top of page

ను'వ్వంటే' నాకిష్టం

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #NuvvanteNakishtam, #నువ్వంటేనాకిష్టం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Nuvvante Nakishtam - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 19/04/2025

నువ్వంటే నాకిష్టం - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల


బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వెలగబెడుతున్న బుచ్చిబాబు పెళ్ళి త్వరగా చేసేయాలన్న నిర్ణయానికి వచ్చారు అతని తల్లి తండ్రులు. అమ్మాయిల కొరత కారణంగా ఆలస్యం చేస్తే పెళ్ళికాని ప్రసాదులా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నాడు బుచ్చిబాబు. హోటల్ తిండి పడక, స్వంతంగా వంట చేసుకు తినే బుచ్చిబాబుకి జీహ్వచాపల్యం ఎక్కువ. తిండి పుష్టి కూడా కాస్త ఎక్కవే!


పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడల్లా అమ్మాయి అందంచందం కన్నా, ఆమెకి వంటావార్పూ వచ్చా రాదా అన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలా చాలా సంబంధాలు తప్పిపోయాక, కోరికోరి కోమలిని వరించి పెళ్ళి చేసుకున్నాడు.


పెళ్ళిచూపుల్లో తనకు పెట్టిన స్వీట్స్, హాట్స్ కోమలి చేసిందని నమ్మి, ఆమెకి వంట బాగా వచ్చని అభిప్రాయపడిన బుచ్చిబాబుకి ఆమె విపరీతంగా నచ్చేసింది. నిజం చెప్పాలంటే స్వీట్స్, హాట్స్ బాగా నచ్చాయి. మారుమాట్లడకుండా ఆమె మెళ్ళో మూడుముళ్ళు వేసాడు. బెంగుళూరులో కాపురం పెట్టాక ఆమెకేమాత్రం వంట రాదని, తనలాగే ఆమెకీ జీహ్వ చాపల్యం మాత్రమే ఉందని, వంట ఎలా చెయ్యాలో మాత్రం తెలియదని తెలుసుకొని డీలా పడిపోయాడు పాపం బుచ్చిబాబు.


అయితే, తనకి వంటరాదన్న విషయాన్ని మాత్రం ఆమె ఒప్పుకోదు. పెళ్ళైన తర్వాత యూట్యూబ్ చూసి వంట నేర్చుకొని, రోజూ ఏదో ఓ కొత్తరకం వంటచేసి బుచ్చిబాబుని తినమని వేధిస్తుంది. తనకి వంట చెయ్యడం బాగా వచ్చని, ఎటొచ్చీ ఆ వంటకాలకి బుచ్చిబాబు వంకలు పెడుతున్నాడని ఆమెకి అనుమానంగా ఉంది. యూట్యూబ్ ను ఆశ్రయించి చాలా రకాల వంటకాలే నేర్చుకుందామె. టమాటా హల్వా, బెండకాయ గుమ్మిడికాయ కూర, పన్నీర్ బీరకాయ కూర్మా (పాపం బుచ్చిబాబు ఖర్మ), కంద-కాకరకాయ వేపుడు, అందులో మచ్చుకు కొన్ని. అవి చేసి ఫేస్ బుక్, వాట్సప్ లో పెట్టిన ఆమె పోస్టులకి విశేష స్పందన లభించింది కూడా. ఆ ఉత్సాహంతో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసి కొన్ని కొత్తరకం వంటకాలు కనిపెట్టింది.


అవి సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే కాకుండా, స్వయంగా తయారుచేసి బుచ్చిబాబును తినమని బలవంతం చేస్తుంది. కోమలి చేతి వంటంటే చచ్చేంత భయం పట్టుకుంది బుచ్చిబాబుకు. ఏమైనా అంటే, కన్నీటి కావేరిని వదులుతుందాయె! కోమలి కంట కన్నీరు అంటే బుచ్చిబాబుకు మాచెడ్డ భయం! ఆమె కన్నీరు పెట్టి అలిగిందంటే, తన జేబుకి మూడిందన్నమాటే. బజారుకి తీసుకెళ్ళి, ఆమెకి నచ్చినవి కొనిపెట్టి ప్రసన్నం చేసుకోవలసిందే!


ఆ రోజు ఆదివారం. కొత్తరకం వంట చేసి ఎలాగైనా బుచ్చిబాబు మెప్పు సంపాదించాలని నిర్ణయించుకుందామె. బుచ్చిబాబు మనసులో బితుకుబితుకు మంటున్నా, దేవుడి మీద భారంవేసి భోజనం చెయ్యడానికి సిద్ధమయ్యాడు.


కంచంలో వడ్డించిన పదార్థాల్లో అన్నమొకటే పోల్చుకోగలిగాడు, మిగతావేంటో బుచ్చిబాబుకి ఏ మాత్రం బోధపడలేదు. అయినా ధైర్యంగా కంచంలో వడ్డించినది కూర అయుంటుందని, అన్నంలో కలుపుకొని ఓ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. కాని గొంతు దిగలేదా ముద్ద.


ఇంతలో ఎదురుగా చేతిలో గరిటతో నిలబడిన కోమలి భర్తవైపు చూసి, "ఎలా ఉందండి నా వంట? ఇవాళ యూట్యూబ్ చూసి మీకోసం ప్రత్యేకంగా బ్యాంగిన్ బ్యాంగ్ చేసాను." అంది.


ఒక్కసారి పరమ వికారంగా మొహం పెట్టాడు బుచ్చిబాబు. "ఎలా ఉందంటే ఏం చెప్పను? పరమ భయంకరంగా ఉంది! నువ్వు మాములు వంటలు నేర్చుకుంటే చాలు, ఇలా కొత్తకొత్త ప్రయోగాలెందుకు చెప్పు!?" అన్నాడు.


అతనివైపు కోపంగా చూసింది కోమలి. "పెళ్ళైన కొత్తలో 'నీవంటంటే నాకు చాలాచాలా ఇష్టం!' అని ఎప్పుడూ అనేవారు. ఇప్పుడేమో నా వంటకు వంకలు పెడుతున్నారు." అంది అతనివైపు తీవ్రంగా చూస్తూ.


అప్పుడు తనన్నమాట గుర్తుకు వచ్చి బిగ్గరగా నవ్వాడు బుచ్చిబాబు. "నువ్వంటే నాకిష్టం అని మాత్రమే అన్నానే, నీవంటంటే ఇష్టమని అనలేదు. కాని నువ్వేమో అలా అర్ధం చేసుకొని నా ప్రాణాలు తోడేస్తున్నావు." అన్నాడు.


బిత్తరపోయి చూడటం ఆమె వంతైంది. ఆ రోజు నుండి వంట చేసే బాధ్యత తన చేతిలోకి పూర్తిగా తీసుకున్నాడు బుచ్చిబాబు. ఇదేదో బాగుందని కోమలి సీరియల్స్ కే అంకితమైపోయింది.


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


コメント


bottom of page