#NiyyathIzzath, #నియ్యత్ఇజ్జత్, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Niyyath Izzath - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 01/12/2024
నియ్యత్... ఇజ్జత్ - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
పుట్టిన మనిషి గిట్టక తప్పదు. గిట్టిన మనిషి పుట్టక తప్పదు. ఇది మన సనాతన ఋషులు వేదవాక్కు.... దీనిని నమ్మేవారు కొందరు, నమ్మని వారు కొందరు. నమ్మకం అన్నది వ్యక్తిగత విషయం, అపనమ్మకం అన్నదీ వ్యక్తిగత విషయం. దైవాన్ని నమ్మేవారు ఆస్థికులు, నమ్మనివారు నాస్తికులు.
ఈ సృష్టిలో యుగయుగాలుగా దేవదానవులు వశించారు. కృత త్రేతాయుగ ద్వాపర యుగాలలో నాస్తికవాదం లేదు. వుండినది శివుడా!... కేశవుడా!... అనే ఇరుతత్వ భావన.
కానీ... ఈ కలియుగంలో మూడవ తత్వం నాస్తికత ఉద్భవించింది. ఆ తత్వవాదులు కొంతమంది తయారైనారు.
తత్వ బేధము అంటే అది వైరానికి మూలం. అసఖ్యతకు ఆధారం...
దేశంలో నేడు మూడు పెద్ద సమాజాలు వున్నాయి. ఒకటి హైందవత, రెండవది క్రిస్టియానిటి, మూడవది ఇస్లామ్.
రామ్, రాబర్ట్, రహింలు ఒకే వయస్సు వారు. ఒకే గ్రామవాసులు. ముగ్గురూ స్కూల్లో ఒకే బెంచ్‍లో కూర్చునేవారు. కలిసి ఆడుకునేవారు. మంచి స్నేహితులు. సాటి విద్యార్థులకు ఆదర్శప్రాయులు. గురువులకు ప్రియ శిష్యులు. ఆ ముగ్గురి మాట, చేత ఒక్కటే.
అందుకే వారిని ఊరిజనం అంతా అభిమానించేవారు.
వీరు అందరికీ ఆత్మీయులుగా వర్తించేవారు.
వారి ముగ్గురికీ సభ్య సమాజమన్నా, మన పవిత్ర భారతావని అన్నా ఎంతో ప్రేమాభిమానాలు. అందరూ సఖ్యతతో ఒకటిగా కలిసి మెలసి వుండాలనేది, దానికిగా తమ వంతు ప్రయత్నం చేయాలనేది వారి లక్ష్యం.
రామ్ తండ్రిగారు శివశర్మ. రాబర్ట్ తండ్రిగారు సత్యయ్య. రహిం తండ్రి గారు సయ్యద్. వీరు ముగ్గురు కూడా బాల్యం నుండి మంచి స్నేహితులు. ముగ్గురూ శివశర్మ తండ్రిగారైన పరమేశ్వర శర్మ గారి వద్ద చదువుకొన్నవారు.
పరమేశ్వరశర్మ గారు వారికి ఎవరి ధర్మం ఆచార వ్యవహారాలు వారివి. ఒకరినొకరు ఆ విషయాల్లో విమర్శించడం, ఆక్షేపించడం సత్ సంస్కారం కాదు. అది సఖ్యతకు, విరోధాలకు అంతః కలహాలకు మూలం అవుతుంది. కలహం ప్రశాంతతకు శత్రువు. విధ్వంశానికి మూలం. కనుక మీరు మీ జీవిత కాలంలో, మీ పెద్దలు మీకు నేర్పిన ధర్మాలను పాటిస్తూ, ఆ విషయంలో వాదోపవాదాలను, చర్చలను జరపకుండా ప్రశాంత చిత్తులుగా జీవనాన్ని సాగించడం ఉత్తమ మార్గం అనే తత్త్వాన్ని పాఠ్యాంశాలతో పాటే నేర్పాడు. ఆ ముగ్గురు తమ జీవిత కాలంలో ఆ గురువు మాటలను విస్మరించకుండా వారి జీవిత గమనాన్ని సాగించారు. వూరందరి చేత గొప్ప స్నేహితులు అనే పేరును సంపాదించుకొన్నారు. ఆ ముగ్గురి వయస్సు అరవైకి, డెబ్బైకి మధ్యన రెండు మూడేళ్ళ వ్యత్యాసం.
అలాగా రామ్, రాబర్ట్, రహీంలు ఒకే వయస్సు వారు. వారి ప్రాయం పాతిక సంవత్సరాలు.
వారి ముగ్గురు తండ్రుల మనస్తత్వాలను ఎరిగిన ఈ ముగ్గురూ తండ్రులకు ఆనందం కలిగించే రీతిగా ఇంటా బయటా నడుచుకొనేవారు.
వారి లక్ష్యం.. మతపరమైన కలహాలు ఏర్పడకూడదని వూరి వారంతా అందరూ సఖ్యతతో వర్తించాలని. అది వారి తత్వం. ఆ తత్వ సాధనకు వారు ఒక సమాజాన్ని స్థాపించ నిర్ణయించుకొన్నారు. ఆ సమాజం పేరు బి.యస్.యస్ భారత సేవా సమాజ్. ఆ సమాజానికిగా వారు కొన్ని సిద్ధాంతాలను నిర్ణయించారు.
ఆ సిద్ధాంతాలు....
1. ఈ దేశపు మనుషులందరూ భారతీయులు
2. కుల మత రహితంగా అందరూ కలిసి మెలసి వుండాలి.
3. ఒకరి ఆచార వ్యవహారాలను మరొకరు ఆక్షేపించకూడదు.
4. ఆచార వ్యవహారాలను గురించిన చర్చలను కొనసాగించకూడదు.
5. ఉన్నంతలో పేదవారికి సహాయం చేయాలి.
6. స్త్రీలను అభిమానించి గౌరవించాలి.
7. అన్యాయవర్తనం, మోసపు తత్వం కూడదు.
8. ఒకరి ఆహార పానీయాదుల విషయంలో మరొకరు జోక్యం కల్పించుకొనరాదు.
9. అనాధలను ఆదుకొనవలయును.
10. పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పించాలి.
11. ఎవరినీ ఏ విషయంలోనూ విమర్శించడం ఆక్షేపించడం తగదు.
12. దైవం విషయంలో ఎవరి ఆరాధనా విధానాలు వారివి. ఆ విషయంపై చర్చ జరుపకూడదు.
13. నమ్మకద్రోహం, అబద్ధాలాడటం చేయరాదు.
14. సదా సత్యమును పలుకుతూ ధర్మ మార్గములో నడవాలి.
15. తమ్ముడు తప్పు చేసినా నిర్మొహమాటంగా ఖండించాలి.
16. తెలియక తప్పు, నేరం చేసిన వారిని ఆదరించి, అభిమానించి వారి తత్వాన్ని మార్చాలి.
17. ప్రతి మనిషి సాటి ఎదుటి మనిషిని అభిమానించాలి. గౌరవించాలి, ప్రేమించాలి.
18. మంచి విషయాలు తెలియని అమాయకులకు మంచి విషయాలను నేర్పాలి.
19. పరుల సొమ్ముకు ఆశపడకూడదు. దొంగతనం చేయరాదు.
20. సదా సత్యమునే పలుకుతూ ధర్మ మార్గమున నడవాలి.
21. కుల మత ద్వేషం, అసహ్యం, అగౌరవం పనికిరాదు.
22. నోరులేని జీవరాసుల పట్ల కారుణ్యాన్ని చూపాలి.
23. బాధితులను ఆదుకొని వారి అవసరాన్ని తీర్చి ఆదుకొనాలి.
24. సర్వమత సమానతా భావం కలిగియుండాలి.
25. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రేమ వివాహాలను చేసుకోకూడదు.
26. వృద్ధులైన తల్లితండ్రులను అనాధ ఆశ్రమాల పాలు చేయరాదు.
27. డబ్బుకోసం ఆస్థికోసం అయినవారిని కానివారిని మోసం చేయరాదు.
28. భరత సంతతి భిన్నత్వంలో ఏకత్వం కలిగినది జగతికి తెలియజేయాలి.
పై ఇరవై ఎనిమిది సిద్ధాంతాలను ముగ్గురు మిత్రులూ కలిసి చర్చించి, వ్రాసి వారి పెద్దలైన శివశర్మ, రాబర్ట్, సయ్యద్‍లకు చూపించారు.
ఆ ముగ్గురు పెద్దలు చదివి, చర్చించుకొని వారి సమ్మతిని అభినందనలతో ముగ్గురు పిల్లలకు తెలియజేశారు. ముగ్గురూ ఆ సమాజ స్థాపనకు అంగీకరించారు. కొంత ఆర్థిక సహాయాన్ని కూడా చేశారు.
శివశర్మగారు ఆ సంస్థ స్థాపనకు పంచాగాన్ని చూచి శుభముహూర్తాన్ని నిర్ణయించారు.
రామ్, రాబర్ట్, రహీంలు తమ సంకల్పం త్వరలో ఒక రూపు దిద్దుకొనబోతున్నందుకు ఎంతగానో ఆనందించారు.
*
ఆ వూరి గరీబు (బాగా డబ్బు ఆస్థి వున్నవాడు) ధర్మపాల్. పేరు ధర్మ కానీ... వారు నిర్వర్తించే కార్యాలన్నీ అధర్మాలే. వీరి అనునయులు (శిష్యులు) కొందరు, వారి మాటకు వంతపాడుతూ తానా అంటే తందానా అనడమే వారి దినచర్య.
అందులో ముఖ్యులు ఉమర్. వీరికి పాకిస్థాన్‍లో మిత్రులు వున్నట్లు వినికిడి. రెండవ వ్యక్తి ఏసు. వీరు మతం మారినవారు. సీనియర్ పాస్టర్. ధర్మపాల్ ఆదేశానుసారంగా వారిరువురూ రామ్, రాబర్ట్, రహీంల కార్యాలయానికి వచ్చారు. వారు వయస్సు పెద్దవారైనందు గౌరవంగా ఆ ముగ్గురూ వారికి స్వాగతం పలికారు. ఆ ఇరువురూ సుఖాశీనులైనారు.
"అరేయ్ రామ్!.... మీ ముగ్గురూ ఏదో కొత్త సమాజాన్ని స్థాపించాలనుకొంటున్నారట! ఏంది ఆ వివరాలు" అడిగాడు ఉమర్.
"అవును బాబాయ్!.... మీరు విన్నది నిజమే. మేము స్థాపించనున్న సంస్థ మన యావత్ భారత ప్రజనీకానికి. పరస్పర మైత్రీ భావాన్ని, సఖ్యతను కల్పించేటందుకు. పేరుకు B.S.S"
"రేయ్!... రామూ BSS అంటే ఏమిట్రా!"
"భారత సేవా సమాజ్!" రాబర్ట్ జవాబు.
"అంటే మా ఉద్దేశ్యంలో యావత్ భారత వాసులు ఒక తల్లి సంతతి. ఆ తల్లి మన పవిత్ర భారతమాత" చిరునవ్వుతో చెప్పాడు రహీమ్.
ఉమర్, ఏసు ఒకరి ముఖాలు ఒకరు ముఖాలు చిట్లించి చూచుకొన్నారు.
"ఏం బాబాయిలూ!... అంతగా ఆశ్చర్యపోతున్నారు!" అడిగాడు రామ్.
"ఎందుకురా నవ్వుతున్నావ్?" అడిగాడు ఏసు.
"మీ ముఖ కవళికలను, అదే మార్పును చూచి!..." అన్నాడు రాబర్ట్ జవాబు.
"వాడి నడిగితే నీవు జవాబు..." ఏసు ముగించకముందే....
"బాబాయ్!... మా ముగ్గురి మాట, చేత ఒక్కటే!" అన్నాడు రహీమ్.
"మేము మీకు ఒక మాట చెప్పాలని వచ్చాము!" అన్నాడు ఉమర్.
"చెప్పండి బాబాయ్!" అడిగాడు రామ్.
"మేము చెప్పేది మా మాట కాదు!" అన్నాడు ఉమర్.
"ధర్మపాల్ గారి మాట అవునా?" అడిగాడు రాబర్ట్.
ఇంతలో అక్కడికి ధర్మపాల్ కూతురు అరుణ, ఉమర్ కూతురు సజ్బాది. ఏసు కూతురు మేరీ వారి స్నేహితురాండ్రు గీత, నీతు, పండరి వచ్చారు. ఇక ఇకలు పకపకలతో... అందరూ ఒక వయస్సు వారే. ఒకే కాలేజీలో చదువుతున్నారు.
వారిని చూచి ఏసు, ఉమర్ ఆశ్చర్యపోయారు.
రామ్, రహీమ్, రాబర్ట్ లు వారికి స్వాగతం పలికారు.
"మీ అసోసియేషన్‍లో మేమందరం జాయిన్ కావాలని వచ్చాము రామ్‍జీ" నవ్వుతూ చెప్పింది మేరి.
ఆ మాట విన్న ఏసు మేరి ముఖంలోకి చురచురా చూచాడు.
"ఎందుకు బాబాయ్ మేరిని అంత కోపంగా చూస్తున్నావ్? అది తప్పుగా మాట్లాడిందా!" అడిగింది ధర్మపాల్ కూతురు అరుణ.
"అమ్మా!... మీకెందుకమ్మా ఈ అసోసియేషన్. ఈ ముగ్గురికి తిన్నది అరగక ఏదేదో వాగుతున్నారు!"
అన్నాడు ఉమర్.
"హలో!... ఉమర్ బాబాయ్. ఆ దైవ కృప వలన మా ఆరోగ్యాలు సరిగా వున్నాయి. మాకు తిన్నది బాగా జీర్ణం అవుతూ ఉంది. మీకే మా తత్వం మాటలు రుచించ నట్లున్నాయి. మీరు వచ్చిన పని అయిపోయిందిగా. వెళ్ళి ధర్మపాల్ అంకుల్‍కి ఇక్కడ మీరు చూచింది విన్నది చెప్పండి. మరోమాట మేము ముగ్గురం వారిని త్వరలో కలవబోతున్నామనీ చెప్పండి సరేనా!" అన్నాడు రామ్.
ఉమర్, ఏసులు తెల్లబోయారు. కుర్చీల నుండి లేచారు.
ఏసు కుమారుడు జీజస్ గదిలో ప్రవేశించాడు.
"నీవు ఎందుకురా ఇక్కడికి వచ్చావ్?" అడిగాడు ఏసు.
"ఈ ఎదవలు ఏదో అఘోరిస్తున్నారని విన్నాను. చూడాలని వచ్చాను" అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ జీసస్.
"జీసస్!" రహీమ్ పిలుపు.
"ఆ... ఏమిటి?" జీసస్ జవాబు.
"ఎవరురా వెధవలు?" ఆవేశంగా అడిగాడు రహీమ్.
"మీరే!..."
"జీసస్!..." రామూ మాట.
"ఎందిరా!..."
"మాటల్లో మర్యాద అవసరం!" అన్నాడు రాబర్ట్.
"మీకేందిరా మర్యాద!" కసిగా అన్నాడు జీసస్.
"హద్దులు దాటకు జీసస్!" రాము హెచ్చరిక.
"మర్యాదగా బయటికి పో!" రహీమ్ సందేశం.
"ఇక్కడ మత మార్పిడి జరగడం లేదు. బయటికి వెళ్ళి నీ పనిని నీవు చూచుకో!" రాబర్ట్ సందేశం.
"నా వృత్తిని గురించి ఆక్షేపిస్తావురా నీవు!" ఆవేసంతో జీసస్ రాబర్ట్ చెంపపై కొట్టాడు.
రాబర్ట్ కళ్ళల్లో నీళ్ళు....
అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దవారైన ఉమర్, ఏసులు..
"రేయ్!.... జీజస్ నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోరా!..." ఇరువురూ ఒకేసారి అన్నారు.
ఆడపిల్లలందరూ నవ్వారు. రామూ, జీసస్‍ను సమీపించాడు. జీసస్‍లో ఆవేశం... పళ్ళు కొరుకురూ ఆడపిల్లల్లో ముందున్న రామూను చెయ్యెత్తి కొట్టాడు. రామూ జరిగాడు. ఆ దెబ్బ ధర్మపాల్ కూతురు అరుణ చెంపకు తగిలింది. తెల్లని ఆమె బుగ్గపై జీసస్ ఐదువేళ్ళు ముద్ర నిలిచింది.
నొప్పితో అరుణ "అమ్మా!..." అంటూ నేలకూలబడింది.
ఆడపిల్లలు ఆమెను చుట్టుముట్టారు. మంచినీరు త్రాగించారు.
రాములో సహనం నశించింది. కళ్లు ఎర్రగా మారాయి. తన ఎడంచేత్తో జీసస్ తలపై గట్టిగా ఒక బాదు బాదాడు. జీసస్ కళ్ళు తిరిగి నేలకూలాడు. స్పృహ కోల్పోయాడు.
"జీసస్.... జీసస్!..." అంటూ కొడుకు ప్రక్కన చేరాడు ఏసు.
జీసస్‍లో చలనం లేదు. అతన్ని తాకి చూచిన ఉమర్...
"అరే ఏసు!... వీడిని వెంటనే హాస్పిటల్‍కి తీసుకొని వెళ్ళాలిరా" చెప్పి వీధిలోకి పరుగెత్తాడు.
వెళుతున్న ఆటోను ఆపాడు. ఇంట్లోకి పరుగెత్తి జీసస్‍ను తన భుజంపై వేసుకొని ఆటోవైపుకు పరుగెత్తాడు. ఏసు అతన్ని కన్నీటితో అనుసరించాడు. ముగ్గురూ ఆటోలో చేరి హాస్పిటల్ వైపుకు వెళ్ళారు. రామూ కొట్టిన దెబ్బ అది దెబ్బ కాదు. సమ్మెట దెబ్బ. జీజస్ కణత ప్రాంతంలో అది తగిలింది. హాస్పిటల్‍కు వెళ్ళే మార్గ మధ్యంలోనే జీజస్ ప్రాణం పోయింది. డాక్టర్లు అతన్ని పరీక్షించి చనిపోయాడని చెప్పారు. ఏసు అతని భార్య శాంతి కూతురు మేరి ఎంతగానో ఏడ్చారు.
రామ్, రాబర్ట్, రహీంలు, వారి తల్లితండ్రులు ఎంతగానో బాధపడ్డారు. వారిపై పగతో వున్న ధర్మపాల్ ఏసును రెచ్చగొట్టి తన కొడుకును చంపింది రామూ అని పోలీస్ స్టేషనులో కేసు పెట్టించాడు. పోలీసులు రామును అరెస్ట్ చేసి జైలుకు తీసుకొని వెళ్ళారు.
తన కుమారుడు జైలు పాలైనందుకు శివశర్మ, భార్య సుమతి, సత్యయ్య, సయ్యద్, రాబర్ట్, రహీం, ధర్మపాల్ కూతురు అరుణ ఎంతగానో బాధపడ్డారు.
*
ధర్మపాల్ అతనికి బెయిల్ మంజూరు కానివ్వలేదు. పోలీసులు రామును కోర్టుకు హాజరు పరిచారు. ఆరోజు విచారణ. రామూను పోలీసులు బోనులో ప్రవేశపెట్టారు.
జడ్జీగారు బోనులో వున్న రామూను చూచి....
"నీ తరుపున వాదించే వకీల్ ఎవరు?" అడిగారు.
"ఎవరూ లేరు మైలార్డ్ నేనే!" రాము సమాధానం.
"డిఫెన్స్ లాయర్ నీవు జీజస్‍ను కావాలనే కొట్టి చంపావంటున్నారు దానికి నీ సమాధానం!" జడ్జిగారి ప్రశ్న.
"మైలార్డ్!... నాకు అతనికి ఎలాంటి పగలేదు. అతను మా అసోసియేషన్ ఇంటికి ఆహ్వానరహితంగా వచ్చాను. మా ముగ్గురికీ అంటే నన్ను మా రాబర్ట్, రహీములను తన మాటలతో చాలా పరుషంగా మాట్లాడాడు. ఆ సమయంలో వారి తండ్రి ఏసు, వారి మిత్రుడు ఉమర్ అక్కడే వున్నారు. మాటా మాటా పెరిగి జీజస్ నన్ను చెంపపై ఆవేశంతో కొట్టబోయాడు. నేను ప్రక్కకు జరిగాను. ఆ దెబ్బ ధర్మపాల్ గారి అమ్మాయి అరుణ గారి చెంపకు తగిలింది. వారు నేల కూలారు. నేను ఆ సన్నివేశాన్ని చూచి ఆవేశంగా జీజస్ చెంపపైన కొట్తాను. అతనూ నేలకు ఒరిగాడు. ఉమర్ గారు జీజస్‍ను చూచి, వారిని ఆటోలో హాస్పిటల్‍కు తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో ఎం జరిగిందో నాకు తెలియదు" రాము చెప్పడం ముగిసింది.
జడ్జిగారు నోట్ చేసుకున్నారు.
తర్వాత ఏసును, ఉమర్‍ను విచారించారు. వారు రాము కావాలనే జీజస్‍ను బలంగా కొట్టి చంపాడని, మేము మా కళ్ళతో చూచామని వాగ్మూలం ఇచ్చారు.
రాము నేరస్థుడుగా రుజువైంది.
మూడు సంవత్సరాలు జైలు శిక్షను జడ్జిగారు రాముకు విధించారు.
రాబర్ట్, రహీంలు జైల్లో రాముని కలుసుకొని ’నీవు సంకల్పించి, మనం స్థాపించిన BSS తన విధులను సవ్యంగా నెరవేరుస్తుందని, ఎక్కువ సభ్యులను తయారు చేస్తుందని మేమిరువురం నిరంతరం అందుకుగా శ్రమిస్తామని’ ప్రమాణం చేశారు.
ఆ వార్త ప్రక్క గ్రామాలకంతా పాకింది. ఆదర్శవంతులైన BSS యువతీ యువకులు ధర్మపాల్ పన్నిన వల ఫలితం రాముకు ఆ శిక్ష అన్న విషయాన్ని గ్రహించారు. యధార్థంగా జీజస్‍ను BSS కార్యాలయానికి పంపినది ధర్మపాల్ గారే. ఆ విషయాన్ని అతనికి చచ్చిపోయిన జీజస్‍కు మాత్రమే తెలుసు.
రామూ కారాగార శిక్షకు పెద్దవారైన శివశర్మ, సత్యయ్య, సయ్యద్‍లు వాడి ఆడవారు, వూరిజనం ఎంతగానో బాధపడ్డారు.
*
ధర్మపాల్ అతని అనుచరులు ఉమర్, ఏసులు రాము జైలు పాలైన కారణంగా BSS సంస్థ నేలమట్టం అవుతుందని ఆనందించారు.
వారి ఆనందాన్ని, ప్రసంగాలను విన్న ధర్మపాల్ కుమార్తె అరుణ వారి ముందుకు వచ్చింది. ఆవేశంతో...
"మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించిన రామూ, రాబర్ట్, రహీంలు స్థాపించిన BSS సంస్థ, రామూ జైలు పాలైనంత మాత్రానా నశించిపోదు. అది దినదిన ప్రవర్థమానంగా ఎక్కువ సభ్యులతో పెరుగుతుంది. ఆ సంస్థ మహత్తర ఆశయం.. భారతీయులందరు కులమత భేద భావాలు లేకుండా ఒకటిగా సఖ్యత సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లడం.
నేను రాబర్ట్, రహీములతో కలిసి ఆ సంస్థలను ఉన్నతికి తీసుకుని వచ్చేటందుకు పాటు పడతాను. మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రజల్లో కులమత కలహాలను సృష్టించాలనే దుష్ట చింతనను మానుకోండి" ఆవేశంగా చెప్పి అరుణ BSS కార్యాలయానికి వెళ్ళింది.
ఆమెతో ఆమె స్నేహితురాండ్రు కలిశారు.
రాబర్ట్, రహీం, అరుణ, శివశర్మ, సత్యయ్య, సయ్యద్‍లు ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామానికి వెళ్ళి BSS సిద్ధాంతాలను ప్రజలకు విద్యార్థులకు తెలియజేశారు. BSS గాలి విద్యార్థులను ఎంతగానో ఆకర్షించి, వేలల్లో సభ్యులు చేరారు. నెలకొకసారి రాబర్ట్, రహీములు జైల్లో రాముని కలిసికొని వారు సాధించిన ప్రగతిని గురించి చెప్పేవారు. రాముకు ఎంతో సంతోషం....
రాము జైల్లో వున్న పద్ధతికి అతని శిక్షాకాలం ఆరునెలలు తగ్గించారు అధికారులు. రాము ఆ రోజు జైలునుండి విడుదల. జైలుముందు వేలల్లో విద్యార్థులు. రాబర్ట్, రహీమ్, అరుణ, శివశర్మ, సత్యయ్య, సయ్యద్ రాము రాకకోసం వేచియున్నారు.
రాము జైలునుండి బయటికి వచ్చాడు. అందరూ BSS జిందాబాద్... రామూ జిందాబాద్ అని బిగ్గరగా అరిచారు. ఆనందంతో ఎగిరారు. రాము మెడలో అరుణ పూలమాలను వేసి ఆనందంగా నవ్వుతూ స్వాగతం పలికింది.
’వీరంతా నీ నియ్యత్ (లక్ష్యం)నికి, మాకు నీమీద వున్న (ఇజ్జత్) మా గౌరవానికి ప్రత్యక్ష సాక్షులు’ ఆనందంగా నవ్వుతూ చెప్పాడు రహీమ్, రాబర్ట్ లు రామును కౌగలించుకొన్నారు. రామూ జిందాబాద్.... BSS జిందాబాద్ అనే నినాదంతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అందరి వదనాల్లో ఆనందం.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios