'Noppinchaka Thanovvaka' - New Telugu Story Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 23/05/2024
'నొప్పించక తానొవ్వక' తెలుగు కథ
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“మీ వాళ్ళు ఇంకా నాకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వలేదు, అయినా ఇన్నాళ్ళూ ఓపిక పట్టాను. మీ ఇంటికి పోయి ఏం చెప్తావో, నీ ఇష్టం! మనం అన్యోన్యంగా కాపురం చేయాలంటే మాత్రం నా బాకీ పూర్తి చెల్లించాల్సిందే” కటువుగా కృపాకర్ భార్య మయూరితో అన్నాడు.
“ఇప్పటికే ఈ టాపిక్ అనేక సార్లు తర్కించుకున్నాం, మన పెళ్లి కుదిర్చన మీ పేరెంట్స్ తో ముఖాముఖి మాట్లాడాతాను, మీ లిమిట్ ఓన్లీ ‘ఎస్-నో’ వరకే అన్నారుగా” టైమ్ లేక చెప్పాల్సిన మాటలు చెప్పి, బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ లో సర్దుకుని స్కూటీ ఎక్కి ఆఫీసుకు బయలు దేరింది.
‘భర్తకు యిచ్చే మర్యాదేనా! ఈ రోజుల్లో భార్యలు ఒద్దికగా ఎందుకు లేరు?’ కృపాకర్ మనసులో సగటు ప్రశ్న.
మనసు మళ్ళింది. “హలో నువ్వు చెప్పినట్లే అడిగానమ్మా, విసురుగా మీతో మాట్లాడతానని ఆఫీసుకు వెళ్ళిపోయింది.”
“మాతో వద్దు. నువ్వే తేల్చుకో, మా వరకు తీసుకురాకు.”
“నా మాటకు విలువ లేదమ్మా. పైగా సివిల్స్ పాస్ అయి గవర్నమెంట్ జాబ్ కదా! మరీ రాద్దాంతం చేస్తే బాగోదేమో” నసుగుతూ అన్నాడు.
“నువ్వు మగాడివి! ముందు గుర్తు పెట్టుకో, నీ దారిన నువ్వు ప్రయత్నించు. పాతిక లక్షలు ఎందుకు వదులుకోవాలి.. నేను చెప్పేది అర్థం అవుతుందా!?”
“అర్థమైందమ్మా.. ట్రై చేస్తాను. ఆఫీసుకు టైం అవుతుంది, తర్వాత మాట్లాడతాను” ఫోన్ పెట్టేశాడు.
***
“సుశీలా, నువ్వు మాట్లాడేది చిన్నబ్బాయి తోనేనా? పురుషోత్తమరావు అన్నాడు.
“నేను చేసింది ఆర్డినరీ కాల్ అయినా, మీరు వీడియో కాల్ చూసినంత ఈజీగా కనుగొన్నారు” నవ్వు ముఖానికి పులుముకుంది.
“నువ్వు ఏదైనా మాట్లాడు కానీ పిల్లల్ని దురాశ వైపు దారి మళ్లించకు.”
“ఇందులో దురాశ ఏముందని? వాళ్ళు కట్నం ఎగ్గొడితే, గుర్తు చేసి వసూలు చేస్తే తప్పేంటి?”
ప్రశ్నకు బదులిచ్చాడు “గుర్తు తెచ్చుకోవాల్సిందే వాళ్ళు కాదు, మనం; ముఖ్యంగా నువ్వు!” గతంలోకి లాక్కెళ్లాడు.
వైజాగ్ సొంతింట్లో వుంటున్న పురుషోత్తమరావు సిటీ మున్సిపల్ ఆఫీస్లో అధికార పదవితో సుఖంగా వున్నాడు. పెద్దబ్బాయి కరుణాకర్ ఐటీ ఉద్యోగంలో స్థిరం కాగానే, ప్రేమించుకుంటున్న పూజను రిజిస్టర్ పెళ్లి చేసుకొని కెనడా దూరమై అప్పుడప్పుడు నేను మీకు దగ్గర వాడినే అంటూ ఫోన్ చేస్తాడు. ఫలితంగా కృపాకర్ని సుశీల ‘కీ’ బొమ్మగా మలుచుకుంది.
“మీ ఉద్యోగం-హోదా విని అంతా జెలసీ అవుతున్నారు. కానీ ఏం లాభం, ‘జీతం రాళ్ళు తప్ప నవరత్నాలు’ ఎరుగనని అవకాశం చిక్కించుకుని సుశీల రొదల రణం సాగించేది. తినగ తినగ వేము తియ్యగనుండు, పురుషోత్తమరావు చేదైన లంచాలు లాంఛన ప్రాయంగా మొదలిడి తీపి చూరగొన్నాడు. లంచం నలుపు; తెలుపు కలుపుతో తీగలల్లి తీయనైన వేప చేదై ఉద్యోగం వూడింది. చింత చచ్చినా పులుపు చావ లేదు. సుశీల కృప మీద ఆశల పందిరి అల్లుకుంది.
భారతదేశ జనాభా గణాంకాలు అమ్మాయిల కొరత గ్రాఫ్ విదితమే, నలుపు చరిత్ర తెలియ వచ్చి పెళ్లి సంబంధాలన్నీ మాయమయి, విసిగి పోయి; గొంతెమ్మ కోరికలు పూడ్చి, వచ్చిన అమ్మాయిని సహృదయంతో ఆహ్వానించు క్రమంలో..
“కట్నం యే మాత్రం ఇచ్చుకోగలరు.”
“ఏమీ ఇవ్వలేమండి.”
“కులగోత్రాలు, రాశులు కుదిరాయి, ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఏదో కొంత కట్నం ఇవ్వక పోతే ఎలా చెప్పండి” సుశీల తరపు పెద్దమనిషిగా వచ్చిన గంగారామ్ ఆయన సతీమణి కాంతమణి వంత పలికారు.
అటు నుయ్యి ఇటు గొయ్యి; ఒప్పుకునేంత ఆర్థిక స్తోమత లేదు. ఒప్పుకోక పోతే మంచి సంబంధం, అబ్బాయి బాగున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, తల్లిదండ్రులు తప్ప ఆధారపడిన వాళ్ళు లేరు. క్యాన్సిల్ అయితే ఎలా? వాగ్దేవీ వరుణ్ సందిద్గత!
వాగ్దేవీ హాల్ నుండి బెడ్ రూమ్లో వెళ్లి మంచానికే పరిమితమైన మామగారిని, గుట్టుగా సంప్రదించింది. “అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు! ఇది కాకుంటే మరోటి, కట్నం తీసుకునే వాళ్ళు మనకు వద్దు” బిపి మాత్రలు క్రమం తప్పకుండా వేసుకున్నా మామగారి బ్లడ్ ప్రెషర్ హెచ్చింది.
“నో డౌరీ క్యాప్షన్ కు వాళ్ళు అంగీకరించి, లెవెన్త్ అవర్లో.. నాన్సెన్స్! వద్దు వదినా.. ప్లీజ్ క్యాన్సిల్..” చిటపట లాడింది మయూరి.
టీ-బిస్కట్స్ తో హాల్లోకి ఎంట్రీ యిస్తూ వరుణ్ వైపు తల అడ్డంగా తిప్పుతూ సైగ చేసింది. “ఏం నిర్ణయం తీసుకున్నారు?” పురుషోత్తమరావు ఆతృత.
“మనం వియ్యం అందుకోవడం కంటే పరిచయస్తులుగా వుందామని” వరుణ్ వాక్యం పిడుగులా వినిపించి, నివ్వెరపోయి సుశీల కొద్ది పక్కగా నడిచి కొడుకుతో ఫోన్లో మాట్లాడి వచ్చింది.
“మీ సాంప్రదాయమైన నాగరికత, అమ్మాయి ఎంతో నచ్చాయి. ఉన్న పళంగా కాకుండా మెల్లిగా వాయిదాల్లో కట్నం చెల్లించండి, కానీ సంబంధం వద్దనుకోవడం బాగా లేదండీ!” గంగారామ్ గొంతు గరగర లాడింది.
“పెళ్లి అనే శుభకార్యం జీవితాంతం సంబంధించిన విషయం. ఆ అడుగు జాగ్రత్తగా వేయాలి. పెళ్లి సంబంధం నిర్ణయించినప్పుడు స్తితిగతులు, సంప్రదాయాల విషయాల్లో సౌమ్యం ముఖ్యం! విచక్షణ పాళ్ళు ఎక్కువ మోతాదులో ఉండాలి. మా బుజాలు మోయలేని బరువు మేము తీసుకోలేము” వరుణ్ వడగళ్ళు కురిసే.
నెత్తి మీద నీటి కుండ చిల్లు పడ్డట్టు, ఉబికిన కన్నీటిని అదుపు చేసుకుంటూ సుశీల హాల్ నుండి బెడ్ రూమ్ వైపు నడక అనే పరుగు పెట్టింది. వెనువెంటనే కాంతామణి “వదినా, ఎందుకు బాధ పడతారు. మనం వేరే చూద్దాం” అంటూ ఓదారుస్తూ వెంబడించింది.
బెడ్రూమ్లో కూర్చున్న తండ్రీ కూతుళ్ళిద్దరూ వీరి హఠాత్ ఆగమనంతో లేచి, “ఏమైంది? ఎందుకని ఏడుస్తున్నారు?”
కాంతమణి “మా వదిన ఎన్నో ఆశల పెట్టుకుంది, మీతో వియ్యం ఖాయం చేసుకోవాలని, కానీ మీ వాళ్ళు ముందుకు సాగనివ్వడం లేదు” దుఃఖ ధ్వని పరిమాణం పెరిగింది.
ప్రకాశరావు తట్టుకోలేక “మీరు ఏడిస్తే సమస్య పూడ్చుకోదు. ముందుగానే మేము మా స్థితి విన్నవించాము. పైగా కట్నం మా మనోభావాలకు విరుద్దం. మా కోడలు నుండి పైసా ఆశించలేదు. ఇప్పుడు నా ఇల్లు స్వర్గసీమ! నా బిడ్డను కూడా అలాగే చూడాలని కోరిక.”
కొన్ని క్షణాలనంతరం ఎక్కిళ్ళ ఏడుపు ఆగింది. “మీరు పెద్ద మనసున్న వారు, ఇంత చల్లగా మాట్లాడుతూ వుంటే ఇంకా వినాలని వుంది. నా మాట, ఒక్కటి కాదనకండి..”
“చెప్పండి,” సుశీల బదులు కాంతామణి జవాబు ఇచ్చింది. “మా వదిన పేరుకు తగ్గట్టు సౌశీల్యవతి! మా వారు అదే బయట కూర్చున్న గంగారామ్ గారికి అన్నీ ‘ఎస్’ అనే సమాధానాలు కావాలి. కనుక దయచేసి వారి ముందు మాత్రం కట్నం ఇస్తామని ఒప్పుకోండి ప్లీజ్ అంతే!”
“అష్టలక్ష్మీ అయిన కోడల్ని ధనంతో తూచలేము. నాకెందుకండీ మీ డబ్బు! పైగా హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్. కళ్లకద్దుకుని కన్యాదానం స్వీకరిస్తాం!” సుశీల గ్యారెంటీ ఇచ్చింది.
ఉద్దేశ్యం నిర్ధారణ అయితే దేవేంద్ర భవనం కూడా దెయ్యాల కొంపె! ఆడపెళ్ళి వారిని తప్పు పట్టే ఆనవాయితీ! “ఎలా వేగుతావమ్మా ఈ నస-బుస అత్తతో” అన్న అనుమానంతో సాగనంపారు. గవర్నమెంట్ జాబ్ అంటే కామధేనువు అని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
***
“హలో మయూరి.. చీకటి పడుతున్నది, ఇంకా రాలేదేమిటి?”
“నేను మా పుట్టింటికి వెళుతున్నాను. ఇంకో ఐదు నిమిషాల్లో బస్సు కదులుతుంది.”
“ఆ.. అదేంటి అంత సడన్ డిసిషన్! కొంచెం ముందుగా చెబితే నేనూ వచ్చేవాడిని. ఏమైంది, నీ ఆరోగ్యం ఓకే కదా?”
“ఐయం ఫైన్. ‘ఇన్నాళ్ళూ ఓపిక పట్టాను. మీ ఇంటికి పోయి.., నీ ఇష్టమని’ నువ్వేగా అన్నావు, అందుకే ఇష్టంగా వెళ్లి, యిష్టం ఉన్నప్పుడు వస్తాను.”
“అరే! మన మధ్య ఎన్నో అనుకుంటాం, అన్నిటినీ సిరీయస్ తీసుకుంటే కాపురం చేయగలమా!? ప్లీజ్, బస్ దిగేసి వెయిట్ చేయి, వితిన్ నో టైమ్ వస్తాను.”
“బస్ కదిలింది. బై!” మయూరికి కోపం వచ్చిందంటే కోటలు దాటుతుంది. కృపాకర్ ఆలోచనల్లో అల్లుకు పోయాడు. ఇద్దరి మధ్య అరమరికలు, ఆర్థిక యిబ్బందుల్లేవు; మన్మధ సామ్రాజ్యంలో ఎవరికి వారే సాటి. అన్ని విధాల దైవమిచ్చిన, తామెచ్చిన నెచ్చెలిని అప్పుడప్పుడు కట్నం ముల్లుకర్రతో గుచ్చడం ఔన్నత్య శూన్యత నిదర్శనం.
అమ్మకు డబ్బు ఆశ ఉండవచ్చు, ఉన్నపళాన నేనెందుకు స్పందించాలి! ఉన్న దాంట్లో తృప్తిగా కాలం గడపక. మా ఇద్దరి మధ్య పెట్రోలు పోసి, నేనెందుకు అగ్గితో తలకొరివి పెట్టుకోవాలి!
అమ్మ ధన్ధాహంతో కర్ణభేరిని తూట్లు పొడిచే మాటలను విన్న నేను మరో చెవి నుంచి ఉద్వాసన చెప్పక, నా బుర్రలో బూజు పట్టించు కోవడం అవసరమా?
అమ్మ ఆజ్ఞ ఇవ్వగానే శిరసావహించడం అలవాటై మయూరిని ఇరుకున పెట్టానే గాని, అన్యథా కాదు. అంటే ఒకర్ని సంతోషపెట్టడం కోసం మరొకరిని బాధ పెట్టె తత్త్వమా నాది. ఛీ.. ఇది పద్ధతి కాదు. రాబోవు రోజుల్లో నేను ‘హెడ్ ఆఫ్ ది ఫ్యామిలి’.. ఇప్పుడు లేని ఆదర్శం అప్పుడేలా అబ్బుతుంది.
నొప్పించక తానొవ్వక ఎక్కడ టాపిక్ అక్కడ మేనేజ్ చేయాలి. ప్రైవేటు కంపెనీ మేనేజర్ పోస్ట్ అనగానే మురిసిపోయాను. మేనేజ్ చేయడమంటే మురిపం కాదు, మెదడుకు పని, మెలకువగా మెరవాలి. నా సహజీవన సమవుజ్జీ విశ్వాసాన్ని గెలవాలి.
ముసిరిన ఆలోచనలతో నిద్ర రాక తల భారంగా ఉంది. టైమ్ మూడు కావస్తోంది. ఆన్లైన్లో వైజాగ్ బస్సుల్లో స్లీపర్ లేవు అన్నీ సిటింగ్! అదే సిటింగ్ ఇంకొంచెం విలాసవంతంగా వెళ్లొచ్చు, నా కోసం నేను సుఖపడాలి! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందేభారత్ ట్రైన్ మధ్యాహ్నం వుంది, లేని హుషారు కదం తొక్కింది.
వేడినీళ్లకు అలవాటు పడ్డ శరీరాన్ని చన్నీళ్లతో ముఖం కడుక్కొని, ఎప్పుడూ చేసే వ్యాయామం కానిచ్చి, ఇల్లంతా శుభ్రం పర్చి, షవర్ స్నానం తర్వాత బాలభానుడుకి మొక్కుకున్నాడు. విరిసిన పూలతో సోమశేఖరుని అలంకరించి దీపం వెలిగించాడు. ఇది వరకటి సోమరితనం ఏమైంది? ఇవన్నీ మయూరి చేసేది. అందుకే అన్ని పనుల్లో శక్తివంతంగా ఉండేది.
హుషారుగా ఆఫీసుకెళ్ళి జరిగిన పనుల్లో తప్పులు ఎత్తి చూపలేదు, జరగని పనుల్లో చిరాకు పడలేదు. చిరునవ్వుతో బుజం మీద చేయి వేస్తూ, బుజం తట్టి సరి చేస్తున్నాడు. నాణ్యత సరితూగే హామీలకు షేక్ హ్యాండ్ యిస్తూ మెచ్చుకున్నాడు. కృపాకర్ సమైక్యతకు స్టాఫ్ ఆనందాశ్చర్యులయ్యారు.
***
“మయూరి ఏదైనా గుడ్ న్యూస్?”
“లేదు వదినా, మిమ్మల్ని చూడాలని వచ్చాను. నేను రావడమే గుడ్ న్యూస్.”
“అవుననుకో, కనీసం ఫోన్ కూడా చేయక వస్తే..”
“నువ్వు గుడ్ న్యూస్ దాచిపెట్టి, నన్ను అడుగుతున్నావు? ఎనీ వేస్ కంగ్రాట్స్!”
“థాంక్స్, నేనే చెబుదామనుకున్నా, మీ అన్నయ్య చెప్పేశాడు.”
“మా మధ్య నో సీక్రెట్స్!” నవ్వుతూ వాగ్దేవిని హత్తుకుంది. నాన్నను పలకరించడానికి వెళ్ళింది. టాబ్లెట్స్ మహిమ కాబోలు మంచి నిద్రలో ఉన్నారు.
రీడింగ్ టేబుల్ పైన అటుఇటుగా వున్న మాగజైన్స్ సర్దింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అని చెప్పలేక ‘నో సీక్రెట్స్’ అని వదినతో అబద్ధం చెప్పింది. సంతోషం అందరికి పంచాలి, దుఃఖం మాత్రం అమ్మనాన్నలతో; కానీ నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. అత్తారింట్లో కట్నం పిశాచని ఎలా చెప్పను?
‘మీ పేరెంట్స్ తో ముఖాముఖి మాట్లాడాలి’ అని వచ్చాను కానీ ఇక్కడ ఇంట్లో అందర్ని సమావేశ పర్చాలి. ఈ ఆవేశపూరితమైన సీన్ ఆందోళన కలిగిస్తుంది.
నిస్సత్తువ ప్రవాహంలా ముంచేస్తున్న నీరసం, వదిన ఇచ్చిన కాఫీ వల్ల రిలాక్స్ అయింది. నాదే తప్పు, ఆనాడే కొంచెం కఠినంగా ఉండి, ఈ పెళ్లి కాన్సిల్ చేస్తే బాగుండేది. ప్రకాశరావు నిదుర లేచి మయూరిని చూసి చాలా ఆనంద పడ్డారు.
నా పట్ల సుహృద్భావంతో వున్న వీరిని క్లేశ పర్చటం న్యాయం కాదు. సమయం చూసి వరుణన్నతో చెప్పి, నాన్నకు తెలియకుండా జాగ్రత్త తీసుకోవాలి. నాన్న మెల్లిగా గోడవారగా వున్న ఈజీ చైర్ లో కూర్చున్నారు. మనసులోని మాట నవ్వుతున్న అమ్మ ఫోటోతో చెప్పుకుంది. మానసిక ఒంటరి జీవితం దుర్భరం!
కృప మంచివాడు అని సద్దుకున్నా, ఇంటి నుంచి ఫోన్ రాగానే మారిపోతాడు. మళ్లీ మామూలు స్థితికి రావడానికి టైం పడుతుంది. ప్రతిసారి ఇదే గోల. కుదురుగా ఉండలేమా? వేయి ప్రశ్నలు, లక్ష అనుమానాలు!
స్నానం చేసి, “వదినా ఈ రోజు నేనే వంట చేస్తాను. నేనున్నన్ని రోజులు నీకు రెస్ట్.”
“నేను నీకో విషయం చెప్పాలి.. ఏమీ అనుకోవద్దు.”
“మన మధ్యలో అనుకోవడల్లేవు వదినా..”
“నాకు ఈ మధ్య కొంచెం నలతగా, వికారంగా ఉంటుంది. కొన్ని రోజులు ఇక్కడే వుండగలవా?”
“నువ్వింత ప్రాధేయ పడుతూ అడగలా, ఉంటాను.”
“పుట్టింటికి వెళ్తానంటే మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు.”
“ఎందుకు ఒప్పుకోవడం లేదో, కూడా చెప్పాలి..” వరుణ్ కల్పించుకున్నాడు.
“మరేం లేదు, అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగా లేదు.”
“అవునా, ఏమైంది?”
“చూపు తగ్గింది; కాళ్ళ వాపులు. కూర్చుంటే నిలవడం కష్టం, నిలుచుంటే కూర్చోవడం కష్టం. మనిషిని పెట్టుకొని కాలం గడుపుతుంది. అమ్మకు భారం కావద్దని ఇక్కడ ఉందామనుకున్నా.”
“వదినా, నాకు సంజాయిషీ ఎందుకు, నేను వుంటాను.”
“అదే.. మరి నీ ఆఫీస్?”
“సెలవు పెడతా..”
“ఒకమాట బావగారితో చెప్తే బావుంటుందేమో..” వరుణ్ సందేహం.
“చెప్తాను.. అయినా నేను తీసుకున్న నిర్ణయాన్ని కృప కాదనడు. ఇట్స్ ఓకే.”
“నిన్ను ఎలా అడగాలో, నీ నుండి మాకు కావాల్సిన జవాబు వస్తుందో, రాదో అని మేమిద్దర చాలా తికమక పడ్డాము. థాంక్స్” వాగ్దేవి మాటల్లోనే కాదు కళ్ళల్లో కృతజ్ఞత.
***
“మాట మాత్రం చెప్పక సడన్గా.. యిలా వచ్చావేం కృపా?”
“మయూరి తోడుగా వచ్చాను. తను అటు వెళ్ళింది, నేనిటు..”
“ఇద్దరూ కలిసి వచ్చి, ఇక్కడ విడిపోవటం ఏమిటీ?” పురుషోత్తమరావు నచ్చని మాట అనేశారు.
“నాకు మిమ్మల్ని చూడాలని ఆతృత, మయూరికి వాళ్ళ వాళ్ళని .. అంతే.”
“సరే, ఫ్రెష్ ఐయి, టిఫిన్ తిను.” తల్లికి కొడుకు ఆకలి ముందుగా కనిపిస్తుంది. ఆ తర్వాతే అన్నీ. టిఫిన్ చేసి, మయూరితో ఫోన్లో మాట్లాడాలని “ఇక్కడ ఫోన్ డిస్టర్బన్స్ చాలా ఉంది” వరండాలోకి వెళ్ళాడు.
వెనువెంటనే సుశీల కూడా వచ్చింది. “కలిసే వచ్చారు, అప్పుడే ఫోన్లు; మనకు రావలసిన డబ్బులు ఏమైనా వచ్చే దారి దొరికిందా?” సహనానికి సున్నా చుట్టింది.
ప్రేమగా బుజాలు పట్టుకొని “అమ్మా, మయూరి వాళ్ళు కట్నం వద్దన్న పెళ్లి సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ‘అంపకం మాట్రిమోనియల్’ వాళ్ళు ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నామని ఇద్దరి మేరేజ్ ఫోటో జత చేస్తూ రెండు వాక్యాల్లో ఒపీనియన్ అడిగారు. ఆ వివరాలన్నీ ఇచ్చామనుకో. ‘బెస్ట్ కపుల్’ అని ప్రశంసాపత్రం కూడా ఇచ్చారు. నీకు డబ్బులు కావాలంటే నేను ఏదైనా లోన్ తీసుకొని ఇస్తాను.”
“అవునా, కంగ్రాచులేషన్స్! లోన్లు-డైమండ్లు వద్దు. పద నాన్నతో చెప్తాలి,” ఉత్సాహంగా అన్నది.
శ్రీమతి ఫోన్ ముచ్చట్లు తృప్తి తీరలేదు. ప్రత్యక్ష ఏకాంతం కోసం సాయంత్రానికల్లా ముందున్నాడు. ఎంతో ఆప్యాయతతో నిండిన స్పర్శ సేద తీరుస్తున్నట్లున్నది. ఇరువురి ప్రవర్తనలో సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. ఆమె మెడ వంపులో తలదించుకున్నాడు. అంతటా నిశ్శబ్దం, మనోహరమైన ప్రశాంతత.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli
Surekha Puli
•3 hours ago
ధన్యవాదాలు 🙏
Anil Gurram
•36 minutes ago
👌🥳👌🙏
Divik G
•2 hours ago
Congrats ❤