'Nyayameva Jayathe' - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy Published In manatelugukathalu.com On 11/01/2024
'న్యాయమేవ జయతే' తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
ఆ రోజు అన్ని పేపర్లలో ఒక వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
అదే సమయంలో అదే వార్త ప్రతి వార్తా ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ గా రావడం మొదలైంది;
పేపర్లో "కాలేజీ అమ్మాయి మానస కిడ్నాప్, ఆ తరువాత మానభంగం, హత్య. మానభంగం చేసిన వాళ్ళలో ముగ్గురు మైనర్లు; తప్పించుకున్న మంత్రి గారి కుమారుడు" అన్న హెడ్డింగు కింద విపులంగా వార్త వ్రాయబడింది.
“నిన్న సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న మానస అనే శివాజీ కళాశాల డిగ్రీ విద్యార్థినిని ఐదుగురు అదే కాలేజీ విద్యార్థులు కిడ్నాప్ చేసి ఊరి బయట పాడుబడ్డ భవంతిలో మానభంగం చేసి ఆ తరువాత హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విద్యార్థుల్లో ముగ్గురు ఇంటర్ చదువుతున్న వాళ్ళు. ” అని వ్రాసి పక్కన ఆ పాడుబడ్డ భవనం ఫొటోని వేసింది ఆ పత్రిక.
ఆ వార్త కిందనే “నిందితులు అరెస్ట్" అనే ఒక బాక్స్ ఐటమ్ కూడా ప్రచురించింది. ఈ సంఘటన జరిగిన ఐదు గంటల లోపే నిందితులు అయిదుగుర్ని అరెస్ట్ చేసామనీ, వాళ్ళని సాయంత్రం ప్రెస్ మీట్ సందర్భంగా హాజరు పరుస్తామనీ ఎస్పీ మిశ్రా చెప్పారు. ఐదుగురు అదే కాలేజీ విద్యార్థులు ఈ దుశ్చర్యకి పాల్పడ్డారనీ, వారిలో ముగ్గురు మైనర్ బాలురనీ మిగతా వివరాలన్నీ కేసు దర్యాప్తు పూర్తైన తరువాత వెల్లడిస్తామనీ అతను చెప్పారు..
ఈ ఘోర సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడుతూ హెూం మంత్రి రాజీనామాకు పట్టుబట్టాయి. ఇది గడిచిన రెండు నెలల్లో జరిగిన మూడవ అత్యాచార ఘటన; కేంద్ర హెూం శాఖ ఈ దుశ్చర్య పై స్పందిస్తూ ఇటువంటి ఘటనలు జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఘటన జరిగిన తరువాత ఆడపిల్లల తల్లితండ్రులు తమ పిల్లల్ని స్కూళ్ళకు, కాలేజీలకు పంపడానికి భయపడుతున్నారనీ మహిళ సంఘం నేతలు వ్యాఖ్యానిస్తూ తక్షణం ఎస్పీని సస్పెండ్ చెయ్యాలనీ, హెూం మంత్రి రాజీనామా చెయ్యాలనీ కలెక్టర్ కు ఒక వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించి జరిగిన అత్యాచార ఘటనపై విచారణకు ఆదేశించి రెండు రోజుల్లో రిపోర్టివ్వాలనీ ఆదేశించారు;”
అన్ని వార్తా ఛానళ్ళలో విరామం లేకుండా ఈ సంఘటనపై వార్తలు వస్తున్నాయి. సాయంత్రానికల్లా ఆందోళనలు ఉధృతమై శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి.
ముఖ్యమంత్రి ఆందోళన చెంది వెంటనే కేబినేట్తో సమావేశమై తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించారు..
కానీ ఆ మర్నాడు ఉదయం జరిగిన ఒక అనుకోని సంఘటన మళ్ళీ రాష్ట్రంలో సంచలనం రేపింది.
తెల్లవారి 5 గంటలకు సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం ఐదుగురి నిందితుల్ని సంఘటనా స్థలానికి తీసికెళ్ళినప్పుడు వాళ్ళు తప్పించుకొని పోలీసుల్ని చంపే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళను ఎనకౌంటర్ చేయవలసి వచ్చిందనీ ఎస్పీ ఒక నోట్ విడుదల చెయ్యడం ఆ సంచలనానికి కారణం;
మళ్ళీ రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్ లు , చర్చలు; అత్యాచార ఘటన కన్నా ఈ ఎన్ కౌంటరే ఎక్కువ సంచలనం సృష్టించింది. ప్రజా హక్కుల సంఘం అయితే ఒకడుగు ముందుకేసి ఇది పోలీసులు చేసిన హత్య లనీ వ్యాఖ్యానించింది;మహిళా సంఘం సభ్యులు మాత్రం పోలీసులు చర్యని సమర్థిస్తూ వాళ్ళకు పాలాభిషేకాలు చేసారు.
రాష్ట్రంలో మానవ హక్కుల్ని ప్రభుత్వ హరించు వేస్తోందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
అదే రోజున జరిగిన సంఘటనలపై సీబిఐ విచారణ జరిపించాలని హైకోర్టులో ప్రజావాజ్యం ఒకటి దాఖలైంది.
ఆ మర్నాడే ఆ కేసు విచారణ న్యాయమిత్ర అనే హైకోర్టు న్యాయమూర్తి ఎదుటకు వచ్చింది;
మర్నాడు ఉదయం పది గంటలకు హైకోర్టులో మానస అత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ ఘటన మీద వాదనలు ప్రారంభమయ్యాయి.
ముందుగా డిఫెన్స్ లాయర్ రఘునాథ్ తన వాదనలు మొదలుపెట్టాడు;
“యువరానర్! అత్యాచారం జరిగిన 24 గంటల్లోపే నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేసామని ప్రగల్బాలు పలికిన పోలీసులు ఐదారు గంటల్లోపే వాళ్ళని ఎన్ కౌంటర్ చేసి మానవ హక్కుల్ని కాలరాసారు. ఇది ముమ్మటికీ పోలీసులు చేసిన హత్యలు; రిమాండులో ఉన్న నేరస్థుల్ని సీన్ రీకనస్ట్రక్షన్ పేరిట తెల్లవారి 4 గంటల సమయంలో అక్కడికి తీసికెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఉదయన్నే విలేఖరుల సమక్షంలో ఆ పని ఎందుకు చెయ్యలేదు?. ఆ ఐదుగురు నిందితులు 60 మంది ఆయుధులైన పోలీసుల మీద ఎదురు తిరగడం అన్నది పూర్తిగా అవాస్తవం;పోలీసులు చెప్పిన కట్టుకథ ; కేవలం వాళ్ళని పాశవికంగా చంపడానికే అక్కడికి తీసికెళ్ళి అత్యంత క్రూరంగా చంపేసారు. ఒకవేళ వాళ్ళు చెప్పినవి నిజమైతే ఆ సంఘటన జరిగినప్పుడు వీడియో ఎందుకు తియ్యలేదు; ఇది కేవలం రాష్ట్ర ప్రజల నిరసనని చల్లార్చడానికి పోలీసులు చేసిన ఒక కుటిల ప్రయత్నం”;
"శాంతి భద్రతల విషయంలో వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో జరిపించిన దమన కాండ ఇది. కాబట్టి కోర్టువారు పోలీసులను దోషులుగా నిర్ధారించి వారి మీద, ప్రభుత్వం మీద హత్యానేరం కింద కేసులు నమోదు చెయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను” అంటూ తన వాదనలను వినిపించాడు రఘునాథ్.
ఆ తరువాత ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఆనందరావు తన వాదనలు కొనసాగించాడు.
“ఒక కాలేజీ అమ్మాయిని అదే కళాశాల విద్యార్థులు కిడ్నాప్ చేసి మానభంగం, తరువాత హత్య చేసిన ఈ కేసులో 5 గురు నిందుతుల్ని 24 గంటలలోపే అరెస్ట్ చేయ్యడం అన్నది పోలీసుల గొప్ప బాధ్యతయుతమైన చర్యని చెప్పక తప్పదు. పోలీసులు ఈ కేసులో ఎంతో కష్టపడి ఆధారాలు సేకరించి వాళ్ళని అరెస్ట్ చేసారు. ఈ విషయంలో వాళ్ళ చిత్తశుద్ధిని శంకించరాదు. ఇక సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిందితుల్ని సంఘటనా స్థలికి తీసికెళ్ళడమన్నది పోలీసుల విధిలో భాగం. తెల్లవారకముందే సంఘటనా స్ధలానికి ఎందుకు తీసికెళ్ళారన్నది అర్థం లేని ప్రశ్న; ప్రతీదానికీ విలేఖర్లను తీసికెళ్ళి, వీడియో తియ్యాలనడం అన్నది పోలీసు పరిశోధనలకు విఘాతం కలిగించే విషయాలు. కేసుని ఎలా ఎప్పుడు, ఏవిధంగా పరిశోధించాలన్నది పోలీసులు విశేషాధికారం. ఆ విషయంలో వాళ్ళని ప్రశ్నించడం అంటే వాళ్ళ విధుల్లో జోక్యం చేసుకోవడమే! 24 గంటలలోపు నిందితుల్ని కోర్టులో హాజరు పర్చవలసిన అవసరం ఉన్నందువల్ల సమయాభావం వల్ల ఆ సమయంలో అక్కడికి తీసికెళ్ళవలసి వచ్చింది. అదే పెద్ద తప్పు అని డిఫెన్స్ వారు వాదించడం దురుద్దేశ పూర్వకం. ఇక ఎన్కౌంటర్ అన్నది పోలీసులు తమని తాము కాపాడుకోవటానికి చేసిన తప్పనిసరి చర్య; దీని గురించి డిఫెన్స్ వారు చేసిన ఆరోపణలు అసత్యం; వాళ్ళకు లేనిపోని ఉద్దేశాలు ఆపాదించడం నేరస్తుల్ని తప్పించే ప్రయత్నంలో భాగమే; నిందితుల ఎన్ కౌంటర్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. పోలీసుల చర్యను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నారు. ” ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు ఉండనక్కర్లేదు. అందువల్ల పోలీసుల డ్యూటీని వాళ్ళని చేయనిద్దాం; అలా కాకుండా వాళ్ళ డ్యూటీకి అడ్డుపడితే ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఈ కేసుని ఎడ్మిట్ చెయ్యెకుండా కొట్టివెయ్యాలని కోర్టు వారిని కోరుతున్నాను” అని తన వాదనలను ముగించాడు ఆనందరావు.
వెంటనే న్యాయమూర్తి న్యాయమిత్ర ఆనందరావుని ఉద్దేశించి "ప్రజలు పోలీసుల ఎన్ కౌంటర్ని సమర్థిస్తున్నారు అని మీరే విధంగా చెబుతునారు; అందుకు ఆధారాలేమైనా ఉన్నాయా? నిందితుల్ని పట్టుకొని కోర్టుకు అప్పచెప్పచెప్పడం వరకే పోలీసుల బాధ్యత. వాళ్ళు నేరస్తులో కాదో తేల్చడం అన్నది కోర్టుల పని ; శిక్షల్ని కోర్టులు ధృవీకరిస్తే వాటిని అమలు జరపడం అన్నది పోలీసుల పని ; కానీ పోలీసులే శిక్షలు వేస్తే ఎలా?” అని ప్రశ్నించారు..
“యువరానర్ ; పోలీసుల వృత్తి అసిధారావ్రతం, అంటే కత్తి మీద సాము లాంటిది; కరడు గట్టిన నేరస్తులతో వ్యవహారం, ప్రతి కేసులో నేరస్తుల నుంచి వాళ్ళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. అటువంటప్పుడు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో నేరస్తుల్ని ఎనకౌంటర్ చెయ్యక తప్పదు. ఈ కేసు విషయంలోనూ ఇదే జరిగింది అంతే తప్ప దానికేదో తప్పడు ఉద్దేశాలు అపాదించడం తప్పు; ” అని ఆనందరావు మళ్ళీ తన వాదనల్ని వినిపించాడు.
ఇరువురి వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కేసుని వారం రోజుల పాటు వాయిదా వేసారు.
ఆ తరువాత వరుస సంఘటనలు త్వరత్వరగా చోటు చేసుకున్నాయి; కోర్టు పోలీసులు చేసింది బూటకపు ఎన్ కౌంటరని నమ్మి దానిమీద సిబీఐ విచారణకు ఆదేశించింది.
సిబీఐ రంగంలోకి దిగి విచారణ చేసి రెండు నెలల్లో కోర్టుకి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పోలీసులు కావాలనే నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసి చంపేసారని పొందుపరిచింది.
వెంటనే న్యాయమూర్తి ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరి మీదా కేసులు నమోదు చేసి ఎఫ్. ఐ. ఆర్ దాఖలు చెయ్యాలని ఆదేశించారు.
ఈ తీర్పు రాష్ట్ర పోలీసుల పనితీరు మీద ప్రజల్లో అనుమానాలు పెంచింది. ప్రజలకు పోలీసులంటే ఏహ్య భావం ఏర్పడింది. పత్రికల్లోనూ, ఛానళ్ళలోనూ పోలీసుల ప్రవర్తన మీద చర్చలు మొదలయ్యాయి. పోలీసులు మానవహక్కుల్ని హరించి వేస్తున్నారని మానవ హక్కుల సంఘం ఆరోపిస్తే, మహిళా సంఘాలవారు పోలీసుల చర్య సక్రమమైనదేనని వ్యాఖ్యానించారు.
ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత మరొక ఘోరం జరిగింది..
హైకోర్టులో పనిచేస్తున్న సుదర్శనం అనే ఒక గుమాస్తా కూతుర్ని నలుగురు ఆటో డ్రైవర్లు ఎత్తుకు పోయి మానభంగం చేసి హత్య చేసారు. ఆ వార్త మళ్ళీ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ సంఘటనతో రాష్ట్రం అంతా అట్టుడికి పోయింది; మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి త్వరగా ఉరి తియ్యాలనీ నిందితుల్ని కోర్టు తీర్పు దాకా ఎదురు చూడకుండా క్రితం సారి చేసినట్లు ఎన్ కౌంటర్ చెయ్యాలనీ ఉద్యమాలు మొదలయ్యాయి.
ఆ సమయంలో నగర పోలీసు కమీషనర్ ప్రభాకర్ హైకోర్టు న్యాయమూర్తి న్యాయమిత్రను అతని బంగ్లాలో కలిసాడు;
“సార్! గుమాస్తా సుదర్శనం కూతురికి జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను.. వాళ్ళని పట్టుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాము" అని చెప్పాడు.
ఆ మాటలకు జస్టిస్ న్యాయమిత్ర కొద్దిసేపు మేనం వహించి "కమీషనర్ గారూ! వాళ్ళని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలి పెట్టొద్దు. అతను ఓ సాధారణ గుమాస్తా; న్యాయస్థానంలో పనిచేస్తున్న అతనికి న్యాయం జరగకపోతే న్యాయవ్యవస్థకే అవమానం; త్వరగా వారిని పట్టుకొని ఆమె ఆత్మకు శాంతి కలిగించండి; అటువంటి ఉన్మాదులు సమాజంలో ఉండకూడదు;” అని బాధగా చెప్పారు;
“సార్ తప్పకుండా పట్టుకుంటాము. క్రితం సారి మానభంగ నిందితుల్ని మావాళ్ళు ఎన్ కౌంటర్ చేస్తే వాళ్ల మీదే కేసులు పెట్టవలసిరావడంతో వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతిన్న మాట నిజమే అయినా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు” అన్నాడు ప్రభాకర్.
“ప్రభాకర్; క్రితం సారి నేనే ఆ తీర్పు ఇచ్చాను. కోర్టులు చట్టప్రకారం న్యాయం ఎటు వైపు ఉంటే అటు తీర్పులు ఇస్తాయి; కోర్టులు తమ పని తాము చేస్తాయి; మీ పని మీరు చట్ట ప్రకారం చెయ్యండి; మీరు మీ వృత్తి ధర్మాన్ని నిర్వహించండి. ధర్మాన్ని కాపాడండి; చట్ట వ్యతిరేక పనులు చెయ్యొద్దు ” అని న్యాయమిత్ర అన్నారు;
“తప్పకుండా సార్, కొద్దిరోజుల్లో మీరే చూస్తారు; ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేలా మేము ఆ నిందితులను పట్టుకుంటాము; వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము” అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభాకర్;
వారం రోజుల తరువాత పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లో సుదర్శనం కూతుర్ని మానభంగం చేసిన నలుగురు ఆటోడ్రైవర్లు చనిపోయారు.
నిందుతలైన నలుగురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసి తీసుకు వస్తున్న సమయంలో వాళ్ళు ఎదురు తిరిగి పోలీసుల మీద కాల్పులు జరపడంతో ఆత్మ సంరక్షణార్థం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆ నలుగురూ చనిపోయారు” అని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments