనూ వాళ్ళకి ముగ్గురికి మొత్తంఆస్తి అంతా సమానంగా పంచి ఇచ్చేశానట. 


వాళ్ళు నాకు, నా పెళ్ళానికి అన్నం పెట్టకుండా మమ్మల్ని ముందుగా యాత్రలకని పంపించి తిరిగివచ్చాకా ‘ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. మీరు మా ఇళ్ళకి వచ్చారంటే మా పిల్లలు చదువుకోకుండా, మీ ముసలి రోగాలు అంటించుకుని బతుకుతారు. వెళ్ళండి అవతలకి. ’’ అని నిర్దాక్షిణ్యంగా గెంటేసారట.


అపుడు నాస్నేహితుడు శ్రీహర్ష నన్ను మా యావిడని దగ్గరుండి అనాధాశ్రమంలో చేర్పించారట. కొంతకాలం తరువాత ఒక టీవీ చానెల్ వాళ్ళు మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఎందుకున్నారు? అని అడిగారాట. నేను జరిగినదంతా ఆ టీవీ యాంకర్ కి వివరంగా చెప్పానంటా. అపుడు ఆ యాంకరు, శ్రీహర్ష ఇచ్చిన నా పెద్దకొడుకు సెల్ నెంబర్ తీసుకుని వాడికి ఫోన్ చేసి నన్ను మాట్లాడమని ఇచ్చిందంట. ‘’మమ్మల్ని ఎందుకు వదిలేశార్రా ? మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచాను కదా.. మీ ముగ్గురు ఇళ్ళల్లో నాలుగేసినెలలు ఒకరి ఇంట్లో చొప్పున మాఇద్దరికి ఇంత ముద్ద పడేస్తే కుక్కల్లా మీఇల్లు కాపలా కాస్తాం కదా నాన్న.. ’’ అని అడిగానట. 


అపుడు నా పెద్దకొడుకు తమ్ముళ్ళు, మరదళ్లతో ఆలోచించి చెబుతానులే.. ఇప్పుడు మా పరిస్థితులేమీ బాగోలేదు. సరిగా ఇల్లు గడవక బాధ పడుతున్నాం. ’’ అన్నారట. 


‘’పోనీ నువు నీ పెద్దకొడుక్కి పుట్టిన రోజు కానుకగా అల్శేషియన్ కుక్కపిల్లని బహుమతిగా ఇచ్చి పెంచుతున్నావ్ గా.. దానికి అయ్యే ఖర్చులో పదోవంతు ఖర్చుతో నాలుగు ముద్దలు మా ఇద్దరికీ పెట్టండి నాయనా..’’ అని వేడుకుంటే "అవన్నీ తమ్ముళ్లతో మాట్లాడి చెబుతానన్నానుగా. వుంటాను నాన్న. పని ఉంది.’’ అన్నాడట. 


‘’అమ్మ నా పక్కనే ఉంది. ఒక్కసారి మాట్లాడతావా?’’ అని నేను అడిగితే ‘’తర్వాత మాట్లాడతాలే నాన్నా.’’ అని ఫోనే పెట్టేశాడట. 


నా భార్య శరీరాన్ని చీల్చుకుని పుట్టి, ఆమె రొమ్ముపాలు తాగి, వాళ్ళని అంతగా పెంచి పెద్ద చేసిన కన్నతల్లితో కూడా మాట్లాడలేదంటే, ’’ వాళ్ళు రక్తం తాగే తాగని రాక్షసులు. మనం ముందే ఆస్తి రాసిచ్చి తప్పుపనిచేసామండి’’ అని పేగులుతెగేలా ఏడిచి, ఏడిచి చచ్చిపోయిందట నా పెళ్ళాం. ఈ ప్రపంచంలో అతి విశ్వాసమైన జంతువు కుక్కే అనుకున్నాను ఇంతకాలం. 


అంతకన్నా విశ్వాసంగల కుక్కలుగా బతకడానికి కూడా వృద్ధాప్యపు తల్లితండ్రులు సిద్ధమవుతారని నాకు ఆ కలద్వారా అర్ధమైంది నాన్న. నేను.. నేను పెళ్లి చేసుకోనునాన్న.. పిల్లల్ని కనను. మీదగ్గరే ఉంటాను నాన్న. అందుకే ‘’పింటూ’’ని వాళ్ళ అమ్మ దగ్గరకి పంపేశాను నాన్న’’ అంటూ బావురుమంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ మెల్లగా నిద్రలోకి జారిపోయాడు అభిజిత్. 


ప్రపంచంలోని అతిపెద్దసుత్తితో మాడు బద్దలు కొట్టినట్టు, లక్ష బ్లేడులతో ఒకేసారి ఒళ్ళంతా చీరేస్తున్నట్టు ఒళ్ళు జలదరించి కంపించిపోయాడు కరుణాకరం. అతని కళ్ళల్లోకి చూస్తూ భార్యకూడా. తాము అక్షరాలా చేసిన పనులే తమబిడ్డకు కలగా వచ్చాయా?


********

మరునాడు ఉదయం అభిజిత్ కళ్ళు తెరిచేసరికి నీళ్ళు నిండిన కళ్ళతో ఆదుర్దాగా చూస్తున్న తల్లితండ్రులతో పాటు, తాతయ్య, బామ్మలను చూస్తూనే ప్రశ్నార్ధకంగా కరుణాకరం దంపతులకేసి చూశాడు. 


‘’నాన్న. అభి. ఎన్నో ఏళ్లక్రితం కాశీయాత్రకు వెళ్లిన తాతయ్య.. బామ్మ తెల్లవారుతూనే వచ్చేసారు నాన్న. ఇక.. ఎప్పుడూ మనతోనే ఉంటారు నాన్న. వాళ్ళు వెళ్తానన్నా మనం పంపవద్దు. సరేనా?’’అన్నాడు కరుణాకరం. 


"మీరు ఇంక మాతోనే ఉండండి తాతా! నాన్న.. మీరు.. అమ్మ.. ఎంత మంచి వాళ్ళు? ఎంత మంచి పనిచేశారు. మీరు నా తల్లితండ్రులవడం నా పూర్వజన్మ సుకృతం నాన్న. తాతయ్య.. బామ్మా.. ’’ అంటూ వారి పాదాలకి నమస్కరించాడు అభిజిత్. 


ఎన్నో ఏళ్లక్రితం తనతండ్రుల్ని ఒక టీవీ ఛానల్ యాంకర్ ఇంటర్వ్యూ చేసిన వీడియోని మూడు రోజుల క్రితం యాదృచ్ఛికంగా యూట్యూబ్ లో చూసిన తాను, వారిలో మార్పు తీసుకురావడంకోసం అదే సంఘటనను ఒక కలగా వర్ణించి చెప్పడంవల్ల వారిలో వచ్చినటువంటి మార్పుకి ఎంతో సంతోషించాడు అభిజిత్ మనసులో. 


సరిదిద్దుకున్న తప్పులో దాగున్న పరిపూర్ణమైన సంతృప్తిని అనుభవిస్తూ అభిజిత్ తలనిమిరారు కరుణాకరం దంపతులు. !!!


సమాప్తం

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం 


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

                  2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

  *సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

 2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

చివరగా నా అభిప్రాయం :

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్








64 views0 comments

Comments


bottom of page