top of page
Writer's pictureSujatha Swarna

నువ్వొస్తావని

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Nuvvosthavani' - New Telugu Story Written By Sujatha Swarna

Published In manatelugukathalu.com On 10/12/2023

'నువ్వొస్తావని' తెలుగు కథ

రచన: సుజాత స్వర్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ 



పోస్ట్ మేన్ తెచ్చిన ఉత్తరం అందుకుని విప్పాడు శేఖర్. అది ఇండియా నుంచి రవికి వాళ్ళ అక్క రాసినది. కొంత చదివి ఉబుకుతున్న కన్నీళ్ళను ఆపుకొంటూ చదవలేక శ్రీను చేతిలో పెట్టాడు శేఖర్. 


రవి, శ్రీను, శేఖర్ ముగ్గురూ రూమ్మేట్స్. రష్యాలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 


రవికి నెలకి ఒక ఉత్తరమైనా ఇండియా నుంచి వస్తుంది. ఎక్కువగా తన అక్కే రాస్తుందని స్నేహితులకు చెప్తుంటాడు. అప్పటికింకా ఇండియాలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఉన్నా ఎవరో ధనవంతుల వద్ద మాత్రమే ఉండేవి. సమాచారమంతా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానే జరుగుతుండేది. ఐయస్డీ కాల్ ఖర్చుతో కూడినది కాబట్టి అవసరమైతేనే మాట్లాడుకునేవారు. రవి ఈమధ్యనే మొబైల్ ఫోన్ కొన్నాడు. 


శ్రీను శేఖర్ ఇచ్చిన ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు. 


“ప్రియమైన తమ్ముడు రవికి, 


ఎలా ఉన్నావు? మేమంతా బాగున్నాము. నిన్ను తలుచుకుంటేనే బెంగగా ఉంటుంది. ఈ మధ్య నువ్వు బాగా గుర్తొస్తున్నావు. 


నువ్వు నాకంటే ఆరేళ్ళు చిన్నవాడివి. నువ్వు పుట్టినప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగా లేకపోతే నేను, అన్నయ్యే నిన్ను చూసుకునేవాళ్ళం. అప్పుడు నువ్వు ఎంత అందంగా ఉండేవాడివో!దబ్బపండు రంగులో ముద్దులొలుకుతూ ఉండేవాడివి. ముద్దొస్తున్నావని నిన్ను ఎత్తుకోవాలని ఎవరైనా దగ్గరకు వస్తే ఏడ్చి పెడబొబ్బలు పెట్టేదాన్ని. నేనుండగా నిన్ను తాకడానికి ఎవరూ సాహసించేవారు కాదు. నేను నీకో బాడీ గార్డ్ ని. 


నాపెళ్ళయ్యాక కూడా నిన్ను చూడాలని ఏదో ఒక వంకతో మనింటికి వస్తుండేదాన్ని. హాస్టల్లో భోజనం సరిపడటం లేదని ఇంటర్ మావద్దే ఉండి చదివడంతో నీపట్ల మమకారం ఇంకా పెరిగింది. ఇక్కడ వైద్యవిద్యలో సీటు రాలేదని ఎలాగైనా డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అంత దూరం వెళ్ళావు. నీ కోరికను కాదనలేక పంపడమే కానీ మాకెవరికీ నువ్వు రష్యావెళ్లి చదువుకోవడం ఇష్టం లేదు. రష్యన్ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలనే నియమం కూడా ఉందన్నావు. ఎలా నెగ్గుకొస్తున్నావో ఏమో !


'ఎలా ఉన్నావో, ఏం తింటున్నావో' అని ఎప్పుడూ నిన్నే తలచుకుని దిగులు పడుతుంటాము. ఏం తింటున్నా నువ్వే గుర్తొస్తావు. గడ్డపెరుగంటే నీకెంత ఇష్టమోకదా!అక్కడ దొరుకుతుందో లేదో మరి!


అప్పుడే నువ్వు వెళ్లి ఐదు సంవత్సరాలైంది. బావకి ఈమధ్యనే ప్రమోషన్ వచ్చింది. చింటు గాడు రెండో క్లాస్ కి వచ్చాడు. బంటి గాడు బడిలో చేరాడు. వాడి అల్లరి అంతా ఇంతా కాదు. 'మామ ఎప్పులు వత్తాలు?' అంటూ ముద్దుముద్దుగా అడుగుతున్నాడు. 


రవీ! గత నెలలో నాన్నగారు రిటైరయ్యారు. ఆ వేడుకను ఎంతో ఘనంగా చేద్దామనుకున్నాము కానీ నువ్వు రావడానికి వీలుపడట్లేదని తెలిసాక అస్సలు ఆసక్తి కలగలేదు. ఏదో నిస్సత్తువ ఆవహించింది మాకు. 


అన్నయ్య పెళ్లిలో ఎంత ఆనందంగా గడిపామో మనం! నువ్వు చేసిన సందడి గుర్తొచ్చి ఆ జ్ఞాపకాలతో మనసంతా నిండిపోయింది. 


వదినని ఎంత ఆటపట్టించామనీ! బిందెలో ఉంగరాలు... తీసే ఆటలో అన్నయ్యకే ఉంగరం దొరకాలని, నేను వదినకి చక్కలిగింతలు పెట్టడం, అదే అదనుగా అన్నయ్య ఉంగరం దొరకపుచ్చుకొవడంతో వదిన బుంగమూతి పెట్టడం, ఆ వేడుక ఎంత సంతోషంగా జరిగిందో!


వదినకి మనమిచ్చిన బహుమతి ఏంటో గుర్తుందా నీకు ? గిఫ్ట్ కవర్ విప్పలేక వదిన నీరసపడడం, అతిథులందరూ ఆసక్తిగా ఆ కానుక ఏమిటాని చూస్తుండగా విప్పాక కనిపించిన 'పాలపీక' చూసి నవ్వడం, ఆ సన్నివేశం నాకింకా కళ్ళముందు కనబడుతోంది. నువ్వెక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది. చిన్నల్లో చిన్నగా పెద్దల్లో పెద్దగా కలిసిపోతావు. ఆనందానికి మారు పేరే నువ్వు. 


ఒరేయ్ తమ్ముడు.. ! నీ ఆరోగ్యం జర భద్రం. వేళకు తిను. ఒంటరిగా తిరగకు. అక్కడ సముద్రాలు ఎక్కువట. ఈతలకు గట్రా వెళ్ళకండి. ఇవ్వన్నీ ఎప్పుడూ చెప్పేవే అయినా నా మనసాగక మళ్ళీ మళ్ళీ చెబుతుంటాను. 


'ఎలా చదువుతున్నావు?' అన్న నా ప్రశ్నకు వైద్య విద్యంటే సముద్రం లాంటిదక్కా! దారీ తెన్నూ తెలియట్లేదని అన్నావోసారి దిగులుగా. పట్టుదల ఉంటే సముద్రాన్నైనా ఈది తీరం చేరవచ్చు. మన ఊరిలో ఓ మంచి హాస్పిటల్ పెట్టాలన్న నీ లక్ష్యాన్ని గుర్తుంచుకో. నాతో పాటు అమ్మా నాన్నలు, అన్నా వదినలు, మన ఊరివారు అందరం నీ కోసం ఎదురు చూస్తుంటాము డాక్టర్ పట్టా పుచ్చుకొని నువ్వొస్తావని.“

 

 

 నీ ప్రియమైన 

 అక్క. 


ఉత్తరం చదివిన శ్రీనుకి హృదయం ద్రవించింది. వెంటనే రవి యొక్క మొబైల్ అందుకొని అందులో 'అక్క' అని ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ కి డయల్ చేశాడు శేఖర్ వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా. విషయం రవి వాళ్ళ అక్కా వాళ్ళకి చెబుదామని అతని ఉద్దేశం. 


అటువైపు ఫోన్ ఎత్తి"హలో రవీ!.. " ఉత్సాహంగా అన్న రవి వాళ్ళ అక్క స్వరం విని ఏం చెప్పాలో తెలియక మాట్లాడలేక పోయాడు శ్రీను. అప్పుడు ఇండియాలో సమయం రాత్రి పదకొండు గంటలు. ఆ సమయంలోనే రవి ఎక్కువగా ఫోన్ చేస్తుంటాడు. 


'అక్కా... అదీ... నేను శ్రీనుని' అని చెబుతున్నా వినిపించుకోకుండా 'ఆ.. రవీ!.. నీకో సర్ప్రైజ్ రా, నీకోసం డిల్లీ ఎయిర్ పోర్ట్ కి రమ్మన్నావుగా!నిన్ను రిసీవ్ చేసుకోడానికి మేము ఢిల్లీ బయలు దేరుతున్నాము. ఆ హడావిడిలో ఉన్నాం. అన్నయ్య వాళ్ళకి కుదరడంలేదు. నేనూ, బావా, పిల్లలు వస్తున్నాం. ప్లైట్ దిగేసరికి నీకు స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తుంటాం... సరే ట్రైన్ టైం అవుతుంది. ఉంటాను' అంటూ ఫోన్ పెట్టేసింది. 


డాక్టర్ కావాలని కలలు కన్న రవి రష్యా వెళ్లి డాక్టర్ కోర్సు చదివి డాక్టర్ పట్టా కూడా పుచ్చుకున్నాడు. అందరివాడిగా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా క్షణాల్లో చేసి పెట్టేవాడు. ఇండియా వెళ్ళే ముందు స్నేహితులందరూ సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిమిషాల వ్యవధిలో సంతోషం కాస్తా విషాదంగా మారింది. ఈ వార్త తెలిసి కళాశాల దిగ్భ్రాంతి చెందింది. ఇండియాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు అక్కడి మెడికల్ కాలేజీలో చదువుతున్నారు. వారంతా డా. రవికి ఘనంగా నివాళి అర్పించారు. విషణ్ణవదనాలతోో రవి భౌతిక కాయాన్ని ఇండియా ఫ్లైట్ ఎక్కించారు. 


విద్య కోసం సొంత ఊరిని, స్వదేశాన్ని వదిలి ఎన్నో కలలుకని ఆ కలలు నిజమయ్యే సమయానికి విధి వంచితుడై అసువులు బాసాడు రవి. 


వచ్చేది రవి కాదని అతని పార్థివ దేహమని తెలిసి ఎలా తట్టుకోగలదో అతనొస్తాడని ఎదురు చూస్తున్న అతని కుటుంబం. కాలమే సమాధానం చెప్పాలి... ?

***

సుజాత స్వర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.   


 *******


రచయిత్రి పరిచయం:

నా పేరు సుజాత స్వర్ణ. మాది సాహితీ గుమ్మంగా పేరొందిన ఖమ్మం. నేను ఉపాధ్యాయినిని. పుస్తక పఠనం, పాటలు వినడం, పాడడం, రచనలు చేయడం... నా వ్యాపకాలు.





238 views0 comments

Comments


bottom of page